పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శంబరోద్యగంబు
శంబరోద్యగంబు
←ప్రద్యుమ్న జన్మంబు | తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/శంబరోద్యగంబు) రచయిత: పోతన |
రతీప్రద్యుమ్నులాగమనంబు→ |
తెభా-10.2-17-మ.
గురు మాయారణవేదియై, కవచియై, కోదండియై, బాణియై
హరిజుం "డోరి! నిశాట! వైచితివి నాఁ డంభోనిధిన్ నన్ను, ఘో
రరణాంభోనిధి వైతు నిన్ను నిదె వే ర"మ్మంచుఁ జీరెన్ మనో
హర దివ్యాంబరు నుల్లసద్దనుజ సేనాడంబరున్ శంబరున్.
టీక:- గురు = గొప్ప; మాయా = మాయలతోకూడిన; రణ = యుద్ధమును; వేది = ఎరిగినవాడు; ఐ = అయ్యి; కవచి = కవచము తొడిగినవాడు; ఐ = అయ్యి; కోదండి = విల్లు గలవాడు {కోదండము - ధనుస్సులలో విశేషము, వెదురు విల్లు}; ఐ = అయ్యి; బాణి = బాణములు కలవాడు; ఐ = అయ్యి; హరిజుండు = ప్రద్యుమ్నుడు {హరిజుడు - కృష్ణుని పుత్రుడు, ప్రద్యుమ్నుడు}; ఓరి = ఒరేయ్; నిశాట = రాక్షసుడా {నిశాటుడు - రాత్రించరుడు, రాక్షసుడు}; వైచితివి = పడవేసితివి; నాడు = ఆవేళ; అంభోనిధిన్ = సముద్రము నందు {అంభోనిధి - నీటికి నిధి, కడలి}; నన్నున్ = నన్ను; ఘోర = భీకరమైన; రణ = యుద్ధము అనెడి; అంభోనిధిన్ = సముద్రము నందు; వైతున్ = వేసెదను, చంపెదను; నిన్నున్ = నిన్ను; ఇదె = ఇదిగో; వేన్ = వేగముగా; రమ్ము = రా; అంచున్ = అని; చీరెన్ = పిలిచెను; మనోహర = మనోజ్ఞములైన; దివ్య = దివ్యములైన; అంబరున్ = వస్త్రములు కలవానిని; ఉల్లసత్ = ఉత్సాహవంత మైన; దనుజ = రాక్షస; సేనా = సేనల; ఆడంబరున్ = యుద్ధవాద్యధ్వని కలవానిని; శంబరున్ = శంబరాసురున్.
భావము:- ప్రద్యుమ్నుడు ఆ విధంగా గొప్ప మాయాయుద్ధ ప్రవీణుడు అయ్యాడు. పిమ్మట కవచమును ధరించాడు ధనుర్భాణములను చేబట్టాడు. మనోహరమైన వస్త్రాలంకారాలు ధరించువాడు, గొప్ప దానవసేనతో విలసిల్లుతున్న వాడు అయిన శంబరుణ్ణి “ఓరీ! రాక్షసా! ఆనాడు నన్ను సముద్రంలో పారేశావు కదా. ఈనాడు నిన్ను యుద్ధసముద్రంలో పడవేస్తాను. వేగంగా రారా” అని పిలిచాడు.
తెభా-10.2-18-చ.
అదలిచి యిట్టు కృష్ణసుతుఁ డాడిన నిష్ఠుర భాషణంబులం
బదహతమై వడిం గవియు పన్నగరాజముఁ బోలి శంబరుం
డదరుచు లేచి వచ్చి గద నచ్యుతనందను వ్రేసె నుజ్జ్వల
ద్భిదురకఠోరఘోష సమభీషణనాదము చేసి యార్చుచున్.
టీక:- అదలిచి = గద్దించి; ఇట్టు = ఈ విధముగ; కృష్ణసుతుడు = ప్రద్యుమ్నుడు; ఆడిన = పలికిన; నిష్ఠుర = కఠోరమైన; భాషణంబులన్ = మాటలచేత; పదహతము = కాలితో తన్నబడినది; వడిన్ = వేగముగా; కవియు = తిరగబడు; పన్నగ = సర్పములలో; రాజమున్ = శ్రేష్ఠము; పోలి = వలెను; శంబరుండు = శంబరుడు; అదరుచున్ = తత్తరిల్లుచు; లేచి = బయలుదేరి; వచ్చి = వచ్చి; గదన్ = గదతో; అచ్యుతనందనునన్ = ప్రద్యుమ్నుని; వ్రేసెన్ = కొట్టెను; ఉజ్జ్వలత్ = ప్రకాశించుచున్న; భిదుర = వజ్రాయుధము యొక్క; కఠోర = కఠినమైన, భీకర; ఘోష = ధ్వనితో; సమ = పోలిన; భీషణ = భయంకరమైన; నాదమున్ = ధ్వని; చేసి = కలుగజేసి; ఆర్చుచున్ = సింహనాదముచేస్తూ.
