పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/నముచి వృత్తాంతము

వికీసోర్స్ నుండి

నముచివృత్తాంతము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-372-వ.
అప్పుడు నముచి నిలువంబడి.
టీక:- అప్పుడు = అప్పుడు; నముచి = నముచి; నిలువంబడి = నిలబడి.
భావము:- బల, పాకాసురులు మరణించిన పిమ్మట, యుద్ధ భూమిలో ఇంద్రునికి నముచి ఎదురునిలిచి. . .

తెభా-8-373-మ.
చుట్టంబులఁ జంపె వీఁడనుచు నుద్యత్క్రోధ శోకాత్ముఁడై
కాంతంబును నశ్మసారమయమున్ ఘంటాసమేతంబునై
దృగ్దుస్సహమైన శూలము నొగిన్ సారించి వైచెన్ సురేం
ద్రునిపై దీన హతుండవౌ దని మృగేంద్రుంబోలి గర్జించుచున్.

టీక:- తన = తన యొక్క; చుట్టంబులన్ = బంధువులను; చంపెన్ = చంపెను; వీడు = ఇతడు; అనుచున్ = అనుచు; ఉద్యత్ = ఉప్పొంగిన; క్రోధ = కోపము; శోక = దుఃఖము కల; ఆత్ముడు = మనసు కలవాడు; ఐ = అయ్యి; కనక = బంగారము; అంతంబునున్ = చివరగలది; అశ్మసార = ఇనుముతో; మయము = పోతపోసినది; ఘంటా = గంటలుతో; సమేతంబునున్ = కూడినది; ఐ = అయ్యి; జన = జనులకు; దృక్ = చూడ; దుస్సహము = శక్యముగానిది; ఐన = అయిన; శూలమున్ = బల్లెమును; సారించి = సాచిపెట్టి; వైచెన్ = వేసెను; సురేంద్రుని = ఇంద్రుని; పైన్ = మీదకు; దీనన్ = దీనితో; హతుండవు = చచ్చినవాడవు; ఔదు = అయ్యెదవు; అని = అని; మృగేంద్రు = సింహము; పోలి = వలె; గర్జించుచున్ = గర్జించుచు.
భావము:- తన బంధువులను దేవేంద్రుడు చంపాడని అధికమైన దుఃఖం, కోపం ఉప్పొంగాయి. బంగారపు పిడీ, గంటలూ కలిగి జనులకు చూడటానికే భయంపుట్టేలా ఉన్న ఇనప శూలాన్ని చేపట్టాడు. “దీనితో చస్తావు” అని సింహంలా గర్జిస్తూ ఆ శూలాన్ని సాటిపెట్టి ఇంద్రుడిపైకి విసిరాడు.

తెభా-8-374-శా.
కాశంబున వచ్చు శూలమును జంభారాతి ఖండించి నా
నా కాండంబుల వాని కంఠము దెగన్ దంభోళియున్ వైచె న
స్తోకేంద్రాయుధమున్ సురారిగళముంద్రుంపంగ లేదయ్యె; వా
డాకంపింపక నిల్చె దేవవిభుఁ డత్యాశ్చర్యముం బొందఁగన్.

