Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సత్రాజితుకు మణి తిరిగిచ్చుట

వికీసోర్స్ నుండి

సత్రాజితుకు మణితిరిగిచ్చుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సత్రాజితుకు మణి తిరిగిచ్చుట)
రచయిత: పోతన



తెభా-10.2-76-వ.
ఇట్లు హరి దన పరాక్రమంబున జాంబవతీదేవిం బరిగ్రహించి, రాజసభకు సత్రాజిత్తుం బిలిపించి, తద్వృత్తాంతం బంతయు నెఱిగించి, సత్రాజిత్తునకు మణి నిచ్చె; నతండును సిగ్గువడి మణిం బుచ్చుకొని పశ్చాత్తాపంబు నొందుచు, బలవద్విరోధంబునకు వెఱచుచు నింటికిఁ జని.
టీక:- ఇట్లు = ఈ విధముగ; హరి = కృష్ణుడు; తన = తన యొక్క; పరాక్రమంబునన్ = పరాక్రమముతో; జాంబవతీదేవిన్ = జాంబవతీదేవిని; పరిగ్రహించి = చేపట్టి; రాజు = రాజు (ఉగ్రసేనుని); సభ = కొలువున; కున్ = కు; సత్రాజిత్తున్ = సత్రాజిత్తుని; పిలిపించి = రప్పించి; తత్ = ఆ యొక్క; వృత్తాంతంబు = జరిగిన కథను; అంతయున్ = సమస్తమును; ఎఱిగించి = తెలిపి; సత్రాజిత్తున్ = సత్రాజిత్తుని; కున్ = కి; మణిన్ = రత్నమును; ఇచ్చెన్ = ఇచ్చివేసెను; అతండును = అతను కూడ; సిగ్గుపడి = సిగ్గుపడి; మణిన్ = రత్నమును; పుచ్చుకొని = తీసుకొని; పశ్చాత్తాపంబున్ = జరిగిదానికి బాధ; ఒందుచున్ = పొందుతు; బలవత్ = బలవంతునితో; విరోధంబున్ = శత్రుత్వమున; కున్ = కు; వెఱచుచు = బెదురుతు; ఇల్లు = నివాసమున; కిన్ = కి; చని = వెళ్ళి;
భావము:- ఈలాగున శ్రీకృష్ణుడు తన పరాక్రమంతో జాంబవతీదేవిని చేపట్టి, రాజసభకు సత్రాజిత్తును రప్పించి, జరిగిన విషయమంతా చెప్పి, మణిని అతనికి అప్పగించాడు. సత్రాజిత్తు సిగ్గుపడి మణిని తీసుకుని పశ్చాత్తాపం చెందాడు. బలవంతుడితో విరోధం వచ్చిందే అని భయపడుతూ ఇంటికి చేరాడు.

తెభా-10.2-77-క.
"పాపాత్ముల పాపములం
బాపంగా నోపునట్టి ద్మాక్షునిపైఁ
బాము గల దని నొడివిన
పాపాత్ముని పాపమునకుఁ బారము గలదే?

టీక:- పాపాత్ముల = పాపబుద్ధి కలవారి; పాపములన్ = పాపములను; పాపంగాన్ = పోగొట్టుటకు; ఓపున్ = సామర్థ్యము కలిగిన; అట్టి = అటువమటి; పద్మాక్షుని = కృష్ణుని; పైన్ = మీద; పాపమున్ = తప్పు; కలదు = ఉన్నది; అని = అని; నొడివిన = చెప్పిన; పాపాత్ముని = పాపాత్ముని; పాపమున్ = పాపమున; కున్ = కు; పారము = అంతు; కలదే = ఉన్నదా, లేదు.
భావము:- “పాపాత్ములైన వారి పాపాలన్నిటినీ పోగొట్టగలిగిన వాడు అయిన ఆ పద్మాలవంటి కన్నులున్న శ్రీకృష్ణుడి మీదనే అపనిందవేశాను. ఈ నా పాపానికి అంతం ఉందా?

