పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/జగనమోహిని కథ
జగనమోహిని కథ
←హరిహరసల్లాపాది | తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/) రచయిత: పోతన |
7వ మనువు వైవశ్వతుని చరిత్ర → |
తెభా-8-393-సీ.
ఒక యెలదోటఁలోనొకవీథి నొకనీడఁ-
గుచకుంభముల మీఁదఁ గొంగు దలఁగఁ
గబరికాబంధంబుఁ గంపింప నుదుటిపైఁ-
జికురజాలంబులు చిక్కుపడఁగ
ననుమానమై మధ్య మల్లాడఁ జెక్కులఁ-
గర్ణకుండల కాంతి గంతు లిడఁగ
నారోహభరమున నడుగులుఁ దడఁబడ-
దృగ్దీప్తి సంఘంబు దిశలఁ గప్ప
తెభా-8-393.1-తే.
వామకరమున జాఱిన వలువఁ బట్టి
కనక నూపుర యుగళంబు గల్లనంగఁ
గంకణంబుల ఝణఝణత్కార మెసఁగ
బంతిచే నాడు ప్రాయంపుటింతిఁ గనియె.
టీక:- ఒక = ఒక; ఎలదోట = ఉద్యానవనము; లోన్ = అందు; ఒక = ఒక; వీథిన్ = చెట్లవరుస; ఒక = ఒక; నీడన్ = చెట్టునీడయందు; కుచ = స్తనములనెడి; కుంభముల = కుండల; మీదన్ = పైన; కొంగున్ = పైట; తలగన్ = తొలగిపోగా; కబరికాబంధంబున్ = జుట్టుముడి; కంపింపన్ = చలించుచుండగ; నుదురు = ఫాలభాగము; పైన్ = మీద; చికుర = ముంగురుల; జాలంబులున్ = సమూహములు; చిక్కుపడగన్ = ముసురుకొనుచుండగ; అనుమానము = ఉందాయనిసందేహము; ఐ = కలిగెడిదై; మధ్యము = నడుము; అల్లాడన్ = కదులాడుతుండగా; చెక్కులన్ = చెక్కిళ్ళపై; కర్ణకుండల = చెవికుండలముల; కాంతి = ప్రకాశము; గంతులు = చిందులు; ఇడగన్ = వేయుచుండగ; ఆరోహ = స్త్రీలపిరుదుల; భరమునన్ = బరువువలన; అడుగులు = పాదాలు; తడబడన్ = తడబడుచుండగ; దృక్ = చూపుల; దీప్తి = కాంతుల; సంఘంబున్ = సమూహములు; దిశలన్ = సర్వదిశలను; కప్పన్ = పరచుకొనగా.
వామ = ఎడమ; కరమునన్ = చేతితో; జాఱిన = జారిపోయిన; వలువన్ = బట్టను; పట్టి = పట్టుకొని; కనక = బంగారు; నూపుర = కాలియందెలు; యుగళంబున్ = రెండును (2); గల్లు = గలగలమని; అనగన్ = అనుచుండ; కంకణంబులన్ = బంగారపుగాజుల; ఝణఝణత్ = ఝణ ఝణ; కారము = అనెడి శబ్దములు; ఎసగన్ = అతిశయించగా; బంతి = బంతి; చేన్ = తోటి; ఆడు = ఆడెడి; ప్రాయంపు = మంచివయసులోనున్న; ఇంతిన్ = స్త్రీని; కనియె = చూచెను.
భావము:- అలా మాయమయిన విష్ణువు ఎక్కడికి వెళ్ళాడా అని శంకరుడు చూస్తున్నాడు. అంతలో ఆయన ఎదుట ఒక ఉద్యానవనం; ఆ వనంలో ఒక చెట్ల వరుస; అందులో ఒక చెట్టు నీడలో ఒక ఎలప్రాయపు సుందరాంగి కనబడింది. ఆమె కుచకుంభముల మీద పైట తొలగింది. కొప్పుముడి వీడింది . నుదుట ముంగురులు ముసురుతున్నాయి. నడుము ఉందాలేదా అనే అనుమానానికి అవకాశమిస్తూ కదలాడుతోంది. చెవుల కమ్మల కాంతులు చెక్కిళ్ళపై చిందుతున్నాయి. పిరుదుల బరువుతో పాదాలు తడబడుతున్నాయి. తళుకు చూపులు దిక్కులలో పిక్కటిల్లుతున్నాయి. జారిపోయిన చీర కుచ్చెళ్ళను ఎడమచేతితో పట్టుకుంది. బంగారు కాలిఅందెల గలగలలూ చేతికంకణాల ఝణ ఝణాలూ అతిశయిస్తున్నాయి. అలా బంతితో ఆడుతూ ఉన్న ఆ యింతిని శంకరుడు చూసాడు.
తెభా-8-394-వ.
కని మున్ను మగువ మరగి సగమయిన మగవాఁ డమ్మగువ వయో రూప గుణ విలాసంబులు దన్ను నూరింపం గనుఱెప్ప వ్రేయక తప్పక చూచి మెత్తనయిన చిత్తంబున.
టీక:- కని = చూసి; మున్ను = ఇంతకుముందే; మగువన్ = స్త్రీని; మరగి = అలవాటుపడి; సగము = సగము; అయిన = ఐనట్టి; మగవాడు = పురుషుడు; ఆ = ఆ; మగువన్ = స్త్రీ యొక్క; వయస్ = ప్రాయము; రూప = అందము; గుణ = సుగుణములు; విలాసంబులున్ = వయ్యారములు; తన్ను = తనను; ఊరింపన్ = ఆకర్షించుచుండగ; కనుఱెప్పన్ = కంటిమీదిరెప్ప; వ్రేయకన్ = ఆర్పకుండగ; తప్పక = విడువకుండ; చూచి = చూసి; మెత్తను = మెత్తబడినది; అయిన = ఐనట్టి; చిత్తంబున = మనసునందు.
భావము:- ఇంతకు ముందే మగువ వలపుతో సగమైన మగవాడు కదా శివుడు. ఆజవరాలి ప్రాయమూ రూపమూ ఒయ్యారమూ విలాసమూ ఆయనను బాగా ఆకర్షించాయి. ఆయన కంటిరెప్పకూడా వేయకుండా మైమరచి ఆమెను చూడసాగాడు. ఆయన చిత్తం మెత్తబడింది.
తెభా-8-395-శా.
"ఈ కాంతాజనరత్న మెవ్వరిదొకో? యీ యాడురూపంబు ము
న్నే కల్పంబుల యందుఁ గాన; మజుఁ డీ యింతిన్ సృజింపంగఁ దా
లేకుం టెల్ల నిజంబు; వల్లభత నీ లీలావతిం జేరఁగా
నే కాంతుండుఁ గలండొ? క్రీడలకు నాకీ యింతి సిద్ధించునే?"
