Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నరకాసురుని వధించుట

వికీసోర్స్ నుండి

నరకాసురుని వధించుట

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/నరకాసురుని వధించుట)
రచయిత: పోతన



తెభా-10.2-186-వ.
అయ్యవసరంబునం గంససంహారి మనోహారిణిం జూచి సంతోషకారియుం, గరుణారసావలోకన ప్రసారియు, మధురవచన సుధారస విసారియుం, దదీయ సమరసన్నాహ నివారియునై యిట్లనియె.
టీక:- ఆ = ఆ యొక్క; అవసరంబునన్ = సమయము నందు; కంసారి = కృష్ణుడు {కంసారి - కంసుని చంపినవాడు, కృష్ణుడు}; మనోహారిణిన్ = ప్రియురాలిని; చూచి = చూసి; సంతోష = సంతోషమును; కారియున్ = కలుగజేయువాడును; కరుణారస = దయారసము కల; అవలోకన = చూపులను; ప్రసారియున్ = పరపువాడును; మధుర = తియ్యని; వచన = పలుకు అను; సుధారస = అమృతమును; విసారియున్ = వ్యాపింపజేయువాడును; తదీయ = అతని యొక్క; సమర = యుద్ధ; సన్నాహ = సన్నద్ధతను; నివారియున్ = నిలుపువాడును; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- అలా దానవ సైన్యంపై విజయం సాధించగా కంసుని సంహరించిన వాని మనసును దోచిన వీరనారి సత్యభామను చూసి కృష్ణుడు సంతోషం ఉప్పొంగేలా, కరుణాకటాక్ష వీక్షణలు వీక్షిస్తూ, మృదు మధుర అమృత పూరిత పలుకులతో ఆమె రణోద్రేకాన్ని శాంతింపజేస్తూ ఇలా అన్నాడు....

తెభా-10.2-187-క.
"కొమ్మా! దానవ నాథుని
కొమ్మాహవమునకుఁ దొలఁగె గురువిజయముఁ గై
కొమ్మా! మెచ్చితి నిచ్చెదఁ
గొమ్మాభరణములు నీవు గోరిన వెల్లన్. "

టీక:- కొమ్మా = చిన్నదానా; దానవనాథుని = నరకాసురుని {దానవనాథుడు - రాక్షస రాజు, నరకుడు}; కొమ్ము = పక్షము; ఆహవమునన్ = యుద్ధమున; కున్ = నుండి; తొలగె = పారిపోయెను; గురు = గొప్ప; విజయమున్ = గెలుపును; కైకొమ్మా = చేపట్టుము; మెచ్చితిన్ = మెచ్చుకొంటిని; ఇచ్చెదన్ = ఇస్తాను; కొమ్మా = తీసుకొనుము; ఆభరణములున్ = సొమ్ములు, భూషణములు; నీవు = నీవు; కోరినవి = కోరుకొన్నవి; ఎల్లన్ = అన్నిటిని.
భావము:- “ఓ కాంతా రత్నమా! కాంచితి నీ రణకౌశలము. రాక్షస రాజు సైన్యం మొత్తం ఓడి పాఱిపోయింది. ఇది ఒక గొప్ప విజయం సుమా. అందుకే మెచ్చుకుంటున్నాను. నీకు కావలసిన ఆభరణాలు ఏవైనా సరే కోరుకో ఇచ్చేస్తాను.”
నరకాసుర వధ ఘట్టంలో శ్రీ కృష్ణుడు సత్యభామతో పలికిన పలుకులివి. పద్యం నడక, “కొమ్మా” అనే అక్షర ద్వయంతో వేసిన యమకాలంకారం అమోఘం. చమత్కార భాషణతో చేసిన యిద్దరి వ్యక్తిత్వాల పోషణ ఎంతో బావుంది. సత్యభామ రణకౌశల ప్రదర్శనకు ముందరి దొకటి వెనుకటి దొకటి వేసిన జంట పద్యాలా అన్నట్లు ఉంటుంది “10.2-172-క. లేమా…” పద్యం. ఒకే హల్లు మరల మరల వేస్తే వృత్యనుప్రాస, రెండు అంతకన్న ఎక్కువ హల్లులు అర్థబేధంతో అవ్యవధానంగా వేస్తే ఛేక. శబ్ద బేధం లేకుండా అర్థ బేధంతో మరల మరల వేస్తే యమకం. అవ్యవధానంగా రెండు అంత కన్నా ఎక్కువ హల్లులు అర్థబేధం శబ్దబేధం లేకుండా తాత్పర్య బేధంతో వేస్తే లాట.

