పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/పులినంబునకు తిరిగివచ్చుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

తెభా-10.1-580-వ.
దేవా! నీకుఁ గల్పపర్యంతంబు నమస్కరించెద”నని యివ్విధంబున సంస్తుతించి ముమ్మాఱు వలగొని పాదంబులపైఁ బడి వీడ్కొని బ్రహ్మ తన నెలవునకుం జనియె; నతని మన్నించి భగవంతుండైన హరి తొల్లి చెడి తిరిగి వచ్చిన వత్సబాలకులం గ్రమ్మఱం గైకొని పులినంబుకడఁ జేర్చె; నిట్లు.
టీక:- దేవా = కృష్ణా {దేవుడు - తనంతటతను వెలుగువాడు, విష్ణువు}; నీకున్ = నీకు; కల్ప = ఈకల్పము; పర్యంతము = అంతమై ప్రళయము వరకు; నమస్కరించెదను = నమస్కారము చేసెదను; అని = అని; ఈ = ఈ; విధంబునన్ = రీతిగా; సంస్తుతించి = గట్టిగా స్తోత్రముచేసి; ముమ్మాఱు = మూడుసార్లు; వలగొని = ప్రదక్షిణముచేసి; పాదంబుల్ = కాళ్ళ; పైన్ = మీద; పడి = మ్రొక్కి; వీడ్కొని = సెలవుతీసుకొని; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; తన = తన యొక్క; నెలవున్ = నివాసమున; కున్ = కు; చనియెన్ = వెళ్ళిపోయెను; మన్నించి = ఆదరించి; భగవంతుండు = కృష్ణా {భగవంతుడు - షడ్గుణైశ్వర్యముల (మహత్వ ధైర్య యశో శ్రీ జ్ఞాన వైరాగ్యములు అనెడి ఐశ్వర్యములు)తో సంపన్నుండు (సమృద్ధిగా కలవాడు), విష్ణువు}; ఐన = అయినట్టి; హరి = కృష్ణుడు {హరి - భక్తుల పాపములను హరించువాడు, విష్ణువు}; తొల్లి = ఇంతకుముందు; చెడి = కనబడకుండపోయి; తిరిగి = వెనుకకు; వచ్చిన = వచ్చినట్టి; వత్స = దూడలు; బాలకుల్ = బాలురను; క్రమ్మఱన్ = మరల; కైకొని = స్వీకరించి; పులినంబు = ఇసుకదిబ్బ (ముందు చల్దులు తిన కూర్చున్న స్థలము); కడన్ = వద్దకు; చేర్చెన్ = చేర్చెను; ఇట్లు = ఈ విధముగ.
భావము:- ఓ భగవంతుడా! నా ఆయుర్దాయం ఈ కల్పాంతం వరకూ ఉంది కదా. అంత వరకూ నీకు నమస్కరిస్తూనే ఉంటాను.” అని స్తుతించి బ్రహ్మదేవుడు మూడుసార్లు కృష్ణుడికి ప్రదక్షిణం చేసి, పాదాలకు మ్రొక్కి, సెలవు తీసుకుని తన సత్యలోకానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు అతనిని క్షమించి గౌరవించాడు. ఇంతకు ముందు మాయమై తిరిగి వచ్చిన దూడలను, బాలకులను మళ్ళీ ఇసుక తిన్నెల వద్దకు చేర్చాడు.ఈ విధముగా. . .

తెభా-10.1-581-క.
క్రించు దనంబున విధి దము
వంచించిన యేఁడు గోపరనందను లొ
క్కించుక కాలంబుగ నీ
క్షించిరి రాజేంద్ర! బాలకృష్ణుని మాయన్.

టీక:- క్రించుదనంబునన్ = అల్పత్వముతో; విధి = బ్రహ్మదేవుడు; తమున్ = తమను; వంచించిన = మోసపుచ్చిన; ఏడు = సంవత్సరకాలము; గోప = యాదవ; వర = శ్రేష్ఠుల; నందనులు = కుమారులు; ఒక్కించుక = చాలాకొద్ది; కాలంబు = కాలము; కన్ = ఐనట్టు; ఈక్షించిరి = చూచిరి, భావించిరి; రాజేంద్ర = మహారాజా {రాజేంద్రుడు - రాజులలో ఇంద్రుని వంటివాడు, మహారాజు}; బాలకృష్ణుని = చిన్నికృష్ణుని; మాయన్ = మహిమవలన.
భావము:- మహారాజా! ఈవిధంగా బ్రహ్మదేవుడు అల్పత్వంతో మోసగించి తమను దాచిపెట్టిన ఏడాది కాలాన్ని కృష్ణుని మాయ కారణంగా గోపబాలకులు కొద్దిసేపుగా భావించారు.