టీక:- ఈ = ఈ; కాంతా = స్త్రీ; జన = జనములలో; రత్నము = శ్రేష్ఠురాలు; ఎవ్వరిదోకో = ఎవరికి చెందినదో కదా; ఈ = ఇట్టి; ఆడు = స్త్రీ; రూపంబున్ = అందమును; మున్ను = ఇంతకుముందే; ఏ = ఏ; కల్పంబులన్ = కల్పముల; అందున్ = లోను; కానము = చూడలేదు; అజుడు = బ్రహ్మదేవుడు; ఈ = ఈ; ఇంతిన్ = స్త్రీని; సృజింపంగన్ = సృష్టించుటకు; తాన్ = తాను; లేకుంటన్ = చేయలేదనుట; ఎల్లన్ = పూర్తిగా; నిజంబున్ = సత్యము; వల్లభతన్ = ప్రీతితో; ఈ = ఈ; లీలావతిన్ = శృంగారవతిని; చేరంగాన్ = దరిచేరుటకు; ఏ = ఏ; కాంతుండు = చక్కనివాడు; కలండొ = ఉన్నాడోకదా; క్రీడల = లీలావిహారముల; కున్ = కోసము; నా = నా; కున్ = కు; ఈ = ఈ; ఇంతిన్ = స్త్రీ; సిద్ధించునే = దొరుకుతుందా.
భావము:- “ఎవరమ్మాయో ఈ అన్నులమిన్న. ఏ కల్పంలోనూ ఇప్పటి వరకూ ఇంతటి అందమైన స్త్రీ కనబడలేదు. ఈమెను బ్రహ్మ సృష్టించ లేదనడం తథ్యం. ఈ ఒయ్యారిని ఇల్లాలుగా పొందే అదృష్టవంతుడు ఎవడో? ఈ లావణ్యవతి లీలావిహారలకు నాకు లభిస్తుందా?” అని అనుకున్నాడు శివుడు.
తెభా-8-396-వ.
అని మఱియుం జెఱకువిలుతుని మెఱవడిఁ దరపిన నెఱబిరుదు వెఱంగుపడం దెఱవ దుఱిమికొనిన తుఱుము బిగిముడి వదలి కదలి భుజముల మెడల నొడల నదరి చెదరిన కురులు నొసలి మృగమద తిలకంపుటసలు మసల, విసవిస నగుమొగము మెఱుంగులు దశదిశలం బసలు కొలుపఁ, జిఱునగవు మెఱయ, నునుఁ జెమటం దడంబడి పులకరములు గులకరములు గొన, హృదయానందకందం బగు కందుకంబు గరారవిందంబునం దమర్చి, యక్కునం జేర్చి, చెక్కున హత్తించి, చుబుకంబు మోపి, చూచుకంబులం గదియించి, నఖంబుల మీటుచు, మెల్లమెల్లన గెల్లాడు కరకమలంబులం గనక మణి వలయంబులు ఝణఝణ యనం గుచకలశంబు లొండొంటి నొరయ, నెడమఁ గుడిం దడంబడఁ గ్రమ్మన నెగురఁ జిమ్ముచు, నెగురఁ జిమ్మి తనకుఁదానె కొన్ని చిన్నపన్నిదంబులు చేసికొని బడుగు నడుము బెడఁకి వడవడ వడంక నఱితి సరులుఁ గలయంబడఁ దిరుగుచు, తిరుఁగు నెడఁ బెనఁకువలుగొనఁ జెవుల తొడవుల రుచులు గటముల నటనములు సలుపఁ బవిరి తిరిగి యొడియుచు, నొడిచి కెలంకులన్ జడియుచు, జడిసి జడను పడక వలువ నెలవు వదలి దిగంబడం, గటిస్థలంబునఁ గాంచీ కనకమణి కింకిణులు మొరయఁ జరణకటకమ్ములు గల్లుగల్లుమనం, గరకంకణమణి గణములు మెఱయ మితితప్పిన మోహాతిరేకం బుప్పొంగ వెనుకొని యుఱుకి పట్టుచుఁ, బట్టి పుడమిం బడవైచి, పాటు వెంటన మింటికెగసి గెంటక కరంబునం గరంబు దిరంబయి పలుమఱు నెగయ నడుచుచు, నెగయు నెడం దిగంబడు తఱిని నీలంపు మెఱుంగు నిగ్గుసోగ పగ్గంబుల వలలువైచి రాఁ దిగిచిన పగిది వెనుకొనంగ, విలోకన జాలంబులు నిగిడించుచు, మగిడించుచుఁ గరలాఘవంబున నొకటి, పది, నూఱు, వేయి చేసి నేర్పులు వాటించుచు, నరుణ చరణకమల రుచుల నుదయ శిఖరి శిఖర తరణి కరణి చేయుచు, ముఖచంద్ర చంద్రికలఁ జంద్రమండలంబులు గావించుచు, నెడనెడ నురోజ దుర్గ నిర్గత చేలాంచలంబు జక్క నొత్తుచుం, గపోలఫల కాలోల ఘర్మ జలబిందు బృందంబుల నఖాంకురంబుల నోసరించుచు, అరుణాధరబింబఫల భ్రాంత సమాగత రాజకీరంబులం జోపుచు, ముఖసరోజ పరిమళాసక్త మత్తమధుపంబుల నివారించుచు, మందగమనాభ్యాస కుతూహలాయత్త మరాళ యుగ్మంబులకుం దలంగుచు, విలాస వీక్షణా నందిత మయూర మిథునంబులకు నెడగలుగుచుఁ, బొదరిండ్ల యీఱములకుం బోక మలంగుచు, కరకిసలయాస్వాద కాముక కలకంఠ దంపతులకు దూరమగుచు, దీఁగ యుయ్యెలల నూగుఁచు, మాధవీ మండపంబు లెక్కుచుఁ, గుసుమరేణు పటలంబుల గుబ్బళ్ళు ప్రాకుచు మకరందస్యంద బిందుబృందంబు నుత్తరించుచుఁ, గృతక శైలంబుల నారోహించుచుఁ, బల్లవ పీఠంబులం బథిశ్రమంబు పుచ్చుచు, లతాసౌధభాగంబులఁ బొడచూపుచు, నున్నత కేతకీ స్తంభంబుల నొరగుచుఁ, బుష్పదళఖచిత వాతాయనంబులం దొంగిచూచుచుఁ, గమలకాండపాలికల నాలంబించుచుఁ, జంపక గేహళీ మధ్యంబుల నిలువంబడుచుఁ, గదళికాపత్ర కవాటంబుల నుద్ఘాటించుచుఁ, బరాగ నిర్మిత సాలభంజికా నివహంబుల నాదరించుచు, మణికుట్టిమంబుల మురియుచుఁ, జంద్రకాంత వేదికల నొలయుచు, రత్నపంజర శారికానివహంబులకుం జదువులు చెప్పుచుఁ, గోరిన క్రియంజూచుచు చూచిన క్రియ మెచ్చుచు, మెచ్చిన క్రియ వెఱఁగుపడుచు, వెఱఁగుపడిన క్రియ మఱచుచు, మఱవక యేకాంతం బగు నవ్వనాంతంబున ననంత విభ్రమంబుల జగన్మోహినియై విహరించుచు నున్న సమయంబున.
