పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/అర్జునితో మృగయావినోదంబు
అర్జునితోమృగయావినోదంబు
←ఇంద్రప్రస్థంబున కరుగుట | తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/దశమ స్కంధము (ద్వితీయాశ్వాసము)/అర్జునితో మృగయావినోదంబు) రచయిత: పోతన |
కాళింది మిత్రవిందల పెండ్లి→ |
తెభా-10.2-112-మ.
తురగశ్రేష్ఠము నెక్కి కంకటధనుస్తూణీశరోపేతుఁడై
హరితోడన్ వనభూమి కేగి విజయుం డాసక్తుఁడై చంపె శం
బర శార్దూల తరక్షు శల్య చమరీ భల్లూక గంధర్వ కా
సర కంఠీరవ ఖడ్గ కోల హరిణీ సారంగ ముఖ్యంబులన్.
టీక:- తురగ = గుఱ్ఱములలో; శ్రేష్ఠమును = ఉత్తమమైనదానిని; ఎక్కి = ఎక్కి; కంకట = కవచము; ధనుస్ = విల్లు; తూణీ = అమ్ములపొది; శర = బాణములతోటి; ఉపేతుడు = కూడుకున్నవాడు; ఐ = అయ్యి; హరి = కృష్ణుని; తోడన్ = తోటి; వన = అటవీ; భూమి = ప్రదేశమున; కిన్ = కు; ఏగి = వెళ్ళి; విజయుండు = అర్జునుడు {విజయుడు - విజయశీలము కలవాడు, అర్జునుడు}; ఆసక్తుడు = ఆసక్తి కలవాడు; ఐ = అయ్యి; చంపెన్ = సంహరించెను; శంబర = శంబర జింకలు {శంబర మృగము - ఎఱ్ఱనివన్నెగల చిన్న జింక}; శార్దూల = పెద్దపులులు; తరక్షు = సివంగులు; శల్య = ఏదుపందులు; చమరీ = సవరపు మృగములు; భల్లూక = ఎలుగబంట్లు; గంధర్వ = గంధర్వ దుప్పులు {గంధర్వము - వట్రువు తోక దొడ్డ కడుపుగల దుప్పి}; కాసర = కారుదున్నపోతులు; కంఠీరవ = సింహములు; ఖడ్గ = ఖడ్గమృగములు; కోల = పందులు; హరిణీ = ఆడుజింకలు; సారంగ = మగజింకలు; ముఖ్యంబులన్ = మున్నగువానిని.
భావము:- ఒకనాడు అర్జునుడు అశ్వారూఢుడై శ్రీకృష్ణునితో కలిసి అరణ్యానికి వెళ్ళాడు. అక్కడ జింకలను, పెద్దపులులను, సివంగులను, ఏదుపందులను, చమరీమృగాలను, ఎలుగుబంట్లను, దుప్పులను, ఎనుబోతులను, సింహాలను, ఖడ్గమృగాలను, వనవరాహాలను, లేళ్ళను, ఇఱ్ఱి లేళ్ళను, ఏనుగులను ఆసక్తితో వేటాడాడు.
తెభా-10.2-113-క.
అచ్చోటఁ బవిత్రములై
చచ్చిన మృగరాజి నెల్ల జననాథునకుం
దెచ్చి యొసంగిరి మెచ్చుగఁ
జెచ్చెర నరుఁ గొల్చి యున్న సేవకు లధిపా!
టీక:- ఆ = ఆ; చోటన్ = ప్రదేశము నందు; పవిత్రములు = పరిశుద్ధమైనవి, తినదగినవి; ఐ = అయ్యి; చచ్చిన = చచ్చిపోయిన; మృగ = జంతువుల; రాజిన్ = సమూహము; ఎల్లన్ = అన్నిటిని; జననాథున్ = రాజున {జననాథుడు - మానవులకు ప్రభువు, రాజు}; కున్ = కు; తెచ్చి = తీసుకువచ్చి; ఒసంగిరి = ఇచ్చిరి; మెచ్చుగన్ = మెచ్చుకొనునట్లుగ; చెచ్చెరన్ = శీఘ్రముగా; నరున్ = అర్జునుని; కొల్చి = సేవించుచు; ఉన్న = ఉన్నట్టి; సేవకులు = బంట్లు; అధిపా = రాజా.
భావము:- అలా చనిపోయిన అర్హ మృగాలను అన్నింటినీ ధర్మరాజు మెచ్చుకునేలా అర్జునుడి సేవకులు శీఘ్రంగా తెచ్చి ఆయనకు ఇచ్చారు.
తెభా-10.2-114-వ.