తెభా-10.1-582-ఆ.
మహాత్ము మాయ నీ విశ్వమంతయు
మోహితాత్మక మయి మునిగి యుండు
ట్టి విష్ణుమాయ ర్భకు లొక్క యేఁ
డెఱుఁగ కుండి రనుట యేమి వెఱఁగు?

టీక:- ఏ = ఏ; మహాత్ము = మహిమ గలవాని; మాయన్ = మహిమత్వముచేత; ఈ = ఈ యొక్క; విశ్వము = జగత్తు; అంతయున్ = సమస్తమును; మోహిత = మోహము చెందిన; ఆత్మకము = ఆత్మ కలది; అయి = అయ్యి; మునిగి =మగ్నం అయి, ఓలలాడి; ఉండున్ = ఉండును; అట్టి = అటువంటి; విష్ణు = కృష్ణుని యొక్క {విష్ణువు - విశ్వమంత వ్యాపించి ఉండువాడు, హరి}; మాయన్ = మాయవలన; అర్భకులు = చిన్నపిల్లలు; ఒక్క = ఒకే ఒక; ఏడున్ = సంవత్సరము; ఎఱుగకన్ = కలదని తెలియక; ఉండిరి = ఉన్నారు; అనుట = అని చెప్పుట; ఏమి = ఏమి; వెఱగు = వింత.
భావము:- మొత్తం విశ్వమంతా మహాత్ముడైన విష్ణుదేవుడి మాయ వలన మోహంలో మునిగిపోయి ఉంటుంది. అంతటి విష్ణుమాయ వలన గోపబాలకులు ఏడాది కాలాన్ని తెలుసుకోలేకపోడంలో ఆశ్చర్యం ఏముంది?

తెభా-10.1-583-వ.
అప్పుడు.
టీక:- అప్పుడు = ఆ తరువాత.
భావము:- బ్రహ్మదేవుడి మాయా గుహనుండి పులినతలానికి కృష్ణబాలుడు తీసుకువచ్చిన సమయంలో. . .

తెభా-10.1-584-మ.
చెలికాఁడా! యరుదెంచితే యిచటికిన్? క్షేమంబునం గ్రేపులున్
నెవుల్ జేరె నరణ్యభూమివలనన్ నీ వచ్చునం దాకఁ జ
ల్దులు వీ రించుక యెవ్వరుం గుడువ; రా లోకింపు; ర”మ్మంచు నా
జాక్షుండు నగన్ భుజించి రచటన్ సంభాషలన్ డింభకుల్.

టీక:- చెలికాడా = స్నేహితుడా; అరుదెంచితే = వచ్చితివా; ఇచటికిన్ = ఇక్కడికి; క్షేమంబునన్ = కులాసాగా; క్రేపులున్ = దూడలును; నెలవుల్ = వాటి స్థానములకు; చేరెన్ = తిరిగి వచ్చినవి; అరణ్య = అటవీ; భూమి = ప్రాంతము; వలనన్ = నుండి; నీవు = నీవు; వచ్చున్ = వచ్చెడి; అందాక = వరకు; చల్దులు = చల్దిభోజనములు; వీరు = వీరందరు; ఇంచుకన్ = కొంచెముకూడ; ఎవ్వరున్ = ఏ ఒక్కరు; కుడువరు = తినలేదు; ఆలోకింపుము = చూడుము; రమ్ము = రా; అంచున్ = అనుచు; ఆ = ఆ యొక్క; జలజాక్షుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; నగన్ = నవ్వుతుండగా; భుజించిరి = తినిరి; సంభాషలన్ = కబుర్లుచెప్పుకొంటు; డింభకుల్ = బాలురు.
భావము:- (ఇసుకతిన్నెల మీద కూర్చుని చల్దులు తింటూ అర్థాంతరంగా ఆపు చేసిన గోపబాలురు కృష్ణుని చూసి ఇలా అన్నారు.) “చెలికాడా! వచ్చావా? ఇదిగో లేగదూడలు అరణ్య మధ్యం నుండి ఇప్పుడే తిరిగి వచ్చేసాయి. నీవు తిరిగివచ్చే వరకూ మాలో ఎవరమూ చల్దులు తినలేదు. చూడు. త్వరగారా! తిందాము.” అని పిలిచారు కృష్ణుడు నవ్వుతూ వచ్చి వారి మధ్యలో కూర్చోగానే అందరూ కబుర్లు చెప్పుకుంటూ చల్దులు తిన్నారు.

