Jump to content

నారాయణీయము/చతుర్థ స్కంధము/16వ దశకము

వికీసోర్స్ నుండి

||శ్రీమన్నారాయణీయము||

చతుర్ధ స్కంధము

[మార్చు]

16వ దశకము - నరనారాయణుల అవతారము వర్ణనం

16-1-శ్లో.
దక్షో విరించితనయో౾ థ మనోస్తనూజాం
లబ్ద్వా ప్రసూతిమిహ షోడశ చా౾ ప కన్యాః।।
ధర్మే త్రయోదశ దదౌ పితృషు స్వధాం చ
స్వాహాం హవిర్భుజి సతీం గిరిశే త్వదంశే।।
11వ. భావము.
బ్రహ్మపుత్రుడైన దక్షుడు, మనువు కమార్తె అయిన ప్రసూతిని వివాహమాడెను. వారికి పదహారుమంది కుమార్తెలు కలిగిరి. దక్షుడు వారిలో పదముగ్గురును "ధర్మునికి" ఇచ్చి వివాహము చేసెను. "స్వధా" అను కుమార్తెను పితరులకు, "స్వాహా"ను అగ్నిదేవునికి, "సతీ దేవి"ని పరమాత్మ అంశుడైన శివునికి ఇచ్చి వివాహము చేసెను.

6-2-శ్లో.
మూర్తిర్హి ధర్మగృహిణీ సుషువే భవంతం
నారాయణం నరసఖం మహితానుభావమ్।
యజ్జన్మని ప్రముదితాః కృతతూర్యఘోషాః
పుష్పోత్కరాన్ ప్రవవృషుర్నునువుః సురౌఘాః।।
2వ. భావము.
ధర్ముని ఇల్లాలు అయిన "మూర్తి"కి, అత్యంత మహిమాన్వితుడవైన నీవు “నారాయణు“ డను, నామమున జన్మించితివి. నీకు సఖుడుగా కవలసోదరుడై “నరుడు“ జన్మించెను. అట్లు ‘నరనారాయణులు‘ జన్మించగా ఆనందముతో దేవతలు దేవవాద్యములను మ్రోగించిరి, పుష్పవృష్టిని కురిపించిరి, మిమ్ములను కీర్తించిరి.

16-3-శ్లో.
దైత్యం సహస్రకవచం కవచైః పరీతం
సాహస్రవత్సరతపస్సమరాభిలవైః।
పర్యాయనిర్మితతపస్సమరౌ భవంతౌ
శిష్టైకకంకటమముం న్యహతాం సలీలమ్ ।।
3వ. భావము.
‘సహస్ర కవచుడు‘ అని పేరొందిన ఒక రాక్షసుడు సజ్జనులను భాదించుచు - వారికి కంటకుడయ్యెను. ఆరాక్షసుడు వేయి కవచములను ధరించినవాడు. మిక్కిలి శక్తిసంపన్నుడు. ఆ రాక్షసుని ఒక్కక్క కవచము ఛేదించుటకు వేయిసంవత్సరములు తపస్సు చేసి వేయి సంవత్సరములు యుద్ధము చేయవలయును. కవలలు - నరనారాయణు లగు మీరిరువురు - ఒకరు తపస్సు చేయుచుండగా మరియెకరు యుద్ధము చేయుచు, అనేక వేల సంవత్సరములు ఆ రాక్షసునితో పోరాడి అతనిని అంతమొందించిరి.

16-4-శ్లో.
అన్వాచరన్నుపదిశన్నపి మోక్షధర్మం
త్వం భ్రాతృమాన్ బదరికాశ్రమ మధ్యవాత్సీః।
శక్రో౾థ తే శమతపోబలనిస్సహాత్మా
దివ్యాంగనా పరివృతం ప్రజిఘాయ మారమ్।।
4వ. భావము.
పిమ్మట, నారాయణుని రూపమున నున్న నీవు, నీ సోదరు డగు నరునితో కలిసి బదరికాశ్రమమున మోక్షధర్మము నాచరించుచు - పరతత్వము నుపదేసించుచుంటివి. ఇంద్రియ నిగ్రహముతో నీ వాచరించు తపోబలము దేవేంద్రునికి అసహనము కలిగించినది. నీ తపస్సుకు విఘ్నము కలిగించవలెనను తలంపుతో అప్పుడు దేవేంద్రుడు మన్మథుని మరియు దివ్యాంగనలైన అప్సరసలను నీవద్దకు పంపెను.

16-5-శ్లో.
కామో వసంతమలయానిలబంధుశాలీ
కాంతాకటాక్షవిశిఖైర్వికసద్విలాసైః।
విధ్యన్ముహుర్ముహురకంపముదీక్ష్య చ త్వాం
భీతస్త్వయాథ జగదే మృదుహాసభాజా।।
5వ. భావము. .
దేవేంద్రుని ఆజ్ఞచే మన్మథుడు - వసంతడు, మలయమారుతము మరియు అప్సరసలను తోడ్కొని మీవద్దకు వచ్చెను. దేవకాంతల వీక్షణ బాణములచేతను, వారి విలాసములచేతను మీ దీక్షను భంగపరచుటకు మన్మథుడు ప్రయత్నించెను. మరల మరల ప్రయత్నించినను చలించని మీ దీక్షను చూచి మన్మథుడు భయము నొందెను. వారిని చూచి నీవు మృదుదరహసముతో ఇట్లు పలికితివి.

