పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సుయోధనుడు ద్రెళ్ళుట

వికీసోర్స్ నుండి

సుయోధనుడుద్రెళ్ళుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సుయోధనుడు ద్రెళ్ళుట)
రచయిత: పోతన


తెభా-10.2-824-వ.
అట్లు సనుదెంచి మయమాయామోహితంబైన సభాస్థలంబు నందు.
టీక:- అట్లు = ఆ విధముగా; చనుదెంచి = వచ్చి; మయ = మయుని యొక్క; మాయా = మాయచేత; మోహితంబు = మోహింప జేయబడినది; ఐన = అయినట్టి; సభాస్థలము = సభాస్థలము; అందున్ = లో;
భావము:- ఇలా వచ్చిన దుర్యోధనుడు మాయమయమైన మయాసభా మధ్యంలో ప్రవేశించి.

తెభా-10.2-825-క.
లిలములు లేని ఠావున
లువలు వెస నెగయఁ దిగిచి వారక తోయం
బులు గల చోటనుం జేలం
బులు దడియఁగఁ బడియె నిజవిభుత్వము దఱుఁగన్

టీక:- సలిలములు = నీళ్ళు; లేని = లేని; ఠావున్ = తావు నందు; వలువలు = కట్టుకొన్న బట్టలు; వెసన్ = శీఘ్రమె; ఎగయదిగిచి = ఎగకట్టి; వారక = తప్పక; తోయంబులు = నీళ్ళు; కల = ఉన్నట్టి; చోటనున్ = తావు నందు; చేలంబున్ = కట్టుకొన్న బట్టలు; తడియన్ = తడిసిపోగా; పడియెన్ = పడిపోయెను; నిజ = తన; విభుత్వము = రాజసము; తఱుగన్ = తగ్గిపోవునట్లు.
భావము:- ఆ మయాసభలో నీరులేని స్థలంలో కట్టుకున్న దుస్తులు పైకి ఎగగట్టుకుని; నీరున్న స్థలంలో దుస్తులు తడుపుకొని; దుర్యోధనుడు భ్రమకు లోను అయ్యాడు.

తెభా-10.2-826-క.
విధమంతయుఁ గనుఁగొని
పాని నవ్వుటయు నచటి పార్థివులునుఁ గాం
తాలియును యమతనయుఁడు
వావిరిఁ జేసన్నఁ దమ్ము వారింపంగన్.

టీక:- ఆ = ఆ; విధము = రీతి; అంతయున్ = ఎల్ల; కనుగొని = చూసి; పావని = భీముడు; నవ్వుటయున్ = నవ్వగా; అచటి = అక్కడ ఉన్న; పార్థివులునున్ = రాజులు; కాంతా = స్త్రీల; ఆవలియును = సమూహము; యమతనయుడు = ధర్మరాజు; వావిరన్ = అధికముగ; చేసన్నన్ = చేతిసైగలచేత; తమ్మున్ = తమను; వారింపంగన్ = వారిస్తుండగా.
భావము:- ఈవిధంగా భ్రమకులోనైన దుర్యోధనుడిని చూసిన భీమసేనుడు నవ్వాడు. అక్కడున్న రాజులూ స్త్రీ జనమూ ధర్మరాజు సైగ చేసి వారిస్తూ ఉన్నా...

తెభా-10.2-827-వ.
దామోదరానుమోదితులయి మహారవంబుగాఁ బరిహాసంబులు చేసిన సుయోధనుండు లజ్ఞావనతవదనుండై కుపితమానసుం డగుచు నయ్యెడ నిలువక వెలువడి నిజపురంబునకరిగె; నయ్యవసరంబున ధీవిశాలు రైన సభాసదులగు నచ్చటి జనంబుల కోలాహలంబు సంకులంబైన నజాతశత్రుండు చిత్తంబున విన్ననై యుండె; నప్పుండరీకాక్షుండు భూభార నివారణకారణుం డగుటంజేసి దుర్యోధను నపహాసంబునకుం గాదనండయ్యె; నంత.
టీక:- దామోదర = కృష్ణునిచే; అనుమోదితులు = అంగీకరింపబడినవారు; అయి = ఐ; మహారవంబుగాన్ = బిగ్గరగా; పరిహాసంబులు = నవ్వుటలు; చేసినన్ = చేయగా; సుయోధనుండు = దుర్యోధనుడు; లజ్జ = సిగ్గుచేత; అవనత = వంచబడిన; వదనుండు = ముఖము కలవాడు; ఐ = అయ్యి; కుపిత = కోపించిన; మానసుండు = మనసు కలవాడు; అగుచున్ = ఔతు; ఆ = ఆ; ఎడన్ = చోటు నందు; నిలువక = ఉండకుండా; వెలువడి = బయలుదేరి; నిజ = తన; పురంబున్ = నగరమున; కున్ = కు; అరిగెన్ = వెళ్ళిపోయెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; ధీవిశాలురు = విశేషమైనబుద్ధి కలవారు; ఐన = అయిన; సభాసదులు = సభికులు; అగున్ = అయిన; అచ్చటి = అక్కడి; జనంబులన్ = వారల; కోలాహలంబు = సందడి; సంకులంబు = కలత నొందినది; ఐనన్ = కాగా; అజాతశత్రుండు = ధర్మరాజు; చిత్తంబునన్ = మనసు; విన్నను = చిన్నపోయినవాడు; ఐ = అయ్యి; ఉండెన్ = ఉండెను; ఆ = ఆ దివ్యుడైన; పుండరీకాక్షుండు = కృష్ణుడు; భూ = భూమి యొక్క; భార = భారమును; నివారణ = పోగుట్టు; కారణుండు = కారణము కలవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; దుర్యోధనున్ = దుర్యోధనుని ఎడ; అపహాసంబున్ = నవ్వుట; కున్ = కు; కాదు = వద్దు; అనడు = అననివాడు; అయ్యెన్ = అయ్యెను; అంత = పిమ్మట.
భావము:- కృష్ణుడి ఆమోదంతో అక్కడున్న రాజులు స్త్రీ జనము భీముడితోపాటు పెద్దగా పకపకా నవ్వారు. మయసభలో తనకు జరిగిన ఘోరమైన అవమానానికి సిగ్గుపడి దురాగ్రహంతో దుర్యోధనుడు తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో సభాసదుల వేళాకోళంతో కూడిన కోలాహలాన్ని చూసిన ధర్మరాజు చిన్నపోయాడు. భూభారాన్ని నివారించడానికి అవతారం ధరించిన శ్రీకృష్ణుడు దుర్యోధనునికి జరిగిన అవమానాన్ని ఖండించ లేదు.