తెభా-10.1-585-వ.
ఇట్లు బాలకులతోడఁ జల్ది గుడిచి వారలకు నజగర చర్మంబు చూపుచు వనంబున నుండి తిరిగి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; బాలకుల్ = పిల్లల; తోడన్ = తోటి; చల్ది = చద్దన్నములు; కుడిచి = తిని; వారల్ = వారి; కున్ = కి; అజగర = కొండచిలువ; చర్మంబు = కళేబరమును; చూపుచున్ = చూపించుచు; వనంబున్ = అడవి; నుండి = నుండి; తిరిగి = మరలి.
భావము:- అలా కృష్ణుడు వారితో చల్దులు తిని వనంలో నుండి తిరిగి వస్తుంటే, వారికి కొండచిలువ చర్మం చూపాడు.

తెభా-10.1-586-పంచ.
ప్రన్నపింఛమాలికా ప్రభావిచిత్రితాంగుఁడుం
బ్రసిద్ధ శృంగ వేణునాద పాశబద్ధ లోకుఁడుం
బ్రన్న గోప బాలగీత బాహువీర్యుఁ డయ్యు ను
ల్లసించి యేగె గోపకుల్ జెలంగి చూడ మందకున్.

టీక:- ప్రసన్న = నిర్మలమైన, మనోహరమైన; పింఛ = నెమలి పింఛముల; మాలికా = వనమాలల; ప్రభా = కాంతులచే; విచిత్రిత = అలంకరింపబడిన; అంగుండున్ = దేహము కలవాడు; ప్రసిద్ధ = ఖ్యాతికెక్కిన; శృంగ = కొమ్ము; వేణు = మురళీ; నాద = ధ్వను లనెడి; పాశబద్ధ = తాళ్ళచే కట్టివేయబడిన; లోకుండున్ = లోకులు కలవాడు; ప్రసన్న = సంతోషించిన; గోప = గొల్ల; బాల = పిల్లలు; గీత = కీర్తించెడి; బాహువీర్యుడు = భుజబలము గలవాడు; అయ్యున్ = అయ్యి; ఉల్లసించి = సంతోషించి; ఏగెన్ = వెళ్లెను; గోపకుల్ = యాదవులు; చెలంగి = చెలరేగి; చూడన్ = చూచుచుండగా; మందకున్ = మంద విడిచిన చోటికి.
భావము:- శ్రీ కృష్ణుడు తలలో అడవిపూలు నెమలిపింఛము ధరించాడు. వాటి రంగురంగుల కాంతులు అంతటా ప్రసరించి అతని శరీరభాగాలను అలంకరిస్తున్నాయి. కృష్ణుని కొమ్ముబూర మోత, అతని వేణుగానం అందరికీ పరిచయమైనవి. అవి వినపడగానే లోకమంతా పరవశం చెంది ఆకర్షించబడుతుంది. గోపబాలురు సంతోషంతో అతని బాహుబలాన్ని స్తోత్రం చేసారు. కృష్ణుడు గోపబాలురతో కూడి ఉల్లాసంతో మందకు చేరుకుంటూ ఉంటే గోపకు లందరూ సంతోషంతో వారిని ఆదరించారు.

తెభా-10.1-587-వ.
ఆ సమయంబున.
టీక:- ఆ = ఆ; సమయంబునన్ = సమయమునందు.
భావము:- అప్పుడు

తెభా-10.1-588-క.
పెనుఁబాము దమ్ము మ్రింగిన
నందసుతుండు పాము ర్దించి మమున్
నిచె నరణ్యములోపల
ని ఘోషించిరి కుమారు లా ఘోషములోన్."

టీక:- పెను = పెద్ద; పాము = సర్పము; తమ్మున్ = తమను; మ్రింగినన్ = మింగివేయగా; మన = మన యొక్క; నంద = నందుని; సుతుండు = పుత్రుడు; పామున్ = సర్పమును; మర్దించి = చితగ్గొట్టి; మమున్ = మమ్ములను; మనిచెన్ = కాపాడెను; అరణ్యము = అడవి; లోపలన్ = అందు; అని = అని; ఘోషించిరి = చాటించిరి; కుమారులు = బాలకులు; ఆ = ఆ యొక్క; ఘోషము = గొల్లపల్లె; లోన్ = అందు.
భావము:- బాలకులు గోకులంలో అడుగు పెడుతూనే అందరికీ వినిపించేటట్లు కేకలు వేస్తూ “మన నందగోపకుమారుడు అడవిలో ఒక పెద్ద పాముని చంపి మమ్మల్ని అందరిని రక్షించాడు” అని చాటి చెప్పారు.”

తెభా-10.1-589-వ.
అనిన విని నరేంద్రుం డిట్లనియె
టీక:- అనినన్ = అనగా; విని = విని; నరేంద్రుడు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- శుకయోగి అలా చెప్పగానే పరీక్షన్మహారాజు ఇలా అన్నాడు.