పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/చాణూరముష్టికులతో పోరు
తెభా-10.1-1348-వ.
ఇ ట్లగ్గలం బగు నగ్గలిక డగ్గఱిన మల్లునిం గని మెల్లన మొల్లంబగు బీరంబు వెల్లిగొన, వల్లవీవల్లభుం డుల్లసిల్లి బాహునాదంబున రోదోంతరాళంబు పూరించి మించి కవిసె; నట్లిద్దఱు నుద్దవిడి నున్నత విషమంబులగు ఠాణ లిడి, కరి కరియును, హరి హరియును గిరి గిరియునుం దాఁకు వీఁకం దలపడి యితరేతర హేతిహింసితంబులగు దవానలంబుల తెఱంగునఁ బరస్పర దీర్ఘనిర్ఘాత ఘట్టితంబులగు మహాభ్రంబుల విభ్రమంబున నన్యోన్య తుంగతరంగ తాడితంబు లగు కల్పాంతకాల సముద్రంబుల రౌద్రంబున నొండరుల ముష్టి ఘట్టనంబుల ఘట్టితశరీరులై దద్దరిలక డగ్గఱి గ్రద్దన నయ్యిద్దఱుం దిరుగు నెడ హరి చొచ్చి పేర్చి యార్చి జెట్టింబట్టి పడం దిగిచి పాదంబుల జాడించి సముల్లాసంబున నెసకంబునకు వచ్చిన మెచ్చి నొచ్చి య చ్చపలుండు మీఱి మోర సారించి తెరలక పొరలం ద్రొబ్బిన న బ్బలానుజుం డుబ్బి గొబ్బున మేను వర్ధిల్ల నర్దాంగకంబున నుండి జానువుల నొత్తుచు నురవడింగరవడంబున నున్ననా దుర్నయుండును “బాల! మేలు మే”లని లీలం గాలు చొరనిచ్చి త్రోచినం జూచి యేచి ఖేచరు లగ్గించి యుగ్గడింప న గ్గోపకుమారుండు పాటవంబున రాటవంబునకుంజని వెన్నెక్కి నిక్కిన న క్కంసభటుండు మదజలరేఖా బంధురం బగు గంధసింధురంబు చందంబునఁ పదంబునుఁ బదంబునం జాఁపి కరంబునుఁ గరంబున గ్రహించి సహించి వహించి నైపుణ్యంబున లోపలం దిరిగి యట్టిట్టు దట్టించిన దిట్టతనంబునం దిటవు దప్పక న ప్పద్మలోచనుండు కేడించి యేచి సమతలంబున వైచి ప్రచండం బగు వాని పిచండంబు వాగించి కాలఁధిక్కరించి డొక్కరంబు గొనిన న య్యభ్యాసి సభ్యులు సన్నుతింపం గ్రమ్మఱించి జడ్డనం గా లడ్డగించి రక్షించుకొనిన నా రక్షోవైరి వైరి కటిచేలంబు పట్టి యెత్తి యొత్తి నడుమ రాగెయిడి సందుబెట్టి నవ్విన, న వ్విరోధికాలు కాలిలో నిడి వేధించి నిరోధించిన, నిరోధంబుఁ బాసి తిరిగిన వసుదేవుపట్టి పట్టిసంబుఁ గొని దట్టించిన నుబ్బరిక చేసి చాణూరుండు హరికరంబుపట్టి హుమ్మని నెమ్మొగంబునం గాలిడి మీఁదైనం గేళీ బాలకుండు కాలుగాల నివారించి మీఁదై నెగడియుండనీయక దుర్వారబలంబున విదలించిలేచి గృహీత పరిపంథి చరణుండయి విపక్షుని వక్షంబు వజ్రివజ్ర సన్నిభంబగు పిడికిటం బొడిచిన వాఁడు వాఁడిచెడక విజృంభించి యంభోరాశి మథనంబునం దిరుగు శైలంబు పోలిక నేల జిఱజిఱం దిరిగి తన్నిన వెన్నుండు కుప్పించి యుప్పరం బెగసి మీఁద నుఱికిన నతండు కృష్ణపాద సంధి పరిక్షిప్తపాదుండై యెగసి లేచి సముద్ధతుం డయ్యె, న య్యెడ.
టీక:- ఇట్లు = ఈ విధముగ; అగ్గలంబు = అధికము; అగు = ఐన; అగ్గలికన్ = ఉత్సాహముతో; డగ్గఱిన = సమీపించిన; మల్లునిన్ = మల్లవీరుని; కని = చూసి; మెల్లన = తిన్నగా; మొల్లంబు = అధికము; అగు = ఐన; బీరంబు = శౌర్యము; వెల్లిగొనన్ = మిక్కిలి పెరగగా; వల్లవీవల్లభుండు = కృష్ణుడు {వల్లవీ వల్లభుడు - గోపికలకు ప్రియుడు, కృష్ణుడు}; ఉల్లసిల్లి = ఉత్సహించి; బాహు = భుజములు చరచిన; నాదంబునన్ = శబ్దముతో; రోదోంతరాళంబున్ = భూమ్యాకాశ మధ్యభాగం; పూరించి = నిండించి; మించి = అతిశయించి; కవిసెన్ = ఎదుర్కొనెను; అట్లు = అలా; ఇద్దఱును = ఇద్దరు (2); ఉద్దవిడిన్ =బహు శీఘ్రముగా; ఉన్నత =అధికముగా; విషమంబులు =కఠినమైనవి, భయంకరమైనవి; అగు = ఐన; ఠాణలిడి = పట్లు పట్టి; కరి = ఏనుగు; కరియును = ఏనుగును; హరి = సింహము; హరియును = సింహమును; గిరి = కొండ; గిరియునున్ = కొండను; తాకు = తలపడెడి; వీకన్ = విధముగ; తలపడి = తలపడి; ఇతరేతర = ఒండొంటి; హేతి = మంటలచే; హింసితంబులు = కొట్టబడినవి; అగు = ఐన; దవానలంబుల = కార్చిచ్చుల; తెఱంగునన్ = వలె; పరస్పర = ఒకదానినొకటి; దీర్ఘ = పెద్ద; నిర్ఘాత = పిడుగులచే; ఘట్టితంబులు = కొట్టబడినవి; అగు = ఐన; మహా = గొప్ప; అభ్రంబుల = మేఘముల; విభ్రమంబునన్ = విలాసముచే; అన్యోన్య = ఒండొంటి యొక్క; తుంగతరంగ = పెద్ద అలలచేత; తాడితంబులు = కొట్టబడినవి; అగు = ఐన; కల్పాంత = ప్రళయ; కాల = సమయపు; సముద్రంబుల = సముద్రముల; రౌద్రంబునన్ = భీకరత్వము చేత; ఒండొరులన్ = ఒకరినొకరు; ముష్టి = పిడికిటి; ఘట్టనంబులన్ = పోటులతో; ఘట్టిత = కొట్టబడిన; శరీరులు = దేహములు కలవారు; ఐ = అయ్యి; దద్దరిలకన్ = చలింపక; డగ్గఱి = కదిసి; గ్రద్దనన్ =శీఘ్రముగా; ఆ = ఆ; ఇద్దఱున్ = ఇద్దరు (2); తిరుగు = సంచరించు; ఎడన్ = అప్పుడు; హరి = కృష్ణుడు; చొచ్చి = చొరవచేసి ప్రవేశించి, అధిగమించి; పేర్చి = విజృంభించి; ఆర్చి = సింహనాదముచేసి; జెట్టిన్ = మల్లవీరుని; పట్టి = పట్టుకొని; పడందిగిచి = పడగొట్టి; పాదంబులన్ = కాళ్ళతో; జాడించి = తన్ని; సమ = మిక్కిలి; ఉల్లాసంబునన్ = ఉత్సాహముతో; ఎసకంబున్ = మీరుట, మించుట; కున్ = కు; వచ్చినన్ = రాగా; మెచ్చి = శ్లాఘించి; నొచ్చి = నొప్పిని పొంది; ఆ = ఆ యొక్క; చపలుండు = చపలత కలవాడు {చపలత - రాగద్వేషాదులచే పనుల యందు కలుగు తబ్బిబ్బు}; మీఱి = మించి, అతిశయించి; మోర = మూతి; సారించి = మీదికెత్తి; తెరలక = వెనుదీయక; పొరలన్ = కిందుమీదగునట్లు; ద్రొబ్బినన్ = తోయగా; ఆ = ఆ యొక్క; బలానుజుండు = కృష్ణుడు {బలానుజుడు - బలరాముని సోదరుడు, కృష్ణుడు}; ఉబ్బి = దేహముపెంచి; గొబ్బునన్ = తటాలున; మేను = శరీరము; వర్ధిల్లన్ = పెరుగగా; అర్ధాంగకంబునన్ = అర్థాంగకము అను స్థానకమునందు; ఉండి = ఉండి; జానువులన్ = మోకాళ్ళతో; ఒత్తుచున్ = నొక్కుతూ; ఉరవడిన్ = మిక్కిలి వడితో; కరవడంబునన్ = కరవడము అను స్థానకమునందు; ఉన్నన్ = ఉండగా; ఆ = ఆ యొక్క; దుర్నయుండును = దుష్టుడు; బాల = పిల్లాడా; మేలుమేలు = బాగుబాగు; అని = అని; లీలన్ = విలాసముగా; కాలు = కాలును; చొరనిచ్చి = దూర్చి, చొప్పించి; త్రోచినన్ = తోయగా; చూచి = చూసి; ఏచి = విజృంభించి; ఖేచరులు = దేవతలు {ఖేచరులు - ఆకాశ గమనము కలవారు, దేవతలు}; అగ్గించి = పొగడి; ఉగ్గడింపన్ = చెప్పుకొనగా; ఆ = ఆ; గోపకుమారుండు = కృష్ణుడు {గోపకుమారుడు - గొల్లపిల్లవాడు, కృష్ణుడు}; పాటవంబున్ = నేర్పుచేత; రాటవంబున్ = రాటవము అను మల్లస్థానకమున; కున్ = కు; చని = వెళ్ళి; వెన్ను = వీపుమీదకు; ఎక్కి = ఎక్కి; నిక్కినన్ = నిక్కగా; ఆ = ఆ యొక్క; కంస = కంసుని యొక్క; భటుండు = సేవకుడు; మదజల = మదజలము; రేఖా = స్రావముచే; బంధురంబు = ఉన్నతమగునది; అగు = ఐన; గంధ = మదపు; సింధురంబు = ఏనుగు; చందంబునన్ = వలె; పదంబును = పాదమును; పదంబునన్ = పాదములందు; చాపి = చాపి; కరంబును = చేతిని; కరంబునన్ = చేతితో; గ్రహించి = పట్టుకొని; సహించి = నొప్పినోర్చుకొని; వహించి = పూని; నైపుణ్యంబునన్ = నేర్పుతో; లోపలన్ = కాలు చేతుల లోపలి వైపుకు; తిరిగి = తిరిగి; అట్టిట్టు = అటునిటు; దట్టించినన్ = బిగించగా; దిట్టతనంబునన్ = చలింపని నేర్పుతో; దిటవు = పట్టు; తప్పక = విడువకుండ; ఆ = ఆ యొక్క; పద్మలోచనుండు = పద్మాక్షుడు, కృష్ణుడు; కేడించి = తొలగి, వెనుకమొగమై; ఏచి = చెలరేగి; సమతలంబునన్ = అడ్డంగా; వైచి = పడదోసి; ప్రచండంబు = చేరరానిది, అసాధ్యమైనది; అగు = ఐన; వాని = అతని; పిచండంబున్ = కడుపును; వాగించి = తట్టి; కాలన్ = కాలితో; ధిక్కరించి = తన్ని, నిలువరించి; డొక్కరంబున్ = డొక్కరము అను మల్లవిజ్ఞానమును {డొక్కరము - మూపుమీద మోకాళ్ళు మోపి చేతులతో అణచిపట్టుట}; ఆకొనినన్ = అవలంభింపగా; ఆ = ఆ యొక్క; అభ్యాసి = చాణూరుడు {అభ్యాసి - మంచి అభ్యాసము చేసినవాడు, చాణూరుడు}; సభ్యులు = సభికులు; సన్నుతింపన్ = శ్లాఘించగా; క్రమ్మఱించి = మరలించి; జడ్డనన్ = తటాలున; కాలు = కాలును; అడ్డగించి = అడ్డముగపెట్టి; రక్షించుకొనినన్ = కాపాడుకొనగా; ఆ = ఆ యొక్క; రక్షోవైరి = కృష్ణుడు {రక్షోవైరి - రాక్షసుల శత్రువు, విష్ణువు}; వైరి = పగవాని; కటి = నడుము; చేలంబున్ = బట్టను; పట్టి = పట్టుకొని; ఎత్తి = పైకెత్తి; ఒత్తి = నొక్కిపెట్టి; నడుమ = నడుమ; రాగె = రాగ అను విజ్ఞానము (పట్టు); ఇడి = కనబరచి; సందుబెట్టి = సందుబెట్టి; నవ్వినన్ = నవ్వగా; ఆ = ఆ యొక్క; విరోధి = శత్రువు, చాణూరుడు; వేధించి = పీడించి; నిరోధించినన్ = అడ్డగించగా; నిరోధంబున్ = అడ్డు; పాసి = తొలగించుకొని; తిరిగినన్ = మరలగా; వసుదేవుపట్టి = కృష్ణుడు; పట్టిసంబు = ఇనుపగుదియను; కొని = చేతబట్టి; దట్టించినన్ = అదలించగా; ఉబ్బరిక = పైకెగురుట; చేసి = చేసి; చాణూరుండు = చాణూరుడు; హరి = కృష్ణుని; కరంబున్ = చేతిని; పట్టి = పట్టుకొని; హుమ్మ్ = హుమ్మ్; అని = అని శబ్దముతో; నెఱి = విశాలమైన; మొగంబునన్ = ముఖముమీద; కాలు = కాలును; ఇడి = పెట్టి; మీదైనన్ = పైకెక్కగా; కేళీబాలకుండు = కృష్ణుడు; కాలున్ = కాలును; కాలన్ = కాలితో; నివారించి = అడ్డగించి; మీద = మీరినవాడు; ఐ = అయ్యి; నెగడి = మించి; ఉండియున్ = ఉండి; ఉండక = అట్లే ఉండకుండా; దుర్వార = నివారింపరాని; బలంబునన్ = బలముతో; విదలించి = విదల్చికొని; లేచి = పైకి లేచి; గృహీత = పట్టుకొనబడిన; పరిపంథి = పగవాని; చరణుండు = కాళ్ళు కలవాడు; అయి = అయ్యి; విపక్షుని = పగవాని; వక్షంబు = రొమ్ముప్రదేశమును; వజ్రి = ఇంద్రుని; వజ్ర = వజ్రాయుధమును; సన్నిభంబు = వంటిది; అగు = ఐన; పిడికిటన్ = ముష్టితో; పొడిచినన్ = గుద్దగా; వాడు = అతడు; వాడి =నిశితము, శౌర్యము; చెడక = చెడినవాడు కాకుండ; విజృంభించి = చెలరేగి; అంభోరాశి = సముద్ర; మథనంబునన్ = మథనము సమయములో; తిరుగు = తిరుగునట్టి; శైలంబు = మంధరపర్వతము; పోలికన్ = వలె; నేలన్ = నేలమీద; జిఱజిఱన్ = గిరగిరా; తిరిగి = తిరిగి; తన్నినన్ = తన్నగా; వెన్నుండు = కృష్ణుడు; కుప్పించి = గెంతి; ఉప్పరంబు = మీదకి; ఎగిసి = ఎగిరి; మీదన్ = మీదకి; ఉఱికినన్ = దుముకగా; అతండు = అతను; కృష్ణ = కృష్ణుని; పాద = కాలిచేత; సంధి = కీళ్ళసంధు లందు; పరిక్షిప్త = తన్నబడిన; పాదుండు = కాళ్ళు కలవాడు; ఐ = అయ్యి; ఎగసి = ఎగిరి; లేచి = పైకి లేచి; సముద్ధతుండు = నిక్కినిలిచినవాడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ యొక్క; ఎడ = సమయము నందు.