తెభా-10.2-188-వ.
అని పలికి సమ్మానరూపంబులును, మోహనదీపంబులును, దూరీకృత చిత్తవిక్షేపంబులునైన సల్లాపంబులం గళావతిం దద్దయుఁ బెద్దఱికంబు సేసి, తత్కరకిసలయోల్లసిత బాణాసనంబు మరల నందుకొనియె; నప్పుడు సురవైరి మురవైరి కిట్లనియె.
టీక:- అని = అని; పలికి = చెప్పి; సమ్మాన = మన్నన; రూపంబులును = విధములు; మోహన = మోహమును; దీపంబులును = కలిగించునవి; దూరీకృత = పోగొట్టబడిన; చిత్త = మనస్సు; విక్షేపంబులున్ = కరవరపాటు కలవి; ఐన = అయినట్టి; సల్లాపంబులన్ = ముచ్చట్లతో; కళావతిన్ = సత్యభామను {కళావతి - కళలు తెలిసినామె, స్త్రీ}; దద్దయున్ = మిక్కిలి; పెద్దఱికంబు = గౌరవించుట; చేసి = చేసి; తత్ = ఆమె; కర = చేతులు అను; కిసలయ = చిగుర్లు యందు; ఉల్లసిత = ప్రకాశించుచున్నట్టి; బాణాసనంబున్ = విల్లును; మరలన్ = తిరిగి; అందుకొనియెన్ = తీసుకొనెను; అప్పుడు = అప్పుడు; సురవైరి = నరకాసురుడు {సురవైరి - దేవతల శత్రువు, రాక్షసుడు}; మురవైరి = కృష్ణుని {మురవైరి - మురాసురుని శత్రువు, కృష్ణుడు}; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా, బహు మన్నన విధములు, అనురాగ కలితములు, మనసులోని కలవరపాటు తొలగించేవీ, ముచ్చటగొలిపేవీ అయిన మాటాలు మాటలాడుతూ, సకలకళా ప్రవీణ అయిన తన ఇష్ట సఖి చేతులో ఉన్న విల్లును గౌరవ పూర్వకముగా శ్రీకృష్ణుల వారు తీసుకున్నారు. అప్పుడు, నరకాసురుడు, మురాసుర సంహారి అయిన శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.

తెభా-10.2-189-క.
"మగువ మగవారి ముందఱ
తనములు సూప రణము మానుట నీకున్
తనము గాదు; దనుజులు
గువల దెసఁ జనరు మగలగ లగుట హరీ! "

టీక:- మగువ = స్త్రీ; మగవారి = పురుషుల; ముందఱన్ = ఎదురుగా; మగతనములు = పౌరుషములు; చూపన్ = చూపిస్తుండగా; రణము = యుద్ధము; మానుట = చేయక పోవుట; నీ = నీ; కున్ = కు; మగతనము = పౌరుషము; కాదు = కాదు; దనుజులు = రాక్షసులు; మగువల = స్త్రీల; దెసన్ = వైపు; చనరు = పోరుకి పోరు; మగల = మగవారికి; మగలు = మొగుళ్ళు, శిక్షించువారు; అగుటన్ = ఔటచేత; హరీ = కృష్ణా.
భావము:- “ఇలా వీర పురుషుల ఎదుట ఒక స్త్రీ పౌరుషం ప్రదర్శిస్తుంటే, యుద్ధం చేయకుండా కూర్చోవడం నీకు మగతనం కాదు సుమా. మేము రాక్షసేశ్వరులం, పరాక్రమశాలులైన మగవారినే శాసించే మొగుళ్ళం, కనుక ఆడవారి జోలికి వెళ్ళం”

తెభా-10.2-190-వ.
అనిన హరి యిట్లనియె.
టీక:- అనినన్ = అని చెప్పగా; హరి = కృష్ణుడు; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- అని పౌరుషంగా మాట్లాడుతున్న నరకాసురుడితో సకల పాపాలాను హరించే శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు...

తెభా-10.2-191-క.
"నకా! ఖండించెద మ
త్కకాండాసనవిముక్త నశరముల భీ
కాయు నిన్ను సుర కి
న్నకాంతలు సూచి నేఁడు నందం బొందన్."

టీక:- నరకా = నరకాసురుడా; ఖండించెద = నరికేయుదును; మత్ = నా యొక్క; కర = చేతి; కాండాసన = వింటినుండి; విముక్త = విడువబడిన; ఘన = గొప్ప; శరములన్ = బాణములతో; భీకర = భయంకరమైన; కాయున్ = దేహము కలవానిని; నిన్నున్ = నిన్ను; సుర = దేవతా; కిన్నర = కిన్నర; కాంతలు = స్త్రీలు; చూచి = చూసి; నేడు = ఇవాళ; నందంబు = ఆనందము; ఒందన్ = పొందగా.
భావము:- “నరకాసురా! నా చేతి వింటి నుండి వెలువడే బాణ పరంపరలతో భయంకర స్వరూపుడ వైన నిన్ను చీల్చిచెండాడుతాను. ఇవాళ, ఇది చూసి దేవ కిన్నర కాంతలు ఎంతో సంతోషిస్తారులే.”

తెభా-10.2-192-వ.
అని పలికి హరి నరకాసురయోధులమీఁద శతఘ్ని యను దివ్యాస్త్రంబు ప్రయోగించిన నొక్క వరుసను వారలందఱు మహావ్యథం జెందిరి; మఱియును.
టీక:- అని = అని; పలికి = పలికి; హరి = కృష్ణుడు; నరకాసుర = నరకాసురుని; యోధుల = వీరుల; మీద = పైన; శతఘ్ని = శతఘ్ని; అను = అనెడి; దివ్య = మహిమాన్వితమైన; అస్త్రంబు = అస్త్రమును; ప్రయోగించినన్ = ప్రయోగించగా; ఒక్కవరుసను = ఒక్కమాటుగా; వారలు = వారు; అందఱున్ = అందరు; మహా = తీవ్ర; వ్యథన్ = వేదనలు; చెందిరి = పొందిరి; మఱియును = ఇంకను.
భావము:- అని పలికిన శ్రీకృష్ణుడు, నరకాసురుడి సైన్యం మీదకి శతఘ్ని అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ఆ శతఘ్ని ధాటికి రాక్షస సైనికు లంతా తీవ్రవేదనలకు లోనయ్యారు. అంతేకాదు.....

