పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/జరాసంధుని విడుచుట

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-10.1-1577-ఉ.
కుంఠితులై పరుల్ బెగడ ఘోరబలుండు బలుండు వాని సో
ల్లుంము లాడుచుం దిగిచి లోకభయంకరమైన ముష్టిచేఁ
గంగతాసుఁ జేసి తమకంబున మొత్తఁగ భూభరక్షయో
త్కంఠుఁడు చక్రి మీఁదెఱిఁగి కార్యము గల్దని మాన్పి యిట్లనున్.

టీక:- కుంఠితులు = ఓడిపోయినవారు; ఐ = అయ్యి; పరుల్ = శత్రువులు; బెగడన్ = వెరచుచుండగా; ఘోర = భయంకరమైన; బలుండు = బలరాముడు {బలుడు - బలము కలవాడు, బలరాముడు}; వానిన్ = అతనిని; సోల్లుంఠములు = దెప్పిపొడుపుమాటలు {సోల్లుంఠములు - మర్మభేదకములైన మాటలు, దెప్పిపొడుపుమాటలు}; ఆడుచున్ = పలుకుచు; తిగిచి = దగ్గరకులాగి; లోక = లోకములకు; భయంకరమైన = భీకరమైన; ముష్టి = పిడికిటిపోటు; చేన్ = చేత; కంఠ = కంఠమున; గత = గల; ఆసున్ = ప్రాణములు కలవానిని; చేసి = చేసి; తమకంబు = సంభ్రమముతోటి; మొత్తగన్ = మోదగా; భూ = భూమి; భర = భారమును; క్షయ = అణచివేయుట యందు; ఉత్కంఠుండు = ఆసక్తి కలవాడు; చక్రి = కృష్ణుడు {చక్రి - చక్రము ఆయుధముగా కలవాడు, విష్ణువు, కృష్ణుడు}; మీదన్ = జరుగబోవునది; ఎఱిగి = తెలిసి; కార్యము = పని; కల్దు = కలదు, ఉన్నది; అని = అని; మాన్పి = ఆపించి; ఇట్లు = ఈ విధముగ; అనున్ = అనుచుండెను.
భావము:- శత్రువులు చెదరిబెదరిపోగా భయంకర బలశాలి అయిన బలభద్రుడు వాడిని ఎత్తిపొడుపు మాటలతో పొడుస్తూ, లాగి లోకాలకు వెరపు కలిగించే తన పిడికిటి పోటుతో కంఠగతప్రాణుణ్ణి గావించాడు. భూభారము అడగింప నెంచిన చక్రాయుధుడు భావికార్యం తలపోసి, కావలసిన పనుందని చెప్పి అన్నను ఆపి, మాగధునితో ఇలా అన్నాడు.

తెభా-10.1-1578-శా.
"దుఃఖింపం బనిలేదు; పొమ్ము; బలసందోహంబులం దెమ్ము; చే
తఃఖేదం బెడలంగ రమ్ము; రిపులం దండింపు; కాదేని భూ
స్వఃఖేలజ్జన మెల్ల మెచ్చ నృప! నీ శౌర్యోన్నతుల్ జూపి మే
దఃఖండంబులు భూతముల్ దినఁ దనుత్యాగంబు చేయం దగున్."

టీక:- దుఃఖింపన్ = విచారించవలసిన; పని = అవుసరము; లేదు = లేదు; పొమ్ము = వెళ్ళిపో; బల = సైన్యముల; సందోహంబులన్ = సమూహములను; తెమ్ము = తీసుకురా; చేతస్ = మనసులోని; ఖేదము = వ్యాకులత; ఎడలన్ = తొలగునట్లు; కరమ్ము = అధికముగా; రిపులన్ = శత్రువులను; దండింపు = శిక్షింపుము; కాదు = అలాకాని; ఏని = ఎడల; భూ = భూలోకమున; స్వః = స్వర్గలోకమున; ఖేలత్ = విహరించెడి; జనము = వారు; ఎల్లన్ = అందరు; మెచ్చన్ = శ్లాఘించునట్లు; నృప = రాజా; నీ = నీ యొక్క; శౌర్య = పౌరుషము యొక్క; ఉన్నతులున్ = అధిక్యములను; చూపి = కనబరచి; మేదః = మెదడుకండల; ఖండంబులున్ = ముక్కలు; భూతముల్ = పిశాచములు; తినన్ = తినునట్లు; తనుత్యాగంబున్ = చనిపోవుట; చేయన్ = చేయుట; తగున్ = యుక్తమగును.
భావము:- “ఓ నరపతీ! నీవు దుఃఖించవలసిన అవసరం లేదు. పొమ్ము. సేనలను సమకూర్చుకుని మనోవ్యధ తొలగేలా మళ్ళీ రా. శత్రువులను శిక్షించు. లేకపోతే భూలోక, స్వర్గలోకాలలో సంచరించే వాళ్ళు మెచ్చుకునేలా నీ పరాక్రమాతిశయం చాటి, నీ మెదడు ముక్కలు పిశాచాలు తినేలా నీ దేహాన్నివదలి పెట్టు.”