అంత నర్జునుండు నీరుపట్టున డస్సిన, యమునకుం జని, య మ్మహారథులైన నరనరాయణు లందు వార్చి జలంబులు ద్రావి, యొక పులినప్రదేశంబున నుండి.
టీక:- అంతన్ = అంతట; అర్జునుండు = అర్జునుడు; నీరుపట్టున = దప్పికతో; డస్సినన్ = బడలికపొందగా; యమున = యమునానది; కున్ = కి; చని = వెళ్ళి; ఆ = ఆ; మహారథులు = మహారథులు {మహారథుడు - పదకొండువేల యోధులతో ఎదిరించి యుద్ధము చేయజాలినవాడు (చూ. వివరములకు అనుయుక్తములు చూడండి}; ఐన = అయిన; నర = అర్జునుడు {నరనారాయణులు - పూర్వ అవతారము నందు నరనారాయణులుగా అవతరించినవారు, అర్జునుడు కృష్ణుడు}; నారాయణులు = కృష్ణుడు; అందు = దానిలో; వార్చి = ఆచమనములు చేసి; జలంబులు = నీరు; త్రావి = తాగి; ఒక = ఒకానొక; పులినప్రదేశంబునన్ = ఇసుకతిన్నెపై; ఉండి = కూర్చుండి.
భావము:- అప్పుడు అర్జునుడుకి దాహంవేసి బాగా అలసిపోయాడు. ఆ నరనారాయణులు ఇద్దరూ యమునానదికి వెళ్ళి ఆచమనం చేసి, దాహం తీర్చుకుని, ఇసుక ప్రదేశంలో కూర్చున్నారు.
తెభా-10.2-115-ఉ.
ఉపగతు లైన యట్టి పురుషోత్తమ పార్థులు గాంచి రాపగా
విపుల విలోల నీలతర వీచికలందు శిరోజభార రు
చ్యపహసితాళిమాలిక నుదంచిత బాల శశిప్రభాలికం
దపనుని బాలికన్ మదనదర్పణతుల్య కపోలపాలికన్.
టీక:- ఉపగతులు = దగ్గర దగ్గరగా ఉన్న వారు; ఐనయట్టి = అగు; పురుషోత్తమ = కృష్ణుడు {పురుషోత్తముడు - పురుషుడైన (జగత్తుకు కారణభూతుడైన) శ్రేష్ఠుడు, విష్ణువు}; పార్థులున్ = అర్జునులు {పార్థుడు - పృథ (కుంతి) యొక్క పుత్రుడు, అర్జునుడు}; కాంచిరి = చూసిరి; ఆపగా = నదిలో; విపుల = విరివి అయిన; విలోల = మిక్కిలి చలించుచున్న; నీలతర = మిక్కిలి నల్లనైన; వీచికలు = అలలు; అందున్ = లో; శిరోజ = తలవెంట్రుకల; భార = ముడి యొక్క; రుచి = కాంతులచేత; అపహసిత = ఎగతాళిచేయబడిన; అళీ = తుమ్మెదల; మాలికన్ = సమూహము కలామెను; ఉదంచిత = మిక్కిలి చక్కటి; బాలశశి = లేతచంద్రుని; ప్రభా = ప్రకాశము కల; అలికన్ = నొసలు కలామెను; తపనుని = సూర్యుని {తపనుడు - తపింపజేయు వాడు, సూర్యుడు}; బాలికన్ = కుమార్తెను; మదన = మన్మథుని; దర్పణ = అద్దముతోటి; తుల్య = సమానమైన; కపోల = చెక్కిటి; పాలికన్ = పాలి (ప్రదేశము) కలామెను.
భావము:- కృష్మార్జునులు అలా యమున ఇసుకతిన్నెలపై కూర్చుని ఉన్నప్పుడు, ఆ నదీతరంగాలలో తుమ్మెదల సమూహాన్ని ధిక్కరించే శిరోజశోభతో, బాలచంద్రుడిని బోలిన నెన్నుదురుతో, అద్దాలవంటి చెక్కిళ్ళతో ప్రకాశించే, సూర్యుని కుమార్తెను చూసారు.
తెభా-10.2-116-వ.
కని యచ్యుతుండు పంచిన వివ్వచ్చుండు సని యా కన్య కిట్లనియె.
టీక:- కని = చూసి; అచ్యుతుండు = కృష్ణుడు; పంచినన్ = పంపించగా; వివ్వచ్చుండు = అర్జునుడు {వివ్వచ్చుడు - భీభత్సుడు, భయంకరమైన యుద్ధము చేయువాడు, అర్జునుడు}; చని = వెళ్ళి; ఆ = ఆ యొక్క; కన్యన్ = యువతి; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;
భావము:- శ్రీకృష్ణుడు పంపగా అర్జునుడు ఆమె చెంతకు వెళ్ళి ఇలా అన్నాడు.
