Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నాగ్నజితి పరిణయంబు

వికీసోర్స్ నుండి

నాగ్నజితి పరిణయంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నాగ్నజితి పరిణయంబు)
రచయిత: పోతన



తెభా-10.2-126-సీ.
ననాథ! వినుము కోలదేశ మేలెడి;-
గ్నజిత్తను నరనాథుఁ డొకడు
సుమతి ధార్మికుఁడు దత్సుత నాగ్నజితి యను;-
న్యక గుణవతి లదు దానిఁ
బెండ్లియాడుటకునై పృథివీశు లేతెంచి;-
వాఁడికొమ్ములు గల వాని, వీర
గంధంబు సోఁకినఁ గాలు ద్రవ్వెడివాని,-
తిమదమత్తంబు యిన వాని

తెభా-10.2-126.1-తే.
గోవృషంబుల నేడింటిఁ గూర్చి తిగిచి
బాహుబలమున నెవ్వఁడు ట్టి కట్టు
తఁడు కన్యకుఁ దగు వరుం నిన వానిఁ
ట్టఁజాలక పోదురు ప్రజలు బెగడి.

టీక:- జననాథ = రాజా; వినుము = వినుము; కోసల = కోసల అను; దేశమున్ = రాజ్యమును; ఏలెడి = పాలించెడి; నగ్నజిత్తు = నగ్నజిత్తు; అను = అనెడి; నరనాథుడు = రాడు; ఒకడు = ఒకతను; సుమతి = మంచిబుద్ధిగలవాడు; ధార్మికుడున్ = ధర్మమునడపువాడు; తత్ = అతని; సుత = పుత్రిక; నాగ్నజిత్తి = నాగ్నజిత్తి; అను = అనెడి; కన్యక = యువతి; గుణవతి = గుణవంతురాలు; కలదు = ఉన్నది; దానిన్ = ఆమెను; పెడ్లి = వివాహము; ఆడుట = చేసికొనుట; కున్ = కు; ఐ = అయ్యి; పృథివీశులు = అనేకమైన రాజులు; ఏతెంచి = వచ్చి; వాడి = సూదిగానున్న, పదునైన; కొమ్ములు = కొమ్ములు; కల = కలిగిన; వానిన్ = వాటిని; వీర = వీరుల; గంధంబు = వాసన; సోకినన్ = తగిలితేచాలు; కాలుద్రవ్వెడు = పోరుకుసిద్ధపడెడి; వానిన్ = వాటిని; అతి = మిక్కిలి; మద = మదముచేత; మత్తంబులు = ఒళ్ళుతెలియనావేశంగలవి; ఐన = అయిన; వానిన్ = వాటిని; గోవృషంబులన్ = ఆబోతులను; ఏడింటిన్ = ఏడింటిని (7); కూర్చి = కలిపికట్టి; తిగిచి = లాగి; బాహుబలమునన్ = భుజబలముతో; ఎవ్వడు = ఎవరు; పట్టి = పట్టుకొని; కట్టునో = కట్టవేయునో; అతడు = అతనే; కన్య = బాల; కున్ = కు; తగు = తగిన; వరుండు = భర్త; అనినన్ = అనగా; వానిన్ = వాటిని; పట్టజాలక = పట్టలేక; పోదురు = పోవుచున్నారు; ప్రజలు = వచ్చినవారందరు; బెగడి = బెదిరిపోయి.
భావము:- ఓ పరీక్షన్మహారాజా! కోసలదేశాన్ని సద్గుణుడు ధర్మపరుడు అయిన నగ్నజిత్తు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని కుమార్తె నాగ్నజితి. సద్గుణ సంపన్న. ఆ రాజు దగ్గర వాడి కొమ్ములు కలిగి వీరగంధం సోకితే చాలు కాలుద్రవ్వుతుండే మిక్కిలి మదించిన ఏడు ఆబోతులు ఉన్నాయి. ఆ వృషభాలను తన బాహుబలంతో ఎవడు కట్టివేస్తాడో, అతడే నాగ్నజితికి భర్త అని ఆ రాజు నిర్ణయించాడు. ఎందరో రాజులు వచ్చి ఆ ఎద్దులను చూసి బెదిరి పోయారు, పట్టికట్టలేకపోయారు.