తెభా-10.1-1579-వ.
అని నగుచు విడిపించిన విడివడి చిడిముడికి నగ్గలంబైన సిగ్గున మ్రొగ్గి నెమ్మొగంబు చూపక, కోప కపట భావంబులు మనంబునం బెనంగొనఁ దపంబు చేసి యైన వీరలం జయించెద నని పలాయితులైన రాజులం గూడుకొనుచు జరాసంధుండు విరిగి చనియె; సురలు కుసుమవర్షంబులు గురియ హలియు హరియును మధురానగర జన వందిమాగధ జేగీయమానులై వీణా వేణు మృదంగ శంఖ దుందుభి నినదంబు లాకర్ణించుచు, మృగమద జలసిక్త విమల వీధికాశతంబును, వివిధ విచిత్ర కేతనాద్యలంకృతంబును సువర్ణ మణిమయ జయస్తంభ నిబద్ధ తోరణ సంయుతంబును, వేద నాద నినాదితంబును, సంతుష్టజన సంకుల గోపురంబునునైన పురంబుఁ బ్రవేశించి; రందు.
టీక:- అని = అని; నగుచున్ = నవ్వుతు; విడిపించినన్ = వదలిపెట్టగా; విడివడి = విడుదలపొంది; చిడిముడి = తొట్రుపాటు; కిన్ = కంటెను; అగ్గలంబు = మించిన; సిగ్గునన్ = సిగ్గుచేత; మ్రొగ్గి = తలవంచుకొని; నెఱి = నిండు; మొగంబున్ = ముఖమును; చూపక = కనబరచకుండ; కోప = కోపము; కపట = కపటము కల; భావంబులున్ = భావములు; మనంబున్ = మనసును; పెనంగొనన్ = చుట్టుముట్టగా; తపంబున్ = తపస్సును; చేసి = చేసి; ఐనన్ = అయినను; వీరలన్ = వీరిని; జయించెదను = గెలిచెదను; అని = అనుకొని; పలాయితులు = పారిపోయినవారు; ఐన = అయిన; రాజులన్ = రాజులను; కూడుకొనుచు = కలుసుకొనుచు; జరాసంధుండు = జరాసంధుడు; విరిగి = ఓడి; చనియెన్ = పోయెను; సురలు = దేవతలు; కుసుమ = పూల; వర్షంబులున్ = వానలు; కురియన్ = కురిపించగా; హలియున్ = బలరాముడు; హరియును = కృష్ణుడు; మథురా = మథుర అను; నగర = పట్టణపు; జన = ప్రజలచే; వంది = వందించువారిచే {వంది - వందించు (స్తుతి పాఠములు చదువు) వారు}; మాగధ = మాగధులచే {మాగధులు - వంశావళి చదువువారు}; జేగీయమానులు = కీర్తింపబడుచున్నవారు; ఐ = అయ్యి; వీణా = వీణలు; వేణు = మురళీలు; మృదంగ = మద్దెలలు; శంఖ = శంఖములు; దుందుభి = భేరీల యొక్క; నినదంబులు = ధ్వనులు; ఆకర్ణించుచున్ = వినుచు; మృగమద = కస్తూరి కలిపిన; జల = నీళ్ళచే; సిక్త = కళ్ళాపిజల్లబడిన; విమల = నిర్మలమైన; వీధికా = వీధుల; శతంబును = అనేకముకలది; వివిధ = పెక్కు; విచిత్ర = చిత్రితములైన; కేతన = జండాలు; ఆది = మున్నగువానిచే; అలంకృతంబును = అలంకరింపబడినది; సువర్ణ = బంగారము; మణి = రత్నాలు; మయ = పొదిగిన; జయ = గెలుపులను తెలుపు; స్తంభ = ధ్వజస్తంభములు; నిబద్ధ = కట్టబడిన; తోరణ = తోరణములుతో; సంయుతంబును = కూడి యున్నది; వేద = వేదపఠనముల; నాద = రవములుచే; నినదితంబును = మోగునది; సంతుష్ట = తృప్తిచెందిన; జన = ప్రజల; సంకుల = కలకలారావములు గల; గోపురంబును = పురద్వారముల కలది; ఐన = అయిన; పురంబున్ = పట్టణమును (మథురను); ప్రవేశించిరి = ప్రవేశించిరి; అందు = దానిలో.
భావము:- అలా నవ్వుతూ అని, వాడిని విడిచిపెట్టాడు. వాడేమో తొట్రుపాటును మించిన సిగ్గుతో కుమిలిపోయి, ముఖము ఎత్తుకోలేక, కోపం కుటిలత్వం మనసును చుట్టుముట్టగా, ‘తపస్సు చేసి అయినా వీళ్ళను జయించితీరాలి’ అని అనుకున్నాడు. పారిపోయిన తన రాజులను అందరిని కలుపుకుని ఓడి వెనక్కి వెళ్ళిపోయాడు. దేవతలు బలరామకృష్ణుల మీద పూలవాన కురిపించారు. అప్పుడు, వారు తమను మధురానగరవాసులూ వందిమాగధులూ కీర్తిస్తుండగా; వీణలు, వేణువులు, మృదంగాలు, శంఖాలు, దుందుభులు మొదలైన మంగళతూర్య రావాలు ఆలకిస్తూ పురప్రవేశం చేసారు. అలా వీధులు అన్నీ శుభ్రంగా కస్తూరి కలిపిన నీళ్ళతో తడపబడి, అనేక విచిత్రము లైన జెండాలు మున్నగు వాటితో అలంకరించబడి, కనకరత్నమయము లైన విజయ స్తంభాలకు తోరణాలు కట్టబడి ఉండి; వేదధ్వనులతో ప్రతిధ్వనిస్తూ, సంతుష్టహృదయులైన ప్రజలు కలిగిన వాకిళ్ళతో కళకళలాడుతున్న ఆ మథురానగరాన్ని బలరాముడు శ్రీకృష్ణుడు ప్రవేశించారు.