16-6-శ్లో.
భీత్యాలమంగజ వసంత సురాంగనా వో
మన్మానసం త్విహ జుషధ్వమితి బ్రువాణః।
త్వం విస్మయేన పరితః స్తువతా మథైషాం
ప్రాదర్శయః స్వపరిచారకకాతరాక్షీః।।
6వ. భావము.
“మన్మథా! భీతిచెందవలదు. వసంతుడా! దేవకాంతలారా! భయపడవలదు“ అని పలికి, నీ మనోశక్తి వారికవగతముగుటకై వారికంటే సౌందర్యవతులైన పరిచారికలను సృష్టించి వారికి కనిపింపజేసితివి. అప్పుడు, మన్మథుడు మరియు దేవకాంతలు విస్మయముతో నిన్ను స్తుతించిరి.

16-7-శ్లో.
సమ్మోహనాయ మిలితా మదనాదయస్తే
త్వద్దాసికాపరిమళైః కిల మోహమాపుః।
దత్తాం త్వయా చ జగృహుస్త్రపయైవ సర్వ-
స్వర్వాసిగర్వశమనీం పునరుర్వశీం తామ్।।7వ. భావము.
నారాయణ నామమున అవతరించిన ఓ పరమాత్మా! మన్మథాదులు నీకు మోహము కలిగించి తపోభగ్నము చేయవలెనని ఆశించెను. కాని, నీవు సృష్టించిన పరిచారికల సౌందర్యానికి, వారి మేని సుగంధ పరిమళమునకు, మన్మథాదులు సమ్మోహితులైరి. తమ చిత్తప్రవృత్తికి కించపడిన వారై అప్పుడు వారు నిన్ను స్తుతించిరి. వారి అహంకార ప్రవృత్తిని అణచి వేయవలెనని, నీవు అత్యంత సౌందర్యవతియైన ఊర్వశిని (ఊరువునుంచి) సృష్టించి వారివెంట దేవలోకమునకు పంపితివి.

16-8-శ్లో.
దృష్ట్వోర్వశీం తవ కథాం చ నిశమ్య శక్రః
పర్యాకులో౾జని భవన్మహిమావమర్శాత్।
ఏవం ప్రశాంతరమణీయతరా౾వతారాత్
త్వత్తో౾ధికో వరద! కృష్ణతనుస్త్వమేవ।।
8వ. భావము.
దేవేంద్రుడు నీకు తపోభంగము కలిగించుటకు ప్రయత్వించియు, విఫలుడై తానే గర్వభంగము పొందెను. నీ వృత్తాంతమును విని, నీచే సృష్టించబడిన ఊర్వశిని చూచి, గర్వమణిగిన వాడయ్యెను. వరదా! ప్రశాంతమైనది, రమణీయమైనది మరియు మిక్కిలి మనోహరమైనది అయిన నారాయణావతారమునకు మించినది – నీ శ్రీకృష్ణ రూపమొక్కటే!

16-9-శ్లో.
దక్షస్తు ధాతురతిలాలనయా రజోం౾ధో
నాత్యాదృతస్త్వయి చ కష్టమశాంతిరాసీత్।
యేన వ్యరుంధ స భవత్తనుమేవ శర్వం
యజ్ఞే చ వైరపిశునే స్వసుతాం వ్యమానీత్।।
9వ. భావము.
బ్రహ్మకు మిక్కిలి ఇష్ట పుత్రుడైన దక్షుడు రజోగుణము ప్రకోపించి గర్వాంధుడై - పరమాత్మవైన నిన్ను సహితము గుర్తించలేని దుస్థితికి చేరి అశాంతికి లోనయ్యెను. ఆస్థితిలో అతడు నీరూపమే అయిన పరమశివునిపై విరోధముతో శివ రహితమైన యజ్ఞమును తలపెట్టెను. అతడు శివునిపై వైరము పెంచుకుని తన కుమార్తె - శివుని పత్నిఅయిన సతీదేవిని అవమాన పరిచెను. (అవమానమునకు లోనైన సతీదేవి అచటనే తన దేహమును త్యజించెను)

16-10-శ్లో.
కృద్దేశమర్దితమఖః స తు కృత్తశీర్షో
దేవప్రసాదితహరాదథ లబ్ధజీవః।
త్వత్పూరితక్రతువరః పునరాప శాంతిం
స త్వం ప్రశాంతికర! పాహి మరుత్పరేశ।।
10వ. భావము.
మహాశివుడు కోపోద్రిక్తుడై దక్షయజ్ఞమును ధ్వంసము చేసెను. దక్షుని శిరస్సును ఛేదించివేసెను. అప్పుడు దేవతలు ప్రార్ధించగా మహాశివుడు తిరిగి దక్షుని పునర్జీవితుని జేసెను. యజ్ఞేశ్వరుడవైన నీవు సాక్షాత్కరించి - దక్షయజ్ఞమును పూర్తిగావించితివి. దక్షుడు నిర్మలాంతఃకరుణుడై శాంతిని పొందెను. శాంతిని ప్రసాదించు గురవాయూరు పురాధీశా! నారాయణమూర్తీ ! నన్ను రక్షింపుము.


చతుర్థ స్కంధము
16వ దశకము సమాప్తము.

-x-
 

Lalitha53 (చర్చ) 15:59, 9 మార్చి 2018 (UTC)