Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సాంబుడు లక్షణ నెత్తకొచ్చుట

వికీసోర్స్ నుండి

సాంబుడు లక్షణనెత్తకొచ్చుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సాంబుడు లక్షణ నెత్తకొచ్చుట)
రచయిత: పోతన


తెభా-10.2-560-సీ.
"కోరి సుయోధనుకూఁతురు సర్వల-
క్షణములు గల్గి లక్షణ యనంగ
హి నొప్పు కన్యకాణి వివాహంబునఁ-
క్రహస్తుని తనూజాతుఁడైన
సాంబుఁడు బలసాహమున నెత్తుకపోవఁ-
గౌరవు లీక్షించి "డఁగి క్రొవ్వి
డచువాఁ డొకఁ డదె బాలికఁ గొనిపోవు-
చున్నాఁడు గైకొన కుక్కుమిగిలి

తెభా-10.2-560.1-తే.
యిట్టి దుర్మదుఁ గయిముట్టి ట్టి తెచ్చి
నులు వెఱఁగందఁ జెఱపట్టి యునుతుమేని
దువులు మనల నేమి సేయంగఁ గలరొ"
నుచుఁ గురువృద్ధజనముల నుమతమున.

టీక:- కోరి = కావలెనని; సుయోధను = సుయోధనుని; కూతురు = పుత్రిక; సర్వ = ఎల్ల; లక్షణములున్ = శుభలక్షణములు; కల్గిన్ = కలిగిన; లక్షణ = లక్షణ అని; అనంగన్ = అనగా; మహిన్ = భూమిమీద; ఒప్పు = చక్కగానుండెడి; కన్యక = పెళ్ళికావలసిన వధువు; మణి = శ్రేష్ఠురాలు; వివాహంబునన్ = వివాహసమయమున; చక్రహస్తుని = కృష్ణుని {చక్రహస్తుడు - చక్రము ధరించినవాడు, కృష్ముడు}; తనూజాతుడు = కుమారుడు; ఐన = అయిన; సాంబుడు = సాంబుడు; బల = బలము చేత; సాహసమునన్ = తెగువచేత; ఎత్తుకుపోవన్ = తీసుకుపోతుండగా; కౌరవులు = కౌరవులు, దుర్యోధనాదులు {కౌరవులు - కురువంశపువారు, ధృతరాష్ట్రుని కుమారులు వందమంది (100), చూ. వివరములకు అనుయుక్తములందు}; ఈక్షించి = చూసి; కడగి = ప్రయత్నపడి; క్రొవ్వి = మదించి; పడచువాడు = కుఱ్ఱవాడు; ఒకడు = ఒక్కడు; అదె = అదిగో; బాలికన్ = కన్యకను; కొనిపోవుచున్నాడు = తీసుకుపోతున్నాడు; కైకొనక = లక్ష్యపెట్టకుండ; ఉక్కుమిగిలి = బలము అతిశయించి; ఇట్టి = ఇటువంటి; దుర్మదున్ = చెడ్డగర్విష్ఠిని; కయి = చేయి; ముట్టి = అందుకొని; పట్టి = పట్టుకొని; తెచ్చి = తీసుకువచ్చి; జనులు = ప్రజలెల్లరు; వెఱగందన్ = ఆశ్చర్యపోవునట్లు; చెఱపట్టి = బంధించి; ఉనుతుమేని = మనము ఉంచిన పక్షమున; యదువులున్ = యాదవులు; మనలన్ = మనని; ఏమి = ఏమి; చేయంగగలరో = చేయగలరు, ఏమిచేయలేరు; అనుచున్ = అని; కురు = కురు వంశపు; వృద్ధ = పెద్ద; జనముల = వారి; అనుమతంబునన్ = అనుజ్ఞతో.
భావము:- “రాజా! దుర్యోధనుడి కుమార్తె పేరు లక్షణ సకల శుభలక్షణాలు కలిగిన కన్య. శ్రీకృష్ణుడి కుమారుడైన సాంబుడు ఆ వివాహ సమయంలో ఆమెను ధైర్యసాహసాలతో ఎత్తుకుపోయాడు. అది చూసి కౌరవులు “ఒక కుఱ్ఱవాడు మన అమ్మాయిని దౌర్జన్యంగా తీసుకుపోతున్నాడు. ఆ పొగరుబోతును బంధించి తెచ్చి, చెరసాలలో వేద్దాము. యాదవులు మనలను ఏమిచేయగలరు.” అని. పెద్దలైన భీష్మాదుల అనుమతితో.....

