పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/యదు సాల్వ యుద్ధంబు

వికీసోర్స్ నుండి

యదు సాల్వ యుద్ధంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/యదు సాల్వ యుద్ధంబు)
రచయిత: పోతన


తెభా-10.2-846-వ.
చని యా గోవిందనందన స్యందనంబుం బలసందోహంబునుం దలకడచి, యదు సైన్యంబులు సాల్వబలంబులతోడం దార్కొని బెరయునప్పుడు దేవదానవ సంకులసమర విధంబునం దుములం బయ్యె; నయ్యెడ.
టీక:- చని = వెళ్ళి; ఆ = ఆ; గోవిందనందన = ప్రద్యుమ్నుని; స్యందనంబున్ = రథమును; బల = సేనా; సందోహంబును = సమూహమును; తలకడచి = దాటిపోయి; యదు = యాదవుల; సైన్యంబులు = సైన్యములు; సాల్వ = సాల్వుని; బలంబుల = సైన్యముల; తోడన్ = తోటి; తార్కొని = తాకి, ఎదుర్కొని; బెరయున్ = యుద్ధము చేయున్; అప్పుడు = సమయము నందు; దేవ = దేవతల; దానవ = రాక్షసుల; సంకుల = బాహబాహి; సమర = యుద్ధము; విధంబునన్ = వలె; తుములము = దొమ్మిలు; అయ్యెన్ = జరిగినవి; ఆ = ఆ; ఎడన్ = సమయము నందు;
భావము:- ఈ విధంగా యాదవసైన్యం ప్రద్యుమ్నుని రథాన్నిదాటి ముందుకు పోయి సాల్వుడి సైన్యాలను ఎదిరించింది. అప్పుడు రెండు పక్షాల బలాలకు జరిగిన బాహాబాహీ సంకుల సమరం దేవదానవ యుద్ధంలాగ కనబడసాగింది. అప్పుడు....

తెభా-10.2-847-మ.
వితజ్యాచయ టంకృతుల్‌, మదజలావిర్భూతశుండాల ఘీం
కృతు, లుద్యద్భటహుంకృతుల్‌, మహితభేరీభాంకృతుల్‌, భీషణో
ద్ధనిస్సాణధణంకృతుల్‌, ప్రకటయోవ్రాతసాహంకృతుల్‌,
కులంబున్ దివి నిండ మ్రోసె రిపుసంక్షోభంబుగా భూవరా!

టీక:- వితత = విస్తారమైన; జ్యా = అల్లెతాళ్ళ, వింటినారుల; చయ = సమూహముల యొక్క; టంకృతుల్ = టం అనుశబ్దములు, టంకారములు; మదజల = మదజలముతోటి; ఆవిర్భూత = పుట్టుచున్న; శుండాల = ఏనుగుల; ఘీంకృతులున్ = ఘీంకారములు; ఉద్యత్ = ఉత్సాహము కల; భట = యోధుల; హుంకృతుల్ = హుంకారములు, హుం అను నాదములు; మహిత = గొప్ప; భేరీ = నగారాల; భాంకృతుల్ = భాంకారములు, భం అను భేరీనాదములు, ధ్వనులు; భీషణ = భీకరమైన; ఉద్ధత = అతిశయించిన; నిస్సాణ = ఢంకాల; ధణంకృతుల్ = ధణధణలు; ప్రకట = ప్రసిద్ధులైన; యోధ = వీరుల; వ్రాత = సమూహముల యొక్క; సాహంకృతుల్ = అహంకారముతోటి మాటలు; కుతలంబున్ = భూమండలము; దివి = ఆకాశమండలము; నిండన్ = నిండిపోవునట్లు; మ్రోసెన్ = మోగినవి; రిపు = శత్రువులకు; సంక్షోభంబుగా = కలతచెందునట్లుగా; భూవరా = రాజా.
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! ఆ సంకుల సమరంలో విస్తారమైన అల్లెత్రాళ్ళ టంకారాలు, మదగజాల ఘీంకారాలు, భటుల హూంకారాలు, భేరీ భాంకారాలు, వీరుల దురహంకారాలు, శత్రుసంక్షోభంగా భూమ్యాకాశాలు నిండాయి.

తెభా-10.2-848-మ.
రిరింఖారథనేమి సద్భటపదవ్యాఘట్టనోద్ధూత దు
స్తధూళీపటలప్రభూత నిబిడధ్వాంతప్రవిధ్వంస కృ
త్క శాతాసి గదాది హేతిరుచు లాకాశంబు నిండన్ వియ
చ్చ దృక్కుల్‌ మిఱుమిట్లు గొల్ప సమరోత్సాహంబు సంధిల్లఁగన్.

టీక:- హరి = గుఱ్ఱముల; రింఖా = గిట్టలచేత; రథ = తేరుల; నేమి = కడకమ్మిచేత, చక్రాలచే; సద్భట = కాల్బలము యొక్క; పద = పాదముల; వ్యాఘట్టన = విశేషమైన తాకిడిచేత; ఉద్దూత = రేగిన; దుస్తర = దాటరాని; ధూళీ = దుమ్ము; పటల = తెరలవలన; ప్రభూత = పుట్టిన; నిబిడ = దట్టమైన; ధ్వాంత = చీకటిని; ప్రవిధ్వంసకృత్ = అణిచేస్తున్న; కర = చేతులలోని; శాత = వాడియైన; అసి = కత్తి; గద = గద; ఆది = మున్నగువాని; హేతి = ఆయుధముల; రుచులు = కాంతులు; ఆకాశంబున్ = ఆకాశము; నిండన్ = వ్యాపించగా; వియచ్చర = ఆకాశగమనుల; దృక్కుల్ = చూపులు; మిఱుమిట్లు = చెదరునట్లు; కొల్పన్ = చేయగా; సమర = యుద్ధము నందు; ఉత్సాహంబు = ఆటోపము; సంధిల్లగన్ = కలుగగా.
భావము:- గుఱ్ఱాల గిట్టల తాకిడికి, రథచక్రాల ఒరిపిడికి, భటుల పాదఘట్టనలకు లేచిన ధూళి ఆకాశం అంతా నిండి చీకట్లు వ్యాపించాయి. ఆ చీకట్లను పోగొడుతూ సైన్యం చేతులలోని కత్తులు గదలు మున్నగు ఆయుధాల కాంతులు ఆకాశ విహారుల చూపులకు మిరుమిట్లు గొలుపుతూ ఆకాశం నిండా వ్యాపించాయి.

తెభా-10.2-849-చ.
కొని సైనికుల్‌ గవిసి తార్కొని పేర్కొని పాసి డాసి యం
కిలి గొనకెమ్ములమ్ములఁ బగిల్చి నొగిల్చితరేతరుల్‌ తలల్‌
లియఁగ మొత్తి యొత్తి నయనంబులు నిప్పులు రాల లీల నౌఁ
లు లలాటముల్‌ ఘనగదాహతి నొంచి కలంచి పోరఁగన్.

టీక:- తలకొని = పూనుకొని; సైనికుల్ = సైనికులు (ఉభయ పక్షపు); కవిసి = కూడి; తార్కొని = ఎదుర్కొని; పేర్కొని = కమ్ముకొని; పాసి = దూరమై; డాసి = సమీపించి; అంకిలిగొనక = వెనుదీయకుండ; ఇమ్ములున్ = జీవమర్మస్థానముములు; అమ్ములన్ = బాణములతో; పగిల్చి = చీల్చి; నొగిల్చి = నొప్పించి; ఇతరేతరుల్ = ఒండొరుల; తలల్ = తలకాయలను; నలియగన్ = నలిగిపోవునట్లు; మొత్తి = మోది; ఒత్తి = కొట్టి; నయనంబులున్ = కళ్ళమ్మట; నిప్పులు = అగ్ని; రాలన్ = రాలగా; లీలన్ = అనాయాసముగా; తలలు = తలకాయలు; లలాటముల్ = నుదుర్లు; ఘన = గొప్ప; గదా = గదల యొక్క; ఆహతిన్ = దెబ్బలతో; నొంచి = నొప్పించి; కలంచి = కలత పొందించి; పోరగన్ = యుద్ధము చేయగా.
భావము:- ఇరు పక్షాల సైన్యాలు పూని ఒకరి నొకరు ఎదిరించి బాణ వర్షాలు కురిపించి మర్మస్థానాలను చీల్చేస్తు, క్రోధంతో కన్నులనుండి నిప్పురవ్వలు రాలగా పెద్ద పెద్ద గదలతో తలలపై బాదుకుంటూ, భయంకరంగా పోరాడారు.

