పోతన తెలుగు భాగవతము/తృతీయ స్కంధము/కర్దముని విమానయానంబు

వికీసోర్స్ నుండి


తెభా-3-803-వ.
"ఇట్లు స్వాయంభువుండు దేవహూతిం గర్దమునికి వివాహంబుసేసి మరలిచనినం దదనంతరంబ; దేవహూతియుఁ బతిభక్తి గలిగి భవునికి భవాని పరిచర్యసేయు తెఱంగునఁ బతియ తనకు నేఁడుగడయుంగా నెఱింగి; యమ్మునీంద్రుని చిత్తవృత్తికొలఁది దినదినంబునకు భక్తితాత్పర్యస్నేహంబులు రెట్టింపం; బ్రియశుశ్రూషణంబులు గావించుచు ననూనతేజోవిరాజిత యగుచుఁ గామక్రోధ దంభలోభాది గుణవిరహిత యై; శరీరశుద్ధి వహించి మృదుమధుర వచనరచన యై; పతిభక్తి యేమఱక వర్తింప దైవయోగంబు నైననుం దప్పింప సమర్థుం డైన కర్దముండు నిజ సేవాయాసకృశీభూతదేహ యై యున్న దేవహూతిం గరుణా తరంగితాపాంగుం డై కనుంగొని మంజుభాషణంబుల నిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; స్వాయంభువుండు = స్వాయంభువుడు; దేవహూతిన్ = దేవహూతిని; కర్ధమున్ = కర్దముని; కిన్ = కి; వివాహంబున్ = వివాహమును; చేసి = చేసి; మరలి = వెనుకకు; చనిన్ = వెళ్ళిన; తదనంతరంబ = తరువాత; దేవహూతియున్ = దేవహూతియును; పతి = పతి ఎడల; భక్తిన్ = భక్తి; కలిగి = కలిగి; భవునిన్ = శంకరుని; కిన్ = కి; భవాని = పార్వతీదేవి; పరిచర్య = సేవ; చేయున్ = చేసెడి; తెఱంగునన్ = విధముగ; పతియ = పతియే; తన = తన; కున్ = కు; ఏడుగడయున్ = సమస్తము (ఆంధ్రశబ్దరత్నాకరము), సర్వస్వము; కాన్ = అయి; ఆ = ఆ; ముని = మునులలో; ఇంద్రునిన్ = శ్రేష్ఠుని; చిత్త = మానసిక; వృత్తిన్ = వర్తనను; కొలది = అనుసరించి; దినదినంబున్ = నానాటి; కున్ = కి; భక్తిన్ = భక్తియును; తాత్పర్య = శ్రద్ధయును; స్నేహంబుల్ = ప్రేమయును; రెట్టింపన్ = ద్విగుణీకృతముకాగా; ప్రియ = ప్రేమపూర్వక; శుశ్రూషణంబులున్ = పరిచర్యలు; కావించుచున్ = చేయుచూ; అనూన = వెలితిలేని; తేజస్ = తేజస్సుతో; విరాజిత = విరాజిల్లునది; అగుచున్ = అవుతూ; కామ = కామమును; క్రోధ = కోపమును; దంభ = మోసము; లోభ = పిసినారితనమును; ఆది = మొదలగు; గుణ = గుణములు {అరిషడ్వర్గము - 1కామ 2క్రోధ 3దంభ 4లోభ 5మద 6మాత్సర్యములు}; విరహిత = అసలులే నామె; ఐ = అయ్యి; శరీర = దేహ; శుద్ధి = శుభ్రత; వహించి = కలిగి; మృదు = మెత్తని; మధుర = తీయని; వచన = మాటల; రచన = కూర్పు కలది; ఐ = అయ్యి; పతిభక్తిన్ = పతిభక్తిని; ఏమఱక = మరువక; వర్తింపన్ = నడచుచుండగ; దైవ = దేవుని; యోగంబునన్ = సంకల్పమును; ఐనన్ = అయినను; తప్పింపన్ = తప్పించుటకు; సమర్థుండు = చాలినవాడు; ఐనన్ = అయినట్టి; కర్దముండు = కర్దముడు; నిజ = తన; సేవా = సేవించుటచేత; ఆయాస = శ్రమ వలన; కృశీభూత = చిక్కిపోయినది; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; దేవహూతిన్ = దేవహూతిని; కరుణా = దయతో; తరంగిత = తొణకిసలాడుతున్న; అపాంగుడు = కటాక్షములు కలవాడు; ఐ = అయ్యి; కనుంగొని = చూసి; మంజు = ఇంపైన; భాషణంబులన్ = మాటలతో; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- ఈ విధంగా స్వాయంభువుడు దేవహూతిని కర్దమునికి ఇచ్చి వివాహం చేసి వెళ్ళిపోగా, ఆ తర్వాత దేవహూతి పతిభక్తి కలిగి శివునికి పార్వతి సేవ చేసిన విధంగా భర్తయే సర్వస్వముగా భావించి, ఆ మునీశ్వరుని మనస్సులోని అభిప్రాయాలకు అనుగుణంగా దినదినం భక్తి, ప్రేమ రెట్టింపుకాగా సేవలు చేస్తూ, మిక్కిలి తేజస్సుతో ప్రకాశిస్తూ, కామం, క్రోధం, కపటం, లోభం మొదలైన దుర్గుణములకు దూరంగా ఉండి, తన సౌందర్యాన్ని పోషించుకుంటూ, చాతుర్యంతో, చనువుతో, ప్రేమతో పతినే దైవంగా భావించి మృదుమధురంగా అతనితో మాట్లాడుతూ పతివ్రతయై ప్రకాశించింది. దైవయోగాన్ని సైతం తప్పింప సమర్థుడైన కర్దమ ప్రజాపతి తన సేవలో మిక్కిలి కృశించిన దేవహూతిని దయతో చూసి ముద్దుగా ఇలా అన్నాడు.

