పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/హిరణ్యాక్షుని జన్మప్రకారంబు
తెభా-3-631-చ.
అనవుడు దానవేంద్రుఁడు హుతాశనుకైవడి మండి పద్మలో
చను నెదిరించు వేడుకలు సందడిగొల్ప ననల్పతేజుఁడై
ఘనగదఁ గేలఁ బూని త్రిజగద్భయదాకృతిఁ దాల్చి వ్రేల్మిడిం
జనియె రసాతలంబునకుఁ జండ భుజాబల దర్ప మేర్పడన్.
టీక:- అనవుడు = అనగా; దానవ = రాక్షసులలో; ఇంద్రుడు = శ్రేష్ఠుడు; హుతాశను = అగ్ని {హుతాశనుడు - హుతము (యజ్ఞమున హోత్రము చేయబడినది) తీసుకెళ్లవాడు, అగ్ని}; కైవడి = వలె; మండి = మండిపడి; పద్మలోచనున్ = విష్ణుమూర్తిని {పద్మ లోచనుడు - పద్మముల వంటి లోచనములు (కన్నులు) ఉన్నవాడు, హరి}; ఎదిరించు = ఎదిరించే; వేడుకలు = ఉత్సాహములు; సందడి = తొందర; కొల్పన్ = చేస్తుండగ; అనల్ప = మిక్కిలి; తేజుడు = తేజస్సు కలవాడు; ఐ = అయ్యి; ఘన = గొప్ప; గదన్ = గదను; కేలన్ = చేత; పూని = ధరించి; త్రి = మూడు; జగత్ = లోకములకు; భయద = భయమును కలిగించు; ఆకృతిన్ = రూపమును; తాల్చి = ధరించి; వ్రేల్మిడిన్ = చిటికెలో; చనియెన్ = వెళ్ళెను; రసాతలంబున్ = పాతాళమున; కున్ = కు; చండ = భయంకరమైన; భుజాబలమున్ = బాహుబలము; దర్పమేర్పడన్ = గర్వము ప్రదర్శిస్తూ.
భావము:- అలా నారదమహర్షి చెప్పగా, హిరణ్యాక్షుడు అగ్నిహోత్రంలా మండిపడ్డాడు. కమలలోచనుడైన విష్ణువును ఎదిరించా లని ఉత్సాహపడ్డాడు. ముల్లోకలాకు భయం కలిగించేలా, తన భుజబలాన్ని ప్రదర్శించుతూ, పెద్ద గదను చేతబట్టి, అతిశయించిన తేజస్సుతో ఆ మహా సముద్రగర్భంలోనికి అతి వేగంగా వెళ్ళాడు.
తెభా-3-632-వ.
చని జలమధ్యంబున.
టీక:- చని = వెళ్లి; జల = నీటి; మధ్యంబునన్ = మధ్యలో.
భావము:- అలా వెళ్ళి సముద్ర మధ్యభాగంలో...
తెభా-3-633-క.
దివిజారి యెదురఁ దగఁ గనె
సవిరళ దంష్ట్రాభిరాము నమరలలాముం
గువలయభరణోద్ధామున్
సవనమయస్తబ్ధరోము జలదశ్యామున్.
టీక:- దివిజారి = రాక్షసుడు {దివిజారి - దివిజుల (దేవతల)కు అరి (శత్రువు), రాక్షసుడు}; ఎదురన్ = ఎదురుగ; తగన్ = శ్రీఘ్రమే; కనెన్ = చూసెను; సవిరళదంష్ట్రాభిరామున్ = ఆదివరాహుని {సవిరళ దం ష్ట్రాభిరాముడు - స (కలిగిన) అవిరళ (దట్టమైన) దంష్ట్తా (కోరలతో) అభిరాముడు (ఒప్పువాడు), ఆదివరాహావతారుడు}; అమరలలామున్ = ఆదివరాహుని {అమర లలాముడు - అమరుల (దేవతల)కు లలాముడు శ్రేష్ఠమైనవాడు, విష్ణువు}; కువలయభరణోద్ధామున్ = ఆదివరాహుని {కువలయ భర ణోద్ధాముడు - కువలయము (భూమి)ని భరణ (మోయుట) అందు ఉద్దాముడు (అధికుడు), విష్ణువు}; సవనమయస్తబ్దరోమున్ = ఆదివరాహుని {సవన మయ స్తబ్ధ రోముడు - సవన (యజ్ఞ) మయ స్తబ్ధ రోముడు (నిక్కబొడుచుకున్న వెండ్రుకలు గలవాడు , వరాహుడు), విష్ణువు}; జలదశ్యామున్ = ఆదివరాహుని {జలద శ్యాముడు - జలదము (మేఘము) వలె శ్యాముడు (నల్లగ ఉన్నవాడు), విష్ణువు}.
భావము:- హిరణ్యాక్షుడు తన ఎదుట దట్టమైన కోరలు కలిగి, దేవతలలో శ్రేష్ఠుడై, భూభారాన్ని మోయడానికి సమర్థుడై, యజ్ఞమయమై, మేఘంలాగా నల్లగా ఉన్న ఆది వరాహమూర్తిని వీక్షించాడు.
తెభా-3-634-వ.
అయ్యవసరంబున సూకరాకారుం డైన హరియు.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; సూకర = వరాహము యొక్క; ఆకారుండు = ఆకారమున ఉన్నవాడు; ఐన = అయినట్టి; హరియున్ = ఆదివరాహుడును.
భావము:- ఆ సమయంలో వరాహరూపంలో ఉన్న హరి...
తెభా-3-635-క.
వనజ రుచిసన్నిభము లగు
తన లోచనయుగళ దీప్తి దనరఁ దదాలో
కనముల దనుజాధీశుని
తనుకాంతి హరింపఁజేసెఁ దత్క్షణమాత్రన్.
టీక:- వనజ = పద్మము {వనజము - వనము (నీటి) అందు పుట్టినది, పద్మము}; రుచి = ప్రకాశమునకు; సన్నిభములు = సమానములు; అగు = అయినట్టి; తన = తన యొక్క; లోచన = కన్నుల; యుగళ = జంట; దీప్తిన్ = కాంతి; తనరన్ = విజృంభించగ; తత్ = వాని; ఆలోకనములన్ = చూపులచే; దనుజ = రాక్షస; అధీశునిన్ = ప్రభువు యొక్క; తను = దేహము యొక్క; కాంతిన్ = ప్రకాశమును; హరింపన్ = అణగునట్టు; చేసెన్ = చేసెను; తత్ = ఆ; క్షణ = క్షణము; మాత్రన్ = సమయములోనే.
భావము:- కమలములవంటి తన కన్నుల కాంతులను ప్రసరింప జేస్తూ, తన చూపుతో ఆ హిరణ్యాక్షుని దేహకాంతిని వెంటనే నశింపజేశాడు.
తెభా-3-636-వ.
మఱియు నయ్యాదివరాహం బవార్యశౌర్యంబున మాఱులేని విహారంబున జరియించు నట్టియెడ.
టీక:- మఱియున్ = ఇంకనూ; ఆ = ఆ; ఆదివరాహంబున్ = వరాహావతారుడు; అవార్య = వారింప శక్యము కాని; శౌర్యంబునన్ = పరాక్రమముతో; మాఱులేని = తిరుగులేని; విహారంబునన్ = విహారము; చరియించున్ = చేయుచున్న; అట్టి = అటువంటి; ఎడన్ = సమయములో;
భావము:- ఇంకా ఆ ఆదివరాహం అడ్డులేని శౌర్యంతో నిరాటంకంగా విహరిస్తూ...
తెభా-3-637-సీ.
తుదమొదళ్ళకుఁ జిక్కి దునిసి పాఱఁగ మోరఁ-
గులశైలములఁ జిమ్ముఁ గొంత దడవు
బ్రహ్మాండభాండంబు పగిలి చిల్లులువోవఁ-
గొమ్ములఁ దాటించుఁ గొంతద డవు
జలధు లేడును బంకసంకులం బై యింక-
ఖురముల మట్టాడుఁ గొంత దడవు
నుడురాజు సూర్యుఁడు నొక్క మూలకుఁ బోవఁ-
గుఱుచ వాలము ద్రిప్పుఁ గొంత దడవు
తెభా-3-637.1-తే.
గునియుఁ గుప్పించి లంఘించుఁ గొప్పరించు
నెగయు ధరఁ ద్రవ్వు బొఱియఁగా నేపురేగి
దానవేంద్రుని గుండెలు దల్లడిల్లఁ
బంది మెల్లన రణపరిపంథి యగుచు.