తెభా-10.2-850-వ.
అయ్యవసరంబునం బ్రద్ముమ్నుండు గనుంగొని.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; ప్రద్యుమ్నుండు = ప్రద్యుమ్నుడు; కనుంగొని = చూసి.
భావము:- అలా భీకరంగా పోరుసాగుతున్న సమయంలో అదంతా వీక్షిస్తున్న ప్రద్యుమ్నుడు...

తెభా-10.2-851-మ.
యంబుం గలుషించి సౌభపతి మాయాకోట్లు చంచచ్ఛరా
నిర్ముక్త నిశాత దివ్యమహితాస్త్రశ్రేణిచేఁ దత్‌క్షణం
బు లీలాగతి నభ్రగుల్‌ మనములన్ భూషింప మాయించె న
వ్వజాతాప్తుఁడు భూరి సంతమసమున్ వారించు చందంబునన్

టీక:- అనయంబున్ = మరిమరి; కలుషించి = కోపించి; సౌభపతి = సాల్వుని యొక్క {సౌభపతి - సౌభకము యజమాని, సాల్వుడు}; మాయా = మాయలు; కోట్లు = అనేకమైన వానిని; చంచత్ = మెరుస్తున్న; శరాసన = ధనుస్సునుండి; నిర్ముక్త = వదలబడిన; నిశాత = మిక్కిలి వాడియైన; దివ్య = దివ్యమైన; మహిత = మహిమగల; అస్త్ర = బాణముల; శ్రేణి = వరుసల; చేన్ = చేత; తత్క్షణంబునన్ = వెంటనే; లీలాగతిన్ = అనాయసముగా; అభ్రగుల్ = ఆకాశగమనులు, దేవతలు; మనములన్ = మనస్సు లందు; భూషింపన్ = మెచ్చుకొనగా; మాయించెన్ = అణగగొట్టెను; ఆ = ఆ; వనజాతాప్తుడు = సూర్యుడు {వనజాతాప్తుడు - పద్మముల హితుడు, సూర్యుడు}; భూరి = మిక్కుటమైన; సంతమసమున్ = గాఢమైన చీకటిని; వారించు = తొలగించు; చందంబునన్ = విధముగా.
భావము:- సాల్వుడు కలుషాత్ముడై పన్నిన అనంత మాయాజాలాలను వీక్షించాడు. వీరావేశంతో విజృంభించి, సూర్యుడు తన కిరణాలతో కారుచీకట్లను పటాపంచలు చేయునట్లు, ప్రద్యుమ్నుడు తన దివ్యాస్త్రాలతో ఆ మాయాజాలాన్ని ఛేదించాడు. గగనచరులు అతని పరాక్రమం చూసి పొగిడారు.

తెభా-10.2-852-వ.
మఱియును.
టీక:- మఱియును = ఇంకను.
భావము:- అనంతరం...

తెభా-10.2-853-చ.
తిరథికోత్తముం డన నుదంచితకాంచనపుంఖ పంచ విం
తివిశిఖంబులన్నతని సైనికపాలుని నొంచి యుగ్రుఁడై
శతకోటికోటినిభసాయకముల్‌ పరఁగించి సాల్వభూ
తి కకుదంబు నొంచి లయభైరవుకైవడిఁ బేర్చి వెండియున్.

టీక:- అతిరథిక = అతిరథులలో; ఉత్తముండు = శ్రేష్ఠుడు; అనన్ = అనగా; ఉదంచిత = మిక్కిలి చక్కనైన; కాంచన = బంగారు; పుంఖ = పిడులు కల {పింజ - బాణము వెనుక నారిని సంధించుటకైన రెక్కలవంటివి}; పంచవింశతి = ఇరవైయైదు (25); విశిఖంబులన్ = బాణములచేత; అతనిన్ = అతని, సాల్వుని యొక్క; సైనికపాలునిన్ = సేనానాయకుని; నొంచి = నొప్పించి; ఉగ్రుడు = భయంకరుడు; ఐ = అయ్యి; శత = నూరు (100); శతకోటి = వజ్రాయుధముల; కోటి = కోటిసంఖ్య గలవానితో; నిభ = సమానమైన; సాయకముల్ = బాణములను; పరగించి = ప్రయోగించి; సాల్వ = సాల్వ; భూపతిన్ = రాజు; కకుదంబున్ = మూపురమును; నొంచి = నొప్పించి; లయ = ప్రళయకాలపు; భైరవు = కాల భైరవుని; కైవడిన్ = వలె; పేర్చి = చెలరేగి; వెండియున్ = మఱియును.
భావము:- గొప్ప అతిరథుడి వలె ప్రద్యుమ్నుడు ఇరవైఐదు వాడి బాణాలతో సాల్వుడి సైన్యాధిపతిని నొప్పించాడు. పిడుగుల్లాంటి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని మూపు పగలగొట్టాడు. లయకాలపు భైరవుడి లాగ విజృంభించాడు. అటుపిమ్మట....

తెభా-10.2-854-చ.
దిపది యమ్ములన్ మనుజపాలవరేణ్యుల నొంచి రోషముం
దురఁగ మూఁడుమూఁడు శితకాండములన్ రథదంతివాజులం
దియఁగ నేసి యొక్కొక నిశాతశరంబున సైనికావలిన్
ము లడించి యిట్లతఁ డమానుషలీలఁ బరాక్రమించినన్.

టీక:- పదిపది = పదేసి(10) చొప్పున; అమ్ములన్ = బాణములతో; మనుజపాల = రాజ; వరేణ్యులన్ = ఉత్తములను; నొంచి = బాధించి; రోషమున్ = రోషము; కదురగన్ = అతిశయించగా; మూడుమూడు = మూడేసి (3) చొప్పున; శిత = వాడియైన; కాండములన్ = బాణములతో; రథ = రథములను; దంతి = ఏనుగులను; వాజులన్ = గుఱ్ఱాలను; చదియగన్ = చితక; ఏసి = కొట్టి; ఒక్కొక్క = ఒక్కొక్క; నిశాత = మిక్కిలి వాడియైన; శరంబునన్ = బాణముతో; సైనిక = పదాతిసైనికుల; ఆవలిన్ = సమూహమును; మదములు = గర్వాలు; అడించి = అణగగొట్టి; ఇట్లు = ఇలా; అతడు = అతను; అమానుష = మావవాతీతమైన; లీలన్ = విలాసములతో; పరాక్రమించినన్ = పరాక్రమముచూపగా.
భావము:- ప్రద్యుమ్నుడు పదేసి బాణాలు చొప్పున వేసి, సాల్వుడి మిత్రులైన రాజశ్రేష్ఠులను నొప్పించాడు. మూడేసి బాణాలు వేసి రథ, గజ, అశ్వాలను పడగొట్టాడు ఒక్కొక్క బాణం ప్రయోగించి సైనికులను చిందరవందర చేసాడు. ఇలా ప్రద్యుమ్నుడు ఎదురులేని విధంగా పరాక్రమించాడు

తెభా-10.2-855-క.
దుర్మానవహరు నద్భుత
ర్మమునకు నుభయ సైనిప్రకరంబుల్‌
నిర్మలమతి నుతియించిరి
ర్మాచలధైర్యు విగతయుఁ బ్రద్యుమ్నున్.

టీక:- దుర్మానవ = దుష్టుల; హరున్ = నాశము చేయువాని; అద్భుత = ఆశ్చర్యకరమైన; కర్మమున్ = నైపుణ్యమున; కున్ = కు; ఉభయ = రెండు పక్షముల; సైనిక = సేనల; ప్రకరంబుల్ = సమూహములు; నిర్మల = కపటము లేని; మతిన్ = బుద్ధితో; నుతియించిరి = స్తుతించిరి; భర్మాచల = మేరుపర్వతమంత; ధైర్యున్ = ధైర్యము కలవానిని; విగత = లేని; భయున్ = భయము కలవానిని; ప్రద్యుమ్నున్ = ప్రద్యుమ్నుడిని.
భావము:- అలా మేరుపర్వతం అంత ధైర్యంతో ప్రద్యుమ్నుడు నిర్భయంగా అద్భుత పరాక్రమాన్ని ప్రదర్శించగా, తిలకించిన ఉభయ సైన్యాలు ప్రస్తుతించాయి.

తెభా-10.2-856-వ.
అయ్యవసరంబున.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు.
భావము:- అలా సాల్వుడితో యుద్ధం జరుగుతున్న సమయంలో....