తెభా-10.2-117-మ.
"సుదతీ! యెవ్వరి దాన? వేమికొఱ కిచ్చోటం బ్రవర్తించె? దె
య్యది నీ నామము? కోర్కి యెట్టిది? వివాహాకాంక్షతోఁగూడి యీ
నదికిన్ వచ్చినజాడ గానఁబడె? ధన్యంబయ్యె నీ రాక, నీ
యుదయాదిస్థితి నెల్లఁ జెప్పు మబలా! యుద్యత్కురంగేక్షణా! "
టీక:- సుదతీ = సుందరీ {సుదతి - మంచి దంతములు కలామె, స్త్రీ}; ఎవ్వరిదానవు = ఎవరి బిడ్డవు; ఏమి = దేని; కొఱకు = కోసము; ఇచ్చటన్ = ఇక్కడ; ప్రవర్తించెద = మెలగుచుంటివి; ఎయ్యది = ఏది; నీ = నీ యొక్క; నామము = పేరు; కోర్కి = ఆకాంక్ష; ఎట్టిది = ఎలాంటిది; వివాహ = పెండ్లాడవలెనను; కాంక్ష = కోరిక; తోన్ = తో; కూడి = కూడి ఉండి; ఈ = ఈ; నది = నది; కిన్ = కి; వచ్చిన = వచ్చిన; జాడ = ఆనమాలు; కానబడెన్ = కనిపించుచున్నది; ధన్యంబు = కృతార్థము; అయ్యెన్ = అయినది; నీ = నీవు; రాక = వచ్చుట; నీ = నీ యొక్క; ఉదయ = పుట్టుక; ఆది = మున్నగు; స్థితిన్ = వృత్తాంతము; ఎల్లన్ = అన్నిటిని; చెప్పుము = చెప్పుము; అబలా = యువతీ {అబల - బలము తక్కువ ఉండునామె, స్త్రీ}; ఉద్యత్ = మెరయుచున్న; కురంగ = లేడివంటి; ఈక్షణా = చూపులు కల బాలికా.
భావము:- “ఓ అమ్మాయీ! బహు చక్కటి దంతాల చక్కనమ్మా! సుకుమారీ! లేడికన్నుల వన్నెలాడీ! నీవెవరవు? ఎందు కోసం ఇక్కడ తిరుగున్నావు? నీ పేరేమిటి? నీ కోరికేమిటి? వివాహకాంక్షతో ఈ ప్రాంతానికి వచ్చినట్లున్నావు. నీ రాక ధన్యమైనది. నీ ప్రయత్నం నెరవేరుతుంది. నీ గురించిన విశేషాలు అన్నింటినీ చెప్పు.”
తెభా-10.2-118-వ.
అనిన నర్జునునకుఁ గాళింది యిట్లనియె.
టీక:- అనినన్ = అని అడుగగా; అర్జునున్ = అర్జునుని; కున్ = కు; కాళింది = కాళింది; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- అలా అడిగిన అర్జునుడితో ఆ అమ్మాయి, కాళింది ఇలా సమాధానం చెప్పింది.
తెభా-10.2-119-మ.
"నరవీరోత్తమ! యేను సూర్యుని సుతన్; నాపేరు కాళింది; భా
స్కర సంకల్పితగేహమందు నదిలోఁ గంజాక్షు విష్ణుం బ్రభున్
వరుగాఁ గోరి తపంబుసేయుదు; నొరున్ వాంఛింపఁ; గృష్ణుండు వ
న్యరతిన్ వచ్చి వరించునంచుఁ బలికెన్ నా తండ్రి నాతోడుతన్. "
టీక:- నర = మానవ, అర్జునా; వీర = వీరులలో; ఉత్తమ = శ్రేష్ఠుడా; ఏను = నేను; సూర్యుని = సూర్యుని యొక్క; సుతన్ = కుమార్తెను; నా = నా యొక్క; పేరు = నామము; కాళింది = కాళింది; భాస్కర = సూర్యునిచేత; సంకల్పిత = ఏర్పరుపబడిన; గేహము = ఇల్లు; అందున్ = అందు; నది = నది; లోన్ = అందు; కంజాక్షున్ = కృష్ణుని {కంజాక్షుడు - పద్మాక్షుడు, విష్ణువు}; విష్ణున్ = కృష్ణుని}; ప్రభున్ = కృష్ణుని {ప్రభువు - సర్వమునకు ఈశ్వరుడు, విష్ణువు}; వరున్ = భర్త; కాన్ = అగుటను; కోరి = అపేక్షించి; తపంబున్ = తపస్సు; చేయుదున్ = చేయుచున్నాను; ఒరున్ = ఇతరుని; వాంఛింపన్ = కోరను; కృష్ణుండు = కృష్ణుడు; వన్యరతిన్ = వేటాడవేడుకతో; వచ్చి = వచ్చి; వరించును = పెండ్లాడును; అంచున్ = అని; పలికెన్ = చెప్పెను; నా = నా యొక్క; తండ్రి = నాన్న; నా = నా; తోడుతన్ = తోటి.