టీక:- తుద = చివర; మొదళ్ల = మొదలుల; కున్ = కు; చిక్కి = చిక్కుకొని; తునిసి = చినగి; పాఱగన్ = పోవగా; మోరన్ = మెడను; కులశైలములన్ = కులపర్వతములను; చిమ్మున్ = చెదరగొట్టును; కొంత = కొంచము; తడవు = సేపు, కాలము; బ్రహ్మాండ = బ్రహ్మాండము అను; భాండమున్ = కుండను; పగిలి = పగిలిపోయి; చిల్లులు = కన్నములు; పోవన్ = పడునట్లుగ; కొమ్ములన్ = కొమ్ములతో; తాటించు = కొట్టును; కొంత = కొంచెము; తడవు = సేపు; జలధులు = సముద్రములు {జలధి - జలము (నీటి)కి నివాసము వంటిది, సముద్రము}; ఏడున్ = ఏడును (7); పంక = బురద; సంకులమున్ = మయముగ; ఐ = అయిపొయి; ఇంకన్ = ఇంకిపోవునట్లు; ఖురములన్ = గిట్టలతో; మట్టాడున్ = కాలితో గెంటును; కొంత = కొంచము; తడవున్ = సేపు; ఉడురాజు = చంద్రుడు; సూర్యుడున్ = సూర్యుడును; ఒక్క = ఒకే; మూల = మూల; కున్ = కు; పోవన్ = పోవునట్లు; కుఱుచ = పొట్టి; వాలమున్ = తోకను; త్రిప్పున్ = తిప్పును; కొంత = కొంచము; తడవు = సేపు;
గునియున్ = తిరుగు; కుప్పించి = గెంతి; లంఘించున్ = దాటును; కొప్పరించున్ = తవ్విపెళ్ళగించును; ఎగయున్ = ఎగురును; ధరన్ = భూమిని; త్రవ్వున్ = తవ్వును; బొఱియగన్ = గుంటపడునట్లు; ఏపురేగి = విజృంభించి; దానవ = రాక్షస; ఇంద్రుని = ప్రభువు యొక్క; గుండెలు = గండెలు; తల్లడిల్లన్ = తల్లడిల్లగ; పంది = వరాహమూర్తి; మెల్లనన్ = మెల్లగా; రణ = యుద్ధమునకు; ప్రతి = ఎదురు, సిద్దపడి; పంథి = వెళ్లువాడు; అగుచున్ = అవుతూ.
భావము:- కొంతసేపు తుదా మొదలూ ఏకమై ముక్కలయ్యేటట్లు కులపర్వతాలను తన ముట్టెతో కూలదోస్తూ, కొంతసేపు బ్రహ్మాండభాండం పగిలి చిల్లులుపడే విధంగా తన కొమ్ములతో చిమ్ముతూ, కొంతసేపు సప్తసముద్రాలు బురదలై ఇంకిపోయే విధంగా తన గిట్టలతో మట్టగిస్తూ, కొంతసేపు చంద్రుడూ సూర్యుడూ ఒకమూలకు తోసుకుపోయేటట్లు తన పొట్టితోకను త్రిప్పుతూ...తిరుగుతూ, కుప్పించి దూకుతూ, దాటుతూ, ఇగిలిస్తూ, ఎగురుతూ, నేలను బొరియలుగా తవ్వుతూ హిరణ్యాక్షుని గుండెలు తల్లడిల్లే విధంగా ఆ వరాహం యుద్ధానికి సిద్ధమై....
తెభా-3-638-వ.
మఱియును.
టీక:- మఱియున్ = ఇంకనూ.
భావము:- ఇంకా...
తెభా-3-639-క.
కనుఁగవ నిప్పులు రాలఁగ
సునిశిత దంష్ట్రాగ్ర యుత వసుంధరుఁ డగుచున్
తన కెదురేతేరఁగ నీ
వనచర మేరీతి నిపుడు వనచర మయ్యెన్.
టీక:- కను = కన్నుల; గవన్ = జంట; నిప్పులు = నిప్పులు, అగ్ని; రాలగన్ = కురియగ; సునిశిత = వాడియైన; దంష్టా = దంతముల; అగ్ర = చివర; యుత = ఉన్న; వసుంధరుడు = భూమి కలవాడు; అగుచున్ = అవుతూ; తన = అతని; కిన్ = కి; ఎదురన్ = ఎదురు; ఏతేరగన్ = రాగా; ఈ = ఈ; వనచరము = అడవిలోతిరుగునది, జంతువు; ఏరీతిన్ = విధముగ; ఇపుడున్ = ఇప్పుడు; వన = నీటిలో; చరము = తిరుగునది; అయ్యెన్ = అయినది.
భావము:- కన్నులు నిప్పులు కురియగా వాడికోరపైన భూమిని ధరించినవాడై వరాహమూర్తి తనకు ఎదురు రాగా చూచి హిరణ్యాక్షుడు ‘అడవిలో సంచరించవలసిన ఈ జంతువు నీళ్ళల్లో విహరించేదిగా ఎలా అయింది?’....
తెభా-3-640-క.
అని యాశ్చర్య భయంబులు
దన మనమునఁ దొంగిలింపఁ దనుజాధిపుఁ డి
ట్లనియెన్ భీకరసూకర
తనువొంది చరించు దనుజ దర్పావహుతోన్
టీక:- అని = అని; ఆశ్చర్య = ఆశ్చర్యము; భయంబులున్ = భయములు; తన = తన యొక్క; మనంబునన్ = మనసుని; దొంగిలింపన్ = దోచుకోగా; దనుజ = రాక్షస; అధిపుడు = రాజు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; భీకర = భయంకరమైన; సూకర = వరాహ; తనువున్ = దేహమును; పొంది = ధరించి; చరించు = తిరుగుతున్న; దనుజదర్పావహు = విష్ణుమూర్తి {దనుజదర్పావహుడు - దనుజ (రాక్షసు)ల దర్పము (గర్వము) ను అపహరించువాడు, హరి}; తోన్ = తోటి.
భావము:- అని ఆశ్చర్య భయాలు తన మనస్సులో అతిశయించగా హిరణ్యాక్షుడు భయంకర వరాహ రూపాన్ని ధరించిన రాక్షస గర్వ నాశకుడైన ఆ హరితో ఇలా అన్నాడు
తెభా-3-641-క.
"ఘనసూకర! మూఢాత్మక!
వనరుహసంభూత దత్త వరదానమునం
గనిన రసాతలగత భువి
యనయంబును నా యధీనమై వర్తించున్.
టీక:- ఘన = పెద్ద; సూకర = వరాహమా; మూఢాత్మక = మూర్ఖుడా; వనరుహసంభూత = బ్రహ్మదేవుని చేత {వనరుహ సంభూతుడు - వనరుహము (పద్మము)న పుట్టినవాడు, బ్రహ్మదేవుడు}; దత్త = ఇవ్వబడిన; వరదానమునన్ = వరముల వలన; కనిన = కనిపించు; రసాతల = పాతాళమున; గత = ఉన్నట్టిది; భువి = భూమి; అనయంబున్ = అవశ్యము; నా = నా యొక్క; అధీనము = అధీనములో; వర్తించున్ = నడచును.
భావము:- “బుద్ధిలేని ఓ పెద్ద వరాహమా! బ్రహ్మ ఇచ్చిన వరదానాన్నిబట్టి చూస్తే రసాతలంతో కూడిన భూమి శాశ్వతంగా నా ఆధీనమైనదే.
తెభా-3-642-క.
గొనకొని నీ వీ ధరణిం
గొనిపోకుము విడుము కాక కొని యేఁగెదవేఁ
గొనియెద నీ ప్రాణముఁ గై
కొను మిదె నా మాట నలముగొనవేమిటికిన్.
టీక:- గొనకొని = పూనుకొని; నీవు = నీవు; ఈ = ఈ; ధరణిన్ = భూమిని; కొనిపోకుము = తీసుకొనిపోకుము; విడుము = విడువుము; కాక = అలాకాకుండగ; కొని = తీసుకొని; ఏగెదవు = వెళ్లెదవు; ఏని = అయితే; కొనియెద = తీసెద; నీ = నీ; ప్రాణమున్ = ప్రాణమును; కైకొనుము = అంగీకరింపుము; ఇదె = ఇదిగో; నా = నా యొక్క; మాటన్ = మాటని; అలముకొనవున్ = పట్టించుకోవు; ఏమిటికిన్ = ఎందులకు.
భావము:- పూనికతో నీవీ భూమిని తీసుకువెళ్ళకు. విడిచి పెట్టు. కాదని తీసుకుపోతే నీ ప్రాణం తీస్తాను. నా మాటలను విను. మొండిపట్టు ఎందుకు పడతావు?
తెభా-3-643-క.