తెభా-10.2-561-వ.
ఇట్లు గడంగి యుద్ధసన్నద్ధులై బలశౌర్యోపేతులగు కర్ణ శల్య భూరిశ్రవో యజ్ఞకేతు సుయోధనాదులు సమున్నత రథారూఢులై కూడ నరిగిన వారలఁ గనుంగొని జాంబవతీనందనుండు మందస్మిత వదనారవిందుం డగుచు సింగంబు భంగి గర్జించుచు మణిదీప్తం బైన చాపంబుఁబూని నిల్చిన వారును సాంబు నదల్చి “నిలునిలు” మని పలికి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; కడంగి = పూని; యుద్ధ = యుద్ధమునకు; సన్నద్ధులు = సిద్ధపడినవారు; ఐ = అయ్యి; బల = పెద్దసైన్యముతో; శౌర్యము = పరాక్రమముతో; ఉపేతులు = కూడుకొన్నవారు; అగు = ఐన; కర్ణ = కర్ణుడు; శల్య = శల్యుడు; భూరిశ్రవః = భూరిశ్రవుడు; యజ్ఞకేతు = యజ్ఞకేతుడు; సుయోధన = దుర్యోధనుడు; ఆదులున్ = మున్నగువారు; సమ = మిక్కిలి; ఉన్నత = ఎత్తైన; రథ = రథములపై; ఆరూఢులు = ఎక్కినవారు; ఐ = అయ్యి; కూడనరిగినన్ = వెంటనంటగా; వారలన్ = వారిని; కనుంగొని = చూసి; జాంబవతీనందనుండు = సాంబుడు {జాంబవతీనందనుడు - జాంబవతి అందు కృష్ణునికి జన్మించిన వాడు, సాంబుడు}; మందస్మిత = చిరునవ్వు కల; వదన = మోము అను; అరవిందుడు = పద్మము కలవాడు; అగుచున్ = ఔతు; సింగంబు = సింహము; భంగిన్ = వలె; గర్జించుచు = బొబ్బలు వేయుచు; మణి = రత్నాలచే; దీప్తంబు = ప్రకాశించునది; ఐన = అయిన; చాపంబునునన్ = ధనుస్సును; పూని = ధరించి; నిల్చినన్ = నిలువగా; వారును = వారుకూడ; సాంబున్ = సాంబుడిని; అదల్చి = అదలించి; నిలునిలుము = ఆగిపొమ్ము; అని = అని; పలికి = కేకలేసి.
భావము:- మహాపరాక్రమోపేతులైన కర్ణ, శల్య, భూరిశ్రవ, యజ్ఞకేతు, దుర్యోధనాదులు యుద్ధసన్నధ్దులై చెలరేగి రథాలెక్కి, సాంబుడిని వెంబడించారు. ఆ జాంబవతి పుత్రుడు సాంబుడు వారిని చూసి చిరునవ్వులు చిందులాడే ముఖారవిందంతో సింహంలాగా గర్జిస్తూ ధనుర్ధారియై ఎదురొడ్డి నిలపడ్డాడు. కౌరవులు సాంబుడి మీదకి వెళ్ళి “ఆగు ఆగు” అని అదలించారు.

తెభా-10.2-562-తే.
చండ కోదండ ముక్త నిశాత విశిఖ
జా మందంద వఱపి యాభీముగను
నందనందన నందన స్యందనంబు
ముంచి రచలేంద్రమును ముంచు మంచు పగిది.

