Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోపికలవద్ద పాడుట

వికీసోర్స్ నుండి

తెభా-10.1-1093-చ.
ప్రద యొకర్తు మాధవుఁడు పాడ విపంచి ధరించి కేల సం
భ్రమునఁ దంత్రి మీటుచుఁ దిరంబుగ ఠాయముచేసి యొక్క రా
ముఁ దగ నాలపించి సుభస్వరజాతులు వేఱువేఱు కా
రఁగఁ బాడెఁ దన్ రమణుఁ డౌనన దారువు లంకురింపఁగన్.

టీక:- ప్రమద = యువతి; ఒకర్తు = ఒకామె; మాధవుడు = కృష్ణుడు {మాధవుడు - మనసులకు ప్రభువు, విష్ణువు}; పాడన్ = పాటలు పాడుతుండగ; విపంచి = వీణను; ధరించి = తీసుకొని; కేలన్ = చేతితో; సంభ్రమమున = సంతోషముతో; తంత్రిన్ = తీగను; మీటుచున్ = వాయించుచు; తిరంబుగన్ = స్థిరమైన; ఠాయము = స్వరస్థాయి; చేసి = చేసి; ఒక్క = ఒకానొక; రాగము = రాగము; తగన్ = చక్కగా; ఆలపించి = పాడి; సుభగ = మనోహరమైన; స్వర = సరిగమాది స్వరములు; జాతులున్ = సమూహములు; వేఱువేఱు = వివరముగా; అమరన్ = అమరి ఉండునట్లు; పాడెన్ = పాడెను; తన్ = ఆమెను; రమణుడు = చక్కటివాడు, కృష్ణుడు; ఔననన్ = మెచ్చుకొనగా, శ్లాఘించగా; దారువులున్ = చెట్లు; అంకురింపన్ = చిగురించగా.
భావము:- ఒక రమణి రమావల్లభుడు కృష్ణుడు పాడుతుండగా వీణను చేతబట్టి సవిలాసంగా తీగలు మీటింది. అతడు “మేలుమే” లని మెచ్చుకోగా, మ్రోడుబారిన చెట్లు చిగురించేలా, నిలుకడగా స్వరస్థాయి అందుకుని ఒక చక్కని రాగము రమ్యంగా ఆలాపించి, షడ్జాదు లైన స్వరభేదాలూ జాతులూ కలిసిపోకుండా విశదం అయ్యేలా పాట పాడింది.

తెభా-10.1-1094-క.
డుచుఁ బాడుచు నందొక
చేడియ మంజీర మంజు శింజిత మమరం
గూడి హరికరము చనుగవ
పై డాయఁగఁ దిగిచె జఘనభారాలసయై.

టీక:- ఆడుచున్ = ఆడుతు; పాడుచున్ = పాడుతు; అందు = వారిలో; ఒక = ఒకానొక; చేడియ = స్త్రీ; మంజీర = కాలి అందెల; మంజు = మనోజ్ఞమైన; శింజితము = ధ్వని; అమరన్ = కుదురునట్లుగ; కూడి = కలిసి; హరి = కృష్ణుని; కరమున్ = చేతిని; చనుగవ = పాలిండ్లజంట; పై = మీద; డాయగన్ = చేరునట్లు; తిగిచె = లాగుకొనెను; జఘన = పిరుదుల యొక్క; భార = బరువులచేత; అలస = బడలిక చెందినది; ఐ = అయ్యి.
భావము:- ఆ గోపికలలో ఒకామె, కాలి అందెలు ఘల్లు ఘల్లు మని శబ్దం చేస్తుండగా ఆడుతూ పాడుతూ పిరుదుల బరువు చేత అలసట వహించి అనంతుని హస్తాన్ని లాగి తన చనుదోయిపై ఉంచుకుంది.

తెభా-10.1-1095-క.
చంనలిప్తంబై యర
విందామోదమున నొప్పు విపులభుజము గో
విందుఁ డొక తరుణి మూపుఁనఁ
బొందించిన నది దెమల్చి పులకించె నృపా!

టీక:- చందన = మంచిగంధముచే; లిప్తంబు = పూయబడనది; ఐ = అయ్యి; అరవింద = తామరపూల; ఆమోదమునన్ = సువాసనలతో; ఒప్పు = చక్కగానుండెడి; విపుల = విస్తారమైన; భుజము = భుజము; గోవిందుడు = కృష్ణుడు; ఒక = ఒకానొక; తరుణి = స్త్రీ; మూపునన్ = వీపుపైన; పొందించి = ఉంచగా; అది = ఆమె; తెమల్చి = చలించి; పులకించెన్ = పులకరించెను; నృపా = రాజా.
భావము:- ఓ రాజా! కృష్ణుడు పద్మాల పరిమళం గుబాళిస్తూ మంచిగంధం పూతచే అందగించిన తన బలమైన భుజమును ఒక సుందరి భుజానికి ఆనించగా, ఆమె చలించి గగుర్పాటు వహించింది.

