పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/కాలనిర్ణయంబు

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search


తెభా-3-345-సీ.
భువిఁ దన కార్యాంశమునకు నంతము నన్య-
స్తుయోగంబు నేఁలన లేఁక
టపటాదిక జగత్కార్యంబునకు నిజ-
మవాయకారణత్వమునఁ బరగి
జాల సూర్యమరీచిసంగతగగనస్థ-
గు త్రసరేణు షడంశ మరయఁ
రమాణు వయ్యెఁ దత్పరమాణు వం దర్క-
తి యెంత దడవు తత్కాల మగును

తెభా-3-345.1-తే.
సూక్ష్మకాలంబు విను మది సూర్యమండ
లంబు ద్వాదశరాశ్యాత్మకం బనంగఁ
లుగు జగమున నొక యేఁడు డచి చనినఁ
గాల మెం తగు నది మహత్కాల మనఘ!

టీక:- భువిన్ = సృష్టిలో {భువిఁదనకార్యాంశము - సృష్టికార్యములోని (ఒక) భాగము, కాలము}; తన = తనయొక్క; కార్య = పనిలో; అంశమున = భాగమున; కున్ = కు; అంతమున్ = అంతమును; అన్య = ఇతరమైన; వస్తు = వస్తువుల; యోగంబున్ = కలుపుటలు; ఏవలన = ఏమాత్రమూ; లేక = లేకుండగ; ఘట = కుండ {ఘటపటాదికన్యాయము అను తర్కశాస్త్ర విషయము ప్రకారము - త్రికరణములు (మూడు కారణములు) - 1 ఉపాదానము (ఇతర వస్తువు) 2 సమవాయము (చేసే నేర్పు) 3 నిమిత్త (పనివాడు)}; పట = బట్ట; ఆదిక = మొదలైన; జగత్ = లోకసామాన్య; కార్యంబున్ = పనుల; కున్ = కు; నిజ = వాని; సమవాయకారణత్వమునన్ = సమవాయకారణతత్త్వము వలె {సమవాయకారణము - సృష్టికి మూడు (3) కారణములు అవసరము అవి 1 ఉపాదానకారణము 2 సమవాయకారణము 3 నిమిత్తకారణము}; పరగి = తెలియబడి; జాలన్ = కిటికీ వలని; సూర్య = సూర్య; మరీచి = కిరణము; సంగత = లోనుండు; గగనస్థము = అవకాశముననుండేది, ఖాళీస్థలముననుండేది; అగు = అయిన; త్రస = ధూళి; రేణు = రేణువు లో; షట్అంశము = ఆరవ (1/6) వంతు; అరయన్ = చేసిచూసిన అది; పరమాణువు = పరమాణువు; అయ్యెన్ = అయెను; తత్ = ఆ; పరమాణువు = పరమాణువు; అందున్ = లో; అర్క = సూర్య కిరణము యొక్క; గతి = గమనమునకు; ఎంత = ఎంత; తడవు = కాలమో; తత్ = ఆ; కాలము = కాలము; అగును = అగును; సూక్ష్మకాలంబున్ = సూక్ష్మకాలము; వినుము = వినుము; అది = ఆ; సూర్య = సూర్య; మండలము = బింబము; ద్వాదశ = పన్నెండు (12); ఆత్మకంబున్ = కలిగినది; అనగన్ = అనబడి; కలుగు = ఉండు; జగమున్ = రేణువులు; ఒక = ఒక; ఏడు = ఏడు (7); కడచి = గడిచి; చనిన = పోయిన; కాలము = కాలము; ఎంత = ఏంతో అంత; అగున్ = అగును; అది = అది; మహత్కాలము = మహత్కాలము; అనఘ = వుణ్యుడా.
