పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/షోడశసహస్ర స్త్రీ సంగతంబు

వికీసోర్స్ నుండి

షోడశసహస్ర స్త్రీ సంగతంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/షోడశసహస్ర స్త్రీ సంగతంబు)
రచయిత: పోతన


తెభా-10.2-612-వ.
అని యభ్యర్థించి యద్దేవునివలనం బ్రసన్నత వడసి, తన్మందిరంబు వెడలి మునివరుం డమ్మహాత్ముని యోగమాయాప్రభావంబు దెలియంగోరి, వేఱొక చంద్రబింబాననాగేహంబునకుం జని యందు నెత్తమాడుచున్న పురుషోత్తము నుద్ధవ యుతుం గని యద్భుతంబు నొందుచు నతనిచేత సత్కృతుండై యచ్చోట వాసి చని.
టీక:- అని = అని; అభ్యర్దించి = వేడుకొని; ఆ = ఆ; దేవుని = భగవంతుని; వలనన్ = వలన; ప్రసన్నతన్ = అనుగ్రహమును; పడసి = పొంది; తత్ = ఆ; మందిరంబున్ = ఇంటినుండి; వెడలి = బయటకువచ్చి; ముని = యోగి; వరుండు = ఉత్తముడు; ఆ = ఆ ప్రసిద్ధుడైన; మహాత్ముని = గొప్పమహిమ కలవాని యొక్క; యోగ = యోగము యొక్క; మాయా = మహిమల; ప్రభావంబున్ = ప్రభావమును; తెలియన్ = తెలిసికొన; కోరి = తలచి; వేఱు = మరింక; ఒక = ఒక; చంద్రబింబాననా = స్త్రీ యొక్క; గేహంబున్ = ఇంటి; కున్ = కి; చని = వెళ్ళి; అందున్ = దానిలో; నెత్తము = పాచికలు; ఆడుచున్న = ఆడుతున్నట్టి; పురుషోత్తమునున్ = కృష్ణుని; ఉద్ధద్దవ = ఉద్ధవునితో; యుతున్ = కూడి ఉన్నవానిని; కని = చూసి; అద్భుతంబున్ = ఆశ్చర్యమును; ఒందుచున్ = పొందుతు; అతని = ఆ కృష్ణుని; చేత = చేత; సత్కృతుండు = సన్మానింపబడినవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; చోటన్ = తావును; పాసి = విడిచి; చని = పోయి.
భావము:- ఆ విధంగా ప్రార్థించి నారదుడు శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాడు. ఆ మందిరం నుంచి బయటకు వచ్చిన ఆ దేవర్షి వాసుదేవుడి యోగమాయా ప్రభావం తెలుసుకోదలచాడు. వేరొక వాల్గంటి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఉద్ధవునితో కలసి జూదమాడుతూ ఉన్న శ్రీకృష్ణుడిని తిలకించి ఆశ్చర్యచకితుడు అయ్యాడు. అక్కడ కృష్ణుడిచేత పూజించబడి ఆ భవనం నుండి బయటకు వెళ్ళాడు.

తెభా-10.2-613-క.
మునివరుఁడు కాంచె నొండొక
జాయతనేత్ర నిజనివాసంబున నం
యుతు జిష్ణు సహిష్ణున్
వినుతగుణాలంకరిష్ణు విష్ణుం గృష్ణున్.

టీక:- ముని = యోగి; వరుడు = సత్తముడు; కాంచెన్ = చూసెను; ఒండు = మరింక; ఒక = ఒక; వనజాయతనేత్ర = సుందరి యొక్క {వనజాయతనేత్ర - వనజ (పద్మము వలె) ఆయత (విస్తారమైన) నేత్రములు కల స్త్రీ}; నిజనివాసంబునన్ = ఇంటిలో; నందన = కొడుకులతో; యుతున్ = కూడి ఉన్నవానిని; జిష్ణున్ = జయశీలుని; సహిష్ణున్ = సహనశీలుని; వినుత = కొనియాడదగిన; గుణ = సుగుణాలచేత; అలంకరిష్ణున్ = అలంకరింపబడినవాడు; విష్ణున్ = సర్వవ్యాపక శీలుని; కృష్ణున్ = కృష్ణుని.
భావము:- నారదుడు మరింకొక సుందరి మందిరానికి వెళ్ళాడు. అక్కడ నందనులతో కలసి ఆనందిస్తున్న కలువ కన్నుల కన్నయ్యను సందర్శించాడు.

తెభా-10.2-614-క.
నాదుఁ డట చని కనె నొక
వారిజముఖియింట నున్నవాని మురారిన్
హారిన్ దానవకుల సం
హారిం గమలామనోవిహారిన్ శౌరిన్.

టీక:- నారదుడు = నారదుడు; అట = అక్కడనుండి; చని = వెళ్ళి; కనెన్ = చూసెను; ఒక = ఒకానొక; వారిజముఖి = పద్మాక్షి యొక్క; ఇంటన్ = ఇంటిలో; ఉన్నవానిన్ = ఉన్నవాడిని; మురారిన్ = కృష్ణుని {మురారి - మురాసురుని సంహరించినవాడు, కృష్ణుడు}; హారిన్ = ముత్యాలహారాలు ధరించినవానిని; దానవ = రాక్షస; కుల = వంశమును; సంహారిన్ = చంపువానిని; కమలా = లక్ష్మీదేవి యొక్క; మనః = మనస్సు నందు; విహారిన్ = విహరించువానిని; శౌరిన్ = కృష్ణుని {శౌరి - శూరుని మనుమడు, కృష్ణుడు}.
భావము:- నారదముని వేరొక పద్మాక్షి సౌధానికి వెళ్ళి అక్కడ ఉన్న దానవాంతకుడు అయిన కృష్ణుడిని దర్శించాడు.

తెభా-10.2-615-వ.
ఇట్లు కనుంగొనుచుం జనుచుండ నొక్కయెడ నమ్మునీంద్రునకు ముకుందుండు ప్రత్యుత్థానంబు చేసి “మునీంద్రా! సంపూర్ణకాము లయిన మిమ్ము నపూర్ణకాములమైన మేమేమిటఁ బరితృప్తి నొందఁ జేయంగలవారము? భవదీయదర్శనంబున నిఖిలశోభనంబుల నందెద” మని ప్రియపూర్వకంబుగాఁ బలికిన నా నందనందను మాటలకు నానంద కందళిత హృదయారవిందుండును, మందస్మిత సుందర వదనారవిందుండును నగుచు నారదుండు వెండియుఁ జనిచని.
టీక:- ఇట్లు = ఈ ప్రకారముగా; కనుంగొనుచున్ = చూచుచు; ఉండన్ = ఉండగా; ఒక్క = ఒకానొక; ఎడన్ = చోట; ఆ = ఆ; ముని = ఋషి; ఇంద్రున్ = ఉత్తముని; కున్ = కి; ముకుందుండు = కృష్ణుడు {ముకుందుడు - ముక్తిని ఇచ్చువాడు, విష్ణువు}; ప్రత్యుత్థానంబు = లేచి ఎదురువచ్చుట; చేసి = చేసి; ముని = ఋషి; ఇంద్రా = ఉత్తముడా; సంపూర్ణకాములు = తీరిన కోరికలు మాత్రమే కలవాడు; అయిన = ఐన; మిమ్మున్ = మిమ్ములను; అపూర్ణకాములము = తీరని కోరికలు కలవారము; ఐన = అయిన; మేమున్ = మేము; ఏమిటన్ = దేనితో; పరితృప్తిన్ = సంతృప్తిని; ఒందజేయగలవారము = కలిగించగలము; భవదీయ = నీ యొక్క; దర్శనంబునన్ = దర్శనము కలుగుటచేత; నిఖిల = సర్వ; శోభనంబులన్ = శుభములను; అందెదము = పొందెదము; అని = అని; ప్రియ = ఇష్టము; పూర్వకంబుగాన్ = నిండి ఉన్నట్టు; పలికిన = మాట్లాడిన; ఆ = ఆ; నందనందనున్ = కృష్ణుని {నందనందనుడు - నందుని కొడుకు, కృష్ణుడు}; మాటలు = మాటలు; కున్ = కు; ఆనంద = ఆనందముతో; కందళిత = విరిసిన; హృదయ = హృదయము అను; అరవిందుండును = పద్మము కలవాడు; మందస్మిత = చిరునవ్వు కల; సుందర = అందమైన; వదన = మోము అను; అరవిందుడును = పద్మము కలవాడు; అగుచున్ = ఔతు; నారదుండు = నారదుడు; వెండియున్ = ఇంకను; చనిచని = చాలా చోట్లకు పోయి.
భావము:- ఈవిధంగా వాసుదేవుని కనుగొంటూ వెళుతూ ఉన్న నారదుడిని కృష్ణుడు ఒక ఇంటిలో గౌరవించి “నారద మునీంద్రా! ఏ కోరికలూ లేని మిమ్ములను కోరికలు కల మేము ఏవిధంగా సంతృప్తి పరచగలం మీ దర్శనంతో సమస్త శుభాలనూ పొందుతాము.” అని ప్రీతి పూర్వకంగా పలికాడు. కృష్ణుడి మాటలకు మన స్ఫూర్తిగా సంతోషించి చిరునవ్వు నవ్వుతూ నారదుడు ముందుకు సాగిపోయాడు