తెభా-10.2-828-క.
రి ధర్మసుతుని వీడ్కొని
రుణీ హిత బంధుజన కదంబము గొలువం
రితోషమునఁ గుశస్థల
పుమునకుం జనియె మోదమున నరనాథా!

టీక:- హరి = కృష్ణుడు; ధర్మసుతుని = ధర్మరాజు; వీడ్కొని = సెలవుతీసుకొని; తరుణీ = స్త్రీలు; హిత = ఆప్తులు; బంధు = బంధువులు; జన = ప్రజల; కదంబము = సమూహము; కొలువన్ = సేవించుచుండగా; పరితోషమునన్ = సంతోషముతో; కుశస్థల = కుశస్థలము అను; పురమున్ = పట్టణమున; కున్ = కు; చనియె = వెళ్ళెను; మోదమునన్ = సంతోషముతో; నరనాథా = రాజా.
భావము:- ఓ మహారాజా! ఆ తరువాత కృష్ణుడు ధర్మరాజును వీడ్కొని భార్యాబిడ్డలు, బంధుజనులు సేవిస్తుండగా సంతోషంగా కుశస్థలికి ద్వారకానగరానికి వెళ్ళాడు.

తెభా-10.2-829-చ.
వరబంధమోక్షణముఁ జైద్యవధంబును బాండురాజ నం
మఖరక్షణంబును నుదారతఁ జేసిన యట్టి దేవకీ
యుచరిత్ర భాసుర కథా పఠనాత్ములు గాంతు రిష్ట శో
బహుపుత్త్ర కీర్తులును వ్యవివేకము విష్ణులోకమున్."

టీక:- జనవర = రాజుల; బంధ = నిర్బందములను; మోక్షణము = విడుదల చేయుట; చైద్య = శిశుపాలుని; వధంబును = సంహరించుట; పాండురాజనందన = ధర్మరాజు; మఖ = యాగము; రక్షణంబును = కాపాడుట; ఉదారతన్ = కృపతో; చేసినయట్టి = చేసినట్టి; దేవకీతనయు = కృష్ణుని; చరిత్ర = వృత్తాంతము; భాసుర = ప్రకాశవంతమైన; కథా = కథను; పఠన = చదువు; ఆత్ములు = మనసు కలవారు; కాంతురు = పొందుతారు; ఇష్ట = కోరిన; శోభన = శుభకరములైన; బహు = పెక్కులైన; పుత్ర = కొడుకులు; కీర్తులు = యశస్సు; భవ్య = గొప్ప; వివేకము = తెలివి; విష్ణులోకమున్ = వైకుంఠము.
భావము:- రాజులను బంధవిముక్తులను చేయడం శిశుపాలుడిని వధించడం ధర్మజ్ఞుని యజ్ఞాన్ని రక్షించడం మొదలైన శ్రీకృష్ణుని విజయ గాథలను చదివినవారు కోరిన సౌభాగ్యాలనూ, కీర్తిని, దివ్యమైన జ్ఞానాన్ని వైకుంఠ వాసాన్ని పొందుతారు."

తెభా-10.2-830-క.
ని శుకయోగీంద్రుండ
మ్మనుజేంద్రునిఁజూచి పలికె ఱియును “శ్రీకృ
ష్ణుని యద్భుత కర్మంబులు
వినిపింతుం జిత్తగింపు విమలచరిత్రా!

టీక:- అని = అని; శుక = శుక; యోగి = ముని; ఇంద్రుండు = ఉత్తముడు; ఆ = ఆ ప్రసిద్ధుడైన; మనుజేంద్రునిన్ = రాజును; చూచి = చూసి; పలికెన్ = చెప్పెను; మఱియునున్ = ఇంకను; శ్రీకృష్ణుని = కృష్ణుని; అద్భుత = ఆశ్చర్యకరములైన; కర్మంబులున్ = పనులు; వినిపింతున్ = చెప్పెదను; చిత్తగింపు = వినుము; విమలచరిత్రా = మంచి నడత కలవాడా.
భావము:- ఇలా పలికిన శుకమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా చెప్పసాగాడు. “నిర్మలమైన చరిత్రగల ఓ రాజా పరీక్షిత్తూ! శ్రీకృష్ణుడి అద్భుత కార్యాలను ఇంకా వివరిస్తాను శ్రద్దగా ఆలకించు.