Jump to content

నారాయణీయము/తృతీయ స్కంధము/15వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||
తృతీయ స్కంధము

15వ దశకము - కపిలోపదేశము.

15-1-శ్లో.
మతిరిహ గుణసక్తా బంధకృత్ తేష్వసక్తా
త్వమృతకృదుపరుంధే భక్తియోగస్తు సక్తిమ్।
మహదనుగమలభ్యా భక్తిరేవాత్రసాధ్యా
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః||
1వ భావము.
“ఇహలోకమున ప్రకృతి గతమైన - సత్వగుణము, రజోగుణము, తమోగుణములకు - బుద్ధి మరియు ఇంద్రియములు వశమగుట వలన జీవునికి కర్మబంధము ఏర్పడుచున్నది. భక్తియోగము - బుద్ధిని నిగ్రహించి తద్వారా జీవునికి బంధవిముక్తిని, మోక్షమును కలిగించును. సర్వసంగవివర్జితు లయిన భక్తుల సత్సంగమున మాత్రమే అటువంటి భక్తి సాధ్య మగును” అని - కపిలుడు అను నామమున జన్మించిన నీవు (నారాయణుడు) నీ తల్లి అయిన దేవహూతికి ఉపదేశించితివి.

15-2-శ్లో.
ప్రకృతిమహదహంకారాశ్చ మాత్రాశ్చ భూతా-
న్యపి హృదపి దశాక్షీ పూరుషః పంచవింశః।
ఇతి విదితవిభాగో ముచ్యతే౾సౌ ప్రకృత్యా
కపిలతనురితి త్వం దేవహూత్తై న్యగాదీః||
2వ భావము.
“గుణత్రయ సమన్వితమయిన ప్రకృతి(1)., మహత్తత్వము1)., అహంకారము(1)., పంచభూతములు(5)., పంచతన్మాత్రలు(5)., జ్ఞానేంద్రియములు(5)., కర్మేంద్రియములు(5)., అంతఃకరణము(1)., జీవుడు(1) - అను ఈ ఇరువది ఐదు తత్వములను తెలిసినవారు ముక్తిని పొందుదురు” అని - కపిల నామముతో మానవ దేహమును ధరించిన నారాయణమూర్తీ ! నీవు నీ తల్లి దేవహూతికి ఉపదేశించితివి.

15-3-శ్లో.
ప్రకృతిగతగుణౌఘైర్నాజ్యతే పూరుషో౾యం
యది తు సజతి తస్యాం తద్గుణాస్తం భజేరన్।
మదనుభజనతత్త్వాలోచనైః సా౾ప్యపేయాత్
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః||
3వ భావము.
కపిలముని రూపమున జన్మించిన నారాయణుడు - తన తల్లి అయిన దేవహూతికి మరల ఇట్లు ఉపదేశించెను. “జీవుడు - సుఖ దుఖాదులగు ప్రకృతి గతమైన గుణములను స్వయముగా పొందుటలేదు. కాని వాని ఆకర్షణకు లోనైనచో (తాదాత్మ్యాద్యాస వలన) ప్రకృతి గుణసంగమము కలుగును. బంధమున చిక్కి - జీవుడు ధర్మాధర్మములు మరియు రాగద్వేషముల దోషమునకు గురి యగును. నిరంతరమూ భగవత్ చింతనచేయుచూ తత్వవిచారణ చేసినచో ఆ బంధములు తొలగిపోవును. జీవుడు జీవన్ముక్తు డగును“.

15-4-శ్లో.
విమలమతిరుపాత్తైరాసనాద్యైర్మదంగం
గరుడసమధిరూఢం దివ్య భూషాయుధాంకమ్।
రుచితులితమాలం శీలయేతానువేలం
కపిలతనురితి త్వం దేవహుత్యై న్యగాదీః||
4వ భావము.
“ఆసనాది యోగాంగముల నభ్యసించి, మనసును సుస్థిరపరచుకొని నిరంతరమూ భగవధ్యానము చేయు భక్తునికి - గరుఢవాహనుడు, దివ్యాభరణశోభితుడు, దివ్యాయుధములను ధరించినవాడు, నీలికలువ ఛాయను పోలిన నల్లని దేహకాంతితో ప్రకాశించువాడు అయిన నారాయణుని అనుగ్రహము ప్రాప్తించును - బంధముల నుండి విముక్తి కలుగును” అని - తల్లి అయిన దేవహూతికి కపిలరూపమున జన్మించిన ప్రభూ! నీవు ఉపదేశించితివి.

15-5-శ్లో.
మమ గుణగణలీలాకర్ణనైః కీర్తనాద్యైః
మయి సురసరిదోఘప్రఖ్యచిత్తానువృత్తిః।
భవతి పరమభక్తిః సా హి మృత్యోర్విజేత్రీ
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః||
5వ భావము.
“నారాయణని గుణములను, లీలలను వినుట యందును, కీర్తించుట యందును ఆనందమును పొందు భక్తునకు - ప్రఖ్యాత దేవనది (గంగానది) ప్రవాహమువలె నిర్మలమైన చిత్తము ఏర్పడును. అటువంటి పరమభక్తి కలగిన జీవుడు మృత్యువును జయించును. గంగానది సముద్రమును చేరినట్లు, జీవుడు కూడా జననమరణ చక్రము నతిక్రమించి పరమాత్మను చేరి - ఐక్యమగును“, అని - కపిలరూపమున జన్మించిన నారాయణుడు తల్లి యైన దేవహూతికి ఉపదేశించెను.

