Jump to content

పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/బృహస్పతి మంత్రాంగము

వికీసోర్స్ నుండి

బృహస్పతిమంత్రాంగము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-455-వ.
అనిన సురరాజునకు సురాచార్యుం డిట్లనియె .
టీక:- అనినన్ = అనగా; సురరాజు = దేవేంద్రుని; కున్ = కి; సురాచార్యుండు = బృహస్పతి; ఇట్లు = ఇలా; అనియె = చెప్పెను.
భావము:- ఇలా బలి బారినుండి తప్పించుకోడం ఎలా అని అడిగిన ఇంద్రుడితో బృహస్పతి ఇలా అన్నాడు.

తెభా-8-456-సీ.
"వినవయ్య దేవేంద్ర! వీనికి సంపద-
బ్రహ్మవాదులు భృగుప్రవరు లర్థి
నిచ్చిరి; రాక్షసు నెదురను నిలువంగ-
రి యీశ్వరుఁడుఁ దక్క న్యజనులు
నీవును నీ సముల్ నీకంటె నధికులుఁ-
జాలరు; రాజ్యంబు చాలు; నీకు
విడిచి పోవుట నీతి విబుధనివాసంబు-
విమతులు నలఁగెడువేళ చూచి

తెభా-8-456.1-తే.
రలి మఱునాఁడు వచ్చుట మా మతంబు;
విప్రబలమున వీనికి వృద్ధివచ్చె
వారిఁ గైకొన కిటమీఁద వాఁడి చెడును;
లఁగు మందాక రిపుఁ బేరు లఁపరాదు
.
టీక:- వినవు = వినుము; అయ్య = తండ్రి; దేవేంద్ర = దేవేంద్రుడా; వీని = ఇతని; కిన్ = కి; సంపద = బలసంపదను; బ్రహ్మవాదులు = బ్రాహ్మణులు; భృగు = భృగువు; ప్రవరులు = వంశమువారు; అర్థిన్ = కోరి; ఇచ్చిరి = కలిగించిరి; రాక్షసున్ = రాక్షసుని; ఎదురను = ఎదుర్కొని; నిలువంగ = నిలబడుటకు; హరి = నారాయణుడు; ఈశ్వరుడు = పరమశివుడు; తక్కన్ = తప్పించి; అన్య = ఇతరులైన; జనులు = వారు; నీవును = నీవుకాని; నీ = నీకు; సముల్ = సమానబలులుకాని; నీకు = నీకు; కంటెన్ = కంటెను; అధికులున్ = ఎక్కువబలస్తులుకాని; చాలరు = సరిపోరు; రాజ్యంబు = రాజ్యాధికారము; చాలును = ఇంకచాలు; నీకున్ = నీకు; విడిచి = వదిలేసి; పోవుట = పోవుట; నీతి = సరియైనది; విబుధనివాసంబున్ = స్వర్గమును; విమతులున్ = శత్రువులు; నలగెడు = ఇబ్బందులలోపడిన; వేళన్ = సమయమును; చూచి = తెలిసికొని.
మరలి = మళ్ళీ; మఱునాడు = మరొకరోజు; వచ్చుట = వచ్చుట; మా = మేముచెప్పెడి; మతంబు = పద్ధతి; విప్ర = బ్రాహ్మణుల; బలమునన్ = శక్తివలన; వీని = ఇతని; కిన్ = కి; వృద్ధి = పెంపు; వచ్చెన్ = సమకూరినది; వారిన్ = వారిని; కైకొనక = లెక్కజేయకపోవుటచే; ఇట = ఇక; మీదన్ = పైన; వాడి = శక్తి; చెడును = చెడిపోవును; తలగుము = తప్పుకొనుము; అందాక = అప్పటివరకు; రిపున్ = శత్రువుయొక్క; పేరు = పేరును; తలపరాదు = ఎత్తకూడదు.
భావము:- “దేవేంద్రా! శ్రద్ధగా విను. బ్రహ్మవాదులైన భృగువంశపు బ్రాహ్మణులు వీనికి బల సంపదను సమకూర్చారు. ఈ రాక్షసుని ఎదిరించడానికి విష్ణువుకూ శివునికీ తప్ప, నీకు కానీ నిన్ను మించిన ఇంకెవరికి కానీ శక్తి చాలదు. నీవిప్పుడు రాజ్యాన్నీ రాజధానిని విడిచి పెట్టి వెళ్ళడమే మేలు. పగవారికి కష్టాలు వచ్చినప్పుడు పసిగట్టి మళ్లీ తిరిగి రావడం మంచిదని నా అభిప్రాయం. బలికి బ్రాహ్మణుల శక్తి వల్ల బలం సమకూరింది. కొన్నాళ్ళు పోయాక వీడు బ్రాహ్మణులను గౌరవించడు. దానివల్ల వీని పరాక్రమం సన్నగిల్లుతుంది. అంత వరకూ శత్రువు పేరు కూడా ఎత్తవద్దు..