భావము:- ఇలా మితిమీరిన శౌర్యంతో సమీపించిన ఆ మల్లుడిని గోపాలప్రియుడు చూసాడు; క్రమంగా పరాక్రమాటోపం అతిశయిల్లగా అతడు ఉల్లాసంగా భుజాలు అప్పళించాడు; ఆ శబ్దం భూనభోంతరాళాలు నిండిపోయింది; అతడు చాణూరమల్లుని ఎదుర్కొన్నాడు; వారిద్దరూ మహా పరాక్రమంతో పెద్ద చిన్న మల్లయోధుల పట్లు పట్టారు. ఏనుగు ఏనుగుతో, సింహం సింహంతో, కొండ కొండతో ఢీకొన్నట్లు ఒకరితో ఒకరు తలపడ్డారు; రెండు కార్చిచ్చులు తమ తమ అగ్నిజ్వాలలతో ఒకదాని నొకటి పీడించుకున్నట్లుగా; రెండు మహా మేఘములు పరస్పరం పెద్ద పెద్ద పిడుగులు రాల్చుకొన్నట్లుగా; ప్రళయకాలంలో రెండు సముద్రాలు ఒకదానినొకటి సముత్తుంగతరంగాలతో కొట్టుకున్నట్లుగా; వారిద్దరూ రౌద్రంతో ఒకరినొకరు పిడికిళ్ళతో గ్రుద్దుకున్నారు; తబ్బిబ్బు పడక ఇద్దరూ ఎదురు బెదురుగా చేరి వేగంగా మల్లరంగంలో పరిభ్రమించారు. అప్పుడు హరి విజృంభించాడు బొబ్బరిస్తూ చాణూర జెట్టిని పట్టిపడలాగాడు; కాళ్ళు జాడించి మిక్కిలి ఉల్లాసంతో ఆ మల్లుడు విజృంభించడం చూసి గోవిందుడు మెచ్చుకున్నాడు; చపలుడైన చాణూరుడు నొప్పెడుతున్నప్పటికీ మెడ నిక్కించి తొలగిపోక మురారిని దొర్లిపోయేలా త్రోసాడు; అంతట బలరాముని తమ్ముడైన కృష్ణుడు శరీరము ఉప్పొంగగా తటాలున అర్ధాంగకంలో ఉన్నవాడై మోకాళ్ళతో వానిని ఒత్తాడు; వేగంగా కరవడ మనే ఒక మల్లబంధం భంగిమలో ఉన్నాడు; అప్పుడు దుర్నీతీపరుడైన మల్లుడు “డింభకా! మేలు మే” లని పలుకుతూ అలవోకగా కాలు చొప్పించి కృష్ణుడిని పడద్రోసాడు; అంతట వెన్నుడు చెలరేగి వ్రేల్పులు ప్రస్తుతించగా చాతుర్యంతో వెనుకకు వెళ్ళి చాణూరుడి వీపుమీదకి ఎక్కి నిక్కాడు; ఆ కంస భృత్యుడు అయిన చాణూరుడు మదజలధారల చారికలతో నిండుగా ఉన్న మదపుటేనుగులా మాధవుడి పాదాన్ని తన పాదంతో, చేతిని తన చేతితో పెనవేసి పట్టుకుని నేర్పుగా మల్లరంగం అంతా తిరుగుతూ అటూ ఇటూ కుదిలించి వేసాడు; కమలలోచనుడు దిట్టతనముతో దిటవు కోల్పోకుండా తొలగి, చెలరేగి, జెట్టిని మల్లరంగతలం మీద పడద్రోసి పెద్దదైన వాడి కడుపు మీద మోదాడు; తన కాలితో వాడి కాలిని మెలిపెట్టి డొక్కర మనే మల్లబంధ విశేషాన్ని చూపాడు. మంచి మల్లవిద్యాభ్యాసం పొంది ఉన్న చాణూరుడు సభలోనివారు తన్ను పొగుడుతుండగా కృష్ణుడిని వెనుకకు మరలించి, తటాలున తన కాలితో అడ్డగించి తనను తాను రక్షించుకున్నాడు; రాక్షసవిరోధి యగు కృష్ణుడు వాడి దట్టి పట్టి ఎత్తి ఒత్తి రాగెయిడి సందుపెట్టి నవ్వాడు. పగతుడైన మల్లుడు తన కాలిని కృష్ణుడి కాలితో చేర్చి బాధించి నిరోధించాడు; వాసుదేవుడు విరోధి నిరోధాన్ని తప్పించుకుని, అడ్డకత్తి చేబూని అదలించాడు; చాణూరుడు చెలరేగి గెంతి శ్రీహరి బాహువు పట్టుకుని హుమ్మని హూంకరించి ముఖాన కాలుపెట్టి మీదుమిగిలాడు; లీలామానుషబాలుడైన శ్రీకృష్ణుడు చాణూరుని కాలిని తన కాలితో అడ్డగించి, వాడి విజృంభణము అణచి, అడ్డుకొనరాని బలిమితో విదిలించుకుని లేచాడు; శత్రువు పాదాన్ని త్రొక్కిపట్టి వజ్రాయుధం వంటి పిడికిలితో వాడి వక్షంపైన పొడిచాడు; వాడు పోడిమిచెడక చెలరేగాడు; సాగరమథనవేళ సముద్రంలో తిరిగే మందరపర్వతం మాదిరి వాడు నేలమీద గిరగిర తిరుగుతూ, కృష్ణుణ్ణి తన్నాడు; వెన్నుడు కుప్పించి పైకెగిరి వాడిపైకి దూకాడు; కృష్ణుడి పాదాలు వాడి పాదాల సంధిబంధాలను తాకయి; వాడు ఎగిరి పైకి లేచి విజృంభించాడు. అదే సమయంలో. .