టీక:- అని = అని; మఱియున్ = ఇంకను; చెఱకువిలుతుని = మన్మథుని; మెఱవడిన్ = ఉద్రేకముతో; తరపిన = హరించిన; నెఱ = నిండు; బిఱుదు = నిబ్బరము; వెఱగుపడన్ = నీరైపోగా; తెఱవ = స్త్రీ; తుఱిమికొనిని = ముడుచుకొన్నట్టి; తుఱుము = కొప్పుగ; బిగి = బిగించిన; ముడి = ముడి; వదలి = విడిపోయి; కదలి = జారిపోయి; భుజముల = భుజములపైన; మెడలన్ = మెడపైన; ఒడలన్ = దేహముపైన; అదరి = పడి; చెదరిన = చెదిరిపోయిన; కురులు = శిరోజములు; నొసలి = నుదుటి; మృగమద = కస్తూరి; తిలకంపు = తిలకము; అసలు = పంకము, బొట్టు; మసలన్ = కరిగిపోవ; విసవిసన్ = ప్రసరించిన; నగు = నవ్వు; మొగము = మొహము యొక్క; మెఱుంగులు = మెరుపులు; దశదిశలన్ = పదిదిక్కులను; పసలుకొలుపన్ = ముసురుకొనగ; చిఱునగవు = చిరునవ్వు; మెఱయన్ = మెరుస్తుండగ; నునున్ = లేత; చెమటన్ = చెమటతో; తడబడి = తొట్రుపడి; పులకరములు = గగుర్పాటులు; కులరకములుగొన = గుంపుగూడగ; హృదయ = మనసునకు; ఆనందక = సంతోషింపజేసెడి; అందంబగు = అందమైన; కందుకంబున్ = బంతిని; కర = చేతులు యనెడి; అరవిందంబునన్ = పద్మము; అందున్ = లో; అమర్చి = అందుకొని; అక్కునన్ = ఎదకు; చేర్చి = హత్తుకొని; చెక్కున = చెక్కిళ్ళపై; హత్తించి = చేర్చుకొని; చుబుకంబున్ = గడ్డమును; మోపి = ఆన్చి; చూచుకంబులన్ = చనుమొనలపై; కదియించి = ఆనించికొని; నఖంబులన్ = గోర్లతో; మీటుచున్ = ఆడించుచు; మెల్లమెల్లన = అతిమెల్లగా; కెల్లాడు = కదలెడు; కర = చేతులు యనెడి; కమలంబులన్ = పద్మములచేత; కనక = బంగారపు; మణివలయములు = రత్నాలగాజులు; ఝణఝణ = ఝణ ఝణ; అనన్ = అనుచుండ; కుచ = స్తనములు యనెడి; కలశంబులు = కుంభములు; ఒండొంటి = ఒకదానినోకటి; ఒరయన్ = ఒరుసుకొనుచుండగ; ఎడమ = ఎడమపక్క; కుడిన్ = కుడుపక్కలకు; తడంబడన్ = తుళ్ళిపడునట్లుగ; క్రమ్మనన్ = క్రమముగా; ఎగురన్ = ఎగుర; చిమ్ముచున్ = వేయుచు; ఎగురన్ = ఎగుర; చిమ్మి = వేసి; తన = తన; కున్ = కు; తానె = తానే; కొన్ని = కొన్ని; చిన్న = చిన్నిచిన్ని; పన్నిదంబులున్ = పందెములను; చేసికొని = పెట్టుకొని; బడుగు = సన్నని; నడుము = నడుము; బెడకి = విలసించి; వడవడ = వడవడ యని; వడంకన్ = వణకునట్లుగ; అఱితిసరులు = కంఠహారములు; కలయన్ = చిక్కు; పడన్ = పడునట్లుగ; తిరుగుచున్ = తిరుగాడుచు; తిరుగున్ = తిరిగెడి; ఎడన్ = సమయమునందు; పెనకువలుగొనన్ = మెలికలుతిరుగుచుండగ; చెవుల = కర్ణ; తొడవుల = ఆభరణముల; రుచులు = కాంతులు; కటముల = చెక్కిళ్ళపై; నటనములు = చిందులు; సలుపన్ = ఆడగా; బవిరి = గుండ్రముగా; తిరిగి = తిరుగుచు; ఒడియుచున్ = పట్టుకొనుచు; ఒడిచి = పట్టుకొని; కెలంకులన్ = పక్కలకు; జడియుచున్ = కదులుచు; జడిసి = కదిలి; జడనుపడక = ఆగక; వలువ = పైబట్ట; నెలవు = స్థాన; వదలి = భ్రంశమై; దిగంబడన్ = జారిపొగా; కటిస్థలంబునన్ = మొలప్రాంతపు; కాంచీ = వడ్డాణపు; కనక = బంగారు; మణి = రత్నాల; కింకిణులు = చిరుగంటలు; మొరయన్ = మోగగా; చరణ = కాలి; కటకమ్ములు = అందెలు; గల్లుగల్లుమనగా = గల్లుగల్లుమనగా; కర = చేతుల; కంకణ = గాజుల; మణి = రత్నాల; గణములు = సమూహములు; మెఱయన్ = మెరుస్తుండగా; మితితప్పిన = మితిమీరిన; మోహా = మోహముయొక్క; అతిరేకంబునన్ = అతిశయము; ఉప్పొంగన్ = విజృంభించగా; వెనుకొని = వెనువెంట; ఉఱికి = పరుగెట్టి; పట్టుచున్ = పట్టుకొనుచు; పట్టి = పట్టుకొని; పుడమిన్ = నేలపై; పడవైచి = పడేసి; పాటు = పడిగెంతుటతో; వెంటన = వెనుకనే; మింటి = ఆకాశమున; కున్ = కు; ఎగసి = ఎగిరి; గెంటక = విడువక; కరంబునన్ = చేతిలో; కరంబు = చేయి; తిరంబయి = కలిపుంచి; పలు = అనేక; మఱున్ = సార్లు; ఎగయన్ = ఎగుర; నడచుచున్ = వేయుచు; ఎగయున్ = ఎగిరెడి; ఎడన్ = సమయమునందు; దిగంబడు = కిందకుబడెడి; తఱిన్ = సమయమునందు; నీలంపు = నల్లని; మెఱంగు = మెరుస్తున్న; నిగ్గు = కాంతుల; సోగ = పొడవైన; పగ్గంబుల = తాళ్లుగల; వలలు = వలలను; వైచి = వేసి; రాదిగిచిన = లాగుతున్న; పగిదిన్ = విధముగా; వెనుకొనంగ = వెంటాడెడి; విలోకన = చూపుల; జాలంబులు = వలలను; నిగిడించుచున్ = సారించుచు; మగిడించుచు = తిప్పుచు; కర = చేతుల; లాఘవంబునన్ = నేర్పులతో; ఒకటి = ఒకటి (1); పది = పది (10); నూఱు = వంద (100); వేయి = వెయ్యి (1,000); చేసి = లెక్కించుచు; నేర్పులు = నేర్పరితనములు; వాటించుచున్ = వాటముగజూపుచు; అరుణ = ఎఱ్ఱని; చరణ = చేతులు యనెడి; కమల = పద్మముల; రుచులను = కాంతులతో; ఉదయ = తూర్పు; శిఖరి = కొండ; శిఖర = కొనగల; తరణి = సూర్యబింబము; కరణి = వలె; చేయుచున్ = స్ఫుంరింపజేయుచు; ముఖ = మోము యనెడి; చంద్ర = చంద్రుని; చంద్రికలన్ = వెన్నెలలతో; చంద్ర = చంద్ర; మండలంబులున్ = బింబములను; కావించుచున్ = సృజించుచు; ఎడనెడన్ = అప్పుడప్పుడు; ఉరోజ = కుచముల; దుర్గ = మిట్టపల్లములనుండి; నిర్గత = జారిపోయిన; చేలాంచలంబు = పైటను; చక్కనొత్తుచున్ = సవరించుకొనుచు; కపోలఫలక = చెక్కిళ్ళపై; ఆలోల = చిందుతున్; ఘర్మ = చెమట; జల = నీటి; బిందు = చుక్కల; బృందంబులన్ = సమూహములను; నఖ = గోళ్ళ; అంకురంబులన్ = కొనలతో; ఓసరించుచు = తొలగించుచు; అరుణ = ఎఱ్ఱని; అధర = పెదవులు యనెడి; బింబ = దొండ; ఫల = పండ్లనెడి; భ్రాంత = భ్రమతో; సమాగత = వచ్చిన; రాజకీరంబులన్ = రామచిలుకలను; చోపుచున్ = తోలుచు; ముఖ = మోము యనెడి; సరోజ = పద్మముల; పరిమళ = సువాసనలచే; ఆసక్త = ఆశగొన్న; మత్త = మత్తెక్కిన; మధుపంబులన్ = తుమ్మెదలను; నివారించుచున్ = అదలించుచు; మంద = మెల్లగా; గమన = నడచుటను; అభ్యాస = నేర్చుకొనెడి; కుతూహల = కుతూహలముతో; ఆయత్త = వచ్చిన; మరాళ = రాయంచల; యుగ్మంబుల్ = జంటల (2); కున్ = కు; తలంగుచున్ = తప్పించుచు; విలాస = సొగసైన; వీక్షణ = చూపులచేత; ఆనందిత = ముచ్చటపడిన; మయూర = నెమళ్ళ; మిథునంబుల్ = జంటల (2); కున్ = కు; ఎడన్ = దూరముగ; కలుగుచున్ = అగుచు; పొదరిండ్లన్ = పొదరిళ్ళలో; ఈఱముల్ = జొంపముల; కున్ = కు; పోక = దరిచేరకుండ; మలంగుచున్ = తప్పుకొనుచు; కర = చేతులు యనెడి; కిసలయ = చిగుళ్ళను; ఆస్వాద = తినుటకు; కాముక = మనసుపడెడి; కలకంఠ = కోయిలల; దంపతుల్ = జంటల (2); కున్ = కు; దూరము = దూరముగ; అగుచున్ = జరుగుచు; తీగ = తీవల; ఉయ్యెలలన్ = ఉయ్యాలలపై; ఊగుచున్ = ఊగుతు; మాధవీ = పూలగురువింద; మండపంబులన్ = గుబుర్లను; ఎక్కుచున్ = ఎక్కుతు; కుసుమ = పూల; రేణు = పుప్పొడిరేణువుల; పటలంబుల = సమూహములందు; గుబ్బళ్ళు = గుట్టలపై; ప్రాకుచున్ = జరుగుచు; మకరంద = పూతేనె; స్యందన = కారిన; బిందు = చుక్కల; బృందంబును = సమూహములను; ఉత్తరించుచు = దాటుతు; కృతక = క్రీడా; శైలంబులన్ = పర్వతములను; ఆరోహించుచు = ఎక్కుతు; పల్లవ = చిగురుటాకుల; పీఠంబులన్ = ఆసనములపై; పథిశ్రమంబున్ = అలసటలను; పుచ్చుచున్ = తీర్చుకొనుచు; లతాసౌధ = పొదరిండ్ల; భాగంబులన్ = లోపల; పొడచూపుచు = కనబడుతు; ఉన్నత = ఎత్తైన; కేతకీ = మొగలి; స్తంభంబులన్ = బోదెలకు; ఒరగుచు = జార్లాపడుతు; పుష్ప = పూల; దళ = రేకల; ఖచిత = కూర్చిన; వాతాయనంబులన్ = కిటికీలలోకి; తొంగిచూచుచున్ = తొంగిచూస్తూ; కమల = తామర; కాండ = తూడుల; పాలికలన్ = చిన్నముక్కలను; ఆలంబించుచున్ = ఊదుతూ; చంపక = సంపెంగ; గేహళీ = పొదల; మధ్యంబులన్ = లోపల; నిలువంబడుచున్ = నిలబడుతు; కదళికా = అరటి; పత్ర = ఆకుల; కవాటంబులన్ = తలుపులను; ఉద్ఘాటించుచున్ = చింపుతూ; పరాగ = పుప్పొడిరేణువుల; నిర్మిత = చేసిన; సాలభంజికా = బొమ్మల; నివహంబులన్ = సమూహములను; అదరించుచున్ = బుజ్జగించుచు; మణి = రత్నాల; కుట్టిమంబులన్ = తిన్నెలపై; మురియుచున్ = మురిసిపోతూ; చంద్రకాంత = చంద్రకాంతాశిలల; వేదికలన్ = వేదికలపైకి; ఒలయుచున్ = చేరుతూ; రత్న = రత్నములుపొదిగిన; పంజర = పంజరములలోని; శారికా = గోరువంకల; నివహంబుల్ = సమూహముల; కున్ = కు; చదువులు = మాటలు; చెప్పుచున్ = నేర్పుచు; కోరిన = ఇష్టము వచ్చిన; క్రియన్ = విధముగా; చూచుచున్ = చూస్తూ; చూచిన = చూసిన; క్రియన్ = విధముగా; మెచ్చుచున్ = మెచ్చుకొనుచు; మెచ్చిన = మెచ్చుకొన్న; క్రియన్ = విధముగా; వెఱగుపడుచు = అచ్చెరువొందుచు; వెఱగుపడిన = అచ్చెరువొందిన; క్రియన్ = విధముగా; మఱచుచు = పరవశించిపోతూ; మఱవ = ప్రమాదముపడక; ఏకాంతంబు = నిర్మానుష్యంబు; అగు = ఐన; ఆ = ఆ; వన = తోట; అంతంబునన్ = లోపల; అనంత = అంతులేని; విభ్రమంబులన్ = విలాసములతో; జగన్మోహిని = జగన్మోహినీ యాకృతి; ఐ = అయ్యి; విహరించుచున్న = సంచరించుచున్న; సమయంబునన్ = సమయమునందు.
