Jump to content

పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/త్రివిక్రమ స్ఫురణంబు

వికీసోర్స్ నుండి

త్రివిక్రమస్ఫురణంబు

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-622-శా.
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై
.
టీక:- ఇంతింతై = ఇంత ఇంత చొప్పున పెరుగుతూ; వటుడు = బ్రహ్మచారి; ఇంత = మరింత పెరిగిన వాడు; ఐ = అయ్యి; మఱియున్ = ఇంకను; తాను = అతను; ఇంత = ఇంకొంత పెరిగినవాడు; ఐ = అయ్యి; నభోవీథి = ఆకాశము; పైన్ = మీద; అంత = అంత; ఐ = అయ్యి; తోయద = మేఘ; మండల = మండలమునకు; అగ్రమున్ = పైకొస; కున్ = కు; అల్లంత = ఆవతలంత; ఐ = అయ్యి; ప్రభారాశి = వెలుగులరాశి, పాలపుంత; పైన్ = కంటెఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; చంద్రుని = చంద్రుని; కిన్ = కి; అంత = అంత; ఐ = అయ్యి; ధ్రువుని = ధ్రువుడికంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; మహర్వాటిన్ = మహర్లోకముకంటె; పైన్ = ఎక్కువ ఎత్తు; అంత = అంత; ఐ = అయ్యి; సత్యపద = బ్రహ్మలోకముకంటె; ఉన్నతుండు = ఎక్కువ ఎత్తు కలవాడు; అగుచున్ = అగుచు; బ్రహ్మాండ = బ్రహ్మాండము; అంత = చివరవరకు; సంవర్ధి = నిండాపెరిగినవాడు; ఐ = అయ్యి.
భావము:- బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే
ఇంత పొట్టి బ్రహ్మచారీ, ఇంత ఇంత చొప్పున ఎదగటం మొదలెట్టాడు; అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు; అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు; అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు; పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు; అదిగదిగో ధ్రువ నక్షత్రం కూడ దాటేసాడు; మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు; ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు.

తెభా-8-623-మ.
విబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
విమత్కంకణమై కటిస్థలి నుదంద్ఘంటయై నూపుర
ప్రరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్
.
టీక:- రవిబింబంబున్ = సూర్యబింబము; ఉపమింపన్ = సరిపోల్చుటకు; పాత్రము = తగినది; అగు = అయిన; ఛత్రంబు = గొడుగు; ఐ = వలెనయ్యి; శిరోరత్నము = శిరసుపైని ఆభరణము; ఐ = వలెనయ్యి; శ్రవణ = చెవుల; అలంకృతి = అలంకారము; ఐ = వలెనయ్యి; గళ = కంఠమునందలి; ఆభరణము = ఆభరణము; ఐ = వలెనయ్యి; సౌవర్ణ = బంగారపు; కేయూరము = భుజకీర్తి; ఐ = వలెనయ్యి; ఛవిమత్ = మెరిసెడి; కంకణము = చేతికంకణము; ఐ = వలెనయ్యి; కటిస్థలిన్ = నడుమున; ఉదంచత్ = వేయబడిన; గంట = గంట; ఐ = వలెనయ్యి; నూపుర = కాలిఅందెల; ప్రవరంబు = పేరు; ఐ = వలెనయ్యి; పదపీఠంబు = పాదపీఠము; ఐ = అయ్యి; వటుడు = బ్రహ్మచారి; తాన్ = అతను; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; నిండుచోన్ = అంతవ్యాపించునప్పుడు.
భావము:- వామనుడు బ్రహ్మాండ మంతా నిండిపోతుంటే, మింట నుండే సూర్యబింబం ఆ పరాత్పరునికి అలంకారంగా పోల్చి చెప్పడానికి తగి ఉన్నాడట. అది ఎలాగంటే ఆ సమయంలో క్రమక్రమంగా త్రివిక్రమునికి గొడుగులా, తర్వాత శిరోమణిలా, తర్వాత మకరకుండలంలా, పిమ్మట కంఠాభరణంలా, ఆ పిమ్మట బంగారు భుజకీర్తులులా, ఆ పిమ్మట కాంతులీనే కంకణంలా, అపైన మొలలోని గంటలా, అనంతరం మేలైన కాలిఅందెలా, చివరికి పాదపీఠంలా పోల్చడానికి తగి ఉన్నాడట.
అందంగా కళ్ళకు కట్టినట్లు అలవోకగా చెప్పడంలో సిద్ధహస్తుడు అయిన మన పోతనామాత్యుల వారి త్రివిక్రమావతరణ అత్యద్భుతం తెలుగు సాహిత్యానికే మకుటాయమానమైన పద్యాలుగా ఎన్నదగ్గవి. ఉపమానం అని చెప్తు ఉపమానానికి గొప్పదనం అబ్బేలా చేయటం సామాన్య విషయం కాదు.

