Jump to content

పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/ఉపోద్ఘాతము

వికీసోర్స్ నుండి


తెభా-10.2-1-క.
శ్రీర! పరిశోషిత ర
త్నార! కమనీయగుణగణాకర! కారు
ణ్యార! భీకరశర ధా
రాకంపితదానవేంద్ర! రామనరేంద్రా!

టీక:- శ్రీకర = శ్రీరామ {శ్రీ కరుడు - శ్రీ (సంపదలను) కరుడు (కలుగజేయు వాడు), రాముడు}; పరిశోషితరత్నాకర = శ్రీరామ {పరిశోషిత రత్నాకరుడు - పరిశోషిత (ఇంకిపోవునట్లు చేసిన) రత్నాకరుడు (సముద్రము కలవాడు), రాముడు}; కమనీయగుణగణాకర = శ్రీరామ {కమనీయ గుణ గణాకరుడు - కమనీయ (మనోజ్ఞము లైన) గుణగణ (గుణముల సమూహము) లకు ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు}; కారుణ్యాకర = శ్రీరామ {కారుణ్యాకరుడు - కారుణ్య (దయ)కి ఆకరుడు (నిధి వంటి వాడు), రాముడు}; భీకరశరధారాకంపితదానవేంద్ర = శ్రీరామ {భీకర శర ధారాకంపిత దానవేంద్రుడు - భీకర (భయంకర మైన) శర (బాణముల) ధారా (పరంపరలచే) ఆకంపిత (వణికింపబడిన) దానవేంద్రుడు (రాక్షస ప్రభువులు కలవాడు), రాముడు}; రామనరేంద్రా = శ్రీరామ {రామ నరేంద్రుడు - రాముడు అనెడి నరేంద్రుడు (రాజు), రాముడు}.
భావము:- సంపదలను కలుగజేయు వాడా; సముద్రము ఇంకిపోవునట్లు చేసిన వాడా; మనోజ్ఞములైన గుణగణములకు నిధి వంటి వాడా; దయకి నిధి వంటి వాడా; రాక్షస ప్రభువులను భయంకరమైన బాణపరంపరలచే వణికింప జేసినవాడా; మహారాజా! శ్రీరామ!

తెభా-10.2-2-వ.
మహనీయగుణగరిష్ఠులగు నమ్మునిశ్రేష్ఠులకు నిఖిల పురాణవ్యాఖ్యాన వైఖరీసమేతుండైన సూతుం డిట్లనియె; "నట్లు ప్రాయోపవిష్టుండైన పరీక్షిన్నరేంద్రుండు "రుక్మిణీపరిణయానంతరంబున నైన కథావృత్తాంతం బంతయు వినిపింపు"మనిన శుకయోగీంద్రుం డిట్లనియె.
టీక:- మహనీయ = గౌరవింపదగిన; గుణ = గొప్ప గుణములు గలవాడు; అగు = ఐన; ఆ = ఆ ప్రసిద్ధులగు; ముని = మునులలో; శ్రేష్ఠులు = ఉత్తముల; కున్ = కు; నిఖిల = సమస్తమైన; పురాణ = పురాణములను; వ్యాఖ్యాన = చెప్పుటలో; వైఖరీ = చక్కటి విధానముతో; సమేతుండు = కూడినవాడు; ఐన = అగు; సూతుండు = సూతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; అట్లు = ఆ విధముగ; ప్రాయోపవిష్ఠుండు = ప్రాయోపవేశంలో ఉన్న వాడు; ఐన = అయినట్టి; పరీక్షిత్ = పరీక్షిత్తు అనెడి; నరేంద్రుండు = రాజు; రుక్మిణీ = రుక్మిణీదేవిని; పరిణయ = పెండ్లి యైన; అనంతరంబునన్ = తరువాత; ఐనన్ = జరిగిన; కథా = కథ; వృత్తాంతంబు = వివరము; అంతయున్ = అంత; వినిపింపుము = చెప్పుము; అనినన్ = అని అడుగగా; శుక = శుకుడు అనెడి; యోగి = యోగులలో; ఇంద్రుండు = శ్రేష్ఠుడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను;
భావము:- సద్గుణసంపన్నులైన ఆ శౌనకాది మునీంద్రులతో సకల పురాణములకు వ్యాఖ్యాన విశిష్ఠుడైన సూతుడు భాగవత కథను ఇలా కొనసాగించాడు. ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షన్మహారాజు రుక్మిణీ దేవి పరిణయం జరిగిన తరువాత కథను వివరించ మని అడుగగా శుకయోగి ఇలా చెప్పనారంభించాడు.