Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రతీ ప్రద్యుమ్ను లాగమనంబు

వికీసోర్స్ నుండి

రతీప్రద్యుమ్నులాగమనంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/రతీ ప్రద్యుమ్ను లాగమనంబు)
రచయిత: పోతన



తెభా-10.2-24-వ.
ఇట్లు శంబరుని వధియించి విలసిల్లుచున్న యించువిలుకానిం గొంచు నాకాశచారిణియైన యా రతీదేవి, గగనపథంబుఁ బట్టి ద్వారకా నగరోపరిభాగమునకుం జనుదెంచిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; శంబరుని = శంబరాసురుని; వధియించి = సంహరించి; విలసిల్లుచున్న = ప్రకాశించుచున్న; ఇంచువిలుకాడు = ప్రద్యుమ్నుడిని {ఇంచువిలుకాడు - ఇంచు (ఇక్షు, చెరకు) విలుకాడు (విల్లు కలవాడు), మన్మథుడు}; కొంచున్ = తీసుకొని; ఆకాశచారిణి = ఆకాశగమనస్తురాలు; ఐన = అయిన; ఆ = ఆ ప్రసిద్ధురాలైన; రతీదేవి = మాయాదేవి; గగన = ఆకాశ; పథంబున్ = మార్గమును; పట్టి = వెంబడి; ద్వారకానగర = ద్వారకానగరపు; ఉపరి = మీది; భాగమున్ = భాగమున; కున్ = కు; చనుదెంచిన = రాగా.
భావము:- ఈ విధంగా శంబరుడిని సంహరించి శోభిస్తున్న ప్రద్యుమ్నుడిని తీసుకుని, ఖేచరి అయిన రతీదేవి ఆకాశమార్గం గుండా ద్వారకానగరం దగ్గరికి వచ్చింది.

తెభా-10.2-25-ఆ.
మెఱుఁగుఁదీగెతోడి మేఘంబు కైవడి
యువిదతోడ మింటి నుండి కదలి
రుగుదెంచె మదనుఁ డంగనాజనములు
మెలఁగుచున్న లోనిమేడకడకు.

టీక:- మెఱుగుతీగె = మెరుపుతీగె; తోడి = తోటి; మేఘంబు = మేఘము; కైవడిన్ = వలె; ఉవిద = స్త్రీ; తోడన్ = తోటి; మిన్ను = ఆకాశము; నుండి = నుంచి; కదలి = బయలుదేరి; అరుగుదెంచె = వచ్చెను; మదనుడు = ప్రద్యుమ్నుడు; అంగనాజనములు = అంతఃపురస్త్రీలు; మెలగుచున్న = తిరుగెడి; లోనిమేడ = అంతఃపురము మేడ; కడ = వద్ద; కున్ = కు.
భావము:- మాయాదేవితో కూడిన ప్రద్యుమ్నుడు మెఱుపుతీగతో కూడిన మేఘంలా శోభిస్తూ ఆకాశంలో నుండి దిగి స్త్రీలు నివసించే అంతఃపురం మేడ మీదకు చేరాడు.

తెభా-10.2-26-మ.
దశ్యాముఁ బ్రలంబబాహుయుగళుం జంద్రాననున్ నీల సం
కువక్రాలకుఁ బీతవాసు ఘనవక్షున్ సింహమధ్యున్ మహో
త్పపత్త్రేక్షణు మందహాసలలితుం బంచాయుధున్ నీరజా
క్షులు దారేమఱుపాటఁ జూచి హరి యంచుం డాఁగి రయ్యైయెడన్.

