Jump to content

పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/సముద్రమథన యత్నము

వికీసోర్స్ నుండి

సముద్రమథనయత్నము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-192-సీ.
భూనాథ! వినవయ్య భోగీంద్రు వాసుకిఁ-
బిలిపించి యతనికిఁ బ్రియము జెప్పి
లభాగ మీ నొడఁడి సమ్మతునిఁ జేసి-
మెల్లన చేతుల మేను నివిరి
నీవ కా కెవ్వరు నేర్తు? రీ పని కియ్య-
కొమ్మని యతని కైకోలు పడసి
వ్వంపుఁ గొండ నిష్కంటకంబుగఁ జేసి-
ర్షించి యతని భోగంబుఁ జుట్టి

తెభా-8-192.1-ఆ.
డఁగి యమృతజలధిఁ లశంబుఁ గావించి
త్రచ్చు నవసరమునఁ లఁపు లమర
ద్ధవస్త్రకేశభారులై యా రెండు
ములవారు తరువఁ దిసి రచట.

టీక:- భూనాథ = రాజా; విను = వినుము; అయ్య = తండ్రి; భోగి = సర్పములకు; ఇంద్రున్ = ప్రభువుని; వాసుకిన్ = వాసుకుని; పిలిపించి = పిలిపించి; అతని = అతని; కిన్ = కి; ప్రియముజెప్పి = నచ్చచెప్పి; ఫల = ఫలితములో; భాగము = వంతు; ఈన్ = ఇచ్చుటకు; ఒడబడి = ఒప్పుకొని; సమ్మతునిజేసి = ఒప్పించి; మెల్లన = మెల్లగా; చేతులన్ = చేతులతో; మేను = దేహమును; నివిరి = దువ్వి; నీవ = నీవుమాత్రము; కాక = తప్పించి; ఎవ్వరు = ఎవరు; నేర్తురు = సమర్థులు; ఈ = ఈ; పని = కార్యమున; కున్ = కు; ఇయ్యకొమ్ము = అంగీకరింపుము; అని = అని; అతని = అతని యొక్క; కైకోలు = అంగీకారము; పడసి = పొంది; కవ్వంపు = కవ్వముగానున్న; కొండన్ = పర్వతమును; నిష్కంటకంబుగన్ = ముళ్ళులేనిదిగ; చేసి = చేసి; ఘర్షించి = రాపిడిచేసి; అతని = అతని; భోగంబున్ = శరీరమును; చుట్టి = చుట్టి.
కడగి = పూని; అమృతజలధిన్ = పాలసముద్రమును; కలశంబుగాన్ = కుండగా; కావించి = చేసుకొని; త్రచ్చు = చిలికెడి; అవసరమునన్ = సమయములో; తలపులు = బారులు; అమరన్ = తీరి; బద్ద = బిగించిన; వస్త్ర = బట్టలు; కేశభారులు = జుట్టుముడులుగలవారు; ఐ = అయ్యి; ఆ = ఆ; రెండు = రెండు (2); గముల = పక్షముల; వారున్ = వారు; తరువన్ = చిలుకుటకు; కదిసిరి = తలపడిరి; అచటన్ = అక్కట.
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! దేవతలూ, రాక్షసులూ సర్పరాజైన వాసుకిని పిలిపించారు. అతనికి ప్రీతి కలిగేలా మాట్లాడారు. అమృతంలో అతనికి కూడా భాగం ఇవ్వటానికి ఒప్పుకున్నారు. మెల్లగా శరీరాన్ని దువ్వి స్నేహం కనబరచారు. “నీ కంటే సమర్థులు ఇంకెవరూ లేరు” అని పొగుడుతూ, కవ్వపు త్రాడుగా ఉండటానికి ఒప్పించారు. వాసుకికి ముళ్ళు గుచ్చకోకుండా ఉండటానికి, మందరపర్వతాన్ని చదును చేశారు. ఆ పెద్ద కొండను కవ్వంగా తీసుకుని, వాసుకిని త్రాడుగా చుట్టి, పాలసముద్రాన్ని కుండగా చేశారు. రెండు పక్షాలవారు రెండువైపులా బారులు తీరి, వస్త్రాలు ఎగగట్టుకున్నారు. జుట్టులు గట్టిగా ముడులు వేసుకుని, పాలసముద్రాన్ని చిలకడానికి తలపడ్డారు.