తెభా-10.2-127-వ.
ఇట్లు గోవృషంబుల జయించినవాఁడ క్కన్యకు వరుండనిన భగవంతుండైన హరి విని సేనాపరివృతుండై కోసలపురంబునకుం జనినం గోసలాధీశ్వరుండును హరి నెదుర్కొని యర్ఘ్యపాద్యాది విధులం బూజించి పీఠంబు సమర్పించి ప్రతివందితుండై యున్న యెడ.
టీక:- ఇట్లు = ఈ విధముగ; గోవృషంబులన్ = ఆబోతులను; జయించి = గెలిచిన; వాడు = వాడే; ఆ = ఆ; కన్య = కుమారి; కున్ = కు; వరుండు = పెనిమిటి; అనినన్ = అనగా; భగవంతుండు = షడ్గుణైశ్వర్యసంపన్నుడు {భగవంతుడు - శ్లో. ఉత్పత్తించ వినాశంచ భూతానామా గతింగతిం, వేత్తి విద్యామవిద్యాంచ షణ్ణాంభగ ఇతీరితః. ఈ ఆరు కలవాడు భగవంతుడు}; ఐన = అగు; హరి = కృష్ణుడు; విని = విని; సేనా = సైన్యములచేత; పరివృతుండు = చుట్టు గలవాడు; ఐ = అయ్యి; కోసల = కోసల అను; పురంబున్ = పట్టణమున; కున్ = కు; చనినన్ = వెళ్ళగా; కోసలా = కోసలపురమునకు; అధీశ్వరుండును = రాజు; హరిన్ = కృష్ణుని; ఎదుర్కొని = ఎదురేగి; అర్ఘ్య = అర్ఘ్యము ఇచ్చుట; పాద్య = పాద్యము ఇచ్చుట; ఆది = మున్నగు; విధులన్ = క్రియలచేత; పూజించి = అర్చించి; పీఠంబు = ఆసనము; సమర్పించి = ఇచ్చి; ప్రతివందితుండు = ప్రతినమస్కారము పొందిన వాడు; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; ఎడన్ = సమయము నందు.
భావము:- ఆ వృషభాలను జయించినవాడే ఆ కన్యకు భర్త అని వినిన శ్రీకృష్ణుడు సేనాసమేతంగా కోసలదేశానికి వెళ్ళాడు. ఆరాజు శ్రీకృష్ణుని గొప్పగా గౌరవించాడు. అర్ఘ్యం, పాద్యం, పీఠం, నమస్కారాదులతో సత్కరించాడు.

తెభా-10.2-128-క.
రాజకన్య ప్రియమున
నా రాజీవాక్షు మోహనాకారుఁ ద్రిలో
కారాధితు మాధవుఁ దన
కారాధ్యుండైన నాథుఁ ని కోరె నృపా!

టీక:- ఆ = ఆ యొక్క; రాజకన్య = రాకుమారి; ప్రియమునన్ = ఇష్టముతో; ఆ = ఆ ప్రసిద్ధుడైన; రాజీవాక్షున్ = కృష్ణుని {రాజీవాక్షుడు - ఎఱ్ఱకలువలవంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}; మోహనాకారున్ = కృష్ణుని {మోహనాకారుడు - మోహము పుట్టించెడి ఆకారము కలవాడు, కృష్ణుడు}; త్రిలోకారాధితున్ = కృష్ణుని {త్రిలోకారాధితుడు - ముల్లోకములచేత ఆరాధింపబడు వాడు, విష్ణువు}; మాధవున్ = కృష్ణుని {మాధవుడు - యదు పుత్రుడు అగు మధువు వంశమున అవతరించిన వాడు, కృష్ణుడు}; తన = ఆమె; కున్ = కు; ఆరాధ్యుండు = పూజనీయుండు; ఐన = అయిన; నాథుడు = భర్త; అన = అని; కోరెన్ = కోరుకొనెను; నృపా = రాజా.
భావము:- రాజకుమార్తె నాగ్నజితి ఆరాధనా భావంతో మోహనకారుడూ, పద్మనేత్రుడూ, త్రిలోకపూజితుడూ, ఐన మాధవుడే తనకు భర్త కావాలని భావించింది.

తెభా-10.2-129-వ.
మఱియు న క్కన్యకారత్నంబు తన మనంబున.
టీక:- మఱియున్ = ఇంతేకాక; ఆ = ఆ యొక్క; కన్యకా = బాలికలలో; రత్నంబు = ఉత్తమురాలు; తన = ఆమె యొక్క; మనంబునన్ = మనస్సు నందు.
భావము:- ఇంకా నాగ్నజితి తన మనసులో.....

తెభా-10.2-130-ఆ.
"విష్ణుఁ డవ్యయుండు విభుఁడు గావలె నని
నోఁచినట్టి తొంటి నోముఫలము
సిద్ధ మయ్యెనేనిఁ జేకొనుఁ బో నన్నుఁ
క్రధరుఁడు వైరిక్రహరుఁడు.

