పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కుంతీదేవి దుఃఖంబు
కుంతీదేవి దుఃఖంబు
←శమంతకపంచకమున కరుగుట | తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కుంతీదేవి దుఃఖంబు) రచయిత: పోతన |
నందాదులు చనుదెంచుట→ |
తెభా-10.2-1054-క.
"ఓ యన్న! పాండుతనయులు
నీ యల్లుం డ్రడవులందు నెఱి మృగములతోఁ
బాయని యిడుమలఁ బడఁ గరు
ణాయత్తుల రగుచు మీర లరయఁగ వలదే?"
టీక:- ఓ = ఓ; అన్న = సోదరుడా; పాండు = పాండురాజు యొక్క; తనయులు = పుత్రులు; నీ = నీ యొక్క; అల్లుండ్రు = మేనల్లుళ్ళు; అడవులు = అరణ్యాలు; అందున్ = లో; నెఱిన్ = వక్రముగా, అక్రమముగా; మృగముల్ = క్రూరజంతువుల; తోన్ = తోటి; పాయని = వదలని; ఇడుములన్ = ఆపదలను; పడన్ = పొందుతుండగా; కరుణ = దయ; ఆయత్తులు = కలిగినవారు; అగుచున్ = ఔతు; మీరలు = మీరు; అరయగన్ = విచారించుట; వలదే = వద్దా, అవసరము.
భావము:- “అన్నయ్యా! పాండురాజుకు పుత్రులు, నీకు అల్లుళ్ళూ అయిన పాండవులు కీకారణ్యాలలో భీకరమృగాల మధ్య పలుబాధలు పడతున్నారు. వారిని మీరు దయార్ద్రహృదయంతో చూడాలి కదా.”
తెభా-10.2-1055-వ.
అని బహుప్రకారంబుల సంతాపించుచు మఱియు నిట్లనియె.
టీక:- అని = అని; బహు = పెక్కు; ప్రకారంబులన్ = విధముల; సంతాపించుచున్ = దుఃఖించుచు; మఱియున్ = ఇంకను; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అంటూ కుంతీదేవి పరిపరివిధాలుగా పరితపిస్తూ వసుదేవుడితో ఇంకా ఇలా అన్నది.
తెభా-10.2-1056-క.
"అతిబలవంతపు విధి దాఁ
బ్రతికూలంబైనఁ గలరె బంధువు?"లనుచున్
ధృతి గలఁగ బాష్పజలపూ
రితలోచన యగు సహోదరిం జూచి యనెన్.
టీక:- అతి = మిక్కిలి; బలవంతపు = బలము గలది ఐన; విధి = దైవము; తాన్ = తాను; ప్రతికూలంబు = అనుకూలము కానిది; ఐననన్ = అయినప్పుడు; కలరె = సాయం ఉంటారా,ఉండరు; బంధువులు = బంధువులు; అనుచున్ = అంటు; ధృతి = ధైర్యము; కలగన్ = కలతచెందగా; బాష్పజల = కన్నీట; పూరిత = నిండిన; లోచన = కన్నులు కలామె; అగు = ఐన; సహోదరిన్ = చెల్లెలును; చూచి = చూసి; అనెన్ = చెప్పెను.
భావము:- “బహు బలవత్తరమైన విధి, ప్రతికూలంగా ఉంటే, ఇంకా బంధువులంటూ ఎవరుంటారులే?” అంటూ కంటతడి పెడుతున్న సోదరి కుంతితో వసుదేవుడు ఇలా అన్నాడు.
తెభా-10.2-1057-సీ.
"తల్లి! నీ కేల సంతాపింప మనమునఁ-
దలవఁక విధినేల సొలసె? దింత
యఖిల నియామకుండగు నీశ్వరుఁడు మాయ-
యవనికాంతరుఁడైన యట్టి సూత్ర
ధారుని కైవడిఁ దగిలి నటింపఁగ-
మనుజులు కీలుబొమ్మలు దలంపఁ;
గావున విధిసేఁతఁ గడిచి వర్తింపంగ-
దేవతలకునైనఁ దీఱ; దట్లు
తెభా-10.2-1057.1-తే.
