పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/హరి అసురులశిక్షించుట
హరి అసురులశిక్షించుట
←బలిప్రతాపము | తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/) రచయిత: పోతన |
జంభాసురుని వృత్తాంతము → |
తెభా-8-341-వ.
అట్లు మొఱయిడు నవసరంబున.
టీక:- అట్లు = అలా; మొఱ = మొర; ఇడు = పెట్టు; అవసరంబునన్ = సమయమునందు.
భావము:- అలా దేవతలు విష్ణుమూర్తికి మొరపెట్టుకుంటున్న సమయంలో . .
తెభా-8-342-మ.
విహగేంద్రాశ్వ నిరూఢుఁడై మణిరమా విభ్రాజితోరస్కుఁడై
బహుశస్త్రాస్త్ర రథాంగ సంకలితుఁడై భాస్వత్కిరీటాది దు
స్సహుఁడై నవ్యపిశంగచేల ధరుఁడై సంఫుల్లపద్మాక్షుఁడై
విహితాలంకృతితోడ మాధవుఁడు దా వేంచేసె నచ్చోటికిన్.
టీక:- విహగేంద్ర = గరుడ; అశ్వ = వాహన; నిరూఢుడు = ఎక్కినవాడు; ఐ = అయ్యి; మణి = కౌస్తుభమణి; రమా = లక్ష్మీదేవిలచేత; విభ్రాజిత = ప్రకాశించుతున్న; ఉరస్కుడు = వక్షస్థలము గలవాడు; ఐ = అయ్యి; బహు = అనేక; శస్త్ర = శస్త్రములు; అస్త్ర = అస్త్రములు; రథాంగ = చక్రములు; సంకలితుండు = కలిగినవాడు; ఐ = అయ్యి; భాస్వత్ = మెరుస్తున్న; కిరీట = కిరీటములు; ఆది = మున్నగువానితో; దుస్సహుడు = చూడశక్యము గానివాడు; ఐ = అయ్యి; నవ్య = కొత్త; పిశంగ = పసుపుపచ్చని; చేల = బట్టలు; ధరుడు = ధరించినవాడు; ఐ = అయ్యి; సంఫుల్ల = బాగుగా విరిసిన; పద్మ = పద్మములవంటి; అక్షుడు = కన్నులుగలవాడు; ఐ = అయ్యి; విహిత = తగిన; అలంకృతి = అలంకారముల; తోడన్ = తోటి; మాధవుడు = విష్ణువు; తాన్ = అతను; వేంచేసెన్ = వచ్చెను; ఆ = ఆ; చోటున్ = ప్రదేశమున; కిన్ = కు.
భావము:- మహావిష్ణువు తన వాహనం పక్షిరాజు గరుడుని మీద కూర్చుని అక్కడకి వచ్చాడు. అప్పుడు ఆయన వక్షస్థలం మీద కౌస్తుభమణి, లక్ష్మీదేవి ప్రకాశిస్తూ ఉన్నాయి. చక్రాయుధంతో సహా అనేక ఆయుధాలు అన్నీ ఆయన వద్ద ఉన్నాయి. చూడశక్యము కానంతటి ధగధగలాడే కిరీటాలు మున్నగునవీ; సరిక్రొత్త పసుపుపచ్చని పట్టు బట్టలూ; తగిన ఆభరణాలు అనేకమూ ధరించి ఉన్నాడు. వికసించిన పద్మాల వంటి కన్నులతో విరాజిల్లుతున్నాడు.
తెభా-8-343-చ.
అసురుల మాయ లన్నియును నబ్జదళాక్షుఁడు వచ్చినంతటన్
గసిబిసియై నిరర్థమయి గ్రక్కునఁ బోయెను; నిద్రబొంది సం
తసమున మేలుకొన్నగతిఁ దాల్చి చెలంగిరి వేల్పు లందఱుం;
బస చెడ కేలయుండు హరిపాద పరిష్కృతిచేయ నాపదల్?