తెభా-10.2-857-ఉ.
సాంబుని సాల్వభూవిభుఁడు సాయకజాలము లేసి నొంచినన్
జాంవతీతనూభవుఁడు చాపము సజ్యము సేసి డాసి సా
ల్వుం దియేను తూపుల నవోన్నతవక్షము గాఁడనేసి శా
తాంకవింశతిన్నతని సౌభక మల్లలనాడ నేసినన్.

టీక:- సాంబుని = సాంబుని; సాల్వ = సాల్వ; భూవిభుడు = రాజు; సాయక = బాణముల; జాలమున్ = సమూహమును; ఏసి = వేసి; నొంచినన్ = బాధించగా; జాంబవతీతనూభవుండు = సాంబుడు; చాపమున్ = ధనుస్సును; సజ్యము = నారి కలదిగా; చేసి = చేసి; డాసి = చేరి; సాల్వున్ = సాల్వుని; పదియేను = పదిహేను (15); తూపులన్ = బాణములతో; నవనవోన్నత = మిక్కిలి ఎత్తైన; వక్షమున్ = వక్షస్థలమును; కాడన్ = నాటునట్లు; ఏసి = వేసి; శాత = వాడియైన; అంబక = బాణములు; వింశతిన్ = ఇరవై (20) యింటితో; అతని = అతని యొక్క; సౌభకము = సౌభక విమానము; అల్లలనాడన్ = ఊగిసలాడిపోగా; ఏసినన్ = ప్రయోగించగా.
భావము:- సాల్వుడు సాంబుడి మీద అనేక బాణాలు ప్రయోగించి నొప్పించాడు. అంతట ఆ జాంబవతీ తనయుడు సాంబుడు తన ధనస్సు ఎక్కుపెట్టి సాల్వుడి వక్షాన్ని పదిహేను బాణాలతో కొట్టాడు. వాడి బాణాలు ఇరవై వేసి వాడి సౌభక విమానాన్ని అల్లల్లాడేలా చేసాడు.

తెభా-10.2-858-చ.
దుఁడు మహోగ్రవృత్తి నిజకార్ముక నిర్గతవిస్ఫురద్విధుం
తువదనాభబాణవితతుల్‌ పరఁగించి విరోధిమస్తముల్‌
గుదులుగ గ్రుచ్చియెత్తుచు నకుంఠిత విక్రమకేళిలోలుఁడై
ల సురల్‌ నుతింప రథిత్తముఁ డొప్పె నరేంద్రచంద్రమా!

టీక:- గదుడు = గదుడు; మహా = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; వృత్తిన్ = విధముగా; నిజ = తన; కార్ముక = ధనుస్సునుండి; నిర్గత = వెలువడు; విస్ఫురత్ = విశేషముగా ప్రకాశించుచున్న; విధుంతుద = రాహువు {విధుంతుదుడు - చంద్రుని బాధపెట్టు వాడు, రాహువు}; వదన = నోరు; ఆభ = వంటి; బాణ = బాణముల; వితతుల్ = సమూహముల; పరగించి = ప్రయోగించి; విరోధి = శత్రువుల; మస్తముల్ = తలలను; గుదులుగన్ = కట్టలుగా; గ్రుచ్చి = కట్టి; ఎత్తుచున్ = లేపేస్తూ; అకుంఠిత = మొక్కవోని; విక్రమ = పరాక్రమముచూపు; కేళీ = ఆట యందు; లోలుడు = నిమగ్నమైనవాడు; ఐ = అయ్యి; చదలన్ = ఆకాశముననందు; సురల్ = దేవతలు; నుతింపన్ = కీర్తిస్తుండగా; రథి = రథికులలో; సత్తముడు = సమర్థుడు; ఒప్పెన్ = ప్రకాశించెను; నరేంద్రచంద్రమా = రాజోత్తమ.
భావము:- ఓ పరీక్షిత్తు రాజేంద్రా! గొప్ప రథికుడైన గదుడు రాహుముఖం లాంటి బాణాలను ప్రయోగించి శత్రువుల శిరస్సులు ఖండించి గుదులు గుదులుగా నేలకూలుస్తు మొక్కవోని పరాక్రమంతో విజృంభించాడు. ఆకాశంలో అతని పరాక్రమం చూసి దేవతలు ప్రస్తుతించారు.

తెభా-10.2-859-ఉ.
సాత్యకి చండరోషమున సాల్వమహీవరు భూరిసౌభ సాం
త్య చతుర్విధోగ్రబలగాఢతమఃపటలంబు భాసురా
దిత్యమయూఖపుంజరుచితీవ్రశరంబులఁ జూపి సైనిక
స్తుత్యపరాక్రమప్రకటదోర్బలుఁడై విలసిల్లె భూవరా!

టీక:- సాత్యకి = సాత్యకి; చండ = తీవ్రమైన; రోషమునన్ = కోపముతో; సాల్వ = సాల్వదేశపు; మహీవరున్ = రాజును; భూరి = మిక్కిలి పెద్దదైన; సౌభ = సౌభక విమానముతో; సాంగత్య = కూడి యున్న; చతుర్విధ = చతురంగ; ఉగ్ర = భీకరమైన; బల = సైన్యము అను; గాఢ = దట్టమైన; తమః = చీకట్ల; పటలంబున్ = సమూహమును; భాసుర = ప్రకాశవంతమైన; ఆదిత్య = సూర్యుని; మయూఖ = కిరణముల; పుంజ = సమూహము యొక్క; రుచి = కాంతి గల; తీవ్ర = వాడి కలవియైన; శరంబులన్ = బాణములను; చూపి = ప్రయోగించి; సైనిక = సేనలచేత; స్తుత్య = స్తుతింపబడిన; పరాక్రమ = శౌర్యము; ప్రకట = ప్రదర్శించిన; దోర్బలుడు = భుజబలము కలవాడు; ఐ = అయ్యి; విలసిల్లెన్ = ప్రకాశించెను; భూవరా = పరీక్షిన్మహారాజా.
భావము:- ఓ రాజశ్రేష్ఠుడా! సాత్యకి మహారోషంతో సాల్వుడి చతురంగబలాలను, సౌభక విమానము అనే చీకటిని సూర్యకిరణాల వంటి వాడి యైన బాణాలను ప్రయోగించి పటాపంచలు కావించాడు. సైనికులందరు అతని పరాక్రమాన్ని బహువిధాల ప్రశంసించారు.

తెభా-10.2-860-ఉత్సా.
భానువిందుఁ డుద్ధతిన్ విక్షపక్షసైన్య దు
ర్మా కాననానలోపమాన చండ కాండ సం
తా మూన నేసి చూర్ణితంబు చేసెఁ జాప వి
ద్యా నిరూఢి దేవతావితాన మిచ్చ మెచ్చఁగాన్.

టీక:- భానువిందుడు = భానువిందుడు; ఉద్ధతిన్ = అతిశయముతో; విపక్ష = శత్రుపక్షము యొక్క; సైన్య = సేనల యొక్క; దుర్మాన = మహచెడ్డ గర్వము అను; కాననన్ = అడవిని; అనల = అగ్నితోటి; ఉపమాన = పోల్చదగిన; చండ = తీక్ష్ణమైన; కాండ = బాణముల; సంతానమున్ = సమూహమును; ఊనన్ = నాటినట్లు; ఏసి = ప్రయోగించి; చూర్ణితంబు = పచ్చడి; చేసెన్ = చేసెను; చాపవిద్యా = విలువిద్యా; నిరూఢిన్ = నేర్పుచేత; దేవతా = దేవతల; వితానము = సమూహము; ఇచ్చన్ = ఇష్టముగా; మెచ్చగాన్ = మెచ్చుకొనునట్లు.
భావము:- భానువిందుడు విజృంభించి, శత్రుసైన్యం అనే అడవిని తీవ్రమైన దావానలం వంటి తన బాణాలు అసంఖ్యాకంగా వేసి భస్మీపటలం చేసాడు. అతని ధనుర్విద్యా కౌశల్యాన్ని దేవతా సమూహం ప్రస్తుతించింది.

తెభా-10.2-861-ఉత్సా.
చారుదేష్ణుఁ డాగ్రహించి త్రుభీషణోగ్ర దో
స్సాదర్ప మేర్పడన్ నిశాత బాణకోటిచే
దారుణప్రతాప సాల్వదండనాథమండలిన్
మారి రేఁగినట్లు పిల్కుమార్చి పేర్చి యార్చినన్.