తెభా-10.2-193-మ.
విచ్ఛిన్న తురంగమై పటుగదాసంభిన్న మాతంగమై,
యురుచక్రాహత వీరమధ్యపద బాహుస్కంధ ముఖ్యాంగమై,
సుభిత్సైన్యము దైన్యముం బొరయుచున్ శోషించి హైన్యంబుతో
రి మ్రోలన్ నిలువంగ లేక పఱచెన్ హాహానినాదంబులన్.

టీక:- శర = బాణములచేత; విచ్ఛిన్న = మిక్కిలి భేదింపబడిన; తురంగము = గుఱ్ఱములుగలది; ఐ = అయ్యి; పటు = దృఢమైన; గదా = గదలచేత; సంభిన్న = ముక్కలైన; మాతంగము = ఏనుగలు కలది; ఐ = అయ్యి; ఉరు = గొప్ప; చక్రా = చక్రాయుధముచేత; ఆహత = కొట్టబడిన; వీర = శూరుల యొక్క; మధ్య = నడుములు; పద = కాళ్ళు; బాహు = చేతులు; స్కంధ = భుజములు; ముఖ్య = మొదలైన; అంగము = అవయవములు కలది; ఐ = అయ్యి; సురభిత్ = రాక్షస {సురభిత్తు - దేవతల శత్రువు, రాక్షసుడు}; సైన్యము = సేనలు; దైన్యమున్ = దీనత్వమునందు; పొరయుచున్ = పొందుతు; శోషించి = సారము ఎండిపోయి; హైన్యంబు = హీనత్వము; తోన్ = తో; హరి = కృష్ణుని; మ్రోలన్ = ఎదురుగా; నిలువం = నిలబడ; లేక = లేక; పఱచెన్ = పారిపోయెను; హాహా = హాహా అనెడి; నినాదంబులన్ = ఆక్రందనములతో.
భావము:- శ్రీకృష్ణ జనార్దనుడు ప్రయోగించిన శరసమూహాలకు గుఱ్ఱాలు కుప్పకూలాయి; గదాఘాతాలకు మదగజాలు నేలకఱచాయి; చక్రాయుధ విజృంభణానికి సైనికుల కాళ్ళు, చేతులూ, తలలూ తుత్తునియలు అయిపోయాయి; ఈవిధంగా, నరకాసురుడి సైన్యం దైన్యంతో కృష్ణుడి ఎదుట నిలబడలేక హాహాకారాలు చేస్తూ పాఱిపోయింది.

తెభా-10.2-194-వ.
అప్పుడు.
టీక:- అప్పుడు = అప్పుడు.
భావము:- అలా కృష్ణుడి ధాటికి దానవ సైన్యం పలాయనం పాఱిపోతుంటే...

తెభా-10.2-195-ఆ.
మొనసి దనుజయోధముఖ్యులు నిగుడించు
స్త్రసముదయముల నవరేణ్య!
మురహరుండు వరుస మూఁడేసి కోలలన్
ఖండితంబు సేసె గన మందు.

టీక:- మొనసి = పూని; దనుజ = రాక్షస; యోధ = వీరులలో; ముఖ్యులు = ముఖ్యమైనవారు; నిగుడించు = ప్రయోగించు; శస్త్ర = ఆయుధ; సముదయములన్ = సమూహమును; జనవరేణ్య = రాజా; మురహరుడు = కృష్ణుడు {మురహరుడు - మురాసురుని సంహరించినవాడు, కృష్ణుడు}; వరుసన్ = వరసపెట్టి; మూడేసి = మూడు (3) చొప్పున; కోలలన్ = బాణములతో; ఖండితంబు = ముక్కలు చేయబడినవిగా; చేసెన్ = చేసెను; గగనము = ఆకాశము; అందున్ = లోనే.
భావము:- ఓ మహారాజా! పరీక్షిత్తూ! దైత్యవీర ప్రముఖులు శ్రీకృష్ణుడి మీద అనేక ఆయుధాలను ప్రయోగించారు. రాక్షసులు ప్రయోగించే వాటన్నింటినీ గాల్లోనే, మురారి మూడేసి బాణాలు ప్రయోగించి ఖండించి వేశాడు.

తెభా-10.2-196-క.
వెన్నుని సత్యను మోచుచుఁ
న్నుగఁ బద నఖర చంచు క్షాహతులన్
భిన్నములు సేసె గరుడుఁడు
న్నిన గజసముదయములఁ బౌరవముఖ్యా!

టీక:- వెన్నుని = కృష్ణుని {వెన్నుడు (వి) - విష్ణువు (ప్ర)}; సత్యను = సత్యభామను; మోచుచున్ = మోస్తూ; పన్నుగన్ = నేర్పుగా; పద = కాళ్ళ; నఖర = గోళ్ళు; చంచు = ముక్కు; పక్షా = రెక్కలచే; హతులన్ = కొట్టుటచేత; భిన్నములున్ = భేదింపబడినవానిగా; చేసెన్ = చేసెను; గరుడుడు = గరుత్మంతుడు; పన్నిన = యుద్ధవ్యూహాలలో పన్నిన; గజ = ఏనుగుల; సముదయములన్ = సమూహములను; పౌరవముఖ్యా = పరీక్షిన్మహారాజా {పౌరవముఖ్యుడు - పురువంశస్థులలో ముఖ్యుడు, పరీక్షిత్తు}.
భావము:- ఓ పురువంశోత్తమా! పరీక్షన్మహారాజా! సత్యభామ శ్రీకృష్ణులను తన మూపున మోస్తూనే, గరుత్మంతుడు తన కఱకు గోళ్ళతో, వాడి ముక్కుతో, రెక్కల దెబ్బలతో శత్రుసైన్యంలోని ఏనుగుల గుంపుల్ని చిన్నాభిన్నం చేసాడు.