టీక:- అసురుల = రాక్షసుల యొక్క; మాయలు = మాయలు; అన్నియునున్ = అన్నీ; అబ్జదళాక్షుడు = విష్ణువు; వచ్చినంతటన్ = రాగా; కసిబిసి = కకావికలు; ఐ = అయ్యి; నిరర్థము = వ్యర్థము; అయి = అయ్యి; క్రక్కున = వెంటనే; పోయెన్ = విరిగిపోయినవి; నిద్ర = నిద్ర; పొంది = పోయి; సంతసమునన్ = సంతోషముతో; మేలుకొన్న = నిద్రలేచిన; గతిన్ = విధముగ; తాల్చి = పూని; చెలంగిరి = చెలరేగిరి; వేల్పుల్ = దేవతలు; అందఱున్ = సర్వులు; పసచెడక = పట్టువిడిపోకుండగ; ఏల = ఎలా; ఉండున్ = ఉండగలుగును; హరి = విష్ణుని; పాద = పాదాశ్రయముచేత; పరిష్కృతిన్ = పరిష్కారము; చేయన్ = చేయబడినట్టి; ఆపదల్ = కష్టములు.
భావము:- అలా కమలాల వంటి కన్నులు గల కాంతుడు విష్ణువు రాగానే, ఆ రాక్షసుల మాయలు అన్నీ కకావికలైపోయి, పనికిరాకుండాపోయి, విరిగిపోయాయి. దేవతలు అందరూ అప్పుడే నిద్ర మేల్కొన్న విధంగా చెలరేగారు. పురుషోత్తముని పాదాశ్రయంతో పరిష్కరింపబడిన ఆపదల పట్టులు విడిపోతాయి కదా.
తెభా-8-344-వ.
అయ్యెడ
టీక:- ఆ = ఆ; ఎడన్ = సమయమునందు.
భావము:- ఆలా వైష్ణవ ప్రభావంతో రాక్షసమాయలు విరిగిపోయినప్పుడు. . .
తెభా-8-345-ఆ.
కాలనేమి ఘోర కంఠీరవము నెక్కి
తార్క్ష్యు శిరము శూలధారఁ బొడువ
నతని పోటుముట్టు హరి గేల నంకించి
దానఁ జావఁ బొడిచె దైత్యవరుని.
టీక:- కాలనేమి = కాలనేమి యనువాడు; ఘోర = భీకరమైన; కంఠీరవమున్ = సింహమును; ఎక్కి = ఎక్కి; తార్క్ష్యు = గరుడుని; శిరమున్ = తలను; శూలధారన్ = శూలము; ధారన్ = సూదికొనతో, పదునుతో; పొడువన్ = పొడవగా; అతనిన్ = అతని యొక్క; పోటుముట్టు = ఆయుధమును; హరి = విష్ణువు; కేలన్ = చేతితో; అంకించి = అందుకొని; దానన్ = దానితోనే; చావన్ = చచ్చేట్టు; పొడిచెన్ = పొడిచెను; దైత్య = రాక్షస; వరుని = ఉత్తముని.
భావము:- అప్పుడు రాక్షస వీరుడు కాలనేమి భీకరమైన సింహాన్ని ఎక్కి వచ్చి, గరుత్మంతుని తలమీద వాడి బల్లెంతో కుమ్మాడు. విష్ణువు అతని ఆ ఆయుధాన్ని లాక్కొని ఆ రాక్షసుడుని చచ్చేలా పొడిచాడు.
తెభా-8-346-క.
పదపడి మాలి సుమాలులు
బెదరించినఁ దలలుఁ ద్రుంచెఁ బృథు చక్రహతిన్;
గదఁగొని గరుడుని ఱెక్కలు
చెదరించిన మాల్యవంతు శిరమున్ వ్రేసెన్.
టీక:- పదపడి = అటుపిమ్మట; మాలి = మాలి; సుమాలులు = సుమాలి అనువారు; బెదిరించినన్ = భయపెట్టగా; తలలున్ = శిరస్సులను; త్రుంచెన్ = ఖండించెను; పృథు = గొప్పదైన; చక్ర = చక్రపు; హతిన్ = దెబ్బతో; గదన్ = గదను; కొని = తీసుకొని; గరుడుని = గరుత్మంతుని; ఱెక్కలున్ = రెక్కలను; చెదరించిన = చెదరగొట్టిన; మాల్యవంతు = మాల్యవంతుని; శిరమున్ = తలను; వ్రేసెన్ = నరికెను.
