Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గోపస్త్రీలకడ కుద్ధవుని బంపుట

వికీసోర్స్ నుండి


తెభా-10.1-1436-క.
సిద్ధవిచారు గభీరున్
వృద్ధవచోవర్ణనీయు వృష్ణిప్రవరున్
బుద్ధినిధి నమరగురుసము
నుద్ధవునిం జూచి కృష్ణుఁ డొయ్యనఁ బలికెన్.

టీక:- సిద్ధ = ఫలించెడి; విచారున్ = ఆలోచనలు కలవానిని; గభీరున్ = గంభీరమైనవానిని; వృద్ధ = పెద్దలచేత; వచోవర్ణనీయున్ = వర్ణింపదగినవానిని; వృష్ణి = వృష్ణికుల; ప్రవరున్ = వంశస్థుని; బుద్ధి = మంచి బుద్ధికి; నిధిన్ = నిధివంటి వానిని; అమరగురు = బృహస్పతితో {అమరగురువు - దేవతల గురువు, బృహస్పతి}; సమున్ = సమానమైనవానిని; ఉద్ధవునినన్ = ఉద్ధవుడిని; చూచి = చూసి; కృష్ణుడు = కృష్ణుడు; ఒయ్యనన్ = మెల్లగా; పలికెన్ = చెప్పెను.
భావము:- ఫలవంత మైన భావాలు కలవాడు, గంభీరుడు, పెద్దలు మెచ్చదగిన వాడు, వృష్ణివంశోత్తముడు, గొప్ప తెలివి కలవాడు, దేవతల గురువైన బృహస్పతితో సమానుడు అయిన ఉద్ధవుడిని పిలచి, మెల్లగా ఇలా చెప్పాడు

తెభా-10.1-1437-శా.
"మ్మా యుద్ధవ! గోపకామినులు నా రాకల్ నిరీక్షంచుచున్
మ్మోహంబున నన్నియున్ మఱచి యే చందంబునం గుందిరో
మ్మున్ నమ్మినవారి డిగ్గవిడువన్ ర్మంబు గాదండ్రు; వే
పొమ్మా; ప్రాణము లే క్రియన్ నిలిపిరో ప్రోద్యద్వియోగాగ్నులన్.

టీక:- రమ్మా = రమ్ము; ఉద్ధవ = ఉద్ధవుడా; గోప = గోపికా; కామినులు = స్త్రీలు {కామిని - కామించదగినామె, స్త్రీ}; నా = నా యొక్క; రాకల్ = వచ్చుటలకై; నిరీక్షించుచున్ = ఎదురుచూచుచు; సమ్మోహంబునన్ = అధికమైన మోహముతో; అన్నియున్ = ఎల్ల కార్యములను; మఱచి = మరిచిపోయి; ఏ = ఏ; చందంబునన్ = విధముగా; కుందిరో = దుఃఖించిరో; తమ్మున్ = తమను; నమ్మిన = నమ్ముకొన్న; వారిన్ = వారిని; డిగ్గవిడువన్ = వదలిపెట్టుట; ధర్మంబు = న్యాయము; కాదు = కాదు; అండ్రు = అని పెద్దలు చెప్తారు; వేన్ = శీఘ్రమే; పొమ్మా = వెళ్ళుము; ప్రాణముల్ = ప్రాణములను; ఏ = ఏ; క్రియన్ = విధముగా; నిలిపిరో = నిలబెట్టుకొన్నారో; ప్ర = మిక్కిలి; ఉద్యత్ = పెరుగుచున్న; వియోగ = ఎడబాటు నెడి; అగ్నులన్ = తాపములచేత.
భావము:- “ఉద్ధవా! ఇలా రా! గోపికలు ప్రణయమూర్తులు. నా ఆగమనానికి ఎదురుచూస్తూ, నా మీది వ్యామోహంతో అన్నీ మరచిపోయి ఎంతగానో దుఃఖపడుతూ ఉంటారు. నమ్ముకున్న తమను విడవడం ధర్మం కాదని పెద్దలుఅంటూ ఉంటారు. వేగంగా వెళ్ళు. పెచ్చుమీరుతున్న వియోగమనే అగ్నిజ్వాలలతో వారెలా ప్రాణాలు నిలబెట్టుకుంటూ ఉన్నారో?

తెభా-10.1-1438-క.
"లౌకిక మొల్లక న న్నా
లోకించు ప్రపన్నులకును లోఁబడి కరుణా
లోనములఁ బోషింతును
నా కాశ్రితరక్షణములు నైసర్గికముల్.

