పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/గుహ్యకుల నారదశాపం
తెభా-10.1-392-క.
"నారదుఁ డేల శపించెను?
వా రా వృక్షత్వమునకు వచ్చిన పనికిం
గారణ మెయ్యది? యోగికు
లారాధ్య! యెఱుంగఁ జెప్పు మయ్య! వినియెదన్."
టీక:- నారదుడు = నారదుడు; ఏలన్ = ఎందుకు; శపించెను = శాపము ఇచ్చెను; వారున్ = వారు; ఆ = అట్టి; వృక్షత్వమున్ = చెట్లుగా ఐపోవుట; కున్ = కు; వచ్చిన = దారితీసిన; పని = చేష్ట; కిన్ = కి; కారణము = హేతువు; ఎయ్యది = ఏమిటి; యోగి = యోగులు; కుల = అందరిచేత; ఆరాధ్య = పూజింపబడువాడ; యెఱుంగన్ = తెలియునట్లు; చెప్పుము = తెలుపుము; అయ్య = తండ్రి; వినియెదన్ = వింటాను.
భావము:- "ఓ యోగివరేణ్యా! శుకా! లోకంలోని యోగులందరూ నిన్ను సేవిస్తూ ఉంటారు. ఆ యక్షులను నారదుడు ఎందుకు శపించాడు; వారికి అలా చెట్లుగా పడిఉండే శాపం రావటానికి వారు చేసిన అపచారం ఏమిటి? ఆ వివరం తెలియజెప్పు వింటాను."
తెభా-10.1-393-వ.
అనిన శుకుండిట్లనియె “మున్ను కుబేరుని కొడుకు లిరువురు శంకరకింకరులై యహంకరించి వెండికొండమీఁద విరుల తోఁటలం బాడెడి చేడియలం గూడికొని కరేణు సంగతంబు లైన యేనుంగుల భంగి సురంగంబు లైన మందాకినీతరంగంబులం గ్రీడింప నారదుండు వచ్చిన న చ్చెలువలు చెచ్చెర వలువలు ధరియించిరి; మదిరాపాన పరవశులు గావున వార లిరువురు వివస్త్రులై మెలంగుచున్న నా మునీశ్వరుండు చూచి శపియించు వాఁడై ప్రతీతంబగు గీతంబు వాడె; వినుము.
టీక:- అనినన్ = అనగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మున్ను = పూర్వము; కుబేరుని = కుబేరుని యొక్క; కొడుకులు = పుత్రులు; ఇరువురు = ఇద్దరు; శంకర = పరమశివుని; కింకరులు = సేవకులు; ఐ = అయ్యి; అహంకరించి = గర్వించి; వెండికొండ = కైలాసపర్వతము; మీదన్ = పైన; విరుల = పూల; తోటలన్ = తోటలలో; పాడెడి = పాటలు పాడునట్టి; చేడియలన్ = స్త్రీలను; కూడికొని = కలిసి; కరేణు = ఆడు ఏనుగులతో; సంగతంబులు = కూడుకొన్నవి; ఐన = అయినట్టి; ఏనుంగుల = ఏనుగుల; భంగిన్ = వలె; సురంగంబులు = చక్కగా వ్యాపించునవి; ఐన = అయిన; మందాకినీ = గంగానదిలోని; తరంగంబులన్ = అలల యందు; క్రీడింపన్ = విహరించుచుండగా; నారదుండు = నారదుడు; వచ్చినన్ = రాగా; ఆ = ఆ; చెలువలు = స్త్రీలు; చెచ్చెరన్ = వెంటనే; వలువలున్ = బట్టలను; ధరియించిరి = కట్టుకొనిరి; మదిరా = మద్యము; పాన = తాగుటచే; పరవశులు = ఒళ్ళు మరచినవారు; కావునన్ = కనుక; వారలు = వారు; ఇరువురున్ = ఇద్దరు; వివస్త్రులు = దిగంబరులు; ఐ = అయ్యి; మెలంగుచున్నన్ = సంచరిస్తుండగా; ఆ = ఆ; ముని = మునులలో; ఈశ్వరుండు = శ్రేష్ఠుడు; చూచి = కనుగొని; శపియించు = శాపము ఇచ్చెడి; వాడు = వాడు; ఐ = అయ్యి; ప్రతీతంబు = ప్రసిద్ధము; అగు = ఐన; గీతంబున్ = గీతమును; పాడెన్ = పాడెను; వినుము = విను.