తెభా-10.2-616-క.
ఘాత్ముఁడు గనుఁగొనె నొక
నితామణిమందిరమున నకేళీ సం
నితానందుని ననిమిష
విమితచరణారుణారవిందు ముకుందున్.

టీక:- అనఘాత్ముడు = పుణ్యాత్ముడు; కనుగొనెన్ = చూసెను; ఒక = ఒకానొక; వనితా = స్త్రీ; మణి = ఉత్తమురాలి; మందిరమునన్ = ఇంటిలో; వన = జల; కేళీ = విహారము వలన; సంజనిత = కలిగిన; ఆనందుని = సంతోషము కలవానిని; అనిమిష = దేవతలచేత; వినమిత = మొక్కబడిన; చరణ = పాదములు అను; అరుణ = ఎఱ్ఱని; అరవిందున్ = కలువలు కలవానిని; ముకుందున్ = కృష్ణుని.
భావము:- పుణ్యాత్ముడైన నారదుడు ఒక స్త్రీరత్నం ఇంటిలో జలకేళి సలుపుతూ ఆనందిస్తున్న దేవతలచే నమస్కరింపబడు పాదాలు గలవానిని, ముకుందుడిని చూసాడు.

తెభా-10.2-617-క.
మేష్ఠిసుతుఁడు గనె నొక
రుణీభవనంబు నందుఁ ను దాన మనోం
బురుహమునఁ దలఁచుచుండెడి
కాసురదమనశూరు నందకుమారున్.

టీక:- పరమేష్ఠిసుతుడు = నారదుడు {పరమేష్ఠి సుతుడు - బ్రహ్మదేవుని కొడుకు, నారదుడు}; కనెన్ = చూసెను; ఒక = ఒకానొక; తరుణీ = యువతి యొక్క; భవనంబున్ = ఇంటి; అందున్ = లో; తనున్ = తనను; తాన = తానే; మనః = మనస్సు అను; అంబురుహమునన్ = పద్మము నందు {అంబురుహము - అంబువు (నీటియందు) రుహము (పుట్టునది), పద్మము}; తలచుచున్ = విచారించుకొనుచు; ఉండెడి = ఉన్నట్టి; నరకాసుర = నరకాసురుని; దమన = సంహరించిన; శూరున్ = వీరుడిని; నందకుమారున్ = కృష్ణుని.
భావము:- నారదుడు మరొక తరుణీమణి ఇంటిలో తనలో తనను చూసుకుంటూ యోగనిష్ఠలో ఉన్న నరకాసురుని సంహరించిన శ్రీకృష్ణుడిని దర్శించాడు.

తెభా-10.2-618-వ.
మఱియుం జనిచని.
టీక:- మఱియున్ = ఇంకను; చనిచని = వెళ్ళి వెళ్ళి.
భావము:- ఇలా చూస్తూ నారదుడు ఇంకా ముందుకు వెళ్ళాడు.

తెభా-10.2-619-సీ.
కచోట నుచితసంధ్యోపాపనాసక్తు-
నొకచోటఁ బౌరాణికోక్తికలితు
నొకచోటఁ బంచయజ్ఞోచితకర్ముని-
నొకచోట నమృతోపయోగలోలు
నొకచోట మజ్జనోద్యోగానుషక్తుని-
నొకచోట దివ్యభూషోజ్జ్వలాంగు
నొకచోట ధేనుదానోత్కలితాత్ముని-
నొకచోట నిజసుతప్రకరయుక్తు

తెభా-10.2-619.1-తే.
నొక్క చోటను సంగీతయుక్త చిత్తు
నొక్కచోటను జలకేళియుతవిహారు
నొక్కచోటను సన్మంచకోపయుక్తు
నొక్కచోటను బలభద్రయుక్తచరితు.

టీక:- ఒక = ఒకానొక; చోటన్ = తావునందు; ఉచిత = తగినవిధంగా; సంధ్యోపాసనా = సంధ్యావందనముచేయుటందు; ఆసక్తున్ = ఆసక్తికనబరచువానిని; ఒక = ఒకానొక; చోటన్ = ప్రదేశమున; పౌరాణిక = పురాణముచెప్పువాని; ఉక్తిన్ = ప్రసంగమువినుటను; కలితున్ = కూడినవానిని; ఒక = ఒకానొక; చోటన్ = చోటునందు; పంచయజ్ఞ = పంచమహాయజ్ఞములుచేయుటకు {పంచమహాయజ్ఞములు - 1దేవయజ్ఞము 2పితృయజ్ఞము 3భూతయజ్ఞము 4మనుష్యయజ్ఞము 5బ్రహ్మయజ్ఞము, చూ. అనుయుక్తములు}; ఉచిత = తగిన; కర్ముని = పనులుచేయువానిని; ఒక = ఒకానొక; చోటన్ = స్థలమునందు; అమృత = నీటిని; ఉపయోగ = తాగుటందు; లోలున్ = లగ్నమైనవానిని; ఒక = ఒకానొక; చోటన్ = తావునందు; మజ్జన = స్నానముచేయు; ఉద్యోగ = ప్రయత్నమున; అనుషక్తుని = నిమగ్నమైనవానిని; ఒక = ఒకానొక; చోటన్ = తావున; దివ్య = గొప్ప; భూష = ఆభరణములచే; ఉజ్వల = మెరిసిపోతున్న; అంగున్ = దేహము కలవానిని; ఒక = ఒకానొక; చోటన్ = తావున; ధేను = పాడియావులను; దాన = దానముచేయుటందు; ఉత్కలిక = ఉత్సాహముకల; ఆత్మునిన్ = మనస్సుకలవానిని; ఒక = ఒకానొక; చోటన్ = తావున; నిజ = తన; సుత = పిల్లల; ప్రకర = సమూహముతో; యుక్తున్ = కూడి ఉన్నవానిని; ఒక్క = ఒకానొక; చోటన్ = తావున; సంగీత = పాటల కార్యక్రమమున; యుక్త = కూడిన; చిత్తున్ = మనస్సుకలవానిని; ఒక = ఒకానొక; చోటును = తావున; జలకేళీ = జలక్రీడ యందు; యుత = కూడిన; విహారున్ = విహారము కలవానిని; ఒక్క = ఒకానొక; చోటను = తావున; సన్మంచక = మంచి మంచయందు, సత్సంగమమున; ఉపయుక్తున్ = పాల్గొనుచున్నవానిని; ఒక్క = ఒకానొక; చోటను = తావున; బలభద్ర = బలరామునితో; యుక్త = కూడి; చరితున్ = చరించువానిని.
భావము:- ఒక ఇంటిలో సంధ్యావందనం చేస్తూ ఉన్న వాడిని; మరొక గృహంలో పురాణశ్రవణం చేస్తూ ఉన్న వాడిని; ఒక చోట పంచయజ్ఞాలు ఆచరిస్తున్నవాడిని; మరొక తావున యోగసమాధి నిమగ్నమై ఉన్న వాడిని; ఒక స్థలంలో స్నానానికి సిద్ధమవుతూ ఉన్న వాడిని; ఇంకొక చోట ప్రశస్త భూషణాలతో ప్రకాశిస్తున్న వాడిని; మరొక ప్రదేశంలో గోదానం చేయాలని కుతూహలపడుతూ ఉన్న వాడిని; ఇంకొక ప్రదేశంలో తన కుమారులతో ఆడుకుంటున్న వాడినీ; ఒకచోట సంగీతం మీద ఆసక్తిని చూపుతున్న వాడిని; మరొక చోట జలకేళి ఆడుతున్నవాడిని; ఇంకొక చోట మంచం మీద కుర్చున్న వాడిని; మరొకచోట బలరాముడి తో కలిసి ఉన్న వాడిని, యిలా పలుస్థలములలో పలుక్రియలలో నిమగ్నుడై యున్న శ్రీకృష్ణుడిని నారదమహర్షి సందర్శించాడు.