తెభా-8-457-క.
రు గెలువ వలయు నొండెను
రిపోరగ వలయు నొండెఁ జా వలె నొండెన్
రి గెలుపు మృతియు దొరకమి
సంబుగ మున్న తొలఁగి నవలె నొండెన్
.
టీక:- పరున్ = శత్రువును; గెలువవలయున్ = జయించవలెను; ఒండెను = అది ఒకటి; సరి = సమానముగా; పోరగవలయున్ = యుద్ధముచేయవలసి; ఒండెన్ = అది ఒకటి; చావవలెన్ = చావవలసి; ఒండెన్ = అది ఒకటి; సరి = సరిగా; గెలుపు = విజయము; మృతియున్ = మరణము; దొరకమి = దొరకనప్పుడు; సరసంబుగన్ = మర్యాదగా; మున్న = ముందుగనే; తొలగి = తప్పుకొని; చనవలెన్ = పోవలసి; ఒండెన్ = అది ఒకటి.
భావము:- ఎదిరించి శత్రువును జయించాలి. లేదా, వాడితో సమానంగా నైనా పోరాడాలి. లేదా, రణరంగంలో వీరమరణం పొందాలి. గెలుపూ సమానత్వమూ మరణమూ కలగవు అనే పక్షంలో ముందే తొలగి వెళ్ళిపోవడమే మేలైన పని.”

తెభా-8-458-వ.
అనినఁ గార్యకాల ప్రదర్శి యగు బృహస్పతి వచనంబులు విని కామరూపులై దివిజులు త్రివిష్టపంబు విడిచి తమతమ పొందుపట్లకుం జనిరి; బలియునుం బ్రతిభట వివర్జిత యగు దేవధాని నధిష్ఠించి జగత్రయంబునుం దన వశంబు జేసికొని విశ్వవిజయుండై పెద్ద కాలంబు రాజ్యంబు జేయుచుండె, శిష్యవత్సలులగు భృగ్వాదు లతని చేత శతాశ్వమేధంబులు చేయించిరి; తత్కాలంబున .
టీక:- అనినన్ = అనగా; కార్యకాల = సమయోచిత కర్తవ్యము; ప్రదర్శి = తెలియజేయువాడు; అగు = అయిన; బృహస్పతి = బృహస్పతి; వచనంబులు = మాటలు; విని = ఆలకించి; కామరూపులు = మారువేషధారులు; ఐ = అయ్యి; దివిజులు = దేవతలు; త్రివిష్టపంబున్ = స్వర్గమును; విడిచి = వదలివేసి; తమతమ = వారివారికి; పొందుపట్ల = కుదిరినచోట్ల; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; బలియును = బలికూడ; ప్రతిభట = శత్రుసైన్యముచే; వివర్జిత = వదలివేయబడినది; అగు = అయిన; దేవధానిన్ = దేవతల ప్రధాన నగరాన్ని {దేవధాని - దేవతల యొక్క ధాని (ఆశ్రయము), అమరావతి}; అధిష్ఠించి = ఆక్రమించి; జగత్రయంబున్ = ముల్లోకములను; తన = తనయొక్క; వశంబున్ = వశమైనవిగా; చేసికొని = చేసికొని; విశ్వవిజయుండు = విశ్వవిజేత; ఐ = అయ్యి; పెద్ద = చాలా; కాలంబున్ = కాలము; రాజ్యంబున్ = రాజ్యమునేలుట; చేయుచుండె = చేయుచుండెను; శిష్య = శిష్యులయెడ; వత్సలులు = వాత్సల్యముగలవారు; అగు = అయిన; భృగు = భృగువు; ఆదులు = మున్నగువారు; అతని = వాని; చేత = చేత; శత = వంద (100); అశ్వమేధంబులున్ = అశ్వమేధయాగములు; చేయించిరి = చేయించినారు; తత్ = ఆ; కాలంబునన్ = కాలమునందు.
భావము:- ఈవిధంగా బృహస్పతి సమయోచితమైన కర్తవ్యాన్నితెలియజెప్పాడు. ఆ మాటలకు ఇంద్రుడూ దేవతలూ ఒప్పుకున్నారు. స్వర్గలోకాన్ని విడిచి పెట్టి తమకు ఇష్టమైన రూపాలు ధరించి అనుకూలమైన చోట్లకు వెళ్ళిపోయారు. బలిచక్రవర్తి పగవారు లేని అమరావతిని సునాయాసంగా ఆక్రమించాడు. ముల్లోకాలనూ తన వశం చేసుకున్నాడు. విశ్వవిజేత అయి చాలాకాలం పాలించాడు.శిష్యులపై వాత్సల్యం కలిగిన శుక్రుడు మొదలగువారు బలిచక్రవర్తి చేత నూరు అశ్వమేధయాగాలు చేయించారు.

