పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/హిరణ్యకశిప హిరణ్యాక్షుల జన్మ

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-3-601-తే.
ఇంతి "తన సుతుల్ సురలఁ గారింతు"రనుచుఁ
లచుఁచుండగ నంత వత్సర శతంబు
నఁగ నటమీదఁ గనియెఁ గశ్యపునిదేవి
ఖిలలోకైక కంటకు లైన సుతుల.

టీక:- ఇంతి = ఆమె; తన = తన యొక్క; సుతుల్ = పుత్రులు; సురలన్ = దేవతలను; కారింతురు = బాధింతురు; అనుచున్ = అని; తలచుచున్ = తలచుకొనుచూ; ఉండగన్ = ఉండగా; అంతన్ = అంతట; వత్సర = సంవత్సరముల; శతము = వంద; చనగన్ = గడచిన; అటమీద = తరువాత; కనియెన్ = జన్మ నిచ్చెను; కశ్యపుని = కశ్యపుడి; దేవి = భార్య; అఖిల = సమస్తమైన; లోక = లోకములు; ఏక = అన్నిటికిని; కంటకులు = ముల్లువలె బాధించువారు; ఐన = అయినట్టి; సుతులన్ = పుత్రులను.
భావము:- తన కుమారులు దేవతలను బాధిస్తారని దితి తలపోయసాగింది. నూరు సంవత్సరాలు గడిచాయి. అప్పుడు దితి సకల లోకకంటకులైన కుమారులను కన్నది.

తెభా-3-602-వ.
అయ్యవసరంబున,
టీక:- ఆ = ఆ; అవసరంబున్ = సమయమున.
భావము:- ఆ సమయంలో...

తెభా-3-603-తే.
రణి గంపించెఁ గులపర్వములు వడఁకె
లధులు గలంగెఁ దారకాళులు డుల్లె
గన మగలెను మ్రొగ్గె దిక్కరులు దిశల
మిడుఁగుఱు లెగసెఁ బిడుగులు పుమిఁ బడియె.

టీక:- ధరణి = భూమి యందు; కంపించె = (భూ) కంపములు పుట్టెను; కులపర్వతములు = ఏడు(సప్త) ప్రధాన పర్వతములు {కులపర్వతములు - సప్తపర్వతములు - 1 మహేంద్రగిరి 2 మలయపర్వతము 3 సహ్యాద్రి 4 శుక్తిమంతము 5 ఋక్షవంతము 6 వింధ్యపర్వతము 7 పారియాత్రము}; వడకె = వణికినవి; జలధులు = సముద్రములు {సప్తసముద్రములు – 1.లవణసముద్రము, 2.ఇక్షుసముద్రము, 3.సురాసముద్రము, 4.ఘృతసముద్రము, 5.దధిసముద్రము, 6.క్షీరసముద్రము, 7.జలసముద్రము; కలంగె = కలతపడి మడ్డిదేరినవి; తారకా = తారలు; ఆవళులు = గుంపులుగ; డుల్లె = రాలినవి; గగనము = ఆకాశము; అగలెన్ = బద్దలయినది; మ్రొగ్గెన్ = ఒరిగినవి, మోకరిల్లినవి; దిక్కరులు = అష్టదిగ్గజములు {దిక్కరులు -అష్టదిగ్గజములు - 1ఐరావతము 2 పుండరీకము 3వామనము 4కుముదము 5అంజనము 6పుష్పదంతము 7సుప్రతీకము 8సుప్రతీకము }; దిశలన్ = అష్టదిక్కులు అందు {దిశలు - అష్టదిక్కులు - 1తూర్పుదిక్కు 2 ఆగ్నేయమూల 3దక్షిణదిక్కు 4నైరృతిమూల 5పడమరదిక్కు 6వాయవ్యమూల 7ఉత్తరదిక్కు 8ఈశాన్యమూల}; మిడుగుఱులు = అగ్నికణములు; ఎగసెన్ = ఎగిరినవి; పిడుగులు = పిడుగులు; పుడమిన్ = భూమిపైన; పడియెన్ = పడినవి.
భావము:- భూమి కంపించింది. కులపర్వతాలు వణికాయి. సముద్రాలు కలతపడ్డాయి. నక్షత్రాలు నేల రాలాయి. ఆకాశం బ్రద్దలైంది. అష్టదిగ్గజాలు ఊగిపోయాయి. దిక్కులనిండా అగ్నికణాలు ఎగిసిపడ్డాయి. భూమిమీద పిడుగులు పడ్డాయి.