టీక:- జలద = మేఘము వంటి; శ్యామున్ = నీలివర్ణమువాని; ప్రలంబ = మిక్కిలి వేలాడుచున్న, పొడవైన; బాహు = చేతుల; యుగళున్ = జంట కలవానిని; చంద్రా = చంద్రునివంటి; ఆననున్ = ముఖము కలవానిని; నీల = నల్లని; సంకుల = సంకీర్ణమైన, వ్యాపించిన; వక్రా = ఉంగరాలు తిరిగిన; అలకున్ = ముంగురులు కలవాడు; పీత = పచ్చని; వాసున్ = వస్త్రములు కలవాని; ఘన = పెద్ధ; వక్షున్ = రొమ్ము కలవాని; సింహ = సింహమువంటి; మధ్యున్ = నడుము కలవాని; మహా = పెద్ద; ఉత్పల = కలువ; పత్ర = రేకుల వంటి; ఈక్షణున్ = కన్నులు కలవాని; మందహాస = చిరునవ్వుచేత; లలితున్ = మనోహరున్; పంచాయుధున్ = ప్రద్యుమ్నుని {పంచయుధుడు - 1ఉన్మాదన 2తాపస 3శోషణ 4స్తంభన 5సమ్మోహనములను ఐదు (5) బాణములు కలవాడు, 1అరవిందము 2అశోకము 3శోషణ 4స్తంభన 5సమ్మోహనములను ఐదు (5) పూలబాణములు కలవాడు, మన్మథుడు}; నీరజాక్షులున్ = స్త్రీలు; తారు = తాము; ఏమఱుపాటన్ = పరాకుగా; చూచి = చూసి; హరి = కృష్ణుడే; అంచున్ = అని; డాగిరి = దాగుకొనిరి; అయ్యై = అయా; ఎడన్ = ప్రదేశములందు.
భావము:- మేఘము వంటి నీలవర్ణ దేహము; ఆజాను బాహువులు; చంద్రుని బోలిన నెమ్మొగము; వ్యాపించిన నల్లని ఉంగరాల ముంగురులు; పచ్చని వస్త్రం; విశాల వక్షఃస్థలము; సన్నని నడుము; కలువరేకుల వంటి కన్నులు; మృదువైన చిరునవ్వు గల ప్రద్యుమ్నుడిని అక్కడి స్త్రీలు ఏమరుపాటుగా చూసి, శ్రీకృష్ణుడని భ్రమించి అక్కడి కక్కడ చాటులకు చేరారు.

తెభా-10.2-27-క.
కొంఱు హరి యగు నందురు,
కొంఱు చిహ్నములు కొన్నికొన్ని హరికి లే
వందురు, మెల్లనె తెలియుద
మందురు మరుఁ జూచి కొంద బలలు గుములై.

టీక:- కొందఱు = కొంతమంది; హరి = కృష్ణుడు; అగును = అగును; అందురు = అంటారు; కొందఱు = కొంతమంది; చిహ్నములున్ = గురుతులు; కొన్నికొన్ని = కొంతవరకు; హరి = కృష్ణుని; కిన్ = కి; లేవు = లేవు; అందురు = అంటారు; మెల్లనన్ = తిన్నగా; తెలియుదము = తెలిసికొందము; అందురు = అనుచున్నారు; మరున్ = మన్మథుని; చూచి = చూసి; కొందఱు = కొంతమంది; అబలలు = స్త్రీలు; గుములు = గుంపులు కూడుకొన్నవారు; ఐ = అయ్యి.
భావము:- ప్రద్యుమ్నుడిని చూసిన కొందరు స్త్రీలు “శ్రీ కృష్ణుడే” అని అనగా, మరికొందరు “శ్రీకృష్ణునిలో ఇతని లక్షణాలు కొన్ని లే”వని అన్నారు. ఇంకా కొందరు “నెమ్మదిగా ఈ విషయం తెలుసుకుందా”మని గుంపులు గుంపులుగా చేరి.....

తెభా-10.2-28-క.
రి యని వెనుచని పిదపన్
రిఁ బోలెడువాఁడు గాని రి గాఁ డనుచున్
రిమధ్య లల్లనల్లన
రినందను డాయ వచ్చి రాశ్చర్యమునన్.

టీక:- హరి = కృష్ణుడు; అని = అని; వెను = వెనుకకు; చని = పోయి; పిదపన్ = పిమ్మట; హరిన్ = కృష్ణుని; పోలెడు = వంటి; వాడున్ = వాడు; కాని = తప్పించి; హరి = కృష్ణుడు; కాడు = కాడు; అనుచున్ = అని; హరిమధ్యలు = సుందరీమణులు {హరిమధ్య - సింహము వంటి నడుము కలవారు, స్త్రీలు}; అల్లనల్లన = మెల్లమెల్లగా; హరినందనున్ = ప్రద్యుమ్నుని; డాయ = దగ్గరకు; వచ్చిరి = వచ్చిరి; ఆశ్చర్యమునన్ = వింతగా.
భావము:- “శ్రీకృష్ణుడే” అని కొంతదూరం వెళ్ళి, “శ్రీకృష్ణుడిలా ఉన్నాడే కాని శ్రీకృష్ణుడు కా” డని అంటూ అంతఃపుర స్త్రీలు ఆశ్చర్యపోతూ శ్రీకృష్ణుడి కుమారు డైన ప్రద్యుమ్నుడిని సమీపించారు.

తెభా-10.2-29-ఉ.
న్నులు సేర వచ్చి మరు నందఱుఁ జూడఁగఁ దాను వచ్చి సం
న్న గుణాభిరామ హరిట్టపుదేవి విదర్భపుత్రి క్రే
న్నుల నా కుమారకుని కైవడి నేర్పడఁ జూచి బోటితోఁ
న్నులు సేఁప నిట్లనియె సంభ్రమదైన్యము లుల్లసిల్లఁగన్.