టీక:- చారుదేష్ణుడు = చారుదేష్ణుడు; ఆగ్రహించి = కోపించి; శత్రు = శత్రువుల; భీషణ = భయంకరమైన; ఉగ్ర = తీక్ష్ణమైన; దోస్సార = భుజబలమువలని; దర్పము = మదము; ఏర్పడన్ = తెలిబడునట్లుగా; నిశాత = మిక్కిలి వాడియైన; బాణ = బాణముల; కోటి = సమూహముల; చేన్ = చేత; దారుణ = తీక్షణమైన; ప్రతాప = పరాక్రమము కల; సాల్వ = సాల్వుని యొక్క; దండనాథ = సేనానాయకుల; మండలిన్ = సమూహమును; మారి = మారి అను దేవత; రేగినట్లు = చెలరేగినట్లుగా; పిల్కుమార్చి = చంపి; పేర్చి = అతిశయించి; ఆర్చినన్ = బొబ్బపెట్టగా, సింహనాదము చేయగా.
భావము:- చారుదేష్ణుడు ఆగ్రహంతో విజృంభించి వాడి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని దండనాథులను సంహరించి సింహనాదం చేసాడు.

తెభా-10.2-862-క.
శుకుఁ డా యోధన విజయో
త్సుమతి బాహాబలంబు సొప్పడ విశిఖ
ప్రరంబులఁ దను శౌర్యా
ధికుఁ డన విద్వేషిబలతతిం బరిమార్చెన్.

టీక:- శుకుడు = శుకుడు అనువాడు; ఆ = ఆ; యోధన = యుద్ధము నందు; విజయ = గెలుచు టందు; ఉత్సుకమతిన్ = తమకముతో; బాహాబలమున్ = భుజబలము; చొప్పడన్ = విశద మగునట్లు; విశిఖ = బాణముల; ప్రకరంబులన్ = సమూహములచేత; తనున్ = తనను; శౌర్య = వీరా; అధికుడు = అగ్రేసరుడు; అనన్ = అనునట్లు; విద్వేషి = శత్రు; బల = సేనా; తతిన్ = సమూహమును; పరిమార్చెన్ = చంపెను.
భావము:- యోధుడైన శుకుడు యుద్ధవిజయకాంక్షతో చెలరేగి తన భుజబలం విశదం అయ్యేలా శరసమూహంతో శత్రు సేనావ్యూహాన్ని నాశనం చేసాడు.

తెభా-10.2-863-ఉ.
సాణుఁ డేపుమైఁ గదిసి శాత్రవవీరులు సంచలింప దో
స్సా మెలర్పఁ గుంత శర క్తి గదా క్షురికాది హేతులన్
వాక వాజి దంతి రథర్గములం దునుమాడి కాల్వురన్
వీముతోడఁ బంపె జమువీటికిఁ గాఁపుర ముగ్రమూర్తియై.

టీక:- సారణుడు = సారణుడు; ఏపుమై = గర్వముతో; కదిసి = చేరి; శాత్రవ = శత్రు; వీరులన్ = శూరులను; సంచలింపన్ = కలతచెందేలా; దోస్సారమున్ = భుజబలము; ఎలర్పున్ = అతిశయించగా; కుంత = ఈటెలు; శర = బాణములు; శక్తి = శక్తి ఆయుధము; గదా = గదాయుధము; క్షురికా = చురకత్తి; ఆది = మున్నగు; హేతులన్ = ఆయుధములచేత; వారక = వెనుదీయక; వాజి = గుఱ్ఱములు; దంతి = ఏనుగులు; రథ = రథములు; వర్గములన్ = సమూహములను; తునుమాడి = చంపి; కాల్వురన్ = కాల్బంటులను; వీరము = పరాక్రము; తోడన్ = తోటి; పంపెన్ = పంపించెను; జము = యముని; వీటి = పట్టణమున; కిన్ = కు; కాపురమున్ = కాపురముండుటకు; ఉగ్ర = భయకరమైన; మూర్తి = స్వరూపము కలవాడు; ఐ = అయ్యి.
భావము:- సారణుడు విజృంభించి శత్రువీరులు తన బాహుబలానికి శత్రువులు భయపడేలాగా కుంతాలూ, శక్తులూ, బాణాలూ, గదలూ, కత్తులూ మొదలైన ఆయుధాలతో సాల్వుడి గుఱ్ఱాలను ఏనుగులను రథాలను ధ్వంసం చేసి ఉగ్రస్వరూపుడు అయి శౌర్యంతో సైనికులను సంహరించాడు.

తెభా-10.2-864-క.
క్రూరుఁడుఁ దదనుజులు న
క్రపరాక్రమము మెఱసి వైరుల బాహా
విక్రమమున వధియించిరి
క్రప్రాసాది వివిధ సాధనములచేన్.

టీక:- అక్రూరుడున్ = అక్రూరుడు; తత్ = అతని; అనుజులున్ = సోదరులు; అవక్ర = తిరుగులేని; పరాక్రమము = పరాక్రమముతో; మెఱసి = విజృంభించి; వైరుల = శత్రువుల; బాహావిక్రమమునన్ = భుజబలముతో; వధియించిరి = చంపిరి; చక్ర = చక్రాయుధములు; ప్రాస = ఈటెలు; ఆది = మున్నగు; వివిధ = నానా విధములైన; సాధనముల = ఆయుధముల; చేన్ = చేత.
భావము:- అక్రూరుడూ అతని తమ్ముళ్ళూ తిరుగులేని పరాక్రమంతో మెరసి ఈటె, చక్రము మున్నగు రక రకాల సాధనాల ప్రయోగంతో శత్రువులను వధించారు.

తెభా-10.2-865-మ.
కృవర్మక్షితినాయకుండు విశిఖశ్రేణిం బ్రమత్తార్యధి
శ్రివర్మంబులఁ జించి మేనుల శతచ్ఛిద్రంబులం జేయ న
ద్భుకర్మం బని సైనికుల్‌ వొగడ శత్రుల్‌ దూలుచో సంగర
క్షితిధర్మంబుఁ దలంచి కాచె రథికశ్రేష్ఠుండు భూమీశ్వరా!

టీక:- కృతవర్మ = కృతవర్మ అను; క్షితినాయకుండు = రాజు; విశిఖ = బాణముల; శ్రేణిన్ = పరంపరచేత; ప్రమత్త = మదించిన; ఆర్య = యజమానిచే; అధి = అధికముగా; శ్రిత = ఆశ్రయించబడిన; వర్మంబులన్ = కవచములను; చించి = చించి; మేనులన్ = దేహములను; శత = నూరేసి (100); ఛిద్రంబులన్ = రంధ్రములు కలవానినిగా; చేయన్ = చేయగా; అద్భుత = ఆశ్చర్యకరమైన; కర్మంబు = పని; అని = అని; సైనికుల్ = సైనికులు; పొగడన్ = కీర్తిస్తుండగా; శత్రుల్ = శత్రువులు; తూలుచోన్ = తూలిపోయిన ఎడల; సంగర = యుద్ధ; క్షితి = భూమి; ధర్మంబున్ = ధర్మమును; తలంచి = తలచి; కాచెన్ = రక్షించెను; రథిక = రథికులలో; శ్రేష్ఠుండు = ఉత్తముడు; భూమీశ్వరా = రాజా.
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! రాజు కృతవర్మ శత్రువుల కవచాలు భేదించి, వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికాడు. ఇది అద్భుతమైన కార్యమని శత్రువులు సైతం పొగిడారు. రథికోత్తముడు అయిన అతడు యుద్ధధర్మాన్ని అవలంబించి విరోధులు పారిపోతుంటే వారిని చంపకుండా వదలిపెట్టాడు.

తెభా-10.2-866-వ.
అయ్యవసరంబున సాల్వుండు గోపోద్దీపితమానసుండై యుండ మాయావిడంబకంబైన సౌభకం బప్పుడు.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; సాల్వుండు = సాల్వుడు; కోప = కోపముచేత; ఉద్దీపిత = మండిపోతున్న; మానసుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; మాయా = మాయతో; విడంబకంబు = మోసపుచ్చునది; ఐన = అయిన; సౌభకంబు = సౌభకము; అప్పుడు = అప్పుడు.
భావము:- అప్పుడు, సాల్వుడికి బాగా కోపం వచ్చింది. అతడి సౌభకవిమానం తన మాయాప్రభావంతో విజృంభించింది.