భావము:- “ఓ వీరాధివీరా! నేను సూర్యుడి కుమార్తెను. నా పేరు కాళింది. ఈ నదిలో నా తండ్రి నా కోసం ఏర్పాటుచేసిన గృహంలో పద్మాక్షుడైన శ్రీకృష్ణుడిని భర్తగా కోరి తపస్సు చేస్తున్నాను. ఇంకెవరినీ నేను కోరను. శ్రీకృష్ణుడు వేటకు వచ్చి నిన్ను వివాహమాడగల డని నా తండ్రి నాకు తెలిపాడు.”
తెభా-10.2-120-వ.
అనిన విని ధనంజయుఁ డా నీలవేణి పలుకులు హరికిం జెప్పిన విని సర్వజ్ఞుండైన హరియు హరిమధ్యను రథంబుమీఁద నిడుకొని ధర్మరాజు కడకుం జని వారలు గోరిన విశ్వకర్మను రావించి వారి పురం బతివిచిత్రంబు సేయించె.
టీక:- అనినన్ = అని చెప్పగా; విని = విని; ధనంజయుండు = అర్జునుడు; ఆ = ఆ యొక్క; నీలవేణి = సుందరి యొక్క {నీలవేణి - నల్లని శిరోజములు కలామె, స్త్రీ}; పలుకులు = మాటలు; హరి = కృష్ణుని; కిన్ = కి; చెప్పినన్ = చెప్పగా; విని = విని; సర్వజ్ఞుండు = సర్వము తెలిసినవాడు; ఐన = అయిన; హరియున్ = కృష్ణుడు; హరిమధ్యను = వనితను {హరిమధ్య - సింహమువంటి నడుము కలామె, స్త్రీ}; రథంబు = రథము; మీదన్ = పైన; ఇడుకొని = పెట్టుకొని; ధర్మరాజు = ధర్మరాజు; కడ = దగ్గర; కున్ = కి; చని = వెళ్ళి; వారలు = వారు; కోరిన = అపేక్షించగా; విశ్వకర్మను = విశ్వకర్మను; రావించి = రప్పించి; వారి = వారల యొక్క; పురంబు = నగరమును; అతి = మిక్కిలి; విచిత్రంబు = అద్భుతమైనదిగా; చేయించె = చేయించెను.
భావము:- అలా చెప్పిన కాళింది మాటలను అర్జునుడు శ్రీకృష్ణుడికి విన్నవించాడు. సర్వజ్ఞుడైన హరి ఆ సన్నని నడుము కల కాళింది సుందరిని రథముపై ఎక్కించుకుని, ధర్మరాజు దగ్గరకు వెళ్ళాడు. పాండవులు కోరగా విశ్వకర్మ వచ్చి ఇంద్రప్రస్థపురాన్ని చిత్రవిచిత్రంగా అలంకరించి తీర్చిదిద్దాడు.
తెభా-10.2-121-క.
దేవేంద్రుని ఖాండవ మ
ప్పావకునకు నీఁ దలంచి పార్థుని రథికుం
గావించి సూతుఁ డయ్యెను
గోవిందుఁడు మఱఁదితోడఁ గూరిమి వెలయన్.
టీక:- దేవేంద్రుని = దేవేంద్రుడి యొక్క; ఖాండవమున్ = ఖాండవవనమును; ఆ = ఆ ప్రసిద్ధుడైన; పావకున్ = అగ్నిదేవుని {పావకుడు - పవిత్రము చేయువాడు, అగ్ని}; ఈన్ = ఇవ్వవలెనని; తలంచి = భావించి; పార్థుని = అర్జునుని; రథికున్ = రథము నందలి యోధునిగా; కావించి = చేసి; సూతుడు = సారథి; అయ్యెను = అయ్యెను; గోవిందుడు = కృష్ణుడు; మఱిది = మేనత్తకొడుకు (అర్జునుని); తోడన్ = తోటి; కూరిమి = మైత్రి; వెలయన్ = ప్రకాశించగా.