తెభా-8-624-వ.
ఇట్లు విష్ణుండు గుణత్రయాత్మకంబగు విశ్వరూపంబు ధరియించి భువియును, నభంబును, దివంబును, దిశలును, దిశాఛిద్రంబులును, సముద్రంబులునుఁ, జలదచల దఖిల భూతనివహంబులుం దానయై యేకీభవించి, క్రమక్రమంబున భూలోకంబునకుం బొడవై భువర్లోకంబు నతిక్రమించి, సువర్లోకంబును దలకడచి, మహర్లోకంబు దాఁటి, జనలోకంబునకు మీఁదై, తపంబునకు నుచ్ఛ్రితుండై, సత్యలోకంబు కంటె నౌన్నత్యంబు వహించి, యెడ లిఱుములు సందులు రంధ్రములు లేకుండ నిండి, మహాదేహ మహితుండై చరణతలంబున రసాతలంబునుఁ, బాదంబుల మహియును, జంఘల మహీధ్రంబులును, జానువులఁ బతత్త్రిసముదయంబులును, నూరువుల నింద్రసేన మరుద్గణంబులును, వాసస్థ్సలంబున సంధ్యయు, గుహ్యంబునఁ బ్రజాపతులును, జఘనంబున దనుజులును, నాభిని నభంబును, నుదరంబున నుదధిసప్తకంబును, నురంబున దారకానికరంబును, హృదయంబున ధర్మంబును, నురోజంబుల ఋతసత్యంబులును, మనంబునఁ జంద్రుండును, వక్షంబున గమలహస్త యగు లక్ష్మియుఁ, గంఠంబున సామాది సమస్త వేదంబులును, భుజంబులఁ బురంద రాది దేవతలునుఁ, గర్ణంబుల దిశలును, శిరంబున నాకంబును, శిరోజంబుల మేఘంబులును, నాసాపుటంబున వాయువును, నయనంబుల సూర్యుండును, వదనంబున వహ్నియు, వాణి నఖిలచ్ఛంద స్సముదయంబును, రసనంబున జలేశుండును, భ్రూయుగళంబున విధినిషేధంబులును, ఱెప్పల నహోరాత్రంబులును, లలాటంబునఁ గోపంబును, నధరంబున లోభంబును, స్పర్శంబునఁ గామంబును, రేతంబున జలంబును, బృష్ఠంబున నధర్మంబును, గ్రమణంబుల యజ్ఞంబులును, ఛాయల మృత్యువును, నగవులవలన ననేక మాయావిశేషంబులును, రోమంబుల నోషధులును, నాడీప్రదేశంబుల నదులును, నఖంబుల శిలలును, బుద్ధి నజుండును, బ్రాణంబుల దేవర్షిగణంబులును, గాత్రంబున జంగమ స్థావర జంతు సంఘంబులును గలవాఁడయి, జలధరనినద శంఖ శార్ఙ సుదర్శన గదాదండ ఖ డ్గాక్షయ బాణతూణీర విభ్రాజితుండును, మకరకుండల కిరీట కేయూర హార కటక కంకణ కౌస్తుభమణి మేఖలాంబర వనమాలికా విరాజితుండును, సునంద నంద జయ విజయ ప్రముఖ పరిచర వాహినీ సందోహ పరివృతుండును, నమేయ తేజోవిరాజితుండును, నై బ్రహ్మాండంబు దన మేనికప్పు తెఱంగున నుండ విజృంభించి.
టీక:- ఇట్లు = ఈ విధముగ; విష్ణుండు = నారాయణుండు; గుణత్రయ = త్రిగుణములతో {గుణత్రయము - 1సత్త్వ 2రజస్ 3తమస్ అనెడి 3 గుణములు}; ఆత్మకంబు = కూడినది; అగు = అయిన; విశ్వరూపంబున్ = విశ్వరూపమును; ధరియించి = ధరించి; భువియును = భూమండలము; నభంబును = ఆకాశమును; దివంబును = స్వర్గమును; దిశలును = నలుదిక్కులును; దిశాఛిద్రంబులును = నలుమూలలును; సముద్రంబులును = సముద్రములును; చలదచల = చరాచర; అఖిల = మున్నగు సమస్తమైన; భూత = జీవ; నివహంబులున్ = సమూహములును; తాన = తనే; ఐ = అయ్యి; ఏకీభవించి = ఒకటిచేసి; క్రమక్రమంబునన్ = క్రమక్రమముగా; భూలోకంబున్ = భూలోకమున; కున్ = కంటె; పొడవు = పెద్ద; ఐ = అయ్యి; భువర్లోకంబున్ = భువర్లోకమును; అతిక్రమించి = దాటి; సువర్లోకంబునున్ = సువర్లోకమును; తలకడచి = దాటేసి; మహర్లోకంబున్ = మహర్లోకమును; దాటి = దాటి; జనలోకంబున్ = జనలోకమున; కున్ = కంటెను; మీద = ఎక్కువ ఎత్తు; ఐ = అయ్యి; తపంబున్ = తపోలోకమున; కున్ = కు; ఉచ్ఛ్రితుండు = దాటినవాడు; ఐ = అయ్యి; సత్యలోకంబున్ = సత్యలోకము; కంటెన్ = కంటె; ఔన్నత్యంబు = ఎత్తగుటను; వహించి = చెంది; ఎడలు = చోటులు; ఇఱుములు = మరుగుస్థానములు; సందులు = సందులు; రంధ్రములున్ = కన్నములు; లేకుండ = లేకుండునట్లు; నిండి = నిండిపోయి; మహా = బాగాపెద్ద; దేహ = శరీరము కల; మహితుండు = గొప్పవాడు; ఐ = అయ్యి; చరణతలంబునన్ = అరికాళ్ళవద్ద; రసాతలంబును = రసాతలము, పాతాళము; పాదంబులన్ = పాదములవద్ద; మహియును = భూతలము; జంఘలన్ = పిక్కలవద్ద; మహీధ్రంబులును = పర్వతములును; జానువులన్ = మోకాళ్ళవద్ద; పతత్రి = పక్షుల; సముదయంబులును = సమూహములు; ఊరువులన్ = తొడలవద్ద; ఇంద్రసేన = దేవతలను; మరుత్ = మరుత్తుల; గణంబులును = సమూహములు; వాసస్థ్సలంబునన్ = వస్త్రములవద్ద; సంధ్యయున్ = సంధ్యలు; గుహ్యంబునన్ = రహస్యాంగమువద్ద; ప్రజాపతులును = ప్రజాపతులు; జఘనంబున = పిరుదులవద్ద; దనుజులును = రాక్షసులు; నాభిన్ = బొడ్డువద్ద; నభంబును = ఆకాశము; ఉదరంబునన్ = పొట్టవద్ద; ఉదధిసప్తకంబును = సప్తసముద్రములు; ఉరంబున = వక్షమువద్ద; తారకా = నక్షత్రముల; నికరంబును = సమూహములు; హృదయంబునన్ = హృదయమువద్ద; ధర్మంబునున్ = ధర్మము; ఉరోజంబులన్ = స్తనములవద్ద; ఋత = ఋతము {ఋతము - శాశ్వతముగా నిలిచే సత్యము}; సత్యంబులును = సత్యమును; మనంబునన్ = మనసునందు; చంద్రుండును = చంద్రుడు; వక్షంబునన్ = వక్షస్థలమున; కమల = పద్మము; హస్త = చేత కలామె; అగు = అయిన; లక్ష్మియున్ = లక్ష్మీదేవి; కంఠంబునన్ = కంఠమునందు; సామ = సామవేదము; ఆది = మున్నగు; సమస్త = సమస్తమైన; వేదంబులును = వేదములు; భుజంబులన్ = భుజములందు; పురందర = ఇంద్రుడు; ఆది = మున్నగు; దేవతలును = దేవతలు; కర్ణంబులన్ = చెవులందు; దిశలును = దిక్కులు; శిరంబునన్ = తలయందు; నాకంబును = స్వర్గము; శిరోజంబులన్ = తలవెంట్రుకలందు; మేఘంబులును = మేఘములును; నాసాపుటంబునన్ = ముక్కుపుటములందు; వాయువును = వాయువు; నయనంబులన్ = కళ్ళయందు; సూర్యుండును = సూర్యుడు; వదనంబునన్ = ముఖమునందు; వహ్నియున్ = అగ్ని; వాణిన్ = మాటయందు; అఖిల = సమస్తమైన; ఛందస్ = ఛందస్సుల; సముదయంబును = సమూహములు; రసనంబున = నాలికయందు; జలేశుండును = వరుణుడు; భ్రూయుగళంబునన్ = కనుబొమలయందు; విధి = తప్పక చేయవలసినవి; నిషేధంబులును = తప్పక చేయకూడనివి; ఱెప్పలన్ = కనురెప్పలందు; అహోరాత్రంబులు = రాత్రింబగళ్ళు; లలాటంబునన్ = నుదుట; కోపంబును = కోపము; అదరంబున = కిందిపెదవియందు; లోభంబును = లోభము; స్పర్శంబునన్ = స్పర్శయందు; కామంబును = కామము; రేతంబునన్ = వీర్యమున; జలంబును = నీరు; పృష్ఠంబునన్ = వీపునందు; అధర్మంబును = అధర్మము; క్రమణంబులన్ = అడుగులలో; యజ్ఞంబులును = యాగములు; ఛాయలన్ = నీడలందు; మృత్యువు = మరణము; నగవుల = నవ్వుల; వలనన్ = వలన; అనేక = అనేకమైన; మాయా = మాయల; విశేషంబులును = విశేషములు; రోమంబులన్ = శరీరరోమములందు; ఓషధులును = ఓషధులు; నాడీ = నాడుల; ప్రదేశంబులన్ = భాగములందు; నదులును = నదులు; నఖంబులన్ = గోర్లుయందు; శిలలును = బండరాళ్ళు; బుద్ధిన్ = బుద్ధియందు; అజుండును = బ్రహ్మదేవుడు; ప్రాణంబులన్ = ప్రాణములయందు; దేవర్షి = దేవఋషుల; గణంబులును = సమూహములు; గాత్రంబున = దేహమునందు; జంగమస్థావర = చరాచర; జంతు = జీవ; సంఘంబులునున్ = జాలమును; కలవాడు = కలిగినవాడు; అయి = అయ్యి; జలధరనినద = ఉరుములవలెమోగెడి; శంఖ = శంఖము; శార్ఙ = శార్ఙమనెడివిల్లు; సుదర్శన = సుదర్శనచక్రము; గదాదండ = గదాయుధము; ఖడ్గ = ఖడ్గము; అక్షయతూణీర = అక్షయములైన అంబులపొదితోను; విభాజితుండును = ప్రకాశించెడివాడును; మకరకుండల = చెవిమకరకుండలములు; కిరీట = కిరీటములు; కేయూర = భుజకీర్తులు; హార = హారములు; కటక = కాలిఅందెలు; కంకణ = చేతికంకణములు; కౌస్తుభమణి = కౌస్తుభమణి; మేఖలా = రత్నాలమొలనూళ్ళు; అంబర = పీతాంబరములు; వనమాలికా = వనమాలికలుతోను; విరాజితుండును = విరాజిల్లెడివాడును; సునంద = సునందుడు; నంద = నందుడు; జయ = జయుడు; విజయ = విజయుడు; ప్రముఖ = మొదలగు; పరిచర = పరిచారకుల; వాహినీ = సమూహములు; సందోహ = గుమిగూడి; పరివృతుండును = చుట్టునుచేరినవాడు; అమేయ = అంతులేని; తేజో = తేజస్సుతో; విరాజితుండును = విరాజిల్లెడివాడును; ఐ = అయ్యి; బ్రహ్మాండంబున్ = బ్రహ్మాండమును; తన = తన యొక్క; మేని = దేహమునకు; కప్పు = మేలిముసుగు; తెఱంగునన్ = వలె; ఉండన్ = ఉండగా; విజృంభించి = విజృంభించి.
భావము:- ఈవిధంగా విష్ణువు సత్త్వరజస్తమో రూపకమైన విశ్వరూపాన్ని పొంది విజృంభించాడు. భూమి, ఆకాశమూ, స్వర్గమూ, దిక్కులూ, దిక్కుల మధ్య ప్రదేశాలూ, సముద్రాలూ, చరాచరములైన సమస్త ప్రాణులూ తానే అయ్యాడు. క్రమంగా భూలోకాన్ని అతిక్రమించాడు. భువర్లోకమూ, సువర్లోకమూ, మహార్లోకమూ, జనోలోకమూ, తపోలోకమూ, దాటిపోయాడు. సత్యలోకం కంటే ఎత్తుగా ఎదిగిపోయాడు. అన్నిచోట్ల మూలమూలలూ సందుసందులూ నిండిపోయాడు. మహోన్నతమైన ఆకారంతో పాదాల అడుగు భాగంలో రసాతలాన్ని, పాదాలలో భూమినీ, పిక్కలలో పర్వతాలనూ, మోకాళ్ళలో పక్షులను, తొడలలో దేవతలను, వస్త్రంలో సంధ్యాకాలాన్నీ, రహస్యాంగంలో ప్రజాపతులనూ, పిరుదులలో రాక్షసులనూ, నాభిలో ఆకాశాన్ని, కడుపులో సప్తసముద్రాలనూ, వక్షంలో నక్షత్రసమూహాన్నీ, హృదయంలో ధర్మాన్ని, స్తనద్వయంలో ఋతాన్ని సత్యాన్ని, మనస్సులో చంద్రుణ్ణి, ఎదలో లక్ష్మి దేవిని, కంఠంలో వేదాలను, భుజాలలో ఇంద్రాదులైన దేవతలను, చెవులలో దిక్కులూ, తలలో స్వర్గలోకాన్ని, తలవెంట్రుకలలో మేఘాలనూ, ముక్కుపుటాలలో వాయువునూ, కన్నులలో సూర్యుణ్ణి, ముఖంలో అగ్నిని, వాక్కులో సమస్త ఛందస్సునూ, నాలుకలో వరుణునీ, కనుబొమ్మలలో కార్యాకార్యాలనూ, రెప్పలలో రేయింబవళ్ళనూ, ఫాలభాగంలో కోపాన్నీ, క్రింది పెదవిలో లోభాన్నీ, స్పర్సలో కామాన్ని, రేతస్సులో జలాన్నీ, వీపులో అధర్మాన్నీ, అడుగులలో యజ్ఞాలనూ, నీడలో మరణాన్నీ, నవ్వులో మాయావిశేషాలనూ, రోమాలలో సస్యాలనూ, నరాలలో నదులనూ, గోళ్ళలో రాళ్లను, బుద్ధిలో బ్రహ్మనూ, ప్రాణాలలో దేవర్షిగణాలనూ, శరీరంలో చరాచర సకలప్రాణులనూ, ఇమిడించికొన్నాడు. ఆయన మేఘంవలే మ్రొగే పాంచజన్యమనే శంఖంతో, శార్జ్గమనే ధనస్సుతో, సుదర్శనమనే చక్రముతో, కౌమోదకి అనే గదాదండంతో, నందకమనే ఖడ్గంతో, అక్షయములైన అంపపొదులతో ప్రకాశించుచున్నాడు. మకరకుండలాలతో, కిరీటంతో, భుజకీర్తులతో, హారాలతో, కాలి అందెలుతో, కంకణాలతో, కౌస్తుభమణితో, రత్నాల మొలనూలుతో, పీతాంబరంతో, వైజయంతీమాలికతో విరాజిల్లుతున్నాడు. సునందుడూ, నందుడూ, జయుడూ, విజయుడూ మొదలైన పరిచారకుల సమూహం చుట్టూ చేరి ఉంది. ఆయన మేరలేని తేజస్సుతో మెరుస్తున్నాడు. బ్రహ్మాండం ఆయన దేహానికి మేలిముసుగుగా ఒప్పుతున్నది.