తెభా-3-604-సీ.
హోమానలంబుల ధూమంబు లడరెను-
బ్రతికూలవాయువుల్ లసి వీచెఁ
రువు లెల్లెడ విటతాటంబులై కూలె-
గ్రహతారకావళి కాంతి మాసె
బెసి మొగిళ్లు నెత్తురు వాన గురిసెను-
మెఱుఁగులు దెసల మిర్మిట్లు గొలిపె
స్వర్భాను డొగి నపర్వమున భానునిఁ బట్టె-
గైకొని చిమ్మ చీట్లు పర్వె

తెభా-3-604.1-తే.
మొనసి కుక్కలు మొఱిఁగెను మోరలెత్తి
గలు నక్కలు వాపోయె గము లార్త
వము లిచ్చెను దేవతాప్రతిమ లొరగెఁ
న్నులను నశ్రుకణములు గ్రందుకొనగ.

టీక:- హోమ = హోమగుండములలోని; అనలంబులన్ = అగ్నులందు; ధూమంబుల్ = పొగలు; అడరెను = కమ్మినవి; ప్రతికూల = విపరీతమైన, ఎదురు; వాయువుల్ = గాలులు; బలసి = బలపడి; వీచెన్ = వీచినవి; తరువులు = చెట్లు; ఎల్లెడ = ఎల్లెడల; విటతాటంబులు = తల్లకిందులై; కూలెన్ = కూలిపోయినవి; గ్రహ = గ్రహముల; తారకా = తారకల; ఆవళి = గుంపుల; కాంతి = ప్రకాశములు; మాసెన్ = మాసిపోయినవి; బెరసి = అతిశయించి; మొగిళ్ళు = మబ్బులు; నెత్తురు = రక్తపు; వాన = వానలు; కురిసెన్ = కురిసినవి; మెఱుగులు = మెరుపులు; దెసలన్ = నలుదెసల, నాలుగు పక్కల; మిర్మిట్లున్ = మిర్మిట్లు; కొలిపెన్ = కలిగించినవి; స్వర్భానుడు = రాహువు; అపర్వమున = అమావాస్యకానిరోజు, గ్రహణ పర్వముకాని సమయములో; భానునిన్ = సూర్యుని; పట్టెన్ = పట్టెను; కైకొని = పూని; చిమ్మచీకట్లు = కటికచీకట్లు; పర్వె = కమ్మెను;
మొనసి = గుమిగూడి; కుక్కలు = కుక్కలు; మొఱిగెను = అరుస్తున్నవి; మోరలు = మెడలు; ఎత్తి = ఎత్తి; పగలు = పట్టపగలు; నక్కలు = నక్కలు; వాపోయె = ఏడుస్తున్నట్లు అరచినవి; ఖగములు = పక్షులు; ఆర్తరవములు = బాధతో అరుపులు; ఇచ్చెను = అరచినవి; దేవతా = దేవతల; ప్రతిమలు = బొమ్మలు; ఒరగెన్ = ఒరిగిపొయినవి; కన్నులను = కళ్ళలో; అశ్రు = కన్నీటి; కణములు = బిందువులు; క్రందుకొనగన్ = కమ్ముకోగా;
భావము:- హోమగుండాలలోని అగ్నులకు పొగలు క్రమ్మాయి. ఎదురుగాలులు బలంగా వీచాయి. అంతటా చెట్లు తలక్రిందులుగా విరిగి పడ్డాయి. గ్రహాలు, నక్షత్రాలు వెలవెలబోయాయి. మేఘాలు రక్తవర్షాన్ని కురిపించాయి. దిక్కులలో మెరుపులు మిరుమిట్లు గొలిపాయి. గ్రహణసమయం కాకుండానే రాహువు సూర్యుణ్ణి పట్టుకున్నాడు. చిమ్మచీకట్లు అంతటా వ్యాపించాయి. కుక్కలు మోరలెత్తి మొరిగాయి. పట్టపగలే నక్కలు కూసాయి. పక్షులు బాధతో ధ్వనులు చేశాయి. దేవతావిగ్రహాలు కన్నుల్లో భాష్పబిందువులు కమ్ముకోగా పక్కకు ఒరిగాయి.

