Jump to content

నారాయణీయము/ప్రథమ స్కంధము/2వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
ప్రథమ స్కంధము

2వ దశకము - భగవద్రూప వర్ణనం

2-1-శ్లో.
సూర్యస్పర్ధి కిరీట మూర్థ్వతిలకప్రోద్భాసిఫాలాంతరం
కారుణ్యాకులనేత్రమార్థ్రహసితోల్లాసం సునాసాపుటం।
గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్కౌస్తుభం
త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే||
1 భావము:
శిరసున సూర్యకాంతిని మించిన కాంతివంతమయిన కిరీటము కలవాడు, ఫాలభాగమున ప్రకాశించు తిలకము కలవాడు, కన్నులలో దయ, ఆర్ద్రత కలవాడు, చక్కని నాసికాపుటములు కలవాడు, మకరకుండలముల కాంతితో ప్రకాశించు కపోలములు కలవాడు, ధరహాసభాసుర వదనము కలవాడు, కంఠమున ఉజ్వలమైన కౌస్తుభమణి కలవాడు, వక్షస్థలమున ప్రకాశించు వనమాల, హారములు, శ్రీవత్సము కలవాడు అయిన ఆ శ్రీకృష్ణుని అర్చించెదను.

2-2-శ్లో.
కేయూరాంగదకంకణోత్తమమహారత్నాంగుళీయాంకిత
శ్రీమద్భాహుచతుష్కసంగతగదాశంఖారిపంకేరుహం।
కాంచిత్కాంచనకాంచిలాంచితలసత్పీతాంబరాలంబినీం
ఆలంబే విమలాంబుజద్యుతిపదాం మూర్తిం తవార్తిచ్ఛిదం||
2 భావము:
కేయూరములు అంగదములతో అలంకరించబడిన భుజములు; ముంజేతి కంకణములు, రత్నాంగుళీయములు మొదలగు ఆభరణములతో అలంకరించబడిన హస్తములు; శంఖము, చక్రము, గద, పద్మములను ధరించిన బాహువులు; పసిడి వర్ణముతో మెరిసే పీతాంబరమును ధరించిన దేహము, పద్మములవలె ప్రకాశించుచున్న పాదద్వయము కల నీ రూపము భక్తులను అనుగ్రహించి, వారి ఆర్తిని తీరుస్తుంది. అటువ౦టి నీ మూర్తిని నేను ప్రార్థించెదను.

2-3-శ్లో.
యత్త్రైలోక్యమహీయసో౾పి మహితం సమ్మోహనం మోహనాత్
కాంతం కాంతినిధానతో౾పి మధురం మాధుర్యధుర్యాదపి।
సౌందర్యోత్రతో౾పి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతో౾
ప్యాశ్చర్యం భువనే న కస్య కుతుకం పుష్ణాతి విష్ణో! విభో!
3 భావము:
ప్రభూ! శ్రీమహావిష్ణూ! భక్తులకు అత్యంత ఆశ్చర్యమును కలిగించు నీ రూపము మిక్కిలి మహిమాన్వితమైనది, త్రిజగన్మోహనమైనది, మధురాతిమధురమైనది, అత్యంత కాంతివంతమైనది, భువనైక సౌందర్యముతో అతిశయిల్లునది. ఆ నీ రూపము మిక్కిలి ఉత్సుకత కలిగిస్తుంది.

2-4-శ్లో.
తత్ తాదృజ్మధురాత్మకం, తవ వపుః సంప్రాప్య సంపన్మయీ
సా దేవీ పరమౌత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్యపి।
తేనాస్యా బత కష్టమచ్యుత! విభో! త్వద్రూపమానోజ్ఞక-
ప్రేమస్థైర్యమయాదచాపలబలాచ్చాపల్యవార్తోదభూత్||
4 భావము:
అచ్యుతా! విభూ! సిరి సంపదలకు నెలవైన లక్ష్మీదేవి నిన్ను చేరి, నీ వక్షస్థలమున స్థిరనివాసము ఏర్పరుచుకొనినది. మధురమైన నీ రూపమును విడిచి ఉండలేక భక్తులవద్ద చిరకాలము నిలవలేక పోవుచున్నది. నీ సౌందర్యమునకు వశమై నిన్ను వదలలేని ఉత్సుకతతో నీ భక్తులవద్ద అస్థిరురాలు అగుట వలన లక్ష్మీదేవి చంచల అను అపవాదును సైతము పొందినది.

2-5-శ్లో.
లక్ష్మీస్తావకరమణీయకహృతైవేయం పరేష్వస్థిరే-
త్యస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే!
యే త్వద్ధ్యానగుణానుకీర్తనరసాసక్తా హి భక్తా జనాః
తేష్వేషా వసతి స్థిరైవ దయితప్రస్తావదత్తాదరా||
5 భావము:
నీ రూపమును విడిచి ఉండలేని లక్ష్మీదేవి నీ వక్షస్థలమున స్దిరముగా ఉన్నప్పటికి, భక్తులు నిన్ను ఎక్కడ ధ్యానము చేయుదురో? ఎక్కడ నీ గుణములు కీర్తించబడుతూ ఉంటాయో? ఎక్కడ నీ కీర్తనలు గానము ఆస్వాదించుటలో భక్తులు ఆసక్తితో ఉంటారో? అక్కడ నీ ప్రస్తావనలొని ప్రశంసను విని లక్ష్మీదేవి వారిని అనుగ్రహించి వారివద్ద శాశ్వతముగా ఉండగలదని ప్రమాణ పూర్తిగా చెప్పబడుచున్నది.