క్రోధచిత్తుండు కంసుఁడు బాధవఱుప
నిలయములు దప్పి నే మడవులఁ జరింప
ఘనకృపానిధి యీ హరి గలుగఁబట్టి
కోరి మా కిండ్లు గ్రమ్మఱఁ జేరఁ గలిగె. "
టీక:- తల్లి = అమ్మా; నీ = నీ; కున్ = కు; ఏలన్ = ఎందుకు; సంతాపించన్ = వగచుట; మనమునన్ = మనస్సునందు; తలవక = ఆలోచించుకోకకుండ; విధిన్ = దేవుని; ఏలన్ = ఎందుకు; సొలసెదు = సంతాపించెదవు; ఇంత = ఇంత అధికముగా; అఖిల = సర్వ; నియామకుండు = నియమించువాడు; అగు = ఐన; ఈశ్వరుడు = భగవంతుడు; మాయన్ = మాయచేత; అవనికా = తెర; అంతరుండు = చాటుననున్నవాడు; ఐన = అయిన; అట్టి = అటువంటి; సూత్రధారుని = దర్శకుడి, సూత్రధారుడి; కైవడిన్ = వలె; తగిలి = పూని; నటింపగన్ = నడిపిస్తుండగా; మనుజులు = మానవులు; కీలుబొమ్మలు = కీలుబొమ్మలు; తలపన్ = తరచిచూసినచో; కావునన్ = కాబట్టి; విధి = దైవము; చేతన్ = కృత్యమును; కడచి = మీరి; వర్తింపంగ = మెలగుటకు; దేవతలు = దేవతలు; కున్ = కు; ఐననన్ = అయినప్పటికి; తీఱదు = వీలుకాదు; అట్లు = ఆ విధముగా.
క్రోధ = కోపము కల; చిత్తుండు = మనస్సు కలవాడు; కంసుడు = కంసుడు; బాధపఱున్ = బాధపెట్టగా; నిలయములున్ = ఇళ్ళు; తప్పి = వదలిపెట్టి; నేము = మేము; అడవులన్ = అడవులలో; చరింపన్ = తిరుగుచుండగా; ఘన = బహుమిక్కిలి; కృపా = దయకు; నిధి = ఉనికిపట్టైనవాడు; ఈ = ఈ; హరిన్ = కృష్ణుని; కలుగబట్టి = ఉండుటవలన; కోరి = అపేక్షించి; మా = మా; కున్ = కు; ఇండ్లు = గృహములు; క్రమ్మఱన్ = మరల; కలిగెన్ = కలిగినవి.
భావము:- “తల్లీ! కుంతీ! నీవు బాధపడడం దేనికమ్మా? విధిని నిందించడ మెందుకు? అన్నింటికీ కర్త ఈశ్వరుడే; మాయ అనే తెరవెనుక ఉన్న సూత్రధారి వంటివాడు అయిన ఆయన; నడిపిస్తుంటే నటించే ఈ మానవులు అంతా అతని చేతిలో కీలుబొమ్మలు; కనుక విధికి ఎదురీదడం దేవతలకైనా సాధ్యం కాదు. ఇంతకు ముందు దుర్మార్గుడైన కంసుడు మమ్మల్ని క్రూరంగా బాధించాడు. మేము మా స్వస్థలం వదిలి, అడవుల పాలై, నానా అవస్థలూ పడ్డాము. కరుణాసింధు వైన ఈ కృష్ణుడి అనుగ్రహంచేత మేము ఆ ఇక్కట్ల నుండి గట్టెక్కి ఇలా ఉన్నాము.”
తెభా-10.2-1058-వ.
అని యూరడిలం బలుకు నవసరంబున.
టీక:- అని = అని; ఊరడిలన్ = ఊరుకోబెట్టుటకైన; పలుకున్ = అనుచున్న; అవసరంబునన్ = సమయము నందు.
భావము:- ఈ మాదిరిగా వసుదేవుడు కుంతిని ఊరడించాడు. ఆ సమయంలో....