తెభా-10.1-1349-క.
బలభద్రుఁడు ముష్టికుఁడును
బలములు మెఱయంగఁ జేసి బాహాబాహిం
బ్రళయాగ్నుల క్రియఁ బోరిరి
వెలయఁగ బహువిధములైన విన్నాణములన్.
టీక:- బలభద్రుడు = బలరాముడు; ముష్టికుడును = ముష్టికుడు; బలములు = బలములు; మెఱయంగన్ = ప్రకాశించునట్లు; చేసి = చేసి; బాహాబాహిన్ = ముష్టాముష్టి, చేతులతో పెనగులాటల చేత; ప్రళయ = ప్రళయకాలపు; అగ్నుల = అగ్నిశిఖల; క్రియన్ = వలె; పోరిరి = పోరాడిరి; వెలయగన్ = ప్రసిద్ధముగా; బహు = అనేక; విధములు = విధములు; ఐన = అయినట్టి; విన్నాణములన్ = నేర్పులతో.
భావము:- అనేక రకాల బలవిన్యాసాలతో బలరాముడు, ముష్టికుడు తమ తమ బలాలు చూపుతూ ప్రళయకాలం లోని అగ్నుల చందాన చేతులతో ఒకరినొకరు త్రోసుకుంటూ పోరాటం సాగించారు.
తెభా-10.1-1350-వ.
ఇవ్విధంబున.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగా.
భావము:- ఈ విధంగా. . .
తెభా-10.1-1351-క.
వల్లవులు పెనఁగి రున్నత
గల్లులతో భిన్నదిగిభకరవల్లులతో
మల్లురతో రిపుమానస
భల్లులతో భీతగోపపల్లులతోడన్.
టీక:- వల్లవులు = బలరాముడు కృష్ణులు; పెనగిరి = పోరాడిరి; ఉన్నత = శ్రేష్ఠమైన; గల్లుల = చెంపలుగలవారి, జెట్టీల; తోన్ = తోటి; భిన్న = భేదింపబడిన; దిగిభ = దిగ్గజముల {దిగిభము - దిక్ + ఇభము, దిగ్గజము}; కర = తొండములవంటి; వల్లుల = చేతులను తీగలు గలవారి; తోన్ = తోటి; మల్లుర = మల్లవీరుల; తోన్ = తోటి; రిపు = శత్రువుల; మానస = మనసులకు; భల్లుల = బల్లెమువంటి వారి; తోన్ = తోటి; భీత = భయపడిన; గోప = గొల్ల; పల్లుల = పల్లెలు గలవారి; తోడన్ = తోటి.
భావము:- నిక్కిన చెక్కిళ్ళు కలవారూ, దిగ్గజాల తొండాలను భేదించే తీవల వంటి చేతులు కలవారూ, శత్రువుల మనస్సులకు బల్లెముల వంటివారూ, గోపకుల సమూహానికి భయము కల్గించేవారూ అయిన మల్ల యోధులతో గోపాలబాలకులైన బలరామకృష్ణులు పోరాడారు.