Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శతధన్వుని ద్రుంచుట

వికీసోర్స్ నుండి

శతధన్వునిద్రుంచుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శతధన్వుని ద్రుంచుట)
రచయిత: పోతన



తెభా-10.2-89-వ.
అని యిట్లక్రూరుం డుత్తరంబు పలికిన నమ్మహామణి యక్రూరుని యొద్ద నునిచి, వెఱచి శతధన్వుండు తురగారూఢుండై శతయోజన దూరంబు సనియె; గరుడ కేతనాలంకృతంబైన తేరెక్కి రామ కృష్ణులు వెనుచని; రంత నతండును మిథిలానగరంబుఁజేరి తత్సమీపంబు నందు.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; అక్రూరుడు = అక్రూరుడు; ఉత్తరంబున్ = బదులు; పలికినన్ = చెప్పగా; ఆ = ఆ ప్రసిద్ధమైన; మహా = గొప్ప; మణిన్ = రత్నమును; అక్రూరుని = అక్రూరుని; ఒద్దను = దగ్గర; ఉనిచి = ఉంచి; వెఱచి = భయపడి; శతధన్వుండు = శతధన్వుడు; తురగ = గుఱ్ఱము; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; శత = నూరు (100); యోజన = ఆమడల; దూరంబున్ = దూరము; చనియెన్ = పోయెను; గరుడ = గరుడుని చిత్రించిన; కేతన = జండాచే; అలంకృతంబు = అలంకరింపబడినది; ఐన = అయిన; తేరు = రథమును; ఎక్కి = ఎక్కి; రామ = బలరాముడు; కృష్ణులు = కృష్ణులు; వెను = వెంబడించి; చనిరి = పోయిరి; అంతన్ = అంతట; అతండును = అతనుకూడ; మిథిలా = మిథిల అనెడి; నగరంబున్ = పట్టణము; చేరి = దగ్గరకుపోయి; తత్ = దాని; సమీపంబున్ = దగ్గర; అందున్ = లో;
భావము:- ఆ విధంగా అక్రూరుడు అనగానే, శతధన్వుడు శమంతకమణిని అక్రూరుడికి ఇచ్చి, భయంతో గుఱ్ఱమెక్కి నూరుయోజనల దూరం పారిపోయాడు. గరుడధ్వజం వెలుగొందే రథం ఎక్కి రామకృష్ణులు అతనిని వెంటాడారు. శతధన్వుడు మిథిలానగరం చేరాడు.

తెభా-10.2-90-చ.
తుగము డిగ్గి తల్లడముతో శతధన్వుఁడు పాదచారియై
రువిడఁ బోకు పోకు మని ద్మదళాక్షుఁడు గూడఁ బాఱి భీ
గతి వాని మస్తకము ఖండితమై పడ వ్రేసెఁ జక్రముం
రిహతదైత్యచక్రముఁ బ్రభాచయ మోదితదేవశక్రమున్.

టీక:- తురగము = గుఱ్ఱము; డిగ్గి = దిగిపోయి; తల్లడము = భయము, తల్లడపాటు; తోన్ = తోటి; శతధన్వుడు = శతధన్వుడు; పాదచారి = కాలినడకన పోవువాడు; ఐ = అయ్యి; పరువిడన్ = పరుగెత్తగా; పోకుపోకుము = పారిపోకుము; అని = అని; పద్మదళాక్షుడు = కృష్ణుడు; కూడన్ = వెనువెంట; పాఱి = పరుగెట్టిపోయి; భీకర = భయంకరమైన; గతిన్ = విధముగ; వాని = అతని; మస్తకము = తల; ఖండితము = తెగిపడినది; ఐ = అయ్యి; పడన్ = పడిపోవునట్లు; వ్రేసెన్ = ప్రయోగించెను; చక్రమున్ = చక్రమును (సుదర్శనం); పరిహత = సంహరింపబడిన; దైత్య = రాక్షస; చక్రమున్ = సమూహము కలదానిని; ప్రభా = కాంతుల; చయ = సమూహముచేత; మోదిత = సంతోషింప జేయబడిన; దేవ = దేవతలు; శక్రమున్ = ఇంద్రుడు కలదానిని.
భావము:- అక్కడ శతధన్వుడు గుఱ్ఱం దిగి వేగంగా పరిగెత్తుతుండగా, శ్రీకృష్ణుడు “పోకు పోకు” అంటూ అతడిని వెంటాడి, రాక్షసులను సంహరించేదీ, దేవతలను తన ప్రభలతో సంతోషింపజేసేది అయిన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ చక్రఘాతానికి శతధన్వుడి శిరస్సు భయంకరంగా తెగి క్రింద పడింది.