భావము:- తరువాత విష్ణుని మాలీ, సుమాలీ బెదిరించారు. అంతట నారాయణుడు తన మహా శక్తిమంతమైన చక్రాయుధంతో వారి తలలు తెగనరికాడు. మాల్యవంతుడు గద పట్టుకుని గరుడుని రెక్కలు చెదరగొట్టాడు. హరి వాని తల కూడా చక్రాయుధంతో ఖండించాడు.
తెభా-8-347-వ.
ఇట్లు పరమపురుషుండగు హరి కరుణాపరత్వంబునం బ్రత్యుపలబ్ధ మనస్కులయిన వరుణ వాయు వాసవ ప్రముఖులు పూర్వంబున నెవ్వరెవ్వరితోఁ గయ్యంబు జేయుదురు, వారు వారలం దలపడి నొప్పించి; రయ్యవసరంబున.
టీక:- ఇట్లు = ఇలా; పరమపురుషుండు = నారాయణుడు; అగు = అయిన; హరి = విష్ణువు యొక్క; కరుణా = కృపచూపుటయదు; పరత్వంబునన్ = నిష్ఠకలగియుండుటను; ప్రత్యుపలబ్ధ = బాగాతెలిసిన; మనస్కులు = మనసులుగలవారు; అయిన = ఐన; వరుణ = వరుణుడు; వాయు = వాయువు; వాసవ = ఇంద్రుడు; ప్రముఖులు = మున్నగుముఖ్యులు; పూర్వంబునన్ = ఇంతకుముందు; ఎవరు = ఎవరైతే; ఎవరి = ఎవరి; తోన్ = తోనైతే; కయ్యంబున్ = పోరు; చేయుదురు = చేయుచున్నారో; వారు = వారు; వారలన్ = వారిని; తలపడి = ఎదుర్కొని; నొప్పించిరి = బాధించిరి; ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
భావము:- ఇలాగ పురుషోత్తముడు శ్రీమహా విష్ణువు కరుణాకటాక్షానికి పాత్రులై తిరిగి బలం పుంజుకున్న వరుణదేవుడూ, వాయుదేవుడూ, దేవేంద్రుడూ మున్నగు దేవతా ప్రముఖులు ఇంతకు ముందు ఎవరు ఎవరితో చేశారో మరల వారు వారిని పోరులో ఎదిరించి పోరాడి వారిని పొడిచారు. ఆ సమయంలో . . .
తెభా-8-348-క.
బాహుబలంబున నింద్రుఁడు
సాహసమున బలిని గెలువ సమకట్టి సము
త్సాహమున వజ్ర మెత్తిన
హాహానినదంబు జేసి రఖిల జనములున్.
టీక:- బాహుబలంబునన్ = భుజబలముతో; ఇంద్రుడు = ఇంద్రుడు; సాహసమునన్ = సాహసముతో; బలిని = బలిచక్రవర్తిని; గెలువన్ = గెలుచుటకు; సమకట్టి = పూనుకొని; సముత్సాహమునన్ = పట్టుదలతో; వజ్రమున్ = వజ్రాయుధమును; ఎత్తిన = పైకెత్తగా; హాహా = హాహాకారముల; నినదంబున్ = కేకలను; చేసిరి = చేసితిరి; అఖిల = సమస్తమైన; జనములున్ = వారును.
భావము:- అంతట బలిచక్రవర్తిని జయించడానికి సాహసించి బాహుబలంతో పూనుకుని ఇంద్రుడు పట్టుదలగా వజ్రాయుధాన్ని పైకెత్తాడు. దానితో రాక్షసు లందరూ హాహాకారాలు చేశారు.
తెభా-8-349-వ.
ఇట్లు సముద్యత భిదుర హస్తుండై యింద్రుండుఁ దన పురోభాగంబునం బరాక్రమించుచున్న విరోచననందను నుపలక్షించి యిట్లనియె.
టీక:- ఇట్లు = ఇలా; సముద్యత = పైకెత్తిన; భిదుర = వజ్రాయుధమును; హస్తుండు = చేతధరించినవాడు; ఐ = అయ్యి; ఇంద్రుండు = ఇంద్రుడు; తన = తన; పురోభాగంబునన్ = ఎదుట; ఆక్రమించుచున్న = పరాక్రమిస్తున్న; విరోచననందనున్ = బలిని; ఉపలక్షించి = ఉద్దేశించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఇలా వజ్రాయుధాన్ని ఎత్తి పట్టుకుని జళిపిస్తూ, ఇంద్రుడు తన ఎదుట పరాక్రమం ప్రదర్శిస్తున్న బలిచక్రవర్తితో ఇలా అన్నాడు.