టీక:- విష్ణుడు = కృష్ణుడు {విష్ణువు - సర్వవ్యాపకుడు, హరి}; అవ్యయుండు = కృష్ణుడు {అవ్యయుడు - నాశము లేని వాడు, విష్ణువు}; విభుడు = భర్త; కావలెను = అవ్వాలి; అని = అని; నోచినట్టి = ఆచరించి నటువంటి; తొంటి = పూర్వజన్మలలో; నోము = వ్రతుముల; ఫలము = ఫలితము; సిద్ధమయ్యెనేని = నెరవేరిన పక్షమున; చేకొనుబో = చేపట్టును కదా; నన్నున్ = నన్ను; చక్రధరుడు = కృష్ణుడు {చక్రధరుడు - చక్రము ధరించు వాడు, విష్ణువు}; వైరి = శత్రువుల; చక్ర = సమూహములను; హరుడు = హరింపజేయువాడు.
భావము:- “నేను పూర్వజన్మలో నోచిననోముల ఫలం సిద్ధించి, శ్రీహరి, అచ్యుతుడు, శత్రురాజులను చెండాడే చక్రధరుడు నన్ను వివాహం చేసుకొను గాక.

తెభా-10.2-131-మ.
సిరియుం బద్మభవేశ దిక్పతులు మున్ సేవించి యెవ్వాని శ్రీ
ణాంభోజపరాగముల్‌ శిరములన్ మ్యగ్గతిం దాల్తుఁ; రీ
ణీచక్రభరంబు వాపుటకు నుద్యత్కేళిమూర్తుల్‌ దయా
రుఁడై యెవ్వఁడు దాల్చు నట్టి హరి యెబ్భంగిం బ్రవర్తించునో! "

టీక:- సిరియున్ = లక్ష్మీదేవి; పద్మభవ = బ్రహ్మదేవుడు {పద్మభవుడు - పద్మమున పుట్టిన వాడు, బ్రహ్మ}; ఈశ = శివుడు; దిక్పతులున్ = ఇంద్రాది అష్టదిక్పాలకులు {అష్టదిక్పాలకులు - 1 ఇంద్రుడు - తూర్పు దిక్కునకు 2 అగ్ని - ఆగ్నేయ మూలకు 3 యముడు - దక్షిణ దిక్కునకు 4 నిరృతి - నైఋతి మూలకు 5 వరుణుడు - పడమటి దిక్కునకు 6 వాయువు - వాయవ్య మూలకు 7 కుబేరుడు - ఉత్తర దిక్కునకు 8 ఈశానుడు - ఈశాన్య మూలకు పరిపాలకులు}; మున్ = పూర్వము; సేవించి = కొలిచి; ఎవ్వాని = ఎవని యొక్క; శ్రీ = సంపత్కరమైన; చరణ = పాదములు అనెడి; అంభోజ = పద్మముల; పరాగముల్ = దుమ్ము అను పుప్పొడిని; శిరములన్ = తలల యందు; సమ్యక్ = చక్కనైన; గతిన్ = విధముగా; తాల్తురు = ధరించెదరో; ఈ = ఈ యొక్క; ధరణీ = భూ; చక్ర = మండల; భరంబున్ = భారమును; వాపుట = పోగొట్టుట; కునున్ = కు; ఉద్యత్ = పూనిన; కేళీ = లీలా; మూర్తుల్ = అవతారాలను, ఆకృతుల; దయా = దయచూపు టందు; పరుడు = ఆసక్తి కలవాడు; ఐ = అయ్యి; ఎవ్వడు = ఎవరైతే; తాల్చున్ = ధరించునో; అట్టి = అటువంటి; హరి = కృష్ణుడు; ఏ = ఏ; భంగిన్ = విధముగా; ప్రవర్తించునో = నడచునో.
భావము:- లక్ష్మీదేవి, బ్రహ్మదేవుడు. శంకరుడు, దిక్పాలకులు సైతం ఎవని పాదధూళిని శిరసున ధరించి సేవిస్తారో? భూభారాన్ని తగ్గించడానికి ఎవడు దయతో లీలావతారాలు ధరిస్తాడో? ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు నా విషయంలో ఎమి చేస్తాడో?”

తెభా-10.2-132-వ.
అని యిట్లు నాగ్నజితి విచారించు నెడఁ గృష్ణుం డా రాజుం జూచి మేఘగంభీర నినదంబున నిట్లనియె.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; నాగ్నజిత్తి = నాగ్నజిత్తి; విచారించున్ = ఆందోళన పడెడి; ఎడన్ = సమయము నందు; కృష్ణుండు = కృష్ణుడు; ఆ = ఆ యొక్క; రాజున్ = రాజు నగ్నజిత్తిని; చూచి = చూసి; మేఘ = ఉరుములవంటి; గంభీర = గంభీరమైన; నిదంబునన్ = కంఠధ్వనితో; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా నాగ్నజితి చింతిస్తున్న సమయంలో కృష్ణుడు కోసలరాజు నగ్నజిత్తితో మేఘగంభీరస్వరంతో ఇలా అన్నాడు

తెభా-10.2-133-క.
"అన్యుల యాచింపరు రా
న్యులు సౌజన్యకాంక్షఁ నుదెంచితి నీ
న్యన్ వేఁడెద నిమ్మా!
న్యాశుల్కదుల మేము గాము నరేంద్రా!"