మాయావి వగుచు నిప్పుడు
వాయక యీ పుడమిఁ జోరభావంబున నీ
వీ యెడఁ గొని పోజూతునె
యాయతభుజబలముచేత నడపక? యనుచున్.
టీక:- మాయావివి = మాయగాడివి; అగుచున్ = అవుతూ; ఇప్పుడు = ఇప్పుడు; పాయక = వదలక; ఈ = ఈ; పుడమిన్ = భూమిని; చోర = దొంగ; భావంబునన్ = బుద్ధితో; నీవు = నీవు; ఈ = ఈ; ఎడన్ = విధముగ; కొని = తీసుకొన; పోజూతునె = పోతుంటే చూస్తూ ఉంటానా?; ఆయాత = విస్తారమైన; భుజ = బాహు; బలమునన్ = బలము; చేతన్ = చే; నడపక = అణచకుండ; అనుచున్ = అంటూ.
భావము:- మాయగాడివై ఇప్పుడీ భూమిని దొంగతనంగా తీసికొని పోతుంటే నిన్ను నా గొప్ప భుజబలం చేత అణచివేయకుండా చూస్తూ ఊరుకుంటానా?
తెభా-3-644-సీ.
అవిరళ యోగమాయాబలంబునఁ జేసి-
యల్ప పౌరుషమున నలరు నిన్ను
నర్థి సంస్థాపించి యస్మత్సుహృద్భృత్య-
కులుల కెల్లను మోద మొలయఁ జేయఁ
జెలువేది మద్గదాశీర్ణుఁడ వగు నిన్నుఁ-
గనుఁగొని దేవతాగణము లెల్ల
నిర్మూలు లై చాల నెఱి నశించెద రన్న"-
విని యజ్ఞపోత్రియై వెలయుచున్న
తెభా-3-644.1-తే.
హరి సరోజాత భవ ముఖామరుల కెల్ల
వచ్చు దురవస్థ కాత్మలో వంత నొంది
నిశిత దంష్ట్తాగ్రలసితమై నెగడు ధరణి
దేవితో నొప్పె నా వాసుదేవుఁ డంత.
టీక:- అవిరళ = గట్టి, దట్టమైన; యోగమాయా = యోగమాయయొక్క; బలంబునన్ = బలము; చేసి = వలన; అల్ప = అల్పమైన; పౌరుషమునన్ = శౌర్యముతో; అలరు = ప్రకాశించు; నిన్నున్ = నిన్ను; అర్థిన్ = కోరి; సంస్థాపించి = పాతిపెట్టేసి; అస్మత్ = నా యొక్క; సుహృత్ = స్నేహితులును; భృత్యు = సేవకులుల; కులులు = గుంపులు; కున్ = కు; ఎల్లన్ = సమస్తమునకు; మోదము = సంతోషము; ఒలయన్ = కలుగునట్లు; చేయన్ = చేయగా; చెలువు = చక్కదనమును; ఏది = నశింపజేసి; మత్ = నా యొక్క; గదా = గదచేత; శీర్ణుడవు = చూర్ణమైనవాడవు; అగు = అయ్యే; నిన్నున్ = నిన్ను; కనుగొని = చూసి; దేవతా = దేవతల; గణములు = సమూహములు; ఎల్లన్ = సమస్తమును; నిర్మూలులు = మొదలుతెగినవారు; ఐ = అయ్యి; చాలన్ = పెక్కు; నెఱిన్ = విధముల; నశించెదరు = నాశనమగుదురు; అన్నన్ = అనగా; విని = విని; యజ్ఞపోత్రి = యజ్ఞవరాహము; ఐ = అయ్యి; వెలయుచున్న = విలసిల్లుతున్నట్టి;
హరి = విష్ణువు; సరోజాతభవ = బ్రహ్మదేవుడు {సరోజాతభవుడు - సరోజాతము (పద్మము)న భవ (పుట్టిన) వాడు, బ్రహ్మదేవుడు}; ముఖ = మొదలగు; అమరుల్ = దేవతల; కున్ = కి; ఎల్లన్ = అందరకు; వచ్చు = వచ్చెడి; దురవస్థ = కష్టముల; కున్ = కి; ఆత్మ = మనసు; లోన్ = లోపల; వంతన్ = దిగులు; పొంది = పొంది; నిశిత = వాడియైన; దంష్ట్రా = కోరల; అగ్ర = చివర; లసితము = ప్రకాశించునది; ఐ = అయ్యి; నెగడు = మెరయుచున్న; ధరణిదేవి = భూదేవి; తోన్ = తోటి; ఒప్పెన్ = చక్కగానుండెను; ఆ = ఆ; వాసుదేవుడు = హరి {వాసుదేవుడు - ఆత్మలందు వసించుదేవుడు, విష్ణువు}; అంతన్ = అంతట.
భావము:- గొప్ప యోగమాయ యొక్క బలంచేత లభించిన అల్పమైన పౌరుషంతో ఉన్న నిన్ను పాతిపెట్టి, నా మిత్రులకు, సేవకులకు ఆనందాన్ని కలిగిస్తాను. నా గదాఘాతంతో ముక్కలైన నీ తలను చూసి దేవతలందరూ నిర్మూలంగా నశిస్తారు” అని హిరణ్యాక్షుడు చెప్పగా విని యజ్ఞవరాహ రూపంతో విలసిల్లుతున్నట్టి....శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతల కందరికీ ఆ రాక్షసుని వల్ల వచ్చే కీడును ఊహించి విచారించి వాడికోర చివర ప్రకాశిస్తున్న భూదేవితో స్థిరంగా ఉన్నాడు.
తెభా-3-645-క.
సురరిపు వాక్యాంకుశముల
గురు కుపితస్వాంతు డగుచుఁ గొమరారె వసుం
ధరతోడ భీతినొందిన
కరణిం గల కరికులేంద్రు కరణిం బెలుచన్.
టీక:- సురరిపు = రాక్షసుని {సుర రిపుడు - సుర (దేవత)లకు రిపుడు (శత్రువు), రాక్షసుడు}; వాక్య = మాటలు అను; అంకుశములన్ = అంకుశములచే {అంకుశము - ఏనుగును నడపుటకు వాడు ఆయుధము}; గురు = మిక్కిలి; కుపిత = కోపించిన; స్వాంతుడు = మనసుకలవాడు; అగుచున్ = అవుతూ; కొమరారెన్ = అందగించెను; వసుంధర = భూదేవి; తోడన్ = తో; భీతిన్ = భయమును; పొందిన = పొందినట్టి; కరణిన్ = ఆడు ఏనుగును; కల = (కూడ) ఉన్న; కరి = ఏనుగులు; కుల = సమూహమునకు; ఇంద్రుడు = నాయకుడు; కరణిన్ = వలె; పెలుచన్ = అతిశయించి.
భావము:- ఆ రాక్షసుని మాటలు అనబడే అంకుశాల పోట్లకు మిక్కిలి కోపించిన హరి భయపడిన ఆడయేనుగుతో ఉన్న గజేంద్రుని వలె భూదేవితో కూడి అతిశయించాడు.
తెభా-3-646-తే.
నిశిత సిత దంత రోచులు నింగిఁ బర్వఁ
గంధి వెడలి భయంకరాకార లీల
నరుగు భీషణ మఖవరాహావతార
మొనరఁ దాల్చిన పద్మలోచనుని వెనుక.
టీక:- నిశిత = వాడియైన; సిత = తెల్లని; దంత = కోరల; రోచులు = కాంతులు; నింగిన్ = ఆకాశమున; పర్వన్ = పరుచుకొనగా; కంధి = సముద్రము నుండి; వెడలి = వెలువడి; భయంకర = భీకరమైన; ఆకార = ఆకారము; లీలన్ = వలె; అరుగు = వెళుతున్న; భీషణ = భయంకరమైన; మఖవరాహ = యజ్ఞవరాహము; అవతారము = అవతారము; ఒనరన్ = ఒప్పునట్లు; తాల్చిన = ధరించిన; పద్మలోచనుని = విష్ణుమూర్తిని {పద్మలోచనుడు - పద్మములవంటి లోచనములు (కన్నులు) ఉన్నవాడు, హరి}; వెనుకన్ = వెంట.
భావము:- వాడియైన తెల్లని కోరల కాంతులు ఆకాశంలో వ్యాపించగా సముద్రంనుండి బయటికి వచ్చిన భయంకరమైన యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన విష్ణువును....
తెభా-3-647-క.
కరి వెనుక దగులు నక్రము
కరణిం జని దైత్యవిభుఁడు గదిసి యిటులనున్
దురిత పయోనిధి తరికిన్
గిరికిన్ ఖురదళిత మేరుగిరికిన్ హరికిన్.
