పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/పదాఱువేల కన్యల పరిణయం
పదాఱువేలకన్యలపరిణయం
←పారిజాతాపహరణంబు | తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/పదాఱువేల కన్యల పరిణయం) రచయిత: పోతన |
రుక్మిణీదేవి విప్రలంభంబు→ |
తెభా-10.2-219-చ.
అమితవిహారుఁ డీశ్వరుఁ డనంతుఁడు దా నొక నాఁడు మంచి ల
గ్నమునఁ బదాఱువేల భవనంబులలోనఁ బదాఱువేల రూ
పములఁ బదాఱువేల నృపబాలలఁ బ్రీతిఁ బదాఱువేల చం
దముల విభూతినొందుచు యథావిధితో వరియించె భూవరా!
టీక:- అమిత = మితిలేని, అధికమైన; విహారుండు = సంచారములు కలవాడు; ఈశ్వరుడు = కృష్ణుడు {ఈశ్వరుడు - సర్వనియామకుడు, విష్ణువు}; అనంతుడు = కృష్ణుడు {అనంతుడు - అంతము లేనివాడు, విష్ణువు}; తాన్ = అతను; ఒక = ఒకానొక; నాడు = దినమున; మంచి = శుభ; లగ్నమునన్ = ముహూర్తమునందు; పదాఱువేల = పదహారువేల (16000); భవనంబుల = భవంతులలోను; పదాఱువేల = పదహారువేల (16000); రూపములన్ = రూపములతో; పదాఱువేల = పదహారువేల (16000); నృపబాలలన్ = రాకుమారీమణులను; పదాఱువేల = పదహారువేల (16000); చందములన్ = విధములుగా; విభూతిన్ = వైభవమును; ఒందుచున్ = పొందుతు; యథావిధితోన్ = పద్ధతి ప్రకారము; వరియించెన్ = పెండ్లాడెను; భూవరా = రాజా.
భావము:- మహానుభావుడు, భగవంతుడు ఐన శ్రీకృష్ణుడు, ఒక శుభముహుర్తాన ఆ పదహారువేల భవనాల యందు, పదహారువేల రూపాలతో, పదహారువేల మంది రాజకన్యలను, పదహారువేల రీతులతో శోభిస్తూ శాస్త్రోక్తంగా వివాహమాడాడు.
తెభా-10.2-220-ఉ.
దానములందు సమ్మద విధానములం దవలోకభాషణా
హ్వానములందు నొక్క క్రియ నా లలితాంగుల కన్ని మూర్తు లై
తా ననిశంబు గానఁబడి తక్కువ యెక్కువలేక యుత్తమ
జ్ఞాన గృహస్థధర్మమునఁ జక్రి రమించెఁ బ్రపూర్ణకాముఁడై.
టీక:- దానములు = అడిగినవి ఇచ్చు టందు; సమ్మద = సంతోష; విధానములు = కృత్యములు; అందున్ = లోను; అవలోక = చూపు లందు; భాషణా = మాట లందు; ఆహ్వానములు = పిలుచుట; అందున్ = లోను; ఒక్క = ఒక; క్రియన్ = విధముగనే; ఆ = ఆ; లలితాంగులు = పడతుల; కున్ = కు; అన్ని = అన్ని; మూర్తులు = రూపములు పొందినవాడు; ఐ = అయ్యి; తాన్ = తాను; అనిశంబున్ = ఎల్లప్పుడు; కానబడి = కనబడుతు; తక్కువ = తక్కువకాని; ఎక్కువ = ఎక్కువకాని; లేక = లేకుండా; ఉత్తమ = మంచి; జ్ఞాన = జ్ఞానము కల; గృహస్థ = గృహస్థుని; ధర్మమునన్ = నడవడిచేత; చక్రి = కృష్ణుడు; రమించెన్ = క్రీడించెను; ప్రపూర్ణ = పూర్తిగాతీరిన; కాముడు = కోరికలు కలవాడు; ఐ = అయ్యి.