టీక:- అన్యులన్ = ఇతరులను; యాచించరు = అడుగరు; రాజన్యులు = రాజవంశస్థులు; సౌజన్య = సుజనత్వము, మంచితనము నందలి; కాంక్షన్ = కోరికచేత; చనుదెంచితి = వచ్చితిని; నీ = నీ యొక్క; కన్యన్ = కుమార్తెను; వేడెదన్ = కోరుచున్నాను; ఇమ్మా = ఇమ్ము; కన్యాశుల్కదులము = ఓలి ఇచ్చువారము; మేము = మేము; కాము = కాదు; నరేంద్రా = రాజా.
భావము:- “రాజులు పరులను యాచించరు. నేను సౌజన్యంతో నీ కుమార్తెను వివాహం చేసుకోడానికి వచ్చాను. నాకు ఇమ్ము. మేము కన్యాశుల్కం ఇచ్చేవారము కాము సుమా.”

తెభా-10.2-134-వ.
అనిన రాజిట్లనియె.
టీక:- అనినన్ = అని అడుగగా; రాజున్ = ఆ రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- కృష్ణుడు ఇలా అనగా కోసల రాజు ఇలా చెప్పాడు.

తెభా-10.2-135-శా.
"న్యం జేకొన నిన్నిలోకముల నీ న్నన్ ఘనుండైన రా
న్యుం డెవ్వఁడు? నీ గుణంబులకు నాశ్చర్యంబునుం బొంది తా
న్యారంభము మాని లక్ష్మి భవదీయాంగంబునన్ నిత్యయై
న్యత్వంబునుఁ జెంది యున్నది గదా తాత్పర్యసంయుక్తయై.

టీక:- కన్యన్ = కుమారిని; చేకొనన్ = పెండ్లాడుటకు; ఇన్ని = ఈ అన్ని; లోకములన్ = లోకములలోను; నీ = నీ; కన్నన్ = కంటెను; ఘనుండు = గొప్పవాడు; ఐన = అయిన; రాజు = రాజు; అన్యుండు = ఇతరుడు; ఎవ్వడు = ఎవరు; నీ = నీ యొక్క; గుణంబుల్ = గొప్పగుణముల; కున్ = కు; ఆశ్చర్యంబునున్ = అద్భుతమును; పొంది = పొంది; తాన్ = తాను; అన్య = ఇతర; ఆరంభంబు = ప్రయత్నములు; మాని = విడిచి; లక్ష్మి = లక్ష్మీదేవి; భవదీయ = నీ యొక్క; అంగంబునన్ = దేహము నందు; నిత్య = నిలుకడగా ఉండునది; ఐ = అయ్యి; ధన్యత్వంబునున్ = కృతార్థత; చెంది = చెంది; ఉన్నది = ఉన్నది; కదా = కదా; తాత్పర్య = తత్పరత్వముతో; సంయుక్త = కూడుకొన్నది; యై = అయ్యి.
భావము:- “నా కుమార్తెను వివాహమాడడానికి ఈ లోకాలు అన్నిటిలో, నీకంటే తగిన వాడెవడు? నీ సద్గుణాలకు మెచ్చి వరించి లక్ష్మీదేవి, ఇతరులను కాదని, నీ వక్షస్థలంలో శాశ్వత స్థానం సంపాదించుకుని ధన్యురాలైంది.

తెభా-10.2-136-శా.
చంద్గోవృషసప్తకంబుఁ గడిమిన్ సైరించి యెవ్వాఁడు భం
జించున్ వానికిఁ గూఁతు నిత్తు నని యేఁ జీరించినన్ వైభవో
దంద్గర్వులు వచ్చి రాజతనయుల్‌ త్పాద శృంగాహతిం
గించిత్కాలము నోర్వ కేగుదు రనిం గేడించి భిన్నాంగులై.

టీక:- చంచత్ = తిరుగుచున్న; గోవృష = ఆబోతులు; సప్తకంబున్ = ఏడింటిని (7); కడిమిన్ = పరాక్రమముతో; సైరించి = తట్టుకొని; ఎవ్వాడు = ఎవరైతే; భంజించున్ = శిక్షించునో; వాని = అతని; కిన్ = కి; కూతున్ = పుత్రికను; ఇత్తును = ఇచ్చెదను; అని = అని; ఏన్ = నేను; చీరించినన్ = పిలిపించగా; వైభవ = ఐశ్వర్యము; ఉదంచత్ = అతిశయముచేత; గర్వులు = గర్వము కలవారు; వచ్చి = చేరి; రాజతనయుల్ = రాకుమారులు; తత్ = వాటి; పాద = కాళ్ళ యొక్క; శృంగ = కొమ్ముల యొక్క; హతిన్ = తాకిడులను, దెబ్బలను; కించిత్ = కొద్ది; కాలమున్ = సమయమేనా; ఓర్వక = తట్టుకొనలేక; ఏగుదురు = పోవుచున్నారు; అనిన్ = పోరునకు; కేడించి = వెనుదీసి; భిన్న = విరిగిన; అంగులు = అవయవములు కలవారు; ఐ = అయ్యి.
భావము:- ఆ ఏడువృషభాలను బాహుబలంతో ఎదుర్కుని ఎవడు జయిస్తాడో? అతనికి నా కుమార్తెను ఇచ్చి వివాహం జరుపుతానని చాటించాను. గర్విష్టులైన రాజులెందరో వచ్చి ఆంబోతులగిట్టల దెబ్బలకు కొంచంసేపు కూడా తట్టుకోలేక ఛిన్నాభిన్నా మైన శరీరాలతో పోటీ నుండి తప్పుకున్నారు.