తెభా-3-804-ఉ.
"మానిత ధర్మమార్గమహిస్ఫుట భూరి తపస్సమాధి వి
ద్యానిభృతాత్మయోగ సముపార్జిత విష్ణుకటాక్షలబ్ధ శో
భాఘ దివ్యభోగ బహుద్ర వితానము లస్మదీయ సే
వా నిరతిన్ లభించు ననివారణ నిత్తును దివ్యదృష్టియున్.

టీక:- మానిత = గౌరవింపదగిన; ధర్మ = ధర్మబద్ధమైన; మార్గ = విధానములను అవలంభించుటచేత; మహిమ = గొప్పదనము; స్ఫుస్ఫుట = విశదమైన; భూరి = అత్యధికమైన {భూరి - ఒకటి (1) తరువాత 34 సున్నాలు కల సంఖ్య అదే కోటైతే తరువాత ఏడు (7) సున్నాలే}; తపస్ = తపస్సు; సమాధి = సమాధి; విద్యా = విద్య వలన; నిభృత్ = నిశ్చలమైన; ఆత్మయోగ = ఆత్మయోగమును; సముపార్జిత = సంపాదించిన; విష్ణు = గోవిందుని; కటాక్ష = కడగంటిచూపు వలన; లబ్ధ = లభించిన; శోభ = ప్రకాశము; అనఘ = పుణ్యము; దివ్య = దివ్యమైన; భోగ = భోగములు; బహు = అనేకములైన; భద్ర = శుభములు; వితానముల్ = అనేకములు; అస్మదీయ = నా యొక్క; సేవా = సేవించుట యొక్క; నిరతిన్ = నిష్ఠవలన; లభించున్ = దొరకును; అనివారణన్ = తప్పకుండగ; ఇత్తున్ = ఇచ్చెదను; దివ్యదృష్టియున్ = దివ్యదృష్టిని కూడ.
భావము:- “దేవీ! మాననీయమైన ధర్మమార్గం వల్ల మహిమ ప్రాప్తిస్తుంది. ఆ మహిమ వల్ల గొప్ప తపస్సూ దానివల్ల ఏకాగ్రత సిద్ధిస్తాయి. వాటివల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. దానివల్ల ఆత్మయోగం లభిస్తుంది. ఆ ఆత్మయోగం విష్ణువుయొక్క కటాక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ కటాక్షం కారణంగా అవ్యయమైన దివ్యభోగాలు, అనంత సుఖాలు సమకూరుతాయి. ఈ విధంగా నాకు సమకూడిన సమస్త సంపదలూ నిరంతరం నన్ను సేవిస్తున్న నీకూ సంప్రాప్తిస్తాయి. నీకు నేను తిరుగులేని దివ్యదృష్టిని కూడా ఇస్తాను.

తెభా-3-805-తే.
నెలఁత! తద్దివ్యదృష్టి నన్నియును నీకుఁ
గానవచ్చు విలోకింపు మలపత్ర
యను బొమముడి మాత్రన నాశ మందు
నితర మగు తుచ్ఛభోగంబు లేమిసెప్ప.

