పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శివుడు కృష్ణుని స్తుతించుట
శివుడు కృష్ణుని స్తుతించుట
←మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు | తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శివుడు కృష్ణుని స్తుతించుట) రచయిత: పోతన |
నృగోపాఖ్యానంబు→ |
తెభా-10.2-441-వ.
“దేవా! నీవు బ్రహ్మరూపంబగు జ్యోతిర్మయుండవు; నిఖిల వేద వేదాంత నిగూఢుండవు; నిర్మలుండవు; సమానాధిక రహితుం డవు; సర్వవ్యాపకుండవైన నిన్ను నిర్మలాంతఃకరణులైన వారలాకాశంబు పగిది నవలోకింతు; రదియునుంగాక పంచోపనిషన్మయం బయిన భవదీయ దివ్యమంగళ మహావిగ్రహ పరిగ్రహంబు సేయునెడ నాభియం దాకాశంబును, ముఖంబునం గృశానుండును, శిరంబున స్వర్గంబును, శ్రోత్రంబుల దిశలును, నేత్రంబుల సూర్యుండును, మనంబునఁ జంద్రుఁడును, బాదంబుల వసుంధరయు, నాత్మ యందహంకారంబును, జఠరంబున జలధులును, రేతంబున నంబువులును, భుజంబుల నింద్రుండును, రోమంబుల మహీరుహౌషధీ వ్రాతంబును, శిరోజంబుల బ్రహ్మలును, జ్ఞానంబున సృష్టియు, నవాంతర ప్రజాపతులును, హృదయంబున ధర్మంబును గలిగి మహాపురుషుండవై లోకకల్పనంబుకొఱకు నీ యకుంఠితతేజంబు గుప్తంబుసేసి జగదుద్భవంబుకొఱకుఁ గైకొన్న భవదీయ దివ్యావతారవైభవం బెఱింగి నుతింప నెంతవారము; నీవు సకలచేతనాచేతననిచయంబులకు నాద్యుండవు; యద్వితీయుండవు; పురాణపురుషుండవు; సకల సృష్టి హేతుభూతుండవు; నీశ్వరుండవు; దినకరుండు కాదంబినీ కదంబావృతుం డగుచు భిన్నరూపుండై బహువిధచ్ఛాయలం దోఁచు విధంబున నీ యఘటితఘటనానిర్వాహకంబైన సంకల్పంబునఁ ద్రిగుణాతీతుండవయ్యును సత్త్వాదిగుణవ్యవధానంబుల ననేక రూపుండ వై గుణవంతులైన సత్పురుషులకుఁ దమోనివారకంబైన దీపంబు రూపంబునం బ్రకాశించుచుందువు; భవదీయమాయా విమోహితులయిన జీవులు పుత్త్ర దార గృహ క్షేత్రాది సంసారరూపకంబైన పాప పారావారమహావర్తగర్తంబుల మునుంగుచుందేలుచుందురు; దేవా! భవదీయ దివ్యరూపానుభవంబు సేయంజాలక యింద్రియ పరతంత్రుండై భవత్పాదసరసీరుహంబులఁ జేరనెఱుంగని మూఢాత్ముం డాత్మవంచకుండనంబడు; విపరీతబుద్ధిం జేసి ప్రియుండ వైన నిన్ను నొల్లక యింద్రియార్థానుభవంబు సేయుట యమృతంబుమాని హాలాహలంబుసేవించుట గాదె? జగదుదయపాలన లయలీలాహేతుండవై శాంతుండవయి సుహృజ్జన భాగధేయుండ వై సమానాధికవస్తుశూన్యుండవైన నిన్ను నేనును బ్రహ్మయుం బరిణతాంతఃకరణు లైన ముని గణంబులును భజియించుచుందుము; మఱియును.
టీక:- దేవా = ప్రభూ; నీవు = నీవు; బ్రహ్మ = పరబ్రహ్మ; రూపంబు = స్వరూపము; అగు = ఐన; జ్యోతిః = తేజస్సు; మయుండవు = స్వరూపముగా కలవాడవు; నిఖిల = సర్వ; వేద = వేదముల; వేదాంత = ఉపనిషత్తుల సారముల; నిగూఢుండవు = మరగున ఉండు వాడవు; నిర్మలుండవు = మాలిన్య రహితుడవు; సమాన = సమానమైన వారు కాని; అధిక = అధికమైన వారు కాని; రహితుండవు = లేనివాడవు; సర్వ = సర్వలోకము నందు; వ్యాపకుండవు = నిండి ఉండువాడవు; నిన్ను = నిన్ను; నిర్మల = రాగద్వేషాదులు లేని; అంతఃకరణులు = అంతరంగము కలవారు; ఐన = అయినట్టి; వారలు = వారు; ఆకాశంబు = ఆకాశము {ఆకాశము - అంతట నిండి ఉండి అన్నిటిని అంటియు అంటక ఉండునది ఆకాశము }; పగిదిని = వలె; అవలోకింతురు = చూతురు; అదియునున్ = అంతే; కాక = కాకుండా; పంచోపనిషన్మయంబు = పంచోపనిషన్మయము; అయిన = ఐన; భవదీయ = నీ యొక్క; దివ్య = అప్రాకృతమైన, దివ్యమైన; మంగళ = శుభస్వరూపమైన; మహావిగ్రహ = విరాడ్రూపము యొక్క; పరిగ్రహంబున్ = ధరించుట; చేయునెడ = చేయు నప్పుడు; నాభి = బొడ్డు; అందున్ = అందు; ఆకాశంబునున్ = ఆకాశము; ముఖంబునన్ = ముఖము నందు; కృశానుండును = అగ్ని {కృశానుడు - తన్నంటినవానిని కృశింపజేయు వాడు, అగ్ని}; శిరంబునన్ = తల యందు; స్వర్గంబునున్ = స్వర్గలోకము; శ్రోత్రంబులన్ = చెవుల యందు; దిశలునున్ = దిక్కులు; నేత్రంబులన్ = కన్ను లందు; సూర్యుండును = సూర్యుడు; మనంబునన్ = మనస్సు నందు; చంద్రుడును = చంద్రుడు; పాదంబులన్ = పాదముల యందు; వసుంధరయున్ = భూమండలము; ఆత్మ = ఆత్మ; అందున్ = అందు; అహంకారంబును = భూతాదియైన అహంకారం; జఠరంబునన్ = కడుపు నందు; జలధులునున్ = సముద్రములు; రేతంబునన్ = రేతస్సు; అందున్ = అందు; అంబువులును = నీరు; భుజంబులన్ = బాహువు లందు; ఇంద్రుండు = ఇంద్రుడు; రోమంబులన్ = మేని వెంట్రుక లందు; మహీరుహ = చెట్లు; ఓషధీ = పైరులు, మొక్కలు; వ్రాతంబును = సమూహములు; శిరోజంబులన్ = తల వెంట్రుకలు అందు; బ్రహ్మలును = బ్రహ్మదేవుడాది సృష్టికర్తలు; జ్ఞానంబునన్ = తెలివి అందు; సృష్టియు = సమస్తమైన సృష్టి; అవాంతర = సృష్టి లోపలి; ప్రజాపతులునున్ = ప్రజాపతులు; హృదయంబున్ = అంతఃకరణము నందు; ధర్మంబును = ధర్మము; కలిగి = కలిగి; మహాపురుషుండవు = పంచకర్తలను మీరిన వాడవు {పంచకర్తలు - బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు అను ఐదుగురు పురుషులు (కారణభూతులు, కర్తలు)}; ఐ = అయ్యి; లోక = లోకములను; కల్పనంబు = సృష్టించుట; కొఱకు = కోసము; నీ = నీ యొక్క; అకుంఠిత = కొరతపడని; తేజంబున్ = తేజస్సును; గుప్తంబు = దాచినది; చేసి = చేసి; జగత్ = జగత్తు; ఉద్భవంబు = పుట్టుక; కొఱకు = కొరకు; కైకొన్న = గ్రహించిన; భవదీయ = నీ యొక్క; దివ్య = దివ్యమైన; అవతార = అవతారముల; వైభవంబున్ = విస్తృతిని; ఎఱింగి = తెలిసికొని; నుతింపన్ = స్తుతించుటకు; ఎంతవారము = ఏపాటివారము; నీవు = నీవు; సకల = సమస్తమైన; చేతనా = ప్రాణుల యొక్క; అచేతన = జడముల యొక్క; నిచయంబులు = సమూహములు; కున్ = కు; ఆద్యుండవు = మూలకారణుడవు; అద్వితీయుండవు = రెండవది లేనివాడవు; పురాణ = పంచకర్తలకు ముందు ఉన్న; పురుషుండవు = కర్తవు; సకల = సమస్తమైన; సృష్టి = సృష్టికి; హేతుభూతుండవు = కారణభూతుడవు; ఈశ్వరుండవు = నియామకుండవు; దినకరుండు = సూర్యుడు {దినకరుడు - పగలు కలిగించువాడు, సూర్యుడు}; కాదంబినీ = మేఘముల {కాదంబిని - కదంబ వృక్షములను పుష్పించుట కలిగి ఉండునది, మేఘము}; కదంబ = సమూహములచే; ఆవృతుండు = ఆవరింపబడినవాడు; అగుచున్ = ఔతు; భిన్న = వేరువేరు; రూపుండు = రూపములు కలవాడు; ఐ = అయ్యి; బహు = అనేక; విధ = విధములైన; ఛాయలన్ = రంగులతో; తోచు = కనబడెడి; విధంబునన్ = విధముగా; నీ = నీ; అఘటిత = కూర్పరాని వాటిని; ఘటనా = కూర్పగల; నిర్వాహకంబు = సామర్థ్యము కలది; ఐన = అయిన; సంకల్పంబునన్ = సంకల్పము చేత; త్రిగుణా = త్రిగుణములకు {త్రిగుణములు - 1సత్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; అతీతుండవు = మీరినవాడవు; అయ్యునున్ = అయినప్పటికి; సత్వాదిగుణ = త్రిగుణముల; వ్యవధానంబులు = భేదములచేత; అనేక = అనేకమైన; రూపుండవు = ఆకారములు కలవాడవు; ఐ = అయ్యి; గుణవంతులు = సజ్జనులు {గుణవంతులు - సుగుణములు (శమము దమము ఉపరతి తితిక్ష ఆది గుణములు) కలవారు, సజ్జనులు}; ఐన = అయిన; సత్పురుషుల = మంచివారి; కున్ = కి; తమః = తమోగుణమును; నివారకంబు = తొలగించునది; ఐన = అయిన; దీపంబు = దీపము; రూపంబునన్ = వలె; ప్రకాశించుచుందువు = ప్రకాశిస్తుంటావు; భవదీయ = నీ యొక్క; మాయా = మాయచేత; విమోహితులు = మోహమున పడినవారు; అయిన = ఐన; జీవులు = మానవులు; పుత్ర = సంతానము; దార = భార్య; గృహ = ఇండ్లు; క్షేత్ర = పొలము; ఆది = మున్నగు; సంసార = సంసారము అను; రూపకంబు = రూపము కలది; ఐన = అయిన; పాప = పాపముల; పారావార = సముద్రము నందలి; మహా = పెద్ద; ఆవర్త = సుడిగుండములు; గర్తంబులన్ = లోతులలో; మునుంగుచున్ = ములుగుచు; తేలుచున్ = తేలుతూ; ఉందురు = ఉంటారు; దేవా = భగవంతుడా; భవదీయ = నీ యొక్క; దివ్య = ప్రకృతి కతీతమైన; రూప = రూపమును; అనుభవంబున్ = సేవించుట; చేయంజాలక = చేయనేరక; ఇంద్రియ = ఇంద్రియములకు; పరతంత్రుడు = లోబడినవాడు; ఐ = అయ్యి; భవత్ = నీ యొక్క; పాద = పాదములు అను; సరసీరుహంబులన్ = పద్మములను; చేరన్ = చేరుట; ఎఱుంగని = తెలిసికొనలేని; మూఢాత్మ = తెలివిమాలినవాడు; ఆత్మ = ఆత్మ; వంచకుడు = ద్రోహి; అనంబడు = అనబడును; విపరీత = నీకన్యమైన; బుద్ధిన్ = భక్తి; చేసి = వలన; ప్రియుండవు = మేలు చేయువాడవు; ఐన = అయిన; నిన్నున్ = నిన్ను; ఒల్లక = అంగీకరించకుండా; ఇంద్రియార్థ = విషయములను; అనుభవంబున్ = అనుభవించుట; చేయుట = చేయుట; అమృతంబున్ = అమృతమును; మాని = వదలి; హాలాహలంబున్ = విషమును; సేవించుట = భుజించుట; కాదె = కాదా, అవును; జగత్ = భువనముల; ఉదయ = సృష్టి; పాలన = స్థితి; లయ = నాశము అను; లీలా = విలాసములకు; హేతుండవు = కారణభూతుడవు; ఐ = అయ్యి; శాంతుండవు = శుద్ధ సత్వవృత్తి కలవాడవు; అయి = అయ్యి; సుహృజ్జన = మంచి హృదయం కలవారు, మిత్రజనులు; భాగధేయుండవు = సౌభాగ్య స్వరూపుండవు; ఐ = అయ్యి; సమాన = సమానమైన; అధిక = అధికమైన; వస్తు = వస్తువులు; శూన్యుండవు = లేనివాడవు; ఐన = అయిన; నిన్ను = నిన్ను; నేను = నేను; అంచు = అంటు; బ్రహ్మయున్ = బ్రహ్మదేవుడు; పరిణత = పరిణితిచెందిన; అంతఃకరణులు = మనస్సు కలవారు; ఐన = అయిన; ముని = మునుల; గణంబులును = సమూహములు; భజియించుచున్ = కొలుచుచు; ఉందుము = ఉంటాము; మఱియును = ఇంకను.
భావము:- “దేవా! నీవు బ్రహ్మస్వరూపుడవు; జ్యోతిర్మయుడవు; సమస్త వేదవేదాంత నిగూఢుడవు; నిర్మలుడవు; నీతో సమానమైనవాడు అధికుడు మరొకడు లేడు; సర్వవ్యాపకుడవైన నిన్ను నిర్మల స్వభావులు ఆకాశంలాగ దర్శిస్తారు. నీవు పంచోపనిషన్మయంబైన నీ దివ్యమంగళ విగ్రహాన్ని పరిగ్రహించు నపుడు; నాభి యందు ఆకాశాన్ని, ముఖంలో అగ్నినీ, శిరస్సున స్వర్గాన్నీ, చెవులలోదిక్కులనూ, నేత్రాలలో సూర్యుణ్ణి, మనస్సులో చంద్రుణ్ణి, పాదాలలో భూమినీ, ఆత్మలో అహంకారాన్నీ, కడుపులో సముద్రాలనూ, రేతస్సులో నీటినీ, భుజాలలో దేవేంద్రుణ్ణీ, వెంట్రుకలలో వృక్షౌషధీ విశేషాలనూ, శిరోజాలలో బ్రహ్మలనూ, జ్ఞానంలో సృష్టినీ ప్రజాపతులనూ, హృదయంలో ధర్మాన్నీ వహించిన మహా పురుషుడవు. అయితే లోకం కోసం నీ తేజాన్ని దాచి జగత్కల్యాణం నిమిత్తం అవతారం దాల్చావు. అటువంటి నీ దివ్యావతార వైభవాన్ని స్తుతించడం ఎవరికి సాధ్యం అవుతుంది. నీవు సమస్త సృష్టికి మూలకారకుడవు; అద్వితీయుడవు; పురాణపురుషుడవు; సూర్యుడు మేఘమాలచేత కప్పబడి భిన్నరూపాలతో కనిపించే విధంగా అఘటితఘటనాఘటన సమర్ధమైన సంకల్పంతో త్రిగుణాతీతుడవై కూడా అనేక రూపాలతో గోచరిస్తుంటావు; సత్పురుషులకు అంధకారం తొలగించే దీపంలా ప్రకాశిస్తుంటావు నీ మాయకు లోనైన జీవులు సంసారమనే సముద్రపు సుడిగుండంలో మునిగితేలుతూ ఉంటారు; నీ దివ్యరూపాన్ని దర్శించకుండా నీ పాదకమలపూజ చేయకుండా ఇంద్రియలోలుడై ఉండు మూఢుడు ఆత్మవంచకుడు అనబడతాడు; నిన్ను ధ్యానించకుండా విపరీతబుద్ధితో ఇంద్రియలోలుడు కావటం అమృతాన్ని వదలి హాలాహలం సేవించడం; సృష్టి స్థితి లయకారకుడవై శాంతుడవై, సజ్జన భాగధేయుడవై, అనుపమానుడవైన నిన్ను బ్రహ్మాదిదేవతలూ మహామునీంద్రులూ నేనూ భజిస్తూ ఉంటాము. అంతేకాదు....
తెభా-10.2-442-తే.
అవ్యయుండ; వనంతుండ; వచ్యుతుండ;
వాదిమధ్యాంతశూన్యుండ; వఖిలధృతివి
నిఖిలమం దెల్ల వర్తింతు నీవు దగిలి
నిఖిల మెల్లను నీ యంద నెగడుఁ గృష్ణ!"
టీక:- అవ్యయుండవు = నశించుట లేనివాడవు; అనంతుండవు = అంతము లేనివాడవు; అచ్యుతుండవు = చ్యుత మగుట లేని వాడవు; ఆదిమధ్యాంతశూన్యుండవు = శాశ్వతుడవు; అఖిలధృతివి = సర్వము ధరించు వాడవు; నిఖిలము = ప్రపంచములోని సర్వము; అందున్ = లోను; ఎల్ల = అంతట; వర్తింతు = ఉందువు; నీవు = నీవు; తగిలి = పూని; నిఖిలము = ప్రపంచములోని సర్వము; ఎల్లను = వెలుపల లోపల అంతయు; నీ = నీ; అందన్ = అందే; నెగడు = కలిగి వ్యాపించును; కృష్ణ = కృష్ణా.