తెభా-10.2-867-సీ.
కమాటు నభమునఁ బ్రకటంబుగాఁ దోఁచు-
నొకమాటు ధరణిపై నొయ్య నిలుచు
నొమాటు శైలమస్తమున వర్తించు-
నొకపరిఁ జరియించు నుదధినడుమ
నొక్క తోయంబున నొక్కటియై యుండు-
నొక్కెడఁ గనుఁగొనఁ బెక్కు లగును
నొకమాటు సాల్వసంయుక్తమై పొడసూపు-
నొక తోయ మన్నియు నుడిగి తోఁచు

తెభా-10.2-867.1-ఆ.
నొక్కతేప కొఱవి యుడుగక త్రిప్పిన
తి మహోగ్రవృత్తిఁ గానవచ్చు
ఱియుఁ బెక్కుగతుల రివరుల్‌ గలఁగంగఁ
దిరిగె సౌభకంబు ధీవరేణ్య!

టీక:- ఒక = ఒక; మాటు = సారి; నభమునన్ = ఆకాశమునందు; ప్రకటంబుగా = విశదముగా; తోచున్ = కనబడును; ఒక = ఒక; మాటు = సారి; ధరణి = నేల; పైన్ = మీద; ఒయ్యనన్ = చటుక్కున; నిలుచున్ = నిలబడును; ఒక = ఒక; మాటు = సారి; శైల = కొండ; మస్తకమున్ = శిఖరముపై; వర్తించున్ = తిరుగును; ఒక = ఒక; పరి = సారి; చరియించును = తిరుగును; ఉదధి = సముద్రము; నడుమ = మధ్యలో; ఒక్క = ఒక; తోయంబునన్ = సారి; ఒక్కటి = ఒకటేగా; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును; ఒక్క = ఒక; ఎడన్ = సమయమునందు; కనుగొనన్ = చూడగా; పెక్కులు = అనేకములుగా; అగును = ఐ కనబడును; ఒక = ఒక; మాటు = సారి; సాల్వ = సాల్వునితో; సంయుక్తము = కూడినది; ఐ = అయ్యి; పొడచూపు = కనబడును; ఒక = ఒక; తోయమున్ = సారి; అన్నియున్ = అన్నిటిని; ఉడిగి = వదలిపెట్టి; తోచున్ = కనబడును; ఒక్క = ఒక; తేప = సారి; కొఱవిన్ = కొరకంచు, నిప్పుకొసనున్నకఱ్ఱ; ఉడుగక = ఎడతెగకుండ; త్రిప్పిన = తిప్పెడి; గతిన్ = విధముగా; మహా = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; వృత్తిన్ = విధముగా; కానవచ్చున్ = కనబడును; మఱియున్ = ఇంక; పెక్కు = అనేక; గతులన్ = విధములుగా; అరి = శత్రు; వరుల్ = శ్రేష్ఠులు; కలగంగన్ = కలతచెందగా; తిరిగె = తిరిగెను; సౌభకంబు = సౌభకము; ధీవరేణ్య = జ్ఞానశ్రేష్ఠుడా.
భావము:- పరీక్షన్మహారాజా! ఆ సౌభకవిమానం తన మాయా ప్రభావంతో ఒకమారు ఆకాశంలో కనపడుతుంది; ఒకమారు భూమి మీద నిలబడుతుంది; ఒకమారు కొండశిఖరం మీద తిరుగుతుంది; ఒకమారు సముద్రమధ్యంలో విహరిస్తుంది; ఒకసారి ఒక్కటిగా, మరుక్షణంలో అనేక రూపాలతో ప్రత్యక్షమవుతుంది; ఒకతూరి సాల్వుడితో కూడి చూపట్టుతుంది; ఒకమారు ఏమీ లేకుండా కనపడుతుంది; ఒకమారు కొఱవి తిప్పినట్లుగా భయంకరంగా దర్శనమిస్తుంది; ఈ విధంగా ఆ విమానం శత్రువులు కలవరపడేటట్లు పెక్కువిధాలుగా తిరిగింది.

తెభా-10.2-868-వ.
ఇవ్విధంబున సౌభకంబు వర్తించుటం జేసి యదుసైన్యంబులచే దైన్యంబు నొందిన నిజసైన్యంబుల మరలం బురికొల్పి సాల్వుం డప్పుడు.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగా; సౌభకంబు = సౌభకము; వర్తించుటన్ = మెలగుట; చేసి = వలన; యదు = యదువుల; సైన్యంబుల = సైన్యముల; చేన్ = చేత; దైన్యంబున్ = దీనత్వమును; ఒందిన = పొందిన; నిజ = తన; సైన్యంబుల = సైన్యములను; మరలన్ = తిరిగి; పురికొల్పి = ప్రేరేపించి; సాల్వుండు = సాల్వుడు; అప్పుడు = అప్పుడు;
భావము:- ఇలా సౌభకవిమానం విజృంభించేసరికి అంతకు ముందు యాదవసైన్యంవల్ల భీతిచెందిన తన సైన్యాల్ని సాల్వుడు మళ్ళీ పురిగొల్పి యుద్ధోన్ముఖులను చేసాడు.

తెభా-10.2-869-క.
స్ఫుదనలాభశరంబులు
పొరిఁబొరి బుంఖానుపుంఖములుగా నేయం
దెలియు మరలియు మురిసియు
విరిసియుఁ బిఱుతివక పోరె వెస యదుబలముల్.

టీక:- స్ఫురత్ = ప్రస్ఫుటమైన; అనల = అగ్ని; ఆభ = వంటి; శరముల్ = బాణములను; పొరిపొరిన్ = అధికముగా; పుంఖాను పుంఖములుగా = పింజ పింజను తాకునట్లు; ఏయన్ = వేయగా; తెరలియున్ = చలించినను; మరలియున్ = వెనుదిరిగి; మురిసియున్ = విచ్చిపోయి; విరిసియున్ = చెదిరిపోయి; పిఱుతివక = వెనుకకు తిరుగకుండ; పోరెన్ = యుద్ధము చేసినవి; వెసన్ = వడిగా; యదు = యదువుల; బలముల్ = సేనలు.
భావము:- అప్పుడు, సాల్వుడు యాదవసైన్యంమీద అగ్నిజ్వాల ల్లాంటి బాణాలను పింజ పింజతాకేలా వేసాడు. అయినా ఆ సైన్యం చెదరక బెదరక వెనుకంజ వేయక ధైర్యంతో నిలచి యుద్ధం చేసింది.

తెభా-10.2-870-క.
య్యెడ మానము వదలక
య్యక మగపాడితో దృఢంబుగఁ బోరన్
య్య మెఱుంగును? నెక్కటి
య్యం బపుడయ్యెఁ బేరుల యోధులకున్.

టీక:- ఆ = ఆ; ఎడన్ = సమయము నందు; మానము = గౌరవబుద్ధిని; వదలక = వదిలిపెట్టకుండ; డయ్యక = బెదరకుండ; మగపాడి = శౌర్యము; తోన్ = తోటి; దృఢంబుగన్ = గట్టిగా; పోరన్ = పోరగా; దయ్యము = దేవుడికే; ఎఱుంగును = తెలియును; ఎక్కటి = అసహాయపు; కయ్యంబు = పోరు; అపుడు = అప్పుడు; అయ్యెన్ = అయినది; పేరుగల = ప్రసిద్ధులైన; యోధుల్ = వీరుల; కున్ = కు.
భావము:- ఆ సమయంలో రెండు పక్షాల యోధులూ నదురూ బెదురూ లేకుండా, అలసిపోకుండా గట్టిగా పౌరుషంతో పోరాడారు. అప్పుడు ప్రసిద్ధులైన యోధుల మధ్య ద్వంద్వ యుద్ధం జరగసాగింది.

తెభా-10.2-871-క.
మును ప్రద్యుమ్నకుమారుని
నిశితాస్త్రములచేతఁ డు నొచ్చిన సా
ల్వుని మంతిరి ద్యుమనాముఁడు
సునిశిత గదచే నమర్చి సుమహితశక్తిన్.