టీక:- ఆకాశంబునన్ = ఆకాశములో; వచ్చు = వచ్చుచున్న; శూలమున్ = శూలమును; జంభారాతి = ఇంద్రుడు; ఖండించి = ముక్కలుచేసి; నానా = అనేకమైన; కాండంబులన్ = బాణములతో; వాని = అతని; కంఠమున్ = కంఠము; తెగన్ = తెగిపోవునట్లు; దంభోళియున్ = వజ్రాయుధమును; వైచెన్ = వేసెను; అస్తోక = బలమైన; ఇంద్ర = ఇంద్రుని; ఆయుధమున్ = ఆయుధముకూడ; సురారి = రాక్షసుని; గళమున్ = గొంతును; త్రుంపగన్ = తెంప; లేదయ్యె = లేకపోయినది; వాడు = అతడు; ఆకంపింపకన్ = చలింపకుండగ; నిల్చెన్ = నిలబడెను; దేవవిభుడు = ఇంద్రుడు; అతి = మిక్కిలి; ఆశ్చర్యమున్ = ఆశ్చర్య; పొందగన్ = పడిపోయెను.
భావము:- నముచి విసిరిన శూలం ఆకాశంలో వస్తుండగానే, ఇంద్రుడు దానిని ఖండించాడు. నముచి తల నరకడానికి అనేకమైన బాణాలు వేశాడు, వజ్రాయుధం ప్రయోగించాడు. కానీ నముచి తలను వజ్రాయుధం సైతం ఖండించ లేకపోయింది. నముచి చలించకుండా నిలబడి ఉండడం చూసి దేవతల ప్రభువు అయిన ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు.

తెభా-8-375-వ.
ఇట్లు నిలిచి యున్న నముచిం గనుంగొని వజ్రంబు ప్రతిహతంబగుటకు శంకించి బలభేది దన మనంబున.
టీక:- ఇట్లు = ఈ విధముగ; నిలిచి = నిలబడి; ఉన్న = ఉన్నట్టి; నముచిన్ = నముచిని; కనుంగొని = చూసి; వజ్రంబు = వజ్రము; ప్రతిహతంబు = వమ్ముపోయినది; అగుట = అయిపోవుట; కున్ = కు; శంకించి = సందేహించి; బలభేది = ఇంద్రుడు; తన = తన యొక్క; మనంబునన్ = మనసునందు.
భావము:- ఇలా వజ్రాయుధం ప్రయోగించినా ఎదురు నిలబడగలిగిన నముచిని చూసి, సందేహించి, ఇంద్రుడు తనలో ఈ విధంగా అనుకున్నాడు.

తెభా-8-376-సీ.
"కొండల ఱెక్కలు ఖండించి వైచుచో-
జ్ర మెన్నఁడు నింత వాఁడి చెడదు;
వృత్రాసురాదుల విదళించుచో నిది-
దిరుగ దెన్నఁడు పనిఁ దీర్చికాని;
యింద్రుండఁ గానొకో యేను దంభోళియుఁ-
గాదొకో యిది ప్రయోగంబు చెడెనొ
నుజాధముఁడు మొనతాఁకుఁ దప్పించెనో-
భిదురంబు నేఁ డేల బెండుపడియె;"

తెభా-8-376.1-ఆ.
నుచు వజ్రి వగవ "నార్ద్ర శుష్కంబులఁ
జావకుండఁ దపము లిపె నీతఁ
డితర మెద్ది యైన నింద్ర! ప్రయోగింపు
వైళ" మనుచు దివ్యవాణి పలికె.