భావము:- వాసుదేవా! నీవు అవ్యయుడవు; అనంతుడవు; అచ్యుతుడవు; ఆదిమధ్యాంత శూన్యుడవు; విశ్వంభరుడవు; నీవు జగత్తు సమస్తము నందు సంచరిస్తూ ఉంటావు; జగత్తు సమస్తమూ నీలో లీనమై ఉంటుంది.”
తెభా-10.2-443-సీ.
అని సన్నుతించిన హరి యాత్మ మోదించి-
మొగమునఁ జిఱునవ్వు మొలకలెత్త
లలితబాలేందుకళామౌళి కిట్లను-
"శంకర! నీ మాట సత్య మరయ
నేది నీ కిష్టమై యెసఁగెడు దానిన;
వేఁడుము; నీకిత్తు వీఁ డవధ్యుఁ-
డిది యెట్టి దనినఁ బ్రహ్లాదుండు మద్భక్తుఁ-
డతనికి వరము నీ యన్వయమున
తెభా-10.2-443.1-తే.
జనన మందిన వారలఁ జంప ననుచుఁ
గడఁక మన్నించితిని యది కారణమున
విశ్వవిశ్వంభరాభార విపులభూరి
బలభుజాగర్వ మడఁపంగ వలయుఁగాన.
టీక:- అని = అని; సన్నుతించిన = పొగడగా; హరి = కృష్ణుడు; ఆత్మన్ = మనసునందు; మోదించి = సంతోషించి; మొగమునన్ = ముఖమునందు; చిఱునవ్వు = చిరునవ్వు; మొలకలెత్తన్ = చిగురించగా; లలితబాలేందుకళా మౌళి = శివుని {లలితబాలేందుకళామౌళి - మనోజ్ఞమైన బాలచంద్రుని రేఖతోడి శిఖ కలవాడు, శివుడు}; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనున్ = అనెను; శంకర = శివా; నీ = నీవు; మాట = చెప్పిన మాట; సత్యము = నిజము; అరయన్ = విచారించినచో; ఏది = ఏదైతే; నీ = నీ; కున్ = కి; ఇష్టము = కావలసినది; ఐ = అయ్యి; ఎసగెడు = అతిశయించునో; దానిని = దానిని; వేడుము = కోరుకొనుము; నీ = నీ; కున్ = కు; ఇత్తున్ = ఇచ్చెదను; వీడు = ఇతడు; అవధ్యుడు = చంపదగినవాడుకాదు; ఇది = ఇలా అగుట; ఎట్టిది = ఎలాంటిది; అనినన్ = అనగా; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; మత్ = నా యొక్క; భక్తుడు = భక్తుడు; అతని = అతని; కిన్ = కి; వరము = వరమిచ్చి; నీ = నీ; అన్వయమున = వంశమున; జననమందిన = పుట్టిన; వారలన్ = వారిని; చంపను = చంపను; అనుచు = అని; కడకన్ = పూని; మన్నించితిన్ = ఆదరించితిని; అది = ఆ; కారణమునన్ = కారణముచేత; విశ్వ = సమస్తమైన; విశ్వంభర = భూమి యొక్క; భార = భారము యొక్క; విపుల = విస్తారమైన; భూరి = అతి మిక్కుటమైన; బల = బలము కలిగిన; భుజ = బాహువుల వలని; గర్వమున్ = గర్వమును; అడపంగవలయున్ = అణచవలెను; కాన = కాబట్టి.
భావము:- ఇలా అని స్తుతించగా శ్రీకృష్ణుడు సంతోషించి చిరు నగవుల మోముతో ఇందురేఖాధరుడైన శివుడితో ఇలా అన్నాడు “ఓ శంకరా! నీవు సత్యము పలికావు. నీకు ఇష్టమైన కోరిక కోరుకో తీరుస్తాను. ఈ బాణాసురుడు అవధ్యుడు. ఎందుకంటే, నా భక్తుడైన ప్రహ్లాదుని వంశంవాడు. నీ వంశస్థులను సంహరించను అని ప్రహ్లాదుడికి నేను వరం ఇచ్చాను. అందువలన ఇతడు చంపదగినవాడు కాదు. అందువలన ఇతనిని క్షమించాను. కానీ సమస్త భూభారాన్ని మోస్తున్నాను అని అహంకరించే వీడి భుజగర్వాన్ని అణచివేయక తప్పదు.
తెభా-10.2-444-క.
కరములు నాలుగు సిక్కం
బరిమార్చితి, వీఁడు నీదు భక్తుల కగ్రే
సరుఁడై పొగడొంది జరా
మరణాది భయంబు దక్కి మను నిటమీఁదన్."
టీక:- కరములున్ = చేతులు; నాలుగు = నాలుగు (4); చిక్కన్ = మిగులునట్లు; పరిమార్చితిన్ = తొలగించితిని; వీడు = ఇతడు; నీదు = నీ యొక్క; భక్తుల = భక్తుల; కున్ = కు; అగ్రేసరుడు = ముఖ్యుడు; ఐ = అయ్యి; పొగడు = కీర్తింపబడుటను; ఒంది = పొంది; జరా = ముసలితనము; మరణ = చావు; ఆది = మున్నగు; భయంబున్ = భయములు; తక్కి = తొలగి; మనున్ = జీవించును; ఇటమీదన్ = ఇకముందు.
భావము:- అందుచేతనే, ఇతనికి నాలుగు చేతులు మాత్రం ఉంచి, తక్కిన హస్తాలను ఖండించాను. ఈ బాణాసురుడు నీ భక్తులలో అగ్రేసురుడుగా స్తుతింపబడుతూ, జరామరణాది భయాలు లేకుండా జీవిస్తాడు.”