టీక:- మును = మునపు; ప్రద్యుమ్న = ప్రద్యుమ్నుడు అను; కుమారుని = బాలుని; ఘన = గొప్ప; నిశిత = వాడియైన; అస్త్రముల = అస్త్రముల {అస్త్రము - మంత్ర ప్రయోగముగల మహిమగల ఆయుధములు}; చేతన్ = వలన; కడు = మిక్కిలి; నొచ్చిన = బాధనొందిన; సాల్వుని = సాల్వుని యొక్క; మంతిరి = మంత్రి; ద్యుమ = ద్యుముడు అను; నాముడు = పేరు కలవాడు; సునిశిత = మిక్కిలి తీవ్రమైన; గదన్ = గద; చేన్ = చేతిలో; అమర్చి = ధరించి; సు = మిక్కిలి; మహిత = అధికమైన; శక్తి = శక్తి; తోన్ = తోటి.
భావము:- మునుపు ప్రద్యుమ్నుడి బాణాల వలన మిక్కిలి నొచ్చిన సాల్వుడి మంత్రి ద్యుముడు అనేవాడు గదను ధరించి ప్రద్యుమ్నుడిని ఎదుర్కున్నాడు.

తెభా-10.2-872-చ.
వెవును లావుఁ జేవయును వీరముఁ బీరము గల్గి డాసి యా
సిజనాభనందను విశాలభుజాంతరముం బగిల్చినన్
వివిరవోయి మేను నిడువెండ్రుక వెట్టఁగఁ జేతిఁ సాధనో
త్కములు దేరిపై వదలి న్నులుమూయుచు మూర్ఛనొందినన్

టీక:- వెరవును = సుళువు; లావున్ = బలము; చేవయున్ = ధైర్యము; వీరమున్ = శౌర్యము; బీరమున్ = పరాక్రమము; కల్గి = కలవాడై; డాసి = చేరి; ఆ = ఆ యొక్క; సరసిజనాభనందను = ప్రద్యుమ్నుని {సరసిజనాభనందనుడు - పద్మనాభుని (కృష్ణుని) కొడుకు, ప్రద్యుమ్నుడు}; విశాల = వెడల్పైన; భుజాంతరమున్ = వక్షస్థలమును; పగిల్చినన్ = పగులునట్లు కొట్టగా; విరవిరపోయి = విలవిల లాడిపోయి; మేను = దేహము నందు; నిడువెండ్రుకపెట్టగన్ = రోమాంచమునొంది, గగుర్పాటునొంది; చేతిన్ = చేతిలోని; సాధన = ఆయుధముల; ఉత్కరమున్ = సమూహమును; తేరి = రథము; పైన్ = మీద; వదలి = వదలిపెట్టి; కన్నులున్ = కళ్ళను; మూయుచున్ = మూసికొనుచు; మూర్ఛ = స్పృహతప్పుటను; ఒందినన్ = పొందగా.
భావము:- నేర్పూ బలపరాక్రమాలూ ప్రదర్శిస్తూ ద్యుముడు గదతో కృష్ణకుమారుడు ప్రద్యుమ్నుడి వక్షం పగిలేలా మోదాడు. ఆ దెబ్బకి అతడు మేను గగుర్పడంతో చేతిలోని అస్త్రశస్త్రాలను రథంమీదనే వదిలి కనులు మూతలు పడి మూర్ఛపోయాడు.

తెభా-10.2-873-ఆ.
మరధర్మ వేది మధిక నయవాది
దారుకుని సుతుండు ధైర్యయుతుఁడు
థముఁ దోలికొనుచు ణభూమి వెడలి వే
నియె మూర్ఛదేఱి శంబరారి.

టీక:- సమర = యుద్ధ; ధర్మ = నీతిని; వేది = తెలిసినవాడు; సమధిక = అత్యధికమైన; నయవాది = న్యాయముగ మాట్లాడువాడు; దారుకుని = దారుకుని యొక్క {దారుకుడు - కృష్ణుని రథసారథి}; సుతుండు = కొడుకు; ధైర్య = ధైర్యము; యుతుడు = కలవాడు; రథమున్ = రథమును; తోలికొనుచు = నడుపుకొనుచు; రణభూమి = యుద్ధభూమినుండి; వెడలి = బయలుదేరి; వేన్ = వేగముగా; చనియె = పోయెను; మూర్చదేఱి = స్మృతి తెలిసి; శంబరారి = ప్రద్యుమ్నుడు {శంబరారి - శంబరాసురుని శత్రువు, ప్రద్యుమ్నుడు}.
భావము:- సారథి దారకుని కుమారుడు; యుద్ధధర్మం చక్కగా తెలిసినవాడు; నీతిశాస్త్ర పారంగతుడు; కనుక, రథాన్ని మళ్ళించి యుద్ధభూమినుండి ప్రక్కకు తోలుకుని పోయాడు. కొంతసేపటికి ప్రద్యుమ్నుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు.

తెభా-10.2-874-ఉ.
సారిథిఁ జూచి యిట్లనియె "శాత్రవవీరులు సూచి నవ్వఁగాఁ
దేరు రణక్షితిన్ వెడలఁ దెచ్చితి తెచ్చితి దుర్యశంబు పం
కేరుహనాభుఁడున్ హలియు గేలికొనన్ యదువంశసంభవుల్‌
బీము దప్పి యిప్పగిదిఁ బెల్కుఱి పోవుదురే రణంబునన్. "

టీక:- సారథిన్ = సారథిని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను; శాత్రవ = శత్రు; వీరులు = యోధులు; చూచి = చూసి; నవ్వగాన్ = పరిహసించగా; తేరున్ = రథమును; రణ = యుద్ధ; క్షితిన్ = భూమినుండి; వెడలన్ = బయటకు; తెచ్చితి = తీసుకు వచ్చావు; తెచ్చితివి = తీసుకు వచ్చావు; దుర్యశంబున్ = అపకీర్తిని; పంకేరుహనాభుడున్ = కృష్ణుడు; హలియున్ = బలరాముడు; గేలికొనన్ = ఎగతాళిచేయగా; యదు = యాదవ; వంశ = వంశమున; సంభవుల్ = పుట్టినవారు; బీరమున్ = పరాక్రమము; తప్పి = హీనులై; ఈ = ఈ; పగిదిన్ = విధముగ; పెల్కుఱి = విహ్వలులై, బెదిరిపోయినవారై; పోవుదురే = పారిపోతారా; రణంబునన్ = యుద్ధమునుండి.
భావము:- సారథిని, తేరుకున్న ప్రద్యుమ్నుడు ఇలా మందలించాడు. “కృష్ణుడూ బలరాముడూ ఎగతాళి చేసేలా, శత్రువులు నవ్వేలా రణక్షేత్రం నుండి రథాన్ని తప్పించి, అపకీర్తి తెచ్చావు. యదువంశంలో పుట్టిన వీరకుమారులు పరాక్రమహీనులై ఈ మాదిరి యుద్ధరంగం నుంచి తొలగిపోరు కదా.”

తెభా-10.2-875-వ.
అనిన నతం డతని కిట్లనియె.
టీక:- అనినన్ = అనగా; అతండు = అతను; అతని = అతని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- ఇలా అంటున్న ప్రద్యుమ్నుడితో సారథి ఇలా అన్నాడు.

తెభా-10.2-876-క.
"రథి రిపుచే నొచ్చిన సా
థియును, సారథియు నొవ్వ థియును గావం
బృథుసమర ధర్మ; మిఁక న
వ్యచిత్తుఁ డవగుచుఁ గడఁగు వైరుల గెలువన్."

టీక:- రథి = రథములో నుండువాడు; రిపు = శత్రువు; చేన్ = చేత; నొచ్చిన = దెబ్బతిన్నచో; సారథియున్ = రథము నడపువాడు; సారథియున్ = సారథి; నొవ్వన్ = దెబ్బతిన్నచో; రథియునున్ = రథి; కావన్ = కాపాడుట; పృథు = గొప్ప; సమర = యుద్ధ; ధర్మము = నీతి; ఇకన్ = ఇంక; అవ్యధ = నిర్విచారమైన; చిత్తుడవు = మనస్సు కలవాడవు; అగుచున్ = ఔతు; కడగుము = పూనుము; వైరులన్ = శత్రువులను; గెలువన్ = జయించవలెను.
భావము:- “యుద్ధధర్మం ప్రకారం శత్రువుల వలన రథికుడు నొచ్చినపుడు సారథి, సారథి దెబ్బతిన్నప్పుడు రథికుడూ పరస్పరం రక్షించుకోవాలి, కాబట్టి. నేను ఇలా చేసాను. నీవు బాధపడక విరోధులను గెలవడానికి ప్రయత్నించు.”

తెభా-10.2-877-వ.
అనిన విని.
టీక:- అనినన్ = అనగా; విని = విని.
భావము:- ఇలా సారథి చెప్పగా విని...