భావము:- అంతలో మన్మథుని జయించి నంతటి పరమశివుని నిబ్బరం సైతం నీరైపోయేలాగ, మోహిని ముడుచుకున్న కొప్పుముడి వీడింది; వెంట్రుకలు భుజాలు మీదా, మెడ మీదా చెదరి పడి చలిస్తున్నాయి; ఆమె నుదుటిమీద కస్తూరి బొట్టు కరిగిపోతోంది; ముద్దులు మూటగట్టే ముఖకాంతులు నలుదెసలా ప్రసరిస్తున్నాయి; చిరునవ్వులు చిందుతున్నాయి; చెమటతో తడిసి తడబడుతూ తనువున పులకలు మొలకెత్తుతున్నాయి; మనసుకు ఇంపునింపే బంతిని అందమైన హస్తంతో అందుకుంటోంది; దానిని రొమ్ముపై ఉంచుకుంటోంది; చెక్కిలిపై చేర్చుకుంటోంది; గడ్డానికి తాకించుకుంటోంది; చనుమొనలపై ఆనించుకుంటోంది; గోళ్ళతో మీటుతోంది; సొగసైన చేతులలో బంతిని కుడిఎడమలకు తృళ్ళిపడేలా ఒయ్యారంగా ఎగురవేస్తోంది; బంతి ఎగరేస్తుంటే మెల్లమెల్లగా కదలాడే మేలిమి కంకణాలు ఝణ ఝణ ధ్వనిస్తున్నాయి; కుచకుంభాలు ఒకదానితో ఒకటి రాసుకుంటున్నాయి; తనకుతానే చిన్నచిన్న పందాలు వేసుకుంటోంది; సన్నని నడుం వణికేట్లు మెడలోని హారాలు చిక్కుపడేటట్లు తిరుగాడుతోంది; అలా తిరిగేటప్పుడు చెవులకుండలాల కాంతులు చెక్కిళ్ళపై చిందులాడుతున్నాయి; ఆమె గుండ్రంగా తిరుగుతూ బంతిని పట్టుకుని ప్రక్కలకు కదులుతోంది; అప్పుడు ఆమె పైటచెరగు జారిపోతోంది; ఒడ్డాణంలోని బంగారుచిరుగంటలు మ్రోగుతున్నాయి; కాలిఅందెలు ఘల్లుఘల్లుమంటున్నాయి; కరకంకణాలు రత్నాలు మెరస్తున్నాయి; ఆమె బంతి వెనువెంట పరుగెత్తి పట్టుకొంటూ పట్టుకుని నేలపై చరుస్తూ అది పైకెగిరినప్పుడు రెండుచేతులూ చేర్చి చాలా మార్లు పట్టుకుంటోంది; బంతి ఎగిరేటప్పుడూ పడేటప్పుడూ పొడవైన వలలు వేసి లాగుతున్నట్లు తన సోగచూపులు వ్యాపింపజేస్తోంది; బంతిని కొడుతూ ఒకటి నుండి పది, నూరు అంటూ వరుసగా ఎంతో నేర్పుతో లెక్కపెడుతోంది; ఎఱ్ఱతామరలవంటి తన పాదాల అరుణకాంతులతో తూర్పుకొండ మీది సూర్య బింబాన్ని స్ఫురింపజేస్తోంది; నెమ్మోము చంద్రుని వెన్నెల వెలుగులతో చంద్రమండలాలను సృజిస్తోంది; అప్పుడప్పుడు కుచలకలశాల మిట్టపల్లాల నుండి జారిపోయిన పైట సవరించుకుంటోంది; చెక్కిళ్ళపై చిందే చెమటబొట్లను కొనగోళ్ళతో చిమ్ముతోంది; ఎఱ్ఱని పెదవిని దొండపండుగా భ్రమించి వచ్చిన రాచిలుకలను తోలుతోంది; పద్మంవంటి ముఖంలోని సువాసనకోసం మూగిన కొదమ తుమ్మెదలను అదలిస్తోంది; అందమైన మందగమనం నేర్చుకోవడానికి వచ్చిన రాయంచ జంటలను గెంటుతోంది; సొగసైన చూపులకోసం ముచ్చటపడి వచ్చిన నెమళ్ళ జంటలకు దూరంగా వెళ్తోంది; పొదరిండ్ల దరిచేరకుండా చిగుళ్ళవంటి చేతులకు మనసుపడి వచ్చిన కోయిల జంటలకు దూరమవుతోంది; తీగఉయ్యాల మీద ఊగుతోంది; పూలగురివింద గుబుర్లపై ఎక్కుతోంది; పుప్పొడి గుట్టలను దాటుతోంది; మకరందాల మడుగులు గడుస్తోంది; క్రీడాపర్వతాలపై విహరిస్తోంది; చిగురుటాకుల ఆసనాలపై అలసట తీర్చుకుంటోంది; తీగ ఇండ్లలో దాగుడుమూతలు ఆడుతోంది; మొగలిపొదలకు ఆనుకంటోంది; పూరేకుల గవాక్షాలలో తొంగిచూస్తోంది; మెట్టతామర మొక్కలను తాకుతోంది; సంపెంగ పొదల గడపలలో నిలబడుతోంది; అరటి ఆకులద్వారాలు తెరుస్తోంది; కమ్మని పుప్పొడి బొమ్మలను బుజ్జగిస్తోంది; రత్నాలబాటపై విహరిస్తోంది; చంద్రకాంత వేదికలను సమీపిస్తోంది; రత్న పంజరాలలోని గోరువంకలకు మాటలు నేర్పుతోంది; ఇష్టం వచ్చిన దానిని చూస్తోంది; చూచిన దానిని మెచ్చుకుంటోంది; మెచ్చుకొన్నదానిపై అచ్చెరువు కనబరుస్తోంది; మైమరుస్తోంది; మైమరపిస్తోంది. అలా ఆ వాల్గంటి ఒంటరిగా ఆ తోటలో అంతులేని అందచందాలతో జగన్మోహిని అయి సంచరించసాగింది.
తెభా-8-397-ఆ.
వాలుఁగంటి వాఁడి వాలారుఁజూపుల
శూలి ధైర్యమెల్లఁ గోలుపోయి
తఱలి యెఱుకలేక మఱచె గుణంబుల
నాలి మఱచె నిజగణాలి మఱచె.
టీక:- వాలుగంటి = అందగత్తె; వాడి = నిశితమైన; వాలారు = వగలారెడి; చూపులన్ = చూపులతో; శూలి = శంకరుని; ధైర్యమున్ = నిబ్బరమును; ఎల్ల = అంతను; కోలుపోయి = కోల్పోయి; తఱలి = సంభ్రమించి; ఎఱుక = తెలివి, గురుతు; లేక = లేకుండగ; మఱచెన్ = మరచిపోయి; గుణంబులన్ = స్వగుణములను; ఆలిన్ = భార్యను; మఱచెన్ = మరచిపోయెను; నిజ = తన; గణ = ప్రమథగణముల; అలిన్ = సమూహమును; మఱచెన్ = విస్మరించెను.
భావము:- అందమైన ఆ వగలాడి వాడి చూపులకు శివుడు నిగ్రహాన్ని నిబ్బరాన్ని పూర్తిగా కోల్పోయాడు. తన్నుతానే మరచిపోయాడు. అంతే కాదు తన ఇల్లాలినీ, ప్రమథగణాలనూ విస్మరించాడు.
తెభా-8-398-వ.
అప్పుడు
టీక:- అప్పుడు = అప్పుడు.
భావము:- అలా శంకరుడు మైమరచి ఆమెని చూస్తున్న ఆ సమయంలో . . .
తెభా-8-399-ఆ.
ఎగురవైచి పట్ట నెడలేమి చే దప్పి
వ్రాలు బంతి గొనఁగ వచ్చునెడను
బడతి వలువ వీడి పడియె మారుతహతిఁ
జంద్రధరుని మనము సంచలింప.
టీక:- ఎగుర = ఎగుర; వైచి = వేసి; పట్టన్ = పట్టుకొనుటకు; ఎడన్ = వీలు; లేమి = కాకపోవుటచేత; చేన్ = చేయి; తప్పి = జారి; వ్రాలు = పడిపోతున్న; బంతిన్ = బంతిని; కొనంగన్ = తీసుకొనుటకు; వచ్చు = వస్తున్న; ఎడను = సమయమునందు; పడతి = స్త్రీ యొక్క; వలువ = బట్ట; వీడి = విడిపోయి, జారి; పడియెన్ = పడిపోయెను; మారుత = గాలి; హతిన్ = తాకిడికి; చంద్రధరుని = పరమశివుని; మనము = మనస్సు; సంచలింపన్ = చలించిపోగా.
భావము:- మోహిని బంతిని ఎగురవేసింది. పట్టుకుందాం అంటే వీలు చిక్కలేదు. దాంతో ఆ బంతి జారి పడిపోయింది. దానిని తీసుకోడానికి వస్తుండగా గాలి తాకిడికి చీర ముడి ఊడిపోయింది. అప్పుడు శివుని మనసు చలించింది.
తెభా-8-400-మ.