తెభా-10.1-1580-ఉ.
"వెల్లువలైన వైరినృపవీరుల నెల్ల జయించి వీటికిన్
ల్లిదులైన కృష్ణబలద్రులు వచ్చుచునున్నవారు రం;
డుల్లములారఁ జూత" మని యున్నత సౌధము లెక్కి వారిపైఁ
ల్లవ పుష్ప లాజములఁ బౌరపురంధ్రులు చల్లి రెల్లెడన్.

టీక:- వెల్లువలు = వరదలెత్తినట్టివి; ఐన = అయిన; వైరి = విరోధి; నృప = రాజ; వీరులన్ = భటులను; ఎల్లన్ = అందరిని; జయించి = గెలిచి; వీడు = పట్టణమున; కిన్ = కు; బల్లిదులు = బలవంతులు; ఐన = అయిన; కృష్ణ = కృష్ణుడు; బలభద్రులు = బలరాముడులు; వచ్చుచున్నవారు = వస్తున్నారు; రండు = రండి; ఉల్లములు = మనసులు; ఆరన్ = అతిశయిల్లగా, నిండుగా; చూతము = చూచెదము; అని = అని; ఉన్నత = ఎత్తైన; సౌధములు = మేడలు; ఎక్కి = ఎక్కి; వారి = వారల; పైన్ = మీద; పల్లవ = చిగుళ్ళను; పుష్ప = పూలను; లాజములన్ = పేలాలను; పౌర = పట్ఠణపు; పురంధ్రులు = స్త్రీలు {పురంధ్రి - గృహమును ధరించునామె, గృహిణి}; చల్లిరి = చల్లిరి; ఎల్ల = అన్ని; ఎడన్ = చోటులందు.
భావము:- “వెల్లువలా పెల్లుబికి వచ్చిన వీరులైన శత్రురాజులు అందరినీ జయించి, బలవంతులైన బలరామకృష్ణులు విచ్చేస్తున్నారు; రండి! రండి! మనసార దర్శిద్దాము” అని ఎత్తయిన మేడలెక్కి, పురస్ఱ్ఱీలు వారి మీద చిగుళ్ళూ పూలూ సేసలూ చల్లారు.

