Jump to content

పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/బ్రహ్మాదుల హరిస్తుతి

వికీసోర్స్ నుండి

బ్రహ్మాదులహరిస్తుతి

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-153-వ.
అంత దానును దేవతాసమూహంబును నతిరయంబునం జని వినయంబునఁ గానంబడని యవ్విభు నుద్దేశించి దైవికంబులగు వచనంబుల నియతేంద్రియుండై యిట్లని స్తుతియించె.
టీక:- అంతన్ = అంతట; తానును = అతను; దేవతా = దేవతల; సమూహంబునున్ = సమూహము; అతి = మిక్కిలి; రయంబునన్ = వేగముగా; చని = వెళ్ళి; వినయంబునన్ = వినమ్రతతో; కానంబడని = కనబడని; ఆ = ఆ; విభునిన్ = స్వామిని; ఉద్దేశించి = గురించి; దైవికంబులు = దివ్యములైనవి; అగు = అయిన; వచనంబులన్ = పలుకులతో; నియతేంద్రియుండు = ఏకాగ్రచిత్తముగలవాడు {నియతేంద్రియుడు - నియత (నియమింపబడిన) ఇంద్రియుడు (ఇంద్రియములుగల వాడు), ఏకాగ్రచిత్తుడు}; ఐ = అయ్యి; ఇట్లు = ఇలా; అని = అనుచు; స్తుతియించెన్ = ప్రార్థించెను.
భావము:- అలా బ్రహ్మదేవుడు దేవతలు కలిసి భగవంతుని వద్దకు వెళ్ళి ఏకాగ్రచిత్తంతో అదృశ్యరూపుడు అయిన భగవంతుడిని ఈ విధంగా ప్రార్థించాడు.

తెభా-8-154-సీ.
"వ్వని మాయకు నింతయు మోహించుఁ-
ఱమి యెవ్వని మాయ దాఁట రాదు;
న మాయ నెవ్వఁ డింయు గెల్చినట్టివాఁ-
డెవ్వనిఁ బొడగాన రెట్టి మునులు;
ర్వభూతములకు మవృత్తి నెవ్వఁడు-
రియించుఁ దనచేత నితమయిన;
రణి పాదములు చిత్తము సోముఁ డగ్ని ము-
ఖంబు గన్నులు సోమమలహితులు;

తెభా-8-154.1-తే.
చెవులు దిక్కులు; రేతంబు సిద్ధజలము;
మూఁడు మూర్తులపుట్టిల్లు; మొదలి నెలవు
ర్భమఖిలంబు; మూర్థంబు గన మగుచు;
లయు నెవ్వఁడు వాని నస్కరింతు.