భావము:- దానాది క్రియలలో, సంతోషపెట్టుటలో, నిండైన ప్రేమతో చూడటంలో, సంభాషణలలో, ఆహ్వానాలతో శ్రీకృష్ణుడు ఎక్కువ తక్కువలు కాకుండా, బాలామణులు అందరకూ అన్ని విధాలుగా కనిపిస్తూ ఉత్తమమైన గృహస్థధర్మాన్ని పాటిస్తూ ఆనందించాడు.
తెభా-10.2-221-క.
తరుణులు బెక్కం డ్రయినను
బురుషుఁడు మనలేఁడు సవతి పోరాటమునన్,
హరి యా పదాఱువేవురు
తరుణులతో సమత మనియె దక్షత్వమునన్.
టీక:- తరుణులు = భార్యలు; పెక్కండ్రు = ఎక్కువమంది; అయినను = అయినచో; పురుషుడు = పెనిమిటి; మనలేడు = బతకలేడు; సవతి = సవతుల మధ్యని; పోరాటమునన్ = కలహముల వలన; హరి = కృష్ణుడు; ఆ = ఆ; పదాఱువేవురు = పదహారువేలమంది (16000); తరుణులు = స్త్రీల; తోన్ = తోటి; సమతన్ = సమత్వముతో; మనియె = జీవించెను; దక్షత్వమునన్ = సమర్థతతో.
భావము:- లోకంలో పురుషుడికి ఎక్కువ మంది భార్యలు ఉంటే సవతి పోరాటాలతో జీవించలేక సతమత మైపోతాడు. కానీ, శ్రీకృష్ణుడు పదహారువేలమంది తరుణుల పట్ల సరి సమాన భావాన్ని ప్రదర్శిస్తూ తన సామర్ధ్యంతో సుఖంగా జీవించాడు.
తెభా-10.2-222-శా.
ఎన్నే భంగుల యోగమార్గముల బ్రహ్మేంద్రాదు లీక్షించుచున్
మున్నే దేవునిఁ జూడఁగానక తుదిన్ మోహింతు; రా మేటి కే
విన్నాణంబుననో సతుల్ గృహిణులై విఖ్యాతి సేవించి ర
చ్ఛిన్నాలోకన హాస భాషణ రతిశ్లేషానురాగంబులన్.
టీక:- ఎన్నే = ఎన్నో; భంగుల = విధములైన; యోగ = యోగముల; మార్గములన్ = విధానములతో; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఇంద్ర = ఇంద్రుడు; ఆదులు = మున్నగువారు; ఈక్షించుచున్ = చూస్తున్నను; మున్ను = ముందు; ఏ = ఏ; దేవుని = దేవుడిని; చూడజాలక = చూడలేక; తుదిన్ = కడపట; మోహింతురు = మోహించెదరో; ఆ = ఆ; మేటి = గొప్పవాని; కిన్ = కి; ఏ = ఎట్టి; విన్నాణంబుననో = నేర్పుచేతనో; సతుల్ = యువతులు; గృహిణులు = భార్యలు; ఐ = అయ్యి; విఖ్యాతిన్ = ప్రసిద్ధితో; సేవించిరి = కొలిచిరి; అచ్ఛిన్న = ఎడతెగని; ఆలోకన = చూపులచేతను; హాస = నవ్వులచేతను; భాషణ = మాట్లాడుటచేతను; రతి = క్రీడించుటలుచేతను; శ్లేష = ఆలింగనములచేతను; అనురాగంబులన్ = ఆప్యాయతలచేతను.
భావము:- బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు మొదలైన వారు యోగమార్గంలో విష్ణుమూర్తిని దర్శించాలని ఎన్నో రీతులుగా ప్రయత్నించి, సాధ్యం కాక చివరకు మాయామోహితులు అవుతారో, ఆ మహాత్ముడికి ఎంతో నేర్పుతోఆ స్త్రీలు ఇల్లాండ్రై; ఎడతెగని ఆత్మీయ చూపులతో, చిరు నవ్వులతో, సరస సంభాషణలతో, ఆలింగన క్రీడలతో, అనురాగాలతో ప్రఖ్యాతంగా సేవించుకున్నారు.