టీక:- కరి = ఏనుగు; వెనుకన్ = వెంట; తగులు = పడు; నక్రము = మొసలి; కరణిన్ = వలె; చని = వెళ్లి; దైత్య = రాక్షస {దైత్యుడు - దితి యొక్క సంతానము, రాక్షసులు}; విభుడున్ = రాజు; కదిసి = సమీపించి; ఇటుల = ఈవిధముగన్; అనున్ = పలికెను; దురితపయోనిధితరి = ఆదివరాహుని {దురిత పయోనిధి తరుడు - దురితములు (పాపములు) అను పయోనిధి (సముద్రము)ని తరుడు (దాటించువాడు), విష్ణువు}; కిన్ = కి; కిరి = ఆదివరాహుని {కిరి - అడవి పంది}; కిన్ = కి; ఖురదళితమేరుగిరి = ఆదివరాహుని {ఖుర దళిత మేరుగిరి - ఖురము (గిట్టలతో) దళిత (అణచబడిన) మేరుగిరి కలవాడు, ఆదివరాహమూర్తి}; కిన్ = కి; హరి = ఆదివరాహుని {హరి - పాపములను హరించువాడు, విష్ణువు}; కిన్ = కి.
భావము:- ఏనుగు వెంటబడిన మొసలి వలె ఆ హిరణ్యాక్షుడు వెంబడించి, పాపసముద్రాన్ని దాటించేవాడూ, వరాహరూపాన్ని ధరించినవాడూ, గిట్టలతో మేరుపర్వతాన్ని మట్టగించినవాడూ అయిన హరితో ఇలా అన్నాడు.
తెభా-3-648-క.
"నిందకు రోయక లజ్జం
జెందక వంచనను రణముసేసి జయంబుం
బొందెద నని తలఁచుచు నిటు
పందగతిం బాఱు బంటుపంతమె నీకున్."
టీక:- నింద = అవమానముల; కున్ = కు; రోయక = అసహ్యించుకొనక; లజ్జన్ = సిగ్గు; చెందక = పడక; వంచనను = మోసముతో; రణము = యుద్ధము; చేసి = చేసి; జయంబున్ = జయమును; పొందెదను = పొందుతాను; అని = అని; తలచుచున్ = అనుకొనుచు; ఇటు = ఇలా; పంద = పిరికిపంద; గతిన్ = వలె; పాఱు = పారిపోవుట; బంటుపంతమె = మగతనమా ఏమి; నీకున్ = నీకు.
భావము:- “నిందించినా రోషం చెందక, సిగ్గుపడక, మోసంతో యుద్ధం చేసి గెలవాలని ఆలోచిస్తూ ఇలా పిరికిపందలాగా పారిపోవడం నీ మగతనానికి తగిన పనేనా?
తెభా-3-649-వ.
అని యాక్షేపించినం బుండరీకాక్షుండు గోపోద్ధీపిత మానసుం డై.
టీక:- అని = అని; ఆక్షేపించినన్ = ఎగతాళిచేసిన; పుండరీకాక్షుండు = యజ్ఞవరాహము {పుండరీకాక్షుడు - పుండరీకములు వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; కోప = కోపముతో; ఉద్దీపిత = రగుల్కొనిన; మానసుండు = మనసు కలవాడు; ఐ = అయ్యి.
భావము:- అని హిరణ్యాక్షుడు ఆక్షేపంచగా శ్రీహరి మనస్సు కోపంతో రగుల్కొనగా...
తెభా-3-650-క.
తోయములమీఁద భూమిన
నాయాసత నిల్పి దానికాధారముగాఁ
దోయజనాభుఁడు దన బల
మాయతమతిఁ బెట్టె సురలు హర్షము వొందన్.
టీక:- తోయముల = జలముల; మీద = మీద; భూమిన్ = భూమిని; అనాయసతన్ = ఆయాసము లేకుండగ; నిల్పి = నిలబెట్టి; దాని = దాని; కిన్ = కి; ఆధారముగన్ = ఆధారముగ; తోయజనాభుడు = యజ్ఞవరాహము {తోయజ నాభుడు - తోయజము (పద్మము) నాభి (బొడ్డు)న కలవాడు, విష్ణువు}; తన = తన యొక్క; బలమున్ = శక్తితో; ఆయత = చక్కటి; మతిన్ = విధమున; పెట్టెను = పెట్టెను; సురలు = దేవతలు; హర్షమున్ = సంతోషమును; పొందగన్ = పొందునట్లు.
భావము:- పద్మనాభుడైన విష్ణువు భూమిని అనాయాసంగా భూమిని నీళ్ళపై నిలిపి, దానికి ఆధారంగా తన బలాన్ని చక్కగా పెట్టాడు. అది చూచి దేవతలు ఆనందించారు.
తెభా-3-651-తే.
కుసుమములఁ వృష్టి బోరనఁ గురిసె నంత
విభవ మొప్పార దేవదుందుభులు మొరసెఁ
గడఁక వీతెంచె గంధర్వగాన రవము
నందితము లయ్యె నప్సరోనర్తనములు.
టీక:- కుసుమములన్ = పుష్పముల; వృష్టి = వర్షము; బోరనన్ = భోరుభోరున; కురిసెన్ = వర్షించెను; అంతన్ = అంతట; విభవము = వైభవము; ఒప్పారన్ = ఒప్పునట్లు; దేవ = దేవతల; దుందుభులున్ = దుందుభులు; మొరసెన్ = మోగినవి; కడకన్ = దిక్కులంట; వీతెంచెన్ = వినవచ్చెను; గంధర్వ = గంధర్వుల; గాన = పాటల; రవమున్ = శబ్దము; నందితములున్ = సంతోషించినవి; అయ్యెన్ = అయినవి; అప్సరస్ = అప్సరసల; నర్తనములు = నాట్యములు.
భావము:- పూలవాన బోరున కురిసింది. దేవదుందుభులు వైభవోపేతంగా మ్రోగాయి. గంధర్వగానం వినిపించింది. అప్సరసల నాట్యాలు ఆనందాన్ని కలిగించాయి.
తెభా-3-652-వ.
అయ్యవసరంబున నయ్యజ్ఞవరాహమూర్తిధరుం డైన కమలలోచనుండు కనక కుండల గేయూర గ్రైవేయ గటకాంగుళీయక భూషణ రోచులు నింగిపర్వ సమరసన్నద్ధుం డై.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయములో; ఆ = ఆ; యజ్ఞవరాహ = యజ్ఞవరాహము యొక్క; మూర్తిన్ = స్వరూపమును; ధరుండు = ధరించినవాడు; ఐన = అయినట్టి; కమలలోచనుండు = హరి {కమల లోచనుడు - కమలములవంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; కనక = బంగారపు; కుండల = కుండలములు; కేయూర = భుజకీర్తులు; గ్రైవేయ = హారములు; కటక = కంకణములు; అంగుళీయక = ఉంగరములు; భూషణ = ఆభరణములు యొక్క; రోచులు = కాంతులు; నింగిన్ = ఆకాశమున; పర్వన్ = పరచుకొనగ; సమర = యుద్ధమునకు; సన్నద్ధుండు = సిద్ధపడినవాడు; ఐ = అయ్యి.
భావము:- ఆ సమయంలో యజ్ఞవరాహ రూపాన్ని ధరించిన విష్ణువు బంగారు మకరకుండలాలు, భుజకీర్తులు, కంఠహారాలు, కంకణాలు, ఉంగరాలు మొదలైన ఆభరణాల కాంతులు ఆకాశ మంతటా వ్యాపింపగా యుద్ధానికి సంసిద్ధుడై...
తెభా-3-653-చ.
ఘనగదఁ గేలఁబూని మణికాంచన నవ్య విచిత్రవర్మమిం
పొనరగఁ దాల్చి దానవ నియుక్త దురుక్త నిశాతబాణముల్
దన ఘనమర్మముల్ కలఁప దానవహంత నితాంతశౌఁర్యుఁ డై
కనలుచు వచ్చు నద్దనుజుఁ గన్గొని రోషవిభీషణాకృతిన్.