తెభా-10.2-137-శా.
ష్ణాంశుండు తమంబుఁ దోలు క్రియ నీ వుగ్రాహవక్షోణిలోఁ
గృష్ణా! వైరులఁ దోలినాఁడవు, రణక్రీడావిశేషంబులన్
నిష్ణాతుండవు, సప్తగోవృషములన్ నేఁ డాజి భంజించి రో
చిష్ణుత్వంబున వచ్చి చేకొనుము మా శీతాంశుబింబాననన్. "

టీక:- ఉష్ణాంశుండు = సూర్యుడు {ఉష్ణాంశుడు - ఉష్ణము కల అంశ కలవాడు, సూర్యుడు}; తమంబున్ = చీకటిని; తోలు = తరుము; క్రియన్ = విధముగా; నీవు = నీవు; ఉగ్ర = భయంకరమైన; ఆహవ = యుద్ధ; క్షోణి = భూమి; లోన్ = యందు; కృష్ణా = కృష్ణా; వైరులన్ = శత్రువులను; తోలినాడవు = తరిమి వేసితివి; రణ = యుద్ధ; క్రీడా = క్రీడల యందు; విశేషంబులన్ = విశిష్టత లందు; నిష్ణాతుండవు = మిక్కిలి నేర్పు కలవాడవు; సప్త = ఏడు (7); గోవృషములన్ = ఆంబోతులను; నేడు = ఇవాళ; ఆజిన్ = యుద్ధము నందు; భంజించి = శిక్షించి; రోచిష్టుత్వంబునన్ = ప్రకాశశీలత్వముతో; వచ్చి = వచ్చి; చేకొనుము = వరించుము; మా = మా యొక్క; శీతాంశుబింబాననన్ = కుమారిని {శీతాంశుబింబానన - శీతాంశుబింబ (చంద్రబింబమువంటి) ఆనన (మోము కలామె), సుందరి}.
భావము:- శ్రీకృష్ణా! సూర్యుడు చీకటిని పారద్రోలినట్లు నీవు రణరంగంలో నీ శత్రువులను పారదోలావు. సంగర క్రీడలో నీవు సర్వసమర్థుడవు. ఏడువృషభాలతో ఈవేళ పోరాడి జయించి మా చంద్రముఖిని నాగ్నజితిని చేపట్టు.”

తెభా-10.2-138-వ.
అని నగ్నజిత్తు తన కూఁతు వివాహంబునకుం జేసిన సమయంబు సెప్పిన విని.
టీక:- అని = అని; నగ్నజిత్తు = నగ్నజిత్తు; తన = అతని; కూతున్ = కుమార్తెను; వివాహంబున్ = పెండ్లాడుట; కున్ = కి; చేసిన = పెట్టిన; సమయంబు = శపథమును; చెప్పినన్ = చెప్పగా; విని = విని.
భావము:- అని నగ్నజిత్తు తన కుమార్తె వివాహ విషయంలో తాము పెట్టుకున్న నియమాన్ని వివరించగా, కృష్ణుడు విని

తెభా-10.2-139-చ.
నియె నఘారివత్సబకకంసవిదారి ఖలప్రహారి దా
తర కిల్పిషంబుల నణ్య భయంకర పౌరుషంబులన్
సునిశిత శృంగ నిర్దళితశూరసమూహ ముఖామిషంబులన్
న గుణోన్మిషంబుల మహా పరుషంబుల గోవృషంబులన్.