తెభా-10.2-91-వ.
ఇట్లు హరి శతధన్వుని వధియించి వాని వస్త్రంబులందు మణి వెదకి లేకుండటఁ దెలిసి బలభద్రునికడకు వచ్చి “శతధన్వుం డూరక హతుం డయ్యె, మణి లే” దనిన బలభద్రుం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; హరి = కృష్ణుడు; శతధన్వుని = శతధన్వుని; వధియించి = చంపి; వాని = అతని; వస్త్రంబులు = బట్టల; అందున్ = లో; మణి = రత్నము; వెదకి = వెతికి; లేకుండుట = లేకపోవుట; తెలిసి = తెలిసికొని; బలభద్రుని = బలరాముని; కడ = వద్ద; కున్ = కు; వచ్చి = సమీపించి; శతధన్వుండు = శతధన్వుడు; ఉరక = వ్యర్థముగా, అనవసరంగా; హతుండు = చంపబడినవాడు; అయ్యెన్ = అయ్యెను; మణి = రత్నము; లేదు = లేదు; అనినన్ = అని చెప్పగా; బలభద్రుండు = బలరాముడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- శ్రీకృష్ణుడు శతధన్వుడిని సంహరించి అతని దగ్గర వెతికాడు కాని, శమంతకమణి కన్పించలేదు. అంతట బలరాముడి దగ్గరకు వచ్చి “శతధన్వుడు అనవసరంగా చచ్చిపోయాడు. అతడి దగ్గర మణి లేదు” అని చెప్పాడు. అప్పుడు బలరాముడు ఇలా అన్నాడు.

తెభా-10.2-92-సీ.
" మణి శతధన్వుఁ పహరించుట నిక్క-
మెవ్వరిచే దాఁప నిచ్చినాఁడొ?
వేగమె నీ వేఁగి వెదకుము పురిలోన-
వైదేహు దర్శింప వాంఛ గలదు,
పోయి వచ్చెద, నీవు పొ"మ్మని వీడ్కొని-
మెల్లన రాముండు మిథిలఁ జొచ్చి
పోయిన జనకుండు పొడగని హర్షించి-
యెంతయుఁ బ్రియముతో నెదురు వచ్చి

తెభా-10.2-92.1-తే.
ర్ఘ్యపాద్యాది కృత్యంబు లాచరించి
యిచ్చగించిన వస్తువు లెల్ల నిచ్చి
యుండు మని భక్తి చేసిన నుండె ముసలి;
కువలయేశ్వర! మిథిలలోఁ గొన్ని యేండ్లు.