టీక:- ఘన = పెద్ద; గదన్ = గదను; కేలన్ = చేత; పూని = పట్టుకొని; మణి = మణులు; కాంచన = బంగారముల; నవ = కొత్త; విచిత్ర = విచిత్రమైన; వర్మము = కవచము; ఇంపు = చక్కదనము; ఒనరగన్ = ఒప్పునట్లు; తాల్చి = ధరించి; దానవ = రాక్షసునిచేత; నియుక్త = ప్రయోగింపబడిన; దురుక్త = చెడుమాటలు అను; నిశాత = వాడియైన; బాణముల్ = బాణములు; తన = తన యొక్క; ఘన = గొప్ప; మర్మముల్ = ప్రాణములను; కలపన్ = కలతపెట్టగ; దానవహంత = యజ్ఞవరాహము {దానవ హంత - దానవ (రాక్షసుల)ను హంత (సంహరించువాడు), విష్ణువు}; నితాంత = మిక్కిలి; శౌర్యుడు = పరాక్రమము కలవాడు; ఐ = అయ్యి; కనలుచున్ = కోపముతో మండిపడుతూ; వచ్చు = వస్తున్న; ఆ = ఆ; దనుజున్ = రాక్షసుని; కన్గొని = చూసి; రోష = రోషముతో; విభీషణ = మిక్కిలి భయంకరమైన; ఆకృతిన్ = స్వరూపముతో.
భావము:- పెద్ద గదాదండాన్ని చేత పట్టుకొని, మణులు పొదిగినట్టి చిత్రమైన బంగారు కవచాన్ని అందంగా ధరించి, హిరణ్యాక్షుడు పలికిన కటువైన మాటలు వాడి బాణాలై తన హృదయాన్ని కలత పెట్టగా విష్ణువు మిక్కిలి పరాక్రమం కలవాడై వస్తున్న అతణ్ణి చూచి ఆగ్రహోదగ్రుడై....
తెభా-3-654-వ.
ఒప్పి నగుచు నిట్లనియె.
టీక:- ఒప్పి = చక్కనై, ఒప్పినవాడై; నగుచున్ = నవ్వుతూ; ఇట్లు = ఈవిధముగ; అనియెన్ = పలికెను.
భావము:- కూడా నవ్వుతూ ఇలా అన్నాడు.
తెభా-3-655-మ.
"వినరా; యోరి! యమంగళాచరణ! యుద్వృత్తిన్ ననున్ నీ మది
న్ననయంబున్ వనగోచరం బగు మృగం బంచుం దలం తౌర! నే
నెనయన్ వన్యమృగంబ యౌదు బలి యై యేతెంచు నీ బోఁటి యీ
శునకశ్రేణి వధింతు నేఁ డని మొనన్ సోఁకోర్చి వర్తించినన్.
టీక:- వినరా = ఒరే విను; ఓరి = ఓరి; అమంగళ = కీడు మూడునవి; ఆచరణ = చేయువాడా; ఉద్వృత్తిన్ = గర్వముతో; ననున్ = నన్ను; నీ = నీ యొక్క; మదిన్ = మనసులో; అనయంబున్ = అవశ్యము; వనన్ = అడవి అందు; గోచరంబు = కనిపించునది; అగు = అయిన; మృగంబున్ = జంతువు; అంచున్ = అని; తలంతు = అనుకొనెదవు; ఔర = ఔరా; నేన్ = నేను; ఎనయన్ = చక్కగా; వన్యమృగంబ = అడవిజంతువునే; ఔదు = ఔతాను; బలి = బలిపశువు; ఐ = అయ్యి; ఏతెంచు = వచ్చునట్టి; నీ = నీ; పోటి = వంటి; ఈ = ఇలాంటి; శునక = కుక్కల; శ్రేణిన్ = సమూహమును; వధింతున్ = సంహరింతును; నేడు = ఈనాడు; అని = యుద్ధ; మొనన్ = రంగములో; సోకు = ఆవేశమును; ఓర్చి = ఓర్చుకొని; వర్తించినన్ = తిరగగలిగితే.
భావము:- ఓరీ అమంగళ కార్యాలను ఆచరించేవాడా! విను. గర్వంతో నన్ను అడవిలో కనిపించే మృగంగా నీ మనస్సులో భావిస్తున్నావు. ఔను. నేను అడవి జంతువునే. నువ్వు యుద్ధరంగంలో స్థిరంగా నిలువగలిగితే బలిపశువుగా వచ్చే నీవంటి కుక్కలను ఈరోజు సంహరిస్తాను.
తెభా-3-656-క.
బలిమి గలదేని నాతోఁ
గలనను నెదిరించి పోరఁగడఁగుము నీ కో
ర్కులు నేఁడు దీర్తు నూరక
తలపోయ వికత్థనంబు దగదు దురాత్మా!
టీక:- బలిమి = శక్తి; కలదు = ఉన్నట్టు; ఏని = అయితే; నా = నా; తోన్ = తోటి; కలనన్ = యుద్ధమున; ననున్ = నన్ను; ఎదిరించి = ఎదుర్కొని; పోరన్ = యుద్ధము చేయ; కడగుము = ప్రయత్నించుము; నీ = నీ యొక్క; కోర్కులు = కోరికలు; నేడు = ఈనాడు; తీర్తున్ = తీర్చెదను; ఊరకన్ = ఉత్తినే; తలపోయ = తలచుకొని; వికత్థనంబున్ = స్వోత్కర్షలు {వికత్థనము - తననుతాను పొగడుకొనుట, స్వోత్కర్ష}; తగదు = తగినపని కాదు; దురాత్మా = చెడ్డవాడ.
భావము:- ఓరీ దురాత్మా! నీకు శక్తి ఉన్నట్లైతే నన్ను యుద్ధంలో ఎదిరించి పోరాడడానికి సిద్ధం కా. ఈరోజు నీ కోరికలను తీరుస్తాను. ఊరికే నిన్ను నీవు పొగడుకొనడం తగదు.
తెభా-3-657-చ.
విను మదిగాక సంగరవివేకవిశారదు లైన యట్టి స
జ్జనములు మృత్యుపాశములఁ జాల నిబద్ధులు నయ్యు నీ వలెన్
గొనకొని యాత్మ సంస్తుతులకున్ ముదమందిరె యేల యీ విక
త్థనములు బంటుపంతములె దైత్యకులాధమ! యెన్ని చూడగన్.
టీక:- వినుము = వినుము; అది = అంతే; కాక = కాకుండగ; సంగర = యుద్ధవిద్యా; వివేక = జ్ఞానము; విశారదులు = బాగుగ తెలిసినవారు; ఐన = అయిన; అట్టి = అటువంటి; సత్ = మంచి; జనములు = వాళ్లు; మృత్యు = మరణ; పాశములన్ = పాశములచే; చాలన్ = మిక్కిలి; నిబద్ధులు = బాగకట్టబడినవారు; అయ్యు = అయినప్పటికిని; నీ = నీ; వలెన్ = వలెనే; గొనకొని = పూనుకొని; ఆత్మ = స్వ; సంస్తుతుల్ = ఉత్కర్షల; కున్ = కు; ముదము = ఇష్ట; అందిరె = పడిరా; ఏలన్ = ఎందులకు; ఈ = ఈ; వికత్థనములు = స్వోత్కర్షలు; బంటుపంతములె = శౌర్యవంతములా ఏమి; దైత్య = రాక్షస {దైత్యుడు - దితి యొక్క సంతానము, రాక్షసులు}; కుల = వంశమునకు; అధమ = నీచుడా; ఎన్ని = ఎంచి; చూడగన్ = చూసినచో.
భావము:- ఓ రాక్షస కులాధమా! విను. రణరంగ విశారదులైన సత్పురుషులు మృత్యుపాశాలలో చిక్కుకొని కూడా నీలాగా తమను తాము పొగడుకొని సంతోషించారా? ఎందుకీ ఆత్మస్తుతులు? ఎంచి చూస్తే ఇవి పౌరుషవంతుని లక్షణాలా?
తెభా-3-658-మ.
ధృతిఁ బాతాళము నందు నీ వనెడి సందీప్తోగ్రనిక్షేపమే
నతి దర్పంబునఁ గొందుఁ జూడు మిదె దేవారాతి! నన్నెన్నెదౌ
గతలజ్జుం డన దాఁగి యుండి రణముం గావింతు యుష్మద్గదా
వితతద్రావితుఁ డన్న నన్నెదురుమా వేదీర్తు నీ కోరికల్.
