Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/బలరాముని తీర్థయాత్ర

వికీసోర్స్ నుండి

బలరాముని తీర్థయాత్ర

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/బలరాముని తీర్థయాత్ర)
రచయిత: పోతన


తెభా-10.2-927-వ.
అట్లు సని మొదలం ప్రభాసతీర్థంబున నవగాహంబు సేసి, యందు దేవర్షిపితృతర్పణంబులు సంప్రీతిం గావించి విమలతేజోధను లగు భూసురప్రవరులు దనతో నరుగుదేరం గదలి చని క్రమంబున సరస్వతియు బిందుసరోవరంబును వజ్రతీర్థంబును విశాలానదియు సరయువును యమునయు జాహ్నవీతీర్థంబును గనుంగొనుచు నచటనచట నవగాహన దేవర్షిపితృతర్పణ బ్రాహ్మణ సంతర్పణంబు లను భూసుర యుక్తుండై నడపుచుం జని సకలలోకస్తుత్యంబును నిఖిలముని శరణ్యంబు నగు నైమిశారణ్యంబు సొచ్చి; యందు దీర్ఘసత్త్రంబు నడపుచున్న ముని జనంబులం గనుం గొనిన; వారును ప్రత్యుత్థానంబు సేసి రామునకు వినతులై యాసన పూజా విధానంబులు గావించిన నతండును బ్రముదిత మానసుం డగుచు సపరివారంబుగాఁ గూర్చున్న యెడ.
టీక:- అట్లు = ఆ విధముగా; చని = వెళ్ళి; మొదలన్ = ముందుగా; ప్రభాసతీర్థంబునన్ = ప్రభాసతీర్థము నందు; అవగాహనంబు = స్నానము చేయుట; చేసి = చేసి; అందున్ = దానిలో; దేవ = దేవతల కొరకు; ఋషి = ఋషుల కొరకు; పితృ = పితృదేవతల కొరకు; తర్పణంబులున్ = తర్పణములను; సంప్రీతిన్ = మంచి ఇష్టముతో; కావించి = చేసి; విమల = నిర్మలమైన; తేజోధనులు = గొప్పతేజస్సు కలవారు; అగు = ఐన; భూసుర = బ్రాహ్మణ; ప్రవరులున్ = వంశస్థులు; తన = అతని; తోన్ = తోటి; అరుగుదేరన్ = రాగా; కదిలి = బయలుదేరి; చని = వెళ్ళి; క్రమంబునన్ = వరుసగా; సరస్వతియున్ = సరస్వతీనది; బిందు = బిందు; సరోవరంబును = సరస్సు; వజ్రతీర్థంబును = వజ్రతీర్థము; విశాలా = విశాలా; నదియున్ = నది; సరయువును = నది సరయువు; యమునయున్ = యమున నది; జాహ్నవీ = గంగా; తీర్థంబునున్ = తీర్థములు; కనుంగొనుచు = చూస్తూ; అచటనచట = అక్కడక్కడ; అవగాహన = స్నానము చేయుట; దేవ = దేవతలు కొరకు; ఋషి = ఋషుల కొరకు; పితృ = పితృ దేవతల కొరకు; తర్పణ = తర్పణములు; బ్రాహ్మణ = బ్రాహ్మణులకు; సంతర్పణ = సమారాధనము; భూసుర = బ్రాహ్మణులతో; యుక్తుడు = కూడి ఉన్నవాడు; ఐ = అయ్యి; నడపుచున్ = జరిపించుచు; చని = వెళ్ళి; సకల = ఎల్ల; లోక = లోకము లందు; స్తుత్యంబును = పొగడబడ తగినది; నిఖిల = సర్వ; ముని = మునులకు; శరణ్యంబున్ = రక్షకముగా నుండునది; అగు = ఐన; నైమిశారణ్యంబు = నైమిశారణ్యము; చొచ్చి = ప్రవేశించి; అందున్ = దానిలో; దీర్ఘసత్త్రంబున్ = దీర్ఘసత్త్రమును; నడుపుచున్న = చేయుచున్న; ముని = మునుల; జనంబులన్ = సమూహములను; కనుంగొనిన = చూడగా; వారును = వారు; ప్రత్యుత్థానంబు = లేచి ఎదురువెళ్ళుట; చేసి = చేసి; రామున్ = బలరాముడి; కున్ = కి; వినతులు = నమస్కరించినవారు; ఐ = అయి; ఆసన = ఆసనము ఇచ్చుట; ఆది = మున్నగు; పూజా = సన్మానించు; విదానంబులున్ = క్రియలను; కావించినన్ = చేయగా; అతండును = అతను; ప్రముదిత = మిక్కిలి సంతోషించిన; మానసుండు = మనసు కలవాడు; అగుచున్ = ఔతు; సపరివారంబుగా = పరివారముతోకూడి; కూర్చున్న = కూరుచుండి ఉన్న; ఎడ = సమయము నందు.
భావము:- అలా తీర్ధయాత్రలకు అని బయలుదేరిన బలరాముడు, ప్రభాసతీర్ధానికి వెళ్ళి స్నానం చేసి ప్రీతితో దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు వదిలాడు. బ్రాహ్మణోత్తములు కూడా వస్తుండగా అతడు అక్కడ నుండి బయలుదేరాడు. క్రమముగా సరస్వతి, బిందుసరోవరం, వజ్రతీర్థం, విశాలానది, సరయువు, యమున, గంగ మున్నగు పుణ్యనదుల్లో స్నానాలు చేసి, దేవతలకు, ఋషులకు, పితృగణాలకు తర్పణాలు సమర్పించాడు. బ్రాహ్మణులకు సంతర్పణలు చేసాడు. పిమ్మట బలరాముడు లోకములు సమస్తము నందు స్తుతిపాత్రము, మునీంద్రులకు నివాసస్థానము అయిన నైమిశారణ్యం ప్రవేశించాడు. అప్పుడు అక్కడి మునులు దీర్ఘసత్రయాగం జరుపుతూ ఉన్నారు. వారందరూ బలరాముడికి ఎదురేగి వినయంగా స్వాగతం పలికి అతిథి మర్యాదలు చేశారు. బలరాముడు సంతోషించి సపరివారంగా ఆసీనుడయ్యాడు.