భావము:- భగవంతుని సృష్టి కార్యానికి అంతు అనేది లేదు. దానికి వేరే వస్తువులతో, సంయోగంకూడా అవసరం లేదు. జగత్తులో కుండలు, బట్టలు, తయారయ్యే తీరు వేరు; సృష్టి నిర్మాణ తీరు వేరు. కుండ ఈ లోకంలో తయారు కావాలంటే, 1. మట్టి (ఉపాదానకారణం), 2. మట్టిని కుండగా రూపొందించటం (సమవాయ కారణం), 3. కుండను చేసేవాడు (నిమిత్త కారణం) అవసరం. అలానే బట్ట నిర్మాణం కూడా 1. ప్రత్తి (ఉపాదానం), దారాలు నేత (సమవాయి), బట్ట నేసే వాడు (నిమిత్తం). లోకంలో, ఏ కార్యానికైనా పై మూడూ అవసరం. భగవంతుని సృష్టిలో భగవంతుడు సమవాయ కారణం అవుతాడు. సూర్యుని కాంతి కిటికీలో నుండి ప్రసరించేటప్పుడు మన కంటికి కనిపించే, చిన్నచిన్న రేణువులలో, ఆరవ భాగానికి పరమాణువు అని పేరు. ఆ పరమాణువుపై ఒక ప్రక్క నుండి మరియొక ప్రక్కకు సూర్యకిరణం పయనించే కాలానికి, సూక్ష్మకాలం అని పేరు. సూక్ష్మకాలాన్ని కేవలం ఊహించుకోవలసిందే. అది మిక్కిలి అత్యల్పమైన కాల పరిమాణం. సూర్యుడు మేషం మొదలైన పన్నెండు రాసులలో పయనించే కాల పరిమాణం పేరు మహత్కాలం. దీనికే, సంవత్సరం అని పేరు. (మహత్కాలానికి సూక్ష్మకాలానికి మధ్య నున్న వివిధ కాల పరిమాణాలు ఇకపై వివరించబడతాయి.)

తెభా-3-346-వ.
అందుఁ, బరమాణుద్వయం బొక్క యణు వగు; నణుత్రిత్రయం బొక్క త్రసరేణు వగు; అవి మూఁడు గూడ నొక్క తృటి యగు; ఆ తృటి శతం బొక్క వేధ యనం బరఁగు; అట్టి వేధలు మూడు గూడ నొక్క లవం బనఁదగు; అవి మూ డైన నొక్క నిమేషం బనంజను; నిమేష త్రయం బొక్క క్షణం బగు; క్షణ పంచకం బొక్క కాష్ఠ యనందగు; నవి పది యైన నొక్క లఘు వన నొప్పు; అట్టి లఘు పంచదశకం బొక్క నాడి యనంబరఁగు; అట్టి నాడికా ద్వయం బొక్క ముహూర్తం బయ్యె; అట్టి నాడిక లాఱైన నేడైన మనుష్యులకు నొక్క ప్రహరం బగు; అదియ యామం బనంజను; దివస పరిమాణ విజ్ఞేయం బగు నాడికోన్మాన లక్షణం బెఱింగింతు వినుము; షట్ఫల తామ్రంబునం బాత్రంబు రచియించి, చతుర్మాష సువర్ణంబునం చతురంగుళాయ శలాకంబుఁ గల్పించి, దానం దత్పాత్ర మూలంబున ఛిద్రంబుఁ గల్పించి, తఛిద్రంబునం బ్రస్థమాత్ర తోయంబు పరిపూర్ణంబు నొందు నంత కాలం బొక్క నాడిక యగు; యామంబులు నాలుగు సన నొక్క పగ లగు; రాత్రియు నిప్పగిది జరుగు; అట్టి యహర్నిశంబులు గూడ మర్త్యుల కొక దివసం బగు; అవి పదునేనైన నొక్క పక్షం బగు శుక్లకృష్ణ నామంబులం బరఁగిన యప్పక్షంబులు రెండు గూడ నొక్క మాసం బగు అది పితృదేవతలకు నొక్క దివసం