తెభా-10.2-445-వ.
అని యానతిచ్చిన నంబికావరుండు సంతుష్టాంతరంగుం డయ్యె; నబ్బలినందనుం డట్లు రణరంగవేదిం గృష్ణదేవతాసన్నిధిం బ్రజ్వలిత చక్రకృశాను శిఖాజాలంబులందు నిజబాహా సహస్ర శాఖా సమిత్ప్రచయంబును, దత్‌క్షతోద్వేలకీలాల మహితాజ్యధారాశతంబును, బరభయంకర వీరహుంకార మంత్రంబులతోడ వేల్చి పరిశుద్ధిం బొంది విజ్ఞానదీపాంకురంబున భుజాఖర్వగర్వాంధకారంబు నివారించినవాఁడై యనవరతపూజితస్థాణుండగు నబ్బాణుండు, భుజవనవిచ్ఛేదజనితవిరూపితస్థాణుం డయ్యును దదీయవరదాన కలితానంద హృదయారవిందుం డగుచు గోవిందచరణారవిందంబులకుఁ బ్రణామంబు లాచరించి; యనంతరంబ.
టీక:- అని = అని; ఆనతిచ్చినన్ = చెప్పగా; అంబికావరుండు = శివుడు {అంబి కావరుడు - అంబిక (పార్వతీదేవి) యొక్క వరుడు (భర్త), శివుడు}; సంతుష్ట = సంతోషించిన; అంతరంగుండు = మనస్సు కలవాడు; అయ్యెన్ = అయ్యెను; ఆ = ఆ; బలినందనుండున్ = బాణాసురుడు; అట్లు = ఆ విధముగా; రణరంగ = యుద్ధభూమి అను; వేదిన్ = వేదిక యందు; కృష్ణదేవతా = కృష్ణభగవానుని; సన్నిధిన్ = ఎదుట; ప్రజ్వలిత = మిక్కిలి ప్రకాశించుచున్న; చక్ర = సుదర్శనచక్రము యొక్క; కృశాను = అగ్ని; శిఖా = మంటల; జాలంబులు = సమూహములు; అందున్ = అందు; నిజ = తన; బాహా = చేతులు; సహస్ర = వేయి (1000) అను; శాఖా = కొమ్మలు; సమిత్ = సమిధల; ప్రచయంబును = సమూహములు చేత; తత్ = ఆ; క్షత = గాయముల నుండి; ఉద్వేల = ఉబికి కారుచున్న; కీలాల = నెత్తురు అనెడి; మహిత = అధికమైన; అజ్య = నేతి; ధరా = ధారలు; శతంబును = వందలాదిచేత; పర = శత్రువులకు; భయంకర = భయము పుట్టించు; వీర = యోధుల యొక్క; హుంకార = హుంకారములు అను; మంత్రంబులు = మంత్రములు; తోడన్ = తోటి; వేల్చి = హోమము చేసి; పరిశుద్ధిన్ = రాగద్వేషాదులు తొలగుట; పొంది = పొంది; విజ్ఞాన = ఆత్మజ్ఞానము అను; దీప = దీపము యొక్క; అంకురంబునన్ = మంటలచేత; భుజ = అధిక భుజముల వలని; అఖర్వ = అధికమైన; గర్వ = గర్వము అను; అంధకారంబున్ = చీకటిని; నివారించిన = తొలగిన; వాడు = వాడు; ఐ = అయ్యి; అనవరత = ఎల్లప్పుడును; పూజిత = పూజింపబడిన; స్థాణుండు = శివుడు కలవాడు {స్థాణుడు - ప్రళయకాలమునను ఉండువాడు, శివుడు}; అగు = ఐన; ఆ = ఆ; బాణుండు = బాణాసురుడు; భుజ = చేతులు అను; వన = అడవిని; విచ్ఛేద = నరకుట వలన; జనిత = కలిగిన; విరూపిత = వికారముగా చేయబడిన; స్థాణుండు = మోడు/స్థిరము ఐనవాడు; అయ్యునున్ = అయినప్పటికి; తదీయ = ఆయొక్క; వర = వరము; దాన = ఇవ్వబడుటచేత; కలిత = కలిగిన; ఆనంద = సంతోషముతో కూడిన; హృదయ = హృదయము అను; అరవిందుండు = పద్మము కలవాడు; అగుచున్ = ఔతు; గోవింద = శివుని; చరణ = పాదములు అను; అరవిందంబులు = పద్మములు; కున్ = కు; ప్రణామంబులు = నమస్కారములు; ఆచరించి = చేసి; అనంతరంబ = పిమ్మట.
భావము:- ఈ మాదిరి శ్రీకృష్ణుడు అనుగ్రహించడంతో పరమేశ్వరుడు ఎంతో ఆనందించాడు. బాణాసురుడు ఈ విధంగా రణరంగం అనే యజ్ఞవేదికపై కృష్ణుడనే దేవుడి సన్నిధిలో భగభగమండుతున్న చక్రాయుధ జ్వాలలతో తన హస్తాలనే సమిధలను రక్తధారలనే ఆజ్య ధారలతో హూంకారాలనే మంత్రాలతో వేల్చి పరిశుద్ధుడు అయ్యాడు. విజ్ఞానదీపం ప్రకాశించడంతో భుజగర్వమనే అంధకారం తొలగింది. నిరంతర పరమేశ్వర ధ్యానానురక్తుడు అయిన బాణుడు శ్రీకృష్ణుడు ఇచ్చిన వరదానంతో మనసు నిండా ఆనందించాడు. గోవిందుడి పాదపద్మాలకు నమస్కారాలు చేసాడు.
తెభా-10.2-446-క.
పురమున కేగి యుషా సుం
దరికిని ననిరుద్ధునకు ముదంబున భూషాం
బర దాసదాసికాజన
వరవస్తువితాన మొసఁగి వారని భక్తిన్.