తెభా-10.2-620-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- ఇంకా.....

తెభా-10.2-621-సీ.
సకలార్థసంవేది యొక యింటిలోపలఁ-
జెలితోడ ముచ్చటల్‌ సెప్పుచుండు
విపులయశోనిధి వేఱొక యింటిలో-
రసిజాననఁ గూడి రస మాడుఁ
బుండరీకదళాక్షుఁ డొండొక యింటిలోఁ-
రుణికి హారవల్లరులు గ్రుచ్చుఁ
రుణాపయోనిధి ఱియొక యింటిలోఁ-
జెలిఁ గూడి విడియము సేయుచుండు

తెభా-10.2-621.1-ఆ.
విచకమలనయనుఁ డొయింటిలో నవ్వు
బ్రవిమలాత్ముఁ డొకటఁ బాడుచుండు
యోగిజనవిధేయుఁ డొకయింట సుఖగోష్ఠి
లుపు ననఘుఁ డొకటఁ జెలఁగుచుండు.

టీక:- సకల = సర్వ; అర్థ = విషయములు; సంవేది = సంపూర్ణముగా తెలిసినవాడు; ఒక = ఒకానొక; ఇంటి = ఇంటి; లోపలన్ = లోపల; చెలి = ప్రియురాలి; తోడన్ = తోటి; ముచ్చటల్ = ఇష్టాగోష్ఠి వాక్యములు; చెప్పుచున్ = చెప్తూ; ఉండు = ఉండును; విపుల = విస్తారమైన; యశః = కీర్తికి; నిధి = ఉనికిపట్టైనవాడు; వేఱు = మరి; ఒక = ఒకానొక; ఇంటి = ఇంటి; లోన్ = లోపల; సరసిజాననన్ = పద్మాక్షితో; కూడి = కూడుకొని; సరసము = సరసములు; ఆడున్ = ఆడుచుండును; పుండరీక = పద్మముల; దళ = రేకులవంటి; అక్షుడు = కన్నులు కలవాడు; ఒండు = మరి; ఒక = ఒక; ఇంటి = ఇంటి; లోన్ = లోపల; తరుణి = యువతి; కిన్ = కి; హార = పూల దండలకు; వల్లరులు = పూలగుత్తులను; గ్రుచ్చున్ = గుచ్చుచుండును; కరుణా = దయా; పయోనిధిన్ = సముద్రుడు; మఱి = ఇంక; ఒక = ఒకానొక; ఇంటి = ఇంటి; లోన్ = లోపల; చెలిన్ = ప్రియురాలిని; కూడి = చేరి; విడియమున్ = తాంబూలములు; చేయుచుండు = చేస్తుండును; వికచ = విరసిన; కమల = కమలములవంటి; నయనుడు = కన్నులు కలవాడు; ఒక = ఒకానొక; ఇంటి = ఇంటి; లోన్ = లోపల; నవ్వున్ = నవ్వుచుండును; ప్రవిమల = మిక్కిలినిర్మలమైన; ఆత్ముడు = మనస్సుకలవాడు; ఒకటన్ = ఒకచోట; పాడుచుండు = పాడుచుండును; యోగి = యోగులైన; జన = వారికి; విధేయుడు = లోబడియుండువాడు; ఒక = ఒకానొక; ఇంటన్ = ఇంటిలో; సుఖగోష్ఠిన్ = సుఖసల్లాపములు; సలుపున్ = చేయుచుండును; అనఘుడు = పుణ్యుడు; ఒకటన్ = ఒకచోట; చెలగుచుండు = ఉత్సహించుచుండును.
భావము:- శ్రీకృష్ణుడు తన ముద్దులసఖితో ఒక ఇంటిలో ముచ్చటలు ఆడుతున్నాడు; మరో ఇంటిలో మరొక ప్రియసఖితో సరసమాడుతున్నాడు; ఇంకో ఇంటిలో ఒక స్త్రీ రత్నం కోసం హారాలు గుచ్చుతున్నాడు; ఒక ఇంటిలో తన యువతితో కలిసి తాంబూలం సేవిస్తున్నాడు; ఒక ఇంటిలో నవ్వుతున్నాడు; ఒక ఇంటిలో పాడుతున్నాడు; ఒక ఇంటిలో సుఖగోష్టి చేస్తున్నాడు; ఒక ఇంటిలో ఆనందిస్తున్నాడు; ఈ మాదిరి అనేక రూపాలతో కనపడుతూ ఉన్న ఆ సకలార్థసంవేదిని, ఆ వికచకమల నయనుని, ఆ విమలాత్ముని, ఆ యోగిజన విధేయుని, ఆ శ్రీకృష్ణభగవానుడిని దర్శిస్తూ నారదుడు ముందుకు సాగిపోయాడు.

తెభా-10.2-622-వ.
ఇట్లు సూచుచుం జనిచని.
టీక:- ఇట్లు = ఈ విధముగ; చూచుచున్ = చూస్తూ; చనిచని = వెళ్ళివెళ్ళి.
భావము:- ఈ విధంగా పరిశీలిస్తూ సాగిపోతూ....

తెభా-10.2-623-క.
తురానననందనుఁ డం
చిమతిఁ జని కాంచె నొక్క చెలిగేహమునం
గ్రతుకర్మాచరణుని నా
శ్రిభయహరణున్ సురేంద్రసేవితచరణున్.

టీక:- చతురానననందనుడు = నారదుడు {చతురానన నందనుడు - చతురానన (చతుర్ముఖ బ్రహ్మ యొక్క) నందనుడు, నారదుడు}; అంచిత = చక్కటి; మతిన్ = బుద్ధితో; చని = వెళ్ళి; కాంచెన్ = చూసెను; ఒక్క = ఒకానొక; చెలి = స్త్రీ; గేహమునన్ = ఇంటిలో; క్రతు = యజ్ఞ; కర్మా = కర్మలను; ఆచరణునిన్ = చేయువానిని; ఆశ్రిత = ఆశ్రయించినవారి; భయ = భయములను; హరణున్ = పోగొట్టువానిని; సురేంద్ర = దేవేంద్రునిచే; సేవిత = సేవింపబడు; చరణున్ = పాదములు కలవానిని.
భావము:- బ్రహ్మదేవుడి కుమారుడైన నారదుడు యజ్ఞకర్మలు ఆచరిస్తున్న వాడూ, ఆశ్రితుల భయాన్ని పోగొట్టేవాడూ, దేవేంద్రుడి చేత పూజింపబడే పాదాలు కలవాడూ అయిన కృష్ణుడిని ఒక ఇష్టసఖి ఇంటిలో చూసాడు.

తెభా-10.2-624-క.
వృత్రారినుతునిఁ బరమ ప
విత్రుని నారదుఁడు గాంచె వేఱొక యింటం
బుత్రక పౌత్త్రక దుహితృ క
త్రసమేతుని ననంతు క్షణవంతున్.