తెభా-8-625-మ.
పాదంబున భూమి గప్పి దివి వే ఱొంటన్ నిరోధించి యొం
డొటన్ మీఁది జగంబు లెల్లఁ దొడి, నొండొంటిన్ విలంఘించి. ప
ట్టబ్రహ్మాండకటాహముం బెటిలి వేండ్రంబై పరుల్ గానరా
కొకఁడై వాగ్దృగలభ్యుఁడై హరి విభుం డొప్పారె విశ్వాకృతిన్
.
టీక:- ఒక = ఒక; పాదంబునన్ = పాదముతో; భూమిన్ = భూమిని; కప్పి = కప్పివేసి; దివిన్ = స్వర్గమును; వేఱొంటన్ = ఇంకొకదానితో; నిరోధించి = ఆపి; ఒండొకటన్ = ఇంకొకదానితో; మీది = పైనున్న; జగంబులన్ = లోకములను; ఎల్లన్ = అన్నిటిని; తొడిన్ = క్రమముగా; ఒండొంటిన్ = ఒక్కొదానిని; విలంఘించి = దాటిపోయి; పట్టక = పట్టకపోవుటచేత; బ్రహ్మాండ = బ్రహ్మాండము యొక్క; కటాహంబు = పైపెంకు; పెటిలి = బద్ధలై; వేండ్రంబు = మిక్కిలి తీక్షణమైనదై; పరుల్ = ఇతరులు; కానరాక = కనబడకుండగ; ఒకడు = ఏకలుడు; ఐ = అయ్యి; వాక్ = మాటలకు; దృక్ = చూపులకు; అలభ్యుడు = అందనివాడు; ఐ = అయ్యి; హరి = విష్ణుడు; విభుండు = విష్ణుడు; ఒప్పారెన్ = ప్రసిద్ధముగనుండెను; విశ్వాకృతిన్ = విశ్వరూపమునందు.
భావము:- విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు తన ఒక పాదముతో భూలోకాన్ని కప్పి, మొదటిఅడుగుగా స్వర్గలోకాన్ని దాటి రెండవ పాదముంచాడు. రెండవ అడుగుగా వేసిన పాదముతో పైలోకాలను అన్నింటినీ దాటిపోయాడు. ఆ మహారూపం పట్టకపోవడంవలన బ్రహ్మాండభాండం పైపెంకు పెటపెటలాడి బ్రద్దలైపోసాగింది. ఆయన తప్ప ఇంకెవరూ కనిపించకుండా పోయారు. ఆ విశ్వరూపుడు మాటలకు చూపులకు అందరానివాడై సంశోభించాడు.