15-6-శ్లో.
అహ హ బహుళహింసా సంచితార్థైః కుటుంబం
ప్రతిదినమనుపుష్ణన్ స్త్రీజితో బాలలాళీ।
విశతి హి గృహసక్తో యాతనాం మయ్యభక్తః
కపిలతనురితి త్వం దేవహుత్యై న్యగాదీః||
6వ భావము.
“నిత్యము దనార్జన చేయుచూ కుటుంబ పోషణ యందే నిమగ్నుడైన జీవుడు, దైవభక్తికి దూరమై, భార్యా సంతాన సంసార లంపట మందు చిక్కుకొని, వారి పోషణార్దము - ధనార్జనకు హింసకు సైతము పాల్పడును. అట్టి మనుజుడు తాను ఆర్జంచిన పాపఫలిత ఫలముగా నరకయాతనకు గురి యగును” అని – కపిలనామధారి యైన నారాయణుడు తల్లి యగు దేవహూతికి తెలిపెను.

15-7-శ్లో.
యువతి జఠరఖిన్నో జాతబోధో౾ప్యకాండే
ప్రసవగళిత బోధః పీడయోల్లంఘ్య బాల్యమ్।
పునరపి బత ముహ్యత్యేవ తారుణ్యకాలే
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః
7వ భావము.
“జననమునకు ముందు జీవుడు తల్లిగర్భమున ఖేదము ననుభవించును. ఆ సమయమున పరతత్వజ్ఞానము కలిగి యుండియు, జననాంతరము అట్టి జ్ఞానమును కోల్పోవును. బాలారిష్టములను దాటి తరుణ వయస్కుడైన పిమ్మట అవిద్యా కర్మబంధ మగు సంసారక్లేశమున చిక్కుకొనును. భగవత్ భక్తిచే ఆ కర్మబంధమును తొలగించుకొనగలిగియు అవివేకుడైన జీవుడు తొలగించుకొనడు” అని - కపిలరూపమున జన్మించిన నారాయణుడు తల్లి యగు దేవహూతికి ఉపదేశించెను.

15-8-శ్లో.
పితృసురగణయాజీ ధార్మికో యో గృహస్థః
స చ నిపతతి కాలే దక్షిణాధ్వోపగామీ।
మయి నిహితమకామం కర్మ తూదక్పథార్థం
కపిలతనురితి త్వం దేవహూత్యై న్యగాదీః||
8వ భావము.
“గృహస్థ ధర్మము నాచరించుచు - దేవతలను, పిత్రుదేవతలను పూజించుచూ - క్రతువులను, కర్మలనూ ఆచరించెడు జీవుడు మరణానంతరమున దక్షిణ మార్గమున పోవును. ఆ మార్గమున చంద్రలోక ప్రాప్తి కలిగి, పుణ్యఫల మనుభవించి మరల జన్మను పొందును. గృహస్ధాశ్రమమున నిష్కామముగా తమ ధర్మమును నిర్వర్తించుచూ - తాము చేయు కర్మలను భగవదర్పితము చేయువారు మరణానంతరమున ఉత్తరమార్గమున పయనించెదరు. వారు సూర్యమండల మార్గము ననుసరించి పరమాత్మను చేరుదురు“ అని - కపిలరూపధారి యైన నారాయణుడు తల్లి యగు దేవహూతికి తెలిపెను.

15-9-శ్లో.
ఇతి సువిదితవేద్యాం దేవ హే! దేవహూతిం
కృతనుతిమనుగృహ్య త్వం గతో యోగిసంఘైః।
విమలమతిరథాసౌ భక్తియోగేన ముక్తా
త్వ మపి జనహితార్థం వర్తసే ప్రాగుదీచ్యామ్||
9వ భావము.
దేవా! నీ అనుగ్రహము వలన దేవహూతి పరతత్వజ్ణానమును పొందినదై, నిర్మల అంతఃకరణచే భక్తియోగము ననుసరించి కాలక్రమమున జీవన్ముక్తిని పొందెను. నీవునూ యోగిబృందముతో కలిసి, జనహితార్దివై తపోదీక్షను స్వీకరించి, ఈశాన్యదిశకు నిష్క్రమించి అచట నివసించు చుంటివి.

15-10-శ్లో.
పరమ! కిము బహుక్త్యా త్వత్పదాంభోజభక్తిం
సకలభయవినేత్రీం సర్వకామోపనేత్రీమ్।
వదసి ఖలు దృఢం త్వం తద్విధూయామయాన్మే
గురుపవనపురేశ త్వయ్యుపాధత్స్వ భక్తిమ్||
10వ భావము.
పరమాత్మా! “నీ పాద పద్మముల యందు కలిగిన భక్తి – సకల భయములను తొలగించును. సకల అభీష్టములను నెరవేర్చును” అని నీవే స్వయముగా మరియు ధృఢముగా పలికితివి. ప్రభూ! ఇంతకుమించి స్తుతించలేని వాడను నేను. నా రోగమును తొలగించి - నీ యందు నాకు ధృఢమైన భక్తిని ప్రసాదింపుము.

తృతీయ స్కంధము పరిపూర్ణము
15వ దశకము సమాప్తము.

-x-
 

Lalitha53 (చర్చ) 10:43, 8 మార్చి 2018 (UTC)