తెభా-8-193-వ.
తదనంతరంబ.
టీక:- తదనంతరంబ = తరువాత.
భావము:- అటుపిమ్మట.

తెభా-8-194-క.
రియును దేవానీకము
నుగేంద్రుని తలలు పట్టనుద్యోగింపన్
రిమాయా పరవశులై
సువిమతులు కూడి పలుకఁ జొచ్చిరి కడిమిన్.

టీక:- హరియును = విష్ణువు; దేవ = దేవతల; అనీకమున్ = సమూహము; ఉరగ = సర్పములకు; ఇంద్రునిన్ = ప్రభువుని; తలలున్ = తలవైపున; పట్టన్ = పట్టుకొనుటకు; ఉద్యోగింపన్ = యత్నిస్తుండగా; హరి = విష్ణుని; మాయా = మాయకు; పరవశులు = లొంగినవారు; ఐ = అయ్యి; సురవిమతులు = రాక్షసులు; కూడి = అందరుకలిసి; పలుకన్ = వాదులాడ; చొచ్చిరి = మొదలిడిరి; కడిమిన్ = పట్టుదలతో.
భావము:- విష్ణువూ, దేవతలూ వాసుకి తలవైపు పట్టుకోడానికి సిద్ధపడసాగారు. విష్ణైవ మాయ కమ్మిన రాక్షసులు అందరూ ఒళ్ళు తెలియని పట్టుదలలతో వాదులాటకు దిగారు.

తెభా-8-195-మత్త.
"స్వచ్ఛమైన ఫణంబు మీరలు క్కఁబట్టి మథింపఁగాఁ
బుచ్ఛ మేటికి మాకుఁ బట్టఁగఁ? బూరుషత్వము గల్గి మే
చ్ఛమైన తపోబలాధ్యయనాన్వయంబుల వారమై
యిచ్ఛయింతుమె తుచ్ఛవృత్తికి? నిండు మాకు ఫణాగ్రముల్."

టీక:- స్వచ్ఛమైన = నిర్మలమైన; ఫణంబున్ = పాముతలలు; మీరలు = మీరు; చక్కన్ = చక్కగా; పట్టి = పట్టుకొని; మథింపగాన్ = చిలుకుతుండగా; పుచ్ఛము = తోక; ఏటి = ఎందుల; కిన్ = కు; మా = మా; కున్ = కు; పట్టగన్ = పట్టుకొనుటకు; పూరుషత్వము = పౌరుషము; కల్గి = ఉండి; మేము = మేము; అచ్ఛము = స్వచ్ఛము; ఐన = అయిన; తపస్ = తపస్సు; బల = బలము; అధ్యయన = చదువు; అన్వయంబుల్ = వంశములు; వారము = కలవారము; ఐ = అయ్యి; ఇచ్ఛయింతుమె = ఒప్పుకొనెదమా ఏమి; తుచ్ఛ = నీచపు; వృత్తి = వర్తనల; కిన్ = కి; ఇండు = ఇవ్వండి; మా = మా; కున్ = కు; ఫణ = పడగల; అగ్రమున్ = కొసను.
భావము:- “మీరు స్వచ్ఛమైన పడగలు పట్టుకుని చిలుకుతారా? మేము తుచ్ఛమైన తోక పట్టుకోవాలా? ఇది మాకు చాల అవమానకరం, మేము గొప్ప పౌరుషమూ, తపస్సూ, విద్యలూ, బలమూ కలవారము. మేము ఈ నీచమైన పనికి ఒప్పుకోము. మాకు పడగలు ఇవ్వండి, మీరు తోక పుచ్చుకోండి” అని రాక్షసులు వాదించారు

తెభా-8-196-వ.
అని పలుకు దనుజులం జూచి.
టీక:- అని = అని; పలుకు = పలికెడు; దనుజులన్ = రాక్షసులను; చూచి = చూసి.
భావము:- ఇలా పాము పడగలు పట్టుకుంటాము అంటున్న రాక్షసులను చూసి.