బగు; అట్టి మాసంబులు రెండైన నొక్క ఋతు వగు; షణ్మాసం బరిగిన నొక్క యాయనం బగు; దక్షిణోత్తర నామంబులం బరఁగి నట్టి యాయనంబులు రెండు గూడి ద్వాదశ మాసంబు లైన నొక్క సంవత్సరం బగు; అది దేవతలకు నొక్క దివసం బగు; అట్టి సంవత్సర శతంబు నరులకుం బరమాయు వై యుండు; కాలాత్ముండును నీశ్వరుండును నైన సూర్యుండు గ్రహ నక్షత్ర తారా చక్రస్థుండై పరమాణ్వాది సంవత్సరాత్మకం బైన కాలంబునం జేసి ద్వాదశరాశ్యాత్మకం బైన జగంబున సౌర బార్హస్పత్య సావన చాంద్ర నాక్షత్ర మానభేదంబులం గానంబడుచున్నవాఁ డై సంవత్సర పరీవృత్స రేడావత్స రానువత్సర వత్సర నామంబుల సృజ్యం బైన బీజాంకురంబుల శక్తిం గాలరూపం బైన స్వశక్తిచేత నభిముఖంబుగాఁ జేయుచుఁ బురుషులకు నాయురాది వ్యయనంబులం జేసి విషయాసక్తి నివర్తింపం జేయుచుం గోరికలు గల వారికి యజ్ఞముఖంబులం జేసి గుణమయంబు లైన స్వర్గాది ఫలంబుల విస్తరింపం జేయుచు గగనంబునఁ బరువు వెట్టు వత్సర పంచక ప్రవర్తకుం డగు మార్తాండునకుం బూజఁ గావింపుము;"అని మైత్రేయుండు పలికిన విదురుం డిట్లనియె.
టీక:- అందున్ = అందులో; పరమాణు = పరమాణువుల; ద్వయంబున్ = జత, రెండింటినికలిపిన; ఒక్క = ఒక; అణువు = అణువు; అగు = అగును; అణు = అణువుల; త్రయంబున్ = త్రయము, మూడింటిని కలిపిన; ఒక్క = ఒక; త్రసరేణువు = త్రసరేణువు; అగు = అగును; అవి = అవి; మూడుగూడన్ = మూడింటిని కలిపిన, త్రయము; ఒక్క = ఒక; తృటి = తృటి; అగు = అగును; ఆ = ఆ; తృటి = తృటి; శతంబు = శతము, నూరు కలిసిన; ఒక్క = ఒక; వేధ = వేధ; అనన్ = అని; పరగు = తెలియబడును; అట్టి = అటువంటి; వేధలు = వేధలు; మూడుగూడన్ = మూడింటిని కలిపిన, త్రయము; ఒక్క = ఒక; లవంబున్ = లవము; అనన్ = అనుట; తగున్ = తగును; అవి = అవి; మూడైన = మూడింటిని కలిపిన, త్రయము; ఒక్క = ఒక; నిమేషంబు = నిమేషము; అనన్ = అనుట; చనున్ = జరుగును; నిమేష = నిమేషముల; త్రయంబున్ = మూడింటిని కలిపిన, త్రయము; ఒక్క = ఒక; క్షణంబు = క్షణము; అగున్ = అగును; క్షణ = క్షణముల; పంచకము = అయిదు కలిపిన; ఒక్క = ఒక; కాష్ఠ = కాష్ఠ; అనన్ = అనుట; తగున్ = తగును; అవి = అవి; పది = పది; ఐన = అయిన; ఒక్క = ఒక; లఘువు = లఘువు; అనన్ = అనుట; ఒప్పున్ = తగును; అట్టి = అటువంటి; లఘు = లఘువుల; పంచదశకంబున్ = ఏభై; ఒక్క = ఒక; నాడి = నాడి; అనన్ = అని; పరగు = తెలియబడును; అట్టి = అటువంటి; నాడికా = నాడికల; ద్వయంబున్ = జత, రెండింటిని