తెభా-10.2-197-వ.
మఱియును విహగరాజపక్షవిక్షేపణసంజాతవాతంబు సైరింపం జాలక హతశేషంబైన సైన్యంబు పురంబు సొచ్చుటం జూచి, నరకాసురుండు మున్ను వజ్రాయుధంబుం దిరస్కరించిన తనచేతి శక్తిం గొని గరుడుని వైచె; నతండును విరులదండ వ్రేటునఁ జలింపని మదోద్దండ వేదండంబునుంబోలె విలసిల్లె; నయ్యవసరంబున గజారూఢుండై కలహరంగంబున
టీక:- మఱియును = ఇంకను; విహగరాజ = గరుత్మంతుని; పక్ష = రెక్కలచే; విక్షేపణ = ఆడించుటచేత; సంజాత = పుట్టిన; వాతంబు = గాలిని; సైరింపంజాలక = సహింపలేక; హత = చనిపోగా; శేషంబు = మిగిలినది; ఐన = అగు; సైన్యంబు = సైన్యము, దండు; పురంబున్ = నగరములోనికి; చొచ్చుటన్ = దూరుటను; చూచి = చూసి; నరక = నరకుడు అను; అసురుండు = రాక్షసుడు; మున్ను = మునుపు; వజ్రాయుధంబున్ = వజ్రాయుధమును; తిరస్కరించిన = అలక్ష్యముచేసిన; తన = అతని యొక్క; చేతి = చేతనున్న; శక్తిన్ = శక్తి అను ఆయుధముతో; కొని = పూని; గరుడుని = గరుత్మంతుని; వైచెన్ = కొట్టెను; అతండును = అతను; విరుల = పూల; దండ = మాల యొక్క; వ్రేటునన్ = దెబ్బకు; చలింపని = చలించనట్టి; మద = మదముచేత; ఉద్దండ = అతిశయించిన; వేదండంబునున్ = ఏనుగును; పోలెన్ = వలె; విలసిల్లెన్ = విరాజిల్లెను; ఆ = ఆ; అవసరంబునన్ = సమయము నందు; గజ = ఏనుగను; ఆరూఢుండు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; కలహ = యుద్ధ; రంగంబునన్ = క్షేత్రమున.
భావము:- గరుత్మంతుడి రెక్కల విసురు వలన పుట్టిన గాలివేగానికి నిలువలేక, చావగా మిగిలిన నరకుడి సైనికులు పట్టణంలోనికి పాఱిపోయారు. అది చూసి నరకాసురుడు దేవేంద్రుని వజ్రాయుధాన్ని తిరస్కరించిన తన చేతిలోని శక్తి అనే ఆయుధాన్ని, గరుత్మంతుడి మీద ప్రయోగించాడు. అంతటి దెబ్బకూ, పూలదండ దెబ్బకు చలించని మదపుటేనుగులాగ గరుత్మంతుడు ఏమాత్రం చెక్కుచెదరక భాసిల్లాడు. ఆ సమయంలో యుద్ధరంగంలో ఓ మదగజాన్ని ఎక్కి.....

తెభా-10.2-198-మ.
దేభేంద్రము నెక్కి భూమిసుతుఁ డా క్రాయుధున్ వైవ శూ
ము చేఁబట్టిన, నంతలోన రుచిమాలాభిన్న ఘోరాసురో
త్త చక్రంబగు చేతిచక్రమున దైత్యధ్వంసి ఖండించె ర
త్నయోదగ్ర వినూత్నకుండల సమేతంబైన తన్మూర్ధమున్.

టీక:- సమద = మదించిన; ఇభ = ఏనుగు; ఇంద్రమున్ = శ్రేష్ఠమును; ఎక్కి = ఎక్కి; భూమిసుతుడు = నరకుడు; ఆ = ఆ ప్రసిద్ధుడైన; చక్రాయుధున్ = కృష్ణుని {చక్రాయుధుడు - చక్రాయుధము ధరించువాడు, విష్ణువు}; వైవన్ = కొట్టుటకు; శూలమున్ = శూలమును; చేబట్టినన్ = ధరించగా; అంతలోనన్ = ఆలోపల; రుచి = కాంతుల యొక్క; మాలా = సమూహముచేత; ఆభిన్న = చీల్చబడిన; ఘోర = భీకరులైన; అసుర = రాక్షసులలో; ఉత్తమ = శ్రేష్ఠుల; చక్రంబు = సమూహముకలది; అగు = ఐన; చేతి = తనచేతనున్న; చక్రమునన్ = చక్రముచేత; దైత్యధ్వంసి = కృష్ణుడు {దైత్యధ్వంసి - రాక్షసులను సంహరించువాడు, విష్ణువు}; ఖండించెన్ = నరికెను; రత్నమయ = మణులుపొదిగిన; ఉదగ్ర = శ్రేష్ఠమైన; వినూత్న = సరికొత్త; కుండల = చెవికుండలములతో; సమేతంబు = కూడినది; ఐన = అయినట్టి; తత్ = అతని యొక్క; మూర్ధమున్ = తలను.
భావము:- అలా మదగజాన్ని ఎక్కి వస్తున్న నరకాసురుడు, చక్రాయుధుడి మీద ప్రయోగించడానికి శూలాన్నిపట్టుకుని పైకెత్తే లోపునే, శ్రీకృష్ణుడు ఎందరో రాక్షసవీరులను ఖండించిన తన చక్రాయుధాన్ని వాడిమీద ప్రయోగించాడు. ఆ చక్రం రత్నాలు పొదిగిన సరిక్రొత్త కుండలాలతో కూడిన నరకుడి తలని తెగనరికింది.