తెభా-8-350-మ.
"జగతిన్ వైరి మొఱంగి గెల్చుటదియున్ శౌర్యంబె ధైర్యంబె? తా
మగవాఁడయ్యును దన్నుఁ దా నెఱిఁగి సామర్థ్యంబునుం గల్గియున్
బగవానిం గని డాఁగెనేని మెయి చూపం జాలఁడేనిం గటా!
నగరే బంధులు? దిట్టరే బుధులుఁ? గన్యల్ గూర్తురే? దానవా!
టీక:- జగతిన్ = లోకములో; వైరిన్ = శత్రువునకు; మొఱంగి = మోసగించి; గెల్చుట = నెగ్గుట; అదియున్ = అదికూడ; శౌర్యంబె = శూరత్వమా; ధైర్యంబె = ధైర్యమా; తాన్ = అతను; మగవాడు = పురుషుడు; అయ్యున్ = అయ్యి యుండియు; తన్నుదానెఱిగి = ఒంటిమీదతెలివికలిగి; సామర్థ్యంబునున్ = తగినశక్తి; కల్గియున్ = కలిగుండి; పగవానిన్ = శత్రువును; కని = చూసి; డాగెనేని = దాక్కొనినచో; మెయిన్ = ఒళ్ళు; చూపంజాలడు = కనిపించలేనివాడు; ఏనిన్ = అయితే; కటా = అయ్యో; నగరే = నవ్వరా; బంధులున్ = బంధువులు; తిట్టరే = దూషించరా; బుధులున్ = పండితులు; కన్యల్ = ఆడపిల్లలు; కూర్తురే = ఇష్టపడుతురా; దానవా = రాక్షసుడా.
భావము:- ఓ రాక్షసుడా! మాయతో మోసగించి గెలవడం లోకంలో ఎక్కడైనా శౌర్యమూ కాదు; ధైర్యమూ కాదయ్యా. పౌరుషం కల మగవాడు తన శక్తిసామర్థ్యాలు తానెరిగి, ఎదుటివానిని ఎదిరించాలి; అంతటి శక్తి ఉన్నా, మాయ చేసి కనిపించకుండా దెబ్బతీస్తే; చుట్టాలు నవ్వుతారు; పండితులు తిడతారు; ఆడపిల్లలు పెదవి విరుస్తారు సుమా.
తెభా-8-351-శా.
మాయల్ చేయఁగ రాదు పో; నగవులే మాతోడి పోరాటముల్?
దాయా! చిక్కితి; వ్రక్కలించెదఁ గనద్దంభోళి ధారాహతిన్;
నీ యిష్టార్థము లెల్లఁ జూడుము వెసన్ నీ వారలం గూడుకో
నీ యాటోపము నిర్జరేంద్రుఁ డడఁచున్ నేఁ డాజిలో దుర్మతీ!"
టీక:- మాయల్ = మాయలు; చేయగరాదు = చేయకూడదు; పో = నిశ్చయంగా; నగవులే = నవ్వులాటలా, కాదు; మా = మా; తోడి = తోటి; పోరాటముల్ = యుద్ధములు; దాయా = దాయదుడా, శత్రువా; చిక్కితి = దొరికిపోతివి; వ్రక్కలించెదన్ = చీల్చివేసెదను; కనత్ = మెరుస్తున్న; దంభోళి = వజ్రాయుధపు; ధారా = అంచు యొక్క; హతిన్ = దెబ్బతో; నీ = నీ యొక్క; ఇష్టార్థముల్ = కోరికలను; ఎల్లన్ = అన్నిటిని; చూడుము = చూసుకొనుము; వెసన్ = శ్రీఘ్రమే; నీ = నీ; వారలన్ = వారిని; కూడుకో = కలుసుకో; నీ = నీ యొక్క; ఆటోపమున్ = అహంకారమును; నిర్జరేంద్రుడు = ఇంద్రుడు; అడచున్ = అణచివేయును; నేడు = ఇప్పుడు; ఆజి = యుద్ధభూమి; లోన్ = అందు; దుర్మతీ = దుర్మార్గుడా.