టీక:- నెలత = స్త్రీ; తత్ = ఆ; దివ్యదృష్టిన్ = దివ్యదృష్టి వలన; అన్నియునున్ = సమస్తమును; నీకున్ = నీకు; కానవచ్చున్ = కనబడును; విలోకింపు = చూడుము; కమలపత్రనయనున్ = విష్ణుమూర్తి యొక్క {కమల పత్ర నయనుడు - కమల (తామర) పత్ర (ఆకు)ల వంటి నయనుడు (కన్నులు ఉన్నవాడు), విష్ణువు}; బొమ = కనుబొమలను; ముడిన్ = ముడిచినంత; మాత్రన = మాత్రముచేత; నాశము = నాశనము; అందున్ = అగును; ఇతర = ఇతరములైన; తుచ్ఛ = నీచమైన; భోగంబులున్ = భోగముల విషయము; ఏమి = ఏమి; చెప్పన్ = చెప్పాలి.
భావము:- ఓ తరుణీ! ఆ దివ్యదృష్టివల్ల అన్నింటినీ నీవు చూడవచ్చు. చూడు. ఇక భగవద్దత్తాలు కాని ఇతర తుచ్ఛభోగాల విషయం వేరే చెప్పటం దేనికి? అవి ఆ విష్ణువు కనుబొమలు చిట్లించినంతమాత్రాన నశిస్తాయి.

తెభా-3-806-సీ.
నుపమ రాజ్యదర్పాంధచేతస్కు లై-
పాపవర్తను లైన పార్థివులకు
ధృతిఁ బొందరాని యీ దివ్యభోగంబులు-
నీదు పాతివ్రత్యనిష్ఠఁ జేసి
సంప్రాప్తములు నయ్యె మత భోగింపుము-
కార్యసిద్ధియు నగుగాక నీకు"
నుటయు నతివయు నుపమ యోగమా-
యా విచక్షణవిభుండైన కర్ద

తెభా-3-806.1-తే.
మునిఁ గనుంగొని విగతాధియును నపాంగ
లిత లజ్జానతాస్యపంజయు నగుచు
వినయ సౌహార్దములఁజేసి విహ్వలంబు
యిన పలుకులఁ బతికి నిట్లనియెఁ బ్రీతి.

టీక:- అనుపమ = సాటిలేని; రాజ్య = రాజ్య సంపదతో కలిగిన; దర్ప = గర్వము వలన; అంధ = గుడ్డిదైన; చేతస్కులు = మనసుకలవారు; ఐ = అయ్యి; పాప = పాపపు; వర్తనులు = నడతలు కలవారు; ఐనన్ = అయినట్టి; పార్థివుల్ = రాజులు {పార్థివులు - పృథు (భూమి)కి ప్రభువులు, రాజులు}; ధృతిన్ = కష్టపడినను; పొందరాని = పొందలేని; ఈ = ఈ; దివ్య = గొప్ప; భోగంబులున్ = భోగములను; నీదు = నా యొక్క; పాతివ్రత్య = పాతివ్రత్యము యొక్క {పాతివ్రత్యము - పతియే వ్రతము (నియమము)గ కలిగి నడచుట}; నిష్ఠన్ = నేర్పు; చేసి = వలన; సంప్రాప్తములు = చక్కగా లభించినవి; అయ్యెన్ = అయినవి; సమతన్ = చక్కగ; భోగింపుము = అనుభవించుము; కార్యసిద్ధియునున్ = సార్థకతయును; అగున్ = కలుగు; కాక = గాక; నీకున్ = నీకు; అనుటయున్ = అని పలికిన; అతివయున్ = ఆమెకూడ; అనుపమ = సాటిలేని; యోగమాయా = యోగమాయ యందు; విచక్షణ = మిక్కిలినేర్పు ఉండుటలో; విభుండు = శ్రేష్ఠుడు; ఐనన్ = అయినట్టి; కర్దమునిన్ = కరందముని; కనుంగొని = చూసి;
విగత = పొయిన; ఆధియును = వ్యధ కలదియును; అపాంగ = కడకంట; కలిత = కలిగిన; లజ్జ = సిగ్గుచే; ఆనత = వంచిన; అస్య = శిరస్సు అను; పంకజయున్ = పద్మము కలదియును; అగుచూ = అవుతూ; వినయ = వినమ్రతయును; సౌహార్థములన్ = చనువుల; చేసి = వలన; విహ్వలంబుల్ = పరవశమైనది; అయిన = అయినట్టి; పలుకులన్ = మాటలతో; పతి = భర్త; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను; ప్రీతిన్ = ప్రేమతో.
భావము:- సాటిలేని రాజ్యవైభవాలతో గర్వాంధులైన రాజులు కనులు గానక పాపమార్గంలో ప్రవర్తిస్తారు. అటువంటి వారికి అందరాని ఈ దివ్యభోగాలు నీ పాతివ్రత్య మహిమ వల్ల నీకు లభించాయి. ఈ సుఖాలను నీవు సమబుద్ధితో అనుభవించు. నీకు కార్యసిద్ధి కలుగుతుంది” అని కర్దముడు పలుకగా దేవహూతి కడకన్నులలో సిగ్గు చిందులు త్రొక్కగా, మనోవ్యథ మాయం కాగా, మోము వంచుకొని వినయంతో చనువుతో పారవశ్యంతో యోగమాయావిశారదుడైన తన భర్తవంక చూస్తూ ముద్దుముద్దుగా ఇలా అన్నది.