టీక:- కనియెన్ = చూసెను; అఘారి = కృష్ణుడు {అఘారి - అఘాసురునిశత్రువు, కృష్ణుడు}; వత్స = వత్సాసుర; బక = బకాసుర; కంస = కంసులను; విదారి = సంహరించినవాడు; ఖలప్రహారి = కృష్ణుడు {ఖలప్రహారి - దుర్జనులను శిక్షించువాడు, కృష్ణుడు}; తాన్ = అతను; ఘనతర = మిక్కిలి అధికమైన{ఘనము – ఘనతరము - ఘనతమము}; కిల్బిషంబులన్ = పాపములు చేసినవానిని; అగణ్య = ఎంచరాని; భయంకర = భీకరమైన; పౌరుషంబులన్ = పౌరుషములు కలవానిని; సునిశిత = మిక్కిలి వాడి యైన; శృంగ = కొమ్ములచే; నిర్దళిత = చీల్చబడిన; శూర = వీరుల; సమూహ = సమూహముల; ముఖ = ముఖము లందలి; అమిషంబులన్ = మాంసములు కలవానిని; హనన = చంపెడి; గుణ = శీలములు; ఉన్మిషంబులన్ = విరిసినవానిని; మహా = అతి; పరుషంబులన్ = క్రూరమైనవానిని; గోవృషంబులన్ = ఆంబోతులను.
భావము:- అఘాసుర, వత్సాసుర, బకాసుర, కంసాది ఖలులను చీల్చిచెండాడిన శ్రీకృష్ణుడు, గొప్ప పౌరుషము కలవీ తమ వాడి కొమ్ములతో ఎందరో వీరుల ముఖాలను క్రుమ్మి గాయపరచినవీ, రూపం ధరించిన పాపరాసుల వలె అతి భయంకరమైనవీ అయిన ఆబోతులను అవలోకించాడు.

తెభా-10.2-140-ఉ.
చేము చక్కఁ గట్టుకొని చిత్రగతిన్ వడి నేడు మూర్తులై
బాలుఁడు దారురూపములఁ ట్టెడు కైవడిఁ బట్టి వీర శా
ర్దూలుఁడు గ్రుద్ది నేలఁ బడఁ ద్రోచి మహోద్ధతిఁ గట్టి యీడ్చె భూ
పాకులెల్ల మెచ్చ వృషభంబులఁ బర్వత సన్నిభంబులన్.

టీక:- చేలము = వస్త్రమును; చక్కన్ = చక్కగా బిగించి; కట్టుకొని = కట్టుకొని; చిత్ర = వింతలైన; గతిన్ = గమనములతో; వడిన్ = వేగముగా; ఏడు = ఏడు (7); మూర్తులు = రూపములు పొందినవాడు; ఐ = అయ్యి; బాలుడు = చిన్నపిల్లాడు; దారు = చెక్క; రూపములన్ = బొమ్మలను; పట్టెడు = పట్టుకొను; కైవడిన్ = రీతిగా; పట్టి = పట్టుకొని; వీరశార్దూలుడు = కృష్ణుడు {వీరశార్దూలుడు - వీరులలో పులి వంటి వాడు, కృష్ణుడు}; గ్రుద్ది = పిడికిటి పోటులు వేసి; నేలన్ = నేలమీద; పడద్రోసి = పడగొట్టి; మహా = మిక్కిలి; ఉద్ధతిన్ = గొప్పదనముతో; కట్టి = బంధించి; ఈడ్చెన్ = ఈడ్చెను; భూపాలకులు = రాజులు; ఎల్లన్ = అందరు; మెచ్చన్ = మెచ్చుకొనగా; వృషభంబులన్ = ఆంబోతులను; పర్వత = కొండలను; సన్నిభంబులన్ = సరిపోలువానిని.
భావము:- శ్రీకృష్ణుడు పైవస్త్రాన్ని నడుముకు బిగించి కట్టుకుని విచిత్రరీతిలో ఏడుమూర్తులు ధరించి బాలుడు కొయ్యబొమ్మలను పట్టుకున్నట్లుగా పర్వతాల వంటి ఏడు వృషభాలను పట్టుకుని గ్రుద్ది, క్రుమ్మి, అవలీలగా నేల మీదకు కూలద్రోసి, కట్టి ఈడ్చాడు. అది చూసి అచ్చటి వారంతా మెచ్చుకున్నారు.