తెభా-10.2-928-క.
నెఱిఁ దనుఁ గని ప్రత్యు
త్థా నమస్కారవిధులు గ నడపక పెం
పూనిన పీఠముపై నా
సీనుండగు సూతు శేముషీవిఖ్యాతున్.

టీక:- ఆ = ఆ యొక్క; నెఱిన్ = విధముగ; తనున్ = తనను; కని = చూసి; ప్రత్యుత్థాన = గౌరవముగ లేచుట; నమస్కార = నమస్కరించుట; విధులు = మర్యాదలను; తగన్ = యుక్తముగ; నడపక = చేయకుండ; పెంపు = గౌరవమున; ఊనిన = అవలంబించిన; పీఠము = పీట; పైన్ = మీద; ఆసీనుండు = కూర్చున్నవాడు; అగు = ఐన; సూతున్ = సూతుని; శేముషీ = బుద్ధివిశేషముచేత; విఖ్యాతున్ = ప్రసిద్ధి పొందిన వానిని.
భావము:- కాని ప్రజ్ఞాసమేతుడైన సూతుడు తక్కిన మునులలాగ బలరామునికి ఎదురువచ్చి స్వాగతమిచ్చి అతిధి పూజలు చేయకుండా ఉన్నతాసనంమీద కూర్చుని ఉన్నాడు. అలా కూర్చుని ఉన్న సూతుని బలరాముడు కనుగొని.