టీక:- వృత్రారి = ఇంద్రునిచే {వృత్రారి - వృత్రాసురుని చంపినవాడు, ఇంద్రుడు}; నుతునిన్ = స్తుతింపబడువానిని; పరమ = మిక్కిలి; పవిత్రునిన్ = పరిశుద్ధుని; నారదుడు = నారదుడు; కాంచెన్ = చూసెను; వేఱు = ఇంక; ఒక = ఒక; ఇంటన్ = ఇంటిలో; పుత్రక = కొడుకులతో; పౌత్రుక = మనుమలతో; దుహితృ = కొమార్తెలతో; కళత్ర = భార్యతో; సమేతునిన్ = కూడి యున్నవానిని; అనంతున్ = అంతము లేనివానిని, కృష్ణుని; లక్షణవంతున్ = శుభలక్షణములు కలవానిని.
భావము:- మరో మందిరంలో దేవేంద్రుడి చేత స్తుతింపబడే వాడూ పరమ పవిత్రుడూ నందుడి కుమారుడూ అయిన కృష్ణుడిని కొడుకులూ, మనుమళ్ళూ, కూతుళ్ళూ, భార్యలు మున్నగు వారితో కలసి (సామాన్య గృహస్థు వలె) ఉండగా దర్శించాడు.

తెభా-10.2-625-క.
సుంరమగు నొక సుందరి
మందిరమునఁ బద్మభవకుమారుఁడు గాంచెన్
నందితనందున్ సుజనా
నందున్ గోవిందు నతసనందు ముకుందున్.

టీక:- సుందరము = అందమైనది; అగు = ఐన; ఒక = ఒకానొక; సుందరి = అందగత్తె; మందిరమునన్ = ఇంటిలో; పద్మభవకుమారుడు = నారదుడు {పద్మభవ కుమారుడు - పద్మభవ (బ్రహ్మదేవుని) కుమారుడు, నారదుడు}; కాంచెన్ = చూచెను; నందితనందున్ = కృష్ణుని {నందిత నందుడు - ఆనందింప జేయబడిన నందుడు కలవాడు, కృష్ణుడు}; సుజన = సజ్జనులను; ఆనందున్ = ఆనందము ఇచ్చువానిని; గోవిందున్ = కృష్ణుని {గోవిందుడు - గోవులకు ఒడయుడు, కృష్ణుడు}; నత = స్తుతించిన; సనందున్ = సనందాదులు కలవానిని; ముకుందున్ = కృష్ణుని.
భావము:- ఒక అందగత్తె అందమైన ఇంటిలో సజ్జనుల చేత కీర్తించబడేవాడూ, సనకసనందాదుల వందనాలు అందుకునేవాడూ, అయిన గోవిందుడిని బ్రహ్మదేవుడి పుత్రుడైన నారదుడు దర్శించాడు.

తెభా-10.2-626-క.
జభవసుతుఁడు గనె నొక
లినాక్షినివాసమందు తభద్రేభున్
దాభున్ గతలోభు
న్నకాళిజితద్విరేఫు నంబుజనాభున్.

టీక:- జలజభవసుతుడు = నారదుడు {జలజభవ సుతుడు - జలజభవ (బ్రహ్మదేవుని) సుతుడు, నారదుడు}; కనెను = చూసెను; ఒక = ఒకానొక; నలినాక్షి = స్త్రీ; నివాసము = ఇంటి; అందున్ = లోపల; నత = మొక్కబడిన; భద్రేభున్ = గజేంద్రుడు కలవానిని; జలద = మేఘమువంటి; ఆభున్ = దేహము కలవానిని; గత = తొలగిన; లోభున్ = లోభము కలవానిని; అలక = ముంగురుల; ఆళి = సమూహముచే; జిత = జయింపబడిన; ద్విరేఫున్ = తుమ్మెదలు కలవానిని; అంబుజనాభున్ = కృష్ణుని {అంబుజ నాభుడు - పద్మనాభుడు, విష్ణువు};
భావము:- ఆ బ్రహ్మపుత్రుడైన నారదుడు ఒక పద్మాక్షి గృహంలో గజేంద్రపాలకుడిని, నీలమేఘ శ్యాముడిని, లోభ రహితుడిని, పద్మనాభుడిని, శ్రీకృష్ణుడిని తిలకించాడు.

తెభా-10.2-627-మ.
యింటం గజవాజిరోహకుఁడునై యొక్కింట భుంజానుఁడై
లాత్ముండు పరుండు షోడశసహస్రస్త్రీనివాసంబులం
దొ బోటింటను దప్పకుండ నిజమాయోత్సాహుఁడై యుండ న
య్యలంకున్వరదున్, మహాపురుషు, బ్రహ్మణ్యున్నతాబ్జాసనున్,

టీక:- ఒక = ఒకానొక; ఇంటన్ = ఇంటిలో; గజ = ఏనుగును; వాజి = గుఱ్ఱమును; ఆరోహకుడున్ = ఎక్కినవాడు; ఐ = అయ్యి; ఒక్క = ఒకానొక; ఇంటన్ = ఇంటిలో; భుంజానుడు = భోజనము చేయువాడు; ఐ = అయ్యి; సకల = సర్వము; ఆత్ముండు = తన యందు కలవాడు; పరుండు = సర్వాతీతమైనవాడు; షోడశసహస్ర = పదహారువేల (16000); స్త్రీ = భార్యల; నివాసంబులన్ = ఇండ్ల; అందున్ = లోను; ఒక = ఏ ఒక్క; బోటి = స్త్రీ; ఇంటనున్ = ఇంటిలోను; తప్పకుండ = విడువకుండ; నిజ = తన; మాయా = మాయవలని; ఉత్సాహుడు = ఉత్సాహము కలవాడు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; ఆ = ఆ; అకలంకున్ = కళంకము లేనివానిని; వరదున్ = వరము లిచ్చువానిని; మహాపురుషున్ = కృష్ణుని {మహాపురుషుడు - విరాట్పురుషుడు, విష్ణువు}; బ్రహ్మణ్యున్ = వేదధర్మ ప్రవర్తకుని; నత = సేవింపబడిన; అబ్జాసనున్ = బ్రహ్మదేవుడు కలవానిని {అబ్జాసనుడు - అబ్జము (పద్మము) ఆసనముగా కలవాడు, బ్రహ్మ}.
భావము:- మహాపురుషుడైన శ్రీకృష్ణుడు పదహారువేల స్త్రీల నివాసాలలోనూ ఏ స్త్రీ ఇంటిని వదిలిపెట్టకుండా, ప్రతి ఇంట తన మాయా ప్రభావంతో తానే ఉంటూ; ఒక ఇంటిలో ఏనుగులపై గుఱ్ఱాలపై స్వారీచేస్తున్నాడు. ఒక ఇంటిలో భోజనం చేస్తున్నాడు. ఇంకొక ఇంటిలో నిద్రిస్తున్నాడు. ఇలా ఉన్న నిర్మలుడూ, కోరిన వరాలను అనుగ్రహించే వాడూ, బ్రాహ్మణ్యుడూ అయిన ఆ కృష్ణపరమాత్మను నారదుడు దర్శించాడు.

తెభా-10.2-628-క.
స్తోకచరితు, నమిత స
స్త సుధాహారు వేద,స్తకతల వి
న్యస్త పదాంబుజయుగళు, న
పాస్తశ్రితనిఖిలపాపుఁ, రము, ననంతున్.

టీక:- అస్తోక = ఘనమైన; చరితున్ = నడవడి కలవానిని; నమిత = నమస్కరించిన; సమస్త = ఎల్ల; సుధాహారున్ = దేవతలు కలవానిని {సుధాహారులు - అమృతము భుజించువారు, దేవతలు}; వేదమస్తక = వేదాంతముల; తల = ప్రదేశము లందు; విన్యస్త = ఉంచబడిన; పద = పాదములు అను; అంబుజ = పద్మముల; యుగళున్ = జంట గలవానిని; అపాస్త = తొలగిన; శ్రిత = ఆశ్రయించినవారి; నిఖిల = సర్వ; పాపున్ = పాపములు కలవాని; పరమున్ = సర్వోత్తముడైనవానిని; అనంతున్ = కృష్ణుని.
భావము:- ఉదాత్త చరిత్రుడు; వేదాంతముల యందు ప్రతిపాదింపబడిన ఆది మూలమైన వాడు; దేవతలు అందరకు ఆరాధ్యుడు; ఆశ్రితుల పాపాలను పోగొట్టే వాడు; అనంతుడు అయిన శ్రీకృష్ణుడిని నారదుడు దర్శించాడు.

