పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సాళ్వుని వధించుట

వికీసోర్స్ నుండి

సాళ్వుని వధించుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సాళ్వుని వధించుట)
రచయిత: పోతన


తెభా-10.2-908-చ.
రి దనమీఁద ఘోరనిశితాశుగజాలము లేయు సాల్వభూ
రు వధియింపఁ గోరి బహువారిద నిర్గతభూరివృష్టి వి
స్ఫుణ ననూన తీవ్రశరపుంజములన్ గగనంబుఁ గప్పి క్ర
చ్చ రిపు మౌళిరత్నమునుఁ జాపము వర్మముఁ ద్రుంచి వెండియున్.

టీక:- హరి = కృష్ణుడు; తన = తన; మీదన్ = పైన; ఘోర = భయంకరములైన; నిశిత = వాడియైన; ఆశుగజాలము = బాణ సముదాయము; ఏయు = వేయుచున్న; సాల్వ = సాల్వ; భూవరున్ = రాజును; వధియింపన్ = చంపవలెనని; కోరి = కోరి; బహు = పెక్కు; వారిద = మేఘములనుండి; నిర్గత = పడెడి; భూరి = అతిపెద్దదైన; వృష్టి = వాన వలె; విస్ఫురణన్ = కనబడునట్లు; అనూన = మిక్కిలి; తీవ్ర = తీక్షణమైన; శర = బాణముల; పుంజములన్ = సమూహములచేత; గగనంబున్ = ఆకాశమును; కప్పి = ఆవరించి; క్రచ్ఛఱ = శీఘ్రమే; రిపు = శత్రువు యొక్క; మౌళి = కీరీటము నందలి; రత్నమున్ = మణిని; చాపమున్ = వింటిని; వర్మమున్ = కవచమును; త్రుంచి = చీల్చివేసి; వెండియున్ = ఇంకను.
భావము:- అప్పుడు తన మీద పదునైన బాణాలను గుప్పిస్తున్న సాల్వుడిని చంపటానికి శ్రీకృష్ణుడు నిశ్చయించుకొని, తన తిరుగులేని తీవ్రమైన బాణాలను వర్షధారలవలె ప్రయోగిస్తూ ఆకాశాన్ని కప్పివేసి శత్రువు కిరీటాన్నీ ధనుస్సునూ కవచాన్నీ ఛేదించి వేశాడు.

తెభా-10.2-909-మ.
వితక్రోధముతోడఁ గృష్ణుఁడు జగద్విఖ్యాతశౌర్యక్రియో
ద్ధశక్తిన్ వడిఁ ద్రిప్పి మింట మెఱుఁగుల్‌ ట్టంబుగాఁ బర్వ ను
గ్రతఁ జంచద్గద వైచి త్రుంచె వెసఁ జూర్ణంబై ధరన్ రాల నా
భూరిత్రిపురాభమున్ మహితమాయాశోభమున్ సౌభమున్.

టీక:- వితత = విస్తారమైన; క్రోధము = కోపము; తోడన్ = తోటి; కృష్ణుడు = కృష్ణుడు; జగత్ = విశ్వమంత; విఖ్యాత = ప్రసిద్ధమైన; శౌర్య = పరాక్రమము కల; క్రియా = వర్తనల; ఉద్ధత = అతిశయించిన; శక్తిన్ = బలముతో; వడిన్ = వేగముగా; త్రిప్పి = తిప్పి; మింటన్ = ఆకాశమున; మెఱుగులు = అగ్నిరవ్వలు; దట్టంబుగా = చిక్కగా; పర్వన్ = వ్యాపించగా; ఉగ్రతన్ = భయంకరత్వముతో; చంచత్ = చలించెడి; గదన్ = గదతో; వైచి = కొట్టి; త్రుంచెన్ = నరికెను; వెసన్ = వెంటనే; చూర్ణంబు = పొడిపొడి; ఐ = అయ్యి; ధరన్ = నేలపై; రాలన్ = రాలిపడునట్లు; ఆయత = మిక్కిలి విశాలమైన; భూరి = మిక్కిలి పెద్దదైన; త్రిపురా = త్రిపురముల; ఆభమున్ = వంటిదానిని; మహిత = మహిమాన్వితమైన; మాయా = మాయతో; శోభమున్ = శోభిల్లుతున్నదానిని; సౌభమున్ = సౌభకవిమానమును.
భావము:- మహాక్రోధంతో శ్రీకృష్ణుడు విశ్వవిఖ్యాతమైన వీరవిజృంభణంతో ఆకాశంనిండా మెరుపులు వ్యాపించేలా గదాదండాన్ని విసిరి త్రిపురాల వంటిదీ గొప్ప మాయతో విరాజిల్లుతున్నది అయిన సాల్వుడి సౌభకవిమానాన్ని తుత్తునియలు చేసాడు.

