Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/యదు వృష్ణి భో జాంధక వంశంబు

వికీసోర్స్ నుండి

యదువృష్ణిభోజాంధకవంశంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/యదు వృష్ణి భో జాంధక వంశంబు)
రచయిత: పోతన


తెభా-10.2-1333-వ.
అట్టి యన్వయంబు నందు మాధవునకు రుక్మిణీదేవి యందుఁ బితృసముండును, సమగ్ర భుజావిజృంభణుండును నై ప్రద్యుమ్నుండు జనియించె; నతనికి రుక్మికూఁతురగు శుభాంగివలన ననిరుద్ధం డుదయించె; నతనికి మౌసలావశిష్టుండైన ప్రజుండు సంభవించె; నతనికిఁ బ్రతిబాహుండుపుట్టె; వానికి సుబాహుండు జన్మించె; నతనికి నుగ్రసేనుండుప్రభవించె; నతనికి శ్రుతసేనుండు గలిగె; నిట్లు యదు వృష్టి భోజాంధక వంశంబులు పరమ పవిత్రంబులై పుండరీకాక్షుని కటాక్షవీక్షణ శయ్యాసనానుగత సరసాలాప స్నానాశన క్రీడావినోదంబుల ననిశంబునుం జెందుచు, సర్వదేవతార్థంబు సమస్తంబైన క్రతువు లొనరింపుచుఁ బరమానంద కందళిత చిత్తులై యుండి"రని చెప్పి వెండియు.
టీక:- అట్టి = అటువంటి; అన్వయంబున్ = వంశము; అందున్ = లో; మాధవున్ = కృష్ణుని; కున్ = కి; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి; అందున్ = తో; పితృ = తండ్రితో; సముండును = సమానమైనవాడు; సమగ్ర = సంపూర్ణమైన; భుజా = భుజబలముల; విజృంభణుండును = ఆటోపము కలవాడును; ఐ = అయ్యి; ప్రద్యుమ్నుండు = ప్రద్యుమ్నుండు; జనియించెన్ = పుట్టెను; రుక్మి = రుక్మి; కూతురు = పుత్రిక; అగు = ఐన; శుభాంగి = శుభాంగి; వలన = అందు; అనిరుద్ధుండున్ = అనిరుద్ధుండు; ఉదయించెన్ = పుట్టెను; అతని = అతని; కిన్ = కి; మౌసలా = ముసలము తరువాత; అవశిష్టుండు = మిగిలినవాడు; ఐన = అయిన; ప్రజుండు = ప్రజుడు; సంభవించెన్ = పుట్టెను; అతని = అతని; కిన్ = కి; ప్రతిబాహుండు = ప్రతిబాహుడు; పుట్టెన్ = పుట్టెను; వాని = అతని; కిన్ = కి; సుబాహుండు = సుబాహుడు; జన్మించెన్ = పుట్టెను; అతని = అతని; కిన్ = కి; ఉగ్రసేనుండు = ఉగ్రసేనుడు; ప్రభవించెన్ = పుట్టను; అతని = అతని; కిన్ = కి; శ్రుతసేనుండు = శ్రుతసేనుండు; కలిగెన్ = పుట్టెను; ఇట్లు = ఈ విధముగ; యదు = యదు; వృష్ణి = వృష్ణి; భోజ = భోజ; అంధక = అంధక; వంశంబులున్ = వంశములు; పరమ = మిక్కిలి; పవిత్రంబులు = పావనములు; ఐ = అయ్యి; పుండరీకాక్షు = కృష్ణుని; నిరీక్షణ = చూపులు; శయ్యా = పడకలు, పండుకొనుట; ఆసన = పీటలు, కూర్చొనుట; అనుగత = వెనుక తిరుగుట; సరస = రసవంతమైన; ఆలాప = ముచ్చట్లు చెప్పుకొనుట; స్నాన = స్నానములు చేయుట; అశన = భోజనములు చేయుట; క్రీడా = ఆటలాడుట; వినోదంబులన్ = వేడుకలలో పాల్గొనుటలలో; అనిశంబు = ఎల్లప్పుడు; చెందుతు = పొందుతు; సర్వ = ఎల్ల; దేవతా = దేవతల; అర్థంబున్ = కోసము; సమస్తంబైన = సమస్తమైన; క్రతువులున్ = యజ్ఞములు; ఒనరింపుచున్ = చేయుచు; పరమ = మిక్కిలి; ఆనంద = ఆనందముచేత; కందళిత = వికసించిన; చిత్తులు = మనసులు కలవారు; ఐ = అయ్యి; ఉండిరి = ఉన్నారు; అని = అని; చెప్పి = చెప్పి; వెండియున్ = మరియును.
భావము:- అలాంటి వంశంలో శ్రీకృష్ణునికి రుక్మిణివల్ల ప్రద్యుమ్నుడు పుట్టాడు. అతడు అన్నిటా తండ్రి వంటివాడు మహాభుజబలం కలవాడు అతని భార్య రుక్మి కూతురు శుభాంగి. ఆమెకు అనిరుద్ధుడు జన్మించాడు. అతనికి ప్రజుడు పుట్టాడు. ఇతను మాత్రమే ముసలం బారినుండి తప్పించుకున్నాడు. ఆ ప్రజుడికి ప్రతిబాహుడు, ప్రతిబాహుడికి సుబాహుడు పుట్టారు. అతనికి ఉగ్రసేనుడు జన్మించాడు. ఈ విధంగా యదు, వృష్ణి, భోజ, అంధక, వంశాలు పవిత్రాలు అయ్యాయి. కృష్ణుడితో సహవాసంచేస్తూ ఆయన కటాక్షవీక్షణలు అందుకుంటు, ఆయనతో కంచాలు మంచాలు ఆసనాలు పంచుకుంటు, కలిసి స్నానాలు భోజనాలు చేస్తు, వినోదాలలో పాల్గొంటు, సకల దేవతలను ఉద్దేశించి యాగాలు చేస్తూ యాదవులు పరమానందం పొందుతూ జీవించారు.” అని చెప్పిన శుకమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు.