భావము:- దేవేంద్రుని ఖాండవవనాన్ని అగ్నిదేవుడికి అర్పించడానికి నిశ్చయించుకుని మేనత్త కొడుకు అర్జునుడిని సస్నేహంగా పిలిచి, అతని రథానికి శ్రీకృష్ణుడు తాను సారథి అయ్యాడు.
తెభా-10.2-122-వ.
ఇట్లు నర నారాయణులు సహాయులుగా దహనుండు ఖాండవవనంబు దహించిన సంతసించి విజయునకు నక్షయ తూణీరంబులు, నభేద్యకవచంబును, గాండీవమనియెడి బాణాసనంబును దివ్యరథంబును ధవళరథ్యంబులను నిచ్చె నందు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; నరనారాయణులు = కృష్ణార్జునులు; సహాయులు = తోడుపడినవారు; కాన్ = కాగా; దహనుండు = అగ్నిదేవుడు {దహనుడు - దహింపజేయు వాడు, అగ్ని}; ఖాండవ = ఖాండవము అను; వనంబున్ = వనమును; దహించినన్ = కాల్చివేయగా; సంతసించి = సంతోషించి; విజయున్ = అర్జునుని; కున్ = కి; అక్షయ = తరుగని; తూణీరంబులున్ = బాణములు గల పొదులు; అభేద్య = భేదింపరాని; కవచంబును = కవచమును; గాండీవము = గాండీవము; అనియెడి = అనెడి; బాణాసనంబును = విల్లును; దివ్య = మహిమాన్వితమైన; రథంబును = రథమును; ధవళ = తెల్లని; రథ్యంబులను = గుఱ్ఱములను; ఇచ్చెన్ = ఇచ్చెను; అందున్ = అప్పుడు.
భావము:- నరనారాయణుల సహాయంతో అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహించి, సంతోషించి అర్జునుడికి అక్షయ తూణీరాలు, భేదించడానికి వీలు లేని కవచం, గాండీవ మనే ధనుస్సు, దివ్యమైన రథమూ, తెల్లని గుఱ్ఱాలు అనుగ్రహించాడు.
తెభా-10.2-123-ఉ.
వాసవసూనుచేఁ దనకు వహ్నిశిఖాజనితోగ్రవేదనల్
పాసినఁ జేసి యొక్క సభ పార్థున కిచ్చె మయుండు ప్రీతుఁడై
యా సభలోనఁ గాదె గమనాగమనంబులఁ గౌరవేంద్రుఁ డు
ల్లాసముఁ బాసి యుండుట జలస్థలనిర్ణయ బుద్ధి హీనుఁడై.
టీక:- వాసవసూను = అర్జునుని {వాసవసూనుడు - ఇంద్రుని కొడుకు, అర్జునుడు}; చేన్ = వలన; తన = అతని; కున్ = కి; వహ్ని = అగ్ని; శిఖా = మంటలచేత; జనిత = కలిగెడి; ఉగ్ర = భయంకరమైన; వేదనల్ = బాధలు; పాసినన్ = తొలగుట; చేసి = వలన; ఒక్క = ఒకానొక; సభన్ = సభామండపమును; పార్థున్ = అర్జునుని; కిన్ = కి; ఇచ్చెన్ = ఇచ్చెను; మయుండు = మయుడు; ప్రీతుడు = సంతోషించినవాడు; ఐ = అయ్యి; ఆ = ఆ; సభ = సభామండపము; లోనన్ = అందునే; కాదే = కాదా; గమన = పోక; ఆగమనంబులన్ = రాకలలో; కౌరవేంద్రుడు = దుర్యోధనుడు; ఉల్లాసమున్ = ఉత్సాహము; పాసి = విడిచి; ఉండుట = అగుట జరిగెను; జలస్థల = నీళ్ళుండు ప్రదేశము; నిర్ణయ = అవునో కాదో తెలిసెడి; బుద్ధి = జ్ఞానము; హీనుడు = లేనివాడు; ఐ = అయ్యి.
భావము:- ఖాండవ వన దహన సమయంలో, అగ్నిజ్వాలల బాధనుండి తప్పించి ఇంద్రుడి పుత్రుడు అర్జునుడు తనను రక్షించినందు వలన, మయుడు సంతోషంతో ఒక మహాసభను నిర్మించి ఆ కుంతీపుత్రుడైన అర్జునుడికి బహుకరించాడు. ఆ సభ లోనే దుర్యోధనుడు సంచరిస్తూ గచ్చుకీ, జలాశయానికీ తేడా తెలియక అవమానం పొందాడు.