తెభా-10.1-1096-సీ.
చెలువ యొక్కతె చెక్కుఁ జెక్కుతో మోపిన-
విభుఁడు తాంబూలచర్వితముఁ బెట్టె
నాడుచు నొక లేమ లసినఁ బ్రాణేశుఁ-
డున్నత దోస్తంభ మూఁతఁ జేసెఁ
జెమరించి యొకభామ చేరినఁ గడగోరఁ-
తురుఁడు గుచఘర్మలముఁ బాపె
లకంబు లొక యింతి ళిక చిత్రకరేఖ-
నంటినఁ బ్రియుఁడు పాయంగ దువ్వెఁ

తెభా-10.1-1096.1-ఆ.
డతి యొకతె పాటపాడి డస్సిన యధ
రామృతమున నాథుఁ డాదరించె
హార మొక్క సతికి నంసావృతంబైనఁ
గాంతుఁ డురముఁ జేర్చి కౌఁగలించె.

టీక:- చెలువ = సుందరి; ఒక్కతె = ఒకామె; చెక్కు = చెంపను; చెక్కు = చెంప; తోన్ = తోటి; మోపినన్ = తాకించగా; విభుడు = కృష్ణుడు; తాంబులచర్వితము = తమ్మ; పెట్టెన్ = పెట్టెను; ఆడుచున్ = నటించుచు; ఒక = ఒకానొక; లేమ = చిన్నది {లేమ - లేతవయస్కురాలు, స్త్రీ}; అలసిన = బడలికచెందగా; ప్రాణేశుడు = భర్త, కృష్ణుడు; ఉన్నత = పొడవైన; దోః = చేయి అనెడి; స్తంభమున్ = స్తంభమును; ఊత = ఆనుట కనువుగా; చేసెన్ = అమర్చెను; చెమరించి = చెమటలుపట్టి; ఒక = ఒకానొక; భామ = స్త్రీ {భామ - క్రీడాసమయమునందు కోపము చూపునామె, స్త్రీ}; చేరినన్ = దగ్గరకురాగా; కడగోరన్ = కొనగోటితో; చతురుడు = నేర్పరి, కృష్ణుడు; కుచ = స్తనములందలి; ఘర్మజలమున్ = చెమటబిందువులను; పాపెన్ = మీటెను; అలకంబులు = ముంగురులు; ఒక = ఒకానొక; ఇంతి = స్త్రీ; కిన్ = కి; అళిక = నుదుటి; చిత్రరేఖన్ = బొట్టునకు; అంటినన్ = అంటుకొనగా; ప్రియుడు = కృష్ణుడు; పాయంగ = విడునట్లు; దువ్వెన్ = దువ్వెను; పడతి = పడచు.
ఒకతె = ఒకామె; పాట = పాటలు; పాడి = పాడి; డస్సినన్ = అలసిపోగా; అధర = పెదవులందలి; అమృతమునన్ = అమృతముచే; నాథుడు = కృష్ణుడు; ఆదరించె = ఆదరించెను; హారము = ముత్యాలపేరు; ఒక్క = ఒకానొక; సతి = స్త్రీ; కిన్ = కి; అంసావృతంబు = మూపున చుట్టుకొనుట; ఐన = కాగా; కాంతుడు = కృష్ణుడు; ఉరమున్ = (ఆమె) వక్షమునందు; చేర్చి = పొందించి; కౌగలించె = ఆలింగనము చేసెను.
భావము:- ఒక చక్కని చుక్క కృష్ణుడి చెక్కిలితో తన చెక్కిలి చేర్చగా, ఆయన తన పుక్కిటి విడియం ఆమె నోటికి అందించాడు. ఒక అందగత్తె ఆడుతూ అలసట చెందగా ప్రాణేశ్వరుడు స్తంభంలాగ ఉన్నతమైన తన బాహువును ఆమెకు ఊతగా పట్టాడు. ఒక మగువ చెమటలు క్రమ్మి చెంతకు చేరగా, ఆమె స్తనాలపై పట్టిన స్వేదబిందువులను ప్రియుడు కొనగోటితో చిమ్మాడు. ఒక చిన్నదాని నుదుటి తిలకానికి అంటుకున్న ముంగురులను ప్రియుడు పైకి దువ్వాడు. ఒక పడచు పాట పాడి అలసిపోగా నాథుడు అధరామృతం ఇచ్చి ఆదరించాడు. ఒక ఆమెకు హారాలు మూపున చిక్కుపడగా ఆ హారాల్ని చక్కదిద్ది ప్రియుడు కౌగలించుకున్నాడు.

తెభా-10.1-1097-క.
హాసంబులఁ గరతల వి
న్యాసంబుల దర్శనముల నాలాపములన్
రాశ్రాంతల నా హరి
సేసెన్ మన్ననలు కరుణఁ జేసి నరేంద్రా!