తెభా-10.2-1334-మ.
"మోత్సాహముతోడ మాధవుఁడు శుంల్లీలఁ బూరించు న
మ్ముళీగానము వీనులం జిలికినన్ మోదించి గోపాల సుం
రు లేతెంతు రరణ్యభూములకుఁ; దద్దాస్యంబు గామించి య
క్కరుణావార్థి భజింప కుందురె బుధుల్‌ కౌరవ్యవంశాగ్రణీ!

టీక:- పరమ = మిక్కిలి; ఉత్సాహము = ఉత్సాహము; తోడన్ = తోటి; మాధవుడు = కృష్ణుడు; శుంభత్ = మిక్కిలి విలాసవంతమైన; లీలన్ = విధముగా; పూరించు = ఊదెడి; ఆ = ఆ; మురళీ = పిల్లనగ్రోవి; గానము = పాట; వీనులన్ = చెవుల యందు; చిలికినన్ = సోకినంతనే; మోదించి = సంతోషముపొంది; గోపాల = గోపికా; సుందరులు = స్త్రీలు; ఏతెంతురు = వచ్చెదరు; అరణ్య = అటవీ; భూముల = ప్రాంతముల; కున్ = కు; తత్ = అతనిని; దాస్యంబు = సేవించుటలను; కామించి = కోరి; ఆ = ఆ; కరుణా = దయా; వార్థిన్ = సముద్రుని; భజింపక = సేవింపకుండా; ఉందురె = ఉంటారా; బుధుల్ = మంచిబుద్ధి కలవారు; కౌరవ్యవంశాగ్రణీ = పరీక్షిన్మహారాజా {కౌరవ్యవంశాగ్రణి – కురువంశము నందు అగ్రణీ (ముఖ్యమైన వాడు), పరీక్షిత్తు}.
భావము:- “ఓ కురుకులోత్తమరాజ! మహోత్సాహంతో శ్రీకృష్ణుడు మురళిని మ్రోగిస్తే ఆ గానం చెవులలో సోకగానే కృష్ణుడిని సేవించాలనే కాంక్షతో సుందర గోపికలు పరమానందంతో బృందావన ప్రాంతా అడవులకు పరుగెత్తుకుని వస్తారు. ప్రాజ్ఞులైనవారు ఆ కరుణామూర్తిని ఆయన సేవను కోరి పూజించకుండా ఎవరు ఉండలేరు కదా.

తెభా-10.2-1335-మ.
తినెవ్వాని యమంగళఘ్న మగు నామం బర్థిఁ జింతించినన్
నుతిగావించిన విన్న మానవులు ధన్యుల్‌; భూరిసంసార దు
ష్కృతులం ద్రోతురు; కాలచక్ర మహితాసిం బట్టి యా కృష్ణుఁ డీ
క్షితిభారం బుడుగంగఁ జేయు టిది యే చిత్రంబు? భూవల్లభా!