తెభా-8-459-శా.
ర్థుల్ వేఁడరు; దాతలుంజెడరు; సర్వారంభముల్ పండుఁ; బ్ర
త్యర్థుల్ లేరు; మహోత్సవంబులను దేవాగారముల్ పొల్చుఁ బూ
ర్ణార్థుల్ విప్రులు; వర్షముల్ గురియుఁ గాలార్హంబులై; ధాత్రికిన్
సార్థంబయ్యె వసుంధరాత్వ మసురేంద్రాధీశు రాజ్యంబునన్
.
టీక:- అర్థులు = యాచకులు; వేడరు = అడుగరు; దాతలున్ = దానమిచ్చువారికి; చెడరు = లోటులేదు; సర్వ = సమస్తమైన; ఆరంభముల్ = ప్రయత్నములు; పండున్ = ఫలించును; ప్రత్యర్థుల్ = శత్రువులు; లేరు = లేరు; మహా = గొప్ప; ఉత్సవంబులన్ = ఉత్సవములతో; దేవాగారముల్ = దేవాలయములు; పొల్చున్ = ఒప్పియుండును; పూర్ణ = తీరిన; అర్థులు = కోరికలుగలవారు; విప్రులు = బ్రాహ్మణులు; వర్షముల్ = వానలు; కురియున్ = కురియును; కాల = కాలమునకు; అర్హంబులు = తగినవి; ఐ = అయ్యి; ధాత్రి = భూమి; కిన్ = కి; సార్థంబు = సార్థకము; అయ్యెన్ = అయినది; వసుంధరాత్వము = వసుంధర యనెడిపేరు; అసుర = రాక్షస; ఇంద్రాధీశు = చక్రవర్తి; రాజ్యంబునన్ = రాజ్యపరిపాలనలో.
భావము:- చేయి సాచి దానం అడిగే యాచకులు, ఆ రాక్షస మహారాజు, బలిచక్రవర్తి రాజ్యంలో, లేరు. దాతలు తమ దానం ఇచ్చే గుణం వదలిపెట్ట లేదు. సకల పంటలూ సానుకూలంగా పండేవి. శత్రువులు లేరు. దేవాలయాలు ఉత్సవాలతో వేడుకలతో వెలుగుతుండేవి. బ్రాహ్మణుల కోరికలు తీరేవి. కాలానికి తగిన విధంగా వానలు కురిసేవి. దానితో భూమికి వసుంధర అనే పేరు సార్థకమైంది.