తెభా-10.2-199-శా.
"ల్లాలం గిటియైన కాలమున మున్నే నంచు ఘోషింతు వో!
ల్లీ! నిన్నుఁ దలంచి యైన నిచటం న్నుం గృపం గావఁడే!
చెల్లంబో! తలఁ ద్రుంచె"నంచు నిల నాక్షేపించు చందంబునన్
ద్రెళ్లెం జప్పుడు గాఁగ భూమిసుతుఁ డుద్దీప్తాహవక్షోణిపై.

టీక:- ఇల్లాలన్ = భార్యను; కిటి = వరాహావతారుడు; ఐన = అయినట్టి; కాలమునన్ = కాల మందు; మున్ను = పూర్వము; ఏన్ = నేను; అంచున్ = అని; ఘోషింతువు = చాటించి చెప్పుదువు; ఓ = ఓ; తల్లీ = అమ్మా; నిన్నున్ = నిన్ను; తలంచి = తలచుకొని; ఐనన్ = అయినప్పటికి; ఇచటన్ = ఇక్కడ; తన్ను = తనను; కృపన్ = దయతో; కావడే = కాపాడలేదు కదా; చెల్లంబో = అయ్యో; తలన్ = శిరస్సును; త్రుంచెన్ = నరికి వేసెను; అంచున్ = అని; ఇలన్ = భూదేవిని; ఆక్షేపించు = ఆక్షేపిస్తున్న; చందంబునన్ = విధముగా; త్రెళ్ళెన్ = తూలిపడెను; చప్పుడు = పెద్దశబ్దము; కాగన్ = కలుగునట్లు; భూమిసుతుడు = నరకుడు {భూమి సుతుడు - భూదేవి కొడుకు, నరకుడు}; ఉద్దీప్త = ప్రకాశించుచున్న; ఆహవ = యుద్ధ; క్షోణి = క్షేత్రము; పై = మీద.
భావము:- “అమ్మా! వరాహావతారంలో నేను విష్ణుమూర్తి ఇల్లాలి నని చాటిచెప్పేదానవు కదమ్మా. కనీసం నిన్ను చూసి అయినా దయచూపకుండా, అయ్యో! అయిపోయింది. ఇదిగో చూడు శ్రీకృష్ణుడు నాతల త్రుంచా”డని భూదేవిని అధిక్షేపిస్తున్నట్లుగా నరకాసరుడు యుద్ధభూమిలో నేలకూలాడు.

తెభా-10.2-200-క.
"కంటిమి నరకుడు వడఁగా
మంటిమి నేఁ"డనుచు వెస నర్త్యులు మునులున్
మింటం బువ్వులు గురియుచుఁ
బంటింపక పొగడి రోలిఁ ద్మదళాక్షున్.

టీక:- కంటిమి = చూసితిమి; నరకుడు = నరకాసురుడు; పడగా = చావగా; మంటిమి = బతికిపోతిమి; నేడు = ఇవాళ; అనుచున్ = అని పలుకుచు; వెసన్ = వేగముగా; అమర్త్యులు = దేవతలు; మునులున్ = మునులు; మింటన్ = ఆకాశమునుండి; పువ్వులు = పూలను; కురియుచున్ = వర్షించుచు, చల్లుచు; పంటింపక = తడబడకుండా; పొగిడిరి = పొగిడిరి; ఓలిన్ = క్రమముగా; పద్మదళాక్షున్ = కృష్ణుని {పద్మదళాక్షుడు - పద్మముల రేకుల వంటి కన్నులు కలవాడు, కృష్ణుడు}.
భావము:- “అమ్మయ్యా! నరకాసురుడి చావు కనులారా కన్నాము. ఇంక ఇవాళ మనం బ్రతికిపోయాము.” అని దేవతలూ, మునీంద్రులూ ఆకాశం నుండి వరుసగా పూలవర్షం కురిపిస్తూ పద్మాక్షుని స్తుతించారు.