టీక:- ధృతిన్ = సౌఖ్యముగ; పాతాళము = పాతాళము; అందున్ = లో; నీవు = నీవు; అనెడి = అనే; సందీప్త = బాగా ప్రకాశిసుస్తున్న; ఉగ్ర = భీకర; నిక్షేపమున్ = నిధిని, దాచుటకు పాతబడినది; అతి = మిక్కిలి; దర్పమునన్ = గర్వముతో; కొందు = గ్రహించెదను; చూడుము = చూడు; ఇదె = ఇదిగో; దేవారాతి = రాక్షసుడ {దేవారాతి - దేవతలకు ఆరాతి (శత్రువు), రాక్షసుడు}; నన్నున్ = నన్నే; ఎన్నెదవు = హేళన చేసెదవు; ఔ = అంతవాడివా; గత = పోయిన; లజ్జుండ = సిగ్గు కలవాడినని; అనన్ = అనేలా; దాగి = దాగికొని; ఉండి = ఉండి; రణమున్ = యుద్ధమును; కావింతున్ = చేయుదును; ఉష్మత్ = నీ యొక్క; గదా = గదచేత; వితత = విస్తారముగ; ద్రావితుడన్ = పరుగెత్తించబడినవాడను; అన్న = అనినట్టి; నన్నున్ = నన్ను; ఎదురుమా = ఎదుర్కొనుము; వేదీర్తున్ = వేగమే తీర్చెదను; నీ = నీ యొక్క; కోరికల్ = కోరికలను.
భావము:- దేవతల శత్రువైన ఓ హిరణ్యాక్షా! చూస్తూ ఉండు. నీవు చెప్పే పాతాళలోకపు గొప్ప నిధిని నేను గ్రహించి గర్విస్తాను. నన్ను సిగ్గులేనివానిగా లెక్కించావు కనుక నేను నీతో దాగి ఉండే యుద్ధం చేస్తాను. నీ గదాదండానికి భయపడి పారిపోతున్నా నన్నావు కదా! నన్నెదుర్కో. నేను నీ కోరికలను తీరుస్తాను.
తెభా-3-659-ఉ.
ఎన్నఁ బదాతియూధముల కెల్ల విభుండవు పోటుబంటవై
నన్ను రణోర్వి నేఁ డెదిరినన్ భవదీయ బలంబు నాయువున్
మిన్నక కొందుఁ జూడు మిది మేరగ మేదిని వీతదైత్యమై
వన్నెకు నెక్కఁ జేసెద నవార్యపరాక్రమ విక్రమంబునన్.
టీక:- ఎన్నన్ = చూస్తే; పదాతి = సైన్య; యూధముల్ = సమూహముల; కిన్ = కి; ఎల్లన్ = అన్నిటికి; విభుడవు = నాయకుడవు; పోటుబంటవు = శూరుడవు; ఐ = అయ్యి; నన్నున్ = నన్ను; రణ = యుద్ధ; ఉర్విన్ = భూమిలో; నేడు = ఈనాడు; ఎదిరినన్ = ఎదుర్కొనిన; భవదీయ = నీ యొక్క; బలంబున్ = బలమును; ఆయువున్ = ఆయువును; మిన్నకన్ = చడిచప్పుడు లేకుండ; కొందున్ = గ్రహించెదను; చూడుము = చూడు; ఇదె = ఇదే; మేరగ = హద్దుగా; మేదినిన్ = భూమిని; వీత = తొలగిన; దైత్యమున్ = రాక్షసులు కలది; ఐ = అగునట్లు; వన్నెకునెక్కన = ప్రసిద్దమగునట్లు; చేసెద = చేసెద; అవార్య = తిరుగులేని; పరాక్రమ = పరాక్రమముయొక్క; విక్రమంబునన్ = అతిశయముతో.
భావము:- నీవు సేనానాయకుడవు. శూరుడవై ఈరోజు యుద్ధభూమిలో నన్ను ఎదిరించితే నీ బలాన్నీ ఆయువునూ తీసుకొంటాను చూడు. తిరుగులేని పరాక్రమంతో నేటినుండి భూమి రాక్షసులు లేనిదై వన్నెకెక్కేలా చేస్తాను.
తెభా-3-660-చ.
నను నెదురంగఁ జాలిన ఘనం బగు శౌర్యము ధైర్యమున్ బలం
బును గలవేని నిల్వు రణభూమిని నీ హితులైన వారికిం
గనుఁగవ బాష్పపూరములు గ్రమ్మఁగ మాన్పఁగనోపుదేనిఁ జ
య్యనఁ జనఁబొమ్ము దానవకులాధమ! యూరక రజ్జులేటికిన్.
టీక:- ననున్ = నన్ను; ఎదురంగన్ = ఎదిరింప; జాలిన = గలిగిన; ఘనంబున్ = గొప్పది; అగు = అయిన; శౌర్యమున్ = పరాక్రమమును; ధైర్యమున్ = ధైర్యమును; బలంబున్ = బలమును; కలవు = ఉన్నట్టు; ఏని = అయితే; నిల్వు = నిలబడు; రణ = యుద్ధ; భూమినిన్ = భూమి యందు; నీ = నీ యొక్క; హితులు = ఇష్టులు; ఐన = అయిన; వారికిన్ = వారికి; కను = కనుల; గవ = జంట; బాష్ప = కన్నీటి; పూరములున్ = మొత్తములు; క్రమ్మగన్ = కమ్ముకొనుటను; మాన్పగన్ = మానపించుటకు; ఓపుదేని = సమర్థుడవైతే; చయ్యనన్ = వెంటనే; చనబొమ్ము = వెళ్లిపో; దానవ = రాక్షస; కుల = వంశమునకు; అధమ = నీచుడా; ఊరకన్ = ఉట్టినే; రజ్జులు = గొడవలు; ఏటికిన్ = ఎందులకు.
భావము:- రాక్షస కులాధమా! నన్ను ఎదిరించగల శౌర్యము, ధైర్యము, బలం నీకు ఉన్నట్లైతే యుద్ధభూమిలో నిలబడు. నీ ఆప్తులు కన్నీరు కార్చడాన్ని ఆపదలిస్తే వెంటనే వెళ్ళిపో. అనవసరమైన ప్రగల్భా లెందుకు?
తెభా-3-661-క.
నను నిట సంస్థాపించెద
నని పలికితి వంతవాఁడవౌదువు నీకున్
నెనరైన చుట్టములఁ బొడ
గని రా యిదె యముని పురికిఁ గాపుర మరుగన్."
టీక:- ననున్ = నన్ను; ఇటన్ = ఇక్కడ; సంస్థాపించెదన్ = పాతివేసెదను; అని = అని; పలికిన = అంటివి; వాడవున్ = వాడివి; ఔదువు = అగున ఏమి; నీ = నీ; కున్ = కు; ఎవరైనన్ = ఎవరైనా; చుట్టములన్ = బంధువులను; పొడగొని = చూసి; రాన్ = రావాలని ఉంటే; ఇదె = ఇదే సమయము; యముని = యమధర్మరాజు యొక్క; పురి = నగరమునకు; కాపురమున్ = నివసించుటకు; అరుగన్ = వెళ్ళుటకు (సందర్భము).
భావము:- నన్నిక్కడ పూడ్చిపెడతా నన్నావు. అంతటివాడవే కావచ్చు. యమపురంలో కాపురానికి వెళ్ళేముందు నీకు ఇష్టమైన చుట్టాలను చివరిసారిగా చూసుకొని రా.”
తెభా-3-662-మ.
అని యిబ్భంగి సరోరుహాక్షుఁడు హిరణ్యాక్షున్ విడంబించి ప
ల్కిన హాసోక్తుల కుల్కి రోషమదసంఘీభూతచేతస్కుఁ డై
కనుఁ గ్రేవన్ మిడుఁగుర్లు సాలఁ బొడమంగాఁ గిన్కమైఁ దోఁకఁ ద్రొ
క్కిన కృష్ణోరగరాజు మాడ్కి మదిలోఁ గీడ్పాటు వాటిల్లఁగన్.
టీక:- అని = అని; ఈ = ఈ; భంగిన్ = విధముగ; సరోరుహాక్షుండు = ఆదివరాహుడు {సరోరుహాక్షుడు - సరోరుహము (పద్మము) వంటి కన్నులు ఉన్నవాడు, విష్ణువు}; హిరణ్యాక్షున్ = హిరణ్యాక్షుడిని; విడంబించి = హేళనచేసి; పల్కిన = పలికిన; హాస = ఎగతాళి; ఉక్తుల్ = మాటల; కున్ = కు; ఉల్కి = ఉలికిపడి; రోష = రోషమును; మద = గర్వమును; సంఘీభూత = కలసిపోయిన; చేతస్కుడు = మనసుకలవాడు; ఐ = అయ్యి; కను = కంటి; గ్రేవన్ = చివరలనుండి; మిడుగుర్లు = నిప్పురవ్వలు; చాలన్ = ఎక్కువగ; పొడమన్ = కనుపించగా; కిన్క = కోపము; మై = తో; తోకన్ = తోకను; త్రొక్కిన = తొక్కిన; కృష్ణ = నల్లత్రాచు; ఉరగ = సర్ప; రాజు = రాజు; మాడ్కిన్ = వలె; మది = మనసు; లోన్ = లో; కీడ్పాటు = చికాకు; వాటిల్లగన్ = కలుగునట్లు.