తెభా-10.2-929-వ.
కనుంగొని యతని సమీపంబున నున్న విప్రవరులం జూచి రాముండు రోషించి “వీఁడు నన్నుఁ గని లేవకుండుటకు హేతు వెయ్యదియొకో? ఈ ప్రతిలోమజాతుండు మునిగణ సభాస్థలంబునఁ దానొక్క ముఖ్యుండ పోలె దురభిమానంబున శక్తిమనుమని వలనంగొన్ని కథలు గాథలు గఱచి విద్వద్గణ్యుని విధంబున విఱ్ఱవ్రీఁగెడును; నీచాత్ముం డభ్యసించు విద్య లెల్లను మనంబున విచారించి చూచిన మదకారణంబులు గాని సత్త్వగుణగరిష్ఠంబులు గావు; ధర్మసంరక్షణంబు సేయ నవతరించిన మాకు నిట్టి దుష్టమర్దనం బవశ్యకర్తవ్యం, బని తలఁచి హస్తంబున ధరించిన కుశాగ్రంబున నా సూతుని వధించిన నక్కడి మునీంద్రు లెల్ల హాహాకారంబులతోడం దాలాంకునిఁ జూచి యిట్లనిరి.
టీక:- కనుంగొని = చూసి; అతనిన్ = అతని; సమీపంబునన్ = దగ్గరలో; ఉన్న = ఉన్నట్టి; విప్ర = బ్రాహ్మణ; వరులన్ = ఉత్తములను; చూచి = చూసి; రాముండు = బలరాముడు; రోషించి = కోపగించి; వీడు = ఇతడు; నన్నున్ = నన్ను; కని = చూసి; లేవకుండుట = లేవకపోవుట; కున్ = కు; హేతువు = కారణము; ఎయ్యదియొకో = ఏమిటో; ఈ = ఈ యొక్క; ప్రతిలోమజాతుండు = సంకరజాతివాడు; ముని = మునుల; గణ = సమూహముల; సభా = సభతీరి యున్న; స్థలంబునన్ = ప్రదేశము నందు; తాన్ = తను; ఒక్క = ఒకేఒక; ముఖ్యుండ = శ్రేష్ఠుని; పోలెన్ = వలె; దురభిమానంబునన్ = చెడ్డ గర్వముచేత; శక్తిమనుమని = వ్యాసుని {శక్తిమనుమడు - శక్తి అనువాని మనవడు, వ్యాసుడు}; వలనన్ = వలన; కొన్ని = కొన్ని; కథలు = వృత్తాంతములను; గాథలు = పద్యాలు; కఱచి = నేర్చుకొని; విద్వత్ = విద్వాంసులచే; గణ్యుని = ఎన్నదగ్గవాని; విధంబునన్ = వలె; విఱ్ఱవ్రీగెడున్ = మిక్కిలి గర్విస్తున్నాడు; నీచ = అల్ప; ఆత్ముండు = బుద్ధి గలవాడు; అభ్యసించు = నేర్చుకొన్న; విద్యలు = చదువులు; ఎల్లను = సర్వము; మనంబునన్ = మనస్సు నందు; విచారించి = ఎంచి; చూచినన్ = చూడగా; మద = మదము కలుగుటకు; కారణంబులున్ = కలిగించునవే; కాని = తప్పించి; సత్త్వగుణ = సత్వగుణములచే; గరిష్ఠంబులు = గొప్పవి; కావు = కావు; ధర్మ = ధర్మమును; సంరక్షణంబు = కాపాడుట; చేయన్ = చేయుటకై; అవతరించిన = పుట్టిన; మా = మా; కున్ = కు; ఇట్టి = ఇటువంటి; దుష్ట = దుష్టుని; మర్దనంబు = శిక్షించుట; అవశ్య = తప్పక; కర్తవ్యంబున్ = చేయదగినది; అని = అని; తలచి = ఎంచి; హస్తంబునన్ = చేతిలో; ధరించిన = పట్టుకొన్న; కుశ = దర్భ; అగ్రంబునన్ = కొసతో; ఆ = ఆ; సూతుని = సూతుడుని; వధించినన్ = చంపగా; అక్కడి = అక్కడ ఉన్న; ముని = ముని; ఇంద్రులు = ఉత్తములు; ఎల్లన్ = అందరు; హాహాకారంబుల = హాహాకారముల; తోడన్ = తోటి; తాలంకుని = బలరాముని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగా; అనిరి = పలికిరి.
భావము:- తనను పూజించక ఉన్న సూతునిపై బలరాముడు ఆగ్రహించాడు. అతడు అక్కడ ఉన్న ఋషులతో “వీడు నన్ను చూసి కూడా ఎందుకు లేవలేదో? ఈ సూతుడు మహర్షులున్న సభలో తానే పెద్దను అని అనుకుంటూ దురభిమానంతో ప్రవర్తించాడు. వ్యాసమహర్షి దగ్గర కొన్ని కథలు గాథలు నేర్చుకున్నాడు. దానికే విద్వాంసుడను అని విఱ్ఱవీగుతున్నాడు. నీచులు అభ్యసించే విద్య వారిలో మదాన్నే పెంచుతుంది కానీ సాత్వికగుణాన్ని పెంచదు. మేము ధర్మ సంరక్షణ కోసం పుట్టాము. ఇలాంటి దుష్టుల్ని శిక్షించడం మా కర్తవ్యం.” అని పలుకుతూ, తన చేతిలోని దర్భపుల్లతో ఆ సూతుడిని వధించాడు. అది చూసి అక్కడి మునీశ్వరులు అందరు హాహాకారాలు చేశారు. వారు బలరాముడితో ఇలా అన్నారు.

తెభా-10.2-930-క.
“అఘా! యితనికి బ్రహ్మా
మే మిచ్చుటను నీవు నుదే నితఁ డా
ము దిగఁడయ్యె నింతయు
మును నీమది నెఱుఁగ నర్థముం గలదె? హలీ!

టీక:- అనఘా = పుణ్యుడా; ఇతని = ఇతని; కిన్ = కి; బ్రహ్మాసనము = అద్యక్షస్థానము; ఇచ్చుటను = ఇచ్చుటచేత; నీవు = నీవు; చనుదేనిన్ = రాగా; ఇతడు = ఇతను; ఆసనమున్ = ఆసనమును; దిగడు = దిగనివాడు; అయ్యెన్ = అయ్యెను; ఇంతయున్ = ఇది అంతా; మును = మునుపు; నీ = నీ యొక్క; మదిన్ = మనస్సు నందు; ఎఱుగన్ = తెలియని; అర్థమున్ = విషయము; కలదె = ఉన్నదా; హలీ = బలరామా.
భావము:- “మహాత్మా! బలరామ! ఈ సూతునికి మేము అధ్యక్ష స్థానము ఇచ్చి ఈ ఉన్నతాసనంపై కూర్చుండబెట్టాము. అందుకనే నీవు వచ్చినప్పుడు ఇతడు లేవ లేదు. ఇదంతా నీకు తెలియని విషయం కాదు. నీకు తెలియని ధర్మం అంటూ ఉందా?

తెభా-10.2-931-క.
ఱిఁగెఱిఁగి బ్రహ్మహత్యా
దురితంబున నీమనంబు దూకొనెఁ బాపో
త్తణప్రాయశ్చిత్తము
దొరఁకొని కావింపు మయ్య దుర్జనహరణా!