తెభా-10.2-629-ఆ.
రమభాగవతుఁడు రమేష్ఠితనయుండు
నుజలీలఁ జెంది హితసౌఖ్య
చిత్తుఁడైన యా హృషీకేశు యోగమా
యాప్రభావమునకు నాత్మ నలరి.

టీక:- పరమ = అత్యుత్తమమైన; భాగవతుడు = భాగవతధర్మానుష్ఠానుని; పరమేష్ఠితనయుండు = నారదుడు {పరమేష్ఠి తనయుడు - బ్రహ్మపుత్రుడు, నారదుడు}; మనుజ = సామాన్య మానవుని; లీలన్ = విధమును; చెంది = పొంది; మహిత = గొప్ప; సౌఖ్య = సుఖముల తగిలిన; చిత్తుడు = మనస్సు కలవాడు; ఐన = అయిన; ఆ = ఆ; హృషీకేశున్ = కృష్ణుని యొక్క {హృషీకేశుడు - హృషీకములు (సర్వేంద్రియములను) ఈశుడు (వర్తింప చేయువాడు), విష్ణువు}; యోగ = యోగశక్తి యొక్క; మాయా = మహిమల; ప్రభావమున్ = వైభవముల; కున్ = కు; ఆత్మన్ = మనస్సు నందు; అలరి = సంతోషించి.
భావము:- పరమ భాగవతోత్తముడు, బ్రహ్మ మానసపుత్రుడు అయిన నారదుడు మానవ రూపుడు అయి సామాన్య మానువుని వలె భౌతిక సౌఖ్యాలలో తేలియాడుతున్న ఆ సర్వేంద్రియములకు ఈశ్వరుడు అయిన శ్రీకృష్ణభగవానుడి యోగమాయా ప్రభావాన్ని పరీక్షించి చూసి చాలా సంతోషించి.....

తెభా-10.2-630-క.
"మాయురె? హరిహరి! వరద! య
మేగుణా!"యనుచు నాత్మ మెచ్చి మునీంద్రుం
డా దునాయకు సుజన వి
ధేయుని కిట్లనియె దేవ! త్రిజగములందున్.

టీక:- మాయురె = ఔరా; హరి = కృష్ణ {హరి - నిద్ర అను ప్రళయమున సర్వము తన యందు లీనము చేసికొనువాడు, విష్ణువు}; హరి = కృష్ణ {హరి - భక్తుల పాపములను హరించువాడు, విష్ణువు}; వరద = వరముల నిచ్చువాడా; అమేయ = అమితమైన; గుణా = సుగుణములు కలవాడా; అనుచున్ = అనుకొంటు; ఆత్మన్ = మనస్సు నందు; మెచ్చి = మెచ్చుకొని; ముని = ఋషి; ఇంద్రుండు = సత్తముడు; ఆ = ఆ ప్రసిద్ధుడైన; యదు = యాదవ; నాయకున్ = ప్రభువుని; సుజన = సజ్జను లందు; విధేయుని = లొంగి ఉండువాని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; దేవ = భగవంతుడా; త్రిజగములు = ముల్లోకములు; అందున్ = లోను.
భావము:- నారదుడు తన మనసులో “ఆహా! హరీహరీ! సుప్రసన్నా! ఉన్నత గుణ సుసంపన్నా!” అంటూ మెచ్చుకుంటూ కృష్ణుడితో ఇలా అన్నాడు.

తెభా-10.2-631-క.
"నీ మాయఁ దెలియువారలె
తారసాసన సురేంద్ర తాపసు లైనన్
ధీమంతులు నీ భక్తిసు
ధామాధుర్యమునఁ బొదలు న్యులు దక్కన్. "

టీక:- నీ = నీ యొక్క; మాయన్ = మాయను; తెలియువారలె = తెలిసికొనగలవారా, కాదు; తామరసాసన = బ్రహ్మదేవుడు {తామర సాసనుడు - పద్మము ఆసనముగా కలవాడు, బ్రహ్మ}; సురేంద్ర = ఇంద్రుడు {సురేంద్రుడు - దేవతల ప్రభువు, ఇంద్రుడు}; తాపసులు = తప సంపన్నులు; ఐనన్ = అయినప్పటికిని; ధీమంతులు = జ్ఞానవంతులు; నీ = నీ యొక్క; భక్తి = భక్తి అను; సుధా = అమృతము యొక్క; మాధుర్యమునన్ = మధురముచేత; పొదలు = వృద్ధిపొందు; ధన్యులు = కృతార్థులు; తక్కన్ = తప్పించి.
భావము:- “నీ భక్తి అనే అమృతములోని తీయదనములో తేలియాడుతుండే పుణ్యాత్ములు మాత్రమే నీ తత్వాన్ని తెలుసుకోగలరు. అంతే తప్ప, ముల్లోకాలలో బ్రహ్మేంద్రాది దేవతలూ మహర్షులూ సహితంగా ఇతరులు నీ మాయను తెలుసుకోలేరు.”

తెభా-10.2-632-క.
ని హర్షించుచు "నిఁక నేఁ
నివినియెద నిఖిలలోకపావనమును స
జ్జహితము నైన నీ కీ
ర్త మఖిలజగంబులందుఁ గ నెఱిఁగింతున్. "

టీక:- అని = అని; హర్షించుచున్ = సంతోషించుచు; ఇంక = ఇక; నేన్ = నేను; పనివినియెదన్ = పోయెదను; నిఖిల = సర్వ; లోక = లోకములను; పావనమును = పవిత్రము చేయునది; సజ్జన = సత్పురుషులకు; హితము = మేలు కలిగించునది; ఐన = అయిన; నీ = నీ యొక్క; కీర్తనము = ఖ్యాతిని; అఖిల = సమస్తమైన; జగంబులు = లోకములు; అందున్ = లోను; తగన్ = చక్కగా; ఎఱిగింతున్ = తెలియజేయుదును.
భావము:- ఈవిధంగా పలికి నారదమహర్షి హర్షాతిశయంతో “ఇంక నేను సెలవు తీసుకుంటాను. లోకాలు అన్నింటినీ పవిత్రము చేసేది, సజ్జనులకు ఇష్టమైనదీ అయిన నీ నామసంకీర్తనం సమస్త లోకాలలోనూ ప్రకటిస్తాను” అని అన్నాడు.

తెభా-10.2-633-క.
ని తద్వచనసుధాసే
మున ముది తాత్ముఁ డగుచు సంయమి చిత్తం
బునఁ దన్మూర్తిం దగ నిడు
కొని చనియెను హరినుతైకకోవిదుఁ డగుచున్.

టీక:- అని = అని; తత్ = ఆ కృష్ణుని; వచన = మాటలు అను; సుధా = అమృతమును; సేచనమునన్ = తడయుటచేత; ముదిత = సంతోషించిన; ఆత్ముడు = మనస్సు కలవాడు; అగుచున్ = ఔతు; సంయమి = ఋషి, నారదుడు {సంయమి - సంయమము కలవాడు, ఋషి}; చిత్తంబునన్ = మనస్సు నందు; తత్ = అతని; మూర్తిన్ = రూపమును; తగన్ = చక్కగా; ఇడుకొని = ఉంచుకొని; చనియెను = వెళ్ళిపోయెను; హరి = విష్ణు; నుత = కీర్తనలు చేయు టందు; ఏక = ప్రధానమైన; కోవిదుడు = విద్వాంసుడు; అగుచున్ = ఔతు.
భావము:- ఇలా పలికి, నారదుడు వాసుదేవ వాగామృతధారలలో మునిగి సంతుష్టాంతరంగుడు, విష్ణు కీర్తనలు వాడుటలో అమిత నేర్పరి అయి, ఆ మంగళమయ స్వరూపాన్ని తన మనసులో నిలుపుకుని వెళ్ళిపోయాడు.

