నారాయణీయము/ప్రథమ స్కంధము/3వ దశకము

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search

ప్రథమ స్కంధము

3వ దశకము - భక్తి స్వరూప వర్ణనము- భక్తికై ప్రార్థన

3-1-శ్లో.
పఠంతో, నామాని ప్రమదభరసింధౌ నిపతితాః
స్మరంతో రూపం తే వరద! కథయంతో గుణకథాః
చరంతో యే భక్తాస్త్వయి ఖలు రమంతే పరమమూన్
అహం ధన్వాన్ మన్యే సమధిగతసర్వాభిలషితాన్||
1వ భావము
వరదా! సదా మనస్సులో నీ రూపమునే నిలుపుకుని నీ కథలనే వింటూ నీ గుణాలను కీర్తిస్తూ, నిరంతరమూ నీ నామమునే జపిస్తూ, ఆనందసాగరములో మునిగి, తన్మయత్వము చెందు భక్తులకు, నీ యందు కలిగిన భక్తి వలననే సకల అభీష్టములు నెరవేరుతాయి. అట్టి భక్తులు ధన్యులు.

3-2-శ్లో.
గదక్లిష్టం కష్టం తవ చరణసేవారసభరే౾
ప్యనాసక్తం చిత్తం భవతి బత విష్ణో! కురుదయామ్।
భవత్పాదాంభోజస్మరణరసికో నామానివహన్
అహంగాయం గాయం కుహచన వివత్స్యామి విజనే||
2వ భావము
. ప్రభూ! నాకు కలిగిన రోగము వలన నీ చరణసేవ చేయుటలో కలుగు ఆనందరసమును అనుభవించలేక పోవుచున్నాను. నా చిత్తమునకు ఆసక్తి లేకున్నది. శ్రీహరీ! నా రోగమును హరించి నన్ను అనుగ్రహించు. ప్రశాంత చిత్తముతో నీ పాదపద్మములను స్మరించుచూ, నీ నామములను గానము చేయుచూ ఆనందమును పొందుతాను.

3-3-శ్లో.
కృపా తే జాతా చేత్ కిమివ నహి లభ్యం తనుభృతాం
మదీయక్లేశౌఘప్రశమనదశా నామ కియతీ
న కే కే లోకే౾స్మిన్ననిశమయి శోకాభిరహితా
భవద్భక్తా ముక్తాః సుఖగతిమసక్తా విదధతే||
3వ భావము
. భగవాన్! నీ అనుగ్రహం వలన లభించనిది కాని, సాధించలేనిది కాని ఏమియూ లేదు. లోకములో ఎందరో భక్తులు లౌకిక సుఖముల పట్ల విరక్తులై నీ అనుగ్రహం వలన శోకరహితులు జీవన్ముక్తులు అగుచూ, అలౌకికమైన ఆనందమును అనుభవించుచున్నారు. నా కష్టమును తొలగించి, అటువంటి భక్తితో కూడిన ఆనందమును నాకు ప్రసాదించుము.

3-4-శ్లో.
మునిప్రౌఢా రూఢా జగతి ఖలు గూఢాత్మయో
భవత్పాదాంభోజస్మరణవిరుజో నారదముఖాః।
చరంతీశ! స్వైరం సతతపరినిర్భాతపరచిత్
సదానందాద్వైత ప్రసరపరిమగ్నాః కిమపరమ్||
4వ భావము
. ప్రభూ! లోకప్రసిద్ద భక్తులైన నారదుడు వంటి మహామునులు, నీ పాదపద్మ స్మరణచే వారి బాధలను దూరము చేసుకుని, నీ అనుగ్రహముతో, వారి చిత్తములలో ప్రకాశించు భగవత్ తత్వాన్ని గ్రహించి, చిదానందముతో, నిరంతరము సకల లోకములలో నిగూఢముగా సంచరించుచున్నారు.

3-5-శ్లో.
భవద్భక్తిః స్ఫీతా భవతు మమ సైవ ప్రశమయేత్
అశేషక్లేశౌఘం న ఖలు హృది సందేహకణికా।
న చేద్వ్యాసస్యోక్తిస్తవ చ వచనం నైగమవచో
భవేన్మిథ్యా రథ్యాపురుషవచనప్రాయమఖిలమ్||
5వ భావము
. ప్రభూ! నాకు నీ పట్ల కలిగిన ధృఢమైన భక్తి నా సకల కష్టములను హరిస్తుంది. నా హృదయములో ఏమాత్రము సందేహము లేదు. అట్లు కానిచో, వ్యాస మహర్షి భగవద్భక్తి గురించి చెప్పిన వాక్కులు మరియు వేదములలో చెప్పబడిన విషయములు అసత్యము లగును. వీధు లమ్మట తిరిగేవారి వ్యర్థపు మాటలతో సమాన మగును.