టీక:- కొండల = పర్వతముల యొక్క; ఱెక్కలున్ = రెక్కలను; ఖండించి = తెగగోసి; వైచుచోన్ = వేయునప్పుడు; వజ్రము = వజ్రము; ఎన్నడున్ = ఎప్పుడుకూడ; ఇంత = ఇంత ఎక్కువగా; వాడి = పదును; చెడదు = చెడిపోలేదు; వృత్ర = వృత్రుడు యనెడి; అసుర = రాక్షసులు; ఆదులన్ = మున్నగువారిని; విదళించుచచోన్ = సంహరించునప్పుడు; ఇది = ఇది; దిరుగదు = వెనుదీయలేదు; ఎన్నడున్ = ఎప్పుడుకూడ; పని = ప్రయోగించిన పనిని; తీర్చి = సాధించును; కాని = తప్ప; ఇంద్రుండన్ = ఇంద్రుడను; కానొకో = కాదేమో; ఏనున్ = నేను; దంభోళియున్ = వజ్రాయుధము; కాదొకో = కాదేమో; ఇది = ఇది; ప్రయోగంబున్ = ఉపయోగంచుటయందు; చెడెన్ = పొరపాటు జరిగెనా ఏమి; దనుజ = రాక్షసుడైన; అధముడు = నీచుడు; మొన = ఆయుధపు కొన; తాకున్ = తాకిడిని; తప్పించెనో = తప్పించుకొనెనేమో; భిదురంబు = వజ్రము; నేడు = ఇవాళ; ఏల = ఎందుకు; బెండుపడియెన్ = మొక్కపోయెను; అనుచున్ = అనుచు.
వజ్రి = ఇంద్రుడు; వగవన్ = విచారించుచుండగ; ఆర్ద్ర = తడివాటివలన; శుష్కంబులన్ = పొడివాటివలనన్; చావకుండన్ = మరణించకుండగ; తపమున్ = తపస్సు; సలిపెన్ = చేసెను; ఈతడు = ఇతను; ఇతరమున్ = మరింకొకటి; ఎద్ది = ఏది; ఐనన్ = అయిన; ఇంద్ర = ఇంద్రుడా; ప్రయోగింపుము = ఉపయోగింపుము; వైళమన్ = శ్రీఘ్రమే; అనుచున్ = అనుచు; దివ్యవాణి = ఆకాశవాణి; పలికెన్ = పలికెను.
భావము:- ఈ వజ్రాయుధానికి కొండల రెక్కలు కత్తిరించేటప్పుడు వాడి తగ్గలేదు. వృత్రాసురుడు మున్నగు రక్కసులను సంహరించేటప్పుడు ఏనాడు పని సాధించకుండా వెనుదిరగింది లేదు. ఇప్పుడు నముచి విషయంలో ఇలా అయింది ఏమిటి? అసలు, నేను ఇంద్రుడినేనా? ఇది వజ్రాయుధమేనా? దీనిని ప్రయోగించడంలో పొరపాటు ఏమైనా జరిగిందా? ఈ దుష్టరాక్షసుడు దీని పదును తెగకుండా చేసాడా ఏమిటి? ఇది ఇవాళ ఎందుకు శక్తిని కోలుపోయింది ఇవాళ అనుకుంటూ దేవేంద్రుడు తెగ విచారిస్తున్నాడు. ఇంతలో ఆకాశవాణి “ఇంద్రా! ఈ రాక్షసుడు తడివాటితో కానీ, పొడివాటితో కానీ చావులేకుండా వరం పొందాడు. వేరే మరొక దానిని దేనినైనా వేగిరం ప్రయోగించు” అంటూ పలికింది.

తెభా-8-377-వ.
ఇట్లాదేశించిన దివ్యవాణి పలుకు లాకర్ణించి పురందరుండు.
టీక:- ఇట్లు = ఈ విధముగ; ఆదేశించినన్ = చెప్పిన; దివ్యవాణి = ఆకాశవాణి; పలుకులున్ = మాటలను; ఆకర్ణించి = విని; పురందరుండు = ఇంద్రుడు.
భావము:- ఇలా ఇంద్రుడు దివ్యవాణి ఆకాశం నుండి పలికిన మాటలు విని. . . .

తెభా-8-378-ఆ.
త్మబుద్ధిఁ దలఁచి యార్ద్రంబు శుష్కంబు
గాని సాధనంబు ఫే మనుచు
ది యమర్చి దాన మరులు మెచ్చంగ
ముచి శిరముఁ ద్రుంచె నాకవిభుఁడు.

టీక:- ఆత్మన్ = తన యొక్క; బుద్ధిన్ = మనసునందు; తలచి = ఆలోచించుకొని; ఆర్ద్రంబున్ = తడిది; శుష్కంబున్ = పొడిది; కాని = కానట్టి; సాధనంబున్ = సాధనము, వస్తువు; ఫేనము = సముద్రపునురుగు; అనుచున్ = అనుచు; అది = అది; అమర్చి = కూర్చి; దానన్ = దానితో; అమరులు = దేవతలు; మెచ్చంగన్ = శ్లాఘించుచుండగ; నముచి = నముచి యొక్క; శిరమున్ = తలను; త్రుంచెన్ = నరికెను; నాకవిభుడు = ఇంద్రుడు.
భావము:- “తడిదీ పొడిదీ కాని వస్తువు సముద్రపు నురుగు ఒక్కటే” అని తనలో విచారించుకున్నాడు. ఆ ప్రకారంగానే సముద్రపు నురుగు అద్దిన వజ్రం ప్రయోగించి, ఇంద్రుడు నముచి శిరస్సు నరికేసాడు. అందుకు దేవతలు మెచ్చుకున్నారు.