టీక:- పురమున్ = నగరమున; కున్ = కు; ఏగి = వెళ్ళి; ఉషా = ఉష అను; సుందరి = కన్య; కినిన్ = కి; అనిరుద్ధున్ = అనిరుద్ధుని {అనిరుద్ధుడు - ఇతరులచే రుద్ధము (అడ్డగింపబడుట) లేనివాడు}; కున్ = కి; ముదంబునన్ = సంతోషముతో; భూష = అలంకారములు; అంబర = వస్త్రములు; దాస = పనివాళ్ళ; దాసికా = పనికత్తెల; జన = సమూహమును; వర = శ్రేష్ఠమైన; వస్తు = వస్తువుల; వితానము = సమూహము; ఒసగి = ఇచ్చి; వారని = తగ్గని; భక్తిన్ = భక్తితో.
భావము:- అటుపిమ్మట, బాణుడు తన నగరానికి వెళ్ళి ఉష అనిరుద్ధులకు సంతోషంతో వస్త్రాభరణాలను, దాసీజనులను, విలువైన వస్తువులను ఇచ్చాడు.
తెభా-10.2-447-క.
కనకరథంబున నిడుకొని
ఘనవైభవ మొప్పఁ గన్యకాయుక్తముగా
ననిరుద్ధుని గోవిందుం
డనుమోదింపంగ దెచ్చి యర్పించె నృపా!
టీక:- కనక = బంగారపు; రథంబునన్ = రథముమీద; ఇడుకొని = ఉంచుకొని; ఘన = గొప్ప; వైభవము = వైభవము; ఒప్పన్ = కనబడుతుండగా; కన్యకా = కన్యతో; యుక్తముగా = కూడిన; అనిరుద్ధున్ = అనిరుద్ధుని; గోవిందుండు = కృష్ణుడు; అనుమోదింపంగ = సంతోషించగా; తెచ్చి = తీసుకువచ్చి; అర్పించెన్ = ఇచ్చెను; నృపా = రాజా.
భావము:- ఓ పరీక్షిత్తు మహారాజా! బంగారురథం మీద ఉషా అనిరుద్ధులను ఎక్కించి, మిక్కిలి వైభవంతో తీసుకుని వచ్చి శ్రీకృష్ణుడు సంతోషించేలా అప్పగించాడు.
తెభా-10.2-448-ఉ.
అంత మురాంతకుండు త్రిపురాంతకు వీడ్కొని బాణు నిల్పి య
త్యంతవిభూతిమై నిజబలావలితోఁ జనుదేర నా యుషా
కాంతుఁడు మున్నుగాఁ బటహ కాహళ తూర్య నినాద పూరితా
శాంతరుఁడై వెసం జనియె నాత్మ పురీముఖుఁడై ముదంబునన్.
టీక:- అతన్ = పిమ్మట; మురాంతకుండు = కృష్ణుడు; త్రిపురాంతకున్ = శివుని; వీడ్కొని = సెలవు తీసుకొని; బాణుని = బాణుని; నిల్పి = ఆపి; అత్యంత = మిక్కిలి; విభూతిమైన్ = వైభవముతో; నిజ = తన; బల = సైనిక; ఆవలి = సమూహము; తోన్ = తోటి; చనుదేరన్ = బయలుదేరగా; ఆ = ఆ; ఉషాకాంతుడు = అనిరుద్ధుడు; మున్నుగా = ముందువైపున ఉంచుకొని; పటహ = తప్పెటలు; కాహళ = బాకాలు; తూర్య = వాయిద్యాల; నినాద = మోతలతో; పూరిత = నిండిన; ఆశాంతరుడు = దిగ్భాగములు కలవాడు; ఐ = అయ్యి; వెసన్ = శీఘ్రముగా; చనియెన్ = వెళ్ళెను; ఆత్మ = తన; పురీ = నగరము; ముఖుండు = వైపు పోవువాడు; ఐ = అయ్యి; ముదంబునన్ = సంతోషముతో.
భావము:- ఆ తరువాత, మురాసురుని సంహరించిన కృష్ణుడు త్రిపురాసుర సంహారుడైన పరమ శివుని వద్ద సెలవు తీసుకుని, బాణాసురుడికి ఇక ఉండ మని చెప్పి. అత్యంత వైభవోపేతంగా పరివార సమేతుడై ఉషా అనిరుద్ధులను తీసుకుని పటహ, కాహాళ, తూర్యాదుల ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేలా మ్రోగుతుండగా ద్వారకానగరానికి బయలుదేరాడు.
తెభా-10.2-449-మ.
కనియెన్ గోపకుమారశేఖరుఁడు రంగత్ఫుల్లరాజీవ కో
కనదోత్తుంగ తరంగసంగత లసత్కాసారకన్ భూరి శో
భన నిత్యోన్నత సౌఖ్యభారక నుదంచద్వైభవోదారకన్
జనసంతాపనివారకన్ సుజనభాస్వత్తారకన్ ద్వారకన్.
టీక:- కనియెన్ = చూసెను; గోపకుమారశేఖరుడు = కృష్ణుడు {గోప కుమార శేఖరుడు - గోపక వంశము పుట్టినవారిలో శ్రేష్ఠుడు, కృష్ణుడు}; రంగత్ = చలించుచున్న; ఫుల్ల = వికసించిన; రాజీవ = తామరపూలతోటి; కోకనద = చెంగలువలతోటి; ఉత్తుంగ = ఎత్తైన; తరంగ = అలలతో; సంగత = కూడిన; లసత్ = ప్రకాశించుచున్న; కాసారకన్ = సరస్సులు కలదానిని; భూరి = అధికమైన; శోభన = శుభకార్యములతో; నిత్య = ఎడతెగని; ఉన్నత = అతిశయించిన; సౌఖ్య = సుఖముల యొక్క; భారకన్ = మిక్కుటముగా కలదానిని; ఉదంచత్ = విజృంభించిన; వైభవ = సంపత్సమృద్ధి కలిగి ఉండుట; ఉదారకున్ = మిక్కుటముగా కలదానిని; సుజన = సజ్జనుల; సంతాప = పరితాపములను; నివారకన్ = తొలగించుదానిని; సుజన = సుజ్జనులు అను; భాస్వత్ = వెలుగుచున్న; తారకన్ = నక్షత్రములు కలదానిని; ద్వారకన్ = ద్వారకానగరమును.