తెభా-10.1-1581-వ.
ఇట్లు పురంబు ప్రవేశించి యుద్ధప్రకారంబెల్ల నుగ్రసేనున కెఱింగించి కృష్ణుం డిచ్ఛావిహారంబుల నుండె; మఱియు నెక్కువ మత్సరంబున నమ్మాగధుండు మహీమండలంబునంగల దుష్టమహీపతుల నెల్లం గూడుకొని సప్తదశ వారంబులు సప్తదశాక్షౌహిణీ బల సమేతుండై మథురానగరంబుపై విడిసి మాధవ భుజాప్రాకార రక్షితు లగు యాదవులతోడ నాలంబు చేసి నిర్మూలిత బలుండై పోయి క్రమ్మఱ నష్టాదశ యుద్ధంబునకు వచ్చునెడం గలహ విద్యావిశారదుం డగు నారదుండు కాలయవను కడకుం జని యిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; పురంబున్ = పట్టణము; ప్రవేశించి = లోనికివెళ్ళి; యుద్ధ = యుద్ధముజరిగిన; ప్రకారంబున్ = విధమును; ఎల్లన్ = అంతటిని; ఉగ్రసేనున్ = ఉగ్రసేనుని; కిన్ = కి; ఎఱింగించి = తెలిపి; కృష్ణుండు = కృష్ణుడు; ఇచ్ఛా = కోరినట్లు; విహారంబులన్ = విహరించుటలందు; ఉండెన్ = ఉండెను; మఱియున్ = తరువాత; ఎక్కువ = అధికమైన; మత్సరంబునన్ = మాత్సర్యముతో; ఆ = ఆ; మాగధుండు = జరాసంధుడు {మాగధుడు - మగధదేశరాజు, జరాసంధుడు}; మహీ = భూ; మండలంబునన్ = లోకములో; కల = ఉన్న; దుష్ట = చెడ్డవారైన; మహీపతులన్ = రాజులను {మహీపతి - మహీ (రాజ్యమునకు) అధిపతి, రాజు}; ఎల్లన్ = అందరిని; కూడుకొని = కూడగట్టుకొని; సప్తదశ = పదిహేడు (17); వారంబులు = మారులు; సప్తదశ = పదిహేడు (17); అక్షౌహిణీ = అక్షౌహిణుల; బల = సేనలతో; సమేతుండు = కూడినవాడు; ఐ = అయ్యి; మథురా = మథుర; నగరంబున్ = పట్టణము; పైన్ = మీద; విడిసి = చుట్టుముట్టి; మాధవ = కృష్ణుని; భుజ = భుజములు అనెడి; ప్రాకార = కోటచేత; రక్షితులు = రక్షింపబడువారు; అగు = ఐన; యాదవుల = గోపకుల; తోడన్ = తోటి; ఆలంబు = యుద్ధము; చేసి = చేసి; నిర్మూలిత = మొదలంటానశింపబడిన; బలుండు = సేనలుకలవాడు; ఐ = అయ్యి; పోయి = వెళ్ళి; క్రమ్మఱన్ = మరల; అష్టాదశ = పద్దెనిమిదవ; యుద్ధంబున్ = యుద్ధమున; కున్ = కు; వచ్చున్ = వచ్చుచున్న; ఎడన్ = సమయమునందు; కలహ = కలహములు పుట్టించెడి; విద్యా = నైపుణ్యములందు; విశారదుండు = మిక్కిలినేర్పుకలవాడు; అగు = ఐన; నారదుండు = నారదుడు; కాలయవను = కాలయవనుని; కడ = వద్ద; కున్ = కు; చని = వెళ్ళి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా పట్టణంలో ప్రవేశించిన రామకృష్ణులు యుద్ధము ఎలా జరిగిందో ఉగ్రసేన మహారాజుకు తెలిపారు. శ్రీకృష్ణుడు యధేచ్ఛా విహారాలతో ఉన్నాడు, కాని జరాసంధుడు పెనుమచ్చరంతో భూమండలంలోని దుష్టరాజులు అందరినీ కలుపుకుని పదిహేడుసార్లు, పదిహేడు అక్షౌహిణులసేనతో మథురపై దండెత్తాడు. కృష్ణ భుజములనే ప్రాకారాలతో పరిరక్షితులైన యాదవులతో అతడు కయ్యాలు గావించాడు, తడవతడవకూ తన బలములు అన్నీ నశించిపోతున్నా జరాసంధుడు మళ్ళీ పదునెనిమిదవ పర్యాయం కదనానికి సిద్ధపడి కదిలివస్తూ ఉండగా కలహవిద్యలో ఆరితేరిన నారదుడు కాలయవనుడు దగ్గరకువెళ్ళి ఇలా అన్నాడు.