తెభా-8-379-వ.
అయ్యవసరంబున.
టీక:- ఆ = ఆ; అవసరంబునన్ = సమయమునందు.
భావము:- అలా ఇంద్రుడు నముచి తల ఖండించిన సమయంలో . .

తెభా-8-380-సీ.
పురుహూతు నగ్గించి పుష్పాంజలులు చేసి-
మునులు దీవించిరి ముదము తోడ;
గంధర్వముఖ్యులు నులు విశ్వావసుఁ-
డును బరావసుఁడు నింపెయఁ బాడి;
మరాంగనాజను లాడిరి; దేవతా-
దుందుభులును మ్రోసె దురములోన;
వాయు వహ్ని కృతాంత రుణాదులును బ్రతి-
ద్వంద్వుల గెల్చి రుద్దండ వృత్తి;

తెభా-8-380.1-తే.
ల్ప మృగముల సింహంబు ట్ల తోలి
మరవర్యులు దనుజుల దటు వాయ
జుఁడు పుత్తేర నారదుఁ రుగుఁ దెంచె
దైత్యహరణంబు వారింప రణినాథ!

టీక:- పురుహూతున్ = ఇంద్రుని; అగ్గించి = పొగిడి; పుష్పాంజలులు = పూలుగల దోసిళ్ళు; చేసి = సమర్పించి; మునులు = మునులు; దీవించిరి = ఆశీర్వదించిరి; ముదము = సంతోషము; తోడన్ = తోటి; గంధర్వ = గంధర్వులలో; ముఖ్యులు = ప్రముఖులు; ఘనులు = గొప్పవారు; విశ్వావసుడునున్ = విశ్వావసుడు; పరావసుడున్ = పరావసుడు; ఇంపు = సొంపు; ఎనయన్ = పొందికగా; పాడిరి = పాటలుపాడిరి; అమర = దేవతా; అంగనా = స్త్రీ; జనులు = జనములు; ఆడిరి = నాట్యములాడిరి; దేవతా = దేవ; దుందుభులును = భేరీలు; మ్రోసెన్ = మోగినవి; దురము = యుద్ధము; లోనన్ = లో; వాయు = వాయుదేవుడు; వహ్ని = అగ్నిదేవుడు; కృతాంత = యమధర్మరాజు; వరుణ = వరుణదేవుడు; ఆదులున్ = మొదలగువారు; ప్రతిద్వంద్వులన్ = తమతోతలపడినవారిని; గెల్చిరి = జయించిరి; ఉద్దండ = అతిశయించిన; వృత్తిన్ = విధముగ; అల్ప = చిన్న.
మృగములన్ = జంతువులను; సింహంబులు = సింహములు; అట్ల = వలె; తోలిరి = పారదోలిరి; అమర = దేవతా; వర్యులు = శ్రేష్ఠులు; దనుజులన్ = రాక్షసులను; అదటు = అహంకారమును; వాయన్ = అణచివేయగా; అజుడు = బ్రహ్మదేవుడు; పుత్తేర = పంపించగా; నారదుడు = నారదుడు; అరుగుదెంచి = వచ్చి; దైత్య = రాక్షసుల; హరణంబున్ = సంహారమును; వారింపన్ = ఆపుటకు; ధరణీనాథ = రాజ.
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! దేవేంద్రుని మునులు పొగుడుతూ దోసిళ్ళకొద్దీ పూలతో సంతోషంగా దీవించారు. విశ్వావసువూ, పరీవసువూ అనే గంధర్వ ప్రభువులు పాటలు బహు సొంపుగా పాడారు. దేవతా స్త్రీలు నాట్యాలు చేశారు. దేవదుందుభులు మ్రోగాయి. రణరంగంలో అగ్నీ, యముడూ, వరుణుడూ, వాయువూ తమతో తలపడిన వారిని భయంకరంగా పారదోలారు. చిన్న జంతువులను సింహాలు పారద్రోలినట్లు, దేవతావీరులు రాక్షసుల అహంకారాన్ని అణచి ఓడించారు. రాక్షస సంహారాన్ని ఆపించడంకోసం బ్రహ్మదేవుడు నారదమహర్షిని పంపాడు.