తెభా-8-626-ఆ.
క పదంబు క్రింద నుర్వి పద్మము నంటి
కొన్న పంకలవము కొమరుఁ దాల్చె;
నొకటి మీఁదఁ దమ్మి కొదిఁగిన తేఁటినా
వెలసె మిన్ను నృప! త్రివిక్రమమున
.
టీక:- ఒక = ఒక; పదంబు = పాదము; క్రిందన్ = కింద; ఉర్వి = భూమండలము; పద్మమున్ = పద్మమునకు; అంటికొన్న = అంటుకొన్నట్టి; పంక = బురద; లవము = రేణువువలె; కొమరు = మనోజ్ఞతను; తాల్చెన్ = ధరించెను; ఒకటి = ఇంకొకదాని; మీదన్ = మీద; తమ్మి = పద్మమున; ఒదిగిన = వంగియున్న; తేటిన్ = తుమ్మెద; నా = వలె; వెలసె = ప్రకాశించెను; మిన్ను = ఆకాశము; నృపా = రాజా; త్రివిక్రమమున = విశ్వాకారమునందు.
భావము:- రాజా! విశ్వరూపంతో ఒకపాదం క్రింద ఉన్న భూమండలం పద్మానికి అంటుకున్న చిన్న బురద రేణువు వలె ఒప్పింది. ఇంకొక పాదం మీద ఉన్న ఆకాశం పద్మం మీద వ్రాలిన తుమ్మెదవలె ప్రకాశించింది.