తెభా-10.2-878-ఉ.
సంచితభూరిబాహుబల శౌర్యుఁడు సారథిమాట కాత్మ మో
దించి యుదాత్తకాండ రుచిదీపితచాపముఁ దాల్చి మౌర్వి సా
రించి గుణధ్వనిన్ బృహదరిప్రకరంబుల భీతి ముంచి తో
లించె రథంబు మేదిని చలింపఁగ నా ద్యుముమీఁద నేర్పునన్.

టీక:- సంచిత = కూడబెట్టుకొన్న; భూరి = అత్యధికమైన; బాహుబల = భుజబలము కల; శౌర్యుడు = శూరత్వము కలవాడు; సారథి = రథసారథి యొక్క; మాట = చెప్పినమాట; కున్ = కు; ఆత్మన్ = మనస్సు నందు; మోదించి = సంతోషించి; ఉదాత్త = ఘనమైన; కాండ = బాణముల; రుచి = కాంతిచేత; దీపిత = ప్రకాశించుచున్న; చాపమున్ = వింటిని; తాల్చి = ధరించి; మౌర్విన్ = వింటినారిని; సారించి = మీటి; గుణ = ఆ అల్లెతాడు యొక్క; ధ్వనిని = శబ్దముతో; బృహత్ = పెద్ద; అరి = శత్రు; ప్రకరములన్ = సమూహములను; భీతిన్ = భయము నందు; ముంచి = ముంచి; తోలించెన్ = నడిపింపజేసెను; రథంబున్ = రథమును; మేదిని = నేల; చలింపన్ = అదిరిపోగా; ఆ = ఆ యొక్క; ద్యుము = ద్యుముని; మీదన్ = పైకి; నేర్పునన్ = నేర్పరితనముతో.
భావము:- మహాశూరుడు, అపార బలసంపన్నుడు అయిన ప్రద్యుమ్నుడు సారథి మాటలకు సంతోషించాడు. ధనుష్టంకారంతో శత్రువులను భయభ్రాంతులను చేస్తూ గొప్ప నేర్పుతో ద్యుముడి మీదకి తిరిగి రథాన్ని తోలించాడు.

తెభా-10.2-879-వ.
అట్లు డగ్గఱి.
టీక:- అట్లు = అలా; డగ్గఱి = సమీపించి.
భావము:- అలా శత్రువు ద్యుముడిని సమీపించి...

తెభా-10.2-880-చ.
రితను వష్ట బాణముల నాగ్రహవృత్తిఁ బగిల్చి నాల్గిటం
దుగములన్ వధించి యొక తూపున సారథిఁ ద్రుంచి రెంటని
ష్ఠుతర కేతుచాపములు చూర్ణముచేసి యొకమ్మునన్ భయం
ముగఁ ద్రుంచె నా ద్యుమునికంఠ మకుంఠిత విక్రమోద్ధతిన్.

టీక:- అరి = శత్రువు యొక్క; తనువున్ = దేహమును; అష్ట = ఎనిమిది (8); బాణములన్ = బాణములతో; ఆగ్రహ = కోపము కల; వృత్తిన్ = నడవడికతో; పగిల్చి = పగులునట్లు కొట్టి; నాల్గిటన్ = నాలుగింటితో (4); తురగములన్ = గుఱ్ఱములను; వధించి = చంపి; ఒక = ఒక; తూపునన్ = బాణముతో; సారథిన్ = రథసారథిన్; త్రుంచి = చంపి; రెంటన్ = రెండింటితో (2); నిష్ఠురతర = మిక్కిలి కఠినమైన {నిష్ఠురము - నిష్ఠురతరము - నిష్ఠురతమము}; కేతు = జండాకఱ్ఱ; చాపములున్ = ధనుస్సులను; చూర్ణము = పొడిపొడిగా; చేసి = చేసి; ఒక = ఒక; అమ్మునన్ = బాణముతో; భయంకరముగన్ = భయంకరముగా; త్రుంచెన్ = నరికెను; ఆ = ఆ; ద్యుముని = ద్యుముని యొక్క; కంఠమున్ = కంఠమును; అకుంఠిత = మొక్కవోని; విక్రమ = పరాక్రమము యొక్క; ఉద్ధతిన్ = అతిశయముతో.
భావము:- మిక్కిలి ఆగ్రహంతో ప్రద్యుమ్నుడు అవక్రపరాక్రమం ప్రదర్శిస్తూ ఎనిమిది బాణాలను వేసి శత్రువు శరీరాన్ని పగులకొట్టాడు. నాలుగు బాణాలు వేసి అతని గుఱ్ఱాలను కూల్చాడు. రెండు బాణాలతో వాడి పతాకాన్నీ ధనుస్సునూ నుగ్గునుగ్గుచేసాడు. ఒక బాణంతో భయంకరంగా అతని సారథిని సంహరించాడు. పిమ్మట విక్రమించి ప్రద్యుమ్నుడు ఒక అమ్ముతో ద్యుముని కంఠాన్ని భీకరంగా నరికాడు.

తెభా-10.2-881-మ.
ని సాంబప్రముఖాది యోధవరు లుత్కంఠాత్ములై మీన కే
ను నగ్గించి సువర్ణపుంఖ నిశితాస్త్రశ్రేణి సంధించి సా
ల్వుని సైన్యావలి మస్తముల్‌ వెరవు లావున్ మీఱఁగా నొక్క యె
త్తు వేత్రుంచిరి తాటిపండ్లు ధరఁ దోడ్తో రాల్చు చందంబునన్.

టీక:- కని = చూసి; సాంబ = సాంబుడు; ప్రముఖాది = మున్నగు ముఖ్యులు; యోధ = వీర; వరులు = ఉత్తములు; ఉత్కంఠ = ఆసక్తి కల; ఆత్ములు = మనసులు కలవారు; ఐ = అయ్యి; మీనకేతనున్ = ప్రద్యుమ్నుని {మీనకేతనుడు – చేపగుర్తు కల జండా కలవాడు, ప్రద్యుమ్నుడు}; అగ్గించి = శ్లాఘించి; సువర్ణ = బంగారు; పుంఖ = పింజలుగల; నిశిత = వాడియైన; అస్త్ర = అస్త్రముల; శ్రేణిన్ = సమూహమును; సంధించి = ఎక్కుపెట్టి; సాల్వుని = సాల్వుని యొక్క; సైన్య = సైన్యముల; ఆవలి = సమూహముల; మస్తముల్ = తలలను; వెరవు = లాఘవము; లావున్ = శక్తిని; మీఱగాన్ = అతిశయించగా; ఒక్కయెత్తునన్ = వరసపెట్టి; వేన్ = వేగముగా; త్రుంచిరి = నరికివేసిరి; తాటిపండ్లున్ = తాటిపళ్ళను; ధరన్ = నేలపై; తోడ్తోన్ = వెనువెంట, గబగబగా; రాల్చు = పడగొట్టెడి; చందంబునన్ = విధముగా.
భావము:- అది చూసిన సాంబుడు మున్నగు యదు యోధులు ప్రద్యుమ్నుడిని ప్రస్తుతించారు. పదునైన బంగారు పింజలు గల బాణాలతో తాటిపండ్లను నేల రాల్చినట్లు సాల్వుని సైనికుల తలలు ఉత్తరించారు

తెభా-10.2-882-వ.
అట్టి యెడ.
టీక:- అట్టి = అటువంటి; ఎడన్ = సమయమునందు.
భావము:- ఆ యాదవులు సాల్వ యుద్ధ సమయంలో....

తెభా-10.2-883-స్రగ్ద.
కూలున్ గుఱ్ఱంబులేనుంగులు ధరఁగె; డయుంగుప్పలై; నుగ్గునూచై
వ్రాలున్దేరుల్‌; హతంబై డిఁబడుసు; భటవ్రాతముల్‌; శోణితంబుల్‌
గ్రోలున్, మాంసంబునంజుంగొఱకు, నెము; కలన్గుంపులైసోలుచున్బే
తాక్రవ్యాదభూతోత్కరములు, జ; తలై తాళముల్‌ దట్టి యాడున్.