తెభా-8-381-వ.
వచ్చి సురలకు నారదుం డిట్లనియె.
టీక:- వచ్చి = వచ్చి; సురల్ = దేవతల; కున్ = కు; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.
భావము:- ఆ దేవదానవ సంగ్రామాన్ని ఆపడానికి వచ్చిన నారదుడు దేవతలతో ఇలా అన్నాడు.

తెభా-8-382-శా.
"సిద్ధించెన్ సురలార! మీ కమృతమున్; శ్రీనాథ సంప్రాప్తులై
వృద్ధిం బొందితి రెల్ల వారలును; విద్వేషుల్ మృతిం బొంది; రీ
యుద్ధం బేటికి? నింకఁ జాలుఁ; బనిలే దోహో పురే"యంచు సం
ద్ధాలాపము లాడి మాన్చె సురలం బాండవ్యవంశాగ్రణీ!"

టీక:- సిద్ధించెన్ = సమకూరినది; సురలార = దేవతలు; మీ = మీ; కున్ = కు; అమృతమున్ = అమృతము; శ్రీనాథ = నారయణుని; సంప్రాప్తులు = ఆశ్రయముదొరికినవారు; ఐ = అయ్యి; వృద్ధిన్ = అభివృద్ధిని; పొందితిరి = పొందిరి; ఎల్లవారలను = మీరు అందరు; విద్వేషుల్ = శత్రువులు; మృతిన్ = మరణమును; పొందిరి = పొందిరి; ఈ = ఈ; యుద్ధంబున్ = పోరు; ఏటికిన్ = ఎందులకు; ఇంకన్ = ఇంక; చాలును = చాలించండి; పని = అవసరము; లేదు = లేదు; ఓహో = భళీ; పురే = బాగు; అంచున్ = అనుచు; సంబద్ధ = తగిన; ఆలాపములు = మాటలు; ఆడి = పలికి; మాన్చెన్ = మానిపించెను; సురలన్ = దేవతలను; పాండవ్యవంశాగ్రణీ = పరీక్షిన్నరేంద్రుడ.
భావము:- ఓ పాండవ వంశంలో ఉత్తముడవయిన పరీక్షిన్మహారాజా! “ఓ దేవతలారా! మీకు అమృతం లభించింది కదా. మీరు అందరూ చక్కగా శ్రీమహావిష్ణువును ఆశ్రయించి బాగుపడ్డారు. మీ శత్రువులు నశించిపోయారు. బాగు బాగు. ఇంక యుద్ధంతో పని లేదు, ఆపేయండి” అంటూ నచ్చజెప్పి నారదుడు యుద్ధం ఆపించాడు.