టీక:- అన్నులు = స్త్రీలు; చేరన్ = దగ్గరకు; వచ్చి = వచ్చి; మరున్ = ప్రద్యుమ్నున్; అందఱున్ = అందరు; చూడగన్ = చూచుచుండగ; తాను = తాను; వచ్చి = వచ్చి; సంపన్నగుణ = మంచి గుణములచేత; అభిరామ = చక్కటి ఆమె; హరి = కృష్ణుని; పట్టపుదేవి = పట్టపురాణి; విదర్భపుత్రి = రుక్మిణీదేవి{ విదర్భపుత్రి - విదర్బ దేశపు రాకుమారి, రుక్మిణి}; క్రేగన్నుల = కడకన్నులచేత; ఆ = ఆ యొక్క; కుమారకుని = పిల్లవాని; కైవడిన్ = వైపు; ఏర్పడన్ = విశదముగా; చూచి = చూసి; బోటి = చెలికత్తె; తోన్ = తోటి; చన్నులు = స్తనములు; చేపన్ = పాలు చేపుతుండగా; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; సంభ్రమ = తొట్రుపాటు; దైన్యములున్ = దీనత్వములు; ఉల్లసిల్లన్ = ప్రకాశింపగా.
భావము:- స్త్రీ లందరూ ప్రద్యుమ్నుడిని చూడటానికి రాగా శ్రీకృష్ణుని పట్టపుదేవి, విదర్భ రాకుమారి, సుగుణాలదీవి అయిన రుక్మిణీదేవి క్రీగంటితో ఆ పిల్లవాని రూపురేఖలను చూసి పాలిండ్లు చేపగా దైన్య సంభ్రమాలు ముప్పిరిగొనగా చెలికత్తెతో ఇలా అంది.

తెభా-10.2-30-శా.
" కంజేక్షణుఁ డీ కుమారతిలకుం డీ యిందుబింబాననుం
డీ కంఠీరవమధ్యుఁ డిచ్చటికి నేఁ డెందుండి యేతెంచెనో
యీ ల్యాణునిఁ గన్న భాగ్యవతి మున్నే నోములన్ నోఁచెనో
యే కాంతామణియందు వీని కనెనో యేకాంతుఁ డీ కాంతునిన్.

టీక:- ఈ = ఈ; కంజ = కమలముల వంటి; ఈక్షణుడు = కన్నులు కలవాడు; ఈ = ఈ; కుమార = బాలురలో; తిలకుడు = శ్రేష్ఠుడు; ఈ = ఈ; ఇందుబింబా = చంద్రబింబము వంటి; ఆననుండు = ముఖము కలవాడు; ఈ = ఈ; కంఠీరవ = సింహమువంటి; మధ్యుడు = నడుము కలవాడు; ఇచ్చటి = ఇక్కడ; కిన్ = కి; నేడు = ఇవాళ; ఎందుండి = ఎక్కడనుండి; ఏతెంచెనో = వచ్చెనో; ఈ = ఈ; కల్యాణునిన్ = శుభలక్షణుని; కన్న = కనినట్టి; భాగ్యవతి = అదృష్టవంతురాలు; మున్ను = మునుపు; ఏ = ఎట్టి; నోములన్ = వ్రతములను; నోచెనో = ఆచరించెనో; ఏ = ఏ; కాంతా = స్త్రీలలో; మణి = ఉత్తమురాలు; అందున్ = అందు; వీనిన్ = ఇతనిని; కనెనో = పొందెనో; ఏ = ఏ; కాంతుడు = పురుషుడు; ఈ = ఈ; కాంతునిన్ = అందగానిని.
భావము:- ఈ చక్కటి పిల్లాడు, పద్మనేత్రుడు, చంద్రముఖుడు, సింహమధ్యముడు ఇక్కడకు ఎక్కడ నుండి వచ్చాడో. ఈ బాలుడిని కన్న భాగ్యవతి పూర్వజన్మలో ఏ నోములు నోచిందో? ఏ అందగాడు ఏ అందగత్తె యందు ఈ అందగాడిని కన్నాడో?

తెభా-10.2-31-శా.
ళీ! నా తొలుచూలి పాపనికి బోర్కాడించి నే సూతికా
శాలామధ్య విశాలతల్పగత నై న్నిచ్చి నిద్రింప నా
బాలున్ నా చనుఁబాలకుం జెఱిచి యే పాపాత్ములే త్రోవ ము
న్నే లీలం గొనిపోయిరో? శిశువుఁ దా నే తల్లి రక్షించెనో!