టీక:- మతిన్ = మనసునందు; ఎవ్వని = ఎవని; అమంగళఘ్నము = అశుభములనుపొగొట్టునది; అగు = ఐన; నామంబున్ = పేరును; అర్థిన్ = కోరి; చింతించినన్ = తలచినను, ధ్యానించినను; నుతి = స్తుతించుట; కావించినన్ = చేసినను; విన్నన్ = వినినను; మానవులు = మనుషులు; ధన్యుల్ = కృతార్థులు; భూరి = మిక్కిలి విస్తారమైన; సంసార = సంసారమువలని; దుష్కృతులన్ = దోషములను; త్రోతురు = తొలగింతురు; కాలచక్ర = కాలచక్రము అనెడి; మహిత = గొప్ప; అసిన్ = అస్త్రమును ధరించినవాడు {అసి – ముప్పది అంగుళములకు నెక్కున కత్తి, ఆయుధములు ముప్పది రెండింటిలో నొకటి, (ఆంధ్ర వాచస్పతము)}; పట్టి =ధరించి; కృష్ణుడు = కృష్ణుడు; ఈ = ఈ; క్షితిభారంబు = భూభారమును; ఉడుగన్ = తొలగునట్లు; చేయుట = చేయుట; ఇది = ఇది; ఏ = ఏపాటి; చిత్రంబు = వింత; భూవల్లభా = రాజా.
భావము:- రాజేంద్రా! అశుభాన్నితొలగించే శ్రీకృష్ణుడి నామాన్ని చింతించేవారు, వినేవారు గొప్ప ధన్యులు. వారు సంసారపరమైన కష్టాల నుంచి విముక్తులు అవుతారు. కాలచక్రమనే ఆయుధాన్ని ధరించిన శ్రీకృష్ణుడు ఈ లోకభారాన్ని పోగొట్టడంలో విచిత్రము ఏముంది?

తెభా-10.2-1336-వ.
ఇవ్విధంబున గోపికాజన మనోజాతుండైన కృష్ణుండు లీలామా నుష విగ్రహుండై నిజరాజధాని యైన ద్వారకాపురంబున నమానుష విభవంబు లగు సౌఖ్యంబులం బొదలుచుండె” నని చెప్పి మఱియు నిట్లనియె.
టీక:- ఈ = ఈ; విధంబునన్ = విధముగా; గోపికా = గోపస్త్రీల; జన = సమూహముల; మనోజాతుండు = మన్మథుడు; ఐన = అయిన; కృష్ణుండు = కృష్ణుడు; లీలా = విలాసముగా; మానుష = మానవ; విగ్రహుండు = ఆకృతిధరించినవాడు; ఐ = అయ్యి; నిజ = తన; రాజధాని = పట్టణము; ఐన = అయిన; ద్వారకాపురంబునన్ = ద్వారకానగరమునందు; అమానుష = మానవాతీతమైన; విభవంబులు = వైభవములు; అగు = ఐన; సౌఖ్యంబులన్ = సుఖములచేత; పొదలుచు = వర్థిల్లుతు; ఉండెను = ఉండెను; అని = అని; చెప్పి = చెప్పి; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఈలాగున గోపికామన్మథుడు అయిన శ్రీకృష్ణుడు లీలామానుష రూపం ధరించినవాడు అయి తన రాజధాని ఐన ద్వారకలో లోకాతీత సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నాడు.” అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో మరల ఇలా అన్నాడు

తెభా-10.2-1337-మ.
"నుజేంద్రోత్తమ! యేను నీకుఁ ద్రిజగన్మాంగల్యమై యొప్పఁ జె
ప్పి యీ కృష్ణకథాసుధారసము సంప్రీతాత్ములై భక్తిఁ గ్రో
లి పుణ్యాత్ములు గాంతు రిందు సుఖముల్‌; నిర్ధూతసర్వాఘులై
యంబుం దుదిఁ గాంతు రచ్యుతపదం బై నట్టి కైవల్యమున్. "

