Jump to content

పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/సముద్రమథన కథా ప్రారంభం

వికీసోర్స్ నుండి

సముద్రమథనకథాప్రారంభం

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-142-వ.
అని పలికినం బరీక్షిన్నరేంద్రుండు మునీంద్రున కిట్లనియె.
టీక:- అని = అని; పలికినన్ = చెప్పగా; పరీక్షిత్ = పరీక్షిత్తు యనెడి; నరేంద్రుండు = రాజు; ముని = మునులలో; ఇంద్రున్ = ఇంద్రుని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను.
భావము:- శుక మునీశ్వరుడు అలా చెప్పగానే పరీక్షిత్తు మహారాజు ఇలా అడిగాడు.

తెభా-8-143-మ.
"విను ము న్నేటికిఁ ద్రచ్చె పాలకడలిన్ విష్ణుండు? కూర్మాకృతిన్
ధిం జొచ్చి య దెట్లు మోచె బలుకవ్వంబైన శైలంబు? దే
నికాయం బమృతంబు నెట్లు పడసెన్? వారాశి నేమేమి సం
నితం బయ్యె? మునీంద్ర! చోద్యము గదా ర్వంబుఁ జెప్పంగదే.

టీక:- విను = వినుము; మున్ను = పూర్వము; ఏటికిన్ = ఎందులకు; త్రచ్చెన్ = చిలికిరి; పాలకడలిన్ = పాలసముద్రమును; విష్ణుండు = నారాయణుడు; కూర్మ = కూర్మము; ఆకృతిన్ = రూపముతో; వనధిన్ = సముద్రమునందు; చొచ్చి = దూరి; అది = దానిని; ఎట్లు = ఏ విధముగ; మోచెన్ = మోసెను; పలు = పెద్ద; కవ్వంబున్ = కవ్వము; ఐన = అయిన; శైలంబున్ = పర్వతమును; దేవ = దేవతల; నికాయంబు = సమూహము; అమృతంబున్ = అమృతమును; ఎట్లు = ఏ విధముగ; పడసెన్ = పొందెను; వారాశిన్ = సముద్రమునందు {వారాశి - వారి (నీటి) రాశి, సముద్రము}; ఏమేమి = ఏ ఏ; సంజనితంబు = పుట్టినవి; అయ్యెన్ = అయినవి; ముని = మునులలో; ఇంద్రా = ఉత్తముడా; చోద్యము = ఆశ్చర్యకరము; కదా = కదా; సర్వంబున్ = సమస్తమును; చెప్పంగదే = చెప్పుము.
భావము:- “మునిశ్రేష్ఠుడవు అయిన శుకుడా! పూర్వకాలంలో విష్ణుమూర్తి పాలసముద్రాన్ని ఎందుకు చిలికాడు? పాల సముద్రంలోని అంత పెద్ద కవ్వపు కొండ మంథర పర్వతం, క్రిందకు దూరి తాబేలు రూపంలో ఎందుకు మోసాడు? అమృతాన్ని దేవతలకు ఎలా అందించాడు? అలా చిలుకుతుంటే పాలసముద్రం లోనుంచి ఏమేమి పుట్టాయి? ఇవన్నీ ఆశ్చర్యకరమైన విషయాలు కదా! వాటన్నిటినీ నాకు వివరంగా చెప్పు.

తెభా-8-144-క.
ప్పటినుండి బుధోత్తమ!
చెప్పెడు భగవత్కథా విశేషంబులు నా
కెప్పుడుఁ దనవి జనింపదు
చెప్పఁగదే చెవులు నిండ శ్రీహరికథలున్."

టీక:- అప్పటినుండి = ఇప్పటివరకు; బుధ = జ్ఞానులలో; ఉత్తమ = ఉత్తముడా; చెప్పెడు = చెప్పుతున్న; భగవత్ = భగవంతుని; కథా = వృత్తాంతముల; విశేషంబులున్ = విశేషములవలన; నా = నా; కున్ = కు; ఎప్పుడు = ఎప్పుడును; తనివి = సంతృప్తి; జనింపదు = కలుగదు; చెప్పగదే = చెప్పుము; చెవులు = వీనుల; నిండన్ = నిండుగా; శ్రీహరి = విష్ణుమూర్తి; కథలున్ = కథలను.
భావము:- ఉత్తమ పండితుడవు అయిన శుకమహర్షి! భగవంతుడి కథలు ఎన్ని చెప్పినా నాకు తృప్తి కలగదు. చెవులారా వింటాను, విష్ణు కథలు ఇంకా చెప్పు.”

తెభా-8-145-వ.
అని మఱియు నడుగం బడినవాఁడై యతని నభినందించి హరి ప్రసంగంబు జెప్ప నుపక్రమించె"నని సూతుండు ద్విజుల కిట్లనియె "నట్లు శుకుండు రాజుం జూచి.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; అడుగంబడిన = అడుగబడిన; వాడు = వాడు; ఐ = అయ్యి; అతనిన్ = అతనిని; అభినందించి = పొగిడి; హరి = విష్ణుదేవుని; ప్రసంగంబు = కథావిశేషములను; చెప్పన్ = చెప్పుటకు; ఉపక్రమించెన్ = పూనుకొనెను; అని = అని; సూతుండు = సూతుడు; ద్విజుల్ = బ్రాహ్మణుల; కున్ = కి; ఇట్లు = ఈ విధముగా; అనియె = పలికెను; అట్లు = ఆ విధముగ; శుకుండు = శుకుడు; రాజున్ = రాజును; చూచి = చూసి.
భావము:- ఇలా అడిగిన పరీక్షిత్తు మాటలు విని సంతోషించి శుకమహర్షి విష్ణుకథలను చెప్పడానికి పూనుకున్నాడు” అని చెప్పి సూత మహర్షి శౌనకుడు మున్నగు మహర్షులతో మరల ఇలా చెప్పసాగాడు “అప్పుడు శుక ముని పరీక్షిత్తుకు ఇలా చెప్పసాగాడు