టీక:- ఆళీ = సఖీ; నా = నా యొక్క; తొలుచూలి = మొదటి కాన్పులో పుట్టిన; పాపని = బిడ్డడి; కిన్ = కి; బోర్కాడించి = స్నానము చేయించి; నేన్ = నేను; సూతికాశాలా = పురిటింటి; మధ్య = లోపలి; విశాల = పెద్ద; తల్ప = మంచము; గతను = పై ఉన్నదానిని; ఐ = అయ్యి; చన్నిచ్చి = స్తన్యము తాగించి; నిద్రింపన్ = నిద్రపోవుచుండగా; ఆ = ఆ; బాలున్ = పిల్లవానిని; నా = నా యొక్క; చనుబాలు = స్తన్యమున; కున్ = కు; చెఱచి = దూరముచేసి; ఏ = ఏ; పాపాత్ములు = పాపచిత్తులు; ఏ = ఏ; త్రోవన్ = మార్గమున; మున్ను = ఇంతకుముందు; ఏ = ఏ; లీలన్ = విధముగ; కొనిపోయిరో = తీసుకొనిపోయిరో; శిశువున్ = బాలుని; తాను = తాను; ఏ = ఏ; తల్లి = పుణ్యవతి; రక్షించెనో = పోషించెనో.
భావము:- ఓ చెలీ! నా తొలిచూలు బాలుడికి స్నానం చేయించి పురిటిగదిలో మంచంపై పడుకుని చన్నిచ్చి నిద్రపోతున్న సమయంలో, ఏ పాపాత్ములు నా పుత్రుడిని నా చనుబాలకు దూరంచేసి ఏవిధంగా దొంగిలించుకుని పోయారో? ఆ పిల్లవాడిని ఏ చల్లనితల్లి రక్షించిందో?

తెభా-10.2-32-క.
కొడుకఁడు నా పొదిగిఁటిలోఁ
జెడిపోయిన నాఁటనుండి చెలియా! తెలియం
దే వార్తయు నతఁడే
డువున నెచ్చోట నిలిచి ర్తించెడినో!

టీక:- కొడుకడు = కుమారుడు; నా = నా యొక్క; పొదిగిటి = ఒడి; లోన్ = లోనుండి; చెడిపోయిన = దూరమైన; నాటి = వేళ; నుండి = నుండి; చెలియా = సఖీ; తెలియంబడదు = తెలియరాదు; ఏ = ఏ; వార్తయున్ = విషయము; అతడు = వాడు; ఏ = ఏ; వడువునన్ = విధముగ; ఏ = ఏ; చోటన్ = ప్రదేశము నందు; నిలిచి = ఉండి; వర్తించెడినో = నివసించుచుండెనో.
భావము:- చెలీ! నా కుమారుడు నా పొత్తిళ్ళ నుండి దూరమైన రోజు నుండి ఏ కబురూ తెలియరాలేదు. వాడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో కదా!

తెభా-10.2-33-క.
ఇందాఁక వాఁడు బ్రదికిన
సందేహము లేదు దేహచాతుర్యవయ
స్సౌంర్యంబుల లోకులు
వందింపఁగ నితనియంతవాఁ డగుఁ జుమ్మీ!

టీక:- ఇందాకా = ఇన్నాళ్ళ వరకు; వాడున్ = అతడు; బ్రదికిన = బతికుంటే; సందేహము = అనుమానము; లేదు = లేదు; దేహ = శరీరము చేత; చాతుర్య = నేర్పు చేత; వయః = వయస్సు చేత; సౌందర్యంబులన్ = చక్కదనముల చేత; లోకులు = ప్రజలు; వందింపన్ = కొనియాడగా; ఇతని = వీని; అంతవాడు = అంతటి వాడు; అగున్ = ఐ ఉండును; చుమ్మీ = సుమా.
భావము:- ఇప్పటిదాకా నా కొడుకు బ్రతికే ఉండి ఉంటే ఇలా చక్కటి రూపు, వయస్సు, అందచందాలతో లోకులు పొగిడేలా, ఈతడి అంతటి వాడై ఉండే వాడు సుమా!

తెభా-10.2-34-మ.
తివా! సిద్ధము నాఁటి బాలకున కీ యాకార మీ వర్ణ మీ
తి యీ హాసవిలోకనస్వరము లీ గాంభీర్య మీ కాంతి వీఁ
తఁడే కాఁదగు నున్నవారలకు నా యాత్మేశు సారూప్య సం
తి సిద్ధింపదు; వీనియందు మిగులం గౌతూహలం బయ్యెడిన్.