తెభా-10.2-201-వ.
అంత భూదేవి వాసుదేవుని డగ్గఱ నేతెంచి జాంబూనదరత్న మండితంబైన కుండలంబులును, వైజయంతియను వనమాలయును, వరుణదత్తంబయిన సితచ్ఛత్త్రంబును, నొక్క మహారత్నంబును సమర్పించి మ్రొక్కి భక్తి తాత్పర్యంబులతోడం గరకమలంబులు ముకుళించి, విబుధవందితుండును, విశ్వేశ్వరుండును నైన దేవదేవుని నిట్లని వినుతించె.
టీక:- అంతన్ = అంతట; భూదేవి = భూదేవి; వాసుదేవుని = కృష్ణుని {వాసుదేవుడు - వసుదేవుని కుమారుడు, కృష్ణుడు}; డగ్గఱన్ = దగ్గరకు; ఏతెంచి = వచ్చి; జాంబూనద = బంగారముతోను {జాంబూనదము - మేరుపర్వత సమీపమున ఉన్న నేరేడుపండ్ల రసముచే పాఱిన నది యందు పుట్టినది, బంగారము}; రత్న = మణులతోను; మండితంబు = అలంకరింపబడినవి; ఐన = అయిన; కుండలంబులును = చెవికుండలములను; వైజయింతి = వైజయంతి; అను = అనెడి; వనమాలయును = వనమాలను; వరుణ = వరుణునిచే; దత్తంబు = ఇయ్యబడినది; అయిన = ఐన; సిత = తెల్లని; ఛత్రంబును = గొడుగు; ఒక్క = ఒకానొక; మహా = గొప్ప; రత్నంబును = మణిని; సమర్పించి = ఇచ్చి; మ్రొక్కి = నమస్కరించి; భక్తి = భక్తితోటి; తాత్పర్యంబుల = లగ్నమైన అభిప్రాయము; తోడన్ = తోటి; కర = చేతులు అను; కమలంబులున్ = పద్మములను; ముకుళించి = జోడించి; విబుధ = దేవతలచే; వందితుండును = కొనియాడబడువాడు; విశ్వేశ్వరుండును = సర్వము నేలువాడు; ఐన = అగు; దేవదేవుని = కృష్ణుని {దేవ దేవుడు - దేవతలకే దేవుడు, విష్ణువు}; ఇట్లు = ఈ విధముగా; అని = అని; వినుతించెన్ = స్తుతించెను.
భావము:- అప్పుడు నరకాసుర సంహారం కాగానే, భూదేవి వాసుదేవుడు కృష్షుడి దగ్గరకు వచ్చింది. అతివిలువైన రత్నాలు పొదిగిన బంగారు కుండలాలనూ, వైజయంతి అనే వనమాలనూ, వరుణుడు ఇచ్చిన తెల్లని గొడుగునూ, ఒక గొప్ప రత్నాన్ని ఇచ్చింది. నమస్కరించి, భక్తిభావంతో ఆ దేవదేవుడిని ఈవిధంగా స్తుతించింది.

తెభా-10.2-202-సీ.
"అంభోజనాభున కంభోజనేత్రున-
కంభోజమాలాసన్వితునకు
నంభోజపదున కనంతశక్తికి వాసు-
దేవునకును దేవదేవునకును
క్తులు గోరినభంగి నే రూపైనఁ-
బొందువానికి నాదిపురుషునకును
ఖిల నిదానమై యాపూర్ణవిజ్ఞానుఁ-
యినవానికిఁ, బరమాత్మునకును,

తెభా-10.2-202.1-ఆ.
ధాతఁ గన్న మేటితండ్రికి, నజునికి,
నీకు వందనంబు నే నొనర్తు
నిఖిలభూతరూప! నిరుపమ! యీశ! ప
రాపరాత్మ మహిత! మితచరిత!

టీక:- అంభోజనాభున్ = పద్మనాభున {అంభోజనాభుడు - జగత్సృష్టికి కారణమైన బ్రహ్మ జనించిన కమలము నాభియందు కలవాడు, విష్ణుమూర్తి}; కిన్ = కి; అంభోజనేత్రున్ = పద్మాక్షున; కిన్ = కు; అంభోజ = పద్మముల; మాలా = దండ; సమన్వితున్ = కలిగిఉన్నవాని; కున్ = కి; అంభోజ = పద్మములవంటి; పదున్ = పాదములు కలవాని; కున్ = కి; అనంత = అంతులేని {అనంతశక్తి - సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వభోక్తృత్వ సర్వ నియంతృత్వ సర్వనియామక సర్వాంతర్యామిత్వ సర్వసృష్టత్వ సర్వపాలక సర్వసంహారకాది మేరలేని సమర్థత కలవాడు, విష్ణువు}; శక్తి = శక్తి కలవాని; కిన్ = కి; వాసుదేవున్ = కృష్ణుని {వాసుదేవుడు - శ్లో. వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్రయం, సర్వభూతనివాసోసి వాసుదేవ నమోస్తుతే. విష్ణువు, ప్రపంచమును లోపలుంచుకొని ప్రపంచమదెల్లడల సర్వభూతములందు వసించి ఉండువాడు, విష్ణువు మరింకొక విధమున వసుదేవుని కొడుకు, కృష్ణుడు}; కును = కి; దేవదేవున్ = దేవుళ్ళకే దేవుని; కును = కి; భక్తులు = భక్తులు; కోరిన = అపేక్షించిన; భంగిన్ = విధముగా; ఏ = ఎట్టి; రూపు = స్వరూపము {ఏరూపైనపొందువాడు - జలచర స్థలచర ఉభయచర జంతు మానవాది ఎట్టి ఆకృతులైనను సూక్ష్మ స్థూలాది రూపములైనను చేపట్టువాడు}; ఐనన్ = అయినను; పొందు = ధరించెడి; వాని = వాని; కిన్ = కి; ఆదిపురుషున్ = మూలకారణభూతుడైనవాని; కును = కి; అఖిల = సమస్తమునకు; నిదానము = ఆధారభూతమై; ఆపూర్ణ = సంపూర్ణమైన; విజ్ఞానుడు = విజ్ఞానముతనైనవాడు; ఐన = అయిన; వాని = వాని; కిన్ = కి; పరమాత్మున్ = పరబ్రహ్మ ఐనవాని; కును = కి;
ధాతన్ = బ్రహ్మను; కన్న = పుట్టించిన; మేటి = గొప్ప; తండ్రి = తండ్రి; కిన్ = కి; అజున్ = పుట్టుక లేనివాని; కిన్ = కి; నీ = నీ; కున్ = కు; వందనంబు = నమస్కారము; నేన్ = నేను; ఒనర్తున్ = చేసెదను; నిఖిల = సమస్త; భూత = జీవ; రూప = స్వరూపుడ; నిరుపమ = పోలికలకతీతమైనవాడ; ఈశ = సర్వనియామక; పరా = పరాప్రకృతియు; అపరా = అపరాప్రకృతియి; ఆత్మ = స్వరూపమైనవాడ; మహిత = మిక్కిలగొప్పవాడ; అమిత = మేరలేని; చరిత = వర్తనకలవాడ.
భావము:- "సర్వభూత స్వరూపుడా! సాటిలేని వాడ! పరమేశ్వరా! అపర పరాలు తానే యైన మహితాత్ముడా! మేరలులేని వర్తనలు కలవాడ! నీవు పద్మనాభుడవు; పద్మాక్షుడవు; పద్మ మాలా విభూషణుడవు; పద్మపాదుడవు; అనంతశక్తి స్వరూపుడవు[1]; వసుదేవు సుతుడవు[2]; దేవాధిదేవుడవు; భక్తులు కోరిన రూపం ధరించ గల వాడవు[3]; ఆది పురుషుడవు; సమస్త జగత్తుకు కారకుడవు; పరిపూర్ణవిజ్ఞాన వంతుడవు; పరమాత్మవు; సృష్టికర్తల పుట్టుకకు కారణ మైన వాడవు; పుట్టుక లేనివాడవు; అయినట్టి నీకు నేను నమస్కరిస్తున్నాను. -
[1] అనంతశక్తి - సర్వజ్ఞత్వ సర్వేశ్వరత్వ సర్వ భోక్తృత్వ సర్వ నియంతృత్వ సర్వ నియామకత్వ సర్వాంతర్యామిత్వ సర్వ సృష్టత్వ సర్వపాలకత్వ సర్వ సంహారకత్వాది మేర లేని సమర్థతలు కల వాడు, విష్ణువు -
[2] వాసుదేవుడు - శ్లో. వాసనాద్వాసుదేవస్య వాసితంతే జగత్రయం, సర్వభూతని వాసోసి వాసుదేవ నమోస్తుతే. విష్ణువు, ప్రపంచమును లోప లుంచుకొని ప్రపంచ మందు ఎల్లడల సర్వ భూతము లందు వసించి ఉండు వాడు, విష్ణువు మరింకొక విధమున వసు దేవుని కొడుకు, కృష్ణుడు -
[3] ఏ రూపైన పొందు వాడు - జలచర స్థలచర ఉభయచర జంతు మానవాది ఎట్టి ఆకృతు లైనను సూక్ష్మ స్థూలాది రూపము లైనను చేపట్టు వాడు"