తెభా-3-807-వ.
"అనఘా! యమోఘయోగమాయావిభుండవు సమర్థుండవు నయిన నీయందు నీ యనుపమ దివ్యభోగంబులు గలుగుట నిక్కం బని యెఱుంగుదు; భవత్సంగతి నన్నియు నాకుం గలుగు; నయినను దేవా! నీ వానతిచ్చిన సంతానపర్యంతం బైన శరీరసంగమ సమయంబు చిత్తంబునం దలంచి భవదంగసంగమంబుఁ గృపసేసి మన్నింపుము; భవదీయ సంయోగవాంఛాపరతం గృశీభూతం బయిన యీ దేహం బే విధంబున మజ్జన భోజన పాన సుఖంబులం బరితుష్టింబొందు నట్టి మన్మనోరథంబుఁ దీర్ప రతిరహస్య ప్రకాశంబగు కామశాస్త్ర ప్రకారం బుపశిక్షించి యందులకు నుచితంబు లయిన వివిధాంబరాభరణ మాల్యానులేపన మందిరారామ ప్రముఖ నిఖిల వస్తువిస్తారంబు గావించి నన్నుం గరుణింపు"మనిన నమ్మహాత్ముండు నిజ యోగమాయా బలంబునం దత్క్షణంబ.
టీక:- అనఘా = పుణ్యుడ; అమోఘ = తిరుగులేని; యోగమాయా = యోగమాయా విద్య యందు; విభుండవు = ప్రభువవు, శ్రేష్ఠుడవు; సమర్థుండవు = మంచి నేర్పు కలవాడవు; అయిన = అయినట్టి; నీ = నీ; అందున్ = అందు; ఈ = ఈ; అనుపమ = సాటిలేని; దివ్య = గొప్ప; భోగంబులున్ = భోగములు; కలుగుట = ఉండుట; నిక్కంబున్ = తథ్యము; అని = అని; ఎఱుంగుదున్ = తెలియుదును; భవత్ = నీతోడి; సంగతిన్ = సమాగమముచేత; అన్నియున్ = అన్నీ; నాకున్ = నాకు; కలుగున్ = లభించును; అయినను = అయినప్పటికిని; దేవా = ప్రభూ; నీవు = నీవు; ఆనతి = అనుజ్ఞ; ఇచ్చిన = ఇచ్చిన; సంతాన = సంతానము; పర్యతంబున్ = కలుగకుండు వరకు; ఐనన్ = అయినట్టి; శరీర = శరీరములు; సంగమ = కలియు; సమయంబున్ = సమయమును; చిత్తంబునన్ = మనసులో; తలంచి = తలచుకొని; భవత్ = నీ యొక్క; అంగ = శరీమును; సంగమంబున్ = కలియుటను; కృపసేసి = దయచేసి; మన్నింపుము = గౌరవింపుము; భవదీయ = నీతోడి; సంయోగ = సమాగమ; వాంఛా = వాంఛకు; పరతన్ = వశమగుటచే; కృశీభూతంబున్ = చిక్కిపోయినది; అయిన = అయినట్టి; ఈ = ఈ; దేహంబున్ = శరీరమును; ఏ = ఏ; విధంబునన్ = విధముగ; మజ్జన = స్నానము చేయు; భోజన = తిను; పాన = తాగు; సుఖంబులన్ = సుఖములను; పరితుష్టిన్ = తృప్తిని; పొందున్ = పొందును; అట్టి = అటువంటి; మత్ = నా యొక్క; మనోరథంబున్ = మనసులోని కోరికను; తీర్పన్ = తీర్చుటకు; రతి = కామక్రీడ యందలి; రహస్య = మెలుకువులు; ప్రకాశంబు = తెలియునవి; అగు = అయినట్టి; కామశాస్త్ర = కామశాస్త్రముల; ప్రకారంబునన్ = ప్రకారము; ఉపశిక్షించి = నేర్పి; అందుల = దాని; కున్ = కి; ఉచితంబులున్ = తగినట్టివి; అయిన = అయిన; వివిధ = అనేక రకములైన; అంబర = వస్త్రములు; ఆభరణ = ఆభరణములు; మాల్య = పూల మాలలు; అనులేపన = మైపూతలు; మందిర = గృహములు; ఆరామ = తోటలు; ప్రముఖ = మొదలగు; నిఖిల = సమస్తమైన; వస్తు = వస్తువులు; విస్తారంబున్ = ఎక్కువగా; కావించి = కలుగజేసి; నన్నున్ = నన్ను; కరుణింపుము = దయచేయుము; అనినన్ = అనగా; ఆ = ఆ; మహాత్ముండు = గొప్పవాడు; నిజ = తన; యోగమాయా = యోగమాయ యొక్క; బలంబునన్ = శక్తి వలన; తత్క్షణంబ = వెంటనే.
భావము:- “ఓ పుణ్యాత్మా! నీవు అమోఘమైన యోగమాయకు అధిపతివి. అత్యంత సమర్థుడవు. అటువంటి నీయందు సాటిలేని దివ్యభోగాలు ఉన్నాయని తెలుసు. నీ సాంగత్యం వల్ల అవన్నీ నాకు లభిస్తాయి. అయినప్పటికీ నీవు సంతానం కలిగేవరకు మాత్రమే శరీరసంగమం కలిగి ఉంటానని ఒక నియమం ఆనాడు సెలవిచ్చావు. ఆ మాట మనస్సులో పెట్టుకొని నీ సాంగత్యాన్ని నాకు దయతో అనుగ్రహించు. నన్ను మన్నించు. నీ సంయోగాన్ని అభిలషిస్తూ కృశించిన ఈ శరీరం స్నానపాన భోజనాదులవల్ల ఎలా తృప్తి పడుతుంది? అటువంటి నా కోరికను తీర్చటానికి రతిరహస్యాలను ప్రకాశితం చేసే కామశాస్త్రాన్ని నాకు నేర్పు. అందుకు తగిన నానావిధాలైన వస్త్రాలు, అలంకారాలు, పూదండలు, మైపూతలు, శయనమందిరాలు, ఉద్యానవనాలు మొదలైన సమస్త వస్తువులనూ సమకూర్చి నన్ను కనికరించు” అని దేవహూతి చెప్పగా విని మహాత్ముడైన కర్దముడు తన యోగమాయాబలంతో ఆ క్షణంలోనే (ఒక దివ్యవిమానాన్ని సృష్టించాడు).