టీక:- అతివా = చెలీ; సిద్ధము = తప్పకుండా; నాటి = ఆనాటి, అప్పటి; బాలకున్ = పిల్లవాని; కున్ = కి; ఈ = ఈ; ఆకారము = రూపము; ఈ = ఈ; వర్ణము = రంగు; ఈ = ఈ; గతి = నడక; ఈ = ఈ; హాస = నవ్వు; విలోకన = చూపులు; స్వరములు = కంఠస్వరములు; ఈ = ఈ; గాంభీర్యము = గాంభీర్యము; ఈ = ఈ; కాంతి = లావణ్యము; వీడు = ఇతను; అతడే = అతనే; కాన్ = అయ్యి ఉండి; తగున్ = ఉండవచ్చును; ఉన్నవారలు = ఇతరుల; కున్ = కు; నా = నా యొక్క; ఆత్మ = సొంత; ఈశు = భర్త; సారూప్య = వంటి రూపము; సంగతి = కలిగి ఉండుట; సిద్ధింపదు = కలుగదు; వీనిన్ = ఇతని; అందున్ = అందు; మిగులన్ = మిక్కిలి; కౌతూహలంబు = ఆసక్తి; అయ్యెడిన్ = కలుగుచున్నది.
భావము:- మగువా! ఆనాటి నా కొడుక్కి ఈ రూపం; ఈ రంగూ; ఈ నవ్వూ; ఈ చూపులు; ఈ కంఠస్వరం; ఈ గంభీర్యం; ఈ కాంతి ఉండి ఉండేవి. ఇతడు నా పుత్రుడే అయ్యుండాలి, లేకపోతే వేరేవాడిలో నా భర్త శ్రీకృష్ణుడి పోలికలు ఎందుకుంటాయి. ఇతడి మీద నాకు ఎంతో అభిమానం కలుగుతోంది కూడా!

తెభా-10.2-35-క.
పొలెడి ముదమునఁ జిత్తము
లెడి నా యెడమమూఁపు, న్నుల వెంటం
బొలెడి నానందాశ్రులు
మెలెడిఁ బాలిండ్లఁ బాలు; మేలయ్యెడినో!"

టీక:- పొదలెడిన్ = పొంగిపొరలుతున్నది; ముదమునన్ = సంతోషముతో; చిత్తము = మనస్సు; కదలెడిన్ = అదురుచున్నది; నా = నా యొక్క; ఎడమ = ఎడమ; మూపు = భుజము; కన్నుల = కళ్ళ; వెంటన్ = వెంబడి; పొదలెడిన్ = పొంగిపొరలుతున్నవి; ఆనంద = సంతోష; ఆశ్రులు = బాష్పములు; మెదలెడిన్ = చేపుచున్నవి; పాలిండ్లన్ = స్తనమునుండి; పాలు = పాలు; మేలు = శుభము; అయ్యెడినో = కలుగుతుందేమో.
భావము:- ఆనందంతో నా హృదయం ఉప్పొంగుతోంది. నా ఎడమ బుజం అదురుతోంది. కళ్ళనుండి ఆనందాశ్రువులు రాలుతున్నాయి. పాలిండ్లలో పాలు జాలువారుతున్నాయి. ఏం మేలు జరుగబోతుందో?

తెభా-10.2-36-వ.
అని డోలాయమాన మానసయై వితర్కించుచు.
టీక:- అని = అని; డోలాయమాన = ఊగిసలాడుతున్న; మానస = మనసు కలామె; ఐ = అయ్యి; వితర్కించుచు = ఆలోచించుకొనుచు.
భావము:- అని చెలికత్తెకు చెప్పి, ఎటూ తేల్చుకోలేని ఊగిసలాడుతున్న మనస్సుతో రుక్మిణీదేవి వితర్కించుకుంటూ.

తెభా-10.2-37-క.
యుఁ డని నొడువఁ దలఁచును;
యుఁడు గా కున్న మిగులఁ తిగొని సవతుల్‌
ను నగియెద రని తలఁచు; న
ను సంశయ మలమికొనఁగఁ నుమధ్య మదిన్.

టీక:- తనయుడు = కొడుకు; అని = అని; నొడువన్ = చెప్పవలెనని; తలచును = అనుకొనును; తనయుడు = కొడుకు; కాక = కాకుండ; ఉన్నన్ = ఉన్నచో; మిగులన్ = మిక్కిలి; తతిగొని = సమయము కనిపెట్టి; సవతుల్ = సపత్నులు; తనున్ = తనను; నగియెదరు = పరిహాసము చేసెదరు; అని = అని; తలచును = అనుకొనును; అతను = ఆధికమైన, తక్కువకాని; సంశయము = సందేహము; అలమికొనగన్ = ఆవరించగా; తనుమధ్య = ఇంతి (రుక్మిణి); మదిన్ = మనసు నందు.
భావము:- రుక్మిణీదేవి ఇతడు తన కొడుకే అని చెప్పబోతుంది. కాని అతడు తన కుమారుడు కాకపోతే సమయం చిక్కిందని తన సవతులు తనను గేలిచేస్తారేమో అనే సంశయంతో ఆలోచించుకోసాగింది.