తెభా-8-383-వ.
ఇట్లు నారద వచన నియుక్తులై రాక్షసులతోడి సంగ్రామంబు చాలించి సకల దేవ ముఖ్యులును ద్రివిష్టపంబునకుం జనిరి"హతశేషు లైన దైత్యదానవులు విషణ్ణుండైన బలిం దోడ్కొని పశ్చిమ శిఖిశిఖరంబుఁ జేరిరి; విధ్వంసమానకంధరులై వినష్టదేహులగు యామినీచరుల నెల్లను శుక్రుండు మృతసంజీవని యైన తన విద్య పెంపునం జేసి బ్రతికించె; బలియును భార్గవానుగ్రహంబున విగత శరీర వేదనుండై పరాజితుండయ్యును లోకతత్త్వ విచక్షణుం డగుటం జేసి దుఃఖింపక యుండె"నని చెప్పి రాజునకు శుకుం డిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; నారద = నారదుని; వచన = మాటలచే; నియుక్తులు = నియమింపబడినవారు; ఐ = అయ్యి; రాక్షసుల = రాక్షసుల; తోడి = తోటి; సంగ్రామంబున్ = యుద్ధమును; చాలించి = ఆపివేసి; సకల = సమస్తమైన; దేవ = దేవతా; ముఖ్యులునున్ = ప్రముఖులు; త్రివిష్టపంబున్ = స్వర్గమున; కున్ = కు; చనిరి = వెళ్ళిరి; హత = మరణించగా; శేషులు = మిగిలినవారు; ఐన = అయిన; దైత్య = రాక్షసులు; దానవులు = రాక్షసులు; విషణ్ణుండు = విషాదముపొందినవాడు; ఐన = అయిన; బలిన్ = బలిని; తోడ్కొని = కూడతీసుకెళ్ళి; పశ్ఛిమ = పడమటి; శిఖి = పర్వతపు; శిఖరంబున్ = శిఖరమునకు; చేరిరి = చేరుకొంటిరి; విధ్వంసమాన = తెగిపోయిన; కంధరులు = కంఠములుగలవారు; ఐ = అయ్యి; వినష్టదేహులు = మరణించినవారు; అగు = అయిన; యామినీచరులన్ = రాక్షసులను; ఎల్లను = అందరును; శుక్రుండు = శుక్రుడు; మృత = మరణించినవారిని; సంజీవని = చక్కగాజీవింపజేయునది; ఐన = అయిన; తన = తన; విద్య = విద్య యొక్క; పెంపునన్ = గొప్పదనము; చేసి = చేత; బ్రతికించెన్ = జీవింపజేసెను; బలియును = బలి కూడ; భార్గవ = శుక్రుని; అనుగ్రహంబునన్ = దయవలన; విగత = పోయినట్టి; శరీర = దేహ; వేదనుండు = బాధలుగలవాడు; ఐ = అయ్యి; పరాజితుండు = ఓటమిపాలైనను; లోక = సృష్టి; తత్త్వ = తత్త్వపు; విచక్షణుండు = జ్ఞానముగలవాడు; అగుటన్ = అగుట; చేసి = వలన; దుఃఖింపక = శోకింపకుండ; ఉండెను = ఉండెను; అని = అని; చెప్పి = పలికి; రాజున్ = రాజున; కున్ = కు; శుకుండు = శుకుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- ఈ విధంగా నారదమునీంద్రుడు చెప్పిన మాటలు విని, రాక్షసులతో యుద్ధాన్ని చాలించి, దేవతావీరులు అందరూ దేవతాలోకానికి వెళ్ళిపోయారు. పరాజితుడు అయిన బలిచక్రవర్తిని, చావకుండా మిగిలిన రాక్షసులు పిలుచుకొని వెళ్ళి, పడమటికొండ శిఖరానికి చేరుకున్నారు. శుక్రాచార్యుడు మృతసంజీవని అనే విద్య ప్రయోగించి, దాని మహత్మ్యం వలన గొంతులు తెగి శరీరం వదిలిన రాక్షసులు అందరనూ మరల బ్రతికించాడు. బలి చక్రవర్తి దైహిక బాధలు అన్నీ కూడా ఆ భర్గుని కుమారుడు అయిన శుక్రాచార్యుని దయతో చల్లారాయి. ఆ బలి ప్రపంచతత్వం తెలిసినవాడు కాబట్టి, ఓటమి పాలైనా దుఃఖపడలేదు.” అని శుకబ్రహ్మ పరీక్షిన్మహారాజుతో ఇలా అన్నాడు.