Jump to content

పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/బలి దాన నిర్ణయము

వికీసోర్స్ నుండి

బలిదాననిర్ణయము

తెలుగు భాగవతము (పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/బలి దాన నిర్ణయము)
రచయిత: పోతన


తెభా-8-595-క.
మేరువు దల క్రిం దైనను
బారావారంబు లింకఁ బాఱిన లోలో
ధారుణి రజమై పోయినఁ
దారాధ్వము బద్ధమైనఁ ప్పక యిత్తున్
.
టీక:- మేరువు = మేరుపర్వతము; తలక్రింద = తలకిందులు; ఐనన్ = అయిపోయినసరే; పారావారంబులు = సముద్రములు; ఇంకబాఱినన్ = ఇంకిపోయినసరే; లోలోన్ = లోపలలోపలే; ధారుణి = భూమండలము; రజము = పొడి; ఐపోయినన్ = అయిపోయినసరే; తారాధ్వము బద్దమైనన్ = ఆకాశము కుంచించుకుపోయినాసరే {తారాధ్వము బద్దమైనన్ - తారలకు అధ్వము (త్రోవ), ఆకాశము; బద్దము హద్దు పరిమితికలది, ఐనన్ - ఐనా సరే; అపరిమితమైన ఆకాశం పరిమితమైనది అగుట అంటే కుంచించుకుపోవుట జరిగినప్పటికి గమనిక -బద్దలైనన్ అన లేదు బద్దమైనన్ అన్నారు కనుక ముక్కలవ్వడం కాడు కుంచించుకుపోవడమే సరి}; తప్పక = తప్పకుండ; ఇత్తున్ = ఇచ్చెదను.
భావము:- మేరుపర్వతం తిరగబడితే బడవచ్చు, సప్తసముద్రాలు ఇంకిపోతే పోవచ్చు, ఈ భూమండలం అంతా తనలో తనే పొడిపొడి అయితే కావచ్చు, పరిమితులులేని ఆకాశం హద్దులేర్పడి కుంచించుకుపోవుట జరిగితే జరగవచ్చు, కాని నేను మాత్రం ఇస్తానన్న దానం తప్పకుండా ఇస్తాను.

తెభా-8-596-మత్త.
న్నడుం బరువేఁడఁ బోఁడట; యేకలుం డఁట; కన్న వా
న్నదమ్ములు నైన లేరఁట; న్నివిద్యల మూల గో
ష్ఠిన్నెఱింగిన ప్రోడ గుజ్జఁట; చేతు లొగ్గి వసింప నీ
చిన్నిపాపనిఁ ద్రోసిపుచ్చఁగఁ జిత్త మొల్లదు సత్తమా!”

టీక:- ఎన్నడున్ = ఎప్పుడు; పరున్ = ఇతరులను; వేడన్ = అడుగుటకు; పోడు = వెళ్ళడు; అటన్ = అట; ఏకలుండు = ఒంటరి, అసహాయుడు; అట = అట; కన్నవారు = తల్లిదండ్రులు; అన్నదమ్ములు = సోదరులు; ఐనన్ = అయినను; లేరు = లేరు; అటన్ = అట; అన్ని = సర్వ; విద్యలన్ = విద్యలయొక్క; మూలగోష్ఠి = ముఖ్యసారాంశమును; ఎఱింగిన = తెలిసిన; ప్రోడగుజ్జు = బహునేర్పరి; అటన్ = అట; చేతులు = చేతులు; ఒగ్గి = చాచి; వసింపన్ = ఉండగా; ఈ = ఈ; చిన్నిపాపనిన్ = పసివానిని; త్రోసిపుచ్చగన్ = గెంటివేయుటకు; చిత్తము = మనసు; ఒల్లదు = ఒప్పుటలేదు; సత్తమా = సమర్థుడా.
భావము:- మహానుభావా! ఈ పొట్టి పిల్లాడు ఎప్పుడు ఇతరులను అడగటం అన్నది లేదుట. ఒంటరి యట. కన్నవాళ్ళు, తోడబుట్టిన వాళ్ళు లేరుట. అన్ని విద్యల మూల సారం తెలిసిన నేర్పరి యట. నా ముందు చేతులు చాపి ఇలా నిల్చున్న ఇలాంటి పసివాడిని గెంటేయటానికి నాకు మన సొప్పటం లేదు."