తెభా-3-605-క.
మొవులు నెత్తురుఁ జీమును
బిదికెన్ గార్దభరవంబు భీషణ మయ్యెన్
ముడిగెఁ గరుల కటములఁ
బొదివెఁ దురంగముల వాలముల నిప్పు లొగిన్.

టీక:- మొదవులు = ఆవులు; నెత్తురున్ = రక్తమును; చీమునున్ = చీమును; పిదికెన్ = పితుకుతున్నాయి; గార్దభ = గాడిదల; రవంబున్ = అరుపులు; భీషణము = భయంకరములు; అయ్యెన్ = అయినవి; మదము = మదజలములు; ఉడిగెన్ = తగ్గిపోయినవి; కరులన్ = ఏనుగుల; కటములన్ = చెక్కిళ్ళ అందు; పొదివెన్ = అగపడుతున్నది; తురంగములన్ = ఱ్ఱగుఱ్ఱముల; వాలములన్ = తోకలకు; నిప్పులు = నిప్పులు; ఒగిన్ = క్రమముగ.
భావము:- ఆవులు రక్తాన్నీ చీమును పిదికాయి. గాడిదలు భయంకరంగా ఓండ్రపెట్టాయి. ఏనుగుల గండస్థలాలమీది మదజలం ఎండిపోయింది. గుఱ్ఱాల తోకలు నిప్పులు చెరిగాయి.

తెభా-3-606-క.
గులు రొద లిచ్చెఁ బాప
గ్రమిత్రతఁ జెంది వక్రతులను సౌమ్య
గ్రములు వర్తించెను దు
స్స తేజో దితితనూజ సంభవ వేళన్.

టీక:- గుహలు = గుహలు; రొదలు = రొదశబ్దములు; ఇచ్చెన్ = చేసెను; పాప = చెడు; గ్రహ = గ్రహములతో; మిత్రతన్ = మైత్రిని; చెంది = కలిగి; వక్ర = వక్రమైన; గతులను = నడకలను; సౌమ్య = శుభ; గ్రహములు = గ్రహములు; వర్తించెను = నడచినవి; దుస్సహ = సహింపరాని; తేజస్ = తేజస్సులు కల; దితి = దితి యొక్క; తనూజ = పుత్రుల; సంభవ = జనన; వేళన్ = సమయములో.
భావము:- సహింపరాని తేజస్సుతో దితి కుమారులు పుట్టిన సమయంలో గుహలు ప్రతిధ్వనించాయి. పాపగ్రహాల మైత్రితో పుణ్యగ్రహాలు వక్రమార్గంలో వర్తించాయి.

తెభా-3-607-మ.
దప్రక్రియ నట్లుదోచిన మహోత్పాతంబు లీక్షించి సం
క్షకాలం బని కాని సాధు హననోగ్రక్రూర దేవాహి తో
సంక్షోభముగా నెఱుంగఁగ సమస్తప్రాణి సంఘాతము
ల్భ మందెన్ సనకాది యోగిజనముల్దక్కన్ బుధేంద్రోత్తమా!