భావము:- అని ఈవిధంగా కమలాక్షుడైన విష్ణువు హిరణ్యాక్షుని ఆక్షేపించి పలికిన పరిహాసపు మాటలకు అతడు కోపం తెచ్చుకొని, రోషమూ గర్వమూ కలగలసిన మనస్సు కలవాడై, కనుగొనల్లో నిప్పుకణాలు వెలిగ్రక్కగా, తోక త్రొక్కిన నల్లత్రాచులాగా చీకాకు కలుగగా...
తెభా-3-663-క.
చలితేంద్రియుఁడై నిట్టూ
ర్పులు నిగడించుచును బొమలు ముడుపడ రోషా
కులమానసుఁడై గదఁగొని
జలజాక్షున కెదురు నడచె సాహసమొప్పన్.
టీక:- చలిత = కంపించిన; ఇంద్రియుండు = ఇంద్రియములు కలవాడు; ఐ = అయ్యి; నిట్టూర్పులు = నిట్టూర్పులను; నిగడించుచును = పెద్దగా చేస్తూ; బొమలు = కనుబొమలు; ముడుపడన్ = ముడిపడగ; రోష = రోషముచేత; ఆకుల = చీకాకుపడిన; మానసుడు = మనసు కలవాడు; ఐ = అయ్యి; గదన్ = గదను; కొని = తీసుకొని; జలజాతాక్షున్ = ఆదివరాహుని {జలజాతాక్షుడు - జలజాతము (పద్మము) వంటి కన్నులు కలవాడు, విష్ణువు}; కిన్ = కి; ఎదురు = ఎదురుగ; నడచెన్ = నడచెను; సాహసము = ధైర్యము; ఒప్పన్ = ఒప్పునట్లుగ.
భావము:- శరీరం కంపించగా, వేడి నిట్టూర్పులు విడుస్తూ, కనుబొమలి ముడిపడగా, రోషంతో మనస్సు కలత చెందిన మనస్సు కలవాడై గదను తీసుకొని సాహసంతో విష్ణువునకు ఎదురు నడిచాడు.
తెభా-3-664-వ.
అత్తఱి హిరణ్యాక్షుం డతి భయంకరాకారుం డై.
టీక:- ఆ = ఆ; తఱిన్ = సమయమున; హిరణ్యాక్షుండు = హిరణ్యాక్షుడు; అతి = మిక్కిలి; భయంకర = భీకరమైన; ఆకారుడు = ఆకారము కలవాడు; ఐ = అయ్యి.
భావము:- ఆ సమయంలో హిరణ్యాక్షుడు అతిభయంకరమైన ఆకారం కలవాడై....
తెభా-3-665-మ.
గద సారించి మదాసురేంద్రుఁడు సమగ్రక్రోధుఁడై మాధవుం
గుదియన్ వ్రేసిన వ్రేటు గైకొనక రక్షోహంత శౌర్యోన్నతిన్
గదఁ గేలన్ ధరియించి దానిఁ దునుకల్ కావించినం దైత్యుఁ డు
న్మదుఁడై యొండు గదన్ రమావిభుని భీమప్రక్రియన్ వ్రేసినన్.
టీక:- గదన్ = గదను; సారించి = సాచిపెట్టి; మద = మదమెక్కిన; అసుర = రాక్షస; ఇంద్రుడు = ప్రభువు; సమగ్ర = నిండిన; క్రోధుడు = కోపము కలవాడు; ఐ = అయ్యి; మాధవున్ = ఆదివరాహుని {మాధవుడు - మనసును రంజింపచేయువాడు, విష్ణువు}; గుదియన్ = కూలిపోవునట్లు; వ్రేసినన్ = వేయగా; వ్రేటు = దెబ్బను; కైకొనకన్ = తీసుకొనక; రక్షోహంత = ఆదివరాహుడు {రక్షోహంత - రక్షస (రాక్షసులను) హంత (సంహరించువాడు), విష్ణువు}; శౌర్య = శౌర్యము యొక్క; ఉన్నతిన్ = అతిశయముతో; గదన్ = గదను; కేలన్ = చేతిలో; ధరియించి = ధరించి; దానిన్ = దానిని; తునుకల్ = ముక్కలు ముక్కలుగ; కావించినన్ = చేయగా; దైత్యుడు = రాక్షసుడు {దైత్యుడు - దితి యొక్క సంతానము, రాక్షసులు}; ఉన్మత్తుడు = వెఱ్ఱెత్తిపోయినవాడు; ఐ = అయ్యి; ఒండు = వేరొక; గదన్ = గదను; రమావిభుని = ఆదివరాహుని {రమావిభుడు - రమా (లక్ష్మీదేవి యొక్క) విభుడు (భర్త), విష్ణువు}; భీమ = మిక్కిలి గట్టిదియైన; ప్రక్రియన్ = విధముగ; వ్రేసినన్ = వేయగా.
భావము:- మదించిన ఆ రాక్షసరాజు మిక్కిలి కోపంతో విష్ణువును గదతో దెబ్బ వేయగా, రాక్షససంహారి అయిన హరి ఆ దెబ్బను లక్ష్యపెట్టక, శౌర్యంతో ఆ గదను స్వాధీనం చేసికొని ముక్కలు చేసాడు. రాక్షసుడు వెఱ్ఱెత్తిపోయి మరొక గదతో భయంకరంగా విష్ణువును కొట్టాడు.
తెభా-3-666-చ.
అది దనుఁ దాకకుండ దనుజారి గదారణకోవిదక్రియా
స్పద కరలాఘవక్రమముఁ బైకొని చూపి విరోధి పేరురం
బదరఁగ వ్రేయ వాఁడు వివశాకులభావము నొంది యంతలో
మదిఁ దెలివొంది వ్రేసె రిపుమానవిమర్దను నా జనార్దనున్.
టీక:- అది = అది; తనున్ = తనను; తాకకుండ = తగలకుండగ; దనుజారి = ఆదివరాహుడు {దనుజారి - దనుజు (రాక్షసు)లకు అరి (శత్రువు) , విష్ణువు}; గదా = గదతో చేయు; రణ = యుద్ధవిద్యలో; కోవిద = ప్రావీణ్యత; ఆస్పద = నెలవైన; కైవడిన్ = వలె; ఆస్పద = కూడిన; కర = హస్త; లాఘవ = లాఘవము యొక్క; క్రమమున్ = విధానమును; పైకొని = మిక్కిలిగ; చూపి = చూపించి; విరోధి = శత్రువు యొక్క; పేరు = పెద్ద; ఉరంబున్ = వక్షస్థలము; అదరంగ = అదిరిపోవునట్లు; వ్రేయన్ = వేయగా; వాడు = వాడు; వివశ = వశముతప్పిన; ఆకుల = చికాకు; భావము = పడుటను; పొంది = పొంది; అంతలో = అంతలోనే; మదిన్ = మనసున; తెలివి = తెలివి; పొంది = పొంది; వ్రేసెన్ = వేసెను; రిపుమానవిమర్దనున్ = ఆదివరాహుని {రిపు మాన విమర్దనుడు - రిపు (శత్రువుల) మాన (అభిమాన)మును విమర్దనుడు (బాగుగ అణచువాడు), విష్ణువు}; ఆ = ఆ; జనార్దనున్ = ఆదివరాహుని {జనార్దనుడు - విష్ణువు}.
భావము:- రాక్షసవైరి అయిన హరి ఆ దెబ్బ తనకు తగలకుండా గదాయుద్ధనైపుణ్యం వెల్లడించే హస్తలాఘవంతో ఆ గదను పట్టుకొని దానితోనే శత్రువు విశాలమైన వక్షస్థలం అదిరిపోయేటట్లు కొట్టాడు. వాడు ఎంతో చికాకుపడి, అంతలోనే తెప్పరిల్లి, శత్రుమర్దనుడైన ఆ జనార్దనుణ్ణి కొట్టాడు.
తెభా-3-667-వ.