టీక:- ఎవ్వని = ఎవని యొక్క; మాయ = మాయ; కున్ = కు; ఇంతయున్ = ఈ సృష్టి యంతయు; మోహించున్ = మోహములో పడును; తఱమి = ప్రయత్నించినను; ఎవ్వని = ఎవని యొక్క; మాయన్ = మాయను; దాటన్ = దాటుటకు; రాదు = వీలుకాదో; తన = తన యొక్క; మాయన్ = మాయచేత; ఎవ్వడు = ఎవరైతే; ఇంతయున్ = ఈ సృష్టి యంతటిని; గెల్చిన = జయించిన; అట్టి = అటువంటి; వాడు = వాడో; ఎవ్వని = ఎవని; పొడగానరు = జాడపట్టుకొనలేరో; ఎట్టి = ఎటువంటి; మునులు = ఋషు లైనను; సర్వ = అఖిలమైన; భూతముల్ = జీవుల; కున్ = ఎడల; సమవృత్తిన్ = ఒకేవిధముగ; ఎవ్వడు = ఎవరైతే; చరియించున్ = మెలగుతాడో; తన = తన; చేతన్ = చేత; జనితము = సృష్టింపబడినది; అయిన = ఐన; ధరణి = భూమండలము; పాదములు = పాదములు; చిత్తము = మనసు; సోముడు = శివుడు; అగ్ని = అగ్నిదేవుడు; ముఖంబున్ = వదనము; కన్నులు = కళ్ళు; సోమ = చంద్రుడు; కమలహితులు = సూర్యుడు {కమలహితుడు - కమలములకు ప్రీతిపాత్రుడు, సూర్యుడు}.
చెవులు = చెవులు; దిక్కులు = దిక్కులు; రేతంబున్ = వీర్యము; సిద్ధ = సిద్దముగ; జలము = నీరు; మూడుమూర్తుల = త్రిమూర్తుల యొక్క {త్రిమూర్తులు - 1బ్రహ్మ 2విష్ణు 3మహేశ్వరులు}; పుట్టిల్లు = జన్మస్థానము నీ స్వరూపం; మొదలి = సృష్టికి మూల; నెలవు = ఆధారము; గర్భము = కడుపు; అఖిలంబున్ = సమస్తమునకు; మూర్థంబు = శిరస్సు; గగనము = ఆకాశము; అగుచున్ = అగుచు; మలయున్ = వ్వాపించి ఉండునో; వాని = అతనిని; నమస్కరింతు = ప్రార్థింతును.
భావము:- “భగవాన్! నీ మాయ వలన సృష్టి సమస్తమూ మోహంలో మునిగిపోతుంది; నీ మాయను దాటడం ఎవరి వల్లా కాదు, ఏమాత్రం నీ మాయను గెలిచినవారు ఎవరూ లేరు; నీవు ప్రాణులు అందరి ఎడల సమానంగా మెలగువాడవు; నీ వల్ల పుట్టిన భూమి నీ పాదాలు; శివుడు నీ మనస్సు; అగ్ని నీ ముఖము; సూర్యచంద్రులు నీ కన్నులు; దిక్కులు నీ చెవులు; జలం నీ వీర్యం; త్రిమూర్తులుకి నీ రూపం పుట్టిల్లు; సృష్టి సమస్తమునకు మూలాధారం నీ కడుపు; ఆకాశం నీ శిరస్సు; ఈ విధంగా విశ్వరూపుడు అయిన నీకు నమస్కరిస్తున్నాను.