తెభా-10.2-141-వ.
ఇట్లు వృషభంబుల నన్నింటినిం గట్టి యీడ్చినం జూచి హరికి నగ్నజిత్తు నాగ్నజితి నిచ్చిన విధివత్ప్రకారంబునం బెండ్లి యయ్యె; నా రాజసుందరు లానందంబును బొంది; రా సమయంబున బ్రాహ్మణాశీర్వాదంబులును, గీత పటహ శంఖ కాహళ భేరీ మృదంగ నినదంబులును జెలంగె; నంతనా కోసలేంద్రుండు దంపతుల రథారోహణంబు సేయించి పదివేల ధేనువులును, విచిత్రాంబరాభరణ భూషితలైన యువతులు మూఁడువేలును, దొమ్మిదివేల గజంబులును, గజంబులకు శతగుణంబులైన రథంబులును, రథంబులకు శతగుణంబులైన హయంబులును, హయంబులకు శతగుణాధికంబైన భట సమూహంబును నిచ్చి పుత్తెంచిన; వచ్చునప్పుడు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; వృషభంబులన్ = ఆంబోతులను; అన్నిటినిన్ = అన్నింటిని; కట్టి = కట్టేసి; ఈడ్చినన్ = లాగివేయగా; చూచి = చూసి; హరి = కృష్ణుని; కిన్ = కి; నగ్నజిత్తు = నగ్నజిత్తు; నాగ్నజిత్తిన్ = నాగ్నజిత్తిని; ఇచ్చినన్ = ఇవ్వగా; విధివత్ = పద్దతి; ప్రకారంబునన్ = ప్రకారముగా; పెండ్లియయ్యెన్ = పెండ్లాడెను; ఆ = ఆ యొక్క; రాజ = రాజు యొక్క; సుందరులున్ = భార్యలు; ఆనందంబునున్ = సంతోషమును; పొందిరి = పొందిరి; ఆ = ఆ; సమయంబునన్ = సమయము నందు; బ్రాహ్మణ = విప్రుల; ఆశీర్వాదంబులును = దీవెనలను; గీత = పాటలను; పటహ = తప్పెటలు; శంఖ = శంఖములు; కాహళ = బాకాలు; భేరీ = పెద్దనగారాలు; మృదంగ = మద్దెలలు యొక్క; నినదంబులును = పెద్ద శబ్దములు; చెలంగెన్ = చెలరేగెను; అంతన్ = పిమ్మట; ఆ = ఆ యొక్క; కోసలేంద్రుండు = నగ్నజిత్తు {కోసలేంద్రుడు - కోసలదేశ రాజు, నగ్నజిత్తు}; దంపతులన్ = భార్యాభర్తలను; రథ = రథముపై; ఆరోహణంబు = ఎక్కుట; చేయించి = చేయించి; పదివేల = పదివేలు (10000); ధేనువులును = ఆవులు; విచిత్ర = చిత్రముగ నేసిన; అంబర = వస్త్రములు; ఆభరణ = భూషణములచే; భూషితలు = అలంకరింపబడినవారు; ఐన = అయిన; యువతులు = యౌవనస్త్రీలు; మూడువేలును = మూడువేలమందిని (3000); తొమ్మిదివేల = తొమ్మిదివేలు (9000); గజంబులును = ఏనుగులు; గజంబుల్ = ఏనుగుల; కున్ = కు; శత = నూరు (100); గుణంబులు = రెట్లు; ఐన = అయిన; రథంబులును = రథములు; రథంబుల్ = రథముల; కున్ = కు; శత = నూరు (100); గుణంబులు = రెట్లు; ఐన = అయిన; హయంబులును = గుఱ్ఱములు; హయంబుల్ = గుఱ్ఱముల; కున్ = కు; శత = వంద (100); గుణ = రెట్లు కన్నా; అధికంబు = ఎక్కువ; ఐన = అయిన; భట = సైనికుల; సమూహంబునున్ = సమూహము; ఇచ్చి = ఇచ్చి; పుత్తెంచినన్ = పంపించగా; వచ్చున్ = వచ్చెడి; అప్పుడు = సమయమునందు;
భావము:- ఈవిధంగా శ్రీకృష్ణుడు ఏడువృషభాలను కట్టి ఈడ్వగా, నగ్నజిత్తు తన కుమార్తెను కృష్ణునికి ఇచ్చి వివాహం చేసాడు. ఆ సమయంలో అంతఃపుర కాంతలు అందరూ ఎంతో సంతోషించారు; బ్రాహ్మణులు ఆశీర్వదించారు; మంగళగీతాలు భేరీమృదంగాది వాద్యధ్వనులు మిన్నుముట్టాయి; కోసలరాజు నూతన దంపతులను రథమెక్కించి సాగనంపాడు. పదివేల గోవులను, వస్త్రాభరణాలంకృతలైన మూడువేలమంది కన్యలనూ, తొమ్మిదివేల ఏనుగులనూ, అంతకు వందరెట్లు రథాలనూ, అంతకు వందరెట్లు గుఱ్ఱాలనూ, అంతకు వందరెట్లు సైనికులనూ కానుకగా ఆ రాజు, కృష్ణుడికి ఇచ్చాడు.

తెభా-10.2-142-ఉ.
భూతి యెలర్పఁ గోసలుని పుత్త్రికకై చనుదెంచి తొల్లి యాఁ
బోతులచేత నోటువడి పోయిన భూపతులెల్ల మాధువుం
డా రుణిన్ వరించుట చరావలిచే విని త్రోవ సైన్య సం
ఘాముతోడఁ దాఁకి రరిర్వవిమోచనుఁ బద్మలోచనున్.

