పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము/కవి సంభాషణ
కవి సంభాషణ
←విదేహర్షభ సంభాషణ | తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/ఏకాదశ స్కంధము) రచయిత: పోతన |
హరిముని సంభాషణ→ |
తెభా-11-41-వ.
మఱియు సకలజంతుసంతానంబుకంటె మానుషాకారంబు నొందుట దుర్లభం; బంతకంటె నారాయణచరణయుగళస్మరణ పరాయణులగుట దుష్కరంబు; గావున నాత్యంతికంబగు క్షేమంబడుగ వలసెఁ; బరమేశ్వరుండు ప్రపత్తినిష్ఠులకు సారూప్యం బెట్లొసంగు నత్తెఱం గానతిం” డనిన విని విదేహభూపాలునకు హరికథామృత పానాతిపరవశులైన మునిసమాజంబునందుఁ గవి యను మహానుభావుం డిట్లని చెప్పం దొడంగె; “నరిషడ్వర్గంబునందు నీషణత్రయంబుచేతం దగులువడి మాత్సర్యయుక్త చిత్తుం డగు నట్టి వానికెవ్విధంబున నచ్యుత పాదారవింద భజనంబు సంభవించు? విశ్వంబును నాత్మయు వేఱుగా భావించు వానికి భీరుత్వం బెట్లు లే? దవిద్యాంధకారమగ్నులకు హరిచింతనంబెట్లు సిద్ధించు? నట్టి నరుండు తొంటికళేబరంబు విడిచి పరతత్త్వం బెబ్భంగిం జేరు? ముకుళీకృతనేత్రుండయిన నరుండు మార్గభ్రమణంబునఁ దొట్రుపాటువడి చను చందంబున విజ్ఞానవిమలహృదయభక్తిభావనా వశంబు లేకున్నఁ బరమపదంబు వీరికెవ్విధంబునం గలుగు? నని యడిగితివి; గావునఁ జెప్పెద; సావధానుండవై యాకర్ణింపుము.
టీక:- మఱియున్ = ఇంకను; సకల = సమస్తమైన; జంతు = జీవ; సంతానంబు = జాతుల; కంటెన్ = కంటెను; మానుష = మానవునిగా; ఆకారంబున్ = జన్మము; ఒందుట = పొందుట; దుర్లభంబు = కష్టము; అంత = దాని; కంటెన్ = కంటెను; నారాయణ = హరి; చరణ = పాద; యుగళ = ద్వయమును; స్మరణ = ధ్యానించుట యందు; పరాయణులు = ఆసక్తి కలవారు; అగుట = ఔట; దుష్కరంబు = మరీకష్టము; కావునన్ = కనుక; ఆత్యంతికంబు = అత్యుత్తమమైనది; అగు = ఐన; క్షేమంబున్ = క్షేమమును గురించి; అడుగవలసె = అడగవలసి వచ్చినది; పరమేశ్వరుండు = భగవంతుడు; ప్రపత్తి = శరణాగతి {ప్రపత్తి - నీవేతప్ప వేరు దిక్కు లేదనుట}; నిష్ఠులు = నిష్ఠ కలవారి; కున్ = కి; సారూప్యంబు = తనరూపమే; ఎట్లు = ఏ విధముగ; ఒసంగున్ = ఇచ్చును; ఆ = ఆ; తెఱంగు = విధమును; ఆనతిండు = చెప్పండి; అనిన = అని అడగగా; విని = విని; విదేహ = విదేహుడు అను; భూపాలున్ = రాజు; కున్ = కి; హరి = విష్ణుమూర్తి; కథ = గాథలు అనెడి; అమృత = అమృతమును; పాన = తాగి; అతి = మిక్కిలి; పరవశులు = పరవశంపొందినవారు; ఐన = అయిన; ముని = ఋషుల; సమాజంబు = సమూహము; అందున్ = లోని; కవి = కవి; అను = అనెడి; మహానుభావుడు = గొప్పవాడు; ఇట్లు = ఇలా; అని = అని; చెప్పన్ = చెప్పుట; తొడంగె = మొదలెట్టెను; అరిషడ్వర్గంబు = అరిషడ్వర్గము {అరిషడ్వర్గము - కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము అను ఆరు గుణములుశత్రు సమూహము వంటివి}; అందున్ = వాటిలో; ఈషణత్రయంబు = ఈషణత్రయము {ఈషణత్రయము - 1దారేషణ 2ధనేషణ 3పుత్రేషణ మూడు కోరికలు తగులములు}; చేతన్ = వలన; తగులుపడి = చిక్కుకుపోయి; మాత్సర్య = మాత్సర్యముతో; యుక్త = కూడిన; చిత్తుండు = మనసు కలవాడు; అగునట్టి = ఐన; వాని = వాడి; కిన్ = కి; ఏ = ఏ; విధంబునన్ = విధముగా; అచ్యుత = శ్రీహరి; పాద = పాదములనెడి; అరవింద = పద్మములను; భజనంబు = భక్తి; సంభవించు = కలుగును; విశ్వంబును = జగత్తు; ఆత్మయు = ఆత్మా; వేఱు = వేరు; కాన్ = అయినట్లు; భావించు = అనుకొనెడి; వాని = అతని; కిన్ = కి; భీరుత్వంబు = భయము, బెదురు; ఎట్లు = ఏ విధముగ; లేదు = లేకుండాపోవును; అవిద్యా = అవిద్య అనెడి; అంధకార = చీకటిలో; మగ్నులు = మునిగినవారి; కున్ = కి; హరి = విష్ణు; చింతనంబు = భక్తి; ఎట్లు = ఎలా; సిద్ధించున్ = లభించును; అట్టి = అటువంటి; నరుండు = మానవుడు; తొంటి = పూర్వపు; కళేబరంబు = శరీరాన్ని; విడిచి = వదలిపెట్టి; పరతత్వంబు = పరమపదాన్ని; ఏ = ఏ; భంగిన్ = విధముగా; చేరున్ = అందుకొనగలడు; ముకుళీకృత = ముసుకున్న; నేత్రుండు = కళ్లుకలవాడు; అయిన = ఐన; నరుండు = మానవుడు; మార్గ = దోవలో; భ్రమణంబునన్ = తిరుగుటలో; తొట్రుపాటుపడి = తూలిపోతు; చను = వెళ్ళెడి; చందంబునన్ = విధముగా; విజ్ఞాన = విజ్ఞానముచేత; విమల = శుద్ధమైన; హృదయ = మనసులోని; భక్తిభావనా = భక్తిభావనకు; వశంబు = కూడినది; లేకున్న = లేకపోతే; పరమపదంబు = మోక్షము; వీరి = వీరి; కిన్ = కి; ఏ = ఏ; విధంబునన్ = విధముగా; కలుగును = లభించును; అని = అని; అడిగితివి = అడిగావు; కావునన్ = కనుక; చెప్పెదన్ = తెలియజెప్పెదను; సావధానుండవు = శ్రద్ధకలవాడవు; ఐ = అయ్యి; ఆకర్ణింపుము = వినుము.
భావము:- అంతేకాదు సకల రకాల జంతువుల జన్మల కంటె మానవ జన్మ శ్రేష్ఠమైనది, అది ప్రాప్తించటం కష్ట సాధ్యం. అందులోనూ శ్రీమన్నారాయణుని చరణయుగళ స్మరణంమీద ఆసక్తి కలగటం మరీ కష్టం. అందువలన, శాశ్వతమైన క్షేమాన్ని గురించి అడుగ వలసి వచ్చింది. ప్రపత్తి యందు నిష్ఠగల భక్తులకు పరమేశ్వరుడు శ్రీమహావిష్ణువు సారూప్యం ఎలా ఇస్తాడు, ఈ విషయం చెప్పండి.” అని అడిగిన విదేహరాజుతో శ్రీహరి కథామృతాన్ని త్రాగి పరవశులు ఐన ఆ మునులలో కవి అనే మహానుభావుడు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు.
“(1) అరిషడ్వర్గం అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఆరింటిలోను; ఈషణత్రయం అనే దారేషణ ధనేషణ పుత్రేషణ మూడింటిలోనూ; చిక్కుకుని మాత్సర్యంతో కూడిన మనసు కల మానవుడికి శ్రీహరి పాదపద్మాలను భజించే భాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది?
(2) విశ్వము వేరు, ఆత్మ వేరు అని భావించే వాడికి భయం ఎలా లేకుండా పోతుంది?
(3) అట్లు అవిద్యాంధకారంలో మునిగితేలే వాడికి విష్ణుభక్తి ఎలా అలవడుతుంది?
(4) అటువంటి నరుడు మొదటి శరీరాన్ని త్యజించి పరతత్వాన్ని ఏ విధంగా చేరుతాడు?