తెభా-10.2-78-మ.
మిభాషిత్వము మాని యేల హరిపై మిథ్యాభియోగంబు సే
సితిఁ? బాపాత్ముఁడ, నర్థలోభుఁడను, దుశ్చిత్తుండ, మత్తుండ, దు
ర్మతి నీ దేహముఁ గాల్పనే? దురితమే మార్గంబునం బాయు? నే
తిఁ గంసారి ప్రసన్నుఁ డై మనుచు నన్ గారుణ్య భావంబునన్?

టీక:- మిత = తగినంత వరకు మాత్రమే; భాషిత్వమున్ = మాటలాడు స్వభావము; మాని = వదలిపెట్టి; ఏలన్ = ఎందుకు; హరి = కృష్ణుని; పైన్ = మీద; మిథ్యాభియోగంబు = అసత్యపు ఆరోపణ, లేనినింద; చేసితిన్ = చేసాను; పాపాత్ముడన్ = పాపిని; అర్థ = ధనము నందు; లోభుడను = అత్యాశ కలవాడిని; దుః = చెడ్డ; చిత్తుండను = ఆలోచనలు కలవాడిని; మత్తుండ = ఒళ్ళు తెలియని గర్విష్ఠిని; దుర్మతిన్ = చెడ్డబుద్ధి కలవాడిని; ఈ = ఇట్టి; దేహమున్ = పుట్టుక; కాల్పనే = తగులబెట్టుటకా; దురితము = పాపము; ఏ = ఏ; మార్గంబునన్ = విధముగా; పాయునే = తొలగును; ఏ = ఏ; గతిన్ = విధముగా; కంసారి = కృష్ణుడు {కంసారి - కంసుని శత్రువు, కృష్ణ}; ప్రసన్నుడు = సంతోషించినవాడు; ఐ = అయ్యి; మనుచున్ = పాలించును; నన్ = నన్ను; కారుణ్య = దయగల; భావంబునన్ = తలపుతోటి.
భావము:- మౌనంగా ఊరుకోకుండా, ఎందుకు కృష్ణుడిపై నిందవేశాను? నేను పాపాత్ముడను, ధనాశాపరుడును, దుష్టుడను, దుర్మతిని, మత్తుడను, ఈ నా శరీరం కాల్చనా? నా పాపం ఏవిధంగా తొలగిపోతుంది? ఏరీతిగా శ్రీకృష్ణుడు ప్రసన్నుడై నన్నుకనికరంతో రక్షిస్తాడు?

తెభా-10.2-79-ఆ.
ణిని గూఁతు నిచ్చి మాధవు పదములు
ట్టుకొంటినేని బ్రదుకు గలదు
సంతసించు నతఁడు దుపాయమగు నిది
త్య మితర వృత్తిఁ క్కఁబడదు. "

టీక:- మణిన్ = శమంతకమణిని; కూతున్ = పుత్రికను; ఇచ్చి = సమర్పించి; మాధవు = కృష్ణుని {మాధవుడు - మాధవి (లక్ష్మీదేవి) భర్త, విష్ణువు}; పదములు = కాళ్ళు; పట్టుకొంటినేని = పట్టుకొంటే; బ్రదుకు = జీవనము; కలదు = ఉండును; సంతసించున్ = సంతోషించును; అతడున్ = అతను; సత్ = మంచి; ఉపాయము = ఉపాయము; అగు = ఔను; ఇది = ఇది; సత్యము = నిజానికి; ఇతర = మరొక; వృత్తిన్ = విధముతో; చక్కబడదు = సరికాదు.
భావము:- ఈ శమంతకమణినీ, మణితోపాటు నా కూతురినీ ఇచ్చి మాధవుడి పాదాలు పట్టుకుంటాను. అప్పుడే నా జీవితం చక్కన అవుతుంది. కృష్ణుడు సంతోషిస్తాడు. మరేం చేసినా ఈ పరిస్థితి చక్కబడదు. ఇది సత్యం.”