పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/గురు పాఠీన విహరణము

వికీసోర్స్ నుండి

గురుపాఠీనవిహరణము

తెలుగు భాగవతము (మూస:పోతన తెలుగు భాగవతము/అష్ఠమ స్కంధము/)
రచయిత: పోతన


తెభా-8-719-వ.
ఇట్లు లక్ష యోజనాయతం బయిన పాఠీనంబై విశ్వంభరుండు జలధి చొచ్చి .
టీక:- ఇట్లు = ఈ విధముగ; లక్ష = లక్ష (1,00,000); యోజన = యోజనముల; ఆయతంబు = పొడవుకలది; అయిన = ఐన; పాఠీనంబు = కొరమీను, చేప; ఐ = రూపుడై; విశ్వంభరుండు = విష్ణుమూర్తి {విశ్వంభరుడు - విశ్వమునుభరించువాడు, విష్ణువు}; జలధిన్ = సముద్రమునందు {జలధి - జలమునకునిధి, కడలి}; చొచ్చి = ప్రవేశించి.
భావము:- అలా భగవంతుడు శ్రీమహావిష్ణువు లక్ష ఆమడల పొడవైన మత్స్య రూపం ధరించాడు. సముద్రంలో ప్రవేశించి . .. . .

తెభా-8-720-సీ.
కమాటు జలజంతుయూథంబులోఁగూడు-
నొకమాటు దరులకు నుఱికి వచ్చు;
నొకమాటు మింటికి నుదరి యుల్లంఘించు-
నొకమాటు లోపల నొదిఁగి యుండు;
నొకమాటు వారాశి నొడలు ముంపమిఁ జూచు-
నొకమాటు బ్రహ్మాండ మొరయఁ దలఁచు;
నొకమాటు ఝషకోటి నొడిసి యాహారించు-
నొకమాటు జలముల నుమిసి వైచు;

తెభా-8-720.1-తే.
ఱులు సారించు; మీసాలుఁ డలు కొలుపుఁ;
బొడలు మెఱయించుఁ; గన్నులఁ పొలప మార్చు;
నొడలు జళిపించుఁ దళతళ లొలయ మీన
వేషి పెన్నీట నిగమ గవేషి యగుచు
.
టీక:- ఒకమాటు = ఒకసారి; జలజంతు = జలచరముల; యూథంబు = సమూహము; లోన్ = అందు; కూడు = కలియును; ఒకమాటు = ఒకసారి; తరుల్ = గట్లవైపునకు; ఉఱికి = దుమికి; వచ్చున్ = వచ్చును; ఒకమాటు = ఒకసారి; మింటి = ఆకాశమున; కిన్ = కు; ఉదరి = ఎగిరి; ఉల్లెఘించున్ = దూకును; ఒకమాటు = ఒకమారు; లోపలన్ = సముద్రమునందు; ఒదిగి = దాగి; ఉండున్ = ఉండును; ఒకమాటు = ఒకసారి; వారాశిన్ = సముద్రమున {వారాశి - వార (నీటి) రాశి, కడలి}; ఒడలు = దేహము; ముంపమిన్ = తేలి ఉండునట్లు; చూచున్ = ప్రయత్నించును; ఒకమాటు = ఒకసారి; బ్రహ్మాండమున్ = బ్రహ్మాండమును; ఒరయన్ = ఒరుసుకోవలెనని; తలచున్ = ప్రయత్నించును; ఒకమాటు = ఒకసారి; ఝష = చేపల; కోటిన్ = సమూహమును; ఒడిసి = పీల్చి; ఆహారించున్ = మింగివేయును; ఒకమాటు = ఒకసారి; జలములు = నీటిని; ఉమిసి = ఉమ్మి; వైచున్ = వేయును.
గఱులున్ = రెక్కలను; సారించున్ = చాచును; మీసలున్ = మీసాలను; కడలుకొలుపున్ = కదలించును; పొడలున్ = మేనిమచ్చలను; మెఱయించున్ = మెరిపించును; కన్నులన్ = కళ్ళ; పొలపమార్పు = కాంతులుమార్చును; ఒడలున్ = దేహమును; జళిపించున్ = జలధరింపజేయుచు; తళతళలు = తళతళలు; ఒలయన్ = ఒలుకుతుండగ; మీన = చేప; వేషి = రూపుధరించినవాడు; పెన్నీటన్ = సముద్రమునందు; నిగమ = వేదములను; గవేషి = వెదకువాడు; అగుచున్ = అగుచు.
భావము:- అతడు తళతళలాడే పెనురూపంతో ప్రళయజలాలలో వేదాలకోసం వెదకటానికి పూనుకున్నాడు. ఒకసారి జలచరాలతో కలిసి తిరుగుతాడు. ఒకసారి వేగంగా గట్లవైపు దుమికి వస్తాడు. ఒకసారి ఆకాశానికి ఎగురుతాడు. ఒకసారి నీళ్ళ లోపల దాగి ఉంటాడు.ఒకసారి సమద్రంలో మునిగి తేలుతాడు. ఒకసారి బ్రహ్మండాన్ని ఒరసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి చేపల గుంపును పట్టి మ్రింగుతాడు. ఒకసారి నీళ్ళను పీల్చి వెలుపలికి చిమ్ముతాడు. ఆవిధంగా ఆ మహామత్స్య మూర్తి రెక్కలు చాస్తూ, మీసాలు కదిలిస్తూ, మేని పొడలు మెరపిస్తూ, కన్నుల కాంతులు ప్రసరిస్తూ, ఒడలు విరుచుకుంటూ, తళతళలాడుతూ సాగరగర్భంలో విహరించాడు.