టీక:- చండ = తీవ్రమైన; కోదండ = ధనుస్సునుండి; ముక్త = విడువబడిన; నిశాత = వాడియైన; విశిఖ = బాణముల యొక్క; జాలమున్ = సమూహమును; అందంద = ఒకదానిమీదొకటి; పఱపి = ప్రయోగించి; ఆభీలముగను = భయంకరముగ; నందనందననందన = సాంబుని {నందనందననందనుడు - నందుని కొడుకు యొక్క (కృష్ణుని) కొడుకు, సాంబుడు}; స్యందనంబున్ = రథమును; ముంచిరి = మునుగునట్లు చేసిరి; అచల = పర్వత; ఇంద్రమును = శ్రేష్ఠమును; ముంచు = ముంచివేసెడి; మంచు = మంచుతెర; పగిదిన్ = వలె.
భావము:- కౌరవులు ధనుస్సులు ఎక్కుపెట్టి సాంబుడి మీద వాడి బాణాలను ప్రయోగించి, మంచు పర్వతాన్ని ముంచివేసినట్లు అతడి రథాన్ని బాణాలతో కప్పివేశారు.

తెభా-10.2-563-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- ఇంకా..

తెభా-10.2-564-శా.
శౌర్యాటోప విజృంభణంబుల సరోజాతాక్షుసూనున్ సురా
హార్యస్థైర్యుని మీఁద నేయ నతఁ డుద్యద్భూరిబాహాబలా
వార్యుండై శితసాయకాలి నవి మాయం జేసినన్ దేవతా
తూర్యంబుల్‌ దివి మ్రోసె; నంత నతఁ డస్తోకప్రతాపోన్నతిన్.

టీక:- శౌర్య = శౌర్యముచేత; ఆటోప = ఉత్సుకతచేత; విజృంభణంబులన్ = విజృంభించుటచేత; సరోజాతాక్షుసూనున్ = సాంబుని {సరోజాతాక్షు సూనుడు - సరోజాతాక్షుడు (కృష్ణుడు) యొక్క సూనుడు (కొడుకు), సాంబుడు}; సురాహార్య = మేరుపర్వతమంత ధైర్యంతో; స్థైర్యుని = చలింపకనుండువాని; మీదన్ = పైన; వేయన్ = ప్రయోగించగా; అతడున్ = అతడు, సాంబుడు; ఉద్యత్ = ఉప్పొంగుచున్న; భూరి = మిక్కుటమైన; బాహాబలా = భుజబలముచేత; అవార్యుండు = అడ్డగింపరానివాడు; ఐ = అయ్యి; శిత = వాడియైన; సాయిక = బాణముల; ఆలిన్ = సమూహముచేత; అవి = వానిని; మాయన్ = నశింప; చేసినన్ = చేయగా; దేవతా = దేవతల; తూర్యంబులు = వాయిద్యములు; దివిన్ = ఆకాశమున; మ్రోసెన్ = మోగినవి; అంతన్ = పిమ్మట; అతడున్ = అతడు; అస్తోక = మిక్కుటమైన {అస్తోకము - తక్కువకానిది,అధికమైనది}; ప్రతాప = శౌర్యము యొక్క; ఉన్నతిన్ = గొప్పదనముచేత.
భావము:- ఈవిధంగా మేరుపర్వతంతో సమానమైన ధైర్యంగల కృష్ణకుమారుడు సాంబుడి మీద కౌరవులు పరాక్రమంతో విజృంభించి బాణాలను ప్రయోగించారు. అతడు ఆకాశంలో దేవ దుంధుభులు మ్రోగుతుండగా, అతిశయించిన భుజబల శౌర్యాలతో, కౌరవులు తనపై వేసిన బాణాలు అన్నింటినీ ధ్వంసం చేసాడు.