తెభా-3-808-సీ.
దివ్యమణిస్తంభదీప్తిఁ జెన్నొందుచు-
రకతస్థలముల హిమ దనర
ర వజ్రకుడ్యకవాట శోభితము లై-
విద్రుమ దేహళీవీథు లమరఁ
గొమరొప్ప నవశాతకుంభ కుంభములపై-
రినీలశకల విస్ఫుణ మెఱయఁ
గఁ బద్మరాగంపు మొడలఁ జెలువొందు-
వైడూర్యవలభులు న్నెఁ జూపఁ

తెభా-3-808.1-తే.
రళతర ధూతకేతుపతాక లొలయ
మంజుశింజత్సమంచిత ధుప కలిత
సురుచిరాలంబమాన ప్రసూనరాజి
మాలికల నొప్పు వివిధ గృహాళిఁ దనరి.

టీక:- దివ్య = గొప్ప; మణి = మణులుతాపిన; స్తంభ = స్తంభముల; దీప్తిన్ = కాంతులతో; చెన్నొందుచున్ = అందమును పొందుచూ; మరకత = గరుడపచ్చలు తాపిన; స్థలముల = నడవల; మహిమన్ = గొప్పదనాలు; తనరన్ = అతిశయించగ; వర = శ్రేష్ఠమైన; వజ్ర = వజ్రముల తాపిన; కుడ్య = గోడలు; కవాట = ద్వారములుచే; శోభితముల్ = శోబించుతున్నవి; ఐ = అయ్యి; విద్రుమ = పగడాలు తాపిన; దేహళీ = గుమ్మముల; వీథుల = వరుసల యొక్క; అమరన్ = అమరికల; కొమర = అందము; ఒప్పన్ = ఒప్పుతుండగా; నవ = కొత్త; శాత = బంగారు; కుంభ = గుండ్రని; కుంభముల = కుంభముల; పై = మీద; హరినీల = ఇంద్రనీలముల; శకల = ముక్కలు; విస్పురణన్ = తళుకులతో; మెఱయన్ = మెరుస్తుండగా; తగన్ = చక్కటి; పద్మరాగంపు = పద్మరాగముల; మొగడలన్ = మొగ్గలతో; చెలువ = అందము; పొందున్ = చిందు; వైడూర్య = వైడూర్యపు; వలభులు = చూరులు; వన్నెన్ = సొగసులు; చూపన్ = కనిపిస్తుండగ; తరళతర = తళతళలాడుతున్ {తరళము - తరళతరము - తరళతమము};
ధూమకేతుపతాకలు = తోకచుక్కజండాలు; ఒలయన్ = చుట్టుకుపోతుండగ; మంజు = మనోహరమైన; శింజత్ = ఝంకారములతో; సమంచిత = ఒప్పుతున్న; మధుప = తుమ్మెదలతో; కలిత = కూడినట్టి; సురుచిర = చక్కటి కాంతివంతమై; ఆలంబమాన = వేలాడగట్టబడిన; ప్రసూనరాజి = పూల; మాలికలన్ = మాలలతో; ఒప్పు = చక్కనైన; వివిధ = అనేకవిధములైన; గృహాళిన్ = గదులతో; తనరి = అతిశయించి.
భావము:- ఆ విమానంలో అందమైన మందిరాలు కనువిందు చేస్తున్నాయి. ఆ మందిరాలన్నీ మణిమయ స్తంభాలతో, గరుడపచ్చలు పరచిన నడవలతో, వజ్రాల తలుపులు గల గోడలతో, పగడాల గడపలతో, ఇంద్రనీల మణిఖండాలతో నిండి తళతళ మెరిసే బంగారు కలశాలతో, అంచులలో పద్మరాగాల మొగ్గలు చెక్కిన చక్కని వైడూర్యపు చూరులతో, గాలికి రెపరెపలాడుతున్న జెండా గుడ్డలతో, మధుర మధురంగా ఝంకారం చేసే తుమ్మెదలతో కూడి వ్రేలాడుతున్న పూలదండల తోరణాలతో అత్యంత మనోహరంగా అలరారుతున్నాయి.

తెభా-3-809-క.
ఱియును దుకూలచీనాం
కౌశేయాది వివిధ టపరివృత మం
ది సుభగాకారంబై
రుదార విచిత్ర పట్టికాలంకృత మై.

టీక:- మఱియునున్ = ఇంకనూ; దుకూల = సున్నితమైన బట్టలు; చీనాంబర = పట్టుచీరలు, చీనాదేశమున నేసిన పట్టు వస్త్రములు, ఆంధ్రశబ్దరత్నాకరము.; కౌశేయ = పట్టుబట్టలు; ఆది = మొదలగు; వివిధ = రకరకముల; పట = వస్త్రములచే; పరివృత = పరుచుకొన్న; మందిర = మందిరములు; సుభగ = మనోహర; ఆకారంబున్ = ఆకారము కలవి; ఐ = అయ్యి; అరుదారన్ = అపురూపమైన; విచిత్ర = చక్కటి చిత్రములు కల; పట్టికా = మంతము చట్ట్రములతో; అలంకృతము = అలంకరింపబడినది; ఐ = అయ్యి.
భావము:- ఇంకా అందలి గదులలో జిలుగు దువ్వలువలు, చీనాంబరాలు, పట్టుచీరలు మొదలైన పలువిధాలైన వస్త్రాలు శోభిల్లుతున్నాయి. అపురూపమైన రంగురంగుల పట్టెమంచాలు అమర్పబడి ఉన్నాయి.

తెభా-3-810-మ.
లితోద్యానవనాంత సంచరణలీలాలోల హంసాళి కో
కి పారావత చక్రవాక శుక కేకీవ్యూహ మంచత్సము
త్కలికం గృత్రిమపక్షులన్ నిజవిహంశ్రేణి యంచుం గుతూ
లి యై పల్కుచు నాడుచుండుఁ బ్రతిశాఖారోహణవ్యాప్తులన్.