కలిపిన; ఒక్క = ఒక; ముహూర్తంబున్ = ముహూర్తము; అయ్యెన్ = అయ్యెను; అట్టి = అటుసంటి; నాడికలు = నాడికలు; ఆఱు = ఆరు; ఐన = అగుట; ఏడు = ఏడు (7); ఐన = అయిన; మనుష్యుల = మానవుల; కున్ = కు; ఒక్క = ఒక్క; ప్రహరంబున్ = ప్రహరంబు, గంటకొట్టుట; అగున్ = జరుగును; అదియ = అదే; యామంబు = యామము; అనన్ = అనుట; చనున్ = తగును; దివస = దినము యొక్క; పరిమాణ = పరిమాణమును; విజ్ఞేయంబు = తెలుపునది; అగు = అయిన; నాడిక = నాడికలను; ఉన్మాన = కొలుచు; లక్షణంబున్ = పద్దతి; ఎఱింగింతు = తెలిపెదను; వినుము = వినుము; షట్ = ఆరు; ఫల = ఫలములబరువు కల; తామ్రంబునన్ = రాగితో; పాత్రంబున్ = పాత్రను; రచియించి = తయారుచేసి; చతుః = నాలుగు; మాష = అయిదు గురివింద గింజల ఎత్తు (బరువు) {మాష - బంగారు తూనిక కొలతలలో ఒకటి; తులములో 12వ భాగము అని (ఆంధ్రభారతి వారి నిఘంటువు), ఆయిదు గురివింద గింజలకు సమానమైన బరువు గల బంగారం అని (ఆంధ్ర భారతి మఱియు ఆంధ్రవాచస్పతము నిఘంటువులు), ఎనిమిది గురివింద గింజలంత బరువు గల బంగారం అని (ఆంధ్రశబ్దరత్నాకరము) ఒక విధముగా, నాలుగు మాషలు అంటే సుమారు తులంలో మూడవ వంతు అని అనుకోవచ్చు, అంటారు,ఏదైనా చిన్నపాటి బంగారము,}; సువర్ణంబునన్ = బంగారముతో; చతుర్ = నాలుగు; అంగుళాయ = అంగుళముల పొడవు కల; శలాకంబున్ = దబ్బనము, మేకు; కల్పించి = తయారుచేసి; తత్ = ఆ; పాత్ర = పాత్ర యొక్క; మూలంబునన్ = అడుగున; ఛిద్రంబున్ = కన్నము; కల్పించి = చేసి, పెట్టి; తత్ = ఆ; ఛిద్రంబునన్ = కన్నములో; ప్రస్థ = ప్రస్థడు {ప్రస్థ - తూము మొదలగు ఘనపరిమాణ కొలమానములోనిదైన కొలత}; మాత్ర = మాత్రము; తోయంబున్ = నీటిని; పరిపూర్ణంబున్ = పూర్తిగా అయిపోవుటకు; ఒందు = పట్టేటటువంటి; అంత = అంత; కాలంబు = కాలము; ఒక్క = ఒక; నాడిక = నాడిక; అగు = అగును; యామంబులు = యామములు; నాలుగు = నాలుగు; చనన్ = జరుగగా; ఒక్క = ఒక; పగలు = పగలు; అగున్ = అగును; రాత్రియున్ = రాత్రికూడ; ఈ = ఈ; పగిదిన్ = విధముగ; జరుగు = అగును; అట్టి = అటువంటి; అహర్ = పగలు; నిశంబులు = రాత్రి; కూడన్ = కలిపిన; మర్త్యుల = మానవుల {మర్త్యులు - మరత (మరణించు లక్షణము) కలవారు, మానవులు}; కున్ = కు; ఒక = ఒక; దివసంబున్ = దినము; అగున్ = అగును; అవి = అవి; పదనేన్ = పదిహేను (15); ఐనన్ = అయిన; ఒక్క = ఒక; పక్షంబు = పక్షము; అగున్ = అగును; శుక్ల = శుక్లపక్షము {శుక్లపక్షము - తెల్ల (వెన్నెల) రాత్రులు ఉండు పక్షము, పూర్ణిమ కు ముందరిరోజులు కల పక్షము}; కృష్ణ = కృష్ణపక్షము {కృష్ణపక్షము - నల్ల (చీకటి) రాత్రులు ఉండు పక్షము, అమావాస్య ముందటి రోజులుకల పక్షము}; నామంబులన్ = పేర్లతో; పరగిన = తెలియబడు; ఆ = ఆ; పక్షంబులు = పక్షములు; రెండున్ = రెండు (2); కూడన్ = కలిపిన; ఒక్క = ఒక; మాసంబున్ = నెల, మాసము; అగున్ = అగును; అది = అది; పితృదేవతల = పితృదేవతల; కున్ = కు; ఒక్క = ఒక; దివసంబున్ = దినము; అగున్ = అగును; అట్టి = అటువంటి; మాసంబులు = మాసములు, నెలలు; రెండున్ = రెండు (2); ఐన = అయిన; ఒక్క = ఒక; ఋతువు = ఋతువు; అగున్ = అగును; షట్ = ఆరు; మాసంబు = మాసములు, నెలలు; అరిగినన్ = జరిగిన; ఒక్క = ఒక; అయనంబు = అయనము; అగున్ = అగును; దక్షిణ = దక్షిణాయనము; ఉత్తర = ఉత్తరాయనము; నామంబులన్ = పేర్లతో; పరగిన్ = తెలియబడునది; అట్టి = అయిన; అయనంబులు = ఆయనములు; రెండున్ = రెండు (2); కూడి = కలిపినను; ద్వాదశ = పన్నెండు (12); మాసంబులు = మాసములు, నెలలు; ఐన = అయిన; ఒక్క = ఒక; సంవత్సరంబు = సంవత్సరము; అగున్ = అగును; అది = అది; దేవతలన్ = దేవతల; కున్ = కు; ఒక్క = ఒక; దివసంబున్ = దినము; అగు = అగును; అట్టి = అటువంటి; సంవత్సర = సంవత్సరముల; శతంబున్ = శతము, నూరుకలిసిన; నరుల = మానవుల; కున్ = కు; పరమాయువు = జీవించి ఉండుటకు అవధి, జీవితకాలము; ఐ = అయి; ఉండున్ = ఉండును; కాల = కాలము; ఆత్ముండు = తానైనవాడును; ఈశ్వరుండును = ప్రభువును; ఐన = అయిన; సూర్యుండు = సూర్యుడు; గ్రహ = గ్రహములు; నక్షత్ర = నక్షత్రములు {నక్షత్రములు - అశ్విని ఆది నక్షత్రములు (తారకల సమూహములు)}; తారకలు = తారకల {తారకలు - నక్షత్రాదులందు ఉండు విడివిడి గోళములు, ఇవి జ్యోతిర్మయగోళములు}; చక్రస్థుండు = జ్యోతిష్చక్రమున తిరుగువాడు {చక్రస్థుండు - గ్రహాదులు తిరుగు చక్రము (జ్యోతిష్చక్రము)న తిరుగువాడు}; ఐ = అయి; పరమాణు = పరమాణువు; ఆది = మొదలు; సంవత్సర = సంవత్సరముల వరకు; ఆత్మకంబున్ = కూడి ఉండునవి; ఐన = అయిన; కాలంబునన్ = కాలము; చేసి = వలన; ద్వాదశ = పన్నెండు (12); రాశి = రాశులు; ఆత్మకంబున్ = కలిగినది; ఐన = అయిన; జగంబునన్ = లోకములో; సౌర = సౌరమానము; బార్హస్పత్య = బార్హస్పత్యమానము; సావన = సావనమానము; చాంద్ర = చాంద్రమానము; నక్షత్ర = నక్షత్రమానములు అను; మాన = మానములు అను; భేదంబులన్ = రకములుగ; కానంబడుచున్ = కనబడుతూ; ఉన్న = ఉన్న; వాడు = వాడు; ఐ = అయి; సంవత్సర = సంవత్సరము; పరీవృత = పరీవృతము; ఏడావత్సర = ఇడావత్సరము (ఏడు); అనువత్సర = అనువత్సరము; వత్సర = వత్సరము అను; నామంబులన్ = పేర్లతో; సృజ్యంబున్ = సృష్టింపబడినది; ఐన = అయినట్టి; బీజాంకురములు = బీజాంకురముల, మొలకల; శక్తిన్ = శక్తితో; కాల = కాలమే; రూపంబున్ = రూపము; ఐన = అయిన; స్వ = తన; శక్తిన్ = శక్తి; చేతన్ = చేత; అభిముఖంబుగాన్ = అనుకూలముగా; చేయుచున్ = చేస్తూ; పురుషుల = మానవుల; కున్ = కు; ఆయుః = ఆయువు; ఆది = మొదలగునవి; వ్యయనంబులన్ = తరుగుదలలు, ఖర్చగునట్లు; చేసి = చేసి; విషయ = ఇంద్రియార్థములు యందు {విషయములు - ఇంద్రియములకు గోచరించునవి}; ఆసక్తిన్ = ఆసక్తి తో; నివర్తింపన్ = ప్రవర్తించునట్లు; చేయుచున్ = చేస్తూ; కోరికలు = కోరికలు; కల = ఉన్న; వారు = వారు; కిన్ = కి; యజ్ఞ = యజ్ఞములు; ముఖంబులన్ = మొదలగువాని; చేసి = వలన; గుణ = గుణములతో; మయంబులున్ = నిండినవి; ఐన = అయిన; స్వర్గ = స్వర్గము; ఆది = మొదలగు; ఫలంబులన్ = ఫలితములను; విస్తరింపన్ = ఫలించునట్లు; చేయుచున్ = చేస్తూ; గగనంబునన్ = ఆకాశమున; పరువు = పరుగులు; పెట్టు = పెడుతూ; వత్సర = సంవత్సర; పంచక = ఎంచే, గణించే; ప్రవర్తకుండు = ప్రవర్తన కలవాడు; అగు = అయిన; మార్తాండున = సూర్యుడు {మార్తాండుడు - మండుతుండే అండము రూపము వాడు, సూర్యుడు}; కున్ = నకు; పూజ = పూజించుట; కావింపుము = చేయుము; అని = అని; మైత్రేయుండు = మైత్రేయుడు; పలికిన = చెప్పిన; విదురుండు = విదురుడు; ఇట్లు = ఈవిధముగా; అనియెన్ = చెప్పెను.
భావము:- రెండు పరమాణువులు ఒక అణువు. మూడు అణువులు ఒక త్రసరేణువు. మూడు త్రసరేణువులు ఒక త్రుటి. నూరు త్రుటులు వేధ, మూడు వేధలు ఒక లవం, మూడు లవాలు ఒక నిమేషం. మూడు నిమేషాలు ఒక్క క్షణం. ఐదు క్షణాలు ఒక్క కాష్ఠ. పది కాష్ఠలు ఒక లఘువు. పదిహేను లఘువులు ఒక నాడి. రెండు నాడులు ఒక ముహూర్తం. అట్టి నాడులు ఆరు కాని, ఏడు కాని అయినచో మనుష్యునకు ఒక ప్రహరం అవుతుంది. దానినే యామ మనీ లేదా జాము అని అంటారు. దిన పరిమాణాన్ని కొలిచే విధానం చెప్తాను విను, ఆరు ఫలాల రాగితో పాత్ర సిధ్ధం చేసి, తులంలో మూడవవంతు బరువు గల బంగారంతో నాలుగు అంగుళాల పొడవైన కమ్మీ తయారుచేసి, దానితో ఆ పాత్ర క్రింద రంధ్రం, చేస్తే, ఆ రంధ్రంగుండా తూమెడు నీరు పూర్తిగా క్రిందకు