పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ప్రథమాశ్వాసము)/కృష్ణుడు మథురకు చనుట
తెభా-10.1-1224-వ.
అంత మఱునాడు సూర్యోదయకాలంబునం దనతోడఁ బయనంబునకు గమకించి నడచు గోపికలను “మరలివత్తు” నని దూతికా ముఖంబున నివర్తించి, కృష్ణుండు శకటంబులందుఁ గానుకలును గోరసంబు నిడికొని నందాదులైన గోపకులు వెనుదగుల నక్రూరచోదితంబైన రథంబెక్కి మథురాభిముఖుండై చను సమయంబున.
టీక:- అంతన్ = అటుపిమ్మట; మఱునాడు = మరుసటిరోజు; సూర్యోదయ = ఉదయపు; కాలంబునన్ = సమయము; తన = తన; తోడన్ = తోటి; పయనంబున్ = బయలుదేరుట; కున్ = కు; గమకించి = యత్నించి; నడచు = బయలుదేరు; గోపికలను = గొల్లభామలను; మరలివత్తును = తిరిగివచ్చెదను; అని = అని; దూతికా = దూతికల; ముఖంబునన్ = వలన; నివర్తించి = నిలువరించి; కృష్ణుండు = కృష్ణుడు; శకటంబుల్ = బళ్ళ; అందున్ = లో; కానుకలు = బహుమతులు; గోరసంబున్ = పాలును; ఇడికొని = ఉంచుకొని; నంద = నందుడు; ఆదులు = మున్నగువారు; ఐన = అయిన; గోపకులున్ = గొల్లవారు; వెనుదగులన్ = వెంటరాగా; అక్రూర = అక్రూరునిచేత; చోదితంబు = నడపబడుతున్నది; ఐన = అయిన; రథంబున్ = రథమును; ఎక్కి = ఎక్కి; మథురా = మథురాపట్టణము; అభిముఖుండు = వైపునకు పోవువాడు; ఐ = అయ్యి; చను = వెళ్ళడి; సమయంబున = సమయము నందు.
భావము:- శ్రీకృష్ణుడు మరునాటి ఉదయం తన వెంట వస్తామని సిద్ధపడుతున్న గోపికాస్త్రీలకు “మళ్ళీ వస్తా” నని దూతికల ద్వారా చెప్పించి, వారిని వెనుకకు మరలించాడు. బండ్ల నిండా కానుకలు, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మున్నగు వాటిని ఎక్కించుకుని నందుడు మొదలుగా గల గోపకులు కూడా వస్తుండగా అక్రూరుడు తోలే రథం ఎక్కి శ్రీకృష్ణుడు మథురానగరం వైపు బయలుదేరి వెళ్తున్నాడు. అప్పుడు. . .
తెభా-10.1-1225-చ.
"అదె చనుచున్నవాఁడు ప్రియుఁ డల్లదె తేరదె వైజయంతి య
ల్లదె రథ ఘోటకాంఘ్రి రజమా దెస మార్గము చూడుఁ" డంచు లో
నొదవెడి మక్కువన్ హరిరథోన్ముఖలై గములై వ్రజాంగనల్
గదలక నిల్చిచూచి రటు కన్నుల కబ్బినయంత దూరమున్.
టీక:- అదె = అదిగో; చనుచున్నవాడు = వెళ్ళిపోతున్నాడు; ప్రియుడు = ప్రియమైనవాడు; అల్లదె = అదిగో; తేరు = రథము; అదె = అదిగో; వైజయంతి = టెక్కెము. జండా; అల్లదె = అదిగో; రథ = రథము యొక్క; ఘోటక = గుఱ్ఱముల; అంఘ్రి = కాళ్ళ; రజము = ధూళి; ఆ = ఆ; దెసన్ = వైపు; మార్గమున్ = దారిని; చూడుడు = చూడండి; అంచున్ = అనుచు; లోన్ = లోపల; ఒదవెడి = కలిగెడి; మక్కువన్ = ప్రేమలచేత; హరి = కృష్ణుని; రథ = రథము; ఉన్ముఖులు = వైపు చూచువారు; ఐ = అయ్యి; గములు = గుంపులు కూడినవారు; ఐ = అయ్యి; వ్రజ = గోపికా; అంగనలు = స్త్రీలు; కదలక = విడువకుండ; నిల్చి = నిలబడి; చూచిరి = చూసారు; అటు = ఆ వైపునకు; కన్నుల్ = కళ్ళ; కున్ = కు; అబ్బిన = అందినంత; అంతన్ = అంతవరకు; దూరమున్ = దూరము వరకు.
భావము:- అలా మథురకు పయనమై పోతుండగా వ్రేపల్లెలోని వనితలు “అదిగో చూడు. మన ప్రియ కృష్ణుడు వెళ్ళిపోతున్నాడు. అదిగో రథం. అదిగదిగో రథంమీది జెండా. రథానికి పూన్చిన గఱ్ఱాల పాదధూళి ఎలా లేస్తోందో చూడు. అదిగో అటు వైపే కృష్ణుడు వెళ్తున్నాడు చూడండి” అంటూ కళ్ళకి కనపడినంత దూరం పోయేదాకా కదలక మెదలక అలాగే చూస్తూ నిలబడిపోయారు.