(5) కండ్లు మూసుకుని నడిచే మనిషి దోవలో తడబాటులు పడుతూ పోతున్నట్లుగా, విజ్ఞానంతో శుద్ధమైన హృదయంలో భక్తిభావన లేకుండా పోతే పరమపదం ఎలా సిద్ధిస్తుంది” అని అడిగావు. సమాధానాలు చెప్తాను శ్రద్ధగా విను.
తెభా-11-42-క.
కరణత్రయంబు చేతను
నరుఁడే కర్మంబు సేయు నయ్యైవేళన్
హరి కర్పణ మని పలుకుట
పరువడి సుజ్ఞాన మండ్రు పరమమునీంద్రుల్.
టీక:- కరణత్రయంబు = మనోవాక్కాయకర్మల {కరణత్రయము - త్రికరణములు 1మనస్సు 2వాక్కు 3కాయము}; చేతను = చేత; నరుడు = మానవుడు; ఏ = ఏదైనాసరే; కర్మంబున్ = పని; చేయున్ = చేయునో; అయ్యై = ఆయా; వేళన్ = సమయములందు; హరి = నారాయణుని; కున్ = కు; అర్పణము = సమర్పిస్తున్నా; అని = అని; పలుకుట = పలకుట; పరువడి = మిక్కిలి; సుజ్ఞానము = మంచి జ్ఞానము; అండ్రు = అంటారు; పరమ = మహా; ముని = ఋషులలో; ఇంద్రులు = శ్రేష్ఠులు.
భావము:- త్రికరణశుద్ధిగా అనగా మనసుతో, వాక్కుతో, కాయంతో చేసే ప్రతీ కర్మా “కృష్ణార్పణం” అని మనస్ఫూర్తిగా పలకటమే సుజ్ఞానము అని మహామునీశ్వరులు అంటారు.
తెభా-11-43-వ.
జ్ఞానాజ్ఞానంబు లందు సంకలితుండైన స్మృతి విపర్యయంబు నొందు; నట్లుగావున గురుదేవతాత్మకుం డయి, బుద్ధిమంతుండైన మర్త్యుండు శ్రీ వల్లభు నుత్తమోత్తమునిఁగాఁ జిత్తంబునఁ జేర్చి సేవింపవలయు; స్వప్న మనోరథేచ్ఛాద్యవస్థలయందు సర్వసంకల్పనాశం బగుటంజేసి, వానిఁ గుదియం బట్టి నిరంతర హరిధ్యానపరుం డైనవానికిఁ గైవల్యంబు సులభముగఁ గరతలామలకంబై యుండు.
టీక:- జ్ఞాన = సుజ్ఞానము; అజ్ఞాన = అజ్ఞానముల; అందున్ = అందు; సంకలితుండు = కూడియున్నవాడు; ఐన = అయినచో; స్మృతి = స్మృతి; విపర్యయంబున్ = వ్యత్యస్తము; ఒందున్ = పొందుతుంది; అట్లుగావునన్ = కాబట్టి; గురు = గురువునే; దేవత = దేవత అని; ఆత్మకుండు = బుద్ధికలవాడు; అయి = ఐ; బుద్ధిమంతుండు = బుద్ధిమంతుడు; ఐన = అయిన; మర్త్యుండు = మానవుడు; శ్రీవల్లభు = విష్ణుమూర్తిని; ఉత్తమోత్తముని = అత్యుత్తముని; కాన్ = ఐనట్లు; జిత్తంబునన్ = మనసునందు; చేర్చి = నిలుపుకొని; సేవింపవలయున్ = సేవించాలి; స్వప్న = కలలోని; మనోరథ = కోరికల; ఇచ్చా = వాంఛ; ఆది = మున్నగు; అవస్థలు = స్థితుల; అందున్ = లో; సర్వ = సమస్తమైన; సంకల్ప = పూనికలు; నాశంబు = నాశనము; అగుటన్ = అగుట; జేసి = వలన; వానిని = వాటిని; కుదియన్ = అణచి; పట్టి = పెట్టి; నిరంతర = ఎల్లప్పుడు; హరి = విష్ణు; ధ్యాన = ధ్యానించుట యందు; పరుండు = లగ్నమైనవాడు; ఐన = అయినచో; వానికి = అతనికి; కైవల్యంబు = మోక్షము {కైవల్యము - కేవలము తానే (పరమాత్మయే) అగు పదము, ముక్తి}; సులభముగ = సుళువుగా; కరతల = అరచేతిలో ఉన్న; అమలకంబు = ఉసరికాయలాగ; ఐ = అయ్యి; ఉండున్ = ఉండును.