టీక:- ఎఱిగెఱిగి = బాగా తెలిసి కూడ; బ్రహ్మహత్యా = బ్రహ్మహత్య {బ్రహ్మహత్య - బ్రాహ్మణుని చంపుట, పంచ మహా పాతకములలో ఒకటి (1స్వర్ణస్తేయము 2సురాపానము 3బ్రహ్మహత్య 4గురుపత్నీగమనము 5ఇవి చేసేవారితో స్నేహము)}; దురితంబున = పాపములో; నీ = నీ; మనంబు = మనస్సు నందు; దూకొనెన్ = చొచ్చుకుపోయింది; పాప = పాపమును; ఉత్తరణ = దాటు; ప్రాయశ్చిత్తము = పరిహారకర్మమును; దొరకొని = పూనుకొని; కావింపుము = చేయుము; అయ్య = నాయనా; దుర్జన = దుష్టులను; హరణా = నశింపజేయువాడా.
భావము:- ఓ బలరామా! దుష్టశిక్షణ చేసే నీవే, తెలిసి తెలిసి బ్రహ్మహత్యా పాపానికి ఒడిగట్టావు. ఈ పాపం నిష్కృతి కావడానికి నీవు ప్రాయశ్చిత్తం చేసుకోవలెను.

తెభా-10.2-932-వ.
అదియునుం గాక పరమపావనుండవైన నీవు ధర్మంబుదప్పిన నెవ్వరు మాన్పంగలరు? కావునఁ బ్రాయశ్చిత్తంబు గైకొని నడపకున్న ధర్మంబు నిలువ; దట్లుగావున దీనికిఁ బ్రతీకారంబు పుట్టింపు” మనిన నతండు వారలం గనుంగొని “తామసంబున నిట్టి పాపంబు సేయంబడియె; దీనికి ముఖ్యపక్షంబునఁ బ్రతికృతి యెఱింగింపుండు, వీనికి నాయువును బహుసత్త్వంబును నొసంగిన మీకిష్టంబగునే నట్లు నాయోగమాయచేఁ గావింతు” నన నమ్మునులు "నీయస్త్రమాహాత్మ్యంబునకు మృత్యువునకు మాకు నెవ్విధంబున వైకల్యంబు నొందకుండునట్లు గావింపు"మనిన నతం డందఱం జూచి యప్పుడు.
టీక:- అదియునున్ = అంతే; కాక = కాకుండా; పరమ = మిక్కిలి; పావనుండవు = పవిత్రుడవు; ఐన = అయిన; నీవు = నీవు; ధర్మంబున్ = ధర్మమును; తప్పినన్ = తప్పివర్తించినచో; ఎవ్వరు = ఎవరు; మాన్పంగలరు = పోగొట్టగలరు; కావునన్ = కాబట్టి; ప్రాయశ్చిత్తంబున్ = పాప పరిహార కర్మమును; కైకొని = చేపట్టి; నడపకున్న = చేయకపోయినచో; ధర్మంబు = ధర్మము; నిలువదు = నిలబడదు; కావునన్ = అందుచేత; దీని = దీని; కిన్ = కి; ప్రతీకారంబు = ప్రతిక్రియను; పుట్టింపుము = కలుగజేయుము; అనినన్ = అనగా; అతండున్ = అతను; వారలన్ = వారిని; కనుంగొని = చూసి; తామసంబునన్ = కోపమువలన; ఇట్టి = ఇటువంటి; పాపంబు = తప్పు; చేయంబడియె = చేయబడినది; దీని = దీని; కిన్ = కి; ముఖ్య = ముఖ్యముగా; పక్షంబున్ = కావలసిన విధమున; ప్రతికృతి = ప్రతికృతి; యెఱింగింపుడు = తెలుపండి; వీని = ఇతని; కిన్ = కి; ఆయువును = ఆయుష్షు, జీవితము; బహు = అధికమైన; సత్త్వంబును = బలము; ఒసంగినన్ = ఇచ్చినచో; మీ = మీ; కున్ = కు; ఇష్టంబు = సమ్మతము; అగునేని = అగు పక్షమున; అట్లు = ఆ విధముగా; నా = నా యొక్క; యోగ = యోగశక్తి యొక్క; మాయ = మహిమ; చేన్ = చేత; కావింతును = చేసెదను; అనన్ = అనగా; ఆ = ఆ; మునులు = ఋషులు; నీ = నీ యొక్క; అస్త్ర = అస్త్రము యొక్క; మహాత్మ్యంబున్ = మహిమ; కున్ = కు; మృత్యువు = మృత్యుదేవత; కున్ = కు; ఎవ్విధంబునన్ = ఏ విధముగాను; వైకల్యంబున్ = వికలత్వము; ఒందకుండునట్లు = పొందకుండగా; కావింపుము = చేయుము; అనినన్ = అనగా; అతండు = అతను; అందఱన్ = అందరిని; చూచి = చూసి; అప్పుడు = ఆ సమయము నందు.
భావము:- అంతే కాకుండా, పరమ పవిత్రుడవైన నీవే ధర్మం తప్పితే, అధర్మాన్ని ఎవరు అడ్డుకుంటారు? దీనికి ప్రాయశ్చిత్తం చేయకపోతే ధర్మం మనుగడకే ప్రమాదం. కనుక, నీవు ఆ ప్రాయశ్చిత కార్యం తలపెట్టాలి.” ఇలా పలుకుతున్న మహర్షుల మాటలు వినిన బలరాముడు వారితో “తొందరపాటు వలన ఇంతటి పాపం చేశాను. దీనికి చేయవలసిన ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పండి. మీకు ఇష్టం అయితే, నా యోగమాయా ప్రభావంతో సూతుణ్ణి బ్రతికించి, అతడిని మహాశక్తిమంతునిగా చేస్తాను.” అన్నాడు. అంతట “నీ అస్త్రమహాత్మ్యానికి, మృత్యు నియమానికి, మాకు ఎలాటి ధర్మవిఘాతం కలుగకుండా, బలరామ! నీ ఇష్ట ప్రకారం చేయుము” అని ఋషులు బలరాముడితో అన్నారు.