తెభా-10.2-203-వ.
దేవా! నీవు లోకంబుల సృజియించుటకు రజోగుణంబును, రక్షించుటకు సత్త్వగుణంబును, సంహరించుటకుఁ దమోగుణంబును ధరియింతువు; కాలమూర్తివి, ప్రధానపూరుషుండవు, పరుండవు, నీవ; నేనును, వారియు, ననిలుండు, వహ్నియు, నాకాశంబుఁ, భూతతన్మాత్రలును, నింద్రియంబులును, దేవతలును, మనంబును, గర్తయును, మహత్తత్త్వంబును, జరాచరంబైన విశ్వంబును, నద్వితీయుండవైన నీ యంద సంభవింతుము.
టీక:- దేవా = భగవంతుడా; నీవు = నీవు; లోకంబులన్ = సర్వలోకములను; సృజియించుట = సృష్టించుట; కున్ = కోసము; రజోగుణంబును = రజోగుణమును (బ్రహ్మ); రక్షించుట = కాపాడుట; కున్ = కు; సత్త్వగుణంబును = సత్త్వగుణము (విష్ణు); సంహరించుట = నాశముచేయుట; కున్ = కు; తమోగుణంబున్ = తమోగుణము (శివుడు); ధరియింతువు = స్వీకరింతువు; కాల = కాలము; మూర్తివి = స్వరూపమైనవాడవు; ప్రధానపూరుషుండవు = ప్రకృతి పురుషుడు రూపముగా కలవాడవు; పరుండవు = సర్వాతీతమైనవాడవు; నీవ = నీవే; నేనును = నేను (భూమి); వారియున్ = జలము; అనిలుండు = వాయువు; వహ్నియున్ = అగ్ని; ఆకాశంబున్ = ఆకాశము; భూత = జీవుడు {పంచభూతము - 1భూమి 2జలము 3వాయువు 4అగ్ని 5ఆకాశము}; తన్మాత్రలు = పంచతన్మాత్రలు {పంచతన్మాత్రలు - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంధము}; దేవతలును = ఇంద్రియాధిదేవతలు; మనంబును = మనస్సు; కర్తయును = అహంకారము; మహత్త్త్వంబును = బుద్ధి; చరా = చరించగలిగినవి; అచర = చరించలేనివి; ఐన = అయిన; విశ్వంబునున్ = ప్రపంచము; అద్వితీయుండవు = రెండవది లేనివాడు; ఐన = అయిన; నీ = నీ; అందున్ = అందే; సంభవింతుము = పుట్టుదుము.
భావము:- ఓ దేవా! నీవు ప్రపంచాన్ని సృష్టించడం కోసం రజోగుణాన్ని రక్షించడం కోసం సత్త్వగుణాన్ని నశింపజేయడం కోసం తమోగుణాన్ని ధరిస్తావు. నీవు కాలమూర్తివి; ప్రధానవ్యక్తివి; నరుడవు; నేను (భూమి), నీరు, అగ్ని, వాయువు, ఆకాశము; శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు; అనగా పంచేంద్రియాలు, పంచ తన్మాత్రలు, ఇంద్రియాలు; దేవతలు; మనస్సు; కర్త; మహాత్తత్వం; ఈ చరాచరమయమైన సమస్త ప్రపంచం; అద్వితీయుడవైన నీ యందే ఉద్భవిస్తాము.