తెభా-10.2-223-సీ.
ఇంటికి వచ్చిన నెదురేగుదెంచుచు-
నానీత వస్తువులందుకొనుచు
సౌవర్ణమణిమయాసనములు వెట్టుచుఁ-
బదములు గడుగుచు భక్తితోడ
సంవాసితస్నానజలము లందించుచు-
సద్గంధవస్త్రభూషణము లొసఁగి
యిష్ట పదార్థంబు లిడుచుఁ దాంబూ లాదు-
లొసఁగుచు విసరుచు నోజ మెఱసి
తెభా-10.2-223.1-తే.
శిరము దువ్వుచు శయ్యపైఁ జెలువు మిగుల
నడుగు లొత్తుచు దాసీసహస్రయుక్త
లయ్యుఁ గొలిచిరి దాసులై హరి నుదారుఁ
దారకాధిప వదనలు దారు దగిలి.
టీక:- ఇల్లు = గృహమున; కిన్ = కు; వచ్చినన్ = రాగా; ఎదురేగుదెంచుచు = ఎదురుగావస్తూ; ఆనీత = తేబడిన; వస్తువులన్ = వస్తువులను; అందుకొనుచు = తీసుకొంటు; సౌవర్ణ = బంగారు; మణి = రత్నాలు; మయా = మయములైన; ఆసనములు = పీటలు; పెట్టుచున్ = వేస్తూ; పదములున్ = కాళ్ళు; కడుగుచున్ = కడుగుతు; భక్తి = పూజ్యభావము; తోడన్ = తోటి; సంవాసిత = సువాసనగల; స్నానజలములన్ = స్నానములకైననీటిని; అందించుచున్ = అందిస్తూ; సద్గంధ = మంచిగంధము; వస్త్ర = బట్టలు; భూషణములు = ఆభరణములు; ఒసగి = ఇచ్చి; ఇష్ట = నచ్చిన; పదార్థంబులు = తినుబండారములు; ఇడుచున్ = ఇస్తూ; తాంబూల = తాంబూలము; ఆదులున్ = మున్నగువానిని; ఒసగుచున్ = ఇస్తూ; విసురుచున్ = వింజామరలువిసురుతు; ఓజన్ = చక్కదనముతో; మెఱసి = ప్రకాశింపజేసి; శిరమున్ = తల; దువ్వుచున్ = దువ్వుతు; శయ్య = పక్క, మంచము; పైన్ = మీద; చెలువు = అందము; మిగులన్ = అతిశయింపగా; అడుగులు = కాళ్ళు; ఒత్తుచు = పిసుకుచు; దాసీ = పనిగత్తెలు; సహస్ర = వేలమందితో; యుక్తులు = కూడియున్నవారు; అయ్యున్ = అయినప్పటికి; కొలిచిరి = సేవించిరి; దాసులు = ఆధీనులు, దాసురాళ్ళు; ఐ = అయ్యి; హరిన్ = కృష్ణుని; ఉదారున్ = ఘనుని; తారకాధిపవదనలు = స్త్రీలు {తారకాధిపవదనలు - తారకాధిప (చంద్రుని వంటి) వదనలు (మోము కలవారు), స్త్రీలు}; తారు = తాము; తగిలి = ఆసక్తులై;
భావము:- ఇంటికి రాగానే ఎదురువెళ్ళి తెచ్చిన వస్తువులు అందుకుంటారు. మణులతో పొదిగిన బంగారు ఆసనాలు వేస్తారు. భక్తితో పాదాలు కడుగుతారు, స్నానానికి సుగంధంతో కలిపిన నీళ్ళను అందిస్తారు. సుగంధాలు, వస్త్రాలు, ఆభరణాలు సమర్పిస్తారు. ఇష్టమైన పదార్ధాలు వడ్డిస్తారు. తాంబూలం అందిస్తూ, విసురుతూ, తల దువ్వుతూ, పాదాలు ఒత్తుతూ, వేలకొలది దాసీలు ఉన్నప్పటికీ ఆ చంద్రముఖులు చేసే సేవలు అన్నీ వాసుదేవుడికి స్వయంగా తామే చేస్తారు.