తెభా-10.2-38-వ.
ఇట్లు రుక్మిణీదేవి విచారించుచుండ లోపలినగరి కావలివారివలన విని కృష్ణుండు దేవకీవసుదేవులం దోడ్కొని చనుదెంచి సర్వజ్ఞుం డయ్యు నేమియు వివరింపక యూరకుండె; నంత నారదుండు సనుదెంచి శంబరుఁడు గుమారునిం గొనిపోవుట మొదలైన వార్త లెఱింగించిన.
టీక:- ఇట్లు = ఈ విధముగ; రుక్మిణీదేవి = రుక్మిణీసతి; విచారించుచున్ = తర్కించుకొనుచు; ఉండన్ = ఉండగా; లోపలినగరి = అంతఃపురపు; కావలివారు = కాపాలా కాసెడివారల; వలన = వలన; విని = తెలిసికొని; కృష్ణుండు = కృష్ణుడు; దేవకీ = దేవకీదేవి; వసుదేవులన్ = వసుదేవులను; తోడ్కొని = కూడ తీసుకొని; చనుదెంచి = వచ్చి; సర్వజ్ఞుండు = అన్నీ తెలిసినవాడు; అయ్యున్ = అయినప్పటికి; ఏమియున్ = ఏమీ; వివరింపకన్ = మాట్లాడకుండ; ఊరక = ఊరికే; ఉండెను = ఉండెను; అంత = అప్పుడు; నారదుండు = నారదుడు; చనుదెంచి = వచ్చి; శంబరుడు = శంబరాసురుడు; కుమారునిన్ = బిడ్డను; కొనిపోవుట = తీసుకుపోవుట; మొదలైన = మొదలగు; వార్తలున్ = విషయములు; ఎఱింగించినన్ = తెలుపగా;
భావము:- అలా ఒక ప్రక్క రుక్మిణీదేవి ఆలోచించుకుంటూ ఉండగా, అంతఃపురం కాపలాకాసే వారి వలన విషయం వినిన శ్రీకృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను వెంట తీసుకుని వచ్చాడు. తాను సర్వజ్ఞుడు అయినా వివరం చెప్పకుండా ఊరుకున్నాడు. ఇంతలో నారదుడు వచ్చి శంబరాసురుడు శిశువును తీసుకొని వెళ్ళడం మొదలైన విషయాలు అన్నీ వివరంగా తెలియజేసాడు.

తెభా-10.2-39-క.
"చచ్చినబాలుఁడు గ్రమ్మఱ
చ్చిన క్రియ వచ్చెఁ బెక్కుర్షములకు నీ
చ్చరితు నేఁడు గంటిమి;
చెచ్చెర మున్నెట్టి తపము సేయంబడెనో?"

టీక:- చచ్చిన = చచ్చిపోయిన; బాలుడు = పిల్లవాడు; క్రమ్మఱన్ = మరల; వచ్చిన = బతికి వచ్చిన; క్రియన్ = విధముగ; వచ్చెన్ = వచ్చెను; పెక్కు = అనేక; వర్షములు = సంవత్సరములు; కున్ = కు; ఈ = ఈ; సత్ = మంచి; చరితున్ = నడత కలవాడిని; నేడు = ఇవేళ; కంటిమి = చూసితిమి; చెచ్చెరన్ = చటుక్కున; మున్ను = మునుపు; ఎట్టి = ఎలాంటి; తపమున్ = తపస్సును; చేయంబడెనో = చేయబడినదో కదా.
భావము:- “ఎన్ని ఏళ్ళకు ఈ బాలుడిని చూడగలిగాము. మరణించిన బాలుడు తిరిగి బ్రతికిరావడం లాంటిదే కదా ఇది. ఈ బాలుడిని తిరిగి చూడడానికి మనం పూర్వజన్మలో ఏం తపస్సులు చేశామో?”

తెభా-10.2-40-వ.
అని యంతఃపుర కాంతలును, దేవకీవసుదేవ రామకృష్ణులును యథోచితక్రమంబున నా దంపతుల దివ్యాంబరాభరణాలంకృతుల సత్కరించి సంతోషించిరి; రుక్మిణీదేవియు నందనుం గౌఁగిలించు కొని.
టీక:- అని = అని; అంతఃపుర = అంతఃపురమున ఉండు; కాంతలును = స్త్రీలు; దేవకీ = దేవకీదేవి; వసుదేవ = వసుదేవుడు; రామ = బలరాముడు; కృష్ణులును = కృష్ణుడు; యథోచిత = తగిన; క్రమంబునన్ = రీతిని; ఆ = ఆ; దంపతుల = భార్యాభర్తలను; దివ్య = దివ్యమైన; అంబర = బట్టలు; అభరణలు = భూషణములచేత; అలంకృతుల = అలంకారములచేత; సత్కరించి = సన్మానముచేసి; సంతోషించిరి = సంతోషించారు; రుక్మిణీదేవియు = రుక్మిణీదేవి; నందనున్ = కుమారుని; కౌగలించుకొని = కౌగలించుకొని;
భావము:- అని అనుకుంటూ అంతఃపుర కాంతలూ, దేవకీ వసుదేవులూ, బలరామ కృష్ణులూ మంచి మంచి వస్త్రాభరణాలతో రతీప్రద్యుమ్నులను సత్కరించి సంతోషించారు. రుక్మిణీదేవి తన కొడుకుని కౌగలించుకుని…