టీక:- భూతి = వైభవము; ఎలర్పన్ = అతిశయింపగా; కోసలుని = నగ్నజిత్తు యొక్క; పుత్రిక = కూతురు; కై = కోసము; చనుదెంచి = వచ్చి; తొల్లి = ముందు; ఆబోతుల = ఆంబోతుల; చేతన్ = చేత; ఓటుపడిపోయిన = ఓడిపోయిన; భూపతులు = రాజులు; ఎల్లన్ = అందరు; మాధవుండు = కృష్ణుడు; ఆ = ఆ యొక్క; తరుణిన్ = యువతిని {తరుణి - తరుణ వయస్కురాలు, స్త్రీ}; వరించుటన్ = పెండ్లాడుట; చర = చారుల; అవలి = సమూహము; చేన్ = వలన; విని = విని; త్రోవన్ = దారిలో; సైన్య = సేనా; సంఘాతము = సమూహము; తోడన్ = తోటి; తాకిరి = ఎదిరించిరి; అరి = శత్రువుల; గర్వ = గర్వమును; విమోచనున్ = తొలగించువానిని; పద్మలోచనున్ = పద్మాక్షుని, కృష్ణుని.
భావము:- ఇంతకుపూర్వం నాగ్నజితిని వివాహం చేసుకుందా మని వచ్చి ఆబోతులను ఓడించలేక పరాజితులైన రాజులు అందరూ, మాధవుడు ఆ కన్యను వివాహ మాడిన విషయం గూఢచారుల వలన తెలుసుకుని శత్రువుల గర్వం భంజించే శ్రీకృష్ణుడిని జయించడానికి సైన్యసమేతంగా వచ్చి మార్గమధ్యంలో అడ్డగించారు.

తెభా-10.2-143-ఉ.
దండి నరాతు లెల్ల హరిఁ దాఁకిన నడ్డము వచ్చి వీఁకతో
భంన భూమియందుఁ దన బాంధవులెల్లను సన్నుతింపఁగా
గాండివచాపముక్త విశిఖంబుల వైరుల నెల్లఁ జంపె నా
ఖంలనందనుండు శశకంబుల సింహము చంపుకైవడిన్.

టీక:- దండిన్ = పరాక్రమముతో; ఆరాతులు = శత్రువులు; ఎల్లన్ = అందరు; హరిన్ = కృష్ణుని; తాకినన్ = ఎదిరించగా; అడ్డమువచ్చి = అడ్డమువచ్చి; వీక = పరాక్రమము; తోన్ = తోటి; భండన = యుద్ధ; భూమి = భూమి; అందున్ = లో; తన = అతని; బాంధవులు = బంధువులు; ఎల్లన్ = అందరు; సన్నుతింపన్ = స్తుతించగా; గాండివ = గాండివము అను {గాండివము - అర్జునుని ధనుస్సు పేరు}; చాప = విటినుండి; ముక్త = విడువబడిన; విశిఖంబులన్ = బాణములతో; వైరులన్ = శత్రువులను; ఎల్లన్ = అందరిని; చంపెన్ = చంపెను; ఆఖండలనందనుండు = అర్జునుడు {ఆఖండల నందనుడు - ఆఖండలుడు (పర్వతములను ఖండించినవాడు, ఇంద్రుడు) యొక్క నందనుడు, అర్జునుడు}; శశకంబులన్ = కుందేళ్ళను; సింహము = సింహము; చంపు = చంపు; కైవడిన్ = విధమున.
భావము:- రాజులు అందరూ కలిసి శ్రీకృష్ణుడి పైకి రాగా, అర్జునుడు పరాక్రమంతో ఎదుర్కొన్నాడు గాండీవంనుండి వదలిన బాణాలతో సింహం కుందేళ్ళను సంహరించునట్లు శత్రువులను అందరినీ హతమార్చాడు. బంధువులంతా ఎంతో సంతోషించారు.

తెభా-10.2-144-వ.
ఇట్లు హరి నాగ్నజితిం బెండ్లియై, యరణంబులు పుచ్చుకొని, ద్వారకానగరంబునకు వచ్చి సత్యభామతోడం గ్రీడించుచుండె; మఱియును.
టీక:- ఇట్లు = ఈ విధమున; హరి = హరి; నాగ్నజిత్తిన్ = నాగ్నజిత్తిని; పెండ్లియై = పెండ్లాడి; అరణంబులు = కట్నములు; పుచ్చుకొని = తీసుకొని; ద్వారకా = ద్వారక అను; నగరంబున్ = పట్టణమున; కున్ = కు; వచ్చి = వచ్చి; సత్యభామ = సత్యభామ; తోడన్ = తోటి; క్రీడించుచుండె = విహరించుచుండెను; మఱియును = ఇదికాక.
భావము:- ఇలా శ్రీకృష్ణుడు నాగ్నజితిని పెండ్లాడి, మామగారు ఇచ్చిన కానుకలతో ద్వారకకు వచ్చి సత్యభామతో ఆనందించాడు.