తెభా-10.2-224-శా.
నన్నే పాయఁడు; రాత్రులన్ దివములన్ నన్నే కృపం జెందెడిన్;
నన్నే దొడ్డగఁ జూచు వల్లభలలో నాథుండు నా యింటనే
యున్నా డంచుఁ బదాఱువేలుఁ దమలో నూహించి సేవించి రా
యన్నుల్ గాఢ పతివ్రతాత్వ పరిచర్యా భక్తియోగంబులన్.
టీక:- నన్నే = నన్ను మాత్రమే; పాయడు = ఎడబాయడు; రాత్రులన్ = రాత్రివేళ లందు; దివములన్ = పగటివేళ లందు; నన్నే = నన్ను మాత్రమే; కృపన్ = దయతో; చెందెడిన్ = పొంది ఉండును; నన్నే = నన్ను మాత్రమే; దొడ్డగన్ = గొప్పగా; చూచున్ = చూస్తాడు; వల్లభలలోన్ = భార్యలలో; నాథుండు = పెనిమిటి; నా = నా; ఇంటనే = ఇంటిలోనే; ఉన్నాడు = ఉన్నాడు; అంచున్ = అనుచు; పదాఱువేలున్ = పదహారువేలమంది (16000); తమలో = తమ మనసులలో; ఊహించి = తలచి; సేవించిరి = కొలిచిరి; ఆ = ఆ; అన్నుల్ = స్త్రీలు; గాఢ = దట్టమైన; పతివ్రతాత్వ = పతివ్రతాభావముతో; పరిచర్యా = పూజించు; భక్తి = సేవించు; యోగంబులన్ = యోగములతో.
భావము:- “శ్రీకృష్ణుడు రాత్రింబవళ్ళు నాచెంతనే ఉంటూ నన్నే ప్రేమిస్తున్నా”డని తమలో తాము సంబరపడుతూ, ఆ పదహారువేలమంది పడతులు గొప్ప భక్తి భావంతో, పాతివ్రత్యంతో యదువల్లభుడిని ఆదరాభిమానములతో ఆరాధించారు
తెభా-10.2-225-క.
ఆ రామలతో నెప్పుడుఁ
బోరాములు సాల నెఱపి పురుషోత్తముఁడున్
గారామునఁ దిరిగెను సౌ
ధారామ లతాసరోవిహారముల నృపా!
టీక:- ఆ = ఆ; రామల = స్త్రీల; తోన్ = తోటి; ఎప్పుడున్ = ఎప్పుడు; పోరాములు = రాకపోకలు, స్నేహములు; చాలన్ = ఎంతో; నెఱపి = చేసి; పురుషోత్తముడున్ = కృష్ణుడు; గారామునన్ = గారాబముతో, ప్రేమతో; తిరిగెను = మెలగెను; సౌధ = మేడలలో; ఆరామ = పూలతోటలలో; లతా = లతాకుంజములలో; సరః = సరస్సులలో; విహారములన్ = విహరించుటలచేత; నృపా = రాజా.
భావము:- ఓ రాజా! పురుషోత్తముడు శ్రీకృష్ణుడు రాకపోకలతో స్నేహం ప్రదర్శిస్తూ, ఆ స్త్రీలతో ఇళ్ళలో, తోటలలో, క్రీడా కొలనులలో విహరించాడు.
తెభా-10.2-226-క.