తెభా-8-197-క.
విస్మయముఁ బొంది దానవ
స్మరుఁ డహిఫణము విడువఁ గైకొని యసురుల్
విస్మితముఖులై యార్చి ర
విస్మితముగఁ గొనిరి సురలు వీఁకం దోఁకన్.

టీక:- విస్మయంబున్ = ఆశ్ఛర్య; పొంది = పోయి; దానవఘస్మరుడు = విష్ణువు {దానవఘస్మరుడు - దానవ (రాక్షసుల) ఘస్మరుడు (నాశకుడు), విష్ణువు}; అహి = పాము; ఫణమున్ = పడగను; విడువన్ = వదిలిపెట్టగ; కైకొని = చేపట్టి; అసురుల్ = రాక్షసులు; విస్మిత = మిక్కిలి నవ్వుతోకూడిన; ముఖులు = ముఖములు గలవారు; ఐ = అయ్యి; ఆర్చిరి = కేకలువేసిరి; అవిస్మితముగన్ = చిరునవ్వులు లేకుండగ; కొనిరి = తీసుకొనిరి; సురలు = దేవతలు; వీకన్ = ఉత్సాహముగ; తోకన్ = తోకను.
భావము:- దానవాంతకుడు విష్ణు మూర్తి ఆశ్చర్యంతో వాసుకి పడగ విడిచిపెట్టాడు; రాక్షసులు గర్వంతో కూడిన ముఖాలతో కేకలు వేస్తూ పడగలు పట్టుకున్నారు; దేవతలు వినయంతో వాసుకి తోక పట్టుకున్నారు.

తెభా-8-198-వ.
ఇట్లు సమాకర్షణస్థానభాగనిర్ణయంబు లేర్పఱచుకొని దేవతలు పుచ్ఛంబును; బూర్వదేవతలు ఫణంబులుం బట్టి పయోరాశి మధ్యంబునం బర్వతంబు పెట్టి; పరమాయత్తచిత్తులై యమృతార్థంబు త్రచ్చుచున్న సమయంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; సమాకర్షణ = లాగబడెడి; స్థాన = స్థానములను; భాగ = పంచుకొనెడి; నిర్ణయంబులు = నిర్ణయములు; ఏర్పఱచుకొని = నియమించుకొని; దేవతలు = దేవతలు; పుచ్ఛంబును = తోకను; పూర్వదేవతలు = రాక్షసులు; ఫణంబులున్ = పడగలను; పట్టి = పట్టుకొని; పయోరాశి = సముద్రము; మధ్యంబునన్ = మధ్యలో; పర్వతంబున్ = పర్వతమును; పెట్టి = పెట్టి; పరమ = మిక్కిలి; ఆయత్త = లగ్నమైన; చిత్తులు = మనసుగలవారు; ఐ = అయ్యి; అమృత = అమృతము; అర్థంబున్ = కోసము; త్రచ్చుచున్న = చిలుకుతున్న; సమయంబునన్ = సమయము నందు.
భావము:- ఇలా వరుసలు కట్టి లాగే స్థానాలను ఏర్పాటు చేసుకున్నారు. క్షీరసాగరం మధ్యన మందర పర్వతాన్ని ఉంచి, దేవతలు నాగరాజు వాసుకి తోక భాగమూ, రాక్షసులు పడగల భాగమూ పట్టుకుని చిలుకుతున్నారు. ఇంతలో . . .