కారడానికి ఎంత కాలం పడుతుందో అంతకాలాన్ని ఒక నాడి అంటారు. నాలుగు జాములు ఒక పగలు అవుతుంది. అదే విధంగా నాలుగు, జాములు ఒక రాత్రి అవుతుంది. పగలు రాత్రి కలిస్తే మానవులకు ఒక దినం. పదిహేను దినాలు ఒక పక్షం , శుక్లపక్షం కృష్ణ పక్షం అని రెండు పక్షాలు. ఈ రెండు పక్షాలూ కలిపి ఒక నెల. అది పితృ దేవతలకు ఒక దినం. రెండు నెలలు ఒక ఋతువు. ఆరు నెలలు ఒక ఆయనం, దక్షిణాయనం, ఉత్తరాయణం అని ఆయనాలు రెండు. ఈ రెండు కలిసిన పన్నెండు నెలలు ఒక సంవత్సరం. ఈ సంవత్సరం దేవతలకు ఒక్క దినం అవుతుంది. నూరు సంవత్సరాలు మానవులకు పరమాయువు. కాలమే ఆత్మగా గల సూర్యభగవానుడు గ్రహాలతో నక్షత్రాలతో కూడిన తారాచక్రంలో ఉన్న వాడై పరమాణువు మొదలుకొని సంవత్సర పర్యంతమైన కాలంలో పన్నెండు రాసులను చుట్టి వస్తాడు. ఈ విధమైన సూర్యగమనం వలన సౌరమానం చంద్రమానం నక్షత్రమానం, అనే భేదాలతో సంవత్సర కాలము ఏర్పడుచున్నది. ఇది సంవత్సరము, వరీవత్సరం, ఇడావత్సరం, అనువత్సరం, వత్సరం అనే భేదాలు కలిగి ఉంటుంది. ఈ ఐదు విధాలైన వత్సరాలను ప్రవర్తింపచేసే సూర్యుడు విత్తనాలనుండి అంకురాలు మొలకెత్తించినట్లు కాలరూపమైన తన శక్తితో జీవ సృష్టిని అనుకూలం చేసుకుంటూ, ఆయుష్షు హరిస్తూ, మానవుల విషయాసక్తిని విస్తరింపచేస్తూ, కోరికలు కలవారికి యజ్ఞాల ద్వారా స్వర్గ ఫలాన్ని సమకూరుస్తూనే, ఆకాశంలో పరుగులు తీస్తుంటాడు. పైన చెప్పిన ఐదు విధాలైన వత్సరాలనూ ప్రవర్తింపచేసే సూర్యభగవానుణ్ణి పూజించు” అని మైత్రేయుడు పలకగా విదురుడు ఈ విధంగా అన్నాడు.

తెభా-3-347-క.
"న పితృ సుర పరమాయుః
రిమాణము లెఱుఁగ నాకుఁ లికితివి మునీ
శ్వ యెఱిగింపు త్రిలోకో
రిలోక విలోక నైక రులగు వారిన్.

టీక:- నర = నరులు; పితృ = పితృదేవతలు; సుర = దేవతల; పరమాయుష్ = జీవితకాలము యొక్క; పరిణామంబున్ = పరిమితులు; ఎఱుగన్ = తెలియునట్లు; నాకున్ = నాకు; పలికితివి = చెప్పితివి; ముని = మునులలో; ఈశ్వర = శ్రేష్ఠుడ; ఎఱిగింపు = తెలుపుము; త్రిలోక = ముల్లోకములు {త్రిలోకములు - ముల్లోకములు, 1 భూ 2 భువర్ 3 సువర్ లోకములు}; ఉపరిలోక = పైనున్న లోకములను; విలోకన = చక్కగా చూచు, దర్శించు; ఏకపరులు = మంచి నేర్పురులు; అగు = అయిననట్టి; వారికిన్ = వారికి;
భావము:- “మహర్షీ! మైత్రేయా! మానవులు, పితృదేవతలు, దేవతలు, వీరి పరమాయువుల పరిమాణాలను తెలిపావు. ముల్లోకాలూ, పై లోకాలు దర్శించే వారి విశేషాలు వివరించు.