ఇట్లు దలపడి; యన్యోన్య జయకాంక్షల నితరేతర తుంగతరంగ తాడితంబు లగు దక్షిణోత్తర సముద్రంబుల రౌద్రంబునఁ బరస్పర శుండాదండ ఘట్టిత మదాంధ గంధసింధుర యుగంబు చందంబున రోషభీషణాటోపంబులం దలపడు బెబ్బులుల గబ్బున నతి దర్పాతిరేకంబున నెదిర్చి ఱంకెలు వైచు మదవృషభంబుల రభసంబున నసహ్యసింహపరాక్రమంబున విక్రమించి పోరునెడ; హిరణ్యాక్షుండు సవ్యమండల భ్రమణంబునం బరివేష్టించినం బుండరీకాక్షుండు దక్షిణ మండల భ్రమణంబునం దిరిగి విపక్షవక్షం బశనిసంకాశం బగు గదా దండంబునం బగిల్చిన; వాడు దెప్పఱి తెలివొంది లేచి; దనుజ పరిపంథి ఫాలంబు నొప్పించె; నప్పు డమ్మేటి వీరులు శోణితసిక్తాంగు లై పుష్పితాశోకంబులం బురుడించుచుం బాయుచు డాయుచు వ్రేయుచు రోయుచు నొండొరుల రుధిరంబు లాఘ్రాణించుచుఁ దిరస్కార పరిహసోక్తుల నిచ్చుచుఁ బోరు సమయంబున; నమ్మహాబలుల సమరంబుఁ జూచువేడ్కఁ బద్మసంభవుండు నిఖిల మునీంద్ర సిద్ద సాధ్య దేవ గణంబులతోడఁ జనుదెంచి; ధరిత్రీ నిమిత్తంబున నసురవరునితోడం బోరు యజ్ఞవరాహున కిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; తలపడి = కలబడి; అన్యోన్య = ఒకరినొకరు; జయ = జయించు; కాంక్షలన్ = కోరికలతో; ఇతరేతర = ఒకదాని నింకొకటి; తుంగ = ఎత్తైన; తరంగంబులన్ = కెరటములతో; తాడితంబులు = కొట్టబడినవి; అగు = అయిన; దక్షిణ = దక్షిణపు; ఉత్తర = ఉత్తరపు; సముద్రంబుల్ = సముద్రములు; అనన్ = అన్నట్లు; రోద్రంబునన్ = పరాక్రమముతో; పరస్పర = ఒకదానితో నొకటి; శుండా = తొండములు అను; దండ = దండములతో; ఘట్టిత = కొట్టబడిన; మద = మదముచేత; అంధ = కన్నుగానని; గంధసిధుర = ఏనుగుల; యుగళ = జంట; చందంబునన్ = వలె; రోష = రోషముతో; భీషణ = భయంకరమైన; ఆటోపంబులన్ = విజృంభణములతో; తలపడి = కలబడి; బెబ్బులుల = పెద్దపులుల యొక్క; గబ్బునన్ = పరాక్రమముతో; అతి = మిక్కిలి; దర్ప = గర్వము; అతిరేకంబునన్ = విజృంభణములతో; ఎదిర్చి = ఎదుర్కొనుచు; ఱంకెలు = రంకెలు; వైచు = వేసే; మద = మదించిన; వృషభంబుల = ఎద్దుల; రభసంబునన్ = వేగముతోను; అసహ్య = సహింపరాని; సింహ = సింహముల వంటి; పరాక్రమంబునన్ = శౌర్యముతోను; విక్రమించి = పరాక్రమించి; పోరున్ = యుద్ధము చేయు; ఎడన్ = సమయమున; హిరణ్యాక్షుండు = హిరణ్యాక్షుడు; సవ్యమండల = సవ్యమైన గుండ్రముగ; భ్రమణంబునన్ = తిరుగుటతో; పరివేష్టించినన్ = చుట్టుకొనిరాగా; పుండరీకాక్షుండు = ఆదివరాహుడు {పుండరీకాక్షుడు - పుండరీకములు (పద్మములు) వంటి అక్షుడు (కన్నులు కలవాడు), విష్ణువు}; దక్షిణ = దక్షిణపు; మండల = గుండ్రముగ; భ్రమణుంబునన్ = తిరుగుటతో; తిరిగి = చుట్టుకొనివచ్చి; విపక్ష = శత్రుపక్షపువాని; వక్షంబున్ = వక్షస్థలమును; అశని = పిడుగుపాటు; సంకాశంబు = వంటిది; అగు = అయిన; గదాదండంబునన్ = గదతో; పగిల్చినన్ = పగులగొట్టగా; వాడున్ = వాడు; తెప్పఱి = తెప్పరిల్లి; తెలివొంది = తెలివితెచ్చుకొని; లేచి = లేచి; దనుజపరిపంథి = ఆదివరాహుని {దనుజపరిపంథి - దనుజు (రాక్షసు)లకు పరిపంథి (శత్రువు) , విష్ణువు}; ఫాలంబున్ = నుదిటిని; నొప్పించెన్ = దెబ్బకొట్టెను; అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; మేటి = గొప్ప; వీరులు = శూరులు; శోణిత = రక్తముతో; సిక్త = తడసిన; అంగులు = అవయవములు కలవారు; ఐ = అయ్యి; పుష్పిత = పుష్పించిన; అశోకంబులన్ = అశోకవృక్షములను; పురుడించుచు = సాటియగుచు; పాయుచున్ = దూరమగుతూ; డాయుచున్ = దగ్గరగుతూ; వ్రేయుచున్ = కొట్టుతూ; రోయుచున్ = నిందిస్తూ; ఒండొరులన్ = ఒకరిదొకరు; రుధిరంబున్ = రక్తమును; ఆఘ్రాణించుచున్ = వాసనచూస్తూ; తిరస్కార = లెక్కచేయని; పరిహస = ఎగతాళిచేయు; ఉక్తులన్ = మాటలు; ఇచ్చుచున్ = ఆడుతూ; పోరు = యుద్ధము చేయు; సమయంబునన్ = సమయములో; ఆ = ఆ; మహా = గొప్ప; బలుల = బలశాలుల యొక్క; సమరంబున్ = యుద్ధమును; చూచు = చూసే; వేడ్కన్ = వేడుకతో; పద్మసంభవుండు = బ్రహ్మదేవుడు {పద్మసంభవుడు - పద్మమున సంభవించిన (పుట్టిన) వాడు, బ్రహ్మదేవుడు}; నిఖిల = సమస్తమైన; ముని = మునులలో; ఇంద్ర = శ్రేష్ఠులు; సిద్ధ = సిద్ధులు; సాధ్య = సాధ్యులు; దేవ = దేవతల; గణంబుల = సమూహముల; తోడన్ = తోటి; చనుదెంచి = వచ్చి; ధరిత్రీ = భూమండలము, భూదేవి; నిమిత్తంబునన్ = కొరకు; అసుర = రాక్షసులలో {అసురుడు -సుర (దేవత) కానివాడు, రాక్షసుడు}; వరున్ = శ్రేష్ఠుని; తోడన్ = తోటి; పోరు = యుద్ధము చేయుచున్న; యజ్ఞవరాహున్ = ఆదివరాహుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఈ విధంగా తలపడి ఒకరినొకరు జయించాలనే కోరిక కలవారై ఆ ఇద్దరూ కోపంతో ఉవ్వెత్తుగా లేచే కెరటాలతో ఒకదాని నొకటి కొట్టుకొంటున్న ఉత్తర దక్షిణ సముద్రాల లాగా, పెద్ద తొండాలతో పరస్పరం ఢీకొంటున్న రెండు మత్తగజాల లాగా, రోషంతో భయంకరంగా గాండ్రిస్తూ తలపడుతున్న రెండు పెద్దపులుల్లా, పొగరుబోతుతనంతో రంకెలు వేస్తూ క్రుమ్ములాడుకుంటున్న ఆబోతుల జంటలాగా సహింపరాని సింహబలంతో పోరాటం చేస్తున్నప్పుడు హిరణ్యాక్షుడు ఎడమ వైపుకు గిఱ్ఱున తిరగగా, విష్ణువు కుడివైపు తిరిగి గదాదండంతో శత్రువు వక్షాన్ని పిడుగుపాటు వంటి దెబ్బతో పగులగొట్టాడు. వాడు తెలివి తప్పి తెప్పరిల్లి లేచి హరి నుదుటిపై కొట్టి నొప్పించాడు. అప్పుడు ఆ ఇద్దరు వీరులు తమ శరీరాలు రక్తంతో తడిసిపోగా పూచిన అశోకవృక్షాలవలె ఉన్నారు. ఒకరికొకరు దూరంగా వెళ్తూ, సమీపిస్తూ, కొడుతూ, అరుస్తూ, ఒకరు మరొకరి రక్తాన్ని వాసన చూస్తూ, తిరస్కారంతో కూడిన హేళనలు చేస్తూ యుద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో ఆ మహాబలుల యుద్ధాన్ని చూడాలనే కోరికతో బ్రహ్మ సమస్త మునీంద్రులను, సిద్ధులను, సాధ్యులను, దేవతల సమూహాన్ని వెంటబెట్టుకొని వచ్చి భూమి కొరకు రాక్షసునితో యుద్ధం చేస్తున్న యజ్ఞవరాహ స్వామితో ఇలా అన్నాడు.