టీక:- లౌకికమున్ = భౌతికవాంఛలను; ఒల్లక = అపేక్షింపకుండ; నన్నున్ = నన్నే; ఆలోకించు = చూచెడి; ప్రపన్నులు = భక్తుల; కును = కు; లోబడి = అధీనుడినై; కరుణా = దయతోకూడిన; ఆలోకనములన్ = చూపులతో; పోషింతున్ = కాపాడెదను; నా = నా; కున్ = కు; ఆశ్రిత = ఆశ్రయించినవారిని; రక్షణములు = కాపాడుటలు; నైసర్గికముల్ = సహజధర్మములు, స్వాభావిక గుణములు.
భావము:- లోకధర్మాలు అన్నీ విడచిపెట్టి నా మీదనే చూపు నిలిపి, భక్తి ప్రపత్తులు సలిపేవారికి నేను లోబడి, వారిని దయతో చూస్తూ కాపాడుతాను. ఆశ్రితులను ఆదుకోవడం నాకు స్వభావసిద్ధమైన గుణం.

తెభా-10.1-1439-క.
సందేహము మానుం డర
విందాననలార! మిమ్ము విడువను వత్తున్
బృందావనమున కని హరి
సందేశము పంపె"ననుము సంకేతములన్."

టీక:- సందేహమున్ = అనుమానములను; మానుండు = విడిచిపెట్టండి; అరవిందాననలారా = ఓ పద్మముఖులు; మిమ్మున్ = మిమ్ములను; విడువను = వదలివేయను; వత్తున్ = తప్పక వచ్చెదను; బృందావనమున = బృందావనమున; కున్ = కు; అని = అని; హరి = కృష్ణుడు; సందేశమున్ = సమాచారము; పంపెను = పంపించెను; అనుము = అని చెప్పుము; సంకేతములన్ = సంకేతములతో {సంకేతస్థలము - సంకేతము (రహస్యముగ ఏర్పాటు చేసుకొన్న గుర్తు)గా పెట్టుకొన్నవి}.
భావము:- సంకేతస్థలమునకు వెళ్ళి గోపికలతో “పద్మముల వంటి మోములు కల పడతులారా! సంశయం మానండి. మిమ్మల్ని వదలిపెట్టను. బృందావనానికి వస్తాను” అని కృష్ణుడు వార్త పంపాడని నీవు చెప్పు.”

తెభా-10.1-1440-వ.
అని మందహాస సుందర వదనారవిందుండై కరంబు కరంబున నవలంబించి, సరసవచనంబు లాడుచు వీడుకొల్పిన నుద్ధవుండును రథారూఢుండై సూర్యాస్తమయ సమయంబునకు నందవ్రజంబు జేరి వనంబులనుండి వచ్చు గోవుల చరణరేణువులం బ్రచ్ఛన్న రథుండై చొచ్చి, నందు మందిరంబు ప్రవేశించిన.
టీక:- అని = అని; మందహాస = చిరునవ్వు కలిగిన; సుందర = అందమైన; వదన = ముఖము అనెడి; అరవిందుడు = పద్మము కలవాడు; ఐ = అయ్యి; కరంబు = చేతిని; కరంబునన్ = చేతితో; అవలంబించి = పట్టుకొని; సరస = రసవంతములైన; వచనంబులున్ = మాటలు; ఆడుచున్ = పలుకుతూ; వీడుకొల్పినన్ = సెలవిచ్చి పంపగా; ఉద్ధవుండును = ఉద్ధవుడు; రథ = రథమును; ఆరూఢుండు = అధిరోహించిన వాడు; ఐ = అయ్యి; సూర్యాస్తమయ = సాయంకాల; సమయంబున్ = సమయమున; కున్ = కు; నంద = నందుని; వ్రజంబున్ = మందకు, వ్రేపల్లెకు; చేరి = దగ్గరకుపోయి; వనంబుల = అడవుల; నుండి = నుండి; వచ్చు = వెనుకకు వచ్చెడి; గోవులన్ = పశువుల యొక్క; చరణ = కాలి; రేణువులన్ = దుమ్ముచేత; ప్రచ్ఛన = కమ్మబడిన; రథుండు = రథము కలవాడు; ఐ = అయ్యి; చొచ్చి = చేరి; నందు = నందుని యొక్క; మందిరంబున్ = నివాసమును; ప్రవేశించినన్ = ప్రవేశించగా.
భావము:- అని చిరునవ్వుతో అందమైన అరవిందం వంటి వదనము గల గోవిందుడు ఉద్ధవుడి చేతిలో చెయ్యేసి పట్టుకుని, సరసమైన మాటలు పలుకుతూ సాగనంపాడు. ఉద్ధవుడు రథము ఎక్కి సూర్యుడు అస్తమించే వేళకు గోకులం చేరాడు. అడవులలో మేతమేసి వచ్చే గోవుల పాద ధూళి అతని రథాన్ని కప్పివేస్తుండగా, ఉద్ధవుడు వ్రేపల్లె చేరి నందుడి ఇంటికి వెళ్ళాడు.