రుచిరాపాంగిని వస్త్రబంధనపరన్ రోమాంచ విభ్రాజితం
గుచభారానమితం గరద్వయపుటీ గూఢీకృతాంగిం జల
త్కచ బంధం గని మన్మథాతురత నాకంపించి శంభుండు ల
జ్జ చలింపం దనకాంత చూడఁ గదిసెం జంద్రాస్య కేల్దమ్మికిన్.
టీక:- రుచిరాపాంగిని = అందగత్తె; వస్త్ర = బట్టను; బంధన = కట్టుకొనుటయందు; పరన్ = నిమగ్నమైన యామెను; రోమాంచన్ = మైపులకరింపుగలామె; విభ్రాజితన్ = శృంగారరూపిని; కుచ = స్తనముల యొక్క; భార = బరువులచేత; ఆనమితన్ = వంగినామె; కర = చేతుల; ద్వయ = రెండు (2); పుటీ = దొప్పలతోను; గూఢీకృత = దాచుకొన్న; అంగిన్ = స్తనములుగలామెను; చలత్ = చలించిన; కచబంధన్ = కొప్పుముడిగలామెను; కని = చూసి; మన్మథ = కామ; ఆతురతన్ = ఆవేశముచేత; ఆకంపించి = చలించిపోయి; శంభుండు = పరమశివుడు; లజ్జన్ = సిగ్గుతో; చలింపన్ = చలించిపోవునట్లు; తన = తన యొక్క; కాంత = భార్య; చూడన్ = చూచుచుండగ; కదిసెన్ = చేరెను; చంద్రాస్య = సుందరిని; కేలు = చేయి యనెడి; తమ్మి = పద్మమున; కిన్ = కు.
భావము:- కడగంటి కాంతులు తళుక్కుమని మెరస్తున్న మోహిని, చీర సరిగా కట్టుకోడానికి ప్రయత్నించింది. ఆమె మేను పులకించింది. స్తనభారంతో ఆమె వంగింది. రెండు చేతులతో ఆమె వక్షః స్ధలాన్ని కప్పుకున్నది. ఆమె కొప్పుముడి వీడి వ్రేలాడుతున్నది. ఆ స్ధితిలో ఆమెను చూసి కామావేశంతో శివుడు చలించి పోయాడు. అతడు సిగ్గు పడేటట్లు సతీదేవి చూస్తున్నది. అయినా ఆయన చంద్రుని వంటి మోము గల ఆ మోహిని చేయి పట్టుకోడానికి వెళ్ళాడు.
తెభా-8-401-ఆ.
పదము చేరవచ్చు ఫాలక్షుఁ బొడగని
చీర వీడిపడిన సిగ్గుతోడ
మగువ నగుచుఁ దరుల మాటున డాఁగెను
వేల్పుఱేఁడు నబల వెంటఁ బడియె.
టీక:- పదమున్ = దగ్గరకు; చేరన్ = చేరుటకై; వచ్చు = వస్తున్న; ఫాలాక్షున్ = శంకరుని; పొడగని = కాంచి; చీర = బట్ట; వీడి = జారి; పడిన = పడిపోయిన; సిగ్గు = సిగ్గు; తోడన్ = తోటి; మగువ = స్త్రీ; నగుచున్ = నవ్వుతూ; తరుల = చెట్ల; మాటునన్ = చాటునకు; డాగెను = దాగుకొనెను; వేల్పుఱేడున్ = శంకరుడు; వెంటబడియె = వెనుతగిలెను.
భావము:- మోహిని సమీపిస్తున్న శివుని అడుగు దూరంలో చూసింది. చీర ఊడిన సిగ్గుతో నవ్వుతూ చెట్ల చాటున దాగింది. ముక్కంటి ఆ వాల్కంటి వెంటబడ్డాడు.
తెభా-8-402-మ.
ప్రబలోద్యత్కరిణిం గరీంద్రుఁడు రమింపన్ వచ్చు లీలన్ శివుం
"డబలా పోకుము పోకుమీ" యనుచు డాయం బాఱి కెంగేలఁ ద
త్కబరీ బంధము పట్టి సంభ్రమముతోఁ గౌగిళ్ళ నోలార్చె నం
త బహిః ప్రక్రియ నెట్టకేనిఁ గదియం దద్బాహునిర్ముక్త యై.
టీక:- ప్రబల = మిక్కిలి; ఉద్యత్ = ఈడేరిన; కరిణిన్ = ఆడ ఏనుగును; కరి = గజ; ఇంద్రుడు = రాజు; రమింపన్ = క్రీడించుటకు; వచ్చు = చేరవచ్చెడి; లీలన్ = విధముగా; శివుండు = శంకరుడు; అబలా = సుందరీ; పోకుము = పోవద్దు; పోకుమీ = పోవద్దు; అనుచున్ = అంటూ; డాయం = దగ్గరకు; పాఱి = పరిగెట్టి; కెంగేలన్ = ఎఱ్ఱని అరచేతితో; తత్ = ఆమె; కబరీబంధమున్ = జడను; పట్టి = పట్టుకొని; సంభ్రమము = పరవశత్వము; తోన్ = తోటి; కౌగిళ్ళన్ = కౌగిట్లో; ఓలార్చెన్ = ఓలలాడించెను; అంతన్ = అంతట; బహిః = బయటపడెడి; ప్రక్రియన్ = ప్రయత్నముతో; ఎట్టకేని = చిట్టచివరకు; కదియన్ = పట్టుకొన్న; తత్ = అతని; బాహు = చేతులనుండి; నిర్ముక్త = విడిపించుకొన్నామె; ఐ = అయ్యి.
భావము:- బాగా ఈడేరిన ఆడఏనుగుతో క్రీడించటానికి వెన్నాడిన మదించిన మగ ఏనుగు వలె, పరమేశ్వరుడు పరుగెత్తి మోహినిని సమీపించాడు. అబలా “పోవద్దు పోవద్దు” అంటూ ఆమె జడ పట్టుకున్నాడు. వేగిరపాటుతో కౌగిలించుకున్నాడు. పరవశత్వంతో రతిక్రీడకు పూనుకోబోగా, ఆమె అతని పట్టు వదిలించుకుంది.
తెభా-8-403-సీ.
వీడి వెన్నున నాడు వేణీభరంబుతో-
జఘన భారాగత శ్రాంతితోడ
మాయావధూటి యై మఱలిచూచుచుఁ బాఱు-
విష్ణు నద్భుతకర్ము వెంటఁదగిలి
యీశాను మరల జయించె మరుం డనఁ-
గరిణి వెన్కను కరి కరణిఁ దాల్చి
కొండలు నేఱులుఁ గొలఁకులు వనములు-
దాఁటి శంభుఁడు చనం దన్మహాత్ము
తెభా-8-403.1-తే.
నిర్మలామోఘ వీర్యంబు నేలమీఁదఁ
బడిన చోటెల్ల వెండియుఁ బైడి యయ్యె
ధరణి వీర్యంబు పడఁ దన్నుఁదా నెఱింగి
దేవ మాయా జడత్వంబు దెలిసె హరుఁడు.