తెభా-10.2-933-క.
ధాత్రీవర సమధిక చా
రిత్రుఁడు హలపాణి పలికె ధృతి "నాత్మా వై
పుత్రక నామాసి యను ప
విత్రశ్రుతి వాక్యసరణి విశదం బగుటన్.

టీక:- ధాత్రీవర = రాజా; సమధిక = మిక్కిలి గొప్ప; చారిత్రుడు = నడవడిక గలవాడు; హలపాణి = బలరాముడు; పలికెన్ = చెప్పెను; ధృతిన్ = స్పష్టముగా; ఆత్మావై = తానే; పుత్రక = పుత్రుడు; నామ = అను పేరుతో; అసి = పుట్టును; అను = అనెడి; పవిత్ర = పవిత్రమైన; శ్రుతి = వేద; వాక్య = వాక్యము; సరణిన్ = అనుసరించి; విశదంబు = తెలియబడినది; అగుటన్ = ఐ ఉండుటచే.
భావము:- ఓ రాజా! “ఆత్మా వైపుత్ర నామాసి”, (తానే పుత్రరూపంలో తిరిగి జన్మిస్తాడు) అనే వేదవచనానికి తగినట్లు మహానుభావుడైన బలరాముడు ఇలా అన్నాడు.

తెభా-10.2-934-క.
సూతసూనుఁ డిపుడు మ
హాత్త్వము నాయువును ననామయమును వి
ద్యా సామర్థ్యము గలిగి సు
ధీత్తములార! యీక్షితిన్ విలసిల్లున్."

టీక:- ఈ = ఈ; సూతసూనుడు = సూతవంశమువాడు; ఇపుడు = ఇప్పుడు; మహా = గొప్ప; సత్త్వమున్ = బలమును; ఆయువున్ = జీవిత కాలము; అనామయమునున్ = వ్యాధులు లేకుండుట; విద్యా = విద్య; సామర్థ్యము = సమర్థత; కలిగి = కలుగుటచేత; సుధీసత్తములారా = విజ్ఞానోత్తములూ; ఈ = ఈ; క్షితిన్ = భూలోకమున; విలసిల్లున్ = ప్రసిద్ధు డగును.
భావము:- “ఓ మహర్షులారా! ఇప్పుడు ఈ సూతుని కుమారుడు ఆయువు, ఆత్మశక్తి, రోగం లేని తనువు, విద్యాదక్షత పొంది ఈ లోకంలో విరాజిల్లుతాడు.”

తెభా-10.2-935-వ.
అని సూతుం బునర్జీవితుంగాఁ జేసి మునులం జూచి యిట్లనియె.
టీక:- అని = అని; సూతున్ = సూతుని; పునః = మరల; జీవితుంగాన్ = బతికినవానిగా; చేసి = చేసి; మునులన్ = ఋషులను; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- ఇలా అనుగ్రహించి బలరాముడు, సూతుడిని బ్రతికించి మునులతో మరల ఇలా అన్నాడు.

తెభా-10.2-936-తే.
" నెఱుంగక చేసిన యీ యవజ్ఞ
శాంతి వొంద నేయది యభీష్టంబు మీకు
దానిఁ గావింతు" ననిన మోదంబు నొంది
లికి రత్తాపసులు హలపాణిఁ జూచి.

టీక:- ఏన్ = నేను; ఎఱుంగక = తెలియక; చేసిన = చేసినట్టి; ఈ = ఈ; అవజ్ఞ = తప్పు; శాంతిన్ = శాంతిని; పొందన్ = పొందుటకు; ఏయది = ఏది; అభీష్టంబు = ఇష్టమగునది; మీ = మీ; కున్ = కు; దానిన్ = దానిని; కావింతును = చేసెదను; అనినన్ = అనగా; మోదంబున్ = సంతోషమును; ఒంది = పొంది; పలికిరి = చెప్పారు; ఆ = ఆ; తాపసులు = మునులు; హలపాణిన్ = బలరాముని; చూచి = చూసి.
భావము:- “తెలియక నేను చేసిన ఈ అపరాధం శాంతించేలాగ మీకు ఇష్టమైన కార్యం చెప్పండి చేస్తాను.” అని పలికిన బలరాముడి మాటలకు ఋషులు పరమానందం చెంది, అతడితో...