భావము:- “ఓ దుష్టా! ఇక నీ మాయలు చెల్లవు. మాతో పోరాటాలంటే నవ్వులాటలేం కావు. దేవేంద్రుడి చేతికి చిక్కావు. ఈ తళతళలాడే వజ్రాయుధంతో నరికేస్తా. తొందరగా నీ కోరికలు అన్నీ చెప్పుకో. నీ వారిని కలుసుకో. ఇవాళ్టి పోరులో నీ అహంకారం ఈ దేవేంద్రుడు అణచివేస్తాడు.”
తెభా-8-352-వ.
అని యుపాలంభించిన విని విరోచననందనుం డిట్లనియె.
టీక:- అని = అని; ఉపాలంభించిన = నిందించుచుండగా; విని = విని; విరోచననందనుడు = బలిచక్రవర్తి; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- అంటూ నిందిస్తున్న అదితి పుత్రుడైన దేవేంద్రుడితో, హిరణ్యకశిపుని మనుమడు విరోచనుని పుత్రుడు అయిన బలిచక్రవర్తి ఇలా అన్నాడు.
తెభా-8-353-శా.
"నీవే పోటరివే? సురేంద్ర! తెగడన్ నీకేల? గెల్పోటముల్
లేవే? యెవ్వరి పాలఁ బోయినవి? మేల్గీడుల్ విరించాదులుం
ద్రోవం జాలుదు రెవ్విధానమున సంతోషింప శోకింప నా
దైవం బేమి? కరస్థలామలకమే? దర్పోక్తులుం బాడియే?
టీక:- నీవే = నువ్వొక్కవే; పోటరివే = మొనగాడవా కాదు; సురేంద్ర = దేవేంద్రుడా; తెగడన్ = దూషించుట; నీకు = నీకు; ఏలన్ = ఎందుకులే; గెల్పు = జయ; ఓటముల్ = అపజయములు; లేవే = తప్పవుగదా; ఎవ్వరి = ఎవరి; పాలన్ = ఎడల; పోయినవి = లేకుండినవి; మేల్ = సుఖములు; కీడుల్ = దుఃఖములు; విరించి = బ్రహ్మదేవుడు; ఆదులున్ = మొదలగువారైనను; త్రోవన్ = తప్పించుకొన; చాలుదురా = సమర్థులా; ఏ = ఏ; విధానమునన్ = విధముగానైన; సంతోషింపన్ = సంతోషించుటకు; శోకింపన్ = దుఃఖించుటకు; ఆ = ఆ; దైవంబున్ = దైవము; ఏమి = ఏమైనా; కరస్థల = అరచేతిలోని; అమలకమే = ఉసిరికాయా; దర్ప = గర్వముతోకూడిన; ఉక్తులున్ = పలుకులు; పాడియే = తగునా కాదు.
భావము:- “ఓహో దేవేంద్రుడా! నువ్వొక్కడవే మొనగాడవాడను అనుకోకు. మిడిసిపడి తెగడబోకు. జయాపజయాలు దైవాధీనాలు. ఎవరికైనా ఇవి తప్పవు సుమా. బ్రహ్మాదులైనా సరే సుఖదుఃఖాలను తప్పించుకోలేరు. ఇంతోటిదానికి సంతోషించడం గానీ, దుఃఖించడంగానీ తగదు సుమా. దేవుడు అరచేతిలో ఉసిరికాయ యేం కాదు. ఇలా ప్రగల్భాలు పలకడం పద్ధతి కాదు.
తెభా-8-354-ఆ.
జయము లపజయములు సంపద లాపద
లనిల చలిత దీపికాంచలములు
చంద్రకళలు మేఘచయములు దరఁగలు
మెఱుఁగు లమరవర్య! మిట్టిపడకు."
టీక:- జయముల్ = జయములు; అపజయములున్ = అపజయములు; సంపదలు = సంపదలు; ఆపదలు = ఆపదలు; అనిల = గాలికి; చలిత = చలించెడి; దీపికాంచలములు = దీపపు శిఖలు; చంద్ర = చంద్రుని యొక్క; కళలు = కళలు; మేఘ = మబ్బుల; చయములున్ = గుంపులు; తరగలున్ = నీటిఅలలు; మెఱుగులు = మెరుపుతీగలు; అమరవర్య = ఇంద్రా; మిట్టిపడకు = విఱ్ఱవీగవద్దు.
