పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కృష్ణుడు మన్ను దినె ననుట
తెభా-10.1-335-వ.
అంత నొక్కనాడు బలభద్రప్రముఖులైన గోపకుమారులు వెన్నుండు మన్ను దినె నని చెప్పిన యశోద బాలుని కేలు పట్టుకొని యిట్లనియె.
టీక:- అంతన్ = అప్పుడు; ఒక్క = ఒకానొక; నాడున్ = దినమున; బలభద్ర = బలరాముడు; ప్రముఖులు = మున్నగువారు; ఐన = అయిన; గోప = యాదవ; కుమారులు = పిల్లలు; వెన్నుండు = కృష్ణుడు {వెన్నుడు (వి) - విష్ణువు (ప్ర)}; మన్ను = మట్టిని; తినెను = తిన్నాడు; అని = అని; చెప్పినన్ = చెప్పగా; యశోద = యశోద; బాలుని = పిల్లవానిని; కేలు = చేయి; పట్టుకొని = పట్టుకొని; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఒక రోజున బలరాముడు మొదలైన యాదవ బాలురు కృష్ణుడు మట్టి తిన్నాడు అని యశోదాదేవికి చెప్పారు. అంత ఆ అమాయకపు తల్లి ఆ నెరదంట పాపడిని చెయ్యి పట్టుకొని గదమాయిస్తోంది.
తెభా-10.1-336-క.
"మన్నేటికి భక్షించెదు?
మన్నియమము లేల నీవు మన్నింపవు? మీ
యన్నయు సఖులును జెప్పెద
రన్నా! మ న్నేల మఱి పదార్థము లేదే? "
టీక:- మన్ను = మట్టిని; ఏటికిన్ = ఎందుకు; భక్షించెదు = తింటావు; మత్ = నా యొక్క; నియమములు = ఆంక్షలు, ఆజ్ఞలు; ఏలన్ = ఎందులకు; నీవున్ = నీవు; మన్నింపవు = లెక్కచేయవు; నీ = నీ యొక్క; అన్నయున్ = అన్నయ్య; సఖులునున్ = స్నేహితులు; చెప్పెదరు = చెప్పుతున్నారు; అన్నా = నాయనా; మన్ను = మట్టి; ఏలన్ = ఎందుకు; మఱి = ఇంకేమి; పదార్థము = తినదగిన వస్తువు; లేదే = లేదా ఏమి.
భావము:- "ఏమయ్యా కన్నయ్యా! మట్టెందుకు తింటున్నావు. నే వద్దని చెప్పేవేవి ఎందుకు లెక్క చేయవు. తల అలా అడ్డంగా ఊపకు. అన్న బలరాముడు, స్నేహితులు అందరు చెప్తున్నారు కదా. ఏం ఇంట్లో తినడానికి ఇంకేం లేవా ఏమిటి పాపం."
తెభా-10.1-337-వ.
అని పలికిన ముగుదతల్లికి నెఱదంట యైన కొడు కిట్లనియె.
టీక:- అని = అని; పలికిన = చెప్పుతున్న; ముగుద = ముగ్ధ యైన, అమాయకురాలైన; తల్లి = తల్లి; కిన్ = కి; నెఱ = మిక్కిలి; దంట =నేర్పరి; ఐన = అయినట్టి; కొడుకున్ = పుత్రుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఆ ముద్దరాలు అయిన తల్లి యశోదా దేవికి మాయలమారి కృష్ణబాలుడు సమాధానం చెప్తున్నాడు
తెభా-10.1-338-శా.
"అమ్మా! మన్నుదినంగ నే శిశువునో? యాఁకొంటినో? వెఱ్ఱినో?
నమ్మం జూడకు వీరి మాటలు మదిన్; న న్నీవు గొట్టంగ వీ
రి మ్మార్గంబు ఘటించి చెప్పెదరు; కాదేనిన్ మదీయాస్య గం
ధ మ్మాఘ్రాణము జేసి నా వచనముల్ దప్పైన దండింపవే."
టీక:- అమ్మా = తల్లీ; మన్నున్ = మట్టిని; తినంగ = తినుటకు; నేన్ = నేను; శిశువునో = చంటిపిల్లాడినా; ఆకొంటినో = ఆకలేసి ఉన్నానా; వెఱ్ఱినో = వెఱ్ఱివాడినా; నమ్మంజూడకు = నమ్మబోకుము; వీరి = వీరి యొక్క; మాటలున్ = పలుకులను; మదిన్ = మనసు నందు; నన్నున్ = నన్ను; నీవున్ = నీవు; కొట్టంగన్ = కొట్టుటకోసము; వీరు = వీరు; ఈ = ఇలాంటి; మార్గమున్ = దారిని; ఘటించి = కూర్చి, కల్పించి; చెప్పెదరు = చెప్పుతున్నారు; కాదేనిన్ = కాకపోయినచో; మదీయ = నా యొక్క; ఆస్య = నోటి; గంధమున్ = వాసనను; ఆఘ్రాణము = వాసనచూచుట; చేసి = చేసి; నా = నా యొక్క; వచనముల్ = మాటలు; తప్పు = అబద్ధమైనవి; ఐనన్ = అయినచో; దండింపవే = శిక్షించుము.
భావము:- "అమ్మా! మట్టి తినడానికి నేనేమైనా చంటిపిల్లాడినా చెప్పు. ఇప్పుడే కదా పాలు తాగాను ఇంకా ఆకలి ఎందుకు వేస్తుంది. లేకపోతే నేనేమైనా అంత వెఱ్ఱివాడినా ఏమిటి మట్టి తినడానికి. నువ్వు నన్ను కొట్టాలని వీళ్ళు కల్పించి చెప్తున్నారు అంతే. కావాలంటే నా నోరు వాసన చూడు. నే చెప్పింది అబద్ధమైతే కొట్టుదుగానిలే. వీళ్ళు చెప్పేమాటలు నమ్మవద్దు"అని చిన్నికృష్ణుడు.
మట్టి ఎందుకు తింటున్నావని దెబ్బలాడుతున్న తల్లి యశోదమ్మకి సర్ది చెప్పి, నోరు తెరిచి చూపించబోతున్నాడు.