తెభా-10.2-937-చ.
"ధర! యిల్వలుండను సురారితనూజుఁడు పల్వలుండు నాఁ
లఁడొక దానవుండు బలర్వమునం బ్రతిపర్వమందు న
చ్చమున వచ్చి మా సవనశాలల మూత్ర సురాస్ర పూయ వి
ట్పలము లోలిమైఁ గురిసి పాడఱఁ జేయును యజ్ఞవాటముల్‌.

టీక:- హలధర = బలరామ; ఇల్వలుండు = ఇల్వలుడు; అను = అనెడి; సురారి = రాక్షసుని; తనూజుడు = కొడుకు; పల్వలుండు = పల్వలుండు; నాన్ = అనగా; కలడు = ఉన్నాడు; ఒక = ఒక; దానవుండు = రాక్షసుడు; బల = అధికమైన బలము వలని; గర్వమునన్ = గర్వముచేత; ప్రతి = ప్రతి; పర్వమున్ = పండుగదినము {పర్వము - పండుగ, పంచపర్వములు, 1అష్టమి 2చతుర్దశి 3కుహువు (చంద్రకళ కానరాని అమావాస్య) 4పూర్ణిమ 5రవిసంక్రాంతి}; అందున్ = అందు; ఆ = ఆ యొక్క; చలమునన్ = గర్వముతోటి; వచ్చి = వచ్చి; మా = మా యొక్క; సవన = యజ్ఞ; శాలలన్ = శాలలను; మూత్ర = నీరుడు; సుర = మద్యము; అస్ర = రక్తము; పూయ = చీము; విట్ = మలము; పలలములు = మాంసములను; ఓలిమై = వరసగా; కురిసి = అధికముగా జల్లి; పాడఱన్ = పాడైపోవునట్లు; చేయును = చేయును; యజ్ఞ = యాగ; వాటముల్ = శాలలు.
భావము:- “బలరామా! నాగలి ఆయుధంగా గలవాడా! ఇల్వలుడనే రాక్షసుడి కొడుకు పల్వలుడు అనే రాక్షసుడు ఉన్నాడు. వాడు బలగర్వితుడై ప్రతి పర్వం నాడూ వచ్చి యజ్ఞశాలల్లో మలమూత్రాలను, చీమునెత్తురులను, మద్యమాంసాలను చాటునుండి కురిపించి పాడుచేస్తున్నాడు.

తెభా-10.2-938-వ.
కావున దుష్టదానవుం ద్రుంచుటయు మాకుం గరంబు సంతసం బగు; నంతమీఁద నీవు విమలచిత్తుండవై భారతవర్షంబునం గల తీర్థంబుల ద్వాదశమాసంబు లవగాహనంబు సేయు; మట్లయిన సర్వపాపనిష్కృతి యగు"నని పలుకునంతఁ బర్వసమాగమంబైన.
టీక:- కావునన్ = కాబట్టి; దుష్ట = చెడ్డవాడైన; దానవున్ = రాక్షసుని; త్రుంచుటయున్ = చంపుటే; మా = మా; కున్ = కు; కరంబు = మిక్కిలి; సంతసంబు = సంతోషము; అగున్ = అగును; అంతమీద = అటుపిమ్మట; నీవు = నీవు; విమల = నిర్మలమైన; చిత్తుండవు = మనస్సు కలవాడవు; ఐ = అయ్యి; భారతవర్షంబునన్ = భారతదేశము నందు; కల = ఉన్నట్టి; తీర్థంబులన్ = పుణ్యతీర్థములను; ద్వాదశ = పన్నెండు (12); మాసంబులు = నెలలు; అవగాహంబు = దర్శించుట, స్నానములు; చేయుము = చేయుము; అట్ల = అలా; అయినన్ = అయినచో; సర్వ = సమస్తమైన; పాప = పాపములునుండి; నిష్కృతి = ప్రాయశ్చిత్తము; అగును = కలుగును; అని = అని; పలుకున్ = చెప్పిన; అంతన్ = అంతట; పర్వ = పండుగదినము; సమాగమంబు = వచ్చినది; ఐన = కాగా.
భావము:- కనుక, దుర్మార్గుడైన ఆ పల్వల రాక్షసుడిని నీవు చంపితే మా కదే సంతోషదాయకం. పిమ్మట నీవు పండ్రెండు మాసాలు నిర్మలమైన హృదయంతో భారతదేశంలో ఉన్న సకల పుణ్యతీర్ధాలను పన్నెడు (12) నెలలు సేవించి వాటిలో స్నానం చెయ్యి. అలా చేస్తే సమస్త పాపాలూ తొలగిపోతాయి.” మునులు ఇలా అంటుండగానే పర్వము రానే వచ్చింది.