ఏ దేవుఁడు జగముల ను
త్పాదించును మనుచుఁ జెఱుచుఁ బ్రాభవమున మ
ర్యాదారక్షణమునకై
యా దేవుం డట్లు మెఱసె యాదవులందున్.
టీక:- ఏ = ఏ; దేవుడు = దేవుడు; జగములను = లోకములను; ఉత్పాదించును = పుట్టించునో; మనుచున్ = రక్షించునో; చెఱచున్ = నాశముచేయునో; ప్రాభవమునన్ = ప్రభుత్వముతో; మర్యాద = ఆచారములను; రక్షణమున్ = కాపాడుట; కై = కోసమై; ఆ = ఆ; దేవుండు = దేవుడు; అట్లు = ఆ విధముగ; మెఱసెన్ = ప్రకాశించెను; యాదవులు = యదువంశస్థుల; అందున్ = లో.
భావము:- ప్రపంచాన్ని తన ప్రభావంతో సృష్టించి, పోషించి, అంతం చేసే ఆ పరమాత్ముడు, జగద్రక్షకుడై యాదవులలో శ్రీకృష్ణుడుగా అవతరించి ఈవిధంగా విరాజిల్లాడు.
తెభా-10.2-227-వ.
అంత నొక్కనాఁడు రుక్మిణీదేవి లోఁగిట మహేంద్రనీల మరకతాది మణిస్తంభ వలభి విటంకపటల దేహళీకవాట విరాజమానంబును, శాతకుంభ కుడ్య గవాక్ష వేదికా సోపానంబును, విలంబమాన ముక్తాఫలదామ విచిత్ర కౌశేయవితానంబును, వివిధ మణిదీపికా విసర విభ్రాజమానంబును, మధుకరకులకలిత మల్లికాకుసుమ మాలికాభిరామంబును, జాలకరంధ్ర వినిర్గత కర్పూరాగరుధూప ధూమంబును, వాతాయన విప్రకీర్ణ శిశిరకర కిరణస్తోమంబును, బారిజాతప్రసవామోద పరిమిళితపవనసుందరంబు నయిన లోపలిమందిరంబున శరచ్చంద్రచంద్రికా ధవళపర్యంక మధ్యంబున, జగదీశ్వరుం డయిన హరి సుఖాసీనుండై యుండ, సఖీజనంబులుం దానును డగ్గఱి కొలిచి యుండి.
టీక:- అంతన్ = ఆ తరువాత; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; రుక్మిణీదేవి = రుక్మిణీదేవి; లోగిటన్ = ఇంటిలో; మహేంద్రనీల = ఇంద్రనీలమణులు; మరకత = పచ్చలు; ఆది = మొదలైన వానిచేతనైన; మణి = రత్నాల; స్తంభ = స్తంభములు; వలభి = చూరులు (ఇంటిముందు); విటంక = గువ్వగూళ్ళు; పటల = పైకప్పులు; దేహళీ = ద్వారబంధములు; కవాట = తలుపులు చేత; విరాజమానంబును = ప్రకాశించునది; శాత = బంగారు; కుంభ = ఇంటిపై ఉండు కుండలు; కుడ్య = గోడలు; గవాక్ష = కిటికీలు; వేదికా = అరుగులు; సోపానంబును = మెట్లు కలిగినవి; విలంబమాన = వేలాడగట్టబడిన; ముక్తాఫల = ముత్యాల; దామ = దండలు; విచిత్ర = బాగా చిత్రించిన; కౌశేయ = పట్టుబట్టల; వితానంబును = మేలుకట్టులు, చాందినీలు; వివిధ = నానావిధములైన; మణి = మణుల; దీపికా = కాంతుల; విసర = సమూహములచే; విభ్రాజమాన = మిక్కిలి కాంతివంతమైనది; మధుకర = తుమ్మెదల; కుల = సమూహములచే; కలిత = కూడుకొన్న; మల్లికాకుసుమ = మల్లెపూల; మాలికా = దండలచే; అభిరామంబును = మనోహరమైనది; జాలక = పొగపోవుకిటికీ; రంధ్ర = కన్నములనుండి; వినిర్గత = వెలువడెడి; కర్పూర = కర్పూరహారతుల; అగరుధూప = అగరుధూపముల; ధూమంబును = పొగలు కలది; వాతాయన = కిటికీలనుండి; విప్రకీర్ణ = మిక్కిలి వ్యాపించు; శిశిరకర = చంద్ర; కిరణ = కిరణముల; స్తోమంబును = సమూహము కలది; పారిజాత = పారిజాత; ప్రసవ = పూల; ఆమోద = సువాసనలచే; పరిమిళిత = పరిమళించు; పవన = వాయువులచే; సుందరంబున్ = అందయైనది; అయిన = ఐన; లోపలిమందిరంబునన్ = అంతఃపురము లందు; శరత్ = శరత్కాలపు; చంద్ర = చంద్రుని; చంద్రికా = వెన్నెల వంటి; ధవళ = తెల్లని; పర్యంక = పాన్పు, మంచము; మధ్యంబునన్ = నడుమ; జగదీశ్వరుండు = ఎల్లలోకాలకి ప్రభువు; అయిన = అగు; హరి = కృష్ణుడు; సుఖాసీనుడు = చక్కగా కూర్చున్నవాడు; ఐ = అయ్యి; ఉండన్ = ఉండగా; సఖీజనంబులున్ = చెలికత్తెలు; తానును = తను; డగ్గఱి = దగ్గరకి వెళ్ళి; కొలిచి = సేవచేయుచు; ఉండి = ఉండి.
భావము:- ఒకనాడు రుక్మిణీదేవి అంతఃపురంలో శరత్కాలపు వెన్నెలవంటి తెల్లనైన పానుపుమీద జగదీశ్వరు డైన శ్రీకృష్ణుడు సుఖాసీనుడై ఉన్నాడు. ఆ అంతఃపురం నవరత్నాలు పొదిగిన స్తంభాలతో ఇంద్రనీల మణులు పొదిగిన చంద్రశిలలతో నిండినట్టిది. ఆ చంద్రశాలలలోని ద్వారబంధాలు గడపలు మండపాలు తలుపులు గోడలు కిటికీలు అరుగులు మెట్లు అన్నీ సువర్ణకాంతులు విరజిమ్ముతున్నాయి. ఆ అంతఃపురం వేల్లాడుతున్న ముత్యాలసరాలతో నిండిన చిత్రవిచిత్రమైన పట్టువస్త్రాల చాందినీలతో వెలుగుతున్నది అనేక మణిదీపాలతో ప్రకాశిస్తున్నది. అక్కడ ఉన్న మల్లెపూలదండలపై తుమ్మెదలు మూగి ఉన్నాయి. కర్పూరం అగరు మొదలైన సుగంధ ద్రవ్యాల పొగలు ఆ అంతఃపురపు కిటికీలగుండా బయటకు వ్యాపిస్తున్నాయి. గవాక్షాల గుండా చల్లని తెల్లని కిరణాలు ప్రసరిస్తున్నాయి. ఉద్యానవనం నుంచి పారిజాత సుగంధ పవనాలు వీస్తున్నాయి. అటువంటి అంతఃపురంలో సుఖాసీనుడై ఉన్న శ్రీహరిని రుక్మిణీదేవి ఆమె సఖులూ సేవిస్తున్నారు.
తెభా-10.2-228-సీ.
కుచకుంభములమీఁది కుంకుమతో రాయు-
హారంబు లరుణంబు లగుచు మెఱయఁ;
గరపల్లవము సాఁచి కదలింప నంగుళీ-
యక కంకణప్రభ లావరింపఁ;
గదలిన బహురత్న కలిత నూపురముల-
గంభీర నినదంబు గడలుకొనఁగఁ;
గాంచన మణికర్ణికా మయూఖంబులు-
గండపాలికలపై గంతు లిడఁగఁ;
తెభా-10.2-228.1-తే.