తెభా-8-199-క.
విడు విడుఁ డని ఫణి పలుకఁగఁ
డుభరమున మొదలఁ గుదురు లుగమి గెడఁవై
బుబుడ రవమున నఖిలము
వడ వడఁకఁగ మహాద్రి నధి మునింగెన్.

టీక:- విడు = విడిచిపెట్టండి; విడుడు = విడిచిపెట్టండి; అని = అని; ఫణి = సర్పము; పలుకగన్ = అరుచుచుండగ; కడు = అధికమైన; భరమునన్ = బరువువలన; మొదలన్ = క్రింద; కుదురు = కుదురు {కుదురు - కుదురుగా నిలుచుటకు ఏర్పరచెడి పీఠము}; కలుగమి = లేకపోవుటచేత; కెడవు = ఒరిగినది; ఐ = అయ్యి; బుడబుడ = బుడబుడ యనెడి; రవమునన్ = శబ్దముతో; అఖిలమున్ = సర్వము; వడవడ = వడవడ యని; వడకగన్ = వణికిపోగా; మహా = గొప్ప; అద్రి = కొండ; వనధిన్ = సముద్రమునందు; మునింగెన్ = మునిగినది.
భావము:- అమృతమథన సమయంలో వాసుకి “వదలండి వదలండి” అన్నాడు. మందర పర్వతం అడుగున కుదురు లేకపోడంతో అధిక బరువు వలన పడిపోతూ సముద్రంలో “బుడ బుడ” మని మునిగింది. దేవ రాక్షస సమూహం సమస్తం “వడ వడ” మని వణికింది.

తెభా-8-200-ఉ.
గౌవమైన భారమునఁ వ్వపుఁగొండ ధరింప లేక దో
స్సా విహీనులై యుభయ సైనికులుం గడు సిగ్గుతో నకూ
పాతటంబునం బడిరి పౌరుషముం జెడి పాండవేయ! యె
వ్వారికి నేరఁబోలు బలవంతపు దైవము నాక్రమింపగన్?

టీక:- గౌరవమైన = గొప్పదైన; భారమునన్ = బరువువలన; కవ్వపు = కవ్వముగానున్న {కవ్వము - పెరుగు చిలికెడు సాధనము}; కొండన్ = కొండను; ధరింపన్ = భరించ; లేక = లేక; దోః = భుజ; సార = బలము; విహీనులు = లేనివారు; ఐ = అయ్యి; ఉభయ = రెండు (2) పక్షముల; సైనికులున్ = భటులును; కడు = మిక్కిలి; సిగ్గు = అవమానము; తోనన్ = తోటి; అకూపార = సముద్రపు; తటంబునన్ = ఒడ్డున; పడిరి = కూలబడిరి; పౌరుషము = పరాక్రమములు; చెడి = కోల్పోయి; పాండవేయ = పరీక్షితా {పాండవేయుడు - పాండవవంశస్తుడు, పరీక్షిత్తు}; ఎవ్వారి = ఎవరి; కిన్ = కి; నేరన్ = సాధ్యము; పోలున్ = శక్యం అవుతుంది?; బలవంతపు = ప్రబలమైన; దైవమున్ = విధిని; ఆక్రమింపన్ = దాటుటకు.
భావము:- దాని అధికమైన బరువు వలన కవ్వంకొండగా ఉన్న ఆ మందర పర్వతాన్ని మళ్ళీ పైకి దేవరాక్షస శూరులు ఎత్తలేకపోయారు. తమ భుజబలాలు కోల్పోయారు. ఎంతో సిగ్గుపడ్డారు. పరాక్రమాలు కోల్పోయి సముద్రం ఒడ్డున నిలబడి తెగ బాధపడసాగారు. అవును, ఎంతటి వారికైనా ప్రబలమైన విధిని దాటడం సాధ్యం కాదు కదా!