తెభా-10.2-939-సీ.
మునులు యజ్ఞక్రియోన్ముఖు లౌటఁ గనుఁగొని-
ఱతెంచి యసుర తద్భవనములను
క్త విణ్మూత్ర సురామాంసజాలంబు-
నించి హేయంబు గావించి పెలుచఁ
బెంధూళి ఱాలును బెల్లలు నురలెడు-
క్రానిలము వీఁచి దల నపుడు
గాటుకకొండ సంతిఁ బొల్చు మేను తా-
మ్రశ్మశ్రు కేశ సమాజములును

తెభా-10.2-939.1-తే.
వ్యచర్మాంబరము భూరినాసికయును
ఱకు మిడి గ్రుడ్లు నిప్పులు గ్రక్కు దృష్టి
వ్రేలు పెదవులు దీర్ఘకరా జిహ్వి
యును ముడివడ్డబొమలును లుగువాని.

టీక:- మునులు = తాపసులు; యజ్ఞ = యజ్ఞము; క్రియా = చేయుటకు; ఉన్ముఖులు = సిద్ధమైనవారు; ఔటన్ = అగుట; కనుగొని = చూసి; పఱతెంచి = పరుగెత్తుకొనివచ్చి; అసుర = రాక్షసుడు; తత్ = ఆ; భవనములను = శాలలను; రక్త = రక్తము; విట్ = మలము; మూత్ర = మూత్రము; సురా = మద్యము; మాంస = మాంసము; జాలంబు = సమూహములతో; నించి = నింపి; హేయంబున్ = రోతలుగా; కావించి = చేసి; పెలుచన్ = ఆటోపముతో; పెన్ = అధికమయిన; ధూళి = దుమ్ము; ఱాలును = రాళ్ళు; పెల్లలునున్ = మట్టిబెడ్డలు; ఉరలెడు = రాలునట్టి; చక్రానిలము = సుడిగాలి; వీచి = వీచి; చదలన్ = ఆకాశమునందు; అపుడు = అప్పుడు; కాటుకకొండ = నల్లనికొండ; సంగతిన్ = వలె; పొల్చు = పోలునట్టి; మేను = దేహము; తామ్ర = రాగిరంగు; శ్మశ్రు = గడ్డము మీసములు; కేశ = తలమీదిజుట్టు; సమాజములును = సమూహములు; నవ్య = కొత్త; చర్మ = తోలు; అంబరమున్ = బట్టలు; భూరి = పెద్ధ; నాసికయును = ముక్కు; కఱకు = కర్కశవంతమైన; మిడిగ్రుడ్లు = పైకి ఉబికిన కనుగుడ్లు; నిప్పులున్ = అగ్ని; క్రక్కు = ఉమియుచున్నట్టి; దృష్టి = చూపు; వ్రేలు = వేలాడెడి; పెదవులు = పెదవులు; దీర్ఘ = పొడవైన; కరాళ = భయంకరమైన; జిహ్వికయును = నాలుక; ముడిపడ్డ = ముడిపడ్డట్టి; బొమలునున్ = కనుబొమలు; కలుగు = కలిగినట్టి; వాని = వాడిని.
భావము:- యాగానికి మునులు ఉపక్రమించటం పల్వలుడు చూసాడు. వెంటనే అక్కడికి వచ్చి ఆ శాలలలో మలమూత్రాలు మద్యమాంసాలు కురిపించి నానా భీభత్సం చేసాడు. రాళ్ళతో, ధూళితో, మట్టిగడ్డలతో నిండిన సుడిగాలులు వీచేలా చేసాడు. కాటుకకొండలాంటి నల్లని శరీరమూ, ఎఱ్ఱని గడ్డమూ మీసాలూ, పెద్దముక్కూ, మిడిగ్రుడ్లూ, నిప్పులు చిమ్మే చూపులూ, వ్రేలాడే పెదవులూ, పొడవైన నాలుకా, ముడిపడ్డ కనుబొమలతో భయంకరంగా ఆకాశంలో సంచరిస్తున్న ఆ రాక్షసుడు పల్వలుడిని బలరాముడు కని.

తెభా-10.2-940-మస్ర.
నియెం దాలాంకుఁ డుద్యత్కటచటు; ల నటత్కాలదండాభశూలున్
రక్తాసిక్తతాలున్ మధిక; సమరోత్సాహలోలుం గఠోరా
నితుల్యోదగ్ర దంష్ట్రా నిత శి; ఖకణాచ్ఛాదితాశాంతరాళున్
నవ్యాపారశీలున్నతి; దృఢ ఘనమస్తాస్థిమాలుం గరాళున్