టీక:- ఆ = ఆ ప్రసిద్ధమైన; మణిన్ = రత్నమును; శతధన్వుడు = శతధన్వుడు; అపహరించుట = దొంగతనము చేయుట; నిక్కము = నిజము; ఎవ్వరి = ఎవరి; చేన్ = చేతికి; దాపన్ = దాచుటకు; ఇచ్చినాడొ = ఇచ్చెనో; వేగమె = శీఘ్రమే; నీవు = నీవు; ఏగి = వెళ్ళి; వెదకుము = అన్వేషించుము; పురి = పట్టణము; లోనన్ = లోపల; వైదేహున్ = జనకరాజుని {వైదేహుడు - విదేహరాజ్యమునకు ప్రభువు, జనకుడు}; దర్శింపన్ = చూడవలెనని; వాంఛ = కోరిక; కలదు = కలిగినది; పోయి = వెళ్ళి; వచ్చెదన్ = వస్తాను; నీవు = నీవు; పొమ్ము = వెళ్ళు; అని = అని; వీడ్కొని = సెలవిచ్చి; మెల్లనన్ = తిన్నగా; రాముండు = బలరాముడు; మిథిలన్ = మిథిలానగరమును {మిథిలానగరము - విదేహరాజ్య ముఖ్యపట్టణము}; చొచ్చి = లోనికి ప్రవేశించి; పోయినన్ = వెళ్ళగా; జనకుండు = జనకుడు; పొడగని = చూసి; హర్షించి = సంతోషించి; ఎంతయున్ = మిక్కిల; ప్రియము = ఇష్టము; తోన్ = తోటి; ఎదురు = ఎదురుగా; వచ్చి = వచ్చి; అర్ఘ్య = అర్ఘ్యమిచ్చుట {అర్ఘ్యము - పూజకొఱకైనది, అష్టార్ఘ్యములు - 1పెరుగు 2తేనె 3నెయ్యి 4అక్షతలు 5గఱిక 6నువ్వులు 7దర్భలు 8పుష్పము అను పూజకొరకైనది}; పాద్య = పాద్యమిచ్చుట {పాద్యము - కాళ్ళు కొరకైనది, జలాదికము}; ఆది = మున్నగు; కృత్యంబులు = పనులు; ఆచరించి = చేసి; ఇచ్చగించిన = కోరిన; వస్తువులు = పదార్థములు; ఎల్లన్ = అన్నిటిని; ఇచ్చి = ఇచ్చి; ఉండుము = ఇక్కడ ఉండుము; అని = అని; భక్తిన్ = సేవించుట; చేసినన్ = చేయగా; ఉండెన్ = ఉండెను; ముసలి = బలరాముడు {ముసలి - ముసలము ఆయుధముగా కలవాడు, బలరాముడు}; కువలయేశ్వర = రాజా {కువలయేశ్వరుడు - కువలయము (భూమండలము)నకు ఈశ్వరుడు, రాజు}; మిథిల = మిథిలానగరమున; కొన్ని = కొన్ని; ఏండ్లు = సంవత్సరములు.
భావము:- “శమంతకమణిని శతధన్వుడు అపహరించడం నిజం. ఎవరికి దాచిపెట్టమని ఇచ్చాడో? ఏమిటో? నీవు వెంటనే ద్వారకకు వెళ్ళి మణి కోసం అన్వేషించు. నాకు విదేహ దేశ ప్రభువు అయిన జనకుడిని చూడాలనే కోరిక కలిగింది. నేను వెళ్ళివస్తాను. నీవు ద్వారకకు వెళ్ళు.” అని చెప్పి, శ్రీకృష్ణుడిని పంపించి, మిథిలానగరమునకు వెళ్ళాడు. బలరాముడికి జనకమహారాజు ఆర్ఘ్యపాద్యాది విధులతో సత్కారాలు చేసి అభీష్ట వస్తువులను ఇచ్చి అక్కడ ఉండమని ప్రార్థించాడు. బలరాముడు కొన్ని ఏళ్ళు మిథిలానగరంలో ఉన్నాడు.

తెభా-10.2-93-వ.
అంత దుర్యోధనుండు మిథిలానగరంబునకుం జనుదెంచి జనకరాజుచేత సమ్మానితుండై.
టీక:- అంతన్ = అంతట; దుర్యోధనుండు = దుర్యోధనుడు; మిథిలా = మిథిలా అనెడి; నగరంబున్ = పట్టణమున; కున్ = కు; చనుదెంచి = వచ్చి; జనకరాజు = జనకరాజు; చేత = చేత; సమ్మానితుండు = గౌరవింపబడినవాడు; ఐ = అయ్యి.
భావము:- ఆ సమయంలో దుర్యోధనుడు మిథిలకు వెళ్ళి జనకుని చేత గౌరవింపబడి...