టీక:- లలిత = అందమైన; ఉద్యాన = ఉద్యాన; వన = వనముల; అంత = లోపల; సంచరణ = సంచరిస్తూ; లీలన్ = విలాసముగ; ఆలోల = తిరుగుతున్న; హంస = హంసల; ఆళి = వరుసలును; కోకిల = కోకిలలు; పారావత = పావురములును; చక్రవాక = చక్రవాకములును; శుక = చిలుకలును; కేకి = నెమళ్ళ; వ్యూహమున్ = బారులతోటి; అంచత్ = రచింపబడిన; సముత్కలికన్ = చక్కటి ఉత్సాహముగ; కృత్రిమ = చేయబడిన బొమ్మల; పక్షులన్ = పక్షులతో; నిజ = నిజమైన; విహంగ = పక్షుల; శ్రేణిన్ = సమూహము; అంచున్ = అనుకొనుచూ; కుతూహలి = కుతూహలము కలవి; ఐ = అయ్యి; పల్కుచున్ = కూయుచూ; ఆడుచున్ = ఆడుతూ; ఉండున్ = ఉండును; ప్రతి = అన్ని; శాఖా = కొమ్మలపైకి; ఆరోహణ = ఎక్కుట; వ్యాప్తులన్ = పొందుటలో.
భావము:- అందలి అందమైన ఉద్యానవనాలలో విలాసంగా విహరిస్తున్న రాజహంసలు, కోయిలలు, పావురాలు, చక్రవాకాలు, చిలుకలు, నెమళ్ళు మొదలైన పక్షులు మందిరాల గోడలమీద చెక్కబడిన కృత్రిమ పక్షులను చూచి తమ జాతికి చెందిన నిజమైన పక్షులుగానే భావించి ఎంతో ఉత్కంఠతో వాటిని పలుకరిస్తూ అక్కడి చెట్లకొమ్మలపై కేరింతలు కొడుతూ ఆడుతుంటాయి.

తెభా-3-811-వ.
వెండియు.
టీక:- వెండియున్ = మరియు.
భావము:- ఇంకా...

తెభా-3-812-క.
సౌధాంతర శయ్యా
కేళీగేహ కృతక గతీధర శో
చంద్రకాంత చారు భ
ఫలభరితావనీజవంతము లగుచున్.

టీక:- ఘన = పెద్ద; సౌధ = మేడల; అంతర = లోపల; శయ్య = పడకలు; ఆసన = ఆసనములు; కేళీ = క్రీడా; గేహ = గృహములు; కృతక = కృత్రిమ; జగతీధరన్ = పర్వతములతో [జగతీధరము – జగత్తును ధరించునవి, పర్వతములు, పర్యా. క్ష్మాధరములు, ధాత్రీధరములు, అవనీదరములు]; శోభనన్ = శోభిల్లుట కల; చంద్రకాంత = చలువరాళ్ళ; చారు = అందమైన; భవన = భవనములును; ఫల = పండ్లతో; భరిత = నిండిన; అవనీజ = చెట్లును {అవనీజములు - అవని (భూమి) యందు జములు (పుట్టినవి), చెట్లు}; వంతములు = కలవి; అగచున్ = అవుతూ.
భావము:- ఆ విమానం మెత్తని శయ్యలతో, మేలైన గద్దెలతో, కేళీగృహాలతో, క్రీడాపర్వతాలతో, పాలరాతి భవనాలతో, పండ్లచెట్లతో నిండిన వనాలతో కూడి ఉన్నది.

తెభా-3-813-క.
లర్తు శోభితంబును
ల శుభావహము సకల సంపత్కరమున్
లోపభోగయోగ్యము
లేప్సితకామదంబు దలంకృతమున్.

టీక:- సకల = అన్ని; ఋతు = ఋతువులందును; శోభితంబునున్ = శోభను కలిగి ఉండుటయును; సకల = సమస్తమైన; శుభ = శుభములను; ఆవహమును = కలిగించునదియును; సకల = సమస్తమైన; సంపత్ = సంపదలను; ఆకరమున్ = నివాసమైనదియును; సకల = అన్ని; ఉపభోగ = విధములైన భోగములను; యోగ్యమును = అనుభవించుటకు తగినదియును; సకల = సమస్తమైన; ఈప్సిత = కోరిన; కామదంబును = కోరికలను తీర్చునదియును; సత్ = మంచిగ; అలంకృతమున్ = అలంకరింపబడినదియును.
భావము:- ఆ విమానం సమస్త ఋతుశోభలతో, సకల శుభాలతో, సర్వసంపదలతో పెంపొందుతూ అన్ని సుఖాలను అనుభవించటానికి యోగ్యమై, అన్ని కోరికలను అందించగలదై, అందమైన అలంకారాలతో ఒప్పుతున్నది.