2-6-శ్లో.
ఏవంభూతమనోజ్ఞతా నవసుధానిష్యందసందోహనం
త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతామ్।
సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచ యత్యంగకం
వ్యాసించత్యపి. శీతబాష్పవిసరైరానందమూర్ఛోద్భవైః||
6 భావము:
సౌందర్యామృతమయమైన నీ రూపము బహు మనోజ్ఞమైనది. నిత్య నూతనమైనది. అట్టి నీ స్వరూప ఆకర్షణతో ప్రేరేపి౦పబడిన భక్తుల చిత్తములు పరతత్వ జ్ఞానానందము పొందుతాయి. వారి శరీరములకు గగుర్పాటు కలిగి, ఆనందభాష్పములతో పులకితులవుతారు.

2-7-శ్లో.
ఏవంభూతతయా హి భక్య్తభిహితో యోగస్త యోగద్వయాత్
కర్మజ్ఞానమయాద్ భృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే!
సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా
భక్తిర్నిశ్శ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభ!
7 భావము:
రమావల్లభా! జ్ఞానయోగము, కర్మయోగము రెండింటికంటెను భక్తియోగము ఉత్తమమైనదని యోగీశ్వరులచేత చెప్పబడినది. నీ రూపములోని సౌందర్యరసమునకు ఆకర్షితులైన సకల జీవులకు ఏమాత్రము శ్రమ లేకనే సులభముగా భక్తి లభించుచున్నది

2-8-శ్లో.
నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిధం
తద్దూరేత్యఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః।
తత్వ్తవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో!
త్వత్ ప్రేమాత్మకభక్తిరేవ సతతం సాద్వీయసీ శ్రేయసీ||
8 భావము:
కర్మఫలము పట్ల ఆశలేక ఆచరణ చేయుట శ్రేష్ఠమైనది. అయినప్పటికి పెక్కు సంవత్సరములు అట్టి సత్కర్మలు చేసినా అవి భగవదర్పితం కానిచో మోక్షమును ప్రసాదించవు. జ్ఞానయోగము దుర్లభమైనది. ఉపనిషత్తులు చిత్తమునకు సులభముగా అర్థంకానివి. జ్ఞానమార్గములో మోక్షము పొందుట మిక్కిలి కష్టతరమైనది. విభూ! నిన్ను స్మరించినంతమాత్రముననే సాక్షాత్కరించి శ్రేయమును కలిగించు భక్తియోగము ఎల్లప్పుడు ఉత్తమమైనది.

2-9-శ్లో.
అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మలా
బోధే భక్తిపథే౾థవా౾ప్యుచితతామాయాంతి కిం తావతా!
క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్బ్రహ్మాఖ్యమన్యే పునః
చిత్తార్ధ్రత్వమృతే విచింత్య బహుభిః సిధ్యంతి జన్మాంతరైః||
9 భావము:
భక్తి రహితముగా కర్మలను ఆచరించి ముక్తిని పొందుట మిక్కిలి కష్టము. కర్మ యోగమును ఆచరించు వారిలో కొందరు క్రమముగా చిత్తశుద్ధిని పొంది నిర్మలమైన మనస్సుతో భక్తిమార్గమును అనుసరించి కర్మ ఫలములను భగవదర్పితం చేసి ముక్తిని పొందుతారు. కొందరు జ్ఞానయోగమును అనుసరించి ఏ మాత్రము ఆర్ద్రత పొందలేని చిత్తములతో భగవంతుని గురించి తర్క విచారణలో నిమగ్నులై అనేక జన్మల అనంతరం ముక్తిని పొందుతారు.

2-10-శ్లో.
త్వద్భక్తిస్తు కథారసామృతఝరీనిర్మజ్జనేన. స్వయం
సిద్ధ్యంతీ విమలప్రబోధపదవీమక్లేశతస్తన్వతీ।
సద్యః సిద్ధికరీ జయత్యయి విభో! సైవాస్తు మే త్వత్పద-
ప్రేమప్రౌఢిరసార్థ్రతా ద్రుతతరం వాతాలయాధీశ్వర!||
10 భావము:
విభూ! నీ కథలు భక్తిరసము నిండిన అమృతప్రవాహములై భక్తులను ఆనందభరితులను చేస్తాయి. నీ భక్తులు స్వయంసిద్ధిని పొంది నిర్మలమైన బ్రహ్మజ్ఞానమును సులభముగా తెలుసుకొని తత్క్షణమే మోక్షమును పొందుతారు. ఓ గురవాయూరుపురాధీశా! నీ రూపమును ఆరాధించి నీ చరణములను ఆర్ధ్రతతో సేవించు భక్తిని నాకు సత్వరమే ప్రసాదించు.
-x-

Lalitha53 (చర్చ) 14:59, 7 మార్చి 2018 (UTC)