తెభా-8-155-వ.
మఱియు నెవ్వని బలంబున మహేంద్రుండును; బ్రసాదంబున దేవతలును; గోపంబున రుద్రుండును; బౌరుషంబున విరించియు; నింద్రియంబులవలన వేదంబులును మునులును; మేఢ్రంబునఁ బ్రజాపతియును; వక్షంబున లక్ష్మియు; ఛాయవలనఁ బితృదేవతలును; స్తనంబులవలన ధర్మంబును; బృష్ఠంబువలన నధర్మంబును; శిరంబువలన నాకంబును; విహాసంబువలన నప్సరోజనంబులును; ముఖంబువలన విప్రులును; గుహ్యంబున బ్రహ్మంబును; భుజంబులవలన రాజులును బలంబును; నూరువులవలన వైశ్యులును నైపుణ్యంబును; బదంబులవలన శూద్రులును నవేదంబును; నధరంబున లోభంబును; పరిరదచ్ఛదనంబువలన బ్రీతియు; నాసాపుటంబువలన ద్యుతియు; స్పర్శంబునఁ గామంబును; భ్రూయుగళంబున యమంబును; బక్షంబునఁ గాలంబును సంభవించె; నెవ్వని యోగ మాయావిహితంబులు ద్రవ్యవయః కర్మగుణ విశేషంబులు; చతుర్విధ సర్గం బెవ్వని యాత్మతంత్రం; బెవ్వనివలన సిద్ధించి లోకంబులును లోకపాలురును బ్రతుకుచుందురు పెరుగుచుందురు; దివిజులకు నాయువు నంధంబు బలంబునై జగంబులకు నీశుండై ప్రజలకుఁ బ్రజనుండై ప్రజావన క్రియాకాండ నిమిత్త సంభవుండగు జాతవేదుం డై; యంతస్సముద్రంబున ధాతుసంఘాతంబులం బ్రపచించుచు బ్రహ్మమయుండై; ముక్తికి ద్వారంబై; యమృత మృత్యు స్వరూపుండై; చరాచరప్రాణులకుఁ బ్రాణంబై; యోజస్సహోబల వాయురూపంబులైన ప్రాణేంద్రి యాత్మ శరీర నికేతనుండై పరమ మహాభూతి యగు నప్పరమేశ్వరుండు మాకుం బ్రసన్నుండగుం గాక"యని మఱియును.
టీక:- మఱియున్ = అంతేకాక; ఎవ్వని = ఎవని; బలంబునన్ = బలమువలన; మహేంద్రుండును = దేవేంద్రుడు; ప్రసాదంబునన్ = అనుగ్రహము వలన; దేవతలును = దేవతలును; కోపంబునన్ = రౌద్రము వలన; రుద్రుండును = పరమశివుడును; పౌరుషంబునన్ = పౌరుషమువలన; విరించియున్ = బ్రహ్మదేవుడు; ఇంద్రియంబుల = ఇంద్రియముల; వలన = వలన; వేదంబులును = వేదములు; మునులును = ఋషులు; మేఢ్రంబునన్ = పురుషావయవమువలన; ప్రజాపతియును = ప్రజాపతి; వక్షంబునన్ = వక్షస్థలమున; లక్ష్మియున్ = లక్ష్మీదేవి; ఛాయ = నీడ; వలనన్ = వలన; పితృదేవతలును = పితృదేవతలు; స్తనంబుల = రొమ్ముల; వలన = వలన; ధర్మంబును = ధర్మము; పృష్టంబు = వీపు; వలన = వలన; అధర్మంబును = అధర్మము; శిరంబున్ = తల; వలన = వలన; నాకంబును = స్వర్గమును; విహాసంబు = నవ్వు; వలన = వలన; అప్సరస్ = అప్సరసల; జనంబులును = సమూహము; ముఖంబు = వదనము; వలన = వలన; విప్రులును = బ్రాహ్మణులు; గుహ్యంబునన్ = యోనివలన; బ్రహ్మంబును = బ్రహ్మదేవుడు; భుజంబుల = భుజముల; వలన = వలన; రాజులును = రాజులు; బలంబును = సైన్యములు; ఊరువుల = తొడల; వలన = వలన; వైశ్యులును = వ్యాపారులు; నైపుణ్యంబును = నేర్పరితనము; పదంబుల = పాదముల; వలన = వలన; శూద్రులును = శూద్రులు; అవేదంబును = వేదములుకానిజ్ఞానము; అధరంబునన్ = క్రిందిపెదవివలన; లోభంబును = లోభము; ఉపరిరదచ్ఛదనంబు = పైపెదవి; వలన = వలన; ప్రీతియున్ = ఇష్టము; నాసా = ముక్కు; పుటంబునన్ = పుటముల; వలన = వలన; ద్యుతియున్ = కాంతి; స్పర్శంబునన్ = స్పర్శవలన; కామంబును = కామము; భ్రూయుగళంబునన్ = కనుబొమలవలన; యమంబును = యముడు; పక్షంబునన్ = పక్కభాగమువలన; కాలంబును = కాలము; సంభవించెన్ = కలిగినవో; ఎవ్వని = ఎవని; యోగమాయ = యోగమాయచే; విహితంబులు = విధింపబడినో; ద్రవ్య = ద్రవ్యము; వయస్ = వయస్సు; గుణ = గుణములయొక్క; విశేషంబులున్ = విశేషములు; చతుర్విధ = నాలుగువిధములైన {చతుర్విధభూతసర్గము - 1అచరము 2భూచరము 3జలచరము 4గగనచరములు ? చతుర్విధవర్గము - 1ధర్మము 