టీక:- కూలున్ = కూలిపోవును; గుఱ్ఱంబులున్ = గుఱ్ఱములు; ఏనుంగులున్ = ఏనుగులు; ధరన్ = నేలమీద; కెడయున్ = చచ్చిపోవును; కుప్పలు = పోగులు; ఐ = అయ్యి; నుగ్గునూచు = పొడిపొడిగా; ఐ = అయ్యి; వ్రాలున్ = రాలిపోవును; తేరుల్ = రథములు; హతంబు = చంపబడినవి; ఐ = అయ్యి; వడిన్ = వేగముగా; పడునున్ = పడిపోవును; సుభట = యోధులు; వ్రాతముల్ = సమూహములు; శోణితంబుల్ = రక్తములు; క్రోలున్ = తాగును; మాంసంబున్ = మాంసమును; నంజున్ = నంజుకొను; కొఱకున్ = కొరుకును; ఎములన్ = ఎముకలను; గుంపులు = గుంపులుగా కూడినవి; ఐ = అయ్యి; సోలుచున్ = చొక్కిపడుచు; బేతాల = బేతాళములు అను పిశాచములు; క్రవ్యాద = రాక్షసులు అను పిశాచములు; భూత = భూతములు అను పిశాచములు; ఉత్కరములు = సమూహములు; జతలు = జతకూడినవి; ఐ = అయ్యి; తాళముల్ = తాళములు; తట్టి = వేస్తు; ఆడున్ = నాట్యము చేసెను.
భావము:- కుప్పలు తెప్పలుగా గుఱ్ఱాలు కూలాయి; ఏనుగులు నేల మీద వ్రాలాయి; రథాలు నుగ్గనుగ్గు అయి కూలాయి; భటులు చచ్చి పడిపోయారు; బేతాళాలూ పిశాచాలూ భూతాలూ ఆనందంతో రక్తాన్ని త్రాగుతూ, మాంసం నంజుకుంటూ, ఎముకలు కొరుకుతూ. చప్పట్లతో తాళాలు చరుస్తూ, పారవశ్యంగా నృత్యాలు చేసాయి.

తెభా-10.2-884-వ.
మఱియు నొక్కయెడ.
టీక:- మఱియున్ = ఇంకను; ఒక్క = ఒక; ఎడన్ = సమయమునందు.
భావము:- ఆ సంగ్రామరంగంలో ఆ సమయంలో....

తెభా-10.2-885-సీ.
ఖండిత శుండాల గండముల్‌ నక్రముల్‌-
భూరితుండంబులు భుజగ సమితి;
దతలంబులు గచ్ఛపంబులు; దంతముల్‌-
శుక్తులు; గుంభనిర్ముక్త మౌక్తి
ములు రత్నములు; వాములు జలూకముల్‌-
మెడలు భేకంబులు; మెదడు రొంపి;
ప్రేవులు పవడంపుఁ దీవెలు; నరములు-
నాఁచు; మజ్జంబు ఫేనంబు; లస్థి

తెభా-10.2-885.1-ఆ.
సైకతములు; రక్తయము తోయంబులు;
నొరగు నెడల నొరలు మొఱలు ఘన త
రంగరవముగా మతంగజాయోధన
స్థలము జలధిఁ బోల్పఁ గె నరేంద్ర!

టీక:- ఖండిత = నరకబడిన; శుండాల = ఏనుగుల; గండముల్ = చెక్కిళ్ళు; నక్రముల్ = మొసళ్ళు; భూరి = పెద్దపెద్ద; తుండంబులు = తొండములు; భుజగ = పాముల; సమితి = సమూహము; పదతలంబులున్ = అరికాళ్ళు; కచ్ఛపంబులు = తాబేళ్ళు; దంతముల్ = ఏనుగుదంతాలు; శుక్తులున్ = ముత్యపుచిప్పలు; కుంభ = కుంభస్థలములనుండి; నిర్ముక్త = రాలిన; మౌక్తికములు = ముత్యాలు; రత్నములు = రత్నములు; వాలములున్ = తోకలు; జలూకముల్ = జలగలు; మెడల్ = కంఠభాగములు; భేకంబులు = కప్పలు; మెదడు = తలలోనిమాంసము; రొంపి = బురద; ప్రేవులు = పేగులు; పవడంపు = పగడాల; తీవెలు = తీగలు; నరములు = నరాలు; నాచు = నాచు, పాచి; మజ్జంబు = కొవ్వు; ఫేనంబులున్ = నురగ; అస్థి = ఎముకలు; సైకతములు = ఇసుకతిన్నెలు; రక్త = నెత్తురుల; చయము = సమూహములు; తోయంబులున్ = నీళ్ళు; ఒరగు = కూలెడి; ఎడలన్ = ,మయములందు; ఒఱలు = కూయునట్టి; మొఱలు = దుఃఖముతోటికూతలు; ఘన = గొప్ప; తరంగ = అలల; రవముగాన్ = చప్పుళ్ళుగా; మతంగజ = మదగజముల; యోధన = యుద్ధ; స్థలము = భూమి; జలధిన్ = సముద్రమును; పోల్పన్ = సరిపోల్చుటకు; తగెన్ = తగి ఉన్నది; నరేంద్ర = రాజ.
భావము:- ఓ రాజా! ఆ రణరంగం సముద్రంలా మారింది ఖండించబడిన ఏనుగుల గండస్థలాలే మొసళ్ళుగా; తొండాలే పాములుగా; ఆ యేనుగుల కాళ్ళు తాబేళ్ళుగా; దంతాలు ముత్యపుచిప్పలుగా; వాటి కుంభస్థలాల నుండి రాలిపడిన ముత్యాలు రత్నాలుగా; తోకలు జలగలుగా; మెడలు కప్పలుగా; మెదడు బురదగా; ప్రేగులు పగడపుతీగలుగా; నరాలు నాచుతీవలుగా; క్రొవ్వు నురుగులా; ఎముకలు ఇసుకతిన్నెలుగా; రక్తము నీరుగా; మరణిస్తూ చేసే ఘీంకారాలు తరంగ శబ్దాలుగా; ఇలా ఆ రణభూమి సముద్రంతో పోల్చతగి పోలుపారింది.

తెభా-10.2-886-వ.
ఇవ్విధంబున యదుసాల్వబలంబులు చలంబునఁ బరస్పర జయకాంక్షలం దలపడి పోరు పూర్వపశ్చిమ సముద్రంబుల వడువున నిరువదియేడు దినంబు లతిఘోరంబుగాఁ బోరునెడ నింద్రప్రస్థపురంబు నుండి ద్వారకానగరంబునకు నగధరుండు సనుదేర ముందటం గానవచ్చు దుర్నిమిత్తంబులం గనుంకొని కృష్ణుండు దారుకునిం జూచి యిట్లనియె.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగ; యదు = యాదవుల యొక్క; సాల్వ = సాల్వుని యొక్క; బలములు = సైన్యములు; చలంబునన్ = పట్టుదలతో; పరస్పర = ఒండొరులను; జయ = గెలువవలె ననెడి; కాంక్షలన్ = కోరికలతో; తలపడి = తాకి; పోరు = పోరాడెడి; పూర్వ = తూర్పు; పశ్చిమ = పడమటి; సముద్రంబులన్ = సముద్రముల; వడువునన్ = వలె; ఇరువదియేడు = ఇరవైయేడు (27); దినంబులు = రోజులు; అతి = మిక్కిలి; ఘోరంబుగాన్ = భయంకరముగా; పోరున్ = పోరాడెడి; ఎడన్ = సమయము నందు; ఇంద్రప్రస్థ = ఇంద్రప్రస్థము; పురంబు = పట్టణము; నుండి = నుండి; ద్వారకా = ద్వారక; నగరంబున్ = పట్టణమున; కున్ = కు; నగధరుండు = కృష్ణుడు {నగధరుడు - గోవర్ధనగిరిధారి, కృష్ణుడు}; చనుదేర = వస్తుండగా; ముందటన్ = ఎదుట; కానవచ్చు = కనబడుతున్న; దుర్నిమిత్తంబులన్ = అపశకునములను; కనుంగొని = చూసి; కృష్ణుండు = కృష్ణుడు; దారుకునిన్ = దారుకుని {దారకుడు - కృష్ణుని సారథి}; చూచి = ఉద్దేశించి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా యాదవ బలాలూ, సాల్వ సైన్యాలూ ఒకరిని ఒకరు జయించాలనే కోరికతో ఇరవైఏడు దినాలు పాటు తూర్పు పడమర సముద్రాలు తలపడి పోరుతున్నాయా అన్నట్లు భీకరంగా యుద్ధం చేశాయి. ఆ సమయంలో ఇంద్రప్రస్థం నుండి శ్రీకృష్ణుడు ద్వారకకు వస్తూ మార్గమధ్యంలో కనపడ్డ చెడ్డ శకునాలను కనుగొని సారథి యైన దారుకుడితో ఇలా అన్నాడు.