టీక:- వీడి = ఊడిపోయి; వెన్నునన్ = వీపుమీద; ఆడు = కదులుచున్న; వేణీభరంబు = జడ; తోన్ = తోటి; జఘన = పిరుదుల; భార = బరువులచేత; ఆగత = కలిగిన; శ్రాంతి = అలసటల; తోడన్ = తోటి; మాయా = మాయా; వధూటి = సుందరి; ఐ = అయ్యి; మఱలి = వెనుతిరిగి; చూచుచున్ = చూస్తూ; పాఱు = పరుగెడుతున్న; విష్ణున్ = హరిని; అద్భుతకర్మున్ = హరిని; వెంటతగిలి = వెంటబడి; ఈశాను = పరమేశ్వరుని; మరల = ఇంకొకసారి; జయించెన్ = గెలిచెను; మరుండు = మన్మథుడు; అనన్ = అన్నట్లుగ; కరిణి = ఆడ ఏనుగు; వెన్కను = వెనుక; కరి = మగ ఏనుగు; కరణిన్ = విధమును; దాల్చి = పట్టి; కొండలున్ = కొండలు; ఏఱులున్ = కాలువలు; కొలకులున్ = కొలనులు; వనములు = తోటలు; దాటి = దాటి; శంభుడు = శంకరుడు; చనన్ = వెళ్లుతుండగ; తత్ = ఆ; మహాత్ము = మహాత్ముని.
నిర్మల = స్వచ్ఛమైన; వీర్యంబు = రేతస్సు; నేల = భూమి; మీదన్ = పైన; పడిన = పడినట్టి; చోటులు = స్థలములు; ఎల్లన్ = అంతయును; వెండియున్ = వెండి; పైడియున్ = బంగారము; అయ్యెన్ = ఏర్పడినది; ధరణిన్ = భూమిమీద; వీర్యంబు = రేతస్సు; పడన్ = పడగా; తన్ను = తనను; తానె = తనే; ఎఱింగి = తెలుసుకొని; దేవ = దివ్యమైన; మాయా = మాయ యొక్క; జడత్వంబున్ = మైమరపును; తెలిసె = తెలుసుకొనెను; హరుడు = శంకరుడు.
భావము:- “మన్మథుడు తిరిగి శివుని జయించాడా” అనట్లు ఆడఏనుగును వెంటాడే మగఏనుగు వలె శివుడు మోహినీరూపంలోవున్న విష్ణువు వెంటబడ్డాడు. ఆ మాయామానిని జడ వీడి వీపుపై వ్రేలాడుతున్నది. ఆమె పిరుదుల బరువుతో అలసిసొలసి వెనుతిరిగి చూస్తూ పరిగెడుతున్నది. ఆమె వెంట శివుడు కొండలూ, నదులూ, సరస్సులు, అడవులు దాటి వెళ్ళసాగాడు. అమోఘమైన ఆమహాత్ముని వీర్యం నేలపై పడింది. అది పడిన ప్రదేశమంతా వెండిగా, బంగారంగా రూపుదాల్చింది. ఆతరువాత శివుడు తన్ను తాను తెలుసుకున్నాడు. పరమాత్మునిమాయ వల్ల కలిగిన మైమరపును గమనించుకున్నాడు.
తెభా-8-404-క.
జగదాత్మకుఁడగు శంభుఁడు
మగిడెను హరి నెఱిఁగి తనదు మాహాత్మ్యమునన్
విగతత్రపుఁడై నిలిచెను
మగువతనం బుడిగి హరియు మగవాఁ డయ్యెన్.
టీక:- జగత్ = భువనములే; ఆత్మకుడు = తానైనవాడు; అగు = అయిన; శంభుడు = శంకరుడు; మగిడెను = వెనుదిరిగెను; హరిన్ = విష్ణుమూర్తిని; ఎఱిగి = తెలిసికొని; తనదు = తన యొక్క; మహాత్మ్యమునన్ = గొప్పదనమువలన; విగత = పోయిన; త్రపుడు = లజ్జలనువిడిచినవాడు; ఐ = అయ్యి; నిలిచెను = నిలబడెను; మగువతనంబున్ = స్త్రీరూపమును; ఉడిగి = విడిచి; హరియున్ = విష్ణువుకూడ; మగవాడు = పురుషుడు; అయ్యెన్ = అయ్యెను.
భావము:- భువన స్వరూపుడు అయిన శివుడు తన మహిమాతిశయంవల్ల విష్ణు మాయను తెలుసుకుని, వెనుతిరిగాడు. విష్ణువు సిగ్గుతోపాటు, స్త్రీ రూపాన్ని విడిచిపెట్టి మగవాడిగా మారిపోయాడు.
తెభా-8-405-ఆ.
కాము గెలువవచ్చుఁ గాలారి గావచ్చు
మృత్యుజయముఁ గలిగి మెఱయవచ్చు
నాఁడువారి చూపుటంపఱ గెలువంగ
వశము గాదు త్రిపురవైరి కైన.
టీక:- కామున్ = మన్మథుని; గెలువవచ్చున్ = జయించవచ్చును; కాలున్ = యముని; అరిన్ = ధిక్కరించినవాడు; కావచ్చున్ = అవ్వవచ్చును; మృత్యు = మరణముపై; జయము = గెలుపు; కలిగి = సాధించి; మెఱయవచ్చున్ = ప్రకాశించవచ్చును; ఆడువారి = స్త్రీల; చూపుల = చూపులనడి; అంపఱన్ = బాణములను; గెలువంగన్ = జయించుట; వశము = సాధ్యము; కాదు = కాదు; త్రిపురవైరి = పరమశివుని; కైనన్ = అయినప్పటికిని.
భావము:- మన్మథుడిని ఓడించి కామాన్ని జయించవచ్చు. యముని ధిక్కరించి, మృత్యుంజయుడై ప్రకాశించవచ్చు. కానీ, ఆడవారి వాలుచూపుల వాడిబాణాలను గెలవడం త్రిపురాంతకుడైన ఆ మహాశివుడికైనా సాధ్యంకాదు.
తెభా-8-406-వ.
ఇట్లు పురుషాకారంబు వహించిన హరి హరున కిట్లనియె.
టీక:- ఇట్లు = ఈ విధముగ; పురుషాకారంబున్ = పురుషరూపము; వహించిన = ధరించినట్టి; హరి = విష్ణువు; హరున్ = శంకరుని; కిన్ = కి; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- అంత మోహినీరూపాన్ని చాలించిన విష్ణువు శివునితో ఇలా అన్నాడు. . .
తెభా-8-407-సీ.
"నిఖిలదేవోత్తమ! నీ వొక్కరుఁడు దక్క-
నెవ్వఁడు నా మాయ నెఱుఁగ నేర్చు?
మానిని యైన నా మాయచే మునుఁగక-
ధృతి మోహితుండవై తెలిసి తీవు
కాలరూపంబునఁ గాలంబుతోడ నా-
యందును నీ మాయ యధివసించు
నీ మాయ నన్ను జయింప నేరదు నిజ-
మకృతాత్ములకు నెల్ల ననుపలభ్య
తెభా-8-407.1-తే.
మిపుడు నీ నిష్ఠ పెంపున నెఱిఁగి' తనుచు
సత్కరించిన సఖ్యంబు చాల నెఱిపి
దక్షతనయ గణంబులుఁ దన్నుఁ గొలువ
భవుఁడు విచ్చేసెఁ దగ నిజ భవనమునకు.
