పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/పూతన వ్రేపల్లె కొచ్చుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-212-సీ.
కంసుపంపున బాలఘాతిని పూతన-
ల్లెల, మందలఁ, ట్టణముల
నిల నెల్లచో, బాలహింస గావించుచుఁ-
నుచు, నెవ్వని పేరు శ్రవణవీధిఁ
డినయంతన సర్వయనివారణ మగు-
ట్టి దైత్యాంతకుం వతరించి
యున్న నందునిపల్లె కొకనాడు ఖేచరి-
యై వచ్చి యందు మాయాప్రయుక్తిఁ

తెభా-10.1-212.1-తే.
గామరూపిణి యై చొచ్చి, కానకుండ
రిగి, యిల్లిల్లు దప్పక రసికొనుచు,
నందగృహమున బాలుని నాద మొకటి
విని ప్రమోదించి, సుందరీవేష యగుచు.

టీక:- కంసు = కంసుని యొక్క; పంపునన్ = ఆజ్ఞప్రకారము; బాల = శిశువులను; ఘాతని = హంతకురాలు; పూతన = పూతన (అను రాక్షసి); పల్లెలన్ = ఊర్లు యందు; మందలన్ = ఘోషము లందు; పట్టణములన్ = పురము లందు; ఇలన్ = భూమండలముమీద; ఎల్ల = అన్ని; చోన్ = ప్రదేశము లందు; బాల = శిశువులను; హింసన్ = చంపుట; కావించుచున్ = చేయుచు; చనుచున్ = పోతుండగా; ఎవ్వని = ఎవని యొక్క; పేరు = నామము; శ్రవణ = చెవుల; వీధిన్ = మార్గమున; పడినన్ = వినబడిన; అంతనన్ = వెంటనే; సర్వ = సమస్తమైన; భయ = భయములనుండి; నివారణము = విముక్తి; అగున్ = కలుగునో; అట్టి = అటువంటి; దైత్యాంతకుండున్ = విష్ణుమూర్తి; అవతరించి = పుట్టి; ఉన్న = ఉన్నట్టి; నందుని = నందుడు యొక్క; పల్లె = వ్రేపల్లె; కున్ = కు; ఒక = ఒకానొక; నాడు = దినమున; ఖేచరి = అదృశ్యగమన {ఖేచరి - ఖః (ఆకాశమున, కనబడకుండగ) చరి (తిరుగునామె), అదృశ్య గమనము గల స్త్రీ}; ఐ = అయ్యి; వచ్చి = చేరి; అందున్ = దానిలో; మాయా = మాయను; ప్రయుక్తిన్ = పన్నుటచే; కామరూపిణి = మారువేషధారి.
ఐ = అయ్యి; చొచ్చి = ప్రవేశించి; కానకుండన్ = కనబడకుండగా; అరిగి = వెళ్ళి; ఇల్లిల్లున్ = ప్రతి ఇంటిని; తప్పకన్ = విడువకుండగ; అరసికొనుచున్ = వెతుక్కొనుచు; నంద = నందుని యొక్క; గృహమునన్ = ఇంటిలో; బాలునిన్ = చిన్నపిల్లవాని; నాదమున్ = చప్పుడు; ఒకటిన్ = ఒకదానిని; విని = విని; ప్రమోదించి = సంతోషించి; సుందరీ = మంచి అందగత్తె; వేష = వేషధారి; అగుచు = ఔతూ.
భావము:- కంసుడు పూతన అనే రాక్షసిని పంపించాడు. ఆ పూతన శిశువులను చంపడంలో ఆరితేరిన రక్కసి. అలా కంసుడు పంపగా వచ్చి, గ్రామాలు, గొల్ల పల్లెలు, పట్టణాలలో ఎక్కడ చంటి పిల్లలు కనబడినా చంపివేయ సాగింది. ఎవరి పేరు విన్నట్లయితే సమస్త భయాలు పోతాయో అట్టి ముకుందుడు ఉన్నట్టి నందుడి వ్రేపల్లెకు ఒకరోజు ఆకాశ మార్గాన వచ్చింది. మాయలు పన్నటంలో దిట్ట గనుక, కామరూపం ధరించి వ్రేపల్లె ప్రవేశించింది. ఎవరికి తెలియకుండ ప్రతి ఇంటిని పరిశీలిస్తోంది. నందుని ఇంట్లోంచి పిల్లాడి ఏడుపు విని సంతోషించింది. మంచి అందగత్తె వేషం వేసుకొంది.