తెభా-3-814-వ.
అగుచు నొప్పు దివ్యవిమానంబుఁ గల్పించి తదీయ సుషమావిశేష విచిత్రంబులు నిర్మించిన తానునుఁ దెలియంజాలని యద్భుతకర్మంబు లైన విమానంబు దేవహూతికిం జూపినం జూచి యమ్ముద్దియ సంతసింపకుండుట యెఱింగి సర్వభూతాంతరాశ యాభిజ్ఞుండును సంతుష్టాంతరంగుండును నైన గర్దముం డిట్లనియె.
టీక:- అగుచున్ = అవుతూ; ఒప్పు = చక్కగ ఉండే; దివ్య = గొప్ప; విమానంబున్ = విమానమును; కల్పించి = సృష్టించి; తదీయ = దాని యందు; సుషమా = మనోజ్ఞమైన; విశేష = ప్రతేకతలు; విచిత్రంబులున్ = విచిత్రములును; నిర్మించిన = సృష్టించిన; తానునున్ = తాను కూడ; తెలియన్ = తెలిసికొన; చాలని = లేని; అద్భుత = ఆశ్చర్య; కర్మంబులు = పనులు; ఐన = కలిగిన; విమానంబున్ = విమానమును; దేవహూతి = దేవహూతి; కిన్ = కి; చూపి = చూపించి; ఆ = ఆ; ముద్దియ = అమాయకురాలు; సంతసింపక = సంతోషించకుండ; ఉండుట = ఉండుట; ఎఱింగి = తెలిసికొని; సర్వ = సమస్తమైన; భూత = జీవుల; అంతర = లోని; ఆశయ = మక్కువలను; అభిజ్ఞుండు = అర్థము చేసికొనువాడు; సంతుష్ట = సంతృప్తి చెందిన; అంతరంగుండు = మనసుకలవాడు; ఐన = అయినట్టి; కర్దముండు = కర్దముడు; ఇట్లు = ఈ విధముగ; అనియెన్ = పలికెను.
భావము:- అటువంటి దివ్యమైన విమానాన్ని సృష్టించి, అందలి శోభావిశేషాలను నిర్మాణం చేసిన తాను కూడా తెలుసుకొనంతటి అద్భుత నిర్మాణాలు కలదానిని దేవహూతికి చూపి, ఆమె సంతోషించడం లేదని తెలిసికొని సమస్త ప్రాణుల అంతరంగాలలో గల అభిప్రాయాలను గ్రహించేవాడూ, తృప్తిపడిన మనస్సు కలవాడూ అయిన కర్దముడు ఇలా అన్నాడు.

తెభా-3-815-తే.
"తివ! భగవత్కృతంబును ఖిలమంగ
ళాకరంబును నగు నీ జలాశయమునఁ
విలి గ్రుంకిన జంతువితానములకుఁ
గామ్యఫలసిద్ధి సేకుఱుఁ గాన నీవు.

టీక:- అతివ = స్త్రీ; భగవత్ = భగవంతునిచే; కృతంబునున్ = నిర్మించబడినదియును; అఖిల = సమస్తమైన; మంగళ = శుభములకు; ఆకరంబునున్ = నివాసమును; అగు = అయిన; ఈ = ఈ; జలాశయమునన్ = సరోవరమున {జలాశయము - జలమునకు ఆశ్రయము ఐనది, సరస్సు}; తవిలి = పూని; క్రుంకినన్ = మునిగినచో; జంతు = జీవుల; వితానములకున్ = సమూహములకు; కామ్య = కోరిన; ఫల = ఫలితముల; సిధ్ధి = సిద్ధించుట; చేకూఱున్ = జరుగును; కాన = కావున; నీవు = నీవు.
భావము:- “ఓ సుందరీ! భగవంతునిచే నిర్మింపబడినదీ, సమస్త శుభాలను కలిగించేదీ అయిన ఈ బిందుసరోవరంలో స్నానం చేసిన ప్రాణులన్నింటికీ కోరికలు తీరుతాయి. కావున నీవు…

తెభా-3-816-క.
జ్జలముల నతి భక్తిని
జ్జన మొనరించి యీ విమానము వేడ్కన్
జ్జావతి యెక్కవె"యని
బుజ్జన మొనరంగఁ గర్దముఁడు పల్కుటయున్.

టీక:- ఈ = ఈ; జలములన్ = నీటిలో; అతి = మిక్కిలి; భక్తిన్ = భక్తితో; మజ్జనము = స్నానము; ఒనరించి = చేసి; ఈ = ఈ; విమానమున్ = విమానమును; వేడ్కన్ = ఇష్టపూర్వకముగ; లజ్జావతి = అతివ {లజ్జావతి - లజ్జ (సిగ్గు) కలామె, స్త్రీ}; ఎక్కవే = ఎక్కుము; అని = అని; బుజ్జనము = లాలనము; ఒనరన్ = ఒప్పగా; కర్దముడు = కర్దముడు; పల్కుటయును = పలుకుటను.
భావము:- ఓ లజ్జాశీలీ! ఈ సరోవర జలాలలో భక్తితో స్నానం చేసి సంతోషంగా ఈ విమానాన్ని ఎక్కు” అని కర్దముడు బుజ్జగిస్తూ పలికాడు.