పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/బ్రహ్మాదుల హరిస్తుతి
బ్రహ్మాదులహరిస్తుతి
←సురలుబ్రహ్మశరణుజొచ్చుట | తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/) రచయిత: పోతన |
విశ్వగర్భుని ఆవిర్భావము → |
(తెభా-8-153-వ.)[మార్చు]
అంత దానును దేవతాసమూహంబును నతిరయంబునం జని వినయంబునఁ గానంబడని యవ్విభు నుద్ధేశించి దైవికంబులగు వచనంబుల నియతేంద్రియుండై యిట్లని స్తుతియించె.
(తెభా-8-154-సీ.)[మార్చు]
ఎవ్వని మాయకు నింతయు మోహించుఁ;
దఱమి యెవ్వని మాయ దాఁట రాదు;
తన మాయ నెవ్వఁ డింతయు గెల్చినట్టివాఁ;
డెవ్వనిఁ బొడగాన రెట్టి మునులు;
సర్వభూతములకు సమవృత్తి నెవ్వఁడు;
చరియించుఁ దనచేత జనితమయిన;
ధరణి పాదములు చిత్తము సోముఁ డగ్ని ము;
ఖంబు గన్నులు సోమకమలహితులు;
(తెభా-8-154.1-తే.)[మార్చు]
చెవులు దిక్కులు; రేతంబు సిద్ధజలము;
మూఁడు మూర్తులపుట్టిల్లు; మొదలి నెలవు
గర్భమఖిలంబు; మూర్థంబు గగన మగుచు;
మలయు నెవ్వఁడు వాని నమస్కరింతు.
(తెభా-8-155-వ.)[మార్చు]
మఱియు నెవ్వని బలంబున మహేంద్రుండును; బ్రసాదంబున దేవతలును; గోపంబున రుద్రుండును; బౌరుషంబున విరించియు; నింద్రియంబులవలన వేదంబులును మునులును; మేఢ్రంబునఁ బ్రజాపతియును; వక్షంబున లక్ష్మియు; ఛాయవలనఁ బిత్రుదేవతలును; స్తనంబులవలన ధర్మంబును; బృష్ఠంబువలన నధర్మంబును; శిరంబువలన నాకంబును; విహాసంబువలన నప్సరోజనంబులును; ముఖంబువలన విప్రులును; గుహ్యంబున బ్రహ్మంబును; భుజంబులవలన రాజులును బలంబును; నూరువులవలన వైశ్యులును నైపుణ్యంబును; బదంబులవలన శూద్రులును నవేదంబును; నధరంబున లోభంబునును; పరిరదచ్ఛదనంబువలన బ్రీతియు; నాసాపుటంబువలన ద్యుతియు; స్పర్శంబునఁ గామంబును; భ్రూయుగళంబున యమంబును; బక్షంబునఁ గాలంబును సంభవించె; నెవ్వని యోగ మాయావిహితంబులు ద్రవ్యవయః కర్మగుణ విశేషంబులు; చతుర్విధ సర్గం బెవ్వని యాత్మతంత్రం; బెవ్వనివలన సిద్ధించి లోకంబులును లోకపాలురును బ్రతుకుచుందురు పెరుగుచుందురు; దివిజులకు నాయువు నంధంబు బలంబునై జగంబులకు నీశుండై ప్రజలకుఁ బ్రజనుండై ప్రజావన క్రియాకాండ నిమిత్త సంభవుండగు జాతవేదుం డై; యంతస్సముద్రంబున ధాతుసంఘాతంబులం బ్రపచించుచు బ్రహ్మమయుండై; ముక్తికి ద్వారంబై; యమృత మృత్యు స్వరూపుండై; చరాచరప్రాణులకుఁ బ్రాణంబై; యోజస్సహోబల వాయురూపంబులైన ప్రాణేంద్రి యాత్మ శరీర నికేతనుండై పరమ మహాభూతి యగు నప్పరమేశ్వరుండు మాకుం బ్రసన్నుండగుం గాక" యని మఱియును.
(తెభా-8-156-క.)[మార్చు]
మొ దల జల మిడిన భూజము
దు ది నడుమను జల్లదనము దొరకొను మాడ్కిన్
మొ దలను హరికిని మ్రొక్కిన
ము ద మొందుదు మెల్ల వేల్పుమూకలు నేమున్.
(తెభా-8-157-క.)[మార్చు]
ఆ పన్నులగు దిదృక్షుల
కో! పుణ్య! భవన్ముఖాబ్జ మొయ్యన తఱితోఁ
బ్రా పింపఁ జేయు సంపద
నో! పరమదయానివాస! యుజ్జ్వలతేజా!
: : 21-05-2016: : గణనాధ్యాయి 12:47, 19 సెప్టెంబరు 2016 (UTC)