టీక:- నిఖిల = సమస్తమైన; దేవ = దేవుళ్ళలోను; ఉత్తమ = ఉత్తముడా; నీవు = నీవు; ఒక్కరుండున్ = ఒక్కడివి; తక్కన్ = తప్పించి; ఎవ్వడున్ = ఎవడు; నా = నా యొక్క; మాయన్ = మాయను; ఎఱుగన్ = తెలిసికొన; నేర్చున్ = కలుగును, లేరు; మానిని = స్త్రీరూపిని; ఐన = అయినట్టి; నా = నా యొక్క; మాయ = మాయ; చేన్ = వలన; మునుగక = మోసపోకుండగ; ధృతిన్ = ధైర్యముగా; మోహితుండవు = మోహింపబడినవాడవు; ఐ = అయ్యి; తెలిసితి = తెలిసికొంటివి; ఈవు = నీవు; కాల = కాలము యొక్క; రూపంబునన్ = రూపముతో; కాలంబు = కాలము; తోడన్ = తోటి; నా = నా; అందును = లో; నీ = నీ యొక్క; మాయ = మాయ; అధివసించున్ = చేరియుండును; నీ = నీ యొక్క; మాయ = మాయ; నన్నున్ = నన్ను; జయింపన్ = గెలువ; నేరదు = చాలదు; నిజము = ఇది సత్యము; అకృతాత్ముల్ = అల్పజ్ఞుల; కున్ = కు; ఎల్లన్ = అందరకు; ఉపలభ్యము = అందనిది; ఇపుడు = ఇప్పుడు;
నీ = నీ యొక్క; నిష్ఠన్ = నేర్పు యొక్క; పెంపునన్ = అధిక్యముచేత; ఎఱిగితి = తెలుసుకొంటివి; అనుచున్ = అనుచు; సత్కరించిన = గౌరవింపగా; సఖ్యంబున్ = స్నేహమును; చాలన్ = అధికముగా; నెఱిపి = సాగించి; దక్షతనయ = పార్వతీదేవి; గణంబులున్ = ప్రమథగణములు; తన్నున్ = తనను; కొలువన్ = సేవించుతుండగ; భవుడు = పరమేశ్వరుడు; విచ్చేసెన్ = వెళ్లెను; తగన్ = చక్కగ; నిజ = తన; భవనమున్ = నివాసమున; కు = కు.
భావము:- “ఓ మహాదేవా! నీవు ఒక్కడవి తప్ప మరింకెవడూ నామాయను తెలుసుకోలేడు. మోహినిగా మారిన నామాయలో పడి మోసపోకుండా ధైర్యంతో పొరపాటు తెలుసుకొని మేలుకొన్నావు. కాలంతో కలిసి నీమాయ నాలో చేరింది. ఈమాయ నన్ను గెలువజాలదు. అల్పజ్ఞులు తెలుసుకోలేని నామాయను నీవు ఇప్పుడు నేర్పుతో తెలుసుకున్నావు.” అంటూ విష్ణువు శివుడిని గౌరవించాడు. విష్ణువు పట్ల తన స్నేహాన్ని ప్రకటించి, పరమేశ్వరుడు సతీదేవితో ప్రమథగణాల సేవలు అందుకుంటూ తన నివాసానికి వెళ్ళాడు.
తెభా-8-408-శా.
పారావారము ద్రచ్చుచో గిరి సముద్యద్భారమై కచ్ఛ పా
కారుండైన రమేశువర్తనము నాకర్ణింపఁ గీర్తింప సం
సారాంభోనిధిలో మునుంగు కుజనుల్ సంశ్రేయముం బొంది వి
స్తారోదార సుఖంబుఁ జెందుదురు తథ్యం బెంతయున్ భూవరా!
టీక:- పారావారమున్ = సముద్రమును; ద్రచ్చుచోన్ = చిలుకునప్పుడు; గిరి = పర్వతమునకు; సమ = సమానమైన; ఉద్యత్ = ఎత్తిన; భారము = బరువుగలవాడు; ఐ = అయ్యి; కచ్ఛప = కూర్మ; ఆకారుండు = అవతారుండు; ఐన = అయిన; రమేశున్ = హరి యొక్క; వర్తనమున్ = చరిత్రను; ఆకర్ణింపన్ = వినినను; కీర్తింపన్ = పాడినను; సంసార = సంసారము యనెడి; అంభోనిధి = సముద్రము; లోన్ = అందు; మునుంగు = ములిగిపోయెడి; కుడనుల్ = అల్పులైన జనులు; సంశ్రేయంబున్ = గొప్పపుణ్యమును; పొంది = పొంది; విస్తార = విశేషమైన; ఉదార = అధికమైన; సుఖంబున్ = సుఖములను; చెందుదురు = పొందెదరు; తథ్యంబు = సందేహములేనిది; ఎంతయున్ = ఎంతైనను; భూవర = రాజా.
భావము:- ఓ పరీక్షిన్మహారాజా! సంసార సముద్రంలో మునిగిపోయే అల్పులైన జనులు సైతం, సముద్రాన్ని చిలికేటప్పుడు సముద్రమధ్యన మునిగిపోతున్న మందరపర్వతాన్ని మోయడం కోసం కూర్మావతారాన్ని ధరించిన విష్ణువు చరిత్రను విన్నా పాడినా గొప్ప పుణ్యాన్నీ విశేషమైన సుఖాన్నీ చూరగొంటారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు.
తెభా-8-409-మ.
ఎలమిన్ దైత్యుల నాఁడురూపమున మోహింపించి పీయూషముం
జలితాపన్నులకున్ సురోత్తములకుం జక్కన్ విభాగించి ని
ర్మల రేఖన్ విలసిల్లు శ్రీవిభునిఁ దన్మాయావధూరూపముం
దలఁతున్ మ్రొక్కుదు నాత్మలోన దురితధ్వాంతార్క రూపంబుగన్."
టీక:- ఎలమిన్ = ఉపాయముగా; దైత్యులన్ = రాక్షసులను; ఆడు = స్త్రీ; రూపమునన్ = రూపముతో; మోహింపించి = మాయజెందించి; పీయూషమున్ = అమృతమును; చలిత = అడలుచున్నట్టి; ఆపన్నుల్ = ఆపదలచెందినవారల; కున్ = కు; సుర = దేవతా; ఉత్తముల్ = శ్రేష్ఠుల; కున్ = కు; చక్కన్ = చక్కగ; విభాగించి = పంచిపెట్టి; నిర్మల = స్వచ్ఛమైన; రేఖన్ = తేజస్సుతో; విలసిల్లు = విరాజిల్లెడి; శ్రీవిభుని = విష్ణుని; తత్ = అతని; మాయా = మాయ; వధూ = మోహినీ; రూపమున్ = అవతారమును; తలతున్ = స్మరించెదను; మ్రొక్కుదున్ = కొలిచెదను; ఆత్మ = మనసు; లోనన్ = అందు; దురిత = పాపము యనెడి; ధ్వాంత = అంధకారమునకు; అర్క = సూర్యుని; రూపంబుగన్ = స్వరూపముగా.
భావము:- శ్రీమన్నారాయముడు జగన్మోహినిగా స్త్రీ రూపం ధరించి ఉపాయంగా రాక్షసులను మోహింపజేసి ఆపదలలో హడలిపోతున్న దేవతలకు అమృతాన్ని పంచిపెట్టి దివ్య తేజస్సుతో విరాజిల్లాడు. ఆ విష్ణుమూర్తినీ ఆయన మోహినీరూపాన్నీ తలచితలచి మ్రొక్కుతాను. అది పాపపు చీకట్లను రూపుమాపే సూర్యుని రూపంగా భావిస్తాను.”
తెభా-8-410-వ.
అని చెప్పి శుకుం డిట్లనియె.
టీక:- అని = అని; చెప్పి = చెప్పి; శుకుండు = శుకుడు; ఇట్లు = ఇలా; అనియె = పలికెను.
భావము:- అని చెప్పి శుకుడు ఇంకా ఇలా అన్నాడు.