2అర్థము 3కామము 4మోక్షము}; సర్గంబున్ = భూతసర్గము; ఎవ్వని = ఎవని; ఆత్మ = స్వంత; తంత్రంబున్ = తంత్రముననుసరించునది; ఎవ్వని = ఎవని; వలనన్ = వలన; సిద్ధించి = ఏర్పడుచు; లోకంబులును = లోకములు; లోకపాలురు = లోకపాలురు; బ్రతుకుచుందురు = జీవించుతుంటారు; పెరుగుచుందురు = వృద్ధిచెందుచుతుంటారు; దివిజుల్ = దేవతలక; కున్ = కు; ఆయువున్ = ఆయుస్సు; అంధంబున్ = ఆహారము; బలంబున్ = బలము; ఐ = అయ్యి; జగంబుల్ = భువనముల; కున్ = కు; ఈశుండు = ప్రభువు; ఐ = అయ్యి; ప్రజల్ = లోకుల; కున్ = కు; ప్రజనుండు = సృష్టించెడివాడు; ఐ = అయ్యి; ప్రజ = లోకులను; అవన = కాపాడెడి; క్రియాకాండ = కర్మకాండ; నిమిత్త = కోసమై; సంభవుండు = ఏర్పడినవాడు; అగు = అయిన; జాతవేదుండు = అగ్నివి {జాతవేదుండు - పుట్టిక తోనే వేదములను తెలుసుకున్న వాడు, అగ్నిదేవుడు}; ఐ = అయ్యి; అంత = అంతరంగ మనెడి; సముద్రంబునన్ = సముద్రమునందు; ధాతువులన్ = సప్తధాతువులను {సప్తధాతువులు - 1రోమ 2త్వక్ 3మాంస 4అస్థి 5స్నాయు 6మజ్జ 7ప్రాణములు}; ప్రపంచించుచున్ = విస్తరింపజేయుచు; బ్రహ్మ = పరబ్రహ్మ; మయుండు = స్వరూపుడు; ఐ = అయ్యి; ముక్తి = మోక్షసాధనకు; కిన్ = కు; ద్వారంబు = మార్గము; ఐ = అయ్యి; అమృత = బ్రతుకు; మృత్యు = చావుల; స్వరూపుండు = స్వరూపమైనవాడు; ఐ = అయ్యి; చర = చరించగల; అచర = చరించలేని; ప్రాణుల్ = జీవుల; కున్ = కు; ప్రాణంబున్ = జీవము; ఐ = అయ్యి; ఓజస్ = తేజము; అహస్ = అహంకారము; బల = సామర్థ్యము; వాయుః = వాయువులు నిండిన; రూపంబులు = రూపములుగలవి; ఐన = అయినట్టి; ప్రాణ = ప్రాణుల; ఇంద్రియ = ఇంద్రియములు; ఆత్మ = ఆత్మలు; శరీర = శరీరములు; నికేతనుండు = నివాసముగాగలవాడు; ఐ = అయ్యి; పరమ = అత్యధికమైన; మహా = గొప్ప; భూతి = శక్తి; అగు = అయిన; ఆ = ఆ; పరమేశ్వరుండు = మహాప్రభువు; మా = మా; కున్ = కు; ప్రసన్నుండు = దయచూపువాడు; అగుంగాక = అగునుగాక; అని = అని; మఱియును = ఇంకను.
భావము:- నీ బలం నుండి దేవేంద్రుడూ; నీ అనుగ్రహం నుండి దేవతలూ; నీ ఆగ్రహం నుండి రుద్రుడూ; నీ పౌరుషం నుండి బ్రహ్మదేవుడూ; నీ ఇంద్రియాల నుండి వేదాలూ, మునులూ; నీ పురుషాంగం నుండి ప్రజాపతీ; నీ రొమ్ములనుండి లక్ష్మీదేవీ; నీ నీడ నుండి ధర్మమూ; నీ వీపు నుండి అధర్మమూ; నీ తల నుండి స్వర్గమూ; నీ నవ్వు నుండి అప్సరసలూ; నీ ముఖం నుండి బ్రాహ్మణులూ, బ్రహ్మమూ; నీ భుజాల నుండి రాజులూ. బలమూ; నీ తొడలు నుండి వైశ్యులూ, నేర్పరితనమూ; నీ పాదాల నుండి శూద్రులూ, శుశ్రూషా; నీ క్రింద పెదవి నుండి లోభమూ; పై పెదవి నుండి ప్రేమా; నీ ముక్కుపుటాల నుండి కాంతీ; నీ స్పర్శ నుండి కామమూ; నీ కనుబొమలు నుండి యముడూ; నీ ప్రక్కభాగం నుండి కాలమూ సంభవించాయి; నీ యోగమాయ వలన ద్రవ్యమూ, వయస్సూ, కర్మమూ, గుణవిశేషాలూ విధింపబడ్డాయి; నీ ఆత్మతంత్రం నుండి ధర్మమూ, అర్థమూ, కామమూ, మోక్షమూ కలిగాయి; నీ వలన లోకాలూ, లోకపాలకులూ ఏర్పడి అభివృద్ధి పొందుతారు; దేవతలకు ఆయుస్సూ, ఆహారమూ, బలమూ నీవే; పర్వతాలపై అధికారి నీవే; ప్రజలను పుట్టించి వారిని కాపాడే కర్మకాండల కోసం ఏర్పడిన అగ్నివి నీవే; సముద్రంలో రత్న రాసులను విస్తరింపజేసేది నీవే; మోక్షానికి ద్వారమైన పరబ్రహ్మం నీవే; చావు బ్రతుకులు నీ రూపాలే; ప్రాణులకు అన్నింటికీ ప్రాణం నీవే; తేజస్సు, అహంకారం, వాయువు నిండిన ప్రాణుల దేహాలలో, అవయవాలలో, ఆత్మలో నీవే నివసిస్తావు; పరమశక్తివైన మహాప్రభూ! మాపై దయచూపు.

