పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సత్యభామా పరిణయంబు

వికీసోర్స్ నుండి

సత్యభామా పరిణయంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/సత్యభామా పరిణయంబు)
రచయిత: పోతన



తెభా-10.2-80-మ.
ని యిబ్భంగి బహుప్రకారముల నేకాంతస్థుఁడై యింటిలోఁ
బుద్ధిం బరికించి నీతి గని, సత్రాజిత్తు సంప్రాప్త శో
నుఁడై యిచ్చె విపత్పయోధితరికిన్ భామామనోహారికిన్
నుజాధీశవిదారికిన్ హరికిఁ గాంతారత్నమున్ రత్నమున్.

టీక:- అని = అని; ఈ = ఈ; భంగిన్ = విధముగా; బహు = అనేక; ప్రకారములన్ = విధములుగా; ఏకాంతస్థుడు = ఒంటరిగా ఉన్నవాడు; ఐ = అయ్యి; ఇంటి = గృహము; లోన్ = లోపల; తన = తన యొక్క; బుద్ధిన్ = బుద్ధితో; పరికించి = విచారించి; నీతిన్ = న్యాయవర్తనను; కని = తెలిసికొని; సత్రాజిత్తు = సత్రాజిత్తు; సంప్రాప్త = పొందిన; శోభనుడు = శోభ కలవాడు; ఐ = అయ్యి; ఇచ్చెన్ = ఇచ్చెను; విపత్పయోధితరి = కృష్ణుని {విపత్పయోధి తరి - విపత్తు (ఆపదలనెడి) పయోధి (సముద్రమును) తరి (దాటించువాడు), విష్ణువు}; కిన్ = కి; భామామనోహారి = కృష్ణుని {భామా మనోహారి - భామా (స్త్రీల) మనః (మనస్సులను) హారి (హరించువాడు), కృష్ణుడు}; కిన్ = కి; దనుజాధీశవిదారి = కృష్ణుని {దనుజాధీశ విదారి - దనుజా (రాక్షస) అధీశ (రాజులను) విదారి (చంపువాడు), విష్ణువు}; కిన్ = కి; హరి = కృష్ణుని; కిన్ = కి; కాంతా = యువతులలో; రత్నమున్ = శ్రేష్ఠురాలిని; రత్నమున్ = మణిని.
భావము:- ఇలా సత్రాజిత్తు రకరకాలుగా తన ఇంట్లో ఏకాంతంగా ఆలోచించుకొని, చేయవలసినది నిశ్చయించుకుని స్థిమిత పడి. ఆపదలనే సముద్రాలను తరింపచేసేవాడూ, కాంతల హృదయాలను దోచేవాడూ, రాక్షసేంద్రులను సంహరించేవాడూ అయిన శ్రీకృష్ణుడికి తన పుత్రికారత్నం సత్యభామనూ, శమంతకమణిని సమర్పించాడు

తెభా-10.2-81-ఉ.
తారసాక్షుఁ డచ్యుతుఁ డుదారయశోనిధి పెండ్లియాడె నా
నా నుజేంద్ర నందిత గుస్థితి లక్షణ సత్యభామ ను
ద్దా పతివ్రతాత్వ నయ ర్మ విచక్షణతా దయా యశః
కాను సత్యభామను ముద్యుతినిర్జితసోమ నయ్యెడన్.

టీక:- తామరసాక్షుడు = కృష్ణుడు {తామర సాక్షుడు - కమలముల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; అచ్యుతుడు = కృష్ణుడు {అచ్యుతుడు - చ్యుతము (నాశము) లేనివాడు, విష్ణువు}; ఉదారయశోనిధి = కృష్ణుడు {ఉదార యశోనిధి - ఉదార (అధికమైన) యశః (కీర్తి)కి నిధి సముద్రము వంటివాడు, విష్ణువు}; పెండ్లియాడె = వివాహమాడెను; నానా = అనేకులైన; మనుజేంద్ర = రాజులచే; నందిత = కీర్తింపబడిన; గుణస్థితి = సద్గుణములు కలిగిన ఆమెను; లక్షణన్ = మంచి లక్షణములు కలామెను; సత్యభామను = సత్యభామను; ఉద్దామ = ఘనమైన; పతివ్రతాత్వ = పాతివ్రత్య మనెడి; నయ = నీతి తోటి; ధర్మ = ధర్మము నందు; విచక్షణ = విచక్షణ; దయా = దయను; యశః = కీర్తిని; కామను = కోరు నామెను; సత్యభామను = సత్యభామను; ముఖ = మోము యొక్క; ద్యుతి = కాంతిచేత; నిర్జిత = ఓడింపబడిన; సోమన్ = చంద్రుడు కలామెను; ఆ = ఆ; ఎడన్ = సమయము నందు.
భావము:- పద్మనేత్రుడు అచ్యుతుడు మిక్కిలి కీర్తిశాలి అయిన శ్రీకృష్ణుడు; సకలరాజులచే సద్గుణవతిగా కీర్తింపబడి, గొప్ప పాతివ్రత్యమూ నీతి ధర్మవిచక్షణత్వమూ దయ కీర్తికాంక్ష కలిగిన ఆ చంద్రముఖిని సత్యభామను పెండ్లాడాడు.