టీక:- భయద = భయము కొల్పు; ప్రక్రియ = విధముగ; అట్లు = అలా; తోచిన = కనిపించిన; మహా = గొప్ప; ఉత్పాతంబులున్ = ఉత్పాతములు; ఈక్షించి = చూసి; సంక్షయ = ప్రళయ; కాలంబు = సమయమా; అని = అని; కాని = లేదా; సాధు = సాధుజనులకు; హనన = సంహరణకైన; ఉగ్ర = భయంకరమైన; క్రూర = క్రూరమైన; దేవ = దేవతలకి; అహిత = శత్రువుల; ఉదయ = పుట్టుత వలన కలిగిన; సంక్షోభము = కల్లోలము; కాన్ = అగునట్లు; ఎఱుగంగ = తెలియునట్లు; సమస్త = సమస్తమైన; ప్రాణి = జీవ; సంఘాతముల్ = జాలములు; భయమున్ = భయమును; పొందెన్ = పొందినవి; సనక = సనకుడు; ఆది = మొదలగు; యోగి = యోగులైన; జనములు = జనులు; తక్కన్ = తప్పించి; బుధ = జ్ఞానులలో; ఇంద్ర = శ్రేష్ఠులలో; ఉత్తమ = ఉత్తముడా.
భావము:- ఆ విధంగా భయంకరంగా తోచిన అపశకునాలను చూసి ప్రళయకాలం వచ్చిందని అనుకున్నారే కాని, క్రూరంగా సాధుజనులను సంహరించే రాక్షసుల పుట్టుక వల్ల సంభవించిన కల్లోలంగా తెలిసికొనక సనకాది యోగులు తప్ప సమస్త ప్రాణికోటి తల్లడిల్లింది.

తెభా-3-608-వ.
అట్లావిర్భవించిన యనంతరంబ.
టీక:- అట్లు = ఆ విధముగ; ఆవిర్భవించిన = ఉద్భవించిన, పుట్టిన; అనంతరంబ = తరువాత.
భావము:- ఆ విధంగా దితికి కుమారులు పుట్టిన తర్వాత...

తెభా-3-609-మ.
కుశైలాభ శరీరముల్ తనర రక్షోనాథు లత్యుగ్ర దో
ర్బ మొప్పం బదఘట్టనన్ ధర చలింపన్ రత్న కేయూర కుం
కాంచీ కటకాంగుళీయక కిరీస్వర్ణమంజీర ని
ర్మ కాంతుల్ దులకింప నాత్మరుచిచే మందీకృతార్కాంశులై.

టీక:- కులశైల = కులపర్వతముల; ఆభ = వంటి; శరీరముల్ = దేహములు; తనర = అతిశయించగా; రక్షస్ = రాక్షస; నాథులు = రాజులు; అతి = మిక్కిలి; ఉగ్ర = భయంకరమైన; దోర్భలము = బాహుబలములు; ఒప్పన్ = ఒప్పునట్లు; పద = అడుగుల; ఘట్టనన్ = తాకిడికి; ధరన్ = భూమి; చలింపన్ = చలించునట్లు; రత్న = మణులు తాపిన; కేయుర = దండకడియములు; కుండల = చెవికుండలములు; కాంచీ = మొలనూళ్ళు; కటక = మురుగులు; అంగుళీయక = ఉంగరములు; కిరీట = కిరీటములు; స్వర్ణమంజీర = బంగారు అందెల యొక్క; నిర్మల = స్వచ్ఛమైన; కాంతుల్ = ప్రకాశములు; తులకింపన్ = ప్రకాశింపగా; ఆత్మ = తమ; రుచి = కాంతుల; చేన్ = వలన; మందీకృత = మందగింపబడిన; అర్క = సూర్య; అంశులు = కిరణములు కలవారు; ఐ = అయ్యి.
భావము:- ఆ రాక్షసులు కులపర్వతాలవంటి శరీరాలతో, భయంకరమైన భుజబలంతో ఒప్పుతున్నారు. వారి పాదాల తాకిడికి భూమి చలించిపోతున్నది. రత్నాలు చెక్కిన బంగారు భుజకీర్తులు, మకరకుండలాలు, మొలనూళ్ళు, కంకణాలు, ఉంగరాలు, కిరీటాలు, కాలి అందెలు స్వచ్ఛమైన కాంతులు వెదజల్లుతుండగా తమ శరీరకాంతులతో సూర్యకాంతిని సైతం హీనపరుస్తూ....