తెభా-8-627-వ.
తత్సమయంబున .
టీక:- తత్ = ఆ; సమయంబునన్ = సమయములో.
భావము:- ఆసమయంలో. . .

తెభా-8-628-ఆ.
గము లెల్ల దాఁటి నిన త్రివిక్రము
రణనఖర చంద్ర చంద్రికలను
బొనుఁగు పడియె సత్యమున బ్రహ్మతేజంబు
దివసకరుని రుచుల దివియ బోలె
.
టీక:- జగములున్ = లోకములు; ఎల్లన్ = అన్నిటిని; దాటి = మించి; చనిన = పోయిన; త్రివిక్రమున్ = త్రివిక్రముని; చరణ = కాలి; నఖర = గోరులనెడి; చంద్ర = చంద్రుని; చంద్రికలను = వెన్నెలలను; పొనుగుపడియెన్ = వెలవెలబోయెను; సత్యమునన్ = సత్యలోకములోని; బ్రహ్మ = బ్రహ్మదేవుని; తేజంబున్ = తేజస్సు; దివసకరుని = సూర్యుని; రుచులన్ = కాంతులందు; దివియన్ = దివిటీ, దీపము; పోలెన్ = వలె.
భావము:- అన్నిలోకాలనూ దాటిపోయిన త్రివిక్రముని కాలిగోళ్ళకాంతికి సత్యలోకం లోని బ్రహ్మ తేజస్సు సూర్యునిముందు దివిటీ వలె వెలవెల పోయింది.

తెభా-8-629-సీ.
వబంధములఁ బాసి బ్రహ్మలోకంబునఁ-
గాపురంబులు చేయు నులు రాజు
లా మరీచ్యాదులు, నా సనందాదులు-
నా దివ్యయోగీంద్రు చట నెపుడు
మూర్తిమంతంబులై మ్రోయు పురాణ త-
ర్కామ్నాయ నియమేతిహాస ధర్మ
సంహితాదులు గురుజ్ఞానాగ్నినిర్దగ్ధ-
ర్ములై మఱియును లుగునట్టి

తెభా-8-629.1-తే.
వార లెల్లఁ జొచ్చి చ్చి సర్వాధిపు
నంఘ్రిఁ జూచి మ్రొక్కి ధిక భక్తిఁ
మ మనంబు లందుఁ లచు నిధానంబుఁ
గంటి మనుచు నేఁడు మంటి మనుచు
.
టీక:- భవ = సంసార; బంధములన్ = బంధములను; పాసి = వదలి; బ్రహ్మలోకమునన్ = సత్యలోకమునందు; కాపురంబులుచేయు = నివాసము ఉండెడి; ఘనులు = గొప్పవారు; రాజులు = రాజులు; ఆ = ఆ; మరీచి = మరీచి; ఆదులున్ = మున్నగువారు; ఆ = ఆ; సనంద = సనందుడు; ఆదులున్ = మున్నగువారు; ఆ = ఆ; దివ్యయోగీంద్రుల్ = దేవర్షులు; అచటన్ = అక్కడ; ఎపుడున్ = ఎప్పుడు; మూర్తిమంతంబులు = రూపుదాల్చినవి; ఐ = అయ్యి; మ్రోయు = మారుమోగెడి; పురాణ = పురాణములు {పురాణము - పురాతన చరిత్రము, 1సర్గ (సృష్టి) 2ప్రతిసర్గ (ప్రతిసృష్టి) 3(మను)వంశము 4మన్వంతరము 5వంశానుచరితము అను పంచలక్షణములు కలవి ఇవి 18}; తర్క = తర్కశాస్త్రములు {తర్కము - శాస్త్రములు (నియమన గ్రంథములు) ఆరింటిలోనిది, 1తర్కము 2వ్యాకరణము 3ధర్మము 4మీమాంస 5వైద్యము 6జ్యోతిషము}; ఆమ్నాయ = వేదములు; నియమ = నియమము {నియమము - అష్టాంగయోగములలోని శరీరముకంటె భిన్నమైన మృజ్జలాదులు సాధనములుగా కలిగి నిత్యముగా ఆచరింపదగిన ఒక యోగాంగము (ఇది దశవిధము - 1తపము 2సంతోషము 3ఆస్తికత్వము 4దానము 5భగవదర్చన 6వేదాంతశ్రవణము 7లజ్జ 8మతి 9జపము 10వ్రతము}; ఇతిహాస = ఇతిహాసములు {ఇతిహాసము - పూర్వము జరిగిన కథ, రామాయణ భారతములు}; ధర్మ = ఉపనిషత్తులు; సంహిత = వేదాంగములు; ఆదులున్ = మొదలగునవాని; గురు = గొప్ప; జ్ఞాన = జ్ఞానము యనెడి; అగ్నిన్ = అగ్నిలో; నిర్దగ్ధ = పూర్తిగా కాలిపోయిన; కర్ములు = కర్మవాసనలు కలవారు; ఐ = అయ్యి; మఱియును = అతిశయించి; కలుగునట్టి = ఉండెడి.
వారలు = వారు; ఎల్లన్ = అందరును; చొచ్చి = తోసుకు; వచ్చి = వచ్చి; సర్వాధిపున్ = విష్ణుని; అంఘ్రిన్ = పాదములను; చూచి = దర్శించుకొని; మ్రొక్కిరి = నమస్కరించిరి; అధిక = మిక్కిలి; భక్తిన్ = భక్తితోటి; తమ = వారియొక్క; మనంబులన్ = మనసుల; అందున్ = లో; తలచు = భావించెడి; నిధానంబున్ = పెన్నిధిని; కంటిమి = దర్శించితిమి; అనుచున్ = అనుకొనుచు; నేడున్ = ఇవాళ; మంటిమి = ధన్యులమైతిమి; అనుచున్ = అనుకొనుచు.
భావము:- సంసారబంధాలను త్రెంచుకొని మోక్షాన్ని పొంది బ్రహ్మ లోకంలో నివాసం చేస్తున్న మహారాజులు మరీచీ మొదలైన వారూ; సనందుడూ మొదలైన దేవర్షులూ; అక్కడ ఎప్పుడూ ఆకారం ధరించి మారుమ్రోగుతుండే పురాణాలూ, తర్కశాస్త్రాలూ, వేదాలూ, వేదాంగాలు, ఇతిహాసాలూ, ధర్మశాస్తాలూ; మహజ్ఞానులైన పుణ్యాత్ములూ మున్నగువారు అందరూ ఆ సర్వనియంత అయిన మహావిష్ణువు పాదాన్ని దర్శించారు. ఆ పాదానికి మిక్కిలి భక్తితో మ్రొక్కారు. మనస్సులలో “మేము భావిస్తున్న పెన్నిధీ కనిపించింది. ఈనాడు మేము ధన్యులం అయ్యాము.” అనుకున్నారు.