తెభా-10.2-204-చ.
నిటు సూడుమా! నరకదైత్యుని బిడ్డఁడు వీఁడు; నీ దెసన్
ముననున్నవాఁడు; గడుబాలుఁ; డనన్యశరణ్యుఁ; డార్తుఁ; డా
శ్రరహితుండు; దండ్రి క్రియ శౌర్యము నేరఁడు; నీ పదాంబుజ
ద్వయిఁ బొడఁగాంచె భక్తపరతంత్ర! సువీక్షణ! దీనరక్షణా! "

టీక:- దయన్ = కృపాదృష్టితో; ఇటు = ఇటుపక్క; చూడుమా = చూడు; నరకదైత్యుని = నరకాసురుని; బిడ్డడు = కొడుకు; వీడు = ఇతడు; నీ = నీ; దెసన్ = ఎడ; భయమునన్ = భయముతో; ఉన్నవాడు = ఉన్నాడు; కడున్ = మిక్కిలి; బాలుడు = చిన్నవాడు; అనన్యశరణ్యుడు = నీవు తప్ప ఇతర రక్షకులు లేనివాడు; ఆర్తుడు = దుఃఖములో ఉన్నవాడు; ఆశ్రయరహితుడు = ఏ ప్రాపు లేనివాడు; తండ్రి = కన్నతండ్రి; క్రియన్ = వలె; శౌర్యము = వీరత్వము చూప; నేరడు = శక్తుడు కాడు; నీ = నీ యొక్క; పద = పాదము లనెడి; అంబుజ = పద్మముల; ద్వయిన్ = జంటను; పొడగాంచెన్ = పొందెను; భక్తపరతంత్ర = కృష్ణా {భక్తపరతంత్రుడు - భక్తుల యెడ సాభిప్రాయము కలవాడు, విష్ణువు}; సువీక్షణ = సామరస్య దృష్టి కలవాడ; దీనరక్షకా = దీనులను కాపాడెడి వాడ.
భావము:- ఓ భక్తమందారా! ధనరక్షణా! దయతో ఇటు చూడు ఈ బాలుడు నరకుని కుమారుడు; నిన్ను చూసి బెదిరిపోతున్నాడు; చిన్న పిల్లవాడు; నీవు తప్ప వేరే దిక్కులేనివాడు; ఆర్తినొందిన వాడు; ఆశ్రయం లేనివాడు; తండ్రిలాగ పరాక్రమవంతుడు కాదు; నీ పాదాలనే ఆశ్రయించుకున్నాడు.”

తెభా-10.2-205-వ.
అని యిట్లు భూదేవి భక్తితోడ హరికిం బ్రణమిల్లి వాక్కుసుమంబులం బూజించిన నర్చితుండై భక్తవత్సలుం డయిన పరమేశ్వరుండు నరకపుత్త్రుం డయిన భగదత్తున కభయంబిచ్చి, సర్వసంపదలొసంగి నరకాసురగృహంబు ప్రవేశించి యందు.
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; భూదేవి = భూదేవి; భక్తి = భక్తి; తోడన్ = తోటి; హరి = కృష్ణుని; కిన్ = కి; ప్రణమిల్లి = నమస్కరించి; వాక్ = పలుకులు అను {వా క్కుసుమంబులం బూజించు - మాట లనెడి పూలతో పూజించు, స్తోత్రము చేయు}; సుమంబులన్ = పూలతో; పూజించినన్ = పూజించగా; అర్చితుడు = పూజింపబడిన వాడు; ఐ = అయ్యి; భక్తవత్సలుండు = భక్తుల ఎడ వాత్సల్యము కలవాడు; అయిన = ఐనట్టి; పరమేశ్వరుండు = కృష్ణమూర్తి; నరక = నరకుని; పుత్రుండు = కొడుకు; అయిన = ఐనట్టి; భగదత్తున్ = భగదత్తున; కున్ = కు; అభయంబు = శరణ్యము; ఇచ్చి = ఇచ్చి; సర్వ = సమస్తమైన {సర్వసంపదలు - అష్టైశ్వర్యములు, 1దాసీజనము 2భృత్యులు 3పుత్రులు 4మిత్రులు 5బంధువులు 6వాహనములు 7ధనము 8ధాన్యము}; సంపదలున్ = సంపదలను; ఒసంగి = ఇచ్చి; నరకాసుర = నరకాసురుని; గృహంబున్ = నివాసము; ప్రవేశించి = లోనికి వెళ్ళి; అందున్ = అక్కడ.
భావము:- ఈవిధంగా భూదేవి భక్తితో హరికి నమస్కరించి, మాట లనే పూలతో పూజించగా, భక్తవత్సలు డైన శ్రీకృష్ణుడు నరకుని కుమారు డైన భగదత్తునికి అభయ మిచ్చి; సర్వ సంపదలనూ ప్రసాదించాడు. అనంతరం నరకాసుని సౌధంలోకి ప్రవేశించాడు.