తెభా-10.2-634-క.
గిది లోకహితమతి
నా రమేశ్వరుఁడు మానవాకృతిఁ ద్రిజగ
ద్దీపితచారిత్రుఁడు బహు
రూములం బొందె సుందరుల నరనాథా!

టీక:- ఈ = ఈ; పగిదిన్ = విధము; లోక = సర్వలోకములకు; హిత = మేలుచేయు; మతి = బుద్ధితో; ఆ = ఆ; పరమేశ్వరుడు = కృష్ణుడు; మానవ = మానవ; ఆకృతిన్ = రూపముతో; త్రిజగత్ = ముల్లోకముల యందు; ఉద్దీపిత = మిక్కిలి ప్రకాశింపజేసినట్టి; చారిత్రుడు = నడవడిక కలవాడు; బహు = అనేక; రూపములన్ = స్వరూపములతో; పొందెన్ = కూడెను; సుందరులన్ = స్త్రీలను; నరనాథా = పరీక్షిన్మహారాజా.
భావము:- ఓ పరీక్షిత్తు మహారాజా! లోకానికి మేలుచేకూర్చాలని మానవాకారాన్ని ధరించిన ఆ శ్రీకృష్ణుడు ఆ సుందరాంగులు అందరికీ ఆ విధంగా అనేక రూపాలతో చెందాడు.

తెభా-10.2-635-చ.
ని హరి యిట్లు షోడశసస్రవధూమణులం బ్రియంబునన్
సిజకేళిఁ దేల్చిన యమానుషలీల సమగ్రభక్తితో
వినినఁ బఠించినం గలుగు విష్ణుపదాంబుజభక్తియున్ మహా
పశు పుత్త్ర మిత్ర వనితాముఖ సౌఖ్యములున్ నరేశ్వరా! "

టీక:- అని = అని; హరి = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగా; షోడశసహస్ర = పదహారువేల (16000)మంది; వధూ = స్త్రీ; మణులన్ = రత్నములను; ప్రియంబునన్ = ప్రీతితో; మనసిజ = మన్మథ; కేళిన్ = క్రీడ యందు; తేల్చినన్ = సంతోషింపజేసినట్టి; అమానుష = మానవాతీతమైన; లీలన్ = లీలలను; సమగ్ర = సంపూర్తి; భక్తి = భక్తి; తోన్ = తోటి; వినినన్ = వినినను; పఠించినన్ = చదివినను; కలుగున్ = కలుగును; విష్ణు = శ్రీమహావిష్ణువు యొక్క; పద = పాదములను; అంబుజ = పద్మముల ఎడలి; భక్తియున్ = భక్తి; మహా = గొప్ప; ధన = సంపదలు; పశు = గోవులు; పుత్ర = కుమారులు; మిత్ర = స్నేహితులు; వనితా = భార్య; ముఖ = మొదలగు; సౌఖ్యములున్ = సుఖములు; నరేశ్వరా = మహారాజా.
భావము:- శ్రీకృష్ణుడు పదహారువేల మంది స్త్రీలను ఆదరించిన మానవాతీత లీలలను వినినా, చదివినా విష్ణుదేవుడి పాదాలపై భక్తి ప్రాప్తించటమే కాకుండా ధన, పశు, పుత్ర, మిత్ర, కళత్రాది సౌఖ్యాలు సైతం లభిస్తాయి.”

తెభా-10.2-636-వ.
అని చెప్పి యప్పారాశర్యనందనుం డభిమన్యునందను కిట్లనియె; “నా నిశావసానంబునఁ బద్మబాంధవాగమనంబును గమలినీ లోకంబునకు మునుకలుగ నెఱింగించు చందంబునం గలహంస సారస రథాంగ ముఖ జలవిహంగంబుల రవంబులు సెలంగ నరుణోదయంబున మంగళపాఠకసంగీత మృదుమధుర గాన నినదంబును లలితమృదంగ వీణా వేణు నినాదంబును, యేతేర మేలుకని తనచిత్తంబునఁ జిదానందమయుం బరమాత్ము నవ్యయు నవికారు నద్వితీయు నజితు ననంతు నచ్యుతు నమేయు నాఢ్యు నాద్యంతవిహీనుఁ బరమబ్రహ్మంబునైన తన్నుందా నొక్కింత చింతించి యనంతరంబ విరోధి రాజన్య నయన కల్హారంబులు ముకుళింప భక్తజననయనకమలంబులు వికసింప నిరస్త నిఖిల దోషాంధకారుం డైన గోవిందుండు మొగిచిన లోచనసరోజంబులు వికసింపఁ జేయుచుఁ దల్పంబు డిగ్గి చనుదెంచి యంత.
టీక:- అని = అని; చెప్పి = చెప్పి; ఆ = ఆ గొప్ప; పారాశర్యనందనుండు = శుకమహర్షి {పారాశర్య నందనుడు - పారాశర్యుడు (పరాశరుని కుమారుని, వ్యాసుని) నందనుడు (కుమారుడు), శుకుడు}; అభిమన్యునందనున్ = పరీక్షిన్మహారాజున {అభిమన్యు నందనుడు - అభిమన్యుని కొడుకు, పరీక్షిత్తు}; కున్ = కు; ఇట్లు = ఈ విధముగా; అనియె = చెప్పెను; ఆ = ఆనాటి; నిశావసానంబువ = రాత్రి తరువాత, తెల్లవారుఝామున; పద్మబాంధవ = సూర్యుని {పద్మబాంధవుడు - పద్మములకు బంధువు, సూర్యుడు}; ఆగమనంబునున్ = ఉదయించుటను; కమలినీ = తామరకొలనులు; లోకంబున్ = అన్నిటి; కున్ = కి; మునుకలుగన్ = ముందుగా; ఎఱింగించు = తెలిపెడి; చందంబునన్ = విధముగా; కలహంస = రాజహంసలు; సారస = బెగ్గురు పక్షులు; రథాంగ = చక్రవాక పక్షులు; ముఖ = మున్నగు; జలవిహంగంబుల = నీటిపక్షుల; రవంబులున్ = కూతలు; చెలంగన్ = చెలరేగగా; అరుణోదయంబునన్ = అరుణుడు ఉదయించునప్పుడు {అరుణుడు - సూర్యుని రథసారథి}; మంగళ = శుభకరమైన; పాఠక = వేదపాఠములు చదువువారి; సంగీత = చక్కటి గీతముల; మృదు = మృదువైన, సున్నితమైన; మధుర = ఇంపైన; గాన = పాటల; నినదంబును = ధ్వనులు; లలిత = మనోజ్ఞమైన; మృదంగ = మద్దెలల యొక్క; వీణా = వీణల యొక్క; వేణు = మురళీల యొక్క; నినాదంబునున్ = ధ్వనులు; ఏతేరన్ = వస్తుండగా; మేలుకని = నిద్రలేచి; తన = తన యొక్క; చిత్తంబునన్ = మనసు నందు; చిదానందమయున్ = చిత్తము అనందముచే నిండినవాని; పరమాత్మున్ = పరమాత్మ ఐనవానిని; అవ్యయున్ = తరుగుట లేనివానిని; అవికారున్ = మార్పులన్నవి లేనివానిని; అద్వితీయున్ = రెండవది లేనివానిని; అజితున్ = జయింపరాని వానిని; అనంతున్ = దేశకాలవస్త్వాది పరిచ్ఛేదము లేనివాని; అచ్యుతున్ = చ్యుతము(దిగజారుట) లేనివానిని; అమేయున్ = మేరలన్నవి లేనివానిని; ఆఢ్యున్ = అష్టైశ్వర్య సంపన్నుని; ఆద్యంతవిహీనున్ = మొదలు తుదులు అసలు లేనివానిని; పరబ్రహ్మంబున్ = పరబ్రహ్మ; ఐన = అయిన; తన్నున్ = తనను; తాను = తానే; ఒక్కింత = కొద్దిగా; చింతించి = ధ్యానించి; అనంతరంబ = పిమ్మట; విరోధి = శత్రువులైన; రాజన్య = రాజుల యొక్క; నయన = కన్నులు అను; కల్హారంబులున్ = ఎఱ్ఱకలువలు; ముకుళింపన్ = ముడుచుకుపోగా; భక్త = భక్తులైన; జన = వారి; నయన = కన్నులు అను; కమలంబులు = తామరలు; వికసింపన్ = వికాసము పొందగా; నిరస్త = తొలగింపబడిన; నిఖిల = సర్వ; దోషా = పాపములు అను; అంధకారుండు = చీకట్లు కలవాడు; ఐన = అయిన; గోవిందుండు = కృష్ణుడు; మొగిచిన = మూసుకొన్న; లోచన = కన్నులు అను; సరోజంబులున్ = పద్మములను; వికసింపన్ = వికాసము పొందునట్లు, తెరచుట; చేయుచున్ = చేస్తూ; తల్పంబున్ = మంచమును, పాన్పును; డిగ్గి = దిగి; చనుదెంచి = వచ్చి; అంత = పిమ్మట.
భావము:- ఈ విధంగా పదహారువేల స్త్రీల సాంగత్య లీలలు చెప్పి ఆ వ్యాసభగవానుని పుత్రుడు శుకుడు, అభిమన్యుడి పుత్రుడు అయిన పరీక్షిత్తుతో మళ్ళా ఇలా అన్నాడు. “పద్మమిత్రుడైన సూర్యుడి రాకను పద్మములకు ముందుగా తెలుపుతున్నాయేమో అన్నట్లు రాజహంసలు, సారసపక్షులు, చక్రవాకాలు మున్నగు నీటిపక్షులు చేస్తున్న కలధ్వనులనూ; మృదుమధురాలైన మంగళపాఠకుల సుస్వర పఠనాలనూ; మనోహరమైన మృదంగ, వేణు, వీణా రవాలనూ ఆలకించుతూ అరుణోదయ సమయాననే శ్రీకృష్ణుడు మేలుకొన్నాడు. చిదానంద స్వరూపుడు, పరమాత్మ, నాశ రహితుడు, వికార శూన్యుడు, తనకు ఇతరమైనది లేని వాడు, జయింపరాని వాడు, దేశ కాలాది పరిచ్ఛేద రహితుడు, అచ్యుతుడు, అమేయుడు, సర్వ ఐశ్వర్య సంపన్నుడు, మొదలు తుది లేని వాడు, పరబ్రహ్మస్వరూపము అయిన తనను తానే ధ్యానించుకుంటూ కన్నులు తెరచి శయ్యను దిగాడు. ఆయన కన్నులు తెరవగానే పగవారి కనుగలువలు ముకుళించాయి. భక్తుల కన్నులు అనే పద్మాలు వికసించాయి. పాపాలనే చీకట్లు పటాపంచలు అయ్యాయి.

