పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శతధన్వుఁడు మణి గొనిపోవుట
శతధన్వుఁడుమణిగొనిపోవుట
←సత్యభామా పరిణయంబు | తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శతధన్వుఁడు మణి గొనిపోవుట) రచయిత: పోతన |
శతధన్వుని ద్రుంచుట→ |
(తెభా-10.2-84-సీ.)[మార్చు]
జగతీశ! విన వయ్య శతధన్వుఁ బొడగని;
యక్రూర కృతవర్మ లాప్తవృత్తి
మన కిత్తు ననుచు సమ్మతిఁ జేసి తన కూఁతుఁ;
బద్మాక్షునకు నిచ్చి పాడి దప్పె
ఖలుఁడు సత్రాజిత్తుఁ, డలయ కే క్రియ నైన;
మణిపుచ్చుకొనుము నీమతము మెఱసి
యని తన్నుఁ బ్రేరేఁప నా శతధన్వుఁడు;
పశువుఁ గటికివాఁడు పట్టి చంపు
(తెభా-10.2-84.1-ఆ.)[మార్చు]
కరణి నిదురవోవఁ గడఁగి సత్రాజిత్తుఁ
బట్టి చంపి, వాని భామ లెల్ల
మొఱలువెట్ట లోభమునఁ జేసి మణి గొంచుఁ
జనియె నొక్క నాఁడు జనవరేణ్య!
(తెభా-10.2-85-వ.)[మార్చు]
ఇట్లు హతుం డైన తండ్రిం గని శోకించి సత్యభామ యతనిం దైలద్రోణియందుఁ బెట్టించి హస్తిపురంబునకుం జని సర్వజ్ఞుండైన హరికి సత్రాజిత్తు మరణంబు విన్నవించిన హరియును బలభద్రుండు నీశ్వరులయ్యును మనుష్య భావంబుల విలపించి; రంత బలభద్ర సత్యభామా సమేతుండై హరి ద్వారకా నగరంబునకు మరలివచ్చి శతధన్వుం జంపెద నని తలంచిన; నెఱింగి శతధన్వుండు ప్రాణభయంబునఁ గృతవర్ము నింటికిం జని తనకు సహాయుండవు గమ్మని పలికినం గృతవర్మ యిట్లనియె.
(తెభా-10.2-86-ఉ.)[మార్చు]
అ క్కట! రామకృష్ణులు మహాత్ములు వారల కెగ్గు సేయఁగా
ని క్కడ నెవ్వఁ డోపు? విను మేర్పడఁ గంసుఁడు బంధుయుక్తుఁడై
చి క్కఁడె? మున్ను మాగధుఁడు సేనలతోఁ బదియేడు తోయముల్
ది క్కులఁ బాఱఁడే! మనకు దృష్టము, వారల లావు వింతయే?
(తెభా-10.2-87-వ.)[మార్చు]
అని యుత్తరంబు సెప్పిన విని శతధన్వుం డక్రూరుని యింటికిం జని హరితోడ పగకుందోడు రమ్మని చీరిన నక్రూరుండు హరి బలపరాక్రమ ధైర్యస్థైర్యంబు లుగ్గడించి మఱియు నిట్లనియె.
(తెభా-10.2-88-సీ.)[మార్చు]
ఎవ్వఁడు విశ్వంబు నెల్ల సలీలుఁడై;
పుట్టించు రక్షించుఁ బొలియఁ జేయు,
నెవ్వనిచేష్టల నెఱుఁగరు బ్రహ్మాదు;
లెవ్వని మాయ మోహించు భువన,
మేడేండ్లపాపఁడై యే విభుఁ డొకచేత;
గో రక్షణమునకై కొండ నెత్తె,
నెవ్వఁడు కూటస్థుఁ డీశ్వరుఁ డద్భుత;
కర్ముఁ డనంతుండు కర్మసాక్షి,
(తెభా-10.2-88.1-తే.)[మార్చు]
యట్టి ఘనునకు శౌరికి ననవరతము
మ్రొక్కెదము గాక; విద్వేషమునకు నేము
వెఱతు మొల్లము నీ వొండు వెంటఁ బొమ్ము
చాలు పదివేలువచ్చె నీ సఖ్యమునను.
21-05-2016: :
గణనాధ్యాయి 10:22, 12 డిసెంబరు 2016 (UTC)