భావము:- గోపాలశేఖరుడైన శ్రీకృష్ణుడు వికసించిన కమలోత్పలాలతో, ఉత్తుంగ తరంగాలతో శోభిస్తున్న సరోవరాలతో నిండినదీ; అనునిత్యమూ సుఖవైభవాలకూ భోగభాగ్యాలకూ అలవాలమైనదీ; సుజనులకు కాపురమైనదీ అయిన ద్వారకను దర్శించాడు.
తెభా-10.2-450-వ.
కని డాయంజనఁ బురలక్ష్మి కృష్ణ సందర్శన కుతూహలయై చేసన్నలం జీరు చందంబున నందంబునొందు నుద్ధూతతరళ విచిత్ర కేతుపతాకాభిశోభితంబును, మహనీయ మరకతతోరణ మండితంబును, గనకమణి వినిర్మితగోపురసౌధప్రాసాద వీథికావిలసితంబును, మౌక్తిక వితానవిరచిత మంగళ రంగవల్లీ విరాజితంబును, శోభనాకలితవిన్యస్త కదళికాస్తంభ సురభి కుసుమమాలి కాక్షతాలంకృతంబును, గుంకుమ సలిల సిక్త విపణిమార్గంబును, శంఖ దుందుభి భేరీ మృదంగ పటహ కాహళాది తూర్య మంగళారావ కలితంబును, వంది మాగధ సంగీత ప్రసంగంబును నై యతి మనోహర విభవాభిరామం బైన యప్పురవరంబు సచివ పురోహిత సుహృద్బాంధవ ముఖ్యు లెదురుకొన భూసురాశీర్వాదంబులను బుణ్యాంగనా కరకలిత లలితాక్షతలను గైకొనుచుం గామినీమణులు గర్పూరనీరాజనంబులు నివాళింప నిజమందిరంబుం బ్రవేశించి యప్పుండరీకాక్షుండు పరమానందంబున సుఖం బుండె; నంత.
టీక:- కని = చూసి; డాయన్ = దగ్గరకు; జనన్ = వెళ్ళగా; పుర = పట్టణ వైభవము అను; లక్ష్మి = లక్ష్మీదేవి; కృష్ణ = కృష్ణుని; సందర్శన = చూచుట యందలి; కుతూహల = వేడుక కలామె; ఐ = అయ్యి; చే = చేతి; సన్నలన్ = సైగలచేత; చీరు = పిలుచుచున్న; చందంబునన్ = రీతిగా; అందంబున్ = అందమును; ఒందుచునున్ = పొందుతు; ఉద్ధూత = ఎగురవేయబడిన; తరళ = చలించుచున్న; విచిత్ర = నానా వర్ణ భరితమైన; కేతు = ధ్వజము నందలి; పతాకా = జండాల చేత; శోభితంబును = ప్రకాశించుచున్నది; మహనీయ = గొప్ప; మరకత = పచ్చల; తోరణ = తోరణములచే; మండితంబునున్ = అలంకరింపబడినది; కనక = బంగారపు; మణి = రత్నాలచేత; వినిర్మిత = కట్టబడిన; గోపుర = గోపురములు; సౌధ = మేడలు; ప్రాసాద = భవనములు; వీథికా = దారుల చేతను; విలసితంబును = ప్రకాశించునది; మౌక్తిక = ముత్యాల; వితాన = సమూహముచేత; విరచిత = వేయబడిన; మంగళ = శుభప్రదమైన; రంగవల్లీ = ముగ్గులచే; విరాజితంబును = విరాజిల్లుతున్నది; శోభనా = శుభకార్యములకు; ఆకలిత = అంతట కూర్చబడిన వై; విన్యస్త = ఉంచబడిన; కదళికా = అరటిబోదెల; స్తంభ = స్తంభములచోత; సురభి = పరిమళించుచున్న; కుసుమ = పూల; మాలికా = దండలచేత; అక్షతా = అక్షింతలచేత; అలంకృతంబును = అలంకరింపబడినది; కుంకుమ = కుంకుమ కలిపిన; సలిల = నీటితో; సిక్త = తడపబడిన; విపణి = బజారు; మార్గంబును = వీధులు కలది; శంఖ = శంఖములు; దుందుభి = పెద్దనగారాలు; భేరీ = రాండోళ్ళు; మృదంగ = మద్దెలలు; పటహ = తప్పెటలు; కాహళ = బాకాలు; ఆది = మున్నగు; తూర్య = వాయిద్యాల; మంగళ = శుభకరమైన; ఆరావ = శబ్దములతో; కలితంబును = కూడినది; వంది = స్తుతి పాఠకుల {వంది - వందించు (వంశావళి స్తుతి పాఠములు చదువి) జీవించువారు వారు}; మాగధ = బిరుదులు ఉగ్గడించువారల {మాగధుడు - బిరుదులను ఉగ్గడించి కీర్తించుచు జీవించువాడు, గాయకుడు, మాగధుడు}; సంగీత = కీర్తనలు పాడువారల; ప్రసంగంబునున్ = పలుకుబడులు కలది; ఐ = అయ్యి; అతి = మిక్కిలి; మనోహర = మనోజ్ఞమైన; విభవ = వైభవములతో; అభిరామంబున్ = విరాజిల్లుతున్నది; ఐన = అగు; ఆ = ఆ ప్రసిద్ధమైన; పుర = పట్టణములలో; వరంబున్ = ఉత్తమమైనదానిని; సచివ = మంత్రులు; పురోహిత = పురోహితులు; సుహృత్తులు = స్నేహితులు; బాంధవ = బంధువులు; ముఖ్యులు = మొదలగువారు; ఎదురుకొనన్ = ఎదురురాగా; భూసుర = విప్రుల; ఆశార్వాదంబులును = దీవెనలు; పుణ్యాంగనా = పునిస్త్రీల; కర = చేతులలో; కలిత = ఉన్నట్టి; లలిత = అందమైన; అక్షతలనున్ = అక్షింతలను; కైకొనుచున్ = తీసుకొంటు; కామినీ = సుందరీమణులు; కర్పూర = కర్పూరపు; నీరాజనంబులున్ = హారతులను; నివాళింపన్ = చుట్టి యిడగా; నిజ = తన; మందిరంబున్ = నివాసమును; ప్రవేశించి = ప్రవేశించి; ఆ = ఆ ప్రసిద్ధమైన; పుండరీకాక్షుండు = కృష్ణుడు; పరమ = మిక్కిలి; ఆనందంబునన్ = సంతోషముతో; సుఖంబు = సుఖముగా; ఉండెన్ = ఉండెను; అంత = అతట.