తెభా-10.2-637-సీ.
లయజకర్పూరహితవాసితహేమ-
లశోదకంబుల లకమాడి
వ్యలసన్మృదు దివ్యవస్త్రంబులు-
లనొప్ప రింగులువాఱఁ గట్టి
కరకుండల హార మంజీర కేయూర-
లయాది భూషణాలులు దాల్చి
నసార కస్తూరికా హరిచందన-
మిళితపంకము మేన నలర నలఁది

తెభా-10.2-637.1-తే.
హితసౌరభ నవకుసుములు దుఱిమి
పొసఁగ రూపైన శృంగార మనంగ
మూర్తిఁ గైకొన్న కరుణాసముద్ర మనఁగ
మణ నొప్పుచు లలితదర్పణము చూచి.

టీక:- మలయజ = మంచిగంధముచేత; కర్పూర = పచ్చకర్పూరముచేత; మహిత = మహిమ కలుగజేయబడినదై; వాసిత = పరిమళిస్తున్న; హేమ = బంగారు; కలశ = చెంబులోని; ఉదకంబులన్ = నీళ్ళతో; జలకము = స్నానము; ఆడి = చేసి; నవ్య = సరికొత్త; లసత్ = ప్రకాశవంతమైన; మృదు = మృదువైన; దివ్య = మేలిమివైన; వస్త్రంబులున్ = బట్టలను; వలను = నేర్పు; ఒప్పన్ = చక్కగానగుటకు; రింగులువాఱన్ = కుచ్చిళ్ళువేలాడునట్లుగా; కట్టి = ధరించి; మకర = మొసలి ఆకారపు; కుండల = చెవికుండలములు; హార = ముత్యాలహారములు; మంజీర = కాలి అందెలు; కేయూర = భుజకీర్తులు; వలయ = చేతి కంకణములు; ఆది = మున్నగు; భూషణ = ఆభరణముల; ఆవలులున్ = సమూహములను; తాల్చి = ధరించి; ఘనసార = పచ్చకర్పూరముతో; కస్తూరికా = కస్తూరితో; హరిచందన = మంచిగంధముచేత; మిళిత = కలుపబడిన; పంకమున్ = మైపూతను; మేనన్ = దేహమునందు; అలది = రాసి; మహిత = శ్లాఘ్యమైన; సౌరభ = పరిమళము కల; నవ = తాజా; కుసుమములున్ = పువ్వులు; తుఱిమి = తలలో పెట్టుకొని; పొసంగన్ = చక్కటి; రూపు = స్వరూపము; ఐన = కలిగిన; శృంగారరసము = శృంగారరసము; అనంగన్ = అనగా; మూర్తిన్ = ఆకృతిని; కైకొన్న = పరిగ్రహించిన; కరుణా = దయా; సముద్రము = సముద్రము; అనగన్ = అనగా; రమణన్ = మనోజ్ఞముతో; ఒప్పుచున్ = చక్కదనముతోనుండి; లలిత = చక్కటి; దర్పణమున్ = అద్దమునందు; చూచి = చూసుకొని.
భావము:- అనంతరం, ఆ నందనందనుడు చందన కర్పూరాల పరిమళాలతో గుమగుమలాడే కాంచనకలశ జలాలతో స్నానం చేసాడు. సన్నని మృదువైన క్రొత్త బట్టలు ధరించాడు. కర్ణ కుండలాలు, హార, భుజకీర్తులు మున్నగు భూషణాలను అలంకరించుకున్నాడు. పచ్చకర్పూరం, కస్తూరి, మంచిగంధం కలిపిన మైపూతను అలదుకున్నాడు సువాసనలు వెదజల్లే పూలమాలలను ధరించాడు. రూపం దాల్చిన శృంగార రసమూ, ఆకారం దాల్చిన అనురాగ సముద్రమూ అన్నట్లుగా అలరారుతున్న శ్రీకృష్ణుడు అద్దంలో చూసుకున్నాడు.

తెభా-10.2-638-తే.
డఁగి సారథి తెచ్చిన నకరథము
సాత్యకి హిత ప్రియోద్ధవ హితుఁ డగుచు
నెక్కి నిజకాంతి దిక్కులఁ బిక్కటిల్లఁ
బూర్వగిరిఁ దోఁచు భానునిఁ బోలి వెలిఁగె.

టీక:- కడగి = పూన్చి; సారథి = రథము తోలువాడు; తెచ్చిన = తీసుకువచ్చిన; కనక = బంగారు; రథమున్ = రథమును; సాత్యకి = సాత్యకితో; హిత = మేలుకోరువాడు; ప్రియ = ఇష్ఠుడు; ఉద్ధవ = ఉద్ధవునితో; సహితుడు = కూడినవాడు; అగుచున్ = ఔతు; ఎక్కి = ఎక్కి; నిజ = తన; కాంతి = ప్రకాశము; దిక్కులన్ = నలుదిక్కులందు {నలుదిక్కులు - 1తూర్పు 2దక్షిణము 3పడమర 4ఉత్తరము అను నాలుగు దిక్కులు}; పిక్కటిల్లన్ = వ్యాపించగా; పూర్వగిరిన్ = తూర్పుకొండ యందు; తోచు = కనబడు; భానుని = సూర్యుని; పోలి = వలె; వెలిగెన్ = ప్రకాశించెను.
భావము:- సాత్యకితోనూ మిత్రుడైన ఉద్ధవునితోనూ కలసి సారథి తెచ్చిన బంగారురథాన్ని అధిరోహించి, తూర్పుకొండపై ఉదయించే సూర్యుడిలా శోభిస్తూ, శ్రీకృష్ణుడు తన శోభ నలుదిక్కులా విరజిమ్ముతూ ప్రకాశించాడు.