భావము:- జ్ఞాన, అజ్ఞానాలలో కలత చెందుతుంటే స్మృతి వ్యత్యస్తమవుతుంది. కాబట్టి, గురువునకు దేవుడికి అనుగుణంగా నడచే బుద్ధిమంతుడైన నరుడు లక్ష్మీపతి ఐన విష్ణుమూర్తిని ఉత్తమోత్తముడైన పురుషోత్తముడిగా చిత్తంలో చేర్చి సేవించాలి. కలల యందు, కోరికల యందు, వాంఛల యందు సర్వసంకల్పాలు నాశనం అవుతాయి. కనుక, ఎట్టి పూనిక గట్టిగా నిలుబడదు. అందుచేత, వాటిని అణచుకుని ఎప్పుడూ శ్రీహరిని ధ్యానిస్తూ ఉండే వాడికి కైవల్యం చేతిలో ఉసిరికాయలాగ సులభంగా ప్రాప్తిస్తుంది
తెభా-11-44-సీ.
సంతతంబును గృష్ణ సంకీర్తనంబులు-
వీనుల కింపుగ వినఁగవలయు,
హర్షంబుతోడుత హరినామకథనంబు-
పాటలఁ నాటలఁ బరఁగవలయు,
నారాయణుని దివ్యనామాక్షరంబులు-
హృద్వీథి సతతంబు నెన్నవలయుఁ,
గంజాక్షులీలలు కాంతారముల నైన-
భక్తి యుక్తంబుగాఁ బాడవలయు,
తెభా-11-44.1-తే.
వెఱ్ఱిమాడ్కిని లీలతో విశ్వమయుని
నొడువుచును లోకబాహ్యత నొందవలయు,
నింతయును విష్ణుమయ మని యెఱుఁగవలయు,
భేద మొనరింప వలవదు మేదినీశ!"
టీక:- సంతతంబును = ఎల్లప్పుడు; కృష్ణ = శ్రీకృష్ణుని; సంకీర్తనంబు = స్తోత్రములు; వీనులు = చెవుల; కిన్ = కి; ఇంపుగా = విందుగా; వినగవలయు = వినవలెను; హర్షంబు = సంతోషము; తోడుత = తోటి; హరి = నారాయణుని; నామ = నామములు; కథనంబు = గాథలను; పాటలనాటల = ఆటపాటలలో; పరగవలయు = చేయవలెను; నారాయణుని = హరి; దివ్య = దివ్యమైన; నామాక్షరంబులు = పేర్లను; హృత్ = మానసిక; వీథిన్ = అంతరాలలో; సతతంబున్ = ఎల్లప్పుడు; ఎన్నవలయు = స్మరించాలి; కంజాక్షు = పద్మాక్షుని, హరి; లీలలు = విహారములను; కాంతారములన్ = అడవులలో; ఐనన్ = అయినను; భక్తి = భక్తితో; యుక్తంబుగా = కూడినవిగా; పాడవలయు = కీర్తించవలెను.
వెఱ్ఱి = వెఱ్ఱివాని; మాడ్కిని = వలె; లీల = లీల; తోన్ = తోటి; విశ్వమయుని = నారాయణుని; నొడువుచును = స్తుతించుతు; లోకబాహ్యతన్ = లోకానికంటీముట్టనిస్థితి; ఒందవలయు = పొందవలెను; ఇంతయును = ఇదంతా; విష్ణు = విష్ణుమూర్తితో; మయము = నిండినది; అని = అని; ఎఱుగవలయున్ = తెలిసికొనవలెను; భేదము = భేదబుద్ధి; ఒనరింప = చూపుట; వలవదు = వద్దేవద్దు; మేదినీశ = రాజా.
భావము:- ఓ రాజా! సదా శ్రీకృష్ణ సంకీర్తనలు వీనులవిందుగా వినాలి; హరినామ కథనాన్ని సంతోషంతో ఆడుతూ పాడుతూ చెయ్యాలి; నారాయణుని దివ్యమైన నామాలను హృదయంలో సదా స్మరిస్తూ ఉండాలి; కమలనయనుని లీలలను అడవులలో చరిస్తున్నా భక్తియుక్తంగా పాడాలి; విశ్వమయుడిని వెఱ్ఱిగా కీర్తిస్తూ లోకానికి అంటీ అంటకుండా ఉండాలి; ఈ సృష్టి మొత్తం విష్ణుమయ మని తెలుసుకోవాలి; భేదబుద్ధి ఏ మాత్రమూ చూపరాదు.”