తెభా-10.2-41-శా.
"న్నా! నా చనుఁ బాపి నిన్ను దనుజుం డంభోనిధిన్ వైచెనే
యెన్నే వర్షము లయ్యెఁ బాసి సుత! నీ వేరీతి జీవించి యే
న్నాహంబున శత్రు గెల్చితివొ? యాశ్చర్యంబు సంధిల్లెడిన్
నిన్నుం గాంచితి నింతకాలమునకున్ నే ధన్యతం జెందితిన్. "

టీక:- అన్నా = నాయనా; నా = నా యొక్క; చనున్ = స్తన్యపానమును; పాపి = దూరము చూసి; నిన్ను = నిన్ను; దనుజుండు = రాక్షసుడు; అంభోనిధిన్ = సముద్రము నందు; వైచెనే = పడవేసెనా ఏమి; ఎన్నే = ఎన్నో; వర్షములు = సంవత్సరములు; అయ్యన్ = ఆయెను; పాసి = ఎడబాసి; సుత = కొడుకా; నీవు = నీవు; ఏ = ఏ; రీతిన్ = విధముగ; జీవించి = బతికివి; ఏ = ఎట్టి; సన్నాహంబునన్ = యత్నములతో; శత్రు = శత్రువులను; గెల్చితివో = జయించితివి; ఆశ్చర్యంబు = వింతగా; సంధిల్లెడిన్ = అగుచున్నది; నిన్నున్ = నిన్ను; కాంచితి = చూచితిని; ఇంత = అన్ని; కాలమున్ = రోజుల; కున్ = కు; నేన్ = నేను; ధన్యతన్ = కృతార్థత్వము; చెందితిన్ = పొందితిని.
భావము:- “నాయనా! రాక్షసుడు నిన్ను నానుండి వేరుచేసి నిన్ను సముద్రంలో పడేసి ఎన్నో సంవత్సరాలైంది. ఇన్నాళ్ళూ ఓ కుమారా! నీవు ఎలా బ్రతికావో, ఎలా ఆ రాక్షసుణ్ణి సంహరించావో? చాలా ఆశ్చర్యంగా వుంది. ఇంత కాలానికి మళ్ళీ నిన్ను చూసి నేను ధన్యురాలిని అయ్యాను.”

తెభా-10.2-42-వ.
అని కొడుకుం జూచి సంతోషించి కోడలిగుణంబులు కైవారంబు సేసి, వినోదించుచుండె; నంత ద్వారకానగరంబు ప్రజలు విని హర్షించి; రందు.
టీక:- అని = అని; కొడుకున్ = కొడుకునప; చూచి = చూచి; సంతోషించి = సంతోషించి; కోడలి = కోడలు (మాయాదేవి); గుణంబులు = సుగుణములను; కైవారంబు = శ్లాఘించుట; చేసి = చేసి; వినోదించుచుండన్ = ఆనందించుచుండగా; అంత = ఆ సమయము నందు; ద్వారకానగరంబు = ద్వారకానగరము; ప్రజలు = పురజనులు; విని = విని; హర్షించిరి = సంతోషించిరి; అందున్ = అప్పుడు.
భావము:- అంటూ రుక్మిణీదేవి తన కుమారుడిని చూసి ఎంతో ఆనందించింది. కోడలి సద్గుణాలను పొగుడుతూ, వేడుకలు చేయసాగింది. అంతట ఆ వార్త విని ద్వారకానగర వాసులు అందరూ ఎంతో సంతోషించారు.