తెభా-10.2-639-సీ.
భినవ నిజమూర్తి యంతఃపురాంగనా-
యనాబ్జములకు నానంద మొసఁగ
లలిత ముఖచంద్ర చంద్రికాతతి పౌర-
నచకోరముల కుత్సవము సేయ
హనీయకాంచనణిమయ భూషణ-
దీప్తులు దిక్కులఁ దేజరిల్ల
ల్ల నల్లన వచ్చి రదంబు వెస డిగ్గి;-
ల కులిశాంకుశ లజ కలశ

తెభా-10.2-639.1-తే.
లితరేఖలు ధరణి నలంకరింప
నుద్ధవుని కరతల మూని యొయ్య నడచి
హితగతి దేవతాసభాధ్యమునను
రుచిర సింహాసనమునఁ గూర్చుండె నెలమి.

టీక:- అభినవ = సరికొత్త (అలంకారములు కల); నిజ = తన; మూర్తిన్ = స్వరూపము; అంతఃపుర = అంతఃపురములోని; అంగనా = స్త్రీల; నయనా = కన్నులు అను; అబ్జములు = పద్మముల; కున్ = కు; ఆనందము = సంతోషము; ఒసగన్ = కలిగిస్తుండగా; సలలిత = మనోహరత్వము కలిగిన; ముఖ = మోము అను; చంద్ర = చంద్రుని; చంద్రికా = వెన్నెలల; తతిన్ = సమూహము; పౌర = పురములోని; జన = ప్రజలు అను; చకోరముల్ = చకోరపక్షుల; కున్ = కు; ఉత్సవము = వేడుక; చేయన్ = కలుగ జేయగా; మహనీయ = ఘనమైన; కాంచన = బంగారు; మణి = రత్నాలు; మయ = పొదిగిన; భూషణ = ఆభరణముల; దీప్తులు = కాంతులు; దిక్కులన్ = నలుదిక్కులందు; తేజరిల్లన్ = ప్రకాశింపజేయగా; అల్లనల్లన = మెల్లమెల్లగా; వచ్చి = వచ్చి; అరదంబున్ = రథమును; వెసన్ = వేగముగా; డిగ్గి = దిగి; హల = నాగలి; కులిశ = వజ్రాయుధము; అంకుశ = అంకుశము; కలశ = కుండ లవంటి; లలిత = మనోజ్ఞమైన; రేఖలు = గీతలు; ధరణిన్ = నేలను; అలంకరింపన్ = అలంకారములుగా అగుచుండగా; ఉద్ధవుని = ఉద్ధవుని; కరతలమున్ = అరచేతితో; ఊని = ఊతముగాకొని; ఒయ్యనన్ = విలాయముగా; నడచి = పోయి; మహిత = గంభీరమైన; గతిన్ = విధముగా; దేవతాసభా = సుధర్మము అను సభ; మధ్యముననున్ = నడుమ; రుచిర = కాంతివంతమైన; సింహాసనమునన్ = సింహాసనమునందు; కూర్చుండెన్ = ఆసీనుడయ్యెను; ఎలమిన్ = సంతోషముతో.
భావము:- అలా బయలుదేరిన శ్రీకృష్ణుడు తన నవమోహనాకారంతో అంతఃపురస్త్రీల కన్నులకు ఆనందాన్ని అందిస్తూ. అందాలు చిందే తన ముఖచంద్రుని వెన్నెల వెలుగులతో పురజనుల నేత్రచకోరాలకు పండుగచేస్తూ, తాను ధరించిన మణిమయ ఆభరణాల కాంతులు నలుదిక్కుల ప్రసరింపజేస్తూ, మెల్ల మెల్లగా రథం దిగి వచ్చాడు. హల, కులిశాది రేఖలతో శుభంకరములు అయిన తన పాదముద్రలు భూమి మీద అలంకారాలుగా వేస్తూ, ఉద్ధవుని చేతిని ఊతగా గ్రహించి గంభీరంగా నడుస్తూ దేవతాసభ సుధర్మసభ మధ్యన ఉన్న మణిమయ సింహాసనం మీద ఆసీనుడైయ్యాడు.

తెభా-10.2-640-చ.
తి విభవంబునం దనరి యాత్మతనుద్యుతి తేజరిల్లఁగా
హితులుపురోహితుల్వసుమతీశులుమిత్రులుబాంధవుల్‌బుధుల్‌
సుతులునుమాగధుల్కవులుసూతులు మంత్రులుభృత్యులున్శుభ
స్థితిఁ గొలువంగఁ నొప్పె నుడుసేవితుఁ డైన సుధాంశుఁడో యనన్.

టీక:- అతి = మిక్కిలి; విభవంబునన్ = వైభవముతో; తనరి = అతిశయించి; ఆత్మ = తన; తను = శరీరము యొక్క; ద్యుతి = కాంతితో; తేజరిల్లగా = ప్రకాశించుచుండగా; హితులు = ఆప్తులు; పురోహితులు = పురోహితులు; వసుమతీశులు = రాజులు; మిత్రులు = స్నేహితులు; బాంధవుల్ = బంధువులు; బుధుల్ = పండితులు; సుతులున్ = కొడుకులు; మాగధుల్ = స్తుతిపాఠకులు; కవులు = కవిత్వము చెప్పువారు; సూతులు = సారథులు; మంత్రులు = మంత్రులు; భృత్యులు = సేవకులు; శుభ = మేలైన; స్థితిన్ = విధముగా; కొలువంగన్ = సేవించుచుండగా; ఒప్పెన్ = చక్కగానుండెను; ఉడు = నక్షత్రములచే; సేవితుండు = కొలువబడువాడు; ఐన = అయిన; సుధాంశుడో = చంద్రడేమో {సుదాంశుడు - అమృతము వంటి కిరణములు కలవాడు, చంద్రుడు}; అనన్ = అనునట్లుగా.
భావము:- శ్రీకృష్ణుడు తన శరీరకాంతులు నలుగడలా ప్రసరిస్తుండగా, హితులూ, పురోహితులూ, రాజులూ, మిత్రులూ, చుట్టాలూ, పెద్దలూ, కుమారులూ, స్తుతిపాఠకులూ, కవులూ, మంత్రులూ, సేవకులూ, అందరూ తనను సేవిస్తూ ఉండగా నక్షత్రాల నడుమ విరాజిల్లే చంద్రుడిలా మహవైభవంతో ప్రకాశించాడు.

తెభా-10.2-641-క.
రుణార్ద్రదృష్టిఁ బ్రజలం
రిరక్షించుచు వివేకభావకళా చా
తురి మెఱసి యిష్టగోష్ఠిం
మానందమున రాజ్యభారకుఁ డగుచున్.

టీక:- కరుణా = దయతో; అర్ద్ర = ద్రవించిన; దృష్టిన్ = చూపులతో; ప్రజలన్ = లోకులను; పరిరక్షించుచున్ = పరిపాలించుచు; వివేక = తెలివితో; భావ = తాత్పర్యము కల; కళా = విద్య యందలి; చాతురిన్ = నేర్పుతో; మెఱసి = ప్రకాశించి; ఇష్ట = ప్రీతిగల; గోష్ఠిన్ = ముచ్చట్లతో; పరమ = మిక్కిలి; ఆనందమునన్ = ఆనందముతో; రాజ్య = రాజ్యమును ఏలెడి; భారకుడు = బాధ్యత వహించినవాడు; అగుచున్ = ఔతు.
భావము:- శ్రీకృష్ణుడు దయతో కూడిన చూపులతో ప్రజలను పరిపాలిస్తూ, వివేక చాతుర్యంతో ఆత్మీయులతో ప్రీతిగా మాటలాడుతూ, ఆనందంగా రాజ్యభారాన్ని వహించాడు.