టీక:- కనియెన్ = చూచెను; తాలంకుడు = బలరాముడు; ఉద్యత్ = ఉద్రేకము కల; కట = కణతల; చటుల = తత్తఱముతో; నటత్ = చలిస్తున్న; కాల = యముని; దండ = దండము; ఆభ = సరిపోలునట్టి; శూలున్ = శూలము కలవానిని; జన = మానవుల; రక్తా = రక్తములతో; సిక్త = తడసిన; తాలున్ = దవుడలు కలవానిని; సమధిక = మిక్కుటమైన; సమర = యుద్ధ; ఉత్సాహ = ఉత్సాహము నందు; లోలున్ = ఆసక్తి కలవానిని; కఠోర = కఠినమైన; అశని = వజ్రాయుధముతో {అశని - దిక్కులంతము వరకు భుజించగలది, వజ్రాయుధము}; తుల్య = సమానమై; ఉదగ్ర = పైకి పొడుచుకు వచ్చిన; దంష్ట్రా = దంతములు యందు; జనిత = పుట్టుచున్న; శిఖ = నిప్పు; కణా = రవ్వలు; ఆచ్ఛాదిత = ఆవరించిన; ఆశా = దిక్కుల; అంతరాళున్ = మధ్యభాగము గలవానిని; హనన = చంపునట్టి; వ్యాపార = పనియందే మెలగు; శీలున్ = నడవడిక గలవానిని; అతి = మిక్కిలి; దృఢ = గట్టివియైన; ఘన = పెద్ద; మస్తా = తలపుఱ్ఱె; అస్థి = ఎముకలు కలిగిన; మాలున్ = దండలు కలవానిని; కరాళున్ = భీకరమైన వానిని.
భావము:- చేతిలో చలిస్తూ ఉన్న భయంకరమైన శూలంతో; మానవ రక్తంతో తడిసి ఉన్న దౌడలుతో; రణోత్సవం అతిశయిస్తూ ఉన్న చిత్తంతో; దిక్కులనూ ఆకాశాన్నీ కప్పివేస్తు అగ్నికణాలు వెదజల్లుతున్న వజ్రాయుధం లాంటి వాడి కోరలతో; ప్రాణుల్ని చంపడమే వ్రతంగా ఆ దానవుడు తలకాయలనూ ఎముకలనూ హారంగా కట్టిమెడలో వేసుకుని; పరమ భయంకరంగా ఉన్న ఆ రాక్షసుడు పల్వలుడిని, జండాపై తాడిచెట్టు ఉండే బలరాముడు చూసాడు.

తెభా-10.2-941-ఉ.
వెండియుఁ గ్రొమ్మెఱుంగు లుడువీథి వెలుంగఁగ నుల్లసద్గదా
దంముఁ గేలఁ ద్రిప్పుచు నుదారత రా బలభద్రుఁ డాసురో
ద్దంవిఘాతులౌ ముసలదారుణలాంగలముల్‌ దలంప మా
ర్తాంనిభంబులై యెదురఁ దత్‌క్షణమాత్రన తోఁచినన్ వెసన్.

టీక:- వెండియున్ = మఱియును; క్రొత్త = కొత్త; మెఱుంగులు = మెరుపులు; ఉడువీథిన్ = ఆకాశము నందు {ఉడువీథి - నక్షత్రములు తిరిగెడి ప్రదేశము, ఆకాశము}; వెలుంగగన్ = ప్రకాశించుచుండగా; ఉల్లసత్ = మెరయుచున్న; గదాదండమున్ = గదను; కేలన్ = చేతితో; త్రిప్పుచున్ = తిప్పుతు; ఉదారతన్ = దిట్టతనముతో; రాన్ = రాగా; బలభద్రుడు = బలరాముడు; అసుర = రాక్షసుల; ఉద్దండ = అతిశయమును; విఘాతులు = అణగగొట్టునవి; ఔ = అగు; ముసల = రోకటి ఆయుధమును; దారుణ = భీకరమైన; లాంగలముల్ = నాగేటి ఆయుధములు; తలంపన్ = తలచుకొనగానే; మార్తాండ = సుర్యుని {మార్తాండుడు - బ్రహ్మాండము పగిలినప్పుడు పుట్టిన వాడు, సూర్యుని సుష్మమ్న అను రశ్మి యొక్క అవతారము}; నిభంబులు = సమానములైనవి; ఐ = అయ్యి; ఎదురన్ = ఎదుట; తత్ = ఆ; క్షణమాత్రన = క్షణ మాత్రపు కాలములో; తోచినన్ = కనబడగా; వెసన్ = శీఘ్రముగా.
భావము:- అంతే కాకుండా ఆకాశంలో మెరుపులు మెరిసేలా చేతిలోని గదను త్రిప్పుతూ పల్వలుడు తన మీదకు రావడం చూసి, బలరాముడు రాక్షస సంహార సమర్థములైన రోకలినీ నాగలినీ స్మరించాడు. తక్షణమే అవి సూర్య సమాన తేజస్సుతో బలరాముడి ఎదుట ప్రత్యక్షమయ్యాయి.

తెభా-10.2-942-వ.
అట్లు సన్నిహితంబులైన తన కార్యసాధనంబులగు నిజసాధనంబులు ధరియించి యప్పుడు.
టీక:- అట్లు = ఆ విధముగా; సన్నిహితంబులు = దగ్గరకు వచ్చినవి; ఐన = అయినట్టి; తన = తన; కార్య = పనిని; సాధనంబులు = సాధించుటకైనవి; అగు = ఐన; నిజ = తన యొక్క; సాధనంబులున్ = ఆయుధములను; ధరియించి = చేపట్టి; అప్పుడు = అప్పుడు.
భావము:- అలా సాక్షాత్కరించిన ఆయుధాలను అందుకుని ధరించాడు. అప్పుడు....