తెభా-8-156-క.
మొల జల మిడిన భూజము
దుది నడుమను జల్లదనము దొరకొను మాడ్కిన్
మొలను హరికిని మ్రొక్కిన
ము మొందుదు మెల్ల వేల్పుమూకలు నేమున్.

టీక:- మొదలన్ = మూలమునందు; జలము = నీరు; ఇడిన = పెట్టినచో; భూజము = చెట్టు; తుదిన్ = చివర; నడుమనున్ = మధ్యనుకూడ; చల్లదనము = చల్లదనమును; దొరకొను = సిద్ధించెడి; మాడ్కిన్ = విధముగ; మొదలను = మొదటగా; హరి = విష్ణుమూర్తి; కిని = కి; మ్రొక్కినన్ = కొలచిన; ముదమున్ = సంతృప్తిని; ఒందుదుము = పొందెదము; ఎల్ల = సమస్తమైన; వేల్పు = దేవతా; మూకలున్ = గణము; ఏమున్ = మేమును.
భావము:- చెట్టు మొదలు వద్ద నీళ్ళు పోస్తే చెట్టు కొన కొమ్మలు లోనూ, మధ్య లోనూ, చల్లదనం వ్యాపిస్తుంది. అలాగే మొదట నీకు మ్రొక్కితే దేవతలూ నేనూ సంతోషిస్తాము.

తెభా-8-157-క.
న్నులగు దిదృక్షుల
కో! పుణ్య! భవన్ముఖాబ్జ మొయ్యన తఱితోఁ
బ్రాపింపఁ జేయు సంపద
నో! రమదయానివాస! యుజ్జ్వలతేజా!"

టీక:- ఆపన్నులు = కష్టాలపాలైనవారలు; అగు = అయిన; దిదృక్షుల = నిన్నుదర్శించగోరువారల; కున్ = కు; ఓ = ఓ; పుణ్య = పుణ్యుడా; భవత్ = నీ యొక్క; ముఖ = ముఖము యనెడి; అబ్జము = పద్మము; ఒయ్యన = తిన్నగా; తఱి = దాటించుట; తోన్ = తోబాటు; ప్రాపింపజేయున్ = సిద్ధింపజేయును; సంపదన్ = సంపదలను; ఓ = ఓ; పరమ = బహు మిక్కిలి; దయా = కృపకు; నివాస = నిలయుడా; ఉజ్జ్వల = ఉజ్జ్వలమైన; తేజ = తేజస్సు గలవాడ.
భావము:- పుణ్యాత్మా! దయామయా! గొప్ప తేజస్సు గలవాడా! కష్టాలపాలై నిన్ను దర్శించాలి అనుకునే వారికి నీ ముఖ పద్మం సకాలంలో సమగ్రమైన సంపదను సమకూర్చుతుంది.”