తెభా-8-630-మ.
పుట్టిల్లిదె పొమ్మటంచు నజుఁడుం న్నాభిపంకేరుహం
బు నిరీక్షించి నటించి యున్నత పదంబుం జూచి తత్పాదసే
ముం జేసెఁ గమండలూదకములం ల్లించి; తత్తోయముల్
వినువీథిం బ్రవహించె దేవనదినా విశ్వాత్ముకీర్తిప్రభన్
.
టీక:- తన = తన యొక్క; పుట్టిల్లు = జన్మస్థానము; ఇదె = ఇదె; పొమ్ము = సుమా; అంచున్ = అనుచు; అజుడు = బ్రహ్మదేవుడు; తత్ = అతని; నాభి = బొడ్డు; పంకేరుహంబున్ = తమ్మిని; నిరీక్షించి = చూసి; నటించి = మిక్కిలి సంతోషించి; ఉన్నత = ఉన్నతమైన; పదంబున్ = పాదములను; చూచి = చూసి; తత్ = అతని; పాద = పాదములను; సేచనమున్ = చిలకరించుట, జల్లుట, తడపుట {సేచన - నైష్ఠిక కర్మలలో మంత్రోదకాన్ని చిలకరించుట, చల్లుట, తడుపుట, ఇది ప్రోక్షణ, అవోక్షణ, అభ్యుక్షణ అని మూడు విధములు}; చేసెన్ = చేసెను; కమండలు = కమండలములోని; ఉదకములన్ = నీటిని; చల్లించి = చల్లి; తత్ = ఆ; తోయముల్ = నీరు; వినువీథిన్ = ఆకాశమునందు; ప్రవహించెన్ = పారినవి; దేవనదిన్ = ఆకాశగంగ; నా = అనబడుతు; విశ్వాత్మున్ = విష్ణుమూర్తి; కీర్తి = యశస్సు యనెడి; ప్రభన్ = కాంతులై.
భావము:- మహవిష్ణువు బొడ్డు తామరను చూసి “నా జన్మస్థానం ఇదే సుమా!” అనుకుంటూ అజుడు అయిన బ్రహ్మదేవుడు సంతోషించాడు. మహోన్నతమైన ఆ పాదాన్ని దర్శించుకున్నాడు. తన కమండల జలంతో స్వామి పాదాన్ని కడిగాడు. ఆ జల్లించిన జలధారలు కీర్తికాంతితో నిండి ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి.

తెభా-8-631-వ.
తత్సమయంబున .
టీక:- తత్ = ఆ; సమయంబునన్ = సమయమునందు.
భావము:- ఇంకా ఆ సమయంలో . . .