తెభా-10.2-82-క.
"మణి యిచ్చినాఁడు వాసర
ణి నీకును; మాకుఁ గలవు ణులు; కుమారీ
ణి చాలు నంచుఁ గృష్ణుఁడు
ణి సత్రాజిత్తునకును రలఁగ నిచ్చెన్. "

టీక:- మణిన్ = రత్నమును; ఇచ్చినాడు = ఇచ్చాడు; వాసరమణి = సూర్యుడు {వాసర మణి - వాసర (దినమునకు) మణి, సూర్యుడు}; నీ = నీ; కును = కు; మా = మా; కున్ = కు; కలవు = ఉన్నాయి; మణులు = రత్నాలు; కుమారీ = కన్యకా; మణి = ఉత్తమురాలు; చాలున్ = చాలును; అంచున్ = అని; కృష్ణుడు = కృష్ణుడు; మణిన్ = రత్నమును; సత్రాజిత్తున్ = సత్రాజిత్తున; కున్ = కు; మరల = మరలగ, తిరిగి; ఇచ్చెన్ = ఇచ్చివేసెను.
భావము:- “ఈ శమంతకమణిని సూర్యభగవానుడు నీకు ప్రసాదించాడు. మాకు మణులకు కొదువ లేదు. ఈ కన్యామణి చాలు” అని శ్రీకృష్ణుడు శమంతకమణిని తిరిగి సత్రాజిత్తునకు ఇచ్చివేశాడు.

తెభా-10.2-83-వ.
అంత నక్కడఁ గుంతీసహితులయిన పాండవులు లాక్షాగారంబున దగ్ధులైరని విని నిఖిలార్థ దర్శనుండయ్యును, గృష్ణుండు బలభద్ర సహితుండై కరినగరంబునకుం జని కృప విదుర గాంధారీ భీష్మ ద్రోణులం గని దుఃఖోపశమనాలాపంబు లాడుచుండె; నయ్యెడ.
టీక:- అంతన్ = పిమ్మట; అక్కడ = అక్కడ (హస్తినలో); కుంతీ = కుంతీదేవితో; సహితులు = కూడినవారు; అయిన = అగు; పాండవులు = పాండవులు; లాక్ష = లక్క; ఆగారంబునన్ = ఇంటిలో; దగ్ధులు = కాలిపోయిరి; అని = అని; విని = విని; నిఖిల = సర్వ; అర్థ = విషయములు; దర్శనుండు = తెలిసినవాడు; అయ్యును = అయినప్పటికి; కృష్ణుండు = కృష్ణుడు; బలభద్ర = బలరామునితో; సహితుండు = కూడినవాడు; ఐ = అయ్యి; కరినగరంబున్ = హస్తినాపురమున; కున్ = కు; చని = వెళ్ళి; కృప = కృపుడు; విదుర = విదురుడు; గాంధారీ = గాంధారిని { గాంధారి (గాంధార దేశపు రాజుగు సుబలుని కుమార్తె) }; భీష్మ = భీష్ముడు; ద్రోణులన్ = ద్రోణాచార్యులను; కని = చూసి; దుఃఖ = దుఃఖము; ఉపశమన = తగ్గించెడి; ఆలాపంబులు = పలుకులు; ఆడుచుండెన్ = పలుకుచుండెను; ఆ = ఆ; ఎడన్ = సమయము నందు.
భావము:- ఇంతలో అక్కడ లక్కఇంటిలో పాండవులు కుంతీ సహితంగా దగ్ధమయ్యారు అని శ్రీకృష్ణుడు విన్నాడు. సర్వము తెలిసిన వాడై కూడా, ఆయన బలరాముడి తోపాటు హస్తినాపురానికి వెళ్ళి కృప, విదుర, గాంధారీ, భీష్మ, ద్రోణులను ఓదార్చాడు