భావము:- ఈలా తనను ప్రద్యుమ్నుడు గద్దించి దూషణ వాక్యాలు పలుకడంతో, శంబరుడు తోకతొక్కిన పామువలె దర్పంతో విజృంభించి, వజ్రాయుధ మంత కఠోరమైన కంఠంతో గర్జిస్తూ, తన గదా దండంతో ప్రద్యుమ్నుణ్ణి కొట్టాడు.
తెభా-10.2-19-క.
దనుజేంద్రుఁడు వ్రేసిన గదఁ
దన గదచేఁ బాయ నడిచి దనుజులు బెదరన్
దనుజాంతకుని కుమారుఁడు
దనుజేశుని మీఁద నార్చి తన గద వైచెన్.
టీక:- దనుజ = రాక్షస; ఇంద్రుడు = రాజు; వ్రేసిన = కొట్టిన; గదన్ = గదను; తన = తన యొక్క; గద = గద; చేన్ = చేత; పాయన్ = తొలగ; నడచి = తోసి; దనుజులు = రాక్షసులు; బెదరన్ = భయపడునట్లు; దనుజాంతకుని = కృష్ణుని {దను జాంతకుడు - రాక్షసులను సంహరించు వాడు, విష్ణువు}; కుమారుడు = కొడుకు; దనుజేశుని = శంబరాసురుని; మీదన్ = మీద; ఆర్చి = సింహనాదముచేసి; తన = తన యొక్క; గద = గదను; వైచెన్ = విసిరి వేసెను.
భావము:- ప్రద్యుమ్నుడు రాక్షసరాజు గదను తన గదతో భగ్నం చేసి రాక్షసులు భయంచెందేలా బొబ్బపెట్టి, తన గదతో రాక్షసుడిని మోదాడు.
తెభా-10.2-20-వ.
అంత నా రక్కసుండు వెక్కసంబగు రోషంబునఁ దనకు దొల్లి మయుం డెఱింగించిన దైతేయమాయ నాశ్రయించి మింటికి నెగసి, పంచబాణునిపై బాణవర్షంబు గురిసిన; నమ్మహారథుండు నొచ్చియు సంచలింపక మచ్చరంబున సర్వమాయా వినాశిని యైన సాత్త్విక మాయం బ్రయోగించి దనుజుని బాణవృష్టి నివారించె; మఱియు వాఁడు భుజగ గుహ్యక పిశాచ మాయలు పన్ని నొప్పించిన నన్నియుం దప్పించి.
టీక:- అంతన్ = అంతట; ఆ = ఆ; రక్కసుండు = రాక్షసుడు {రాక్షసుడు(ప్ర) - రక్కసుడు(వి)}; వెక్కసంబు = సహింపరానిది; అగు = ఐన; రోషంబునన్ = కోపముచేత; తన = అతని; కున్ = కి; తొల్లి = పూర్వకాలము నందు; మయుండు = మయుడు; ఎఱింగించిన = తెలియజేసిన; దైతేయ = రాక్షస; మాయా = మాయను; ఆశ్రయించి = చేపట్టి; మిన్ను = ఆకాశమున; కిన్ = కి; ఎగిసి = ఎగిరి; పంచబాణుని = ప్రద్యుమ్నుని; పై = మీద; బాణ = బాణముల; వర్షంబున్ = వర్షము; కురిసినన్ = కురిపించగా; ఆ = ఆ ప్రసిద్ధుడైన; మహారథుండు = మహారథుడు {మహారథుడు - పదకొండువేల యోధులతో ఎదిరించి యుద్ధము చేయజాలినవాడు; నొచ్చియు = బాధనొందినను; సంచంలింపక = సోలిపోక; మచ్చరంబునన్ = విడువని విరోధముతో; సర్వ = ఎల్ల; మాయా = మాయలను; వినాశిని = నశింప జేసెడిది; ఐన = అయిన; సాత్త్విక = సత్వ గుణప్రధానమైన; మాయన్ = మాయను; ప్రయోగించి = వాడి; దనుజుని = రాక్షసుని; బాణ = బాణముల; వృష్టి = వర్షముచేత; నివారించె = అణచివేసెను; మఱియు = ఇంకను; వాడు = అతడు; భుజగ = సర్పముల; గుహ్యక = గుహ్యకుల; పిశాచ = పిశాచముల; మాయలున్ = మాయలను; పన్ని = కలుగజేసి; నొప్పించినన్ = బాధించగా; అన్నియున్ = అన్నిటిని; తప్పించి = తొలగించి;
భావము:- అప్పుడు శంబరుడు మితిమీరిన రోషంతో తనకు పూర్వం మయుడు నేర్పిన రాక్షసమాయతో ఆకాశంలోకి ఎగిరి, ప్రద్యుమ్నుడిపై బాణవర్షం కురిపించాడు. ప్రద్యుమ్నుడు బాణవర్ష బాధకు ఓర్చుకుని సర్వ మాయలను నశింపజేయగల సాత్త్వికమాయ అనే విద్యను ప్రయోగించి, శంబరుడి శరవర్షాన్ని ఆపాడు. మళ్ళీ శంబరుడు ఎన్నో పిశాచమాయలను గుప్పించి నొప్పించాడు. ఆ మాయలను అన్నింటి నుండీ ప్రద్యుమ్నుడు తప్పించుకున్నాడు.
