పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కాళిందీ భేదనంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

కాళిందీ భేదనంబు

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/కాళిందీ భేదనంబు)
రచయిత: పోతన(భా-10.2-500-చ.)[మార్చు]

ఘనకుపితాత్ముఁడై యమునఁ గన్గొని రాముఁడు వల్కె డాయఁ జీ 1
రినఁ జనుదేక తక్కితి పురే! విను నిందఱుఁ జూడ మద్భుజా 2
సునిశిత లాంగలాగ్రమున సొంపఱ నిప్పుడు నూఱు త్రోవలై 3
చన వెసఁ జించి వైతు నని చండ పరాక్రమ మొప్ప నుగ్రుఁడై. 4

(భా-10.2-501-వ.)[మార్చు]

అట్లు కట్టలుక రాము డుద్దామం బగు బాహుబలంబున హలంబు 1
సాఁచి య మ్మహావాహినిం దగిల్చి పెకలి రాఁ దిగిచిననన్నది భయ 2
భ్రాంతయై సుందరీరూపంబు గైకొని యతిరయంబునం జనుదెంచి, 3
య య్యదువంశతిలకుం డగు హలధరుని పాదారవిందంబులకు 4
వందనం బాచరించి యిట్లనియె. 5

(భా-10.2-502-మ.)[మార్చు]

“బలరామా! ఘనబాహ! నీ యతుల శుంభద్విక్రమం బంగనల్‌ 1
దెలియం జాలెడివారె? యీ యఖిలధాత్రీభారధౌరేయ ని 2
శ్చల సత్త్వుండగు కుండలీశ్వరుఁడునుం జర్చింప నీ సత్కళా 3
కలితాంశ ప్రభవుండు; నీ గురు భుజా గర్వంబు సామాన్యమే?” 4

(భా-10.2-503-చ.)[మార్చు]

అని వినుతించి “యేను భవదంఘ్రి సరోజము లాశ్రయించెదన్ 1
ననుఁగరుణింపు” మన్న యదునందనుఁడన్నదిఁ “బూర్వమార్గవై 2
చను” మని కామినీనికరసంగతుఁడై జలకేళి సల్పె నిం 3
పెనయఁ గరేణుకాయుత మదేభముచాడ్పున న మ్మహానదిన్. 4

(భా-10.2-504-తే.)[మార్చు]

అంత జలకేళి సాలించి సంతసంబు 1
నందుచుండ వినీలవస్త్రాదిరత్న 2
మండనంబులుఁ గాంచనమాలికయును 3
దెచ్చి హలి కిచ్చి చనె నా నదీలలామ. 4

(భా-10.2-505-క.)[మార్చు]

అవి యెల్లఁ దాల్చి హలధరుఁ 1
డవిరళగతి నొప్పి వల్లవాంగనలును దా 2
దివిజేంద్రుఁ బోలి మహి తో 3
త్సవమున వర్తించుచుండె సౌఖ్యోన్నతుఁ డై. 4

(భా-10.2-506-క.)[మార్చు]

అవనీశ! యిట్లు హలమునఁ 1
దివిచినఁ గాళింది వ్రయ్య దెలియఁగ నేఁడున్ 2
భువి నుతి కెక్కెను రాముని 3
ప్రవిమలతరమైన బాహుబలసూచకమై. 4

(భా-10.2-507-వ.)[మార్చు]

అంత బలభద్రుండు వ్రజసుందరీ సమేతుండై నందఘోషంబునం 1
బరితోషంబు నొందుచుండె, నంత నక్కడఁ గరూశాధిపతి యైన 2
పౌండ్రకుండు తన దూతం బిలిచి యిట్లనియె. 3