గురులు నర్తింపఁ బయ్యెద కొంగు దూఁగ;
బోటిచే నున్న చామరఁ బుచ్చుకొనుచు
జీవితేశ్వరు రుక్మిణి సేర నరిగి
వేడ్క లిగురొత్త మెల్లన వీవఁ దొడఁగె.
టీక:- కుచ = స్తనములు అను; కుంభముల = కుంభముల; మీది = పైనున్న; కుంకుమ = కుంకుమపూత; తోన్ = తోటి; రాయు = ఒరుసుకొనెడి; హారంబులు = ముత్యాలదండలు; అరుణంబులు = ఎఱ్ఱనివి; అగుచున్ = ఔతు; మెఱయన్ = మెరుస్తుండగా; కర = చేతులు అను; పల్లవమున్ = చిగురాకులను; చాచి = చాపి; కదలింపన్ = కదలించగా; అంగుళీయక = ఉంగరాల; కంకణ = చేతికడియముల; ప్రభలు = కాంతులు; ఆవరింపన్ = ప్రసరించగా; కదలిన = చలిస్తున్న; బహు = అనేక; రత్న = మణులు; కలిత = కలిగిన; నూపురముల = కాలి అందెల; గంభీర = గంభీరమైన; నినదంబున్ = ధ్వనులు; కడలుకొనగన్ = అతిశయింపగా; కాంచన = బంగారు; మణి = రత్నాల; కర్ణికా = చెవిదుద్దుల; మయూఖంబులు = కాంతికిరణములు; గండపాలికల = చెక్కిటిప్రదేశముల; పైన్ = మీద; గంతులిడగన్ = తళతళలాడగా; కురులు = శిరోజములు; నర్తింపన్ = చలింపగా; పయ్యెద = పైట; కొంగు = చెరగు; తూగన్ = వేలాడుతుండగా; బోటి = చెలికత్తె; చేన్ = చేతిలో; ఉన్న = ఉన్నట్టి; చామరన్ = వింజామర, విసినికఱ్ఱ; పుచ్చుకొనుచు = తీసుకొని; జీవితేశ్వరున్ = భర్తని, కృష్ణుని; రుక్మిణి = రుక్మిణీదేవి; చేరన్ = దగ్గరకు; అరిగి = వెళ్ళి; వేడ్కలు = కోరికలు; ఇగురొత్తన్ = చిగురించగా; మెల్లనన్ = మెల్లిగా; వీవన్ = వీచుట; తొడగెన్ = మొదలిడెను.
భావము:- ఆ సమయంలో వక్షస్థలంమీది కుంకుమ అంటుకుని హారాలు ఎఱ్ఱని కాంతితో మెరుస్తుండగా; చిగురుటాకువంటి చేతిని కదలించి నప్పుడు కదలిన కంకణాలు, ఉంగరాల కాంతులు ప్రసరిస్తుండగా; చెవులకు ధరించిన బంగారు చెవిదుద్దుల ధగధగలు గండస్థలాలపై వ్యాపిస్తుండగా; కదిలినప్పుడు రత్నాల అందెలు గంభీరమైన ధ్వని చేస్తుండగా; ముఖం మీద ముంగురులు కదలాడుతుండగా; పైటకొంగు తూగాడుతూ ఉండగా; చెలికత్తె చేతిలోని వింజామరను తీసుకుని రుక్మిణీదేవి తన జీవితేశ్వరు డైన శ్రీకృష్ణునకు మెల్లిగా విసరసాగింది.
తెభా-10.2-229-వ.
అప్పుడు.
టీక:- అప్పుడు = ఆ సమయమున.
భావము:- అలా శ్రీకృష్ణులవారిని రుక్మిణీదేవి సేవిస్తున్న సమయంలో..