భావము:- ఇంద్రా! ఎంతటి దేవతలలో మేటివి అయినా. జయాలు అపజయాలూ; సంపదలూ ఆపదలూ సర్వం అశాశ్వతాలు అనీ; అవి గాలిలో దీపాలు, చంద్రకళలు, మేఘమాలికలు, మెరుపుతీగలు వంటివి అనీ తెలుసుకో. విఱ్ఱవీగబోకు.”
తెభా-8-355-వ.
అని యి ట్లాక్షేపించి.
టీక:- అని = అని; ఇట్లు = ఇలా; ఆక్షేపించి = తూలనాడి.
భావము:- ఇలా దేవేంద్రుడిని తూలనాడి . . .
తెభా-8-356-క.
వీరుఁడు దానవ నాథుఁడు
నారసముల నింద్రు మేన నాటించి మహా
ఘోరాయుధ కల్పములగు
శూరాలాపములు చెవులఁ జొనిపెన్ మరలన్.
టీక:- వీరుడు = శూరుడు; దానవనాథుడు = బలిచక్రవర్తి; నారసములన్ = బాణములను; ఇంద్రు = ఇంద్రుని; మేనన్ = దేహమునందు; నాటించి = వేసి; మహా = గొప్ప; ఘోర = ఘోరమైన; ఆయుధ = బాణములకు; కల్పములు = సమానములైనవి; అగు = అయిన; శూరాలాపములు = సూటిపోటిమాటలు; చెవులజొనిపెన్ = వినిపించెను; మరలన్ = ఇంకను.
భావము:- వీరాధివీరుడూ, దానవసామ్రాజ్యాధినేతా అయిన బలిచక్రవర్తి ఇంద్రుని శరీరం మీద నాటేలా వాడైన ఇనపబాణాలు వేసాడు. అతని చెవులు చిల్లులు పడేలా భీకరమైన పలుకుల వంటి సూటిపోటి మాటలు పలికాడు.
తెభా-8-357-వ.
ఇట్లు తథ్యవాది యైన బలిచే నిరాకృతుండై
టీక:- ఇట్లు = ఇలా; తథ్యవాది = సత్యవాది; ఐన = అయిన; బలి = బలి; చేన్ = చేత; నిరాకృతుండు = తిరస్కరింపబడినవాడు; ఐ = అయ్యి.
భావము:- ఇలా సత్యవాది అయిన బలిచక్రవర్తి తిరస్కారాలు విన్నట్టి ఇంద్రుడు. . .
తెభా-8-358-క.
శత్రువు నాక్షేపంబునఁ
దోత్రాహత గజము భంగిఁ ద్రుళ్ళుచు బలి నా
వృత్రారి వీచి వైచిన
గోత్రాకృతి నతఁడు నేలఁగూలె నరేంద్రా!
8-358/1-వ.
అప్పుడు.
- తంజనగరము తేవప్పెరుమాల్లయ్య వారి ప్రతి
టీక:- శత్రువున్ = శత్రువు యొక్క; ఆక్షేపంబునన్ = దూషణములచే; తోత్రా = అంకుశముచే; హత = పొడవబడిన; గజము = ఏనుగు; భంగిన్ = వలె; త్రుళ్ళుచున్ = తుళ్ళిపడుతూ; బలిన్ = బలిని; ఆ = ఆ; వృత్రారి = ఇంద్రుడు, వజ్రాయుధము; వీచి = విసిరి; వైచినన్ = వేయగా; గోత్ర = కొండ; ఆకృతిన్ = వలె; అతడు = అతడు; నేలఁగూలెన్ = నేలకొరిగెను; నరేంద్రా = రాజా.
భావము:- ఓరాజా! అంకుశం దెబ్బ తిన్న ఏనుగులాగ ఇంద్రుడు త్రుళ్ళిపడ్డాడు; ఆగ్రహంతో వజ్రాయుధం విసిరి బలిని కొట్టాడు; దానితో బలిచక్రవర్తి పెద్ద పర్వతంలా మరణించి నేలపైకొరిగాడు.