భావము:- ద్వారకానగరంలోని జండాలు శ్రీకృష్ణుడిని రా రమ్మని నగరలక్ష్మి పిలుస్తున్నట్లుగా ఉన్నాయి; మరకతాల తోరణాలతో మణులు పొదగిన బంగారు భవనాలతో నగరం విలసిల్లుతున్నది; పట్టణంలో ముత్యాల రంగవల్లులు తీర్చబడ్డాయి; అరటి స్తంభాలకు మంచి సువాసనల పుష్పమాలలు అలంకరించబడ్డాయి; ఆ పట్ణణ విపణిమార్గం కుంకుమ నీటితో తడుపబడింది; శంఖ, దుందుభి, భేరీ, మృదంగాది మంగళ వాద్యాలు మ్రోగుతూ ఉన్నాయి; వందిమాగధుల సంగీత ప్రసంగాలు అతిశయించాయి; ఇంతటి వైభవంతో విలసిల్లుతున్న ద్వారకాపట్టణం లోనికి శ్రీకృష్ణుడు ప్రవేశించాడు; పురోహిత, బంధుమిత్రులు స్వాగతం పలికారు; బ్రాహ్మణులు ఆశీర్వదించారు; పుణ్యస్త్రీలు శుభ అక్షతలు జల్లారు; కామినీమణులు కర్పూర హారతులు ఇచ్చారు; గోవిందుడు తన మందిరంలో ప్రవేశించి ఆనందడోలికలలో తేలియాడుతూ సుఖంగా ఉండసాగాడు.
తెభా-10.2-451-క.
శ్రీకృష్ణుని విజయం బగు
నీ కథఁ బఠియించువార లెప్పుడు జయముం
గైకొని యిహపరసౌఖ్యము
లాకల్పోన్నతి వహింతు రవనీనాథా!"
టీక:- శ్రీకృష్ణుని = శ్రీకృష్ణుని; విజయంబు = గెలుపు గలది; అగున్ = ఐన; ఈ = ఈ; కథన్ = వృత్తాంతమును; పఠియించు వారలు = చదువువారు; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; జయమున్ = విజయమును; కైకొని = చేపట్టి; ఇహ = ఈ లోకపు; పర = పర లోకపు; సౌఖ్యములు = సుఖములను; ఆకల్ప = కల్పాంతము వరకు; ఉన్నతిన్ = ఉన్నతిని; వహింతురు = పొందుదురు; అవనీనాథా = పరీక్షిన్మహారాజా.
భావము:- ఓ పరీక్షన్మహారాజా! ఈ శ్రీకృష్ణ విజయగాథను పఠించినవారికి ఎల్లప్పుడూ విజయాలు చేకూరుతాయి. ఇహ పర సౌఖ్యాలు శాశ్వతంగా లభిస్తాయి.”
తెభా-10.2-452-క.
అని చెప్పిన శుకయోగికి
జననాయకుఁ డనియెఁ గృష్ణచరితము విన నా
మన మెపుడుఁ దనియ దింకను
విన వలతుం గరుణఁ జెప్పవే మునినాథా!"
టీక:- అని = ఇట్లు; చెప్పిన = తెలియజెప్పిన; శుక = శుకుడు అను; యోగి = ఋషి; కిన్ = కి; జననాయకుడు = రాజు (పరీక్షిత్తు); అనియెన్ = చెప్పెను; కృష్ణ = కృష్ణుని; చరితము = వృత్తాంతములు; వినన్ = వినుట యందు; నా = నా యొక్క; మనము = మనస్సు; ఎపుడున్ = ఎప్పటికి; తనియదు = తృప్తిచెందదు; ఇంకను = ఇంకా; వినన్ = వినవలెనని; వలతున్ = కోరెదను; కరుణన్ = దయతో; చెప్పవే = చెప్పుము; ముని = మునులలో; నాథా = శ్రేష్ఠుడా.
భావము:- ఇలా పరీక్షిత్తుతో శుకయోగీంద్రుడు చెప్పాడు. పరీక్షిత్తు శుకుడితో “కృష్ణుని చరిత్ర వినడానికి మనస్సు ఇంకా ఉవ్విళ్ళూరుతున్నది. సంతృప్తి కలుగుట లేదు. దయచేసి, ఆ కథలను ఇంకా చెప్ప” మని ప్రార్థించాడు.
తెభా-10.2-453-వ.
అనినఁ బరీక్షిన్నరేంద్రునకు శుకయోగీంద్రుం డిట్లనియె.
టీక:- అనినన్ = అని అడుగగా; పరీక్షిత్ = పరీక్షిత్తు అను; నరేంద్రున్ = మహారాజున; కున్ = కు; శుక = శుకుడు అను; యోగి = యోగులలో; ఇంద్రుండు = ఉత్తముడు; ఇట్లు = ఇలా; అనియెన్ = పలికెను.
భావము:- అలా తనను కోరిన పరీక్షన్నరేంద్రుడితో శుకమునీంద్రుడు ఇలా చెప్పసాగాడు...