భావము:- అలా పరీక్షిత్తు అడుగగా శుకుడు ఇలా చెప్పసాగాడు "పూర్వం కుబేరుడి కుమారులు ఇద్దరు నలకూబరుడు, మణిగ్రీవుడు అనేవారు శంకరునికి సేవకులుగా ఉండేవారు, యక్షుల రాకుమారులము, పైగా పరమశివుని అనుచరులము గదా అని అహంకారంతో వారు సంచరిస్తూ ఉండేవారు. ఒకరోజు వారిద్దరూ వెండికొండమీద ఉద్యానవనాలలో తమ ప్రియురాళ్ళతో కలిసి విహరిస్తున్నారు. ఆ గంధర్వకన్యలు చాలా మనోహరంగా పాటలు పాడుతున్నారు. ఇలా ఆడ ఏనుగులతో కూడిన మదపుటేనుగులులాగా తమ కాంతలతో అందమైన ఆకాశగంగా తరంగాలలో జలక్రీడలు సాగిస్తున్నారు. ఇంతలో ఆ మార్గాన నారదమహర్షి వచ్చాడు. ఆయనను చూసి గంధర్వ కాంతలు గబగబా బట్టలు ధరించారు. మద్యం కైపులో మునిగి ఉన్న నలకూబర మణిగ్రీవులు మాత్రం దిగంబరులుగానే తిరుగుతున్నారు. వారిని చూసిన నారదుడు శపించబోతూ ఒక ప్రసిద్ధమైన గీతాన్ని పాడాడు. దానిని విను;
తెభా-10.1-394-శా.
"సంపన్నుం డొరుఁ గాన లేఁడు తనువున్ సంసారమున్ నమ్మి హిం
సింపం జూచు దరిద్రుఁ డెత్తుబడి శుష్కీభూతుఁడై చిక్కి హిం
సింపం డన్యుల నాత్మకున్ సముల కాఁ జింతించు నట్లౌటఁ ద
త్సంపన్నాంధున కంజనంబు వినుమీ దారిద్ర్య మూహింపఁగన్."
టీక:- సంపన్నుండు = ధనవంతుడు; ఒరున్ = ఇతరుని; కానలేడు = లెక్కజేయలేడు; తనువున్ = తన దేహమును; సంసారమున్ = సంసారమును; నమ్మి = విశ్వసించి; హింసింపన్ = బాధించుటకు; చూచున్ = ప్రయత్నించును; దరిద్రుడు = పేదవాడు; ఎత్తుబడి = దీనత్వమును పొంది; శుష్కీభూతుడు = కృశించిపోయినవాడు; ఐ = అయ్యి; చిక్కి = సన్నబడిపోయి; హింసింపడు = బాధింపడు; అన్యులన్ = ఇతరులను; ఆత్మ = తన; కున్ = తో; సములన్ = సమానమైనవారి; కాన్ = ఐనట్లు; చింతించున్ = భావించును; అట్లు = అలా; ఔటన్ = అగుటచేత; తత్ = ఆ; సంపన్న = కలిగిన సంపదలు వలన; అంధున్ = గుడ్డివాడైనవాని; కిన్ = కి; అంజనంబు = కళ్ళు తెరిపించునది; అగున్ = అగును; సుమా = సుమా; దారిద్ర్యము = బీదతనము; ఊహింపగన్ = యోచించినచో.
భావము:- ధనవంతుడు ఎవరినీ లెక్కచేయడు; తన ధనాన్నీ, శరీరాన్నీ, సంసారాన్నీ నమ్ముకుని ఇతరులను హింసించాలని చూస్తాడు; దరిద్రుడు దారిద్ర్యదేవతకు చిక్కి కష్టాలతో బక్కచిక్కినా ఇతరులను హింసించడు; వాళ్ళు కూడా తనలాంటివారే కదా అని భావిస్తాడు; ఇది లోకరీతి; విను, కనుక ధనమదాంధులైన వారికి దరిద్రమే చక్కని కళ్ళు తెరిపించే మందు అవుతుంది;"
తెభా-10.1-395-వ.
అని గీతంబు వాడి తన మనంబున.
టీక:- అని = అని; గీతంబున్ = గీతమును; పాడి = ఆలపించి; తన = తన యొక్క; మనంబునన్ = మనసునందు.
భావము:- ఇలా గీతం పాడిన నారదుడు తన మనసులో . .
తెభా-10.1-396-క.
"కలవాని సుతుల మనుచును
గలకంఠులతోడఁ గూడి కానరు పరులం
గలలో నైనను; వీరికిఁ
గల క్రొవ్వడఁగించి బుధులఁ గలపుట యొప్పున్."