తెభా-10.1-1226-వ.
ఇట్లు నక్రూర రామ సహితుండై చని చని.
టీక:- ఇట్లు = ఈ విధముగ; అక్రూర = అక్రూరుడు; రామ = బలరాములతో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; చనిచని = చాలా దూరము వెళ్ళి.
భావము:- అలా పయనమైన బలరామకృష్ణులు అక్రూరుడితో కలసి వెళ్తూ. . . .
తెభా-10.1-1227-క.
అవలోకించెను గృష్ణుఁడు
ప్రవిమలకల్లోలపవన భాసితజన్య
న్నవసన్నపాపసైన్యం
గవిజనమాన్యం గళిందకన్యన్ ధన్యన్.
టీక:- అవలోకించెను = చూసెను; కృష్ణుండు = కృష్ణుడు; ప్రవిమల = మిక్కిలి నిర్మలమైన; కల్లోల = పెద్ద అలలు వలని; పవన = గాలిచేత; భాసిత = సుఖమును; జన్యన్ = కలిగించునది; అవసన్న = నశించిన, పోయిన; పాప = పాపములు అనెడి; సైన్యన్ = సమూహములు గలదానిని; కవిజన = కవు లందరిచేత; మాన్యన్ = గౌరవింపబడెడిదానిని; కళిందకన్యన్ = యమునానదిని {కళింద కన్య - కళిందపర్వతుని పుత్రిక, యమునానది}; ధన్యన్ = కృతార్థురాలను.
భావము:- కృష్ణుడు యమునా నదిని దర్శించారు. ఆ యమున నిర్మలమైన తన పెద్ద అలలపై నుంచి చల్లటి గాలులు వీస్తుంది. పాపాలన్నిటినీ నశింపజేస్తుంది. ఆ నదిని పండితులు ఎంతో గౌరవిస్తారు. ఆ యమున కళింద పర్వతం కూతురు. పరమ ధన్యాత్మురాలు.
తెభా-10.1-1228-వ.
కని, తత్కాళింది యందుఁ బరిక్షుణ్ణ మణిగణ సముజ్జ్వలంబు లగు జలంబులు ద్రావి, తరుసమూహ సమీపంబున రామసహితుండై కృష్ణుండు రథంబు ప్రవేశించె; నంత నక్రూరుండు వారలకు మ్రొక్కి వీడ్కొని కాళిందీహ్రదంబు జొచ్చి విధిపూర్వకంబుగా వేదమంత్రంబులు జపియించుచు.
టీక:- కని = దర్శించి; తత్ = ఆ యొక్క; కాళింది = యమునానది {కాళింది - కళింద పర్వతుని పుత్రిక, యమునానది}; అందున్ = లో; పరిక్షుణ్ణ = బాగా మెరుగుపెట్టబడిన; మణి = రత్నాల; గణ = సమూహమువలె; సముజ్జ్వలంబులు = మిక్కిలి మెఱుస్తున్నవి; అగు = ఐన; జలంబులున్ = నీటిని; త్రావి = తాగి; తరు = చెట్ల; సమూహ = గుంపులకు; సమీపంబునన్ = దగ్గరలో; రామ = బలరామునితో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; కృష్ణుండు = కృష్ణుడు; రథంబు = రథమును; ప్రవేశించెన్ = చేరెను, ఎక్కెను; అంతన్ = అప్పుడు; అక్రూరుండు = అక్రూరుడు; వారల్ = వారి; కున్ = కి; మ్రొక్కి = నమస్కరించి; వీడ్కొని = సెలవు తీసుకొని; కాళిందీ = యమునానదిలోని; హ్రదంబున్ = మడుగును; చొచ్చి = ప్రవేశించి; విధి = శాస్త్రము నిర్ణయించిన; పూర్వకంబుగాన్ = ప్రకారముగా; వేద = వేదము లందలి; మంత్రంబులున్ = మంత్రములను {మంత్రము - మంతారం త్రాయత ఇతి మంత్రః. (వ్యుత్పత్తి), తలచుట (మననము) చేయు వానిని దుఃఖమునుండి రక్షించునది మంత్రము}; జపియించుచు = జపము చేయుచు.
భావము:- అలా మథుర వెళ్తున్న కృష్ణుడు బలరాముడితో పాటు కాళింది కన్య అయిన యమునను చూసి, బాగా మెరుగు పెట్టిన మణులలా తళతళ మెరుస్తున్న ఆ నదీజలాన్ని త్రాగాడు. పిమ్మట చెట్ల దగ్గర ఆపిన రథాన్ని అధిరోహించాడు. అప్పుడు అక్రూరుడు వారిద్దరికీ నమస్కరించి, వారి అనుమతి తీసుకుని, కాళిందీ మడుగులో దిగి యథావిధిగా వేదమంత్రాలు జపిస్తూ. . .