తెభా-10.2-565-వ.
ఇట్లు గడంగి బాణజాలంబులు పరఁగించి యందఱ కన్నిరూపులై రథ రథ్య సూతధ్వజ పతాకాతపత్రంబులు చూర్ణంబులుగావించి విరథులం జేసి వారల మెయిమఱవులఱువుళ్ళు గావించి యొక్కొక్కనిఁ బెక్కు బాణంబుల నుచ్చిపోనేసిన వారలు శోణిత దిగ్ధాంగులై కుసుమిత కింశుకంబులం బోలి యుండి; రంత.
టీక:- ఇట్లు = ఈ విధముగ; కడంగి = ఉత్సాహపడి; బాణ = బాణముల; జాలంబులున్ = సమూహములను; పరగించి = ప్రయోగించి; అందఱ = అందరి; కిన్ = కి; అన్ని = అన్ని; రూపులు = విధములుగా ఎదుర్కొనువాడు; ఐ = అయ్యి; రథ = తేరులను; రథ్య = గుఱ్ఱములను; సూత = రథసారథులను; ధ్వజ = జండాలను; పతాకా = జండాలను; ఆతపత్రంబులున్ = గొడుగులను; చూర్ణంబులు = నుగ్గునుగ్గు; కాన్ = అగునట్లు; కావించి = చేసి; విరథులన్ = రథము నష్టపోయిన వారిని; చేసి = చేసి; వారలన్ = వారిని; మెయిమఱపులన్ = కవచములను; అఱవుళ్ళు = ఖండించిన వానిగా; కావించి = చేసి; ఒక్కొక్కని = ప్రతి ఒక్కరిని; పెక్కు = అనేక; బాణంబులన్ = బాణములచేత; ఉచ్చిపోన్ = భేదించుకొనిపోవునట్లు, దూసిపోవునట్లు; ఏసినన్ = వేయగా; వారలు = వారు, కౌరవులు; శోణిత = రక్తము చేత; దిగ్ధ = పూయబడిన; అంగులు = దేహములు కలవారు; ఐ = అయ్యి; కుసుమిత = పుష్పించిన; కింశుకంబులన్ = మోదుగ చెట్లను; పోలి = సరిపోలుతూ; ఉండిరి = ఉన్నారు; అంతన్ = అంతట.
భావము:- అపార పరాక్రమంతో సాంబుడు కౌరవుల మీద లెక్కలేనన్ని బాణాలను ప్రయోగించి, అందరకూ అన్ని రూపాలతో కనపడుతూ, వారి రథాలనూ, గుఱ్ఱాలనూ, రథసారథులనూ, జండాలనూ పొడి పొడి చేసాడు. వారు ధరించిన కవచాలను సైతం ఛేదించి వారి శరీరాలలో దూసుకుపోయేలా శరపరంపర ప్రయోగించాడు. సాంబుడి శరజాలం వలన కలిగిన రక్తం కారుతున్న గాయాలతో కౌరవులు పుష్పించిన కింశుకవృక్షాల్లాగా కనపడ్డారు.

తెభా-10.2-566-ఉ.
వా లనేకు లయ్యు బలవంతులునయ్యు మహోగ్రసంగ రో
దాపరాక్రమప్రకటక్షులునయ్యుఁ గుమారకున్ జగ
ద్వీరుని నొక్కనిం జెనకి వ్రేలును వంపఁగలేక సిగ్గునం
గూరినచింత నొండొరులఁ గూడుచు విచ్చుచు వెచ్చనూర్పుచున్.

టీక:- వారలు = వారు; అనేకులు = చాలామంది; అయ్యున్ = ఐ ఉన్నను; బలవంతులు = బలము కలవారు; అయ్యున్ = అయినప్పటికి; మహా = మిక్కిలి; ఉగ్ర = భీకరమైన; సంగర = యుద్ధమునందు; ఉదార = విస్తారమైన; పరాక్రమ = విక్రమము; ప్రకట = చూపుటంబు; దక్షులున్ = సమర్థులు; అయ్యున్ = అయినప్పటికి; కుమారకున్ = బాలుని; జగత్ = లోక; వీరుని = వీరుడిని; ఒక్కనిన్ = ఒక్కడిని; చెనకి = తాకి, ఎదిరించి; వ్రేలునున్ = వేలును కూడ; వంపగలేక = వంచలేక; సిగ్గునన్ = లజ్జతో; కూరిన = పొందిన; చింతన్ = విచారముతో; కూడుచున్ = కలిసికొనుచు; విచ్చుచున్ = విడిపోతూ; వెచ్చనూర్చుచున్ = నిట్టూరుస్తు.
భావము:- కౌరవుల అధిక బలవంతులూ, యుద్ధవిశారదులూ అయిన అంతమంది ఉన్నప్పటికీ, మహావీరుడు సాంబుడు ఒక్కడితో తలపడి అతని వ్రేలు కూడ వంచలేకపోయారు. దానితో, వారు సిగ్గుపడి అవమాన భారంతో చాలా బాధపడ్డారు. నిట్టూర్పులు విడిచారు.