తెభా-10.2-910-వ.
అట్లు కృష్ణుం డమ్మయనిర్మిత మాయావిమానంబు నిజగదాహతి నింతింతలు తునియలై సముద్రమధ్యంబునం దొరంగం జేసిన సాల్వుండు గోఱలు వెఱికిన భుజంగంబు భంగి గండడంగి విన్ననై విగతమాయాబలుం డయ్యునుఁ బొలివోవని బీరంబున వసుధా తలంబునకు డిగ్గి యాగ్రహంబున.
టీక:- అట్లు = ఆ విధముగా; కృష్ణుండు = కృష్ణుడు; ఆ = ఆ; మయ = మయునిచేత; నిర్మిత = తయారుచేయబడిన; మాయా = మాయలు కలిగిన; విమానంబున్ = విమానమును; నిజ = తన; గదా = గదచే; ఆహతిన్ = దెబ్బలుచేత; ఇంతింతలున్ = బాగా చిన్నవైన; తునియలు = ముక్కలు; ఐ = అయ్యి; సముద్ర = సముద్రము యొక్క; మధ్యంబునన్ = మధ్యలో; తొరగన్ = పడునట్లుగా; చేసినన్ = చేయగా; సాల్వుండు = సాల్వుడు; కోఱలు = కోరలు; పెఱికినన్ = పీకినట్టి; భుజంగంబు = పాము; భంగిన్ = వలె; గండు = మదము; అడంగి = అణగి; విన్ననై = చిన్నబోయి; విగత = పోయిన; మాయా = మాయవలని; బలుండు = బలము కలవాడు; అయ్యునున్ = అయినప్పటికి; పొలివోవని = విడువని; బీరంబునన్ = పరాక్రమముచే; వసుధాతలంబున్ = నేలపై; కున్ = కి; డిగ్గి = దిగి; ఆగ్రహంబునన్ = కోపముతో.
భావము:- ఆ విధంగా మయడు నిర్మించిన మాయావిమానాన్ని శ్రీకృష్ణుడు తన గదాఘాతంతో ముక్కలు చేసి సముద్రమధ్యంలో పడేలా చేసాడు. అప్పుడు సాల్వుడు కోరలు తీసిన క్రూరసర్పంలా దీనుడై మాయాబలం నశించి కూడ, మొక్కపోని పరాక్రమంతో భూమికి దిగాడు.

తెభా-10.2-911-క.
మునఁ బవినిభ మగు భీ
గద ధరియించి కదియఁగాఁ జనుదేరన్
ముహరుఁ డుద్ధతి సాల్వుని
ము గదాయుక్తముగను ఖండించె నృపా!

టీక:- కరమునన్ = చేతిలో; పవి = వజ్రాయుధము; నిభము = సరిపోలునది; అగు = ఐన; భీకర = భయంకరమైన; గదన్ = గదను; ధరియించి = పట్టుకొని; కదియగాన్ = దగ్గరకు; చనుదేరన్ = రాగా; మురహరుడు = కృష్ణుడు; ఉద్ధతిన్ = ఉత్సాహముతో; సాల్వుని = సాల్వుని; కరము = చేతిని; గదా = గదతో; యుక్తముగను = సహితముగా; ఖండించెన్ = నరికెను; నృపా = రాజా.
భావము:- ఓ రాజా నరేంద్రా! సాల్వుడు వజ్రాయుధంతో సమానమైన భయంకర గదను చేతబట్టి కృష్ణుడిని ఎదుర్కొన్నాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ గదతో సహితంగా వాడి చేతిని ఖండించివేసాడు.

తెభా-10.2-912-క.
అంతం బోవక కినుక న
నంతుఁడు విలయార్కమండలాయతరుచి దు
ర్దాంతంబగు చక్రంబు ని
తాంతంబుగఁ బూన్చి సాల్వరిణిపుమీఁదన్.

టీక:- అంతన్ = దానితో; పోవక = పోకుండా; కినుకన్ = కోపముతో; అనంతడు = కృష్ణుడు; విలయ = ప్రళయకాలపు; అర్క = సూర్య; మండల = మండలము యొక్క; ఆయత = విస్తారమైన; రుచిన్ = ప్రకాశముచేత; దుర్దాంతంబు = అణపరానిది; అగు = ఐన; చక్రంబున్ = చక్రమును; నితాంతంబుగన్ = మిక్కిలి బలముగ; పూన్చి = అందుకొని, ధరించి; సాల్వ = సాల్వదేశపు; ధరణిపు = రాజు; మీదన్ = పైన.
భావము:- అంతటితో ఆగకుండా శ్రీకృష్ణుడు ప్రళయకాల సూర్యమండల ప్రభలను వెదజల్లే సుదర్శన చక్రాన్ని సాల్వుడి మీద ప్రయోగించాడు.

తెభా-10.2-913-క.
గురుశక్తి వైచి వెస భా
సుకుండలమకుటరత్నశోభితమగు త
చ్ఛిము వడిఁ ద్రుంచె నింద్రుఁడు
కులిశముచేత వృత్రు ధియించు క్రియన్.

టీక:- గురు = అధికమైన; శక్తిన్ = శక్తితో; వైచి = వేసి; వెసన్ = శీఘ్రమే; భాసుర = ప్రకాశవంతమైన; కుండల = చెవికుండలముల యొక్క; మకుట = కిరీటము యొక్క; రత్న = మణులచేత; శోభితము = శోభిల్లుతున్నది; అగు = అయిన; తత్ = వాని; శిరమున్ = తలను; వడిన్ = వేగముగా; త్రుంచెన్ = నరికెను; ఇంద్రుడు = ఇంద్రుడు; వర = శ్రేష్ఠమైన; కులిశము = వజ్రాయుధము; చేతన్ = చేత; వృత్రున్ = వృత్రాసురుని; వధియించు = చంపిన; క్రియన్ = విధముగా.
భావము:- ఇంద్రుడు వజ్రాయుధంతో వృత్రాసురుని చంపినట్లుగా, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వేసి మకరకుండల రత్నాలతో విరాజిల్లుతున్న సాల్వుడి తలను ఖండించాడు.