తెభా-10.2-21-క.
దండధర మూర్తిఁ గైకొని
యొండాడక చక్రిసూనుఁ డుగ్రతరాసిన్
ఖండించె శంబరుని తలఁ
గుండల కోటీర మణులు గుంభిని రాలన్.
టీక:- దండధర = యముని వంటి; మూర్తిన్ = స్వరూపము; కైకొని = గ్రహించి; ఒండాడక = మారుపలుకకుండ; చక్రిసూనుడు = ప్రద్యుమ్నుడు {చక్రి సూనుడు - కృష్ణుని కొడుకు, ప్రద్యుమ్నుడు}; ఉగ్రతర = మిక్కిలి భీకరమైన {ఉగ్రము - ఉగ్రతరము - ఉగ్రతమము}; అసిన్ = ఖడ్గముచేత; ఖండించె = నరికెను; శంబరుని = శంబరాసురుని; తలన్ = శిరస్సును; కుండల = చెవి కుండలములు; కోటిర = కిరీటము లందలి; మణులు = రత్నాలు; కుంభినిన్ = నేలమీద; రాలన్ = రాలిపోవునట్లుగ.
భావము:- శ్రీకృష్ణుడి కుమారుడగు ప్రద్యుమ్నుడు దండం ధరించు యముడి వలె భయంకర రూపము ధరించి, భీకరమైన పదును గల ఖడ్గంతో శంబరుని శిరస్సు ఖండించాడు. కిరీట కుండలాలలోని మణులు అన్నీ నేలరాలాయి.
తెభా-10.2-22-క.
చిగురాకడిదపు ధారను
జగములఁ బరవశము సేయు చలపాదికి దొ
డ్డగు నుక్కడిదంబునఁ దన
పగతుం దెగ వ్రేయు టెంత పని చింతింపన్?
టీక:- చిగురాకు = చిగురాకు అనెడి; అడిదపు = కత్తి యొక్క; ధారను = పదునుతో, అంచుతో; జగములను = లోకములను; పరవశము = చొక్కునట్లు; చేయు = చేయగలిగిన; చలపాది = అసమానుడు, దుస్సహుడు అయిన వాని; కిన్ = కి; దొడ్డ = పెద్దది; అగున్ = ఐన; ఉక్కు = ఉక్కు; అడిదంబునన్ = కత్తి; తన = తన యొక్క; పగతున్ = శత్రువును; తెగవ్రేయుట = సంహరించుట; ఎంతపని = పెద్దపనా, కాదు; చింతింపన్ = తరచిచూసినచో.
భావము:- చిగురాకు కత్తిపదునుతోనే ప్రపంచాన్ని లొంగదీయగల వాడు, అసమాన వీరుడు అయిన, ప్రద్యుమ్నుడికి పెద్ద ఉక్కుకత్తితో శత్రువు శిరస్సు ఖండించడం ఏమంత పెద్ద పని కాదు కదా.
తెభా-10.2-23-క.
బెగడుచు నుండఁగ శంబరుఁ
దెగడుచుఁ బూవింటిజోదు ధీరగుణంబుల్
వొగడుచుఁ గురిసిరి ముదమున
నెగడుచుఁ గుసుమముల ముసురు నిర్జరు లధిపా!
టీక:- బెగడుచును = భయపడుతు; ఉండగ = ఉన్న సమయము నందు; శంబరున్ = శంబరాసురుని; తెగడుచున్ = నిందిస్తూ; పూవింటిజోదు = ప్రద్యుమ్నుని {పూవింటిజోదు - పూల ధనుస్సు యోధుడు, ప్రద్యుమ్నుడు}; ధీర = ధైర్యము; గుణంబుల్ = గుణములు; పొగడుచున్ = శ్లాఘించుచు; కురిసిరి = కురిపించిరి; ముదమున = సంతోషముతో; నెగడుచున్ = అతిశయించుచు; కుసుమముల = పూల; ముసురు = ఎడతెగని వాన; నిర్జరులు = దేవతలు; అధిపా = రాజా.
భావము:- దేవతలు తాము బెదురుతూ బ్రతుకుతుండే, ఆ శంబరుణ్ణి సంహరించిన ప్రద్యుమ్నుడి ధైర్యాన్ని కీర్తిస్తూ, శంబరుడిని నిందిస్తూ ఆనందంగా పూలవాన కురిపించారు.