తెభా-10.2-567-వ.
మగిడి సమరసన్నద్ధులై సంరంభించి.
టీక:- మగిడి = మరల; సమర = యుద్ధమునకు; సన్నద్ధులు = సిద్ధపడినవారు; ఐ = అయ్యి; సంరంభించి = త్వరపాటుతో పూని.
భావము:- కౌరవులు తిరిగి యుద్ధానికి సిద్ధమై సాంబుడిని ఎదుర్కొన్నారు.

తెభా-10.2-568-ఉ.
అంఱు నొక్కపెట్ట దనుజాంతకనందనుఁ జుట్టుముట్టి యం
దం నిశాతసాయకచయంబుల ముంచి రథంబు నుగ్ర లీ
లం దునుమాడి చాపము చలంబునఁ ద్రుంచి హయాలిఁజంపి సూ
తుం దెగటార్చి యంత విరథుం డగుడున్ వెసఁ జొచ్చి పట్టినన్.

టీక:- అందఱున్ = అందరు; ఒక్కపెట్టన్ = ఒక్కసారిగా; దనుజాంతకనందనున్ = సాంబుని; చుట్టుముట్టి = చుట్టును ఎదిరించి; అందంద = మఱిమఱి; నిశాత = వాడియైన; సాయక = బాణముల; చయంబులన్ = సమూహము నందు; ముంచి = ఆవరించి; రథంబును = రథమును; ఉగ్ర = భయంకరమైన; లీలన్ = రీతిలో; తునుమాడి = తెగనరికి; చాపము = వింటిని; చలంబునన్ = పట్టుదలతో; త్రుంచి = నరికి; హయ = గుఱ్ఱముల; ఆలిన్ = సమూహమును; చంపి = చంపి; సూతున్ = సారథిని; తెగటార్చి = చంపి; అంతన్ = అంతట; విరథుండు = రథములేనివాడి; అగుడున్ = అగుటచేత; వెస = వడిగా; చొచ్చి = చేరబోయి; పట్టినన్ = పట్టుకొనగా.
భావము:- అందరూ ఒక్కమారుగా దాడిచేసి సాంబుడి మీద పదునైన బాణాలతో ముంచెత్తారు. అతడి రథాన్ని, ధనస్సునీ విరగగొట్టారు. గుఱ్ఱాలనూ సూతుణ్ణి చంపి విరథుడిని చేసి బంధించారు.

తెభా-10.2-569-తే.
బాలకుఁడు చేయునది లేక ట్టువడియెఁ
గౌరవులు దమ మనములఁ గౌతుకంబు
లొలయ సాంబునిఁ గన్యకాయుక్తముగనుఁ
బురమునకుఁ దెచ్చి రతులవిభూతి మెఱసి.

టీక:- బాలకుడు = పిల్లవాడు; చేయునది = చేయగలిగినది; లేక = లేకపోవుటచేత; పట్టుపడియె = పట్టుబడెను; కౌరవులున్ = కౌరవులు; తమ = వారి; మనములన్ = మనస్సు లందు; కౌతుకంబులు = కుతూహలములు; ఒలయన్ = అతిశయింపగా; సాంబునిన్ = సాంబుడుని; కన్యకా = బాలికతో; యుక్తముగను = పాటు; పురమున్ = పట్టణమున; కున్ = కు; తెచ్చిరి = తీసుకువచ్చిరి; అతుల = సాటిలేని; విభూతిన్ = వైభవము; మెఱసి = ప్రకాశింపజేసి.
భావము:- చిన్నపిల్లాడైన సాంబుడు కౌరవులకు పట్టుబడ్డాడు. వారు అధిక సంతోషంతో, సాంబుడిని కన్యను పట్టణానికి తీసుకుని వచ్చారు.