టీక:- మనుజేంద్రోత్తమ = మహారాజా; ఏను = నేను; నీ = నీ; కున్ = కు; త్రిజగత్ = ముల్లోకములకు; మాంగల్యము = శుభకరమైనది; ఐ = అయ్యి; ఒప్పన్ = చక్కగా నుండునట్లు; చెప్పిన = చెప్పినట్టి; ఈ = ఈ; కృష్ణ = శ్రీకృష్ణుని; కథా = కథ అనెడి; సుధారసమున్ = అమృతమును; సంప్రీత = సంతోషించిన; ఆత్ములు = మనసులు కలవారు; ఐ = అయ్యి; భక్తిన్ = భక్తితో; క్రోలినన్ = తాగిన, అనుభవించినట్టి; పుణ్యాత్ములు = పుణ్యభావనలు కలవారు; కాంతురు = పొందుతారు; ఇందు = ఈ లోకము నందు; సుఖముల్ = సుఖములను; నిర్ధూత = తొలగింపబడిన; సర్వ = సమస్తమైన; అఘులు = పాపములు కలవారు; ఐ = అయ్యి; అనయంబున్ = అవశ్యము; తుదిన్ = కడపట, చనిపోయాక; కాంతురు = పొందుదురు; అచ్యుతంబు = విష్ణు, జారుటలేని; పదంబు = స్థానము; ఐనట్టి = అయినట్టి; కైవల్యమున్ = మోక్షమును {కైవల్యము - కేవలము తానే (భగవంతుడే) అగుట, మోక్షము}.
భావము:- “ఓ మహారాజా! నేను నీకు చెప్పిన ఈ శ్రీకృష్ణకథారసం ముల్లోకాలకూ శుభదాయకమైనది. భక్తితో ఆస్వాదించే పుణ్యాత్ములు ఈ లోకంలో సుఖాలను పొందుతారు. వారి పాపాలు సమస్తము తొలగిపోతాయి. తుదకు శాశ్వతమైన కైవల్యాన్ని అందుకుంటారు.”

తెభా-10.2-1338-క.
ని యిట్లు బాదరాయణి
మున రాగిల్ల నాభిన్యునకుం జె
ప్పి విధమున సూతుఁడు ముని
నుల కెఱింగింప వారు మ్మతితోడన్.

టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; బాదరాయణి = శుకమహర్షి {బాదరాయణి - బదరీవనమున ఉండువాని (బాదరాయణుని) కొడుకు, శుకుడు}; మనమునన్ = మనసునందు; రాగిల్లన్ = రంజిల్లునట్లు; ఆభిమన్యు = పరీక్షిన్మహారాజున {ఆభిమన్యుడు - అభిమన్యుని పుత్రుడు, పరీక్షిత్తు}; కున్ = కు; చెప్పిన = చెప్పినట్టి; విధమునన్ = రీతిని; సూతుడు = సూతమహర్షి; ముని = ఋషి; జనుల = సమూహమున; కున్ = కు; ఎఱింగింపన్ = తెలియజెప్పగా; వారు = వారు; సమ్మతి = ఇష్టము; తోడన్ = తోటి.
భావము:- ఈరీతిగా శుకమహర్షి పరీక్షన్మహారాజు మనసు రంజిల్లేలా చెప్పిన ప్రకారంగా సూతుడు శౌనకాది మహామునులకు ప్రవచించాడు. వారెంతో సంతోషించారు.

తెభా-10.2-1339-క.
సూతుని బహువిధముల సం
ప్రీతునిఁ గావించి మహిమఁ బెంపారుచు వి
ఖ్యాతికి నెక్కిన కృష్ణక
థాత్పరు లైరి బుద్ధిఁ ఱుఁగని భక్తిన్.

టీక:- సూతుని = సూతమహర్షిని; బహు = పెక్కు; విధముల = విధములుగా; సంప్రీతునిన్ = సంతోషించినవానిగా; కావించి = చేసి; మహిమన్ = గౌరవములచేత; పెంపారుచున్ = అతిశయించుచు; విఖ్యాతి = ప్రసిద్ధి; కిన్ = కి; ఎక్కిన = పొందిన; కృష్ణ = శ్రీకృష్ణుని; కథా = కథలందు; తత్పరులు = లగ్నమైనవారు; ఐరి = అయ్యారు; బుద్ధిన్ = అంతరంగము నందు; తఱుగని = తగ్గని; భక్తిన్ = భక్తితో.
భావము:- ఆ మునులు సూతుడిని అనేక విధముల సత్కరించి, అతనిని పూర్తి సంతుష్టుని చేసారు. వారందరు కూడ మనస్సులో తఱగని భక్తితో శ్రీకృష్ణకథలలోమగ్నులైనారు.