తెభా-10.2-43-క.
సిరిపెనిమిటి పుత్త్రకుఁ డగు
రుఁ గని హరిఁ జూచినట్ల మాతలు దమలోఁ
రఁగుదు రఁట, పరకాంతలు
రుఁ గని మోహాంధకార గ్నలు గారే? "

టీక:- సిరిపెనిమిటి = కృష్ణుని {సిరి పెనిమిటి - సిరి (లక్ష్మీదేవి) భర్త, కృష్ణుడు}; పుత్త్రకుడు = కొడుకు; అగు = ఐన; మరున్ = ప్రద్యుమ్నుని; కని = చూసి; హరిన్ = కృష్ణుని; చూచిన = చూసిన; అట్ల = విధముగ; మాతలు = తల్లులు; తమ = వారి; లోన్ = అందు; కరగుదురు = అనురాగము కలవారు; అట = అగుదురు అట; పర = ఇతర; కాంతలు = స్త్రీలు; మరున్ = ప్రద్యుమ్నుని; కని = చూసి; మోహా = మోహము అను; అంధకార = చీకటిలో; మగ్నులు = మునిగినవారు; కారే = కారా, ఔతారు.
భావము:- ప్రద్యుమ్నుడు శ్రీపతి కృష్ణుడి పుత్రుడు, పైగా స్వయంగా మన్మథుడు. అతడిని చూసిన తల్లులు శ్రీకృష్ణుడిని చూసినట్లే భావించి కరగిపోతారుట. ఇంక పరకాంతలు ఈ మన్మథుడిని చూసి మోహాంధకారంలో మునిగిపోరా?”

తెభా-10.2-44-వ.
అని చెప్పి శుకుం డిట్లనియె
టీక:- అని = అని; చెప్పి = చెప్పి; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని చెప్పి శుకమహర్షి ఇంకా ఇలా అన్నాడు.

తెభా-10.2-45-క.
"సత్రాజిత్తు నిశాచర
త్రునకుం గీడు సేసి ద్వినయముతోఁ
బుత్రి, శమంతకమణియును
మైత్రిం గొని తెచ్చి యిచ్చె నుజాధీశా! "

టీక:- సత్రాజిత్తు = సత్రాజిత్తు; నిశాచరశత్రున్ = కృష్ణుని {నిశాచరశత్రువు - రాక్షసుల శత్రువు, విష్ణువు}; కున్ = కు; కీడు = చెడుపు; చేసి = చేసి; సత్ = మంచి; వినయము = వినయము; తోన్ = తోటి; పుత్రిన్ = కుమార్తెను; శమంతక = శమంతకము అను; మణియును = మణి; మైత్రిన్ = మిత్రత్వమును; కొని = చేపట్టి; తెచ్చి = తీసుకువచ్చి; ఇచ్చెన్ = ఇచ్చెను; మనుజాధీశ = రాజా {మనుజాధీశుడు - మానవులకు ప్రభువు, రాజు}.
భావము:- “ఓ పరీక్షిత్తు మహారాజా! సత్రాజిత్తు శ్రీకృష్ణుడి పట్ల అపచారం చేసాడు. పిమ్మట పశ్చాత్తాప పడి, మంచి వినయంతో శమంతకమణినీ తన పుత్రికామణినీ మైత్రీభావంతో తీసుకువచ్చి సమర్పించాడు.”

తెభా-10.2-46-వ.
అనిన విని రా జిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; విని = విని; రాజు = పరీక్షిన్మహారాజు {రాజు - రజియింతి రాజః, రంజింపజేయువాడు రాజు, పరిపాలకుడు}; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అని శుకమహర్షి చెప్పగా వినిన పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు.

తెభా-10.2-47-ఆ.
"శౌరి కేమి తప్పు త్రాజితుఁడు సేసెఁ?
గూఁతు మణిని నేల కోరి యిచ్చె?
తని కెట్లు కలిగె నా శమంతకమణి
విప్రముఖ్య! నాకు విస్తరింపు. "

టీక:- శౌరి = కృష్ణుడు {శౌరి - శూరుని మనుమడు, కృష్ణుడు}; కిన్ = కి; ఏమి = ఎడల; తప్పు = తప్పు; సత్రాజితుడు = సత్రాజిత్తు; చేసెన్ = చేసెను; కూతున్ = కూతురును; మణిని = శమంతకమణిని; ఏలన్ = ఎందుకు; కోరి = అపేక్షించి; ఇచ్చెన్ = ఇచ్చెను; అతని = అతని; కిన్ = కి; ఎట్లు = ఏ విధముగ; కలిగెన్ = లభించెను; ఆ = ఆ యొక్క; శమంతక = శమంతకము అను; మణి = రత్నము; విప్ర = బ్రాహ్మణులలో; ముఖ్య = ముఖ్యమైనవాడ; నా = నా; కున్ = కు; విస్తరింపు = వివరించి చెప్పుము.
భావము:- “ఓ మునీంద్రా! శ్రీకృష్ణుడిపట్ల సత్రాజిత్తు ఏమి అపరాధం చేసాడు. శమంతకమణినీ తన కూతురుని ఎందుకు కోరి కోరి ఇచ్చాడు. అతనికి శమంతకమణి ఎలా దొరికింది. ఈ విశేషాలన్నీ నాకు వివరంగా చెప్పండి.”