తెభా-10.2-570-వ.
అంత ద్వారకానగరంబున.
టీక:- అంతన్ = అంతట; ద్వారకా = ద్వారకా; నగరంబునన్ = నగరము నందు.
భావము:- అక్కడ ద్వారకానగరంలో...

తెభా-10.2-571-ఉ.
జాంవతేయు వార్త యదుజాతులు నారదయోగిచే సమ
స్తంబును విన్నవా రగుచు సంగరకౌతుక ముప్పతిల్లఁ జి
త్తంబులఁ గౌరవాన్వయకదంబము నొక్కట నుక్కడంచు కో
పంబున నుగ్రసేనజనపాలు ననుజ్ఞ ననూనసైన్యముల్.

టీక:- జాంబవతేయు = సాంబుని; వార్త = వృత్తాంతము; యదుజాతులు = బలరామకృష్ణులు; నారద = నారద; యోగి = ముని; చేన్ = వలన; సమస్తంబును = సర్వమును; విన్నవారు = వినినవారు; అగుచున్ = ఔతు; సంగర = యుద్ధ; కౌతుకము = కుతూహలములు; ఉప్పతిల్లన్ = పుట్టుచుండగా; చిత్తంబులన్ = మనసు లందు; కౌరవా = కౌరవవంశస్థుల; కదంబమున్ = అందరిని; ఒక్కటన్ = ఒక్కసారిగా; ఉక్కడంచు = గర్వము అణచవలెనని; కోపంబుననున్ = కోపముతో; ఉగ్రసేన = ఉగ్రసేనుడు అను; జనపాలున్ = రాజు; అనుజ్ఞన్ = అనుమతిని; అనూన = సమస్తమైన; సైన్యముల్ = సేనలు.
భావము:- సాంబుడు పట్టుబడిన వార్తలు అన్నీ నారదమహర్షి ద్వారా యాదవవీరులు విన్నారు. యుద్ధోత్సాహం అతిశయించగా కౌరవ వంశాన్ని నాశనం చేయడానికి సిద్ధమయ్యారు. మహరాజైన ఉగ్రసేనుడి అనుమతిని తీసుకుని, సర్వసైన్యసమేతంగా కదిలారు.

తెభా-10.2-572-తే.
కూడి నడవంగఁ గని వారితోడ బలుఁడు
"ధార్తరాష్ట్రులు మనకు నెంయును డాసి
ట్టి బంధులు; వారిపై నిట్టి యలుక
నెత్తి చనుచుంట యిది నీతియే తలంప?"

టీక:- కూడి = కూడగట్టుకొని; నడవన్ = బయలుదేరిపోతుండగా; కని = చూసి; వారి = వారల; తోడన్ = తోటి; బలుడు = బలరాముడు; ధార్తరాష్ట్రులు = కౌరవులు {ధార్తరాష్ట్రులు - ధృతరాష్ట్రుని కొడుకులు, కౌరవులు 100 మంది}; మన = మన; కున్ = కు; ఎంతయున్ = మిక్కిలి; డాసినట్టి = దగ్గరి; బంధులున్ = బంధువులు; వారి = వారల; పైన్ = మీద; ఇట్టి = ఇటువంటి; అలుకన్ = కోపగించుట; ఎత్తి = దండెత్తి; చనుచుంటన్ = పోవుట; ఇది = ఇది; నీతియె = పాడియేనా; తలంపన్ = విచారించగా.
భావము:- అలా సైన్యం సమాయత్తం అయి బయలుదేరుతుంటే, బలరాముడు యాదవవీరులతో ఇలా అన్నాడు “కౌరవులు మనకు దగ్గర చుట్టాలు. వారి మీదకి యుద్ధానికి వెళ్ళడం నీతి కాదు.”