తెభా-8-597-వ.
అని యిట్లు సత్య పదవీ ప్రమాణ తత్పరుండును, వితరణ కుతూహల సత్త్వరుండును, విమల యశస్కుండును, దృఢ మనస్కుండును, నియతసత్యసంధుండును, నర్థిజన కమలబంధుండును నైన బలిం జూచి శుక్రుండు గోపించి "మదీయ శాసనం బతిక్రమించితివి గావున శీఘ్రకాలంబునఁ బదభ్రష్టుండవుఁ గ"మ్మని శాపం బిచ్చె బలియును గురుశాపతప్తుండయ్యు ననృతమార్గంబు నకభిముఖుండుఁ గాకుండె; నప్పుడు .
టీక:- అని = అని; ఇట్లు = ఈ విధముగ; సత్యపదవీ = సత్యమార్గమునుండి; ప్రమాణ = చలించని; తత్పరుండు = నిష్ఠ కలవాడు; వితరణ = దానముచేయవలెనని; కుతూహల = కౌతుకము; సత్వరుండును = తహతహలాడువాడు; విమల = నిర్మలమైన; యశస్కుండును = కీర్తి కలవాడు; దృఢ = గట్టి; మనస్కుండును = మనసు కలవాడు; నియత = నియమబద్ధమైన; సత్యసంధుడు = సత్యసంధుడు; అర్థిజన = కోర్కెలను అడిగెడివారికి; కమలబంధుండును = సూర్యుని వంటివాడు; ఐనన్ = అయినట్టి; బలిన్ = బలిని; చూచి = చూసి; శుక్రుండు = శుక్రుడు; కోపించి = కోపగించుకొని; మదీయ = నా యొక్క; శాసనంబున్ = ఆజ్ఞను; అతిక్రమించితివి = మీరితివి; కావునన్ = కనుక; శీఘ్ర = కొద్ది; కాలంబునన్ = కాలములోనే; పద = పదవినుండి; భ్రష్టుండవు = జారిపోయినవాడవు; కమ్ము = అయిపో; అని = అని; శాపంబున్ = శాపమును; ఇచ్చెన్ = ఇచ్చెను; బలియునున్ = బలి; గురు = గురువు యొక్క; శాప = శాపమునకు; తప్తుండు = క్షోభితుడు; అయ్యున్ = అయినప్పటికి; అనృత = అసత్యము; మార్గంబున్ = వైపునకు; అభిముఖుండు = వెళ్ళువాడు; కాకుండెన్ = కాలేదు; అప్పుడు = ఆ సమయమునందు.
భావము:- ఇలా పలికిన ఆయొక్క సత్యమార్గం నుండి చలించని వాడునూ, వామనునికి దానమివ్వాలనే కుతూహలంతో ఉన్నవాడునూ, నిర్మలమైన కీర్తి గలవాడునూ, దృఢసంకల్పం గలవాడునూ, పలికిన మాట తప్పనివాడునూ, అర్థులకు ఆత్మబంధువూ అయిన బలిచక్రవర్తి మీద శుక్రాచార్యులు కోపగించుకుని ఇలా శాపమిచ్చాడు, “ నా ఆజ్ఞ మీరావు. కాబట్టి త్వరలో పదభ్రష్టుడవు అయిపోతావు.” గురువుగారి శాపానికి గురైనప్పటికీ బలి బాధపడలేదు. అసత్యమార్గం అవలంభించలేదు. అంత.

తెభా-8-598-ఆ.
బ్రతుక వచ్చుఁగాఁక హుబంధనములైన
చ్చుఁగాక లేమి చ్చుఁగాక
జీవధనములైనఁ జెడుఁగాక పడుఁగాక
మాటఁ దిరుఁగ లేరు మానధనులు
.
టీక:- బ్రతుకన్ = బాగాబతుక; వచ్చుగాక = కలిగినసరే; బహు = పలువిధముల; బంధనములు = కష్టములు; ఐనన్ = కలిగిన; వచ్చుగాక = కలిగినసరే; లేమి = పేదరికము; వచ్చుగాక = కలిగినసరే; జీవ = ప్రాణ; ధనములు = సంపదలు; ఐనన్ = అయినను; చెడుగాక = హానికలగనిమ్ము; పడుగాక =చావు వచ్చినా; మాట = ఇచ్చినమాట; తిరుగలేరు = తప్పలేరు; మానధనులు = అభిమానవంతులు.
భావము:- బాగా బ్రతికినా; పెక్కుకష్టాలకు గురి అయినా; పేదరికం వచ్చినా; ప్రాణానికి ధనానికి చేటు వచ్చినా; కడకు చావు సంభవించినా సరే మానధనులు మాట తప్పలేరు.