3-6-శ్లో.
భవద్భక్తిస్తావత్ ప్రముఖమధురా త్వద్గుణరసాత్
కిమప్యారూఢా చేదఖిలపరితాపప్రశ్రమనీ।
పునశ్చాంతే స్వాంతే విమలపరిబోధోదయమిళ
న్మహానందాద్వైతం దిశతి కిమతః ప్రార్థ్యమపరమ్||
6వ భావము
ప్రభూ ¡ భగవద్భక్తి అత్యంత మహిమ కలిగినది. నీ కథలు, గుణములు గరించి విని, భక్తుల మనసులు ఆర్థ మగుట వలన కలుగు నట్టి భక్తి మధురమైనది. క్రమముగా చిత్తములో స్థిరపడిన ధృఢమైన భక్తి భక్తుల కష్టములను హరించి వారిని ప్రశాంత చిత్తులను చేస్తుంది. పరిపూర్ణమైన భక్తి, చిత్తమునకు భగవతత్వ జ్ఞానముపట్ల ప్రేరణ కలిగిస్తుంది. బ్రహ్మతత్వ జ్ఞానమును గ్రహించిన భక్తులు బ్రహ్మానందముతో అద్వైతసిద్ధిని పొందగలుగుతారు. అంతకన్నా భగవంతుడిని కోరదగినది ఏమియు లేదు.

3-7-శ్లో.
విధూయ; క్లేశాన్ మే కురు చరణయుగ్మం ధృతరసం
భవత్ క్షేత్రప్రాప్తౌ కరమపి చ తే పూజనవిధౌ।
భవన్మూర్త్యా లోకే నయనమథ తే పాదతులసీ-
పరిఘ్రాణే ఘ్రాణం శ్రవణమపి తే చారుచరితే||
7వ భావము
. చక్కటి చరిత్రతో విలసిల్లే ఓ నా ప్రభూ! నా కష్టములను తొలగించి నన్ను అనుగ్రహించుము. నా పాదములు నీ క్షేత్రమునకు చేరుటకు, నా కరములు నీ పూజ చేయుటకు, నా నేత్రములు నీ మూర్తిని దర్శించుటకు, నా నాసిక నీ పాదముల చెంత నున్న తులసిని ఆఘ్రాణించుటకు, నా చెవులు నీ చరితము విని ఆనందించుటకు ఉపయోగపడునట్లు నన్ను అనుగ్రహించ మని ప్రార్దించుచున్నాను.

3-8-శ్లో.
ప్రభూతాధివ్యాధిప్రసభచలితే మామకహృది
త్వదీయం తద్రూపం పరమరసచిద్రూపముదియాత్।
ఉదంచద్రోమాంచో గలితబహుహర్షాశ్రునివహో
యథా విస్మర్యాసం దురుపశమపీడాపరిభవాన్||
8వ భావము
. ప్రభూ¡ మానసికమైన భాధలు, శారీరకమైన రుగ్మతలు నా హృదయమును చలింపచేయుచున్నవి. నా చిత్తము నందు నీ చిదానందరూపము ప్రకాశించునట్లు అనుగ్రహించుము. నీ రూప దర్శనము వలన ఆనందముతో నా శరీరమునకు గగుర్పాటు కలిగి ఆనందభాష్పములు స్రవించగా, ఉపశమనము కలిగి భాధలను మరిచి, ఆనందమును పొందుతాను.

3-9-శ్లో.
మరుద్గేహాధీశ! త్వయి ఖలు పరాంచో౾పి సుఖినో
భవత్ స్నేహీ సో౾హం సుబహు పరితప్యే చ కిమిదమ్।
అకీర్తిస్తే మా౾భూద్వరద! గదభారం ప్రశమయన్
భవద్భక్తోత్తంసం ఝటితి కురు మాం కంసదమన!
9వ భావము
. గురవాయూరుపురాధీశా! ప్రభూ ! నీ యందు భక్తి లేనివారు సుఖముగా ఉన్నారు. భక్తుడ నగు నేను భాధలను అనుభవించుచున్నాను. కంససంహారి! ఇది నీకు అపకీర్తిని కలిగించును. నాకు భాధల నుంచి శీఘ్రముగా విముక్తి కలిగించు. వరదా! నీ భక్తులలో ఉత్తమునిగా అగు వరమును ప్రసాదించుము.

3-10-శ్లో.
కిముక్తైర్భూయోభిస్తవ హి కరుణా యావదుదియాత్
అహం. తావద్దేవ! ప్రహితవివిధార్తప్రలపితః।
పురః క్లుప్తే పాదే వరద! తవ నేష్యామి దివసాన్
యథాశక్తి వ్యక్తం నతినుతినిషేవా విరచయన్||
10వ భావము
. ప్రభూ! వరదా! నా భాధలను నివారించమని పదే పదే వేడుకొను మాటల వలన ప్రయోజనము ఏమి? నీవు నన్ను కరుణించువరకు, వేదనా భరితమైన ప్రలాపములను నిలిపివేసి నీ చరణములకు యధాశక్తిగా, పూజలు చేయుచు నిన్ను ప్రార్థించుచూ దినములు గడుపుదును.


-x-