తెభా-10.1-213-మత్త.
క్రాలుకన్నులు, గుబ్బచన్నులుఁ, గందుఁవొందని చందురుం,
బోలు మోమును, గల్దు లేదను బుద్ధి దూఱని కౌను, హే
రామైన పిఱుందు, పల్లవరాగ పాద కరంబులుం,
జా దొడ్డగు కొప్పు, నొప్పగ ర్వమోహనమూర్తితోన్

టీక:- క్రాలు = చలించెడి; కన్నులున్ = కళ్ళు; గుబ్బ = గుండ్రటి; చన్నులున్ = స్తనములు; కందు = మచ్చ; ఒందని = లేనట్టి; చందురున్ = చంద్రుని; పోలు = వంటి; మోమునున్ = ముఖము; కల్దులేదు = ఉందోలేదో; అను = అనెడి; బుద్ధిన్ = ఆలోచన; దూఱని = కలుగని; కౌను = నడుము; హేరాళము = మిక్కిలి విశాలము; ఐన = అయిన; పిఱుందున్ = పిరుదులు; పల్లవ = చిగుళ్ళవలె మృదువైన; రాగ = ఎఱ్ఱని; పాద = పాదములు; కరంబులున్ = చేతులు; చాలన్ = మిక్కిలిగా; దొడ్డ = పెద్దది; అగు = ఐన; కొప్పు = జుట్టుముడి; ఒప్పు = చక్కనిది; అగు = ఐన; సర్వ = అందరిని; మోహన = మోహింపజేసెడి; మూర్తి = స్వరూపము; తోన్ = తోటి.
భావము:- ప్రకాశవంతమైన కళ్ళు, పొంకమైన స్తనాలు, మచ్చలేని చంద్రుడి వంటి ముఖము. ఉందా లేదా అన్నట్లున్న సన్నని నడుము, విశాలమైన పిరుదులు. చివురు కొమ్మల వంటి ఎఱ్ఱని కాళ్ళు చేతులు. చాలా ఒత్తైన జుత్తుముడి. ఇలా చాలా అందమైన రూపంతో ఆమె అందరిని మోహింపజేసే రూపంతో వచ్చింది.

తెభా-10.1-214-మాని.
కాంనకుండల కాంతులు, గండయు-
గంబునఁ గ్రేళ్ళుఱుకన్, జడపై
మించిన మల్లెల మేలిమి తావులు-
మెచ్చి, మదాళులు మింటను రా,
నంచిత కంకణహారరుచుల్ చెలు-
వారఁగఁ, బైవలు వంచల నిం
చించుక జారఁగ నిందునిభానన-
యేగెఁ గుమారుని యింటికినై.

టీక:- కాంచన = బంగారు; కుండల = చెవికుండలముల; కాంతులున్ = తళతళలు; గండ = చెక్కిళ్ళ; యుగంబునన్ = జంటపై; క్రేళ్ళుఱుకన్ = చిందులాడగా; జడ = జడగా నల్లిన జుట్టు; పైన్ = మీద; మించిన = అతిశయించిన; మల్లెల = మల్లెపూల; మేలిమి = మంచి; తావులున్ = సువాసనలు; మెచ్చి = అపేక్షించి; మద = మత్తెక్కిన; ఆళులు = గండుతుమ్మెదలు; మింటను = ఆకాశము నందు; రాన్ = వస్తుండగా; అంచిత = అలంకరించుకొన్న; కంకణ = చేతికంకణములు; హార = మెడలోని హారముల; రుచుల్ = తళతళలు; చెలువారగన్ = అందగిస్తుండగా; పైవలువ = కొంగు; అంచలన్ = అంచులను; ఇంచించుకన్ = కొద్దికొద్దిగా; జాఱగన్ = జారునట్లుగా; ఇందునిభానన = సుందరి {ఇందునిభానన - చంద్రముఖి, అందగత్తె}; ఏగెన్ = వెళ్ళెను; కుమారుని = బాలకృష్ణుని; ఇంటి = నివాసమున; కినై = కోసము.
భావము:- బంగారపు లోలకుల కాంతులు చెక్కిళ్ళ మీద కేరింతలు కొడుతుండగా, జడ లోని చక్కటి మల్లెల సువాసనలకు ఆకర్షించబడిన తుమ్మెదలు గాలిలో వెన్నంటి వస్తుండగా, వేసుకున్న గాజులు, గొలుసులు కాంతులు విరజిమ్ముతుండగా, పైట కొద్దిగా జారుతుండగా. చంద్రుడిలాంటి అందమైన ముఖం గల పూతన బాలకృష్ణుడి ఇంటికి వెళ్ళింది.
సహజ కవి పోతన వారు, ఆ మాయా మానిని వర్ణిస్తూ మానిని వృత్తం వేశారు. ఎంత చక్కటి సందర్భోచిత ఛందస్సు ఎన్నిక.

తెభా-10.1-215-వ.
ఆ సమయంబునన్.
టీక:- ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు.
భావము:- అలా ఆమె ఇంట్లోకి వెళుతున్న సమయంలో . . .