టీక:- హాసంబులన్ = నవ్వులతో; కరతల = అరచేతులను; విన్యాసంబులన్ = కదల్చుటచేత; దర్శనములన్ = చూపులచేత; ఆలాపములన్ = ముచ్చటలాడుటచేత; రాస = రాసక్రీడ యందు; శ్రాంతలన్ = అలసినవారిని; ఆ = ఆ ప్రసిద్ధుడైన; హరి = కృష్ణుడు; చేసెన్ = చేసెను; మన్ననలు = ఆదరించుటలు; కరుణజేసి = దయతో; నరేంద్రా = రాజా.
భావము:- రాజశ్రేష్ఠా! చిరునగవులతో, హస్త విన్యాసాలతో, చూపులతో, రాగాలాపనలతో, రాసకేళి అందు బడలిన పడతులను పరమ పురుషుడు శ్రీకృష్ణుడు కరుణతో ఆదరించాడు.

తెభా-10.1-1098-క.
రితనుసంగ సుఖంబునఁ
వశలై వ్రేత లెల్లఁ య్యదలు నిజాం
ములు నెఱుఁగమి చోద్యమె?
సుసతు లీక్షించి కరఁగి చొక్కిరి మింటన్.

టీక:- హరి = కృష్ణుని; తను = దేహముతో; సంగ = కూడుటవలని; సుఖంబునన్ = సౌఖ్యముచేత; పరవశలు = చొక్కినవారు; ఐ = అయ్యి; వ్రేతలు = గొల్లస్త్రీలు; ఎల్లన్ = అందరు; పయ్యదలు = పైటలు; నిజ = వారివారి; అంబరములున్ = బట్టలు; ఎఱుంగమి = తొలగిన తెలియకపోవుట; చోద్యమె = ఆశ్చర్యమా, కాదు; సుర = దేవతా; సతులు = స్త్రీలు; ఈక్షించి = చూసి; కరగి = అనురాగముపొంది; చొక్కిరి = పరవశులైరి; మింటన్ = ఆకాశము నందు.
భావము:- ఆ అతివలు కృష్ణ అంగసంగమ సుఖంచేత ఎంతో పారవశ్యం చెంది పైటలు, కట్టుపుట్టములు జారిపోవడం కూడ తెలియకుండా ఉన్నారు. ఇందులో వింత ఏముంది. దేవతాంగనలు సైతం ఆకాశమండలం నుండి ఆ రాసక్రీడా విలాస మంతా తిలకించి కరగి సమ్మోహితులు అయ్యారు.

తెభా-10.1-1099-వ.
ఇట్లు భగవంతుండైన కృష్ణు డాత్మారాముం డయ్యును గోపసతు లెంద ఱందఱకు నందఱై నిజప్రతిబింబంబులతోడం గ్రీడించు బాలు పోలిక రాసకేళి సలిపిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; భగవంతుండు = దేవుడు {భగవంతుడు - షడ్గుణైశ్వర్య సంపన్నుడు, దేవుడు, విష్ణువు}; ఐన = అయినట్టి; కృష్ణుడు = కృష్ణుడు; ఆత్మారాముండు = పరమాత్మ {ఆత్మారాముడు - ఆత్మ యందే రమించెడి వాడు}; అయ్యును = అయినప్పటికిని; గోప = గోపికా; సతులు = స్త్రీలు; ఎందఱు = ఎంతమందైతే ఉన్నారో; అందఱు = అంతమంది; కున్ = కి; అందఱున్ = అంతమందిగా; ఐ = అయ్యి; నిజ = తన యొక్క; ప్రతిబింబంబుల = నీడల; తోడన్ = తోటి; క్రీడించు = ఆడునట్టి; బాలుర = చిన్నపిల్లల; పోలికన్ = వలె; రాసకేళి = రాసక్రీడ; సలిపిన = చేయగా.
భావము:- ఇలా భగవంతుడైన శ్రీకృష్ణుడు ఆత్మారాముడు అయినప్పటికీ ఎందరు గోపవధువులో అందరికీ తానందరై, బాలుడు తన ప్రతిబింబాలతో అడుకునేటట్లు వారితో రాసలీలలు సాగించాడు.

తెభా-10.1-1100-క.
గఁ గూడి యాడి మనముల
గెఁ జూచెం బలికె నందనందనుఁ డనుచున్
గువలు పెద్దఱికముతోఁ
బొడిరి తమ పూర్వజన్మపుణ్యశ్రేణిన్.

టీక:- తగన్ = చక్కగా; కూడి = కలిసి; ఆడి = నటించి; మనములన్ = మనసు లందు; నగెన్ = నవ్వెను; చూచెన్ = చూసెను; పలికెన్ = మాట్లాడెను; నందనందనుండు = కృష్ణుడు {నందనందనుండు - సంతోషమునకే సంతోషము కలిగించువాడు, కృష్ణుడు}; అనుచు = అని; మగువలు = స్త్రీలు; పెద్దఱికము = గౌరవము; తోన్ = తోటి; పొగడిరి = స్తుతించిరి; తమ = వారి యొక్క; పూర్వజన్మ = పూర్వజన్మ లందలి; పుణ్య = పుణ్యముల యొక్క; శ్రేణిన్ = సమూహములవలన.
భావము:- నందకుమారుడైన కృష్ణుడు తమతో కలసిమెలసి నవ్వుతూ చూస్తూ సల్లాపాలు సలుపుతూ మెలగాడని ఆ వనితలు తమ పూర్వజన్మ పుణ్యాలను ఎంతగానో స్తుతించుకున్నారు.