తెభా-8-632-సీ.
యోగమార్గంబున నూహించి బహువిధ-
పుష్పదామంబులఁ బూజ చేసి
దివ్యగంధంబులుఁ దెచ్చి సమర్పించి-
ధూపదీపములఁ దోడ్తోడ నిచ్చి
భూరి లాజాక్షతంబులు జల్లి ఫలములుఁ-
గానిక లిచ్చి రాములఁ బొగడి
శంఖాదిరవములు యఘోషములుఁ జేసి-
  "రుణాంబునిధి! త్రివిక్రమ!" యటంచు

తెభా-8-632.1-ఆ.
బ్రహ్మ మొదలు లోకపాలురుఁ గొనియాడి;
రెల్ల దిశల వనచరేశ్వరుండు
జాంబవంతుఁ డరిగి చాటె భేరిధ్వని
వెలయఁ జేసి విష్ణు విజయ మనుచు
.
టీక:- యోగమార్గంబునన్ = దివ్యదృష్టితో; ఊహించి = ఊహించి; బహు = అనేకమైన; విధ = రకములైన; పుష్పదామంబులన్ = పూలమాలలతో; పూజచేసి = పూజించి; దివ్య = మేలైన; గంధంబులున్ = సుగంధద్రవ్యములను; తెచ్చి = తీసుకొని వచ్చి; సమర్పించి = సమర్పించి; ధూపదీపములన్ = ధూపదీపములను; తోడ్తోడన్ = వెంటవెంటనే; ఇచ్చి = ఇచ్చి; భూరి = అధికముగా; లాజ = పేలాలు; అక్షతలున్ = అక్షింతలు; చల్లి = వేసి; ఫలములన్ = పండ్లు; కానికలు = కానుకలు; ఇచ్చి = సమర్పించి; రాగములన్ = రాగయుక్తముగా; పొగడి = కీర్తించి; శంఖ = శంఖములు; ఆది = మున్నగు; రవములు = శబ్దములు; జయ = జయజయయనెడి; ఘోషములున్ = నాదములు; చేసి = చేసి; కరుణాంబునిధి = దయాసాగరుడా; త్రివిక్రమ = త్రివిక్రముడా; అట = అని; అంచున్ = అనుచు.
బ్రహ్మ = బ్రహ్మదేవుడు; మొదలు = మొదలగు; లోకపాలురు = లోకపాలకులు; కొనియాడిరి = కీర్తించిరి; ఎల్లన్ = అన్ని; దిశలన్ = వైపులను; వనచర = భల్లూకము; ఈశ్వరుండు = రాజు; జాంబవంతుడు = జాంబవంతుడు; అరిగి = వెళ్ళి; చాటె = చాటింపువేసెను; భేరి = బాజాల; ధ్వని = చప్పుడు; వెలయన్ = ప్రసిద్ధముగ; చేసి = చేసి; విష్ణు = విష్ణుమూర్తి; విజయము = జయము జయము; అనుచు = అనుచు.
భావము:- యోగమార్గంలో ఊహించి బ్రహ్మదేవుడు మున్నగు లోకపాలకులుమహావిష్ణువును అనేక రకాలైన పూలమాలలతో పూజలు చేసారు; మేలైన సుగంధ ద్రవ్యాలను, ధూపదీపాలనూ సమర్పించారు; అనంతమైన పేలాలనూ అక్షతలనూ చల్లారు; ఫలాలూ కానుకలూ పెట్టారు; సంతోషంతో కీర్తించారు; శంఖాలు మున్నగువాటిని ఊదారు; జయజయ నాదాలు చేసారు; కరుణాసముద్రా! త్రివిక్రమదేవా! అని కొనియాడారు; భల్లూకరాజైన జాంబవంతుడు అన్ని దిక్కులమ్మటా ఢంకా మ్రోగిస్తూ విష్ణుదేవుని విజయాన్ని చాటాడు.

తెభా-8-633-క.
న్నిజగంబులఁ దానై
యున్నజగన్నాథుఁ జూడ నొగి భావింపం
న్నందక మన మందక
న్నుతులం జేసి రపుడు భ్యులు బలియున్
.
టీక:- అన్ని = సర్వ; జగంబులున్ = లోకములు; తాను = తానే; ఐ = అయ్యి; ఉన్న = ఉన్నట్టి; జగన్నాథున్ = విష్ణుని; చూడన్ = చూచుటకు; ఒగిన్ = సరిగా; భావింపన్ = భావించుటకు; కన్నందక = కంటికందక; మనమందక = మనసునకందక; సన్నుతులన్ = స్తోత్రములను; చేసిరి = చేసితిరి; అపుడు = అప్పుడు; సభ్యులు = సభలోనివారు; బలియున్ = బలిచక్రవర్తి.
భావము:- అన్నిలోకాలలోనూ వ్యాపించి నిండిన భగవంతుణ్ణి కంటితో చూడడానికి కానీ, మనసుతో ఊహించడానికి కానీ వీలుకాక బలిచక్రవర్తి, ఆ సభలోని వారూ చక్కటి స్తోత్రాలు చేసారు.