తెభా-3-610-వ.
ఉన్న సమయంబునం గశ్యపుండు నిజ తనూభవులఁ జూడం దలంచి దితిమందిరంబునకుం జనుదెంచి; సుతులం గనుంగొని; వారలకు నామకరణంబు సేయం దలంచి.
టీక:- ఉన్న = ఉన్నట్టి; సమయంబునన్ = సమయములో; కశ్యపుండు = కశ్యపుడు; నిజ = తన; తనూభవులన్ = పుత్రులను; చూడన్ = చూడవలెనని; తలంచి = అనుకొని; దితి = దితి యొక్క; మందిరమున్ = నివాసముల; కున్ = కు; చనుదెంచి = వచ్చి; సుతులన్ = పుత్రులను; కనుంగొని = చూసి; వారల = వారి; కున్ = కి; నామకరణంబున్ = పేర్లుపెట్టుటలు; చేయన్ = చేయవలెనని; తలంచి = అనుకొని.
భావము:- ఉన్న సమయంలో కశ్యపుడు తన కుమారులను చూడాలనుకొని దితి మందిరానికి వచ్చి పుత్రులను చూచి, వారికి నామకరణం చేయాలనుకొని....

తెభా-3-611-చ.
దితి జఠరంబు నందుఁ దన తేజము మున్నిడి నట్టి పుత్రు న
ద్భు చరితున్ "హిరణ్యకశిపుం" డను పేరఁ బ్రసూతివేళ నా
దితి మును గన్న పట్టి రవితేజునిఁ "గాంచనలోచనుండు"నా
హిమతిఁ బేరువెట్టి చనియెన్ నిజ నిర్మల పుణ్యభూమికిన్.

టీక:- దితి = దితి యొక్క; జఠరంబునన్ = కడుపు; అందు = లో; తన = తన యొక్క; తేజమున్ = తేజస్సును; మున్ను = ముందుగా; ఇడి = పెట్టిన; అట్టి = అటువంటి; పుత్రున్ = కొడుకుని; అద్భుత = అద్భుతమైన; చరితున్ = చరిత్ర కలవానిని; హిరణ్యకశిపుండు = హిరణ్యకశిపుడు; అను = అనెడి; పేరన్ = పేరును; ప్రసూతి = పురిటి; వేళన్ = సమయమున; ఆ = ఆ; దితి = దితి; మును = ముందుగ; కన్న = కనినట్టి; పట్టి = పిల్లవానిని; రవి = సూర్యునితో సమానమైన; తేజునిన్ = తేజస్సు కలవానిని; కాంచనలోచనుండు = హిరణ్యాక్షుడు {కాంచనలోచనుడు - బంగారము వంటి కన్నులు ఉన్నవాడు, హిరణ్యాక్షుడు}; నాన్ = అని; హితమతి = మంచికోరు మనసు కలవాడు; పేరు = పేరును; పెట్టి = పెట్టి; చనియెన్ = వెళ్లెను; నిజ = తన; నిర్మల = స్వచ్ఛమైన; పుణ్య = పుణ్యవంతమైన; భూమికిన్ = స్థలమునకు.
భావము:- దితి గర్భంలో తాను మొదట పెట్టినట్టి తేజస్సువల్ల పుట్టి అద్భుతంగా వెలిగేవానికి ‘హిరణ్యకశిపుడు’ అనీ, కానుపు సమయంలో దితికి మొదటగా పుట్టి సూర్యతేజస్సుతో వెలిగేవానికి ‘హిరణ్యాక్షుడు’ అని మంచి మనస్సుతో పేర్లు పెట్టి కశ్యపుడు తన ప్రవిత్రమైన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.