టీక:- కలవాని = సంపన్నుని; సుతులము = పుత్రులము; అనుచున్ = అని యెంచుకొని; కలకంఠులు = సుందరీమణుల {కలకంఠి - కోయిలవంటి గొంతు కలామె, స్త్రీ}; తోడన్ = తోడి; కూడి = చేరి; కానరు = లక్ష్యపెట్టరు; పరులన్ = ఇతరులను; కల = స్వప్నము; లోన్ = అందు; ఐనను = అయినప్పటికి; వీరి = వీరల; కిన్ = కు; కల = కలిగినట్టి; క్రొవ్వు = గర్వము; అడగించి = అణచివేసి; బుధులన్ = జ్ఞానులందు; కలపుట = చేర్చుట; ఒప్పున్ = చక్కనిపని.
భావము:- "ఈ యక్షరాజు కుమారులు ధనవంతుని కొడుకులమని గర్వించి ఉన్నారు; పైగా ప్రేయసులతో కూడి ఉన్నారు. ఇక చెప్పేదేమి ఉంది. వీరికి కొవ్వు అణచి మళ్ళీ సత్పురుషులనుగా మార్చటం సముచితమైన పని."
తెభా-10.1-397-వ.
అని చింతించి విజ్ఞాన విశారదుండగు నారదుండు నలకూబర మణిగ్రీవులఁ జూచి "మీరలు స్త్రీమదాంధులరు గావున భూలోకంబున నర్జున తరువులై నూఱు దివ్యవర్షంబు లుండుం డటమీఁద గోవిందచరణారవింద పరిస్పందంబున
టీక:- అని = అని; చింతించి = భావించి; విజ్ఞాన = విశిష్ట (బ్రహ్మ) జ్ఞానము; విశారదుండు = సమృద్ధిగా కలవాడు; అగు = ఐన; నారదుండు = నారదుడు {నారదుడు - నారములను ఇచ్చివాడు, బ్రహ్మమానస పుత్రుడు}; నలకూబర = నలకూబరుడు; మణిగ్రీవులన్ = మణిగ్రీవుడులను; చూచి = ఉద్దేశించి; మీరలు = మీరు; స్త్రీ = స్త్రీల సాంగత్యము గల; మద = గర్వమువలన; అంధులరు = గుడ్డివారైనవారు; కావునన్ = కనుక; భూలోకంబునన్ = మానవలోకమున; అర్జునతరువులు = మద్దిచెట్లు; ఐ = అయ్యి; నూఱు = వంద (100); దివ్యవర్షంబులు = దివ్యసంవత్సరములు; ఉండుడు = ఉండండి; అటమీద = ఆపైన; గోవింద = శ్రీకృష్ణుని {గోవిందః- గోవులకు ఇంద్రుడు, గో అనగా వాక్కు కనుక వాక్కు తెలియుట (వేదవిదుత్వము) కలిగించువాడు, శ్రీశంకరభాష్యం విష్ణుసహస్రనామములు 187వ నామం}; చరణ = పాదములు అనెడి; అరవింద = పద్మముల; పరిస్పందంబునన్ = తాకుటచేత, కదలుటచేత (శబ్దార్థ దీపిక).
భావము:- అని తన మనసులో ఆలోచించుకొని విశేషమైన జ్ఞానం కల నారదమహర్షి నలకూబర, మణికూబరులతో ఇలా అన్నాడు "మీరు స్త్రీఐశ్వర్యమదంతో కొట్టుకుంటున్నారు; కనుక భూమ్మీద వంద దివ్యసంవత్సరాల పాటు మద్దిచెట్లుగా పడి ఉండండి. ఆ తరువాత గోవిందుని పాదారవిందాల స్పర్శ లభించుటచేత;
తెభా-10.1-398-క.
ముక్తులరై నారాయణ
భక్తులరై పరమసాధుభావ శ్రీ సం
సక్తులరై సురలోక
వ్యక్తుల రయ్యెదరు నాదువాక్యము కతనన్."
టీక:- ముక్తులరు = మోక్షము పొందినవారు; ఐ = అయ్యి; భక్తులరు = భక్తులైన వారు; ఐ = అయ్యి; పరమ = మిక్కిలి; సాధు = మంచి; భావ = స్వభావము అనెడి; శ్రీ = సంపత్తితో; సంసక్తులరు = బాగుగా కూడినవారు; ఐ = అయ్యి; సుర = దేవ; లోక = లోకపు; వ్యక్తులరు = తెలియబడు మూర్తులు; అయ్యెదరు = అగుదురు; నాదు = నా యొక్క; వాక్యము = మాట; కతనన్ = నిమిత్తముచేత.
భావము:- ఈ నా శాప విమోచన అనుగ్రహం వలన, ఆ యశోదానందనుని పాదారవిందస్పర్శతో విముక్తులు అవుతారు; ఆ విధంగా ముక్తులై, శ్రీమన్నారాయణుని భక్తులై సత్ప్రవర్తన యందు